top of page

చిత్రాంగి నడుము


'Chitrangi Nadumu' New Telugu Story

Written By Mallavarapu Seetharam Kumar

'చిత్రాంగి నడుము' తెలుగు కథ

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


"మహారాజుగారు మిమ్మల్ని ఉన్నపళంగా రమ్మంటున్నారు" ఒకరోజు ఉదయాన్నే ఇద్దరు రాజభటులు నిద్రలేపి మరీ ఆ వార్త చెప్పడంతో కలత చెందాడు చంద్రశేఖరుడు. అతను రాజుగారి ఆస్థానంలో ప్రధాన చిత్రకారుడు. వయసు యాభై దాటినా ఉంగరాల జుట్టుతో, చక్కని ముఖ వర్ఛస్సుతో ముప్పై ఏళ్ళ వాడిలా ఉంటాడు. అతడు చెయ్యి తిరిగిన చిత్రకారుడు. ఎలాంటి బొమ్మనైనా అలవోకగా గీయగలడు. ఒకసారి చూసిన మనిషిని నెల తరువాతైనా గుర్తు పెట్టుకొని, అలాగే గియ్యగల ప్రతిభావంతుడని అతని గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. రాజ కుటుంబంలో మహారాణితో సహా దాదాపు అందరి బొమ్మలూ జీవం ఉట్టి పడేలా గీచి, వాటికి చక్కటి రంగులు అద్ది, అభినందనలు అందుకున్నాడు. ఇటీవలే మహారాజుగారు తన చిత్రాన్ని కూడా చంద్రశేఖరుడి వద్ద గీయించుకున్నారు. నిన్న రాజభటులు ఆ చిత్రాన్ని ఇంటికి తీసుకొని వచ్చి, రాజుగారు సూచించిన కొన్ని సవరణలు చెయ్యమన్నారు. నిజానికి తను గీచిన చిత్రంలో ఎటువంటి లోపమూ లేదు. రాజుగారి జుట్టు ఇటీవలి కాలంలో బాగా పలచబడింది. తను అలాగే చిత్రించడంతో, సవరించమని తనవద్దకు ఆ చిత్రాన్ని పంపారు రాజుగారు. జుత్తును మరీ దట్టంగా చేస్తే అసహజంగా ఉంటుందని కాస్త మాత్రమే పెంచి పంపాడు తను. ‘అదే కొంప ముంచినట్లుంది.. ఇప్పుడు తనను పిలిపించడానికి కారణం అదే అయ్యుంటుంది’ అనుకున్నాడు చంద్రశేఖరుడు. "రాజుగారు దండిస్తారేమో.. " బయలుదేరే ముందు భార్య విశాలాక్షితో అన్నాడు. "సహజంగా గీస్తారనే కదా మిమ్మల్ని తన బొమ్మ చిత్రీకరించమంటున్నారు.. మీరేమీ భయపడకండి. అంతగా అయితే మరొక్క అవకాశం అడిగి, మీ జుట్టును పోలినట్లు ఒత్తుగా గీచి పంపండి" అంది ఆమె. అయినా బెదిరే గుండెతో రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రెండు చేతులూ కట్టుకొని వినయంగా తల వంచుకొని రాజుగారి ముందు నిలుచున్నాడు. రాజుగారు ఆ చేతులను విడదీసి చంద్రశేఖరుడి కుడి చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. “ఈ చేతి వేళ్లతోనే కదా నా చిత్రాన్ని గీచావు.. ” అన్నారు రాజుగారు. గుండె ఝల్లుమంది చంద్రశేఖరుడికి. తన చేతి వేళ్ళు ఖండింపబడటం ఖాయం అనుకున్నాడు. “ఈ ఐదు వేళ్ళకు, ఐదు వజ్రపు ఉంగరాలు బహుకరిస్తున్నాను. ఆస్థాన స్వర్ణకారుడికి నీ వేలి కొలతలు ఇవ్వు. అన్ని వేళ్ళకూ ధరించడం ఇష్టం లేక పోతే భద్రపరుచుకో" అన్నారు రాజుగారు. రాజుగారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు చంద్రశేఖరుడు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి రాజుగారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. పక్కనే ఉన్న భటులను దూరంగా వెళ్ళమన్నాడు మహారాజు. "నిన్ను పిలిపించడానికి మరో కారణం ఉంది. మా రాజ నర్తకి చిత్రాంగి తెలుసు కదా.. " అడిగారు మహారాజు. "తెలుసు మహారాజా" అన్నాడు చంద్రశేఖరుడు. "ఆమె తైలవర్ణ చిత్రాన్ని మీరు స్వయంగా గీయాలి" చెప్పారు మహారాజు. "అలాగే మహారాజా" అన్నాడు చంద్రశేఖరుడు. "రాజ కుటుంబీకులు కాని వారి చిత్రాలు గియ్యాలంటే మీ ఇంటికే వారిని రమ్మంటారట కదా.. ఈమెకు మాత్రం మినహాయింపు ఇచ్చి, మీరే ఆమె ఇంటికి వెళ్లి చిత్రాన్ని గీయాలి" అభ్యర్థిస్తున్నట్లుగానే ఆజ్ఞాపించారు మహారాజు. "ఆజ్ఞ మహారాజా.. అలాగే వెళ్తాను. రేపటినుండే పని ప్రారంభిస్తాను" సవినయంగా బదులిచ్చి రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు చంద్రశేఖరుడు. వచ్చేటప్పుడు ఎంత ఆందోళనతో వచ్చాడో ఇప్పుడు అంతకు నూరు రెట్లు ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు చంద్రశేఖరుడు. వజ్రపుటుంగరాల బహుమతి కంటే చిత్రాంగితో ఏకాంతం లభించబోతుందన్న ఊహ అతన్ని నేలమీద నిలువనీయడం లేదు. గతంలో రాజసభలో చిత్రాంగి నృత్యం చూసాడతడు. చూపు తిప్పుకోలేని అందం ఆమెది. ఆ అందానికి తగిన అవయవ సౌష్టవం కలిగి ఉంటుంది. నాట్యం చేసేటప్పుడు ఆమె నడుము కదలికలు చూపరుల మనసులను సమ్మోహితం చేస్తాయి. సభ్యత కాదని తెలిసినా, రాజుగారి కంట పడితే ప్రమాదమని తెలిసినా గుడ్లప్పగించి ఆమె నడుమువైపు చూస్తూ ఉండిపోయే వారు సభికులు. అలాంటి చిత్రాంగిని ఆమె ఇంట్లో కలిసే అవకాశం కలిగింది. ఇక చిత్రం గీయాలంటే ఏకాంతం కావాలి కదా.. ఆ ఏకాంతంలో చిత్రం గీచేటప్పుడు ఎదుటి వ్యక్తిని తనకు కావలిసిన భంగిమలో కూర్చోబెట్టడానికి దగ్గరకు వెళ్లి సవరించవలసి ఉంటుంది. గతంలో రాజమాత, యువరాణి చిత్రాలను, రాజుగారి చిత్రాన్ని గీచేటప్పుడు కూడా తన చెయ్యి వారిని తాకింది. కానీ ఎప్పుడూ కలగని చిలిపి ఊహలు చిత్రాంగిని కలవబోతున్నందుకు కలుగుతున్నాయి. సవరించే నెపంతో ఆమె నడుమును స్పృశించే అవకాశం తనకు కలగబోతోంది అన్న ఊహే అతనికి తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంచుమించు నాట్యం చేస్తున్నట్లు ఊగిపోతూ ఇంట్లోకి వచ్చిన భర్తను చూసి, ఆశ్చర్యపోయింది విశాలాక్షి. "మహారాజుగారు ఐదు వజ్రపుటుంగరాలు కానుకగా ఇస్తున్నారు" ఆనందంగా చెప్పాడు భార్యతో. "ఎంత మంచి వార్త చెప్పారు.. " అంతకంటే ఆనందంగా అందావిడ. కానీ మనసులో 'విలువైన కానుకలు ఈయనకు కొత్తేమీ కాదు. మరేదైనా కారణం ఉండి ఉంటుంది.. ' అనుకుంది. *** చిత్రాంగి చిత్రం గీచే విషయాన్ని భార్య దగ్గర గోప్యంగా ఉంచాలనుకున్నాడు చంద్రశేఖరుడు. స్త్రీలకు సహజంగా ఉండే అనుమానాలకు ఆజ్యం పొయ్యడమెందుకని అతడి ఉద్దేశం. మర్నాడు భర్త ఇంటినుండి బయలుదేరేటప్పుడు ఎక్కువగా అలంకరణ చేసుకోవడం, మీసకట్టును యువకులకు మల్లే కురచగా, పదునుగా మార్చుకోవడం, కనుబొమలను కుంచెతో సవరించుకోవడం ఆశ్చర్యం కలిగించింది ఆమెకు. రాచకార్యం మీద వెళ్తున్నానని వెళ్ళేటప్పుడు భర్త చెప్పడంతో, సరేనంది. ఏమిటా రాచకార్యమని అడగడం భావ్యం కాదని ఊరుకుంది. చిత్రాంగి ఇంటికి వెళ్లిన చంద్ర శేఖరుడిని సాదరంగా ఆహ్వానించిందామె. తానే స్వయంగా ఫలహారాలు, పండ్ల రసాలు అతనికి అందించింది. సురాపానం కూడా ఇవ్వబోయింది కానీ అతడు తిరస్కరించాడు. దగ్గరనుండి ఆమెను చూస్తుంటే అతనికి దేవకన్యలను చూసినట్లనిపించింది. పైగా చిత్రం కోసం ఆమె చేసుకున్న అలంకరణ ఆమెకు మరింత వన్నె తెచ్చింది. నడుము అనాచ్చాదితంగా ఉండటం అతనికి మరింత నచ్చింది. చిత్రం పూర్తి చెయ్యడానికి రాజుగారు వారం రోజులు గడువు ఇచ్చారు. ఈలోపల ఒక్కసారైనా ఆ నడుమును తాను స్పృసించగలడా.. గతంలో రాజమాత, మహారాణి, యువరాణి చిత్రాలను గీచినప్పుడు లేని సంకోచం ఇప్పుడెందుకు కలుగుతోంది.. బహుశా అప్పుడు తనలో ఏ చెడు తలపులూ లేవు. కానీ రాజ నర్తకి కావడం వల్లనేనా.. ఈమె మీద తనకు చిలిపి ఊహలు కలుగుతున్నాయి..? చిత్రాంగి నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని గీయాలట.. ఆ చిత్రాన్ని నాట్య మండపంలో ఉంచుతారట. అంత పెద్ద చిత్రంలో చిన్న లోపమైనా పెద్దదిగా కనపడుతుంది. అందులోను నాట్య భంగిమలో ఉన్న చిత్రం గీయాలి. ఆ భంగిమలో చిత్రాంగి నడుము వంపులు సరిగ్గా చిత్రిస్తే గానీ, తన చిత్రం విమర్శకులకు నచ్చదు. చిత్రాన్ని గియ్యడం ప్రారంభించాడు చంద్ర శేఖరుడు. రోజులు గడుస్తున్నాయి. నడుము భాగం మినహా చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ఒకసారి తన చేతితో తడిమితే కానీ ఆమె నడుమును యధాతధంగా గీయలేననే నిశ్చయానికి వచ్చాడతను. కానీ అడగడానికి ధైర్యం చాలడం లేదు. రాజుగారి ఆగ్రహానికి గురైతే శిరచ్చేదం ఖాయం.. చిత్రాన్ని పూర్తి చెయ్యడానికి ఇచ్చిన గడువుకు ముందురోజు రాత్రి, అతనికి విపరీతమైన జ్వరం వచ్చింది. మూసిన కన్ను తెరవలేని పరిస్థితులలో ఉన్నాడు. ‘మహారాజా.. మన్నించండి.. ’ అని పలవరిస్తున్నాడు. మరు రోజు ఉదయాన్నే రాజభటులు వచ్చి, సాయంత్రానికల్లా చిత్రాంగి చిత్రం పూర్తి చేయాలని చంద్రశేఖరుడి భార్య విశాలాక్షికి చెప్పారు. దాంతో ఆమెకు విషయం అర్థమైంది. మనో వికారము, రాజ దండన భయము తన భర్త జ్వరానికి కారణమని అర్థం చేసుకొంది. తన భర్త జ్వరంతో ఉన్నాడనీ, మరి కొంత గడువు ఇప్పించమనీ వారిని కోరింది. రాజుగారితో చెప్పి చూస్తామనీ, వారు అంగీకరించకపోతే తామేమీ చేయలేమనీ వారు చెప్పారు. వాళ్ళు వెళ్లిన కొంతసేపటికి ఇంటికి వచ్చిన కుమారుడు కులవర్ధనుడితో విషయం చెప్పి బాధ పడిందామె. అతడేమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళాడు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చిన కులవర్ధనుడు, తన తండ్రి ఎక్కడికో బయలుదేరడానికి శక్తి కూడగట్టుకొని ప్రయత్నించడం గమనించాడు. అయన చేతిని పట్టుకొని నెమ్మదిగా పడక గదిలో పడుకోబెట్టాడు. "ఆందోళన పడకండి నాన్నగారూ! చిత్ర లేఖనం విజయవంతంగా పూర్తి చేసి వచ్చాను" అన్నాడు. "కానీ.. ఎలా.. " అంటున్న తండ్రితో "నాన్నగారూ! మీ మనసులోకి ప్రవేశించిన ఆమె, నాకు మాతృ సమానురాలు. అందుకే ధైర్యంగా ఆమెనే అడిగాను.. ‘తల్లీ.. చిత్రం చక్కగా రావడానికి మీ నడుము కొలతలు తీసుకోవా’లని. నిరభ్యంతరంగా తీసుకొమ్మంది. దాంతో చిత్రలేఖనం పూర్తయింది. ఆమెకు బాగా నచ్చి, ఆ విషయాన్ని అప్పుడే రాజుగారికి కబురు పంపింది. ఇక మీరు నిశ్చింతగా విశ్రమించండి. మీకు త్వరలోనే నయమవుతుంది” అని చెప్పి బయటకు నడిచాడు. బయటకు వెళ్లిన కులవర్ధనుడినికి చిత్రాంగితో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. నడుముని స్పృశించే విషయమై తను ఆమెను అనుమతి అడిగాడు. అప్పుడామె, "ఇందుకేనా మీ నాన్నగారు అంత తటపటాయించారు.. అంత చెయ్యి తిరిగిన చిత్రకారుడి చెయ్యి నా నడుమును తాకితే నేను కాదంటానా.. నన్ను 'తల్లీ' అని సంబోధించావు. మీ పితృదేవులు ఎప్పుడైనా నా వద్దకు రావచ్చని నా మాటగా తెలియజెయ్యి" అంది నర్మగర్భంగా. చిన్నపాటి చెడు ఊహకే జ్వరం తెచ్చుకున్న తన తండ్రి ఎప్పటికీ దారి తప్పడని మనసులో అనుకున్నాడు కులవర్ధనుడు. భర్తకు కషాయం ఇద్దామని గదిలోకి వెళ్ళింది విశాలాక్షి. అప్రయత్నంగా చంద్రశేఖరుడి చూపులు ఆమె నడుముపై పడ్డాయి. తనకు మాత్రమే స్వంతమైన ఇంత అందమైన నడుమును మరిచి, తను ఆ చిత్రాంగి నడుముపై మోజు పడటం గుర్తుకు వచ్చి సిగ్గుపడ్డాడు. భర్త చూపులు గమనించి విశాలాక్షి కూడా సిగ్గుపడి నడుమును కొంగుతో కప్పుకుంది. ***శుభం***

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



125 views0 comments

Comentários


bottom of page