Written By Gannavarapu Narasimha Murthy
'అశ్వ మేధం - ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అశ్వ మేధం ధారావాహిక ప్రారంభం
హేమంతం! ఉదయం పదిగంటలైనా దేశ రాజధానిలో పొగమంచు వీడలేదు. దారి కనిపించనంతటి మంచు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల 9.00 గంటలకు చేరవలసిన ఫ్లైట్ అరగంట ఆలస్యంగా చేరింది.
చరణ్ త్వరగా ఫ్లైట్ దిగి అరగంటలో బయటకొచ్చాడు. టాక్సీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి బయలు దేరాడు. అక్కడికి చేరుకునే సరికి 10.30 అయింది. అప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాబట్టి ఎన్రోల్మెంట్ అవీ ఉంటాయి.
అతను ఆహాలు దగ్గరకు వచ్చి "మే ఐ కమిన్" అన్నాడు.
డయాస్ మీద అభ్యర్ధులతో మాట్లాడుతున్న ప్రొఫెసర్ అతని వైపుతిరిగి 'కమిన్' అన్నాడు.
"సారీసర్... ఫ్లైట్ లేట్... మైనేమ్ ఈజ్ చరణ్ ఫ్రం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్" అన్నాడు తన వివరాలున్న పేపర్ ఇస్తూ.
అప్పటికే ఆ హాలు అభ్యర్థులతో నిండిపోయింది. ఫేను చప్పుళ్ళు తప్ప హాలంతా నిశ్శబ్దం గా ఉ౦ది.
అది యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్... దేశంలోని ప్రముఖ న్యాయ కళాశాలల్లో అదొకటి; జె యన్ యూ కి సంబంధించిన కాలేజి. ఆ సెంటర్ భారతదేశ రాజ్యాంగం - చట్టాలు - పీనల్ కోడ్ మీద వారం రోజులు షార్ట్ టర్మ్ కోర్సు' నిర్వహిస్తోంది.
వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ లా కాలేజిల్లో చదివిన విద్యార్థులు, లాయర్లు దానిని హాజరవుతున్నారు. చరణ్ రెండేళ్ళ క్రితం యూనివర్సీటీ కాలేజీలో 'లా' పాసయ్యాడు. యూనివర్సీటీ గోల్డ్ మెడలిస్ట్; రెండేళ్ల నుంచి ఒక ప్రముఖ లా సిండికేట్లో ప్రాక్టీసు చేస్తున్నాడు. దాంతో పాటు పల్లెకు దగ్గర్లోని చిన్నపట్నంలో లా ప్రాక్టీసు చేస్తూ పేదవాళ్ళకు ఉచితంగా కేసులు వాదిస్తున్నాడు.
ఈ కోర్స్ చాలా మంచిదనీ, హజరైతే మంచిదనీ చెప్పి, లక్షరూపాయలు ఫీజు కట్టి ఢిల్లీ వచ్చాడు;. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తైన తరువాత క్లాసు ప్రారంభమైంది.
మొదటి క్లాసు అది... తెల్లటి బట్టలు వేసుకున్న ఆరడుగుల వ్యక్తిలోనికి వచ్చి "నాపేరు శుక్లా.... ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్" అని తనను పరిచయం చేసుకున్నాడు.
ఆ తరువాత అందరి పేర్లు అడిగి తెలుసుకొన్నాడు. ఆకోర్సుకి అరవైమంది హాజరయ్యారు. అందులో పది హేనుమంది దాకా అమ్మాయిలు కూడా ఉన్నారు.
“డియర్ ఫ్రెండ్స్! మన రాజ్యాంగంలోని చట్టాలు, వాటిలోని లోపాలు... అంటే లూప్ హోల్స్ గురించి ఇప్పుడు చర్చించబోతున్నాము. మన రాజ్యాంగం చాలా క్లిష్టమైన భాషలో వ్రాయబడటం వల్ల భవిష్యత్తులో చాలా మందికి అర్థం కాదని ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయం.
మన రాజ్యాంగం చాలా పెద్దది. అందులో 450 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 101 అమెండ్మెంట్స్, 117, 369 పదాలు ఉన్నాయి.
మన రాజ్యాంగం ఐక్యరాజ్యసమితి ఆశయాల కనుగుణంగా, మానవహక్కులు మరియు పర్యావరణ చట్టాల కనుగుణంగా వ్రాయబడింది.
400 బి.సి.లో వ్రాయబడ్డ కౌటిల్యుని అర్థశాస్త్రం, 100 ఎడిలో వ్రాయబడ్డ మనుస్మృతిల ఆధారంగా మన రాజ్యాంగం కూర్చబడింది".
ఒక ప్రవాహంలా ఆయన చట్టాల గురించి, న్యాయశాస్త్రాల గురించి అనర్గళంగా చెప్పుకు పోతున్నాడు. అలా ఆ పాఠం రెండు గంటల పాటు సాగింది. సూది పడితే వినిపించేటంతటి నిశ్శబ్ధంలో ఆపాఠాన్ని అందరూ ఆస్వాదించ సాగారు.
ఆ తరువాత లంచ్ విరామం ఇచ్చారు. చరణ్ కేంటీన్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్లాడు. కేంటీన్ చాలా పెద్దది. అక్కడ చాలా రష్ గా ఉంది. ఏ టేబులూ ఖాళీలేదు. పది నిముషాల నిరీక్షణ అనంతరం ఒక టేబుల్ ఖాళీ అయింది. ఇంతలోఒక అమ్మాయి పరుగున వచ్చి అతనికెదురుగా కూర్చుంది. ఆమెని చరణ్ గుర్తు పట్టాడు. ఇందాక క్లాసులో చూసాడామెని.
తెల్లగా, పొడవుగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది.
ఆమె చరణ్ ని విష్ చేస్తూ. “హలో... మీరు స్పెషల్ కోర్సుకి వచ్చారు కదూ" అంది.
“అవును మేడం.. మీరు కూడా వచ్చారు కదూ.”
"అవును.. నా పేరు సౌదామిని " అంది మెనూ వివరాలు చూస్తూ;
"నా పేరు చరణ్ ; నేను తెలుగు వాడినని అని ఎలా పోల్చుకున్నారు" అన్నాడు నవ్వుతూ.
"తెలుగు వాళ్ళని పోల్చడం తేలిక.. ఇందాక మీరు ఎవరితోనో హిందీలో మాట్లాడటం విన్నాను” అంది నవ్వుతూ ; ఇంతలో వెయిటర్ వచ్చాడు.
"తండూరీ రోటీ, పన్నీర్ బట్టర్ మసాలా, మిక్సిడ్ వెజిటెబుల్ కర్రీ " అని అతనికి చెప్పి సౌదామిని వైపు తిరిగి "మేడం! మీ కేం కావాలి " అని అడిగాడు చరణ్.
"వెజ్ పులావ్" అని చెప్పడంతో వెయిటర్ వెళ్ళి పోయాడు.
'సౌదామిని గారు! మీ పేరు చాలా బాగుంది. ఢిల్లీలో ఇలా తెలుగువారిని కలవడం ఆనందంగా ఉంది. మీరెక్కడ నుంచి వచ్చారు ? ‘లా' ఎక్కడ చదివారు? " అని ఆమెను అడిగాడు.
"నేన తెలుగమ్మాయినే అయినా పుట్టి పెరిగింది అంతా ఢిల్లీలోనే. ఇక్కడే జె ఎన్ యూలో లా చదివాను. మొన్నే పాసయ్యాను”.
"గ్రేట్! ఇక్కడే పుట్టి పెరిగినా తెలుగు బాగా మాట్లాడుతున్నారు".
"ఇంట్లో మా అమ్మ, నేను తెలుగులోనే మాట్లాడుకుంటాము. బయటకొస్తేనే హిందీ, ఇంగ్లీషు”
ఇంతలో వెయిటర్ ట్రే లో వంటకాలు పట్టుకొచ్చి వాళ్ళకు సర్వ్ చేసాడు.
"ఆంధ్రలో మీరెక్కడ నుంచి వచ్చారు"? పలావ్ తింటూ అడిగిందామె.
మాది విశాఖపట్నం దగ్గర ఓ గ్రామం.. వశిష్టపురం; నేను 'లా' విశాఖపట్నంలో చదివాను. రెండేళ్ల క్రితం పాసై ఇపుడు ఒక లా సిండికేట్లో పనిచేస్తున్నాను"; అంటే వాళ్లు నాకు కొన్ని కేసులిస్తారు.నేను వాటిని వాదిస్తాను; వాటికి తోడు నేను మా ఊరి దగ్గర ఉన్న చిన్నపట్నంలో ‘లాయర్' గా ప్రాక్టీసు చేస్తున్నాను. పేదవాళ్ళకి ఉచితంగా కేసులు వాదిస్తుంటాను; నాబాల్యం అంతా మా వశిష్టపురంలోనే గడిచింది. నాన్నగారులేరు. అమ్మా నేను ఉంటాము. 20 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ ఉంటాను"
"మరి ఈ సెమినారి ఎందుకొచ్చారు"?
"దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు, లీగల్ ఎక్సపర్టులు చాలామంది వస్తారనీ,న్యాయపరమైన ఎన్నో విషయాలు ఈ సెమినార్లో చర్చిస్తారని మా ప్రొఫెసర్ గారు చెబితే వచ్చాను. యూనివర్సిటీలో చదివానుగానీ సబ్జెక్ట్ మీద సరియైన అవగాహన కలగలేదు. తరువాత చాలా పుస్తకాలు చదవవలసి వచ్చింది. నాకైతే డబ్బు సంపాదించాలనీ లేదు. మంచి లాయరుగా పేదవాళ్ళకు సహాయం చెయ్యాలన్నది నాకోరిక. ఈ రోజున్యాయం పేదవాడికి అందని ద్రాక్షలా మారింది. డబ్బున్న వాడికి అది చుట్టం. దాన్ని పేదవాడికి కూడా అందించాలన్నది నాకోరిక;" అన్నాడు చరణ్.
ఇద్దరూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కొని వస్తుండగా వెయిటర్ బిల్లు ఇచ్చాడు. చరణ్ కౌంటర్లలో బిల్లు చెల్లించిన తరువాత ఇద్దరూ బయటకు వచ్చారు.
ఆ సాయంత్రం క్లాస్ అయిన తరువాత సౌదామిని చరణ్ దగ్గరికి వచ్చి "రేపు ఆదివారం.. ఏమిటి మీ ప్రోగ్రాం" అని అడిగింది.
"నాకైతే ఢిల్లీ కొత్త! ఎప్పుడూ రాలేదు. అయితే తాజ్ మహల్ ని చూడాలన్న కోరిక చిన్నప్పట్నుంచీ వుంది. వెన్నెల్లో తాజ్ మహల్ అందంగా ఉంటుందని చదివాను. ఒక వేళ వెళితే తాజ్ ని చూడటానికి వెళ్తాను" అన్నాడు.
"ఒక్కరే వెళితే బాగుండదు. ఇద్దరుంటే మీ భావాలను పంచుకోవచ్చు".
"నాకిక్కడ స్నేహితులు ఎవరూ లేరు... ఇప్పుడు సెమినార్ కొచ్చినవాళ్ళలో చాలామంది ఇతర రాష్ట్రాలవాళ్ళు" అన్నాడు బయటకు నడుస్తూ..
ఆమె అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది.
సాయంత్రం కావడంతో ఢిల్లీ నగరాన్ని మంచుదుప్పటి కప్పేస్తోంది. ఆ హేమంత రాత్రి లో ఢిల్లీ నగరం అద్భుతంగా,అందంగా కనిపించసాగింది. ఆ మర్నాడు ఆగ్రా బయలుదేరాడు. 9 గంటలకి తాజ్ మహల్ దగ్గరికి చేరుకున్నాడు. ప్రవాహంలా జనం.. అందరూ ఆ అద్భుత కట్టడం ఎదురుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు.
చరణ్ దూరంగా నిలబడి దాని అందాలను తిలకిస్తున్నాడు. అలా చూస్తూ ఉంటే దాని నిర్మాణంలో ఏదో ప్రత్యేకత అతనికి గోచరించ సాగింది.
అలా దాన్ని చూస్తూ ఉన్న సమయంలో "చరణ్ గారూ" అని వినిపించింది. చరణ్ ఆ పిలుపు వినిపించిన వైపు చూసేడు.
ఎదురుగా సౌదామిని ; తెల్లటి దుస్తుల్లో దేవదూతలా ఉంది.
"ఆశ్చర్యం! మీరేంటి ఇక్కడ? నిన్న మీరు వస్తానని చెప్పలేదు" అన్నాడు..
"నేను ఢిల్లీలోనే పుట్టి పెరిగినా తాజ్ మహల్ ని చూడలేదు. అందుకే ఈరోజువచ్చాను. మీకు కంపెనీ, నా తాజ్ చూడటం రెండూ జరిగిపోతాయని వచ్చాను.' అంది నవ్వుతూ..
"చాలా సంతోషం మేడం. నిజంగా ఒంటరిగా చూస్తే డల్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారుగా; మంచి కంపెనీ ; పదండి లోపలికెళ్ళి చూసి అపుడు యమున ఒడ్డున కూర్చుని వెన్నెట్లో తాజ్ ని ఆస్వాదిద్దాం" అన్నాడు. ఆమె అతన్ని అనుసరించింది.
లోపల పాలరాతిలో చేసిన సమాధి, దానిమీద సప్తవర్ణ మిశ్రమమైన వెలుగులు ప్రసరిస్తూంటే అద్భుతంగా గోచరించసాగింది.
"సౌదామిని గారు! దీని గురించి మీకు తెలిసింది చెప్పండి"అన్నాడు చరణ్.
షాజహాన్ తన భార్య మీద ప్రేమతో తాజ్ ని నిర్మించాడని చెబుతారు. 400 ఏళ్లైనా ఇది చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది" అంది విస్ఫారిత నేత్రలతో దాన్ని చూస్తూ..
"అవును.. నిజంగా గొప్ప నిర్మాణం.. 1632 - 1653 మధ్య అప్పటి మొఘల్ ప్రభువు షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృత్యర్ధం దీన్ని నిర్మించాడు;, దీని వాస్తు శిల్పి ఉస్తాద్ అహ్మద్ లావచోరీ, దీన్ని మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించాడు; షాజహాన్ మూడవ భార్య ముంతాజ్.. ఆమె తన పద్నాల్గవ సంతానానికి జన్మనిస్తూ మరణించింది. ఆమె మరణించిన సంవత్సరం తరువాత 1632లో దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించి 1653 లో పూర్తి చేసాడని చరిత్ర చెబుతోంది; దీని విశిష్టత ఏమిటంటే సౌష్టవం.. సిమెట్రీ..
అంటే నాలుగువైపులా ఒకేలా ఉండటం.. చార్ మినార్ అంటే నాలుగు స్తంభాలు నాలుగు వైపులా ఒకేలా కనిపిస్తాయి; షాజహాన్ విచారాన్ని, భార్య మీద ప్రేమనూ తెలిపే కట్టడమే తాజ్ నిర్మాణానికి ప్రేరణ.. షాజహాన్ తాజ్ ని ఓ గేయం లో "ఈ సౌధం వీక్షణ ఒక విచారపు నిట్టూర్పుని సృష్టిస్తుంది. సూర్యచంద్రులు తమ కన్నీటిని విడుస్తారు అని చెప్పాడు; " అని దాని గురించి వివరించాడు చరణ్.
"తాజ్ గురించి చాలా విషయాలు బాగా చెప్పారు. ఇవన్నీ నాకు తెలియవు;" అంది సౌదామిని.
"పదండి.. యమునా నది ఒడ్డు నుంచి చూద్దాం. ఇంకా బాగుంటుంది" అన్నాడు బయటకు వస్తూ..
అక్కడ యమున అమాయకంగా పారుతోంది. పౌర్ణమి కావడంతో వెన్నెల కిరణాలు దానిపై పరావర్తనం చెందుతుంటే వాటి మధ్య వెలుగుల్లో మెరిసి పోతున్న తాజ్.. ఆ దృశ్యం రవివర్మ గీసిన చిత్రంలా ఉంది. యమున అనగానే అతనికి రాధాకృష్ణలు గుర్తుకు వచ్చారు.
"గోపాలుని కోసం ఈరాధ! ఈ రాధే గోపాలుని గాధ" అన్న పాట గుర్తొచ్చింది.
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా! ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా";
ఎంత అద్భుతమైన వాక్యాలు... యమున, రాధ, కృష్ణుడు, గోకులం, బృందావనం.. ఇవన్నీ యమునని చూస్తే గుర్తుకువస్తాయి. రాధాకృష్ణుల సరససల్లాపాల దగ్గర్నుంచీ షాజహాన్ ముంతాజ్ ప్రేమ దాకా అన్నిటికీ యమున ప్రత్యక్ష సాక్షి;.
ఆ యమున ఒడ్డున నిలబడి వెన్నెల్లో యమున అందాలను చాలాసేపు వీక్షించారు; ఆతరువాత ఇద్దరూ బయటకొచ్చారు.
'థ్యాంక్స్ సౌదామిని గారు! మీరు రావడం వల్ల తాజ్ మహల్ దర్శనం ఆనందంగా జరిగింది.” అన్నాడు చరణ్;
‘అది సరే.. ఇప్పుడు మీరెలా ఢిల్లీ వెళతారు" అని అడిగింది సౌదామిని;
"నేను త్వరగా ఢిల్లీ వెళ్లాలి. ఏదో టాక్సీ పట్టుకుంటాను. రేపు మాబేచ్ పవర్ పాయింట్ ప్రజెంటేషనుంది" అన్నాడు చరణ్;
“రండి! నాకార్లో వెళ్లిపోదాము. నేనొక్కదాన్నే ఈరాత్రి వెళ్ళడం మంచిదికాదు" అని ఆమె చెప్పగానే చరణ్ కి ఆనందం వేసింది.
ఆ తరువాత దగ్గర్లోని రెస్టారెంట్లో చపాతీలు తిని, టీ తాగి ఢిల్లీ బయలుదేరారు. సౌదామిని రాత్రి కావడంతో జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యసాగింది. రోడ్డు మీద మెత్తగా సాగిపోతోంది కారు…
"మేడం !మీ గురించి చెప్పండి? "? ఆంధ్రాలో ఎక్కడ మీ ఊరు?”
"తూర్పు గోదావరి జిల్లా అనుకుంటాను. ఎక్కడో యానం దగ్గర... కోనసీమ.. ఇప్పుడు ఎవ్వరూ లేరు. నాన్నగారు ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసేవారు. నాలుగేళ్ళ క్రితం చనిపోయారు. మాఅమ్మకి పెన్షన్ వస్తుంది. వాళ్లకి నేనొక్కర్తినే పిల్లని"; చెబుతుంటే ఆమె గొంతు జీరబోవడాన్ని గమనించాడు చరణ్;
"ఈ కార్యక్రమం అయిపోతే ఆంధ్రాకు వెళ్లిపోతారా? లేక ధార్మిక స్థలాలు హరిద్వార్.. యమునోత్ర, గంగోత్రి లాంటివి ఏమైనా చూస్తారా?
“నాకు గుడి, గోపురాల మీద అంత ఆసక్తిలేదు. అలాగని అయిష్టంలేదు. కానీ ప్రకృతి పరిశీలన, చారిత్రక ప్రదేశాలు చూడటం చాలా ఇష్టం; ఆమధ్య ఔరంగాబాద్ వెళ్లినపుడు అజంతా, ఎల్లోరా గుహలను చూసాను. అలాగే కర్నాటక వెళ్లినపుడు బదామీ, హంపీ, హళేబీడు, బేలూరు, రాజస్థాన్లో లో బిల్వారా, కేరళలోని సైలెంట్ వేలీ, వాయనాడు.. ఇలా ఎన్నో చారిత్రక ప్రదేశాలు చూసాను.
ఈ మధ్యనే గోల్కొండ వెళ్లాను. అందులోని రామదాసు బందీఖానాని చూసినపుడు నేను రామదాసు కాలం నాటికి వెళ్ళిపోయాను. భద్రాచలంలోని పంచవటిని చూసినపుడు “వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే!చక్రం చోర్థ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే!" అన్నట్లు ఆ సీతారాములు మదిలో మెదిలారు"; అని అతను చెబుతుంటే సౌదామిని మౌనంగా వినసాగింది.
అరగంట తరువాత కారు ఢిల్లీ చేరింది. ఆమెకి థాంక్స్ చెప్పి అతను హోటల్ ముందు దిగిపోయాడు. మర్నాడు కోర్సు పూర్తి కావడంతో సౌదామిని కి చెప్పి తన ఊరు వచ్చేసాడు.
అలా అతని ఢిల్లీ పర్యాటన ముగిసింది.
ఇంటికి వచ్చిన తరువాత చరణ్ తన పనుల్లో మునిగిపోయాడు. అతను ప్రాక్టీస్ చేస్తున్న పట్నం, ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల పేద గిరిజనులు దళారుల చేతుల్లో మోసపోయిన కేసులు ఎక్కువగా వస్తుంటాయి.
వారాంతంలో వశిష్టపురం వస్తుంటాడు.
ఒకరోజు అతను ఆఫీసులో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళ స్త్రీ వచ్చింది. తెల్లటి చీర, పొడవైన జడలో ఆమె ఆకర్షణీయంగా ఉంది.
వస్తూనే నమస్కారం పెడుతూ "నా పేరు శాంతి. ఒక కేసు విషయమై వచ్చాను." అంది.
“చెప్పండి" అన్నాడు ఆమెను కూర్చోమని చెబుతూ..
|
=================================================================================
ఇంకా వుంది...
=================================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments