top of page

నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 20


'Nakemavuthondi Episode -20' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది ఎపిసోడ్ -20' తెలుగు ధారావాహిక

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ.. కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ. స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల, గతంలో జరిగిన సంఘటనలు వివరిస్తుంది. గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది ప్రియ. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు. సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు. ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు. ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్ . స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది. తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది. ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్. కనకారావు పిఎ డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి, మరుసటి రోజు ప్రియను కనకారావు గెస్ట్ హవుస్ కి తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఢిల్లీనుండి వచ్చిన సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ ఆమెను పరీక్షిస్తారని చెబుతాడు. తన స్నేహితురాలు ప్రవల్లిక సహాయం తీసుకుంటానని చెబుతుంది ప్రియ. ఉదయ్, ప్రవల్లికలు ప్రియను కలుస్తారు. హన్సికను ఆమె భర్తే హత్య చేసినట్లు, అతనికి కనకారావు సహకారం ఉన్నట్లు చెబుతాడు ఉదయ్. ప్రియను తీసుకొని కనకారావు గెస్ట్ హౌస్ కి వెళతారు డాక్టర్ శ్రీనివాస్ దంపతులు.. ఉదయ్, ప్రవల్లికలు కూడా వారితో వెళ్తారు. హిప్నాటిజం గురించి భయపడనవసరం లేదని ప్రియతో చెబుతాడు హిప్నాటిస్ట్ భూషణ్. ట్రాన్స్ లోకి వెళ్లిన ప్రియ, హత్య కాబడటానికి ముందు రోజు భార్గవి తనకు గుర్తుకు వచ్చినట్లు చెబుతుంది.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక ఎపిసోడ్ 20 చదవండి. ముందుగా తేరుకున్న డాక్టర్ శ్రీనివాస్ "గ్రేట్ ప్రియా! చాలా చక్కగా గుర్తు చేసుకున్నావు" అంటూ ఆమెను అభినందించాడు. త్రిపాఠి మాట్లాడుతూ నీలో కచ్చితంగా అద్భుతమైన శక్తి ఏదో దాగి ఉంది. మిగిలిన విషయాల్లో కూడా నీకు ముందుగా సూచనలు కనపడడంతోపాటు, ఆ వ్యక్తులు కూడా ఆరోజు నీకు గుర్తుకు వచ్చి ఉంటారు. ఆ సందర్భాలు భూషణ్ గారు మీకు చెబుతారు. నువ్వు ఇలాగే ప్రయత్నించి గుర్తుకు తెచ్చుకో" అన్నారు. తర్వాత హిప్నాటిస్ట్ భూషణ్ మాట్లాడుతూ "నువ్వు హాస్టల్ లో ఉండి చదువుకునే దానివి కదూ" అని ప్రశ్నించాడు. అవునని చెప్పింది ప్రియ. "మీ పెదనాన్న గారి ఇంటికి తరచుగా వెళ్లే దానివా?" అడిగాడు అతను. "ప్రతి ఆదివారం వెళ్లేదాన్ని. పండగ రోజుల్లో కూడా వాళ్ళు రమ్మని బలవంతం చేయడంతో వెళ్తూ ఉండేదాన్ని. నేను వెళ్ళినప్పుడల్లా మరో వారం పది రోజులకు సరిపోయేలా పచ్చళ్ళు, పొడులు ఇచ్చి పంపేది మా పెద్దమ్మ" చెప్పింది ప్రియ. "మీ పెదనాన్న, పెద్దమ్మలు గొడవ పడగా ఎప్పుడైనా చూసావా?" అడిగాడు డాక్టర్ శ్రీనివాస్. "లేదు. పెదనాన్న కూడా నాన్నగారిలాగే చాలా సౌమ్యులు. చిన్నగా కసురుకోవడం కూడా నేనెప్పుడూ గమనించలేదు" చెప్పింది ప్రియ. "మీ పెద్దమ్మ బలానికి విటమిన్ టాబ్లెట్స్ వేసుకునేది కదా?" అడిగాడు శ్రీనివాస్. "అవును. ప్రతిరోజూ వేసుకుంటానని నాకు చెప్పింది" అంది ప్రియ. "మరి ఆ మాత్రలు స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయని నీకు ఎందుకు అనిపించింది?" అడిగాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆలోచనలో పడింది ప్రియ. కొంతసేపటికి తేరుకొని "పక్కింటావిడ విషయంలో జరిగేది నాకు అలా అనిపించి ఉంటుంది" అంది. "అది మనం ముందుగానే అనుకున్నదే!నేను అడిగేది నువ్వు మీ పెద్దమ్మతో ఆ మాత్రలు వాడవద్దని చెప్పావు కదా.. ఆరోజు కానీ, ముందు రోజు కానీ, ఆ పక్కింటి ఆవిడ నీకు గుర్తుకు వచ్చిందా.. బాగా ఆలోచించి చెప్పు" అన్నాడు భూషణ్. కొంతసేపు ఆలోచించిన తర్వాత "అవును. ముందు రోజు ఆవిడ మా పెద్దమ్మతో మాట్లాడుతూ తనకు ఒంట్లో నీరసంగా ఉంటుందనీ, మాత్రలు వాడుతున్నా ఏమాత్రం ఉపయోగం లేకపోగా నీరసం ఇంకా ఎక్కువ అవుతోందనీ చెప్పింది. ఆరోజు రాత్రి ఆమె చెప్పిన విషయం గురించే ఆలోచించాను. మరుసటి రోజు మా పెదనాన్న విటమిన్ టాబ్లెట్లు మా పెద్దమ్మ చేత మింగించడం గమనించాను. పెద్దమ్మను పక్కకు పిలిచి ఆ మాత్రలు వాడవద్దని చెప్పాలనిపించింది" చెప్పింది ప్రియ. "అంటే ఇక్కడ కూడా నీకు జరగబోయే విషయం తెలియడంతో పాటు ఆ వ్యక్తులు నీకు ఏదో రకంగా గుర్తుకు రావడం జరిగింది. ఇప్పుడు హన్సిక గురించి అడుగుతాను. బాగా ఆలోచించుకొని చెప్పు" అన్నాడు భూషణ్. అంగీకారంగా తల ఊపింది ప్రియ. "హన్సిక అనే అమ్మాయిని ఆమె భర్త హత్య చేశాడు. ముందు రోజు రాత్రి నీ భర్త నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు నీకనిపించింది. ఆరోజు నీకు హన్సిక గుర్తుకు వచ్చిందా? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు" అన్నాడు భూషణ్. కాసేపు ఆలోచించింది ప్రియ. "నాకేమీ గుర్తు రావడం లేదు" అంది. రోజులో మనిషికి ఎన్నో లక్షల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు అవసరమైన వాటినే మదిలో నిక్షిప్తం చేసుకుంటాము. మిగిలినవి మరుగున పడిపోయి ఉంటాయి. అలాంటివే హిప్నాటిజం లో బయటకు వస్తాయి. నా మాటల మీద నీకున్న నమ్మకం నీకు అన్ని విషయాలు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. మరొకసారి బాగా ఆలోచించు ప్రియా" అన్నాడు భూషణ్. కళ్ళు మూసుకొని కొంతసేపు దీర్ఘంగా ఆలోచించింది ప్రియ. ఆమె రెప్పల మాటున గుడ్లలో కదలిక ప్రారంభమైంది. కొంతసేపటికి కళ్ళు తెరిచి ఇలా అంది. "నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఆరోజు నాకు వాట్స్అప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక వివాహిత మృతి కేసులో భర్త పైనే అనుమానం ఉన్నా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేదు. ఆ విషయాన్ని ఖండిస్తూ మహిళా సంఘాలు చేసిన ప్రకటన ఫార్వార్డ్ చేయబడుతూ నాకు చేరింది. ఆ మెసేజ్ చూడగానే నాకెందుకు హఠాత్తుగా హన్సిక గుర్తుకు వచ్చింది. కానీ తను ప్రస్తుతం భర్తతో లేదు కాబట్టి ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. ఆ తరువాత కూడా ఆమెనుండి నా భర్త తరుణ్ కి మెసేజ్ వచ్చినట్లు నాకు అతని సెల్ లో కనిపించింది. కానీ ఆ తరువాత చూస్తే అలాంటి మెసేజ్ లేదు" చెప్పడం ముగించింది ప్రియ. "ఖచ్చితంగా ఈమెకు జరగబోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇందులో సందేహమే లేదు. అయితే అలాంటి శక్తి ఉన్నట్లు తనకు తెలియనందున తనకు వచ్చిన ఆలోచనలను గుర్తుంచుకోవడానికి ఆమె ప్రయత్నించలేదు. ఈమె మీద విస్తృతంగా పరిశోధనలు చేస్తే తనకు ఉండే అద్భుత శక్తిని వెలికి తీయవచ్చు. అయితే అందుకు ఆమె పూర్తి సహకారం ఉండాలి. ట్రాన్స్ నుండి బయటకు వచ్చాక ఆమె అనుమతిస్తే కనీసం ఒక నెల రోజుల పాటు అయినా ఆమెను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి" అన్నాడు త్రిపాఠి. "ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సంఘటనలలో కనకారావు ప్రమేయం ఉంది. అతని గురించి ప్రియకు ముందే తెలుసా? గతంలో ఆమెకు అతనితో పరిచయం ఉందా.. లేక కనకారావు వల్ల నష్టపోయిన లేదా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా ప్రియా కు తెలుసా.. ప్రశ్నించండి. కనకారావు తెలుసుకోవాలనుకుంటున్నది కూడా అదే" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ప్రియ ఇంకా ట్రాన్స్ లోనే ఉన్న విషయం కన్ఫర్మ్ చేసుకొని భూషణ్ "ప్రియా! కనకారావుతో నీకు ముందే పరిచయం ఉందా? అతని వల్ల నీకు ఏమైనా హాని జరిగిందా లేదా.. అతని గురించి నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా?" అని ఆమెను ప్రశ్నించాడు. తిరిగి కాసేపు తీక్షణంగా ఆలోచించింది ప్రియ. ఎంత ఆలోచించినా ఆమెకు కనకారావు తో పరిచయం కానీ, విరోధం కానీ ఉన్నట్లు గుర్తుకు రాలేదు. అదే విషయాన్ని హిప్నాటిస్ట్ భూషణ్ తో చెప్పింది ప్రియ. త్రిపాఠి ఒక కంక్లూజన్ కి వస్తూ "తనకు తెలిసిన వాళ్ళ విషయంలో జరగబోయే ముఖ్య సంఘటనలు లేదా ప్రాణాపాయాలు ప్రియకు ముందుగా తెలుస్తున్నాయి. వాటిలో కనకారావు ప్రమేయం ఉండడం యాదృచ్ఛికం. ప్రియకు అతనితో ఇదివరకు ఏ విధమైన సమస్యలు లేవు. కనకారావు వల్ల నష్టపోయిన స్త్రీలు ఎవరూ ప్రియను ముందుగా కలువలేదు" అన్నాడు. భూషణ్ మాట్లాడుతూ "ప్రపంచంలో రోజు వేలల్లో హత్యలు, మానభంగాలు, దోపిడీలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ ప్రియకు గుర్తుకు వస్తాయనుకోవడం పొరపాటు. అలాగని తనకు తెలియని వారికి జరగబోయే దాని గురించి ఆమెకు ఎంత మాత్రం తెలీదనుకోవడం కూడా పొరపాటే. మరొక చిన్న ప్రయత్నం చేస్తాను" అంటూ ప్రియ వైపు తిరిగాడు. "ప్రియా! నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు అనుకోవద్దు. ఒక నెలరోజుల క్రితం చైనాలో భారీ భూకంపం వచ్చింది. వేలల్లో ప్రాణ నష్టం జరిగింది. ఆ సంఘటన గురించి ముందు రోజు నీకేమైనా తెలిసిందా?" అని ఆమెను అడిగాడు. కొంతసేపు ఆలోచించిన ప్రియా "ఆరోజు ఉదయం టీవీలో ఆ వార్త చూడగానే 'ఇదేమిటి?ముందు రోజు జరిగింది మళ్లీ ఈరోజు చూపిస్తున్నారా.. ' అనిపించింది. ఎందుకంటే ఒకరోజు ముందుగానే నాకు టీవీలో ఆ వార్త చూసినట్లు అనిపించింది. ఆ విషయం తరుణ్ తో చెప్పినట్లు కూడా అనిపించింది. ఇద్దరము ఆ సంఘటన గురించి మాట్లాడుకుని చాలా బాధపడ్డాము. కానీ మరుసటి రోజు అదే వార్తలు వస్తూ ఉండడంతో నాకు కాస్త ఆశ్చర్యం కలిగింది. తరుణ్ తో "ఈ న్యూస్ నిన్నటిది కదా?" అని అడిగాను. "లేదు ప్రియా! ఈరోజు వేకువ జామునే ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 7. 8 ఉండడంతో నష్టం తీవ్రంగా ఉంది" అన్నాడు తరుణ్. నాకైతే 'రిక్టర్ స్కేలు పై 7. 8 ఉంద'ని తరుణ్ ముందు రోజు అన్నమాట బాగా గుర్తుకుంది. ఆ విషయం గురించి తరుణ్ తో వాదించలేదు కానీ నాకు మాత్రం చాలా రోజులు ఆ సందేహం అలానే ఉండిపోయింది" అంది ప్రియ. ఆమె మాటలు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. ఇంతలో వాళ్ళు ఉన్న గది తలుపు తట్టిన శబ్దం వినబడింది. డాక్టర్ శ్రీనివాస్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగుండా ప్రవల్లిక నిలబడి ఉంది. తన చేతిలో ఉన్న మొబైల్ శ్రీనివాస్ కి అందిస్తూ "మీ మొబైల్ సైలెంట్ చేసి హాల్లో ఉంచి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు. నాలుగైదు మార్లు మొబైల్లో వైబ్రేషన్స్ రావడం చూసి, తీసి చూశాను. కనకారావు పిఏ దగ్గర నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి" అంది. "నేను బయటికి వచ్చి మాట్లాడుతాను" అన్నాడు శ్రీనివాస్. "ఏం మాట్లాడాలి అనేది అందరం కలిసి ముందుగా డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. అందరం ఒకే సమాధానం చెబుదాం" అన్నాడు భూషణ్. "హిప్నాటిజం ఈరోజే ప్రారంభించాము కదా! మామూలుగా అయితే ఒక నిర్ణయానికి రావడానికి ఐదారు సిట్టింగ్స్ అవసరమవుతాయి. ఎంత కాదనుకున్నా కనీసం మరో రోజైనా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయాలు రేపు సాయంత్రం చెబుతామని అతనికి చెబుతాను” అన్నాడు శ్రీనివాస్. "అలాగే.. ముందు అతనికి కాల్ చేసి విషయం కనుక్కోండి. నేను ఈ లోపల ప్రియను ట్రాన్స్ లో నుండి బయటకు తీసుకొని వస్తాను" అన్నాడు భూషణ్. త్రిపాఠితో సహా అందరూ బయటకు నడిచారు. బయటకు వెళ్ళాక కనకారావు పిఏకి కాల్ చేసాడు శ్రీనివాస్. కాల్ ని కనకారావు స్వయంగా లిఫ్ట్ చేయడంతో ఆశ్చర్యపోయాడు. "చూడు శ్రీనివాస్! నా మీద సిబిఐ విచారణ జరుగుతోంది కదా.. దాంట్లో బాగానే ఇరుక్కునే లాగా ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్కు తీసుకునే పరిస్థితిలో నేను లేను. ఆ ప్రియను లేపేస్తే నాకు ఎటువంటి రిస్కు ఉండదు. హిప్నాటిజమ్ అయిపోయిందా?" అడిగాడు కనకారావు. "అది నాలుగైదు సిట్టింగ్స్ లో చేయాలి కానీ మీకోసం రేపు సాయంత్రానికి పూర్తి చేస్తాము. ఆ ఢిల్లీనుండి వచ్చిన వాళ్ళను రేపు ఫ్లయిట్ లో పంపిస్తే రేపు రాత్రికిగానీ, ఆ తరువాత రోజుగానీ మీరు అనుకున్నట్లు చెయ్యవచ్చు." అన్నాడు శ్రీనివాస్. "ముహుర్తాలు చూస్తూ వుంటే లాభం లేదు. రేపు రాత్రికి ఆ అమ్మాయిని లేపేస్తాను" అన్నాడు కనకారావు వికృతంగా నవ్వుతూ.

=================================================================================

ఇంకా ఉంది...

=================================================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).







62 views0 comments

Comments


bottom of page