top of page

అశ్వ మేధం ఎపిసోడ్ 2


Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్.

ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు.

అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది.

తాజ్ మహల్ వద్ద ఇరువురూ మళ్ళీ అనుకోకుండా కలుస్తారు.

ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.


ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 2 చదవండి...

"మాది ఇక్కడికి దగ్గర్లోని ఏజెన్సీలో టేకుపల్లె. నాభర్త చైతన్య ఫ్రీలాన్స్ జర్నలిస్టు.. ఈఏజెన్సీలో వార్తలను కవర్ చేస్తుంటాడు. ఆరునెలల క్రితం దయానిధి అనే ఒక కలప కాంట్రాక్టర్ టేకు చెట్లను కొట్టి అక్రమంగా తరలించుకు పోతుంటే గిరిజనులు అడ్డుకొని లారీలను ఆపేయడంతో దయానిధి మనుషులు గిరిజనులపై దాడిచేసి ఆ గ్రామాల మీద పడి వాళ్ళని కొట్టి లారీలను తీసుకెళ్లిపోయారు. అదే తండాకు చెందిన సుశీల అనే మహిళను దయానందం మనుషులు మానభంగం చేసి హత్య చేశారు; ఆ దాడిలో సుక్కు అనే గిరిజనుడు చనిపోయాడు. నాభర్త ఆ దృశ్యాలను వీడియో తీసి ఎస్పీకి పంపించడంతో ఎస్పీ గారు ఎంక్వయిరీకి ఆదేశించారు. ఆతరువాత ఆ సుక్కు శవాన్ని తీసుకొని ఆ తండా గిరిజనులు పోలీసు స్టేషన్ మీద దాడి చేసి ఇద్దరు పోలీసులను చంపివేయడంతో అడవి అంటుకుంది. ఏజెన్సీ అంతా ఏకమై పోలీసుస్టేషన్ మీద దాడి చెయ్యడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆతరువాత పోలీసులు నాభర్త మీద కక్ష కట్టి లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. అప్పట్నుంచీ అతని ఆచూకి తెలియటం లేదు. ఎక్కడ దాచారో, ఏయో హింసలు పెడుతున్నారో ఎవ్వరికీ తెలియదు; కాబట్టి మీరు ఈకేసుని వాదించి నాభర్త చైతన్య ఆచూకి కనుక్కోమని చెప్పటానికి వచ్చాను” అంది రెండు చేతులు జోడించి. చరణ్ ఆమెదగ్గర్నుంచి వివరాలు తీసుకొని మొత్తం కేసు వివరాలు చదివాడు. "మేడం! మీరు ఈకాగితాల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపొండి. మిగతావి నేను చూసుకుంటాను" అని చెప్పి ఆమెను పంపించి వేసాడు. ఆమర్నాడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసాడు. పోలీసులు చైతన్య అనే జర్నలిస్టుని అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడో దాచివేసారనీ ,అతని ఆచూకీ తెలియదనీ, పదిరోజులైనా కోర్టు లో ప్రవేశ పెట్టలేదనీ, అతని భార్య శాంతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనీ, కాబట్టి పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేటట్లు పోలీసులకు ఉత్తర్వులివ్వాలనీ అందులో కోర్టుని అభ్యర్ధించాడు. ఈ విషయం తెలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరభద్రం చరణ్ ని పిలిచి కేసుని వాపసు తీసుకోమని చెప్పాడు. కానీ చరణ్ అతనికి కొన్ని సాక్ష్యాలుచూపించి, పోలీసుల దమనకాండని వివరించాడు. కోర్టు ఈకేసుని విచారించడానికి స్వీకరించి వాదనలు వినడానికి పదిరోజుల తరువాత సమయం ఇచ్చింది.పేపర్లు, టీవీఛానల్స్ ఈకేసుకి బాగా కవరేజి ఇవ్వడంతో రాష్ట్రంలో ఈకేసుకి ప్రాధాన్యత పెరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కేసుని దాఖలు చెయ్యడమే కాకుండా ఈకేసులో వాదిస్తున్నది ఓ యువ న్యాయవాది అని తెలిసి ఏంజరగబోతుందోనని రాష్ట్ర ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించసాగారు. ఈకేసుని లోకల్ మీడియాతో పాటు జాతీయ ఛానల్స్ కవర్ చెయ్యడంతో చరణ్ పేరు మారు మ్రోగి పోసాగింది. ఒకదశలో పోలీసులు వర్సెస్ చరణ్ అన్నట్టు ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో పోలీసులు కోర్టుకి ఒక ఆఫిడివిట్ సమర్పించారు. అందులో గిరిజనులు కలప కాంట్రాక్టర్ల మీదా, అటవీశాఖ అధికారులమీద దాడులు చేస్తూన్నారనీ, వీళ్ళకు ఎవరో తీవ్రవాదులు సహాయం చేస్తున్నారనీ, అందుకే వాళ్ళను అదుపులో తీసుకున్నామనీ, అందులో సుక్కు అనే వ్యక్తికి తీవ్ర వాదులతో ప్రత్యక్ష సంబంధాలున్నాయనీ, అందుకే అతన్ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ లాకప్పులో పెడితే గిరిజనులు మూకుమ్మడిగా పోలీసు స్టేషన్ పై దాడిచేశారనీ, అందులో ఇద్దరు పోలీసులు చనిపోయారనీ, అపుడు ప్రాణరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సుక్కు అనే వ్యక్తి చనిపోయాడనీ, ఈ దాడి వెనుక జర్నలిస్టు ముసుగు వేసుకున్న చైతన్య అనే వ్యక్తి హస్తం ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చెయ్యవలసి వచ్చిందనీ, అతన్ని ఇంటరాగేషన్ చేసిన తరువాత వదిలి వేసామని , లాకప్పు లో వున్నప్పుడు అతని మీద ఏవిధమైన లాఠీ ప్రయోగం జరగలేదనీ, అతన్ని వేధించలేదనీ , ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీ లో లేడనీ తెలిపింది. ఆమర్నాడు కోర్టులో వాదనలు మొదలయ్యాయి. మొదట పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించాడు. ఆఫిడివిట్లో వున్నదే అతను చెప్పాడు; ఆ తరువాత చరణ్ తన వాదనలు ప్రారంభించేడు. "యువరానర్! అనాదిగా అడవి అంటే గిరిజనులది; అక్కడే ఆజాతి పుట్టి పెరిగింది. అటువంటి అడవిని విచక్షణారహితంగా కలప దొంగలు కొట్టి వేస్తుంటే.. అందులోనూ టేకులాంటి చాలా విలువైన కలపను కొట్టి తరలించుకుపోతుంటే దానిని కాపడవలసిన అటవీశాఖ గానీ, పోలీసుశాఖగానీ చోద్యం చూస్తున్నాయి గానీ ఏవిధమైన చర్యలు తీసుకోవటం లేదు. అందుకే అడవి నానాటికి కుదించుకుపోతోంది. గిరిజనులమీద దాడులు ఎక్కువయ్యాయి. వాళ్ళ స్త్రీలమీద ఈ కలప స్మగ్లర్ల అత్యాచారాలు పెరిగిపోయాయి. అందుకే గిరిజనులు విసిగిపోయి వాళ్ళను అడ్డుకున్నారు. ప్రతి ఘటించారు. కానీ రక్షించవలసిన పోలీసు, అటవీశాఖలు స్మగ్లర్స్ తో చేతులు కలిపాయి. గిరిజనుల్ని అరెస్ట్లు చేసాయి. మొన్న టేకుపల్లి తండాలో సుశీల అనే ఒక స్త్రీ అత్యాచారానికి గురైతే పోలీసులు నేరస్తుణ్ణి కాపాడారు. సుక్కు అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. అందుకే పోలీసు స్టేషన్ మీద దాడి జరిగింది. పోలీసులు గిరిజనులను కొట్టి ఆక్రమంగా అరెస్ట్ చేసారు. కాబట్టి వాళ్ళు దాడిచేసారు. ఆ సయమంలో ఒక బాధ్యత గల జర్నలిస్టుగా ఆ సంఘటనల్ని తన కెమేరాలో బంధించాడు చైతన్య. అది పోలీసులకు నచ్చక అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి కేసుపెట్టారు. ఆతరువాత అతను కనిపించలేదు. అంటే అతనింకా పోలీసుల దగ్గరే ఉన్నట్లు భావించాలి. ఒకవేళ అతన్ని విడుదల చేస్తే విలేఖరుల సమావేశంలోను, కోర్టుద్వారానే విడిచిపెట్టాలి. కానీ అలా జరగలేదు. కాబట్టి అతన్ని పోలీసులు ఎక్కడో బంధించి ఉండాలి. లేకపోతే చంపేసి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండవచ్చు. అందుకే ఈ కేసుని పరిశోధిస్తున్న సర్కిల్ ఇన్సెస్పెక్టర్ రామనాధ్ ని ఇంటరాగేట్ చేసే అవకాశం కల్పించాలని కోర్టువారిని కోరుతున్నాను" అని న్యాయమూర్తి వైపు తిరిగి చెప్పాడు. కొద్ది క్షణాలతో రామనాధ్ బోనులోకి వచ్చాడు. చరణ్ అతన్ని ప్రశ్నించటం మొదలుపెట్టాడు.. "మీరు ఎంతకాలం నుంచి ఆపోలీసు స్టేషన్లో పనిచేస్తున్నారు?” "రెండు సంవత్సరాల నుంచి" "మరి కలపని అక్రమంగా స్మగ్లర్స్ తరలించుకుపోతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు.. గిరిజన స్త్రీల మీద అత్యాచారాలను ఎందుకు అరికట్టలేకపోయారు?” “ఇది అబద్ధం.. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాము". "మరి రెండు నెలలు క్రితం సుశీల అనే స్త్రీ అత్యాచారానికి గురైతే ఆకేసులో వారం రోజులు దాకా ఎఫ్.ఐ.ఆర్ ఎందుకు దాఖలు చెయ్యలేదు? చివరకు చైతన్య తన పేపర్లో ఆవార్తని వ్రాసిన తరువాత కేసుని రిజిస్టర్ చేశారు.. సుశీలను అత్యాచారం చేసిన స్మగ్లర్ సంతోష్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతన్ని పట్టుకొని వదిలేసారని చైతన్య వ్రాస్తే అతణ్ణి అరెస్ట్ చేసారు; ఇది నిజమా కాదా?” అనిఅడిగాడు చరణ్. “అబద్ధం - అసలు ఆ స్త్రీ అత్యాచారానికి గురవలేదు. కాబట్టి సంతోష్ ని అరెస్టు చెయ్యలేదు"; “అయితే పోలీసు స్టేషన్లో మీరతనితో మాట్లాడుతున్న ఈ సంఘటన వాస్తవం కాదా?” అంటూ ఒక పేపరు కటింగ్ ని చూపించాడు. అందులో సంతోష్, రామనాథ్ మాట్లాడుతున్న ఫోటో వేసి ఉంది. "అదిప్పుటిది కాదు. పాతది” అన్నాడు రామ నాథ్. "కానీ మీ వాళ్ళు మీ జీపులోనే అతన్ని చెక్ పోస్టు దగ్గర వదిలేసిన దృశ్యాలున్న వీడియోని ఒక్కసారి చూడండి" అంటూ సెల్ ఫోన్ లో వీడియోని చూపించాడు. అందులో సంతోష్ ని ఇద్దరు పోలీసులు తమ జీప్ లో తీసుకువచ్చి చెక్ పోస్టు దగ్గర వదిలివేసిన దృశ్యం రికార్డ్ చెయ్యబడి వుంది; “మరి దీన్నేమంటారు . మీరు అరెస్ట్ చెయ్యలేదు అన్నారు. ఇందులో మీవాళ్లే వదిలి వేసినట్లు వీడియోలో ఉంది. ఇదికూడా అబద్ధమా?" "ఈవిషయం నాకు తెలియదు” “పోలీసు స్టేషన్ లో సుక్కు అనే వ్యక్తిని లాఠీతో కొడితే ఆ దెబ్బలకు తట్టుకోలేక అతను చనిపోయినట్లు చెబుతున్నారు. నిజమేనా?” “కాదు... అతనే మామీద పిస్టల్తో కాల్పులు జరిపితే ఆత్మ సంరక్షణ కోసం మావాళ్ళు అతన్ని షూట్ చెయ్యవలసి వచ్చింది” "ఓహో! అయితే ఇది చూడండి!” అంటూ ఇంకో వీడియో చూపించాడు. జడ్జిగారు కూడా చరణ్ చూపిస్తున్న వీడియో సాక్ష్యాలు, పేపర్ కటింగ్ లు ఆసక్తిగా చూస్తున్నారు. ఆవీడియోలో ఇద్దరు పోలీసులు రామ నాథ్ కెదురుగా 'సుక్కు' అనే గిరిజనుణ్ణి లాఠీలతో విచక్షణా రహితంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. “మరిప్పుడే మంటారు? ఈదృశ్యాలు అబద్ధాలంటారా? మీరన్నట్లు అతని చేతిలో ఏ విధమైన తుపాకీ లేదు. మరి మీమీద ఎలా కాల్పులు జరిపాడు? అంటే మీ లాఠీ దెబ్బల వల్లే అతను చనిపోయాడు. దాన్ని మీరు ఆత్మరక్షణ కోసం చంపినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ చైతన్యే కానీ ఈ దృశ్యాలను రికార్డ్ చెయ్యకపోతే ఈ కేసు ఏమయ్యేది చెప్పండి.. న్యాయం బయట కొచ్చేదా? మీలాంటి కాపాడవలసిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే సమాజం ఏమైపోతుంది? మీరు ఆ గిరిజనుడిని కొట్టారు. కాబట్టి గిరిజనులు మీ స్టేషన్ మీద దాడి చేశారు. లేకపోతే ఆ అవసరమే ఉండేది కాదు కదా ; ఏమంటారు?" "చైతన్య ని ప్రశ్నించిన తరువాత మేము వదిలేసాము " "మరి ఈ ఫోటోలో ఉన్న పోలీసులు ఎవరు? ఈ ఫోటో నిన్న రాత్రి తీసినట్లు ఫోన్లో రికార్డయింది" అంటూ తన మొబైల్ లోంచి ఒక ఫోటో ని చూపించాడు. అందులో చైతన్య లాకప్పులో ఉన్నాడు. ఎదురుగా ఇద్దరు పోలీసులు; “చెప్పండి.. రామ్ నాథ్.. మీరేమో చైతన్యని వదలివేసాము అంటున్నారు. కానీ ఈ దృశ్యంలో ఇద్దరు పోలీసుల కెదురుగా లాకప్పులో చైతన్య ఉన్నాడు. అతనే నాకు ఈ ఫోటో పంపాడు. అంటే చైతన్య ఇంకా మీ ఆధీనంలోనే ఎక్కడో ఉన్నాడు. అతను బయటకు వస్తే మీ గుట్లన్నీ, బయటపడతాయని భయపడి మీరు అతన్ని విడిచి పెట్టటంలేదు.. నిజమా కాదా?" చరణ్ ప్రశ్నలు ఆ కోర్టు హాల్లో ప్రతిధ్వనించసాగాయి; "ఆ విషయం నాకు తెలియదు. నేను కనుక్కోవాలి" అంటూ నీళ్ళు నమిలాడు రామ్ నాథ్.. వెంటనే చరణ్ జడ్జిగారి వైపు తిరిగి 'యువరానర్! ఈకేసులో మొదట్నుంచీ పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారు. సుక్కు అన్న గిరిజనుణ్ణి విడిపించడానికి గిరిజనులు పోలీసు స్టేషను మీద దాడిచేస్తే వాళ్ళందర్ని లాఠీలతో కొట్టి మరో ఇద్దరు చావుకి కారణం అయ్యారు. ఆదృశ్యాలను చిత్రీకరించిన విలేఖరి చైతన్యని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికో తీసికెళ్ళిపోయారు. చట్టప్రకారం ఏవ్యక్తినైనా ప్రశ్నించడానికి తీసికెళ్ళినపుడు అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలి. కానీ చైతన్య విషయంలో పోలీసులు సక్రమంగా, చట్టానికి అనుగుణంగా ప్రవర్తించలేదు. కాబట్టి కోర్టువారిని ఈసాక్ష్యాలన్నీ పరిశీలించి చైతన్యని వెంటనే కోర్టులో హాజరు పరిచేట్లు ఆదేశించాలని కోరుతున్నాను”. అంటూ ఆసాక్ష్యాల వీడియోలు, పేపరు కటింగులను జడ్జి గారికి అందించాడు. కోర్టు మధ్యాహ్నం కి మూడు గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తన తీర్పుని వెలువరించింది. "సాక్ష్యాలు, వాదనలు విన్న తరువాత చైతన్య అనే విలేఖరి పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు కోర్టు అభిప్రాయానికి వచ్చింది. పోలీసులు 24 గంటల్లో చైతన్యని కోర్టులో హాజరు పర్చవలసిందిగా ఆదేశించడమైనది. సుక్కు మరియు మరో ఇద్దరి గిరిజనుల మరణాలకు కారణమైన పోలీసులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. సరియైన సాక్ష్యాలను ప్రవేశపెట్టి, మంచివాదనలను వినిపించిన యువ న్యాయవాది చరణ్ ని ఈకోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది.” అని తన తీర్పుని చదివి తన ఛాంబర్ లోకి వెళ్ళిపోయారు జడ్జిగారు. దాంతో 24 గంటల తరువాత పోలీసులు చైతన్య ని హాజరు పరిచారు. ఆ తరువాత అతన్ని బెయిలు పై విడుదల చేసారు. తన భర్తను విడుదల చేయించినందుకు శాంతి చరణ్ ని ఇంటికి వచ్చి అభినందించింది. ఎన్నో పేపర్లు, ఛానళ్ళు చరణ్ ఇంటర్వ్యూ ని ప్రసారం చేసాయి. సౌదామిని ఈ వార్త చదివి చరణ్ ని అభినందిస్తూ ఒక సందేశం పంపింది.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.

38 views0 comments

Comments


bottom of page