top of page

నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 21


'Nakemavuthondi Episode -21' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది ఎపిసోడ్ -21' తెలుగు ధారావాహిక

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ... కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ. స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల, గతంలో జరిగిన సంఘటనలు వివరిస్తుంది. గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది ప్రియ. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు. సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు. ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు. ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్ . స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది. తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది. ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్. కనకారావు పిఎ డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి, మరుసటి రోజు ప్రియను కనకారావు గెస్ట్ హవుస్ కి తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఢిల్లీనుండి వచ్చిన సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ ఆమెను పరీక్షిస్తారని చెబుతాడు. ప్రియను తీసుకొని కనకారావు గెస్ట్ హౌస్ కి వెళతారు డాక్టర్ శ్రీనివాస్ దంపతులు.. ఉదయ్, ప్రవల్లికలు కూడా వారితో వెళ్తారు. హిప్నాటిజం గురించి భయపడనవసరం లేదని ప్రియతో చెబుతాడు హిప్నాటిస్ట్ భూషణ్. ట్రాన్స్ లోకి వెళ్లిన ప్రియ, హత్య కాబడటానికి ముందు రోజు భార్గవి తనకు గుర్తుకు వచ్చినట్లు చెబుతుంది. కనకారావు శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరుసటి రోజు ప్రియను చంపబోతున్నట్లు చెబుతాడు.



ఇక నాకేమవుతోంది.. ధారావాహిక ఎపిసోడ్ 21 చదవండి. ప్రియను చంపేస్తానంటూ కనకారావు చెప్పిన మాట విన్న శ్రీనివాస్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. "తొందరపడకండి కనకారావు గారూ! ఆ అమ్మాయి మిస్ అయినట్లు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీ రిసార్ట్ మేనేజర్ సందీప్, అతనికి సహకరించి సస్పెండ్ అయిన రంగనాథం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక కనిపించడం లేదు. వాళ్లను పోలీసులే దాచి టార్చర్ పెట్టి ఉంటే, వాళ్లు ఈపాటికి మీ పేరు చెప్పే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి హత్యకు గురైతే, కచ్చితంగా పోలీసులు మిమ్మల్నే అనుమానిస్తారు" కనకారావు ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. అటువైపు నుండి వికృతంగా నవ్వాడు కనకారావు. "పోలీసులు అనుమానిస్తారనీ, పత్రికల్లో ఏదో రాస్తారనీ భయపడే స్థాయి దాటిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. పట్టపగలు నడిరోడ్డు మీద నేను స్వయంగా ఎవరినైనా చంపినా నన్నేమీ చేయలేరు. ఒక వారం రోజులు పేపర్లలోనూ, టీవీల్లోనూ నా గురించి వార్తలు వస్తాయి. నన్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ నా మనుషులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కొద్దిరోజులకు నేను బెయిల్ మీద బయటకు వస్తాను. కోర్టులో నాకు వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పకుండా చూసుకుంటాను కొంతకాలానికి కేసు కొట్టివేయబడి నిర్దోషిగా విడుదలవుతాను. ఇవన్నీ నాకు చిన్న విషయాలే. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి పంపించేస్తాను. రేపు రాత్రికి ఆ అమ్మాయి పని పూర్తి చేస్తాను" చెప్పాడు కనకా రావు. "కానీ ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది? ట్రాన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మీ గురించి ఏమీ తెలియదని చెప్పింది. అసలే సిబిఐ ఎంక్వయిరీ లో తప్పించుకోలేక అవస్థ పడుతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మరో సమస్య సృష్టించుకోవడం ఎందుకని చెప్పాను. అంతే" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. "సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు జరిగింది? నా గుట్టుమట్లు బయట వాళ్లకు చేరాయి కాబట్టి జరిగింది. టీవీలో, న్యూస్ పేపర్లలో రావడంతో నా మినిష్టర్ పదవి పోయి మాజీని అయ్యాను. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా?" ప్రశ్నించాడు కనకారావు. "పార్టీలో మీరంటే గిట్టని వాళ్ళు చేయించి ఉంటారు" అన్నాడు శ్రీనివాస్. "అది నిజమే అయి ఉండవచ్చు. కానీ వాళ్లకు నా రహస్యాలని చెప్పింది ఎవరో ఊహించగలవా?" అడిగాడు కనకారావు. లేదని చెప్పాడు శ్రీనివాస్. "ఇంతసేపూ నా పిఎ ఫోన్లో నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఊహించగలవా.. నా రహస్యాలు అతనే బయట వాళ్లకు చేరవేస్తున్నాడని నా అనుమానం. అందుకే వాడిని బంధించి, వాడి ఫోను నా కస్టడీలో పెట్టుకున్నాను. వీడికి ఎవరెవరి దగ్గర నుండి ఫోన్లు వస్తాయో గమనిస్తాను. ఇక నీ సంగతి చెప్పు. నా గురించి నీకు బాగా తెలుసు. నేనెంత దుర్మార్గుడినో నా నోటితో చెప్పించవద్దు. కొద్దిరోజులు ట్రీట్మెంట్ చేశావు కాబట్టి నీకు ఆ అమ్మాయి మీద జాలి ఉండవచ్చు. కానీ ఏదైనా నీ ప్రాణం తరువాతే అని తెలుసుకో. ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎలాంటి రిస్కు తీసుకోదలచుకోలేదు. నేను తీసిన ఎన్నో ప్రాణాల్లో ఈ అమ్మాయిది మరొకటి అవుతుంది. మామూలుగా ఇలాంటి పనులకు నా పిఎ ద్వారా రంగనాథం, సందీప్ లాంటి వాళ్లను వాడుకునే వాడిని. ఇప్పుడు ఎవరినీ నమ్మలేను కాబట్టి రేపు నేనే స్వయంగా ఆ పని పూర్తి చేస్తాను. నువ్వే నాకు అవసరమైతే సహకరించాలి. నా పీఏ లాగా నమ్మకద్రోహం చెయ్యొద్దు" అని చెప్పి కాల్ కట్ చేశాడు కనకారావు. ఆ ఫోన్ కాల్ సారాంశాన్ని అందరికీ వివరించాడు శ్రీనివాస్. హిప్నాటిస్ట్ భూషణ్, ప్రియా లు మటుకు ఇంకా లోపలి గదిలోనే ఉన్నారు. మిగిలిన వారందరూ శ్రీనివాస్ చెప్పింది శ్రద్ధగా విన్నారు. త్రిపాఠి ఆవేశంగా "నాకు ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్లు కొందరు తెలుసు. ఈ కనకారావు విషయం వాళ్లకు చెబుతాను" అన్నాడు. ప్రవల్లిక కల్పించుకుంటూ "అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీ సహాయం తీసుకుంటాం. ఈ లోపల మీరు తొందరపడి అతనితో విరోధం తెచ్చుకోవద్దు. మన హైదరాబాద్ పోలీసుల్లో ఏసిపి ప్రతాప్ గారి లాంటి సమర్థులు, నిజాయితీ పరులు అయిన ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ గారు మనతోనే ఉన్నారు. మా నాన్నగారు డిటెక్టివ్ పురంధర్ గారి గురించి మీకు తెలుసు కదా! ఆయన కూడా ఈ కేసు విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా పరిస్థితి మా చెయ్యి దాటేలా ఉంటే మిమ్మల్ని సహాయం అడుగుతాము" అని చెప్పింది. ఇంతలో ప్రియ ట్రాన్స్ లో నుండి బయటకు రావడంతో, ఆమెను తీసుకొని హిప్నాటిస్ట్ భూషణ్ బయటకు వచ్చాడు. ప్రవల్లిక అందరినీ తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని, తన ప్లాన్ ఇలా వివరించింది. "ప్రియాను పోలీసులకు లేదా తన భర్తకు అప్పగిస్తే ప్రస్తుతానికి సమస్య ఉండదు. కానీ ఆమెకు ఎప్పటికైనా కనకారావు వల్ల ప్రమాదం ఉంటుంది. అలాగని ఆమెను ఇక్కడే ఉంచి ప్రమాదంలోకి నెట్టలేము. కాబట్టి రేపు కనకారావు వచ్చే సమయానికి ఆ గదిలో బెడ్ మీద ముఖానికి మాస్క్ తగిలించుకొని నేను పడుకొని ఉంటాను. ముందుగానే ఆ గదిలో హిడెన్ కెమెరాలు అమర్చి ఉంచుదాము. అతను నన్ను ప్రియగా భావించి హత్యా ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. నేను అతన్ని సులభంగా ఎదిరించగలను" చెప్పింది ప్రవల్లిక. "నావల్ల నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడతావు. వద్దు ప్రవల్లికా.. " చెప్పింది ప్రియ. "ప్రవల్లికను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. తనకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. కనకారావు ను సులభంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అయినా నేను కూడా ఆ గదిలోనే దాగుకొని ఉంటాను. మేమిద్దరం కలిసి కనకారావును రెడ్ హ్యాండెడ్ గా హత్యా ప్రయత్నం చేస్తూ ఉండగా పట్టుకుంటాము" చెప్పాడు ఉదయ్. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ "చాలా రిస్క్ చేస్తున్నావు ప్రవల్లికా.. ముందుగా ఈ విషయమై మీ నాన్నగారి పర్మిషన్ తీసుకో. అలాగే ఏసిపి ప్రతాప్ గారికి ఇన్ఫార్మ్ చేయి" అన్నాడు. "ఖచ్చితంగా చేస్తాను. నా ధైర్యానికి అసలైన కారణం మరొకటి ఉంది" చెప్పింది ప్రవల్లిక. ఏమిటన్నట్లు చూశారు అందరూ. "నా నమ్మకం ప్రియాకు ఉన్న శక్తి మీద! ఒకవేళ రేపు నాకు ఏదైనా ప్రమాదం జరిగేటట్లుగా ఉంటే ఈరోజు రాత్రి తప్పనిసరిగా అందుకు సంబంధించిన సూచనలు ప్రియాకి కలలో వస్తాయి. ఆ కలను బట్టి అవసరమైతే రేపటి ప్లానింగ్ మారుద్దాం" అంది ప్రవల్లిక. "నా కలల మీద అంత నమ్మకం పెట్టుకున్నావా ప్రవల్లికా! వాస్తవానికి నేనే అంతగా నమ్మడం లేదు" అంది ప్రియ. తర్వాత ప్రవల్లిక తన తండ్రి డిటెక్టివ్ పురంధర్ కి కాల్ చేసి తన మనసులో ఉన్న ప్లాన్ చెప్పింది. "గో ఎహెడ్ ప్రవల్లికా! కానీ నీకు తోడుగా ఉదయ్ ని ఉండమని చెప్పు" అన్నారు పురంధర్. తర్వాత ఉదయ్ తన బాబాయ్ ఏసిపి ప్రతాప్ కి కాల్ చేశాడు. క్లుప్తంగా తాము చేయాలనుకున్నది వివరించాడు. ప్రతాప్ కూడా "అలాగే చేయండి. మఫ్టీలో కొందరు పోలీసులు ఆ చుట్టుపక్కల ఉండేలా చూస్తాము" అని చెప్పాడు. ఆరోజు రాత్రి అందరూ కనకారావు గెస్ట్ హౌస్ లోనే పడుకున్నారు. ప్రవల్లిక , ప్రియా పక్కనే పడుకుంది. పడుకున్న కాసేపటికి ప్రియా నిద్రపోయింది. కానీ ప్రవల్లిక మాత్రం ప్రియాకు ఏదైనా కల వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది. రాత్రి 11 గంటలకు ప్రియా నిద్రలోనే అసహనంగా కదులుతూ ఉండడం గమనించింది ప్రవల్లిక. వెంటనే లేచి కూర్చుంది. ప్రియ కదలికల్ని జాగ్రత్తగా గమనించ సాగింది. కొంతసేపటికి ప్రియ లేచి కూర్చుంది . ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి. తన చేతిలోని ఆయుధంతో ఎవరినో పొడుస్తున్నట్లుగా చేతిని ముందుకు వెనక్కి వేగంగా ఊపసాగింది. ఏసి ఆన్ లో ఉన్నా ప్రియ ముఖమంతా చెమటలు పట్టాయి. కళ్ళు తెరిచింది ప్రియ. కల తాలుకు ప్రభావం వల్ల ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. నోరు తెరిచి బలంగా గాలిని పీల్చి, వదల సాగింది ప్రియ. ఆమె వీపు మీద చేయి వేసి నెమ్మదిగా నిమరడం ప్రారంభించింది ప్రవల్లిక. కొంతసేపటికి ప్రియ నార్మల్ గా అయింది. "ఏమైంది ప్రియా? ఏదైనా పీడకల లాంటిది వచ్చిందా.. ? వెంటనే చెప్పనవసరం లేదు. ముందు కాస్త రిలాక్స్ అవ్వు" అంటూ ఒక గ్లాసులో మంచినీళ్లు పోసి ప్రియకు అందించింది ప్రవల్లిక. ఆ నీళ్లు తాగిన ప్రియ కుదుటపడింది. ప్రవల్లిక మరో గదిలో పడుకొని ఉన్న డాక్టర్ శ్రీనివాస్ కి కాల్ చేసింది. నిద్ర లేచిన శ్రీనివాస్, భార్య శ్రీదేవి ని కూడా లేపి ఆ గదిలోకి వచ్చాడు. శ్రీదేవి, ప్రియకు మరోవైపు కూర్చొని ఆమె తల నిమరసాగింది. డాక్టర్ శ్రీనివాస్ ఒక కుర్చీని లాక్కొని ప్రియకు ఎదురుగా కూర్చున్నాడు. దాంతో ప్రియా పూర్తిగా నార్మల్ అయింది. తనకు వచ్చిన కల గురించి ఇలా వివరించింది. "బెడ్ మీద పడుకొని ఉన్న నన్ను చంపడానికి ఒక 50 సంవత్సరాల వ్యక్తి చేతిలో కత్తితో వస్తున్నాడు. అయితే ఎందుకో నేను భయపడడం లేదు. అతను నా దగ్గరికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాగానే అతన్ని ఎలా అటాక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో హఠాత్తుగా అతని వెనక నుండి మరొక వ్యక్తి వచ్చి తన చేతిలోని ఐరన్ రాడ్ తో ఇతని తలమీద బలంగా మోదాడు. దాంతో నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తి కింద పడిపోయాడు. అతని తల పగిలి రక్తం ధారగా కారుతోంది. కొంతసేపు గిలగిలా కొట్టుకొని అతను చనిపోయాడు. ఇదీ నాకు వచ్చిన కల!" చెప్పింది ప్రియ. "నిన్ను చంపడానికి వచ్చిన వ్యక్తిని ఎవరో ఐరన్ రాడ్ తో కొట్టారని చెప్పావు కదా.. ఆ వ్యక్తి లో ఉదయ్ పోలికలు ఉన్నాయా?" అడిగాడు డాక్టర్ శ్రీనివాస్. "ఎంత మాత్రం లేవు" క్లియర్ గా చెప్పింది ప్రియా. "నిన్ను చంపడానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నా నువ్వు భయపడలేదని చెప్పావు. దీన్నిబట్టి నిన్ను నువ్వు ప్రవల్లిక స్థానంలో ఊహించుకున్నావు. అంటే నీ స్థానంలో పడుకొని ఉన్న ప్రవల్లికను చంపడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని మరో వ్యక్తి వెనక నుండి ఐరన్ రాడ్ తో కొట్టాడు. దీని గురించి భూషణ్, త్రిపాఠీలతో కూడా రేపు ఉదయం చర్చిద్దాం. ఈ సమయంలో వాళ్లను లేపడం బాగుండదు" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. సరేనంది ప్రియ. ఉదయం 6 గంటలకే ప్రియను తప్ప మిగతా అందరిని నిద్ర లేపాడు డాక్టర్ శ్రీనివాస్. అందరూ హాల్లో కూర్చున్నారు. రాత్రి ప్రియాకు వచ్చిన కల గురించి అందరికీ వివరించింది ప్రవల్లిక. "ప్రియాకు కనకారావు తెలియదు కదూ?" అడిగాడు త్రిపాఠి. "తెలీదు. ఆమె ఇంతవరకు కనకారావు ను చూడలేదు" చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. కలలో జరిగిన దాన్నిబట్టి చూస్తూ ఉంటే ప్రియా స్థానంలో గదిలో ఉన్న ప్రవల్లికను చంపడానికి కనకారావు వస్తాడు. అతన్ని ఎదుర్కోవడానికి ప్రవల్లిక సిద్ధంగా ఉంది కానీ అనుకోకుండా మరొక వ్యక్తి వెనక నుండి కనకారావును అటాక్ చేస్తాడు. అతడు ఎవరై ఉంటాడు.. ?" అడిగాడు భూషణ్. "ప్రియ నిద్ర లేచాక ఆమెకు కనకారావు ఫోటోలు, అతనికి సంబంధించిన వాళ్ళ ఫోటోలు చూపిస్తే ఆమె ఎవరినైనా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది" అంది ప్రవల్లిక. "నా దగ్గర కేకేఆర్ హాస్పిటల్స్ కి సంబంధించిన ఫంక్షన్స్ తాలూకు వీడియోలు ఉన్నాయి అవి ప్రియాకు చూపిస్తాను" అని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.

========================================================================

========================================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






62 views1 comment
bottom of page