top of page

కోరిక


'Korika' - Telugu Story Written by

Sanapathi(edida) Prasanna Lakshmi

'కోరిక' - తెలుగు కథ

రచన : శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి


ఈశ్వరి సరస్వతీ పుత్రికంటే నమ్మాల్సిందే...! ప్రభుత్వపాఠశాల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది. చక్కగా చదువుకోవడమే గానీ...పనిచేయడం చేతగాని తన అసమర్ధతకు ఇప్పుడెంతగా కష్టపడుతుందో పాపం. కలం పట్టుకుని రాసుకునే చేతులు అంట్లగిన్నెలు తోముతుంటే...ఎర్రగా కందిపోతున్నాయి. పని కష్టంగా వున్నా...చదువుపై ఇష్టంతో ఆ శ్రమను లెక్కచేయడం లేదు. ఏదో సాధించాలన్న తపనతో...ఆ ఇంటి యజమాని తిట్లను ఓర్చుకుంటుంది. "మీ అమ్మ నీకు పనులు చెప్పుంటే...సరిగా చేయడం చేతనయ్యేది. పూటకు గతిలేని వాళ్ళు కూడా పిల్లల్ని చదివించుకోవాలన్న పేరాశ ఎక్కువైపోతుంటే మీకు మాత్రం పనులెలా వస్తాయి...? నువ్వు తోమే పైపై తోముళ్లకు గిన్నెలు ఎక్కడా వదిలిచావడం లేదు. ఏ గిన్నె చూసినా అంటు కనిపిస్తూనే ఉంది. గదులైనా సరిగా ఊడుస్తున్నావా అంటే అదీ లేదు. చీపుర్ని గాల్లో ఎగరేస్తున్నావు గానీ.. ఒంగొని వాల్చి తుడవడం లేదు. ఎక్కడ దుమ్మక్కడే ఉంటుంది. ఇక తడిగుడ్డ సంగతి చెప్పనక్కర్లేదు. సరిగా పిండని నీళ్ల కర్రతో నువ్వు తుడిచే తుడుపుకి నన్నెప్పుడో జర్రున జారగొట్టేలా ఉన్నావు. మీ నాన్నకు నడుం విరిగినట్టే....నాకూ విరిగిపోవడం ఖాయం. రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఉండి... మీ అమ్మను పంపు" ఈశ్వరిపై అదేపనిగా కేకలేస్తోంది గోవిందమ్మ. "మా అమ్మ కొన్నాళ్ళు పన్లోకి రావడం కుదరదమ్మగారూ"....భయపడుతూనే సంజాయిషీ ఇచ్చుకుంది ఈశ్వరి. "కుదరదంటే ఎలా చెప్పు...? ఎలాగోలా వీలు చూసుకుని రావాలి గానీ. నువ్వు చేసే వచ్చీరాని పనికి వేలకు వేలు జీతాలిచ్చుకోలేను. మీ అమ్మ వస్తానంటే రమ్మను. లేదంటే ఇంకో మనిషిని చూసుకుంటాను" బెదిరిస్తూ చెప్పిన గోవిందమ్మ మాటలకు నిజంగానే బెదిరిపోయింది ఈశ్వరి. " లేదమ్మా...నాన్న కొంచెం తేరుకోగానే అమ్మే వస్తుంది. రేపటి నుంచి సరిగా పని చేస్తానమ్మగారూ"...పని ఎక్కడ పోతుందోననే బెంగతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మాటిచ్చింది ఈశ్వరి. దానితో గోవిందమ్మ చల్లబడింది. ఆమెకు కూడా తెలుసు...చేస్తున్నవాళ్లను మానిపిస్తే...తన చాదస్తానికి ఏ పనిమనిషీ తనకు కుదరదని. ఈశ్వరి తల్లి రాములమ్మ మాత్రమే... ఆమెకు పనికి సరిపోయే పనిమనిషి. కోవిడ్ ప్రభావంతో నాలుగు నెలలు...ఇంటిపనంతా చేసుకునేసరికి ఒళ్ళు హూనమైపోయింది. కరోనా వస్తుందేమో అనే భయం కన్నా...పని ఎక్కువై రోగాన పడిపోతానేమో అనే భయంతో రాములమ్మను మళ్లీ పనిలోకి పిలిచింది గోవిందమ్మ. గోవిందమ్మ పిలుపుతో రాములమ్మకు కూడా ప్రాణం లేచొచ్చినట్టయ్యింది.... అందరిళ్లలోనూ పనిచేసే తన వల్ల కరోనా వారికెక్కడ సోకుతుందోనని ఎవరికి వారు అందరూ పనులు మానిపించేసి, ఎవరిళ్లలో వాళ్లే పనులు చేసుకోవడంతో... చేతికందే డబ్బులు రాకుండాపోయి.ఆ కష్టకాలంలో ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది. తాను పనులు చేసే ఇళ్లందరిలోనూ గోవిందమ్మ గారు ఇచ్చే జీతం డబ్బులే ఎక్కువ. అందుకే పని కష్టమైనా...ఆవిడకు ఇష్టమైనట్లుగా పనిచేసి పెట్టేది. ఇప్పుడు ఆ అమ్మగారి పిలుపుతో...మళ్లీ నాలుగు డబ్బులొస్తాయన్న ఆనందం కనిపించింది రాములమ్మలో. కానీ....తాను పనికి వెళ్తే...తన భర్తకు సేవ చేసేది ఎవరు..? ఇంతటి బరువు మనిషిని లేవదీసి కూర్చోబెట్టడం పీలగా వుండే కూతురికి కష్టమే. కొన్నాళ్ళైనా భర్త గాయం తాలూకూ పచ్చినుంచి తేరుకుంటేనే గానీ...తాను బయటకు కాలు పెట్టడం కుదరదనుకుంది. తల్లి సమస్యను అర్థం చేసుకుంది ఈశ్వరి. "అమ్మా...ఆ అమ్మగారింట్లో పనికి నేనెళ్తానులే. నువ్వయ్యను చూసుకో" అంది తల్లి చేసే పనిని తాను అందిపుచ్చుకోవాలన్నట్టు. కూతుర్ని పనికి పంపడం రాములమ్మ మనసుకి కష్టంగా అనిపించినా... తప్పలేదు. కూతురి కోరిక తీర్చకుండానే... పనిలోకి వెళ్లిన భర్త, పైనుంచి కింద పడిపోవడంతో నడుం విరిగింది. అసలే ప్రాణాల మీద ఆశతో బిక్కుబిక్కుమంటున్న ఈ రోజుల్లో ఆపద వెన్నంటడం ఆ కుటుంబంలో కష్టాలన్నీ కూడుకున్నట్టయ్యింది. భర్త సంపాదనతో పాటు...తన సంపాదన కూడా లేకపోవడంతో....మందులకూ... తిండికీ కూతురు భవిష్యత్తు కోసం దాచిన డబ్బుకాస్తా వాడేయవలసి వచ్చింది. బడులు కూడా మూసేయడంతో కూతురు చదువెలా సాగుతుందా అనిపించింది. ఈశ్వరికి వయసు పెరుగుతున్న కొద్దీ...కన్నవాళ్ళ కష్టాన్ని చూడలేకపోతోంది... జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలిసొస్తుంది... తండ్రి కూలి పనిచేసుకోవడం...తల్లి పాచిపనులు చేసుకోవడం. చిన్నప్పటినుంచీ చూస్తూనే ఉంది. ఎంతో ఎత్తు భవంతుల కట్టడాలకు ప్రాణాల్ని లెక్కచేయకుండా పరంజాలు వేయడం నాన్నపని. ఆకాశాన్ని అతుక్కున్నట్టున్న భవంతుల్లో ఒళ్ళొంచి రోజంతా పాచి పనులు చేయడం తల్లి పని. కానీ...తాముండేది మాత్రం మురికివాడల్లోని ఓ చిన్న రేకుల షెడ్డులో. తాను మూడేళ్ళ వయసులో వున్నప్పుడు తనను చంకనేసుకుని ఎక్కడో మారుమూల ఏజన్సీ ప్రాంతం నుంచి పట్నానికి వలస వచ్చేసారు తల్లీతండ్రీ. కూలీ నాలీ పనులు చేసుకుంటూ...కొద్దిగా స్థిరపడేసరికి రెండేళ్లు పట్టింది. పిల్లను చదివించుకోవాలనే కోరిక కలగడంతో ఆలోచించకుండా అంగన్వాడీ కేంద్రంలో చేర్చడం వల్లే...ఈరోజు తనకు చక్కగా చదువబ్బిందని ఎంతో ప్రేమ పెంచుకుంది కన్నవాళ్లపై. బాగా చదువుకుని... ఉద్యోగం చేయాలనే ఆలోచన ఆ చిన్ని బుర్రకు తట్టిందంటే...తమ కుటుంబమంతా పేదరికం నుంచి బయటపడాలని ఎంతగా తపిస్తుందో...? అదే విషయం...కన్నవాళ్ళతో చెప్పినప్పుడు ఎంతగానో పొంగిపోయారు. వారి కళ్లలోని ఆనందాన్ని చూసి...తానూ పొంగిపోయింది ఈశ్వరి. తాను చదవాలి. బాగా చదివి...మంచిమార్కులు తెచ్చుకోవాలి. పది పాసయ్యాకా...పాలిటెక్నికల్ కోర్సు చేసి, త్వరగా ఉద్యోగం సంపాదించుకోవాలి...ఎన్నో గాలి మేడలు కట్టుకుంటుంది ఈశ్వరి. ఈలోపు...కరోనా కలకలం...అన్ని కార్యాలయాలతో పాటూ బడులన్నీ మూసేసారు. విద్యార్థుల పరీక్షలు జరపకుండానే పాస్ చేసేసారు. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలీని బడుల కోసం ఎదురు చూస్తుంటే.. తరువాత తరగతుల పాఠాలు ఆన్లైన్లో మొదలైపోవడంతో వాటిని తాను అనుసరించలేకపోతున్నందుకు ఈశ్వరిలో కంగారు మొదలయ్యింది. నువ్వేమీ కంగారు పడకమ్మా...నీ చదువుకేమీ ఇబ్బంది రానీయను కదా...అంటూ పనిలోకి వెళ్లిన తండ్రి, పరంజాలు కడుతూ అంతెత్తు కర్రలపై నుంచి జారి కిందపడ్డంతో, నడుం విరిగి ఆసుపత్రి పాలయ్యాడు. నెల్లాళ్ళుగా తండ్రికి మంచం మీదే సేవ చేస్తున్న తల్లిని నిస్సహాయంగా చూస్తూ తనలో తనే బాధను మింగుతుంది తప్పించి...చదువుమాట మరిక ఎత్తలేకపోయింది. ఈశ్వరికి తెలుసు...తండ్రి కోలుకోవాలంటే ఈపరిస్థితుల్లో తల్లి అవసరం ఎంతైనా ఉందని. అందుకే తాను కష్టపడైనా పనిచేసి...కుటుంబాన్ని పోషించుకోవాలనే తలంపుతో మరో రెండిళ్ళు పనికి పిలిస్తే ఒప్పుకుంది. ఒకప్పుడు...ఉదయాన్నే లేచి చదువుకునేది. ఇప్పుడు ఆసమయంలో పనుల్లోకి వెళ్లడం అలవాటుచేసుకుంది. ఎవరు ఏ మాటన్నా మౌనంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుని పోతున్నా...తన మనసు కలవరిస్తూనే ఉంటుంది...తన సంపాదనలో ఇంటి ఖర్చులు పోను...ఎంతోకొంత డబ్బులు దాయగలిగితే...ఆన్లైన్లో జరిగే పాఠాలు నేర్చుకోడానికి.. ఒక సెల్ కొనుక్కోవాలని...!!* ***** ****** *****

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


రచయిత్రి పరిచయం

నాపేరు శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి.

ఊరు విశాఖపట్నం.

1986 లో ఏడిద ప్రసన్నలక్ష్మి పేరుతో నా మొదటి రచన ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడింది. 1992 వరకూ వివిధ వార,దిన పత్రికల్లో నా రచనలు 100 వరకూ ప్రచురించబడ్డాయి. తిరిగి 2016 నుంచి శానాపతి (ఏడిద)ప్రసన్నలక్ష్మి పేరుతో ఎక్కువగా అంతర్జాల పత్రికల్లో రచనలు చేస్తూ వస్తున్నాను. వీటిలో 150 వరకూ ప్రచురించబడ్డాయి. కొన్ని కథలకు ప్రింట్ మీడియాల్లోనూ, వెబ్ మీడియాల్లోనూ కూడా బహుమతులు గెల్చుకున్నాను. ఫేస్ బుక్ మణి మాలికలు గ్రూప్ లో 2000 వరకూ ద్విపదలు రాసాను. చిన్న చిన్న కథలనే రాయడానికి ఇష్టపడతాను. ఇప్పటికీ అన్నయ్య ఏడిద గోపాలకృష్ణ మూర్తి ప్రోత్సాహంతోనే నేను రచయిత్రిగా ఎదగగలిగాను. మావారు శానాపతి రంగధామ్.

బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగిగా పదవీవిరమణ చేశారు. పెద్దబ్బాయి, కోడలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, చిన్న అబ్బాయి డాక్టర్.

529 views13 comments
bottom of page