top of page

అలసట


'Alasata' New Telugu Story


Written By M. Bhanu


'అలసట' తెలుగు కథ


రచన: M. భాను


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


తెల్లవారుజామున నాలుగు గంటలకు అలారం మోగింది. సుగుణకు మెలకువ వచ్చినా మగతగా ఉండిపోయింది. పక్కనే ఉన్న భర్త “లే సుగుణా! అలారం మోగింది” అంటూ అటు తిరిగి పడుకున్నాడు. మళ్లీ ఐదు నిమిషాలకి మోగింది, “సుగుణా! లే! మళ్లీ అలారం మోగింది. వెళ్లేటప్పుడు అలారం ఆఫ్ చేసి వెళ్ళు” అన్నాడు భర్త. ఇక తప్పనిసరిగా లేచి అలారం ఆఫ్ చేసి, దేవుడికి దండం పెట్టుకొని, దైనందిన కార్యక్రమాల్లోకి దిగింది. బ్రష్ చేసుకుని స్నానం చేసేటప్పటికి కొంచెం వెలుతురు వచ్చింది. పెరటి తలుపు తీసుకుని తులసమ్మ దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టింది. లోపలికి వచ్చి గిన్నెతో నీళ్లు స్టవ్ మీద పెట్టి, ఫిల్టర్ లో కాఫీ పొడి వేసింది. ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసి వెచ్చ పెట్టింది. ఇడ్లీలోకి టమాటా కొత్తిమీర పచ్చడి చేసి, కాస్త కాఫీ తాగింది. ఈ లోపనే సమయం అయిదున్నర అవ్వడంతో పిల్లల గదిలోకి వెళ్లి వాళ్ళని నిద్రలేపింది. వాళ్ళు తయారై వచ్చేటప్పటికి టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. ఈ లోపు కుక్కరు రావడంతో గబగబా మూత తీసి పప్పు తాలింపు వేసి, బంగాళదుంపలు ఫ్రై చేసింది. రెండు క్యారేజీల్లోకి సర్దిపెట్టింది. పిల్లల బస్సు ఏడు గంటలకే వచ్చేస్తుంది. పిల్లలు తయారై వచ్చి టిఫిన్ చేసేటప్పటికి బస్సు రెడీగా ఉంటుంది. వాళ్ళని పంపి కాస్త అమ్మయ్య అనుకుంటూ కూర్చునేటప్పటికి భర్త లేస్తాడు. ఇక భర్త ఆఫీస్ కి వెళ్లే వరకు ఒకటే హడావుడి. అతను ఆఫీస్ కి వెళ్లే వరకు ఏ పని చేయకూడదు. అతని చుట్టూ తిరుగుతూనే ఉండాలి. పిల్లలకి కంటే భర్తకి చేసేటప్పటికి అలసట ఎక్కువ వస్తుంది సుగుణకి. భర్త భోజనానికి ఇంటికి వస్తాడు. మళ్లీ అతని కోసం ప్రత్యేకంగా వేడిగా ఉండాలి. మళ్లీ ఆఫీసుకు వెళ్ళాక గిన్నెలు తోముకోవడము, ఇల్లు శుభ్రం చేసుకోవడం సాయంత్రం స్నాక్స్ మళ్లీ రాత్రి భోజనాలు. ఇలా గడిచిపోతోంది. విసుగు వేస్తోంది సుగుణకి. మధ్య మధ్యలో బొంబాయి నుండి వచ్చే ఆడపడుచు, తన చేత పచ్చళ్ళు పట్టించుకోవడం, వడియాలు, అప్పడాలు పెట్టించుకోవడం. లేదా పలానా రోజున వస్తానని ఫోన్ లోనే ఆర్డర్ చేయడం, నువ్వు చాలా బాగా చేస్తావు వదిన అంటూ పొగడటం, ఆ విధంగా అత్తగారు, ఆడపడుచు వచ్చి రోజులు ఇక్కడే గడిపేయడం, రైల్వే స్టేషన్ దగ్గరవడంతో ఇది సెంటర్ అని దిగి ఒకరోజు ఉండి మర్నాడు ట్రైన్ టైం కి వెళ్లే వాళ్లతో విసుగు వస్తోంది సుగుణకి. అందరూ ఇక్కడి నుంచి బజార్లు చేసుకోవడం, కూడా తనని రమ్మనక పోవడం, నువ్వు వచ్చేస్తే మాకు భోజనాలు ఎలా అనడం, వాళ్లు మొహమాటానికి రమ్మన్నా, ‘తను కూడా వచ్చేస్తే ఇంట్లో పని ఎలాగా?’ అనే భర్త.. ఆరోజు భర్త క్యాంపు వెళ్లడంతో కాస్త తీరిక దొరికింది. ఇంతలో స్నేహితురాలి నుండి ఫోన్ వచ్చింది. ఇద్దరూ కుశల ప్రశ్నలు అయిన తర్వాత స్నేహితురాలు లత సుగుణ గొంతులో నీరసాన్ని పసిగట్టింది. “ఏమిటి సుగుణా అంత డల్ గా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాగాలేదా” అని అడిగింది. “లేదు లతా! మనసుకే బాలేదు” ఆ మాటలకి లత “అదేమిటి..చక్కని సంసారం, ముచ్చటైన పిల్లలు.. దేనికోసం?” అని అడిగింది. “నా జీవితం చక్రంలా అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఒకటే పని. మాట్లాడే వారే లేరు. ఎప్పుడూ మార్పు లేదు. ఒకటే పని అని పిల్లలకు సెలవు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దాం అన్నా మా అత్త వారి వైపు చుట్టాలు రావడము, వాళ్లకి చేయడం.. ఇదే సరిపోతోంది. అమ్మను చూసి అప్పుడే సంవత్సరం అవుతోంది. వెళ్తానంటే మావారు పని చేసుకోలేను అంటారు అని, ‘ఒక పది రోజులు అత్తగారిని రమ్మనండి. వండి పెడతా’రంటే ‘మా అమ్మకి వయసు అయిపోయింది, చేయలేదు’ అంటారు. ఒక షాపింగ్ లేదు ఒక సరదా లేదు ఒక సినిమా లేదు. అడిగేవాళ్లు లేరు” ఆ మాటలకు లత నవ్వుతూ, “నీ ఒక్కదాని జీవితమే కాదు. అందరి జీవితాలు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. కాకపోతే నీకోసం నువ్వు కొంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించు. నీకు నచ్చిన పని చేసుకో, నీకు కాస్త ఖాళీ ఉన్నప్పుడు నువ్వే మీ పిల్లల్ని తీసుకుని పార్క్ కి వెళ్ళు. వీలైతే మీ ఆయన వచ్చేటప్పటికి రెడీగా ఉండి అతన్ని కూడా బయటకు తీసుకెళ్తూ ఉండు.ఎన్నో పనులు అలవోకగా చేస్తున్న దానివి సమయాన్ని సద్వినియోగ పరచుకోవడం ఒక లెక్కా నీకు? అంతవరకు ఎందుకు.. నా సంగతే తీసుకో, మా వారు వారానికి ఐదు రోజుల క్యాంపు లోనే ఉంటారు. మిగతా రెండు రోజులు మా అత్తగారితో గడపడానికి సరిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడైనా మాట్లాడతారని చూస్తే ‘ఇంట్లోకి ఏమైనా కావాలా, డబ్బులు కావాలా’ అని పడుకుంటాడు అంతే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుని, మా అత్తగారిని ఒప్పించి ఆ పల్లెటూరు నుండి తీసుకువచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రెండు రోజులు నాతోనే ఉంటున్నారు. మా అత్తగారికి, మా ఆయనకి కూడా సుఖం. సమస్య, పరిష్కారము రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు కాస్త స్థిమితంగా ఆలోచించుకొని ఉత్సాహంతో ముందుకు సాగిపో” అంది లత. ఆ మాటలకు ఉత్సాహంతో సుగుణ “చాలా థాంక్స్ లతా! మంచి విషయం చెప్పావు. నీతో మాట్లాడటం వల్ల నాకు మనశ్శాంతిగా ఉంది, నువ్వు చెప్పినట్టే చేస్తాను” అని ఫోన్ పెట్టేసి తదుపరి తను చేసే పనులు కోసం ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు మనసు శరీరం రెండూ తేలిగ్గా ఉన్నాయి. ముందుగా సుగుణ చేసిన పని, భర్త ఆఫీసుకు, పిల్లల స్కూల్ కు దగ్గర ఒక ఇల్లు తీసుకుని ఉన్న ఇల్లు నుంచి మారిపోవడం. దానితో బంధువుల తాకిడి తగ్గింది. భర్త పిల్లలు ఇంటికి వచ్చే సమయం కలిసి వచ్చింది. దానితో బయటకు వెళ్లడానికి వీలవుతోంది. ఈసారి మొహమాట పడకుండా ఆడపడుచు ఫోన్ చేస్తే నేను మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. సుగుణ భర్త కూడా జరిగేవన్నీ గ్రహించి భార్యకు అనుకూలంగా మసలుకున్నాడు. శుభం

M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.

ధన్యవాదములు 🙏


78 views0 comments

Comments


bottom of page