top of page
Writer's pictureSammetla Venkata Ramana Murthy

ఎ క్కా లు



'Ekkalu' New Telugu Story

Written By Susmitha Ramana Murthy

'ఎ క్కా లు' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"నాలుగు ఒకట్ల నాలుగు. నాలుగు రెళ్ళు ఎనిమిది. నాలుగు మూళ్ళు పన్నెండు.. ” “అవున్రా నాయనా!, నాలుగు మూళ్ళు పన్నెండేరా!.. నలుగురు కొడుకులు.. ఏడాదిలో పన్నెండు నెలలు. ఒక్కొక్కరి దగ్గర మూడేసి నెలలు!.. ” ఎక్కం చదవడం ఆపేసి నాన్నమ్మ వేపు వింతగా చూడసాగాడు మనవడు. "అత్తయ్యా!.. ఆపండిక మీ వేదాంతం!.. వాడిని చదువుకోనివ్వండి. డిస్ట్రబ్, చేయకండి!“ కోడలు గద్దింపుకి వసుంధరమ్మ మనసు చివుక్కుమంది. కొన్ని క్షణాలు మాట రాక నివ్వెర పోయింది. "ఏఁవిటలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నారు?.. చెప్పింది అర్థం కాలేదా?.. వాడిని చదువుకోనివ్వండి! “ ‘వారు కాలం చేయబట్టే కదా?.. తనకీ అవస్థ? ‘స్వగతంలా అనుకుంటూ వరండాలోకి వెళ్ళిపోయిందామె. ఒకనాడు, వసుంధరమ్మ, రాజమాత! భర్తకు , నలుగురు కొడుకులకు, కోడళ్ళకు తన మాటే వేదం! ఠీవిగా , దర్జాగా, బతికింది. తన, ప్రాణస్నేహితురాలి తండ్రి ప్రయివేటు కాలేజీలో, లెక్షరర్ గా ఒక వెలుగు వెలిగింది. కాలగమనంలో ఎన్నెన్నో మార్పులు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయింతర్వాత భర్త నిద్రలోనే కళ్ళు మూసారు. తనిప్పుడు పెద్దకొడుకు దగ్గర ఉంటోంది. మిగతా ముగ్గురూ ఉద్యోగరీత్యా వేరే నగరాలలో ఉంటున్నారు. భర్త లేని తన జీవితంలో, ఊహించని మార్పులు వచ్చాయి. ఫేమిలీ పెన్షన్ కాస్త ఆర్థిక వెసులుబాటు అయింది. , కొడుకులు తల్లి బాధ్యతను, నాలుగు మూళ్ళు పన్నెండంటూ వాటాలు వేసుకున్నారు.. "అమ్మా!, కళ్ళ జోడులో ఒక అద్దం ఊడొచ్చేస్తోంది. బాగు చేయించమ్మా “ బయటకు వెళ్ళబోతున్న పెద్ద కోడలు విసురుగా వెనక్కి తిరిగింది. "నేవెళ్ళే దారిలో కళ్ళద్దాల షాపులు ఉండవు. తర్వాత ఎప్పుడైనా చూద్దాం లెండి!“, అనేసి వెళ్ళిపోయింది. ‘ఈ సందు చివరలో షాపుంది కదా? సాయంత్రం వెళ్ళి చేయించుకుంటాను’ స్వగతంలా అనుకుని, బాధ పడిందామె.. ‘అమ్మ మూడు నెలల కాలం, అయిపోవస్తోంది. పెద్ద తమ్ముడితో మాట్లాడి, రైలు టికెట్ కొనాలి’ మనసులో అనుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళాడు పెద్ద కొడుకు. **** వసుంధరమ్మకు, మొదట్లో ఊర్లు తిరగడం సంతోషంగానే ఉండేది. మూడు నెలలకోసారి కొడుకుల చుట్టూ తిరగడం ఇప్పుడు విసుగనిపిస్తోంది. పిల్లలందరూ, అయిదారేళ్ళ వారయ్యారు. ఒకప్పుడు, అడ్డాలలోని బిడ్డలేగా?.. అప్పుడు కొడుకులు, కోడళ్ళు తనను ఎంతో బాగా చూసుకున్పారు. మనవలు, మనవరాళ్ళ లోకంలో, వారి ఆలన పాలనలో, ముద్దు ముద్దు మాటల్లో అనిర్వచనీయమైన ఆనందం పొందింది. హాయిగా గడిచాయి ఆరోజులు. అందరూ తనంటే, ప్రాణం పెట్టేవారు. ఆ ఆనందంలో, ఆత్మ సంతృప్తితో, పిల్లల కోసం తనెంతో శ్రమించింది. అవి మధుర, జ్ఞాపకాలు ! జీవిత కాలానికి సరిపడే ఆనంద క్షణాలు! ఇప్పుడు తన అవసరం బాగా తగ్గింది. పిల్లలు, స్కూళ్ళకు వెళ్తున్నారు.. గతం గుర్తు చేసుకుని బాధ పడడం, వసుంధరమ్మకు అలవాటైపోయింది. **** "ఏఁవండీ! మీ అమ్మ గారికి చాదస్తం బాగా పెరిగి పోయిందట! పిల్లల దగ్గర అర్థం పర్థం లేకుండా వేదాంతం మాట్లాడుతున్నారట! వారి మాట వినకపోతే విసుక్కుంటున్నారట! నిన్న రాత్రి, మీ వదిన గారు ఫోన్జేసి చెప్పారు. వచ్చే మూడు నెలలు అత్తయ్య గారు మన దగ్గరే కదా?.. ” "అవును! అమ్మను నీవే, జాగ్రత్తగా చూసుకోవాలి. మా బ్రాంచి ఆఫీసులో పని పూర్తవడానికి మరో వారం పట్టేటట్టుంది. వీలైనంత త్వరగా పని పూర్తి చేసి వచ్చేస్తాను. స్టేషనుకి వెళ్ళి అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకురా" "మీరు లేనప్పుడు వారి చాదస్తం ఎలా భరించాలండీ?.. , పిల్లలను చిన్నప్పుడు బాగా చూసుకుందని, ఎంత కాలం మనం వారిని.. ” "తప్పదు! మా అన్నదమ్ముల ఒప్పందం ప్రకారం, అమ్మను అందరం చూసుకోవాలి. వయస్సుతో బాటు కాస్త చాదస్తం రావడం సహజమే!, మనం సర్దుకుపోవాలి” "మీరన్నది, నిజమేనండీ! ఎన్నాళ్ళని వారిలా ఊరూరు తిరుగుతారు చెప్పండి?.. ” "ఈ ఆలోచన మాకు కూడా వచ్చింది. అన్నయ్యకు ప్రమోషన్ మీద హైదరాబాదుకి బదిలీ అవుతుందట. నాన్నగారు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మ పేర్నే ఉన్నాయి. అన్నయ్య అక్కడ లేకపోతే ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. ఇల్లు అమ్మడానికి అమ్మ ఒప్పుకోదు. తన బాగోగులు చూడడానికి ఎవరినైనా మనిషిని ఏర్పాటుచేసి, ఆ ఇంట్లో ఉంచుదామన్నా అమ్మ అంగీకరించదు. ఈ విషయం గురించి మేము ఎంత ఆలోచించినా పరిష్కారం తట్టటం లేదు. ఆస్తి పంపకమూ అవటం లేదు “ "అలాంటప్పుడు అన్ని విధాల అత్తయ్య గారికి, మనకు కూడా ఉత్తమోత్తమ మార్గం .. వృద్ధాశ్రమమే! ఆ తర్వాత ఆస్తి పంపకం తప్పక జరుగుతుంది” "అన్నయ్య ప్రమోషనుపై అక్కడనుంచి వెళ్ళిపోతే, ఏదో ఒకటి చేయక తప్పదు. మరోసారి మాట్లాడుకుని అమ్మను ఎలాగైనా ఒప్పిస్తాం “ ‘మీరు ఒప్పించేలోగా, ఆవిడకు సేవ చేసే యాతన తప్పే మార్గం ఆలోచించుకోవాలి ‘.. "మాట్లాడవేం?.. ఏఁవిటి ఆలోచిస్తున్నావ్? “ "మీరు వీలైనంత త్వరగా వచ్చేస్తే బాగుంటుంది కదాని ఆలోచిస్తున్నానండీ!" "అలాగే! పనైపోయిన వెంటనే వచ్చేస్తాను “ **** బెంగుళూరు స్టేషన్లో దిగి, రెండో కొడుకు ఇంటికి ఆపసోపాలు పడి వెళ్ళిన వసుంధరమ్మకు, అనుకోని సంఘటన ఎదురైంది. "మీరు వసుంధరమ్మ గారు కదా?.. మీ కోడలు, పిల్లలు నిన్న రాత్రి ఊరికి వెళ్ళిపోయారండీ! వారి నాన్న గారికి ఆరోగ్యం బాగులేదట! మీరొస్తే ఇంటి తాళాలు ఇవ్వమన్నారు " అంటూ పక్కింటి ఆమె తాళాలు ఇచ్చింది. ఇంట్లోకి వెళ్ళి నీరసంగా సోఫాలో కూలబడింది తను. సెల్ ఫోను అదేపనిగా మోగుతుంటే విసుగ్గా తీసింది. "ఏయ్! రాజీ! మీ అమ్మ, నాన్నలతో తీర్థయాత్రలకు వెళ్ళావా? మీ అత్తగారి బెడద తప్పించుకున్నావా?.. ” ఆవేపు నుంచి, కోడలు స్నేహితురాలు గడగడా మాట్లాడేస్తుంటే పరిస్థితి అర్థమయింది వసుంధరమ్మకు. “నేనింతలా మాట్లాడుతుంటే, నీవేమిటే మాట్లాడవు!?.. ” "చూడమ్మా! ఆ అత్తయ్యని, నేనే! ఎప్పుడో అనుకున్న తీర్థయాత్రలకు వెళ్ళమని నేనే పంపించాను తనను. ఫోను ఇంట్లోనే మరచిపోయింది. నీ పేరేమిటమ్మా?" ఫోను కట్ అయింది. కొడుకులు, కోడళ్ళు తన గురించి పడుతున్న తర్జనభర్జనల గురించి తెలిసినా, తనేనాడూ నోరు మెదపలేదు. ఆ సమయం వచ్చినప్ప్పుడు చూద్దాంలే అనుకుని ఊరుకుంది. అయినా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంది. అలా ఆలోచిస్తున్నప్పుడే ఒకప్పుడు లెక్షరర్ గా చేసిన ప్రయివేటు కాలేజీ గుర్తొచ్చింది. కొడుకుల పిల్లల కోసం ఉద్యోగం మానేసినప్పుడు తన స్నేహితురాలు, కాలేజీ యాజమాన్యం తనెప్పుడు వెళ్ళినా, ఉద్యోగం ఇస్తారన్న భరోసా కూడా గుర్తొచ్చింది. నాన్న గారు ఇచ్చిన తరగని ఆస్తి- రెండు డిగ్రీల చదువుని తలచుకుని, వారికి మనససులోనే నమస్కరించింది. **** నాలుగు మూళ్ళు.. కొడుకులకు, ఆశీస్సులు. ఒక ఒకటి ఒకటే అయిన ఒకటో ఎక్కం అమ్మ అంతరంగ మథనం ఇది! రక్త సంబంధాలు, మమతానురాగాలు మనుష్యులను బంధించే అదృశ్య హస్తాలు! ఈ బంధాలకు ఒక దశ దాటాక దూరమైపోవడం మంచిది. నెమ్మది, నెమ్మదిగా వాటికి దూరం కావడం అలవాటు చేసుకోవాలి. అన్నీ మనవే!, అందరూ మనవారే అనుకోవడం వట్టి భ్రమే! జగన్నాథుడు ఆడించే ఆటలో, ఈ భ్రమల బతుకులో, పుట్టడం. పెరగడం, చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు, వారి బాగోగులు, , మమతానురాగాలు, .. అన్నీ భ్రమలే!.. పైవాడి, లీలలే!!.. పిడికెడంత గుండెలో ఎన్నెన్నో జ్ఞాపకాల దొంతరలు! ఒకనాడు అపురూపమైనవి , నావని అనుకున్నవన్నీ నేడు రంగు వెలసిన, విలువలేని, బొమ్మలే!.. ఇది వేదాంతం కాదు. నేటి తరం వారి జీవన యానం! ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో అనుభవంలోకి వచ్చే నగ్నసత్యం! విషయంలోకి వస్తున్నాను. మీ అందరికీ నచ్చే నిర్ణయం తీసుకున్నాను. నా పేరుపై ఉన్న ఆస్తులు అన్నీ మీకే! నాకేమీ, వద్దు. నలుగురూ ఎలా పంచుకుంటారో మీ ఇష్టమే!.. నచ్చిన విధంగా వీలునామా రాయించుకోండి. సంతకం చేస్తాను. ఆస్తుల కాగితాలన్నీ ఇంట్లో బీరువాలోనే ఉన్నాయి. మీ తాతగారు మహా మేధావి! భవిష్యత్ దర్శకులు! ఇంతవరకు మీకెవరికీ తెలియని విషయం ఒకటుంది. ఈ ఊరు చివరగల వృద్ధాశ్రమంలో రెండు గదులకు వారే ముందుచూపుతో ఆర్థిక సహాయం చేసారు. ఇప్పుడు నాకు, ఆతర్వాత మీలో ఒక్కొక్కరికి అవసరమైతే ‘అది’ ఆశ్రయం ఇస్తుంది. ఇదివరకు పనిచేసిన కాలేజీలో గౌరవ లెక్చరర్ గా చేరే అవకాశం ఉండనే ఉంది. ఆర్థిక, అవసరాలకు ఫేమిలీ పెన్షన్ సరిపోతుంది. నా శేష జీవితం ఎక్కడ?.. ఎలా అన్న విషయం గురించిన ఆలోచనలు మీకిక అనవసరం. ఎవరికీ భారం కాను. మీ నాలుగో ఎక్కంకి, ఇక స్వస్తి! ..స్వస్తి!!.. స్వస్తి!!!.. స్వస్తి!!!!.. ఉత్తరాలు చూసి నలుగురు కొడుకులూ, ఊహించని తల్లి నిర్ణయానికి నివ్వెరపోయారు. సమాప్తం

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

మీ సుస్మితా రమణ మూర్తి.


142 views3 comments

3 commentaires


ఎక్కాలు అనే కథ చాలా బాగుంది ప్రతీ మనిషికీ అర్ధం కావాల్సిన జీవిత సత్యం ఈ కథను అందించిన సమ్మెట్ల రమణమూర్తి గారికి నా నమస్కారాలు

మన తెలుగు కథలకి నా ధన్యవాదాలు - Swathi

J'aime

సుస్మిత రమణ మూర్తి గారు వ్రాసిన 'ఎక్కాలు ' కధ చాలా బాగుంది. ముగింపు చక్కగా ఇచ్చేరు.

వీర్రాజు, హైదరాబాద్.

J'aime

సమ్మెట్ల ఇంటి పేరు ను సుస్మితా కలం పేరు గా పెట్టు కొన్న మిత్రుడు, 66_69 సం:ల లో మన తోటి విద్యార్థి కథ,గేయ రచయిత రమణ కు,

నీ ఎక్కాలు కథ అమోఘం, అద్భుతం, అభినందనీయం.

నేటి తరం కాల ,మాన ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టింది

మరొక్కసారి అభినందనలు.

నేటి సమాజం తదుగుణం గా ఇటువంటి కథలు మరెన్నో నీ కలంనుడి జాలువారితాయని ఆసిస్తూ నీ శ్రేయోభిలాషి, మిత్రుడు లక్ష్మీపతి

J'aime
bottom of page