top of page

గోదానం


'Godanam' New Telugu Story

Written By Jidigunta Srinivasa Rao

'గోదానం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


శంకరం రాంబాబు యిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ గవర్నమెంట్ పరీక్షలు రాసి, ఒకే డిపార్ట్మెంట్ కి సెలక్ట్ అవడం, పోస్టింగ్స్ కూడా ఒకే ఊరు కావడంతో, యిహ వాళ్ళ స్నేహానికి అడ్డులేదు. ఇద్దరూ మంచి స్నేహితులు అయినా ఆలోచనలు, నమ్మకాలు వేరు. అయితే ఒకరి విషయం లో ఒకరు ఎంత వరకు కలిపించుకోవచ్చో అంతవరకే కలిపించుకునే వారు. వీళ్ళు ఎంత మంచి స్నేహితులో వీళ్ళ భార్యలు కూడా అంతే కలుపుగోలుగా వుంటారు. శంకరం కి కొడుకు, కూతురు, అదేమి విచిత్రమో రాంబాబు కి కూడా అంతే. తేడా అల్లా శంకరం తన పిల్లలకి ఇండియా సంబంధాలు చేసాడు, రాంబాబు పిల్లలకి అమెరికా సంబంధాలు చేసాడు. రిటైర్ మాత్రం ఒక ఆరు నెలల తేడాలో అయ్యారు. శంకరం ముందుగా రిటైర్ అవడంతో రోజూ సాయంత్రం నాలుగు కిలోమీటర్లు వాకింగ్ కి వెళ్ళేవాడు. అతను వెళ్తున్న రోడ్డులో ఒక సాయిబాబా దేవాలయం వుంది. రోజూ గుడిలోకి వెళ్లి హారతి తీసుకుని, వాకింగ్ పూర్తి చేసేవాడు. ఒకేరోజున గుడినుంచి బయటకు రాగానే అతని కళ్లకి ఒక ఆవు తన దూడ తో నుంచుని వుంది. గుడిలోకి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు ఆవుని దూడ ని ముట్టుకుని దణ్ణం పెట్టుకోవడమే కానీ, ఒక్కరు ఒక్క అరటిపండు కూడా తినిపించడం లేదని గమనించి, అక్కడకి కొద్ది దూరంలో వున్న సూపర్ బజార్ లోకి వెళ్లి, నాలుగు అరటిపళ్ళు, ఒక పదిరూపాయల తోటకూర తీసుకుని వెళ్లి ఆ ఆవు, దూడలకి తినిపించాడు. శంకరం చేస్తున్నపని చూసి కొంతమంది భక్తులు కూడా తమ చేతిలోని అరటిపళ్ళు తినిపించారు. ఆకలి తీరింది ఏమో.. గోమాత మనిషి కాదుగా, యింకా తినడానికి, అక్కడనుండి వెళ్ళిపోయింది. రోజూ శంకరం వాకింగ్ కి బయలుదేరే ముందు యింట్లో వున్న ఆకు కూరల కట్టలు రెండు తీసుకుని వెళ్లి ఆ ఆవు దూడా కి పెట్టేవాడు. రోజూ రాంబాబు శంకరం యింటికి వచ్చి, “నువ్వు ఎందుకు ముందుపుట్టావు, హయగా రిటైర్ అయ్యి యింట్లో కూర్చున్నావు, నేను యింకా ఆఫీస్ వెళ్ళాలిసివస్తోంది, నువ్వులేని ఆఫీసుకి వెళ్ళాలి అనిపించడం లే”దని గొడవపెట్టి వెళ్ళేవాడు. వాడి బాధ కూడా అయిపొయింది, మొన్న రిటైర్ అయ్యి, ఏదో కష్టపడ్డట్టు నిన్న యింట్లో విశ్రాంతి తీసుకుని, ఈ రోజు శంకరం తో వాకింగ్ కి తయారు అయ్యాడు. కొద్ది దూరం నడిచి, “ఒరేయ్! కాసేపు యిక్కడ కూర్చుందాము రా, కాళ్ళు నడిచి బోధకాళ్ళు అయినట్టుగా వున్నాయి” అన్నాడు. “ఒరేయ్ రాంబాబు, యింటినుంచి కిలోమీటర్ కూడా నడవలేదు, యిలా రోడ్డు పక్కన కూర్చుంటే ఏ ముష్టి వాళ్ళో అనుకుంటారు. నడువు.. ఆలా కొంత దూరంలో సాయిబాబా గుడి వుంది. అక్కడ కాసేపు ఆగుదాం” అన్నాడు. “గుడి అంటే నాకు పడదు కానీ, నువ్వు వెళ్ళు. నేను బయట అరుగు మీద కూర్చుని వుంటాను. త్వరగా రా, దేముడు కనిపించేదాకా అక్కడ వుండకు, సరేనా” అన్నాడు రాంబాబు. “అలాగేలే.. నువ్వు ఆ అరుగు మీద కూర్చుని వుండే బదులు ఒక్కసారి గుడిలోకి రావచ్చుగా, ఆ సాయిరాం దయవల్ల భక్తుడివి అవుతావేమో” అన్నాడు శంకరం. “అదే నా భయం, భక్తుడు అయితే పూజలు, పూనకాలు, కొబ్బరికాయలు కొనడం నావల్ల కాదురా. ఒక్క పచ్చడికి తప్పా కొబ్బరికాయ కొనడం ఎప్పుడైనా చూసావా?” అంటూ, గుడి అరుగుమీద పడుకుని వున్న బిక్షగాడిని లేవగొట్టి, తను కూర్చున్నాడు రాంబాబు. సరే నీ యిష్టం అని, చేతి సంచిలోనుంచి పెద్ద ఆకుకూర కట్ట తీసి, తనకోసమే అని ఎదురు చూస్తున్నా ఆవు, దూడకి పెట్టి, వాటి చుట్టూ ప్రదక్షిణ చేసి గోళ్ళోకి వెళ్ళాడు శంకరం. హారతి మొదలవడం తో శంకరం కాసేపు గుడిలోనే బయటకి వచ్చి చూసే సరికి, రాంబాబు అరుగు మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతని పక్కన రెండు పది రూపాయలు, రెండు రూపాయి బిళ్ళలు, ఒక అరటిపండు పడేసి వున్నాయి. శంకరం జేబులోనుంచి ఫోన్ తీసి, రాంబాబు ని ఆ స్థితిలో ఫోటో తీసి, రాంబాబు ని లేపాడు. “ఛీ ఎవ్వడు రా, ఈ డబ్బులు వేసింది” అంటూ లేచి నుంచుని, “అందుకే ఈ గుళ్ళకి రాను అంటే నువ్వు తీసుకుని వచ్చావు, పద పద” అని వేగంగా నడవడం మొదలుపెట్టాడు. రోజు శంకరం గుడి దగ్గర ఆగి, ఆవుకి, దూడకి ఏదో ఒక ఆకు కూర తినిపించడం, సాయిరాం దర్శనం చేసుకుని రావడం, అంత వరకు రాంబాబు సోడా షాప్ దగ్గర కూర్చుని, షాప్ అతనితో కబుర్లు తో టైమ్ పాస్ చేయడం జరుగుతోంది. “ఎందుకురా ఆ ఆకుకూర పప్పులో వేసుకోక, ఆవుకి పెడితే ఏం వస్తుంది అంటాడు” రాంబాబు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు, రాంబాబు పిల్లలు, శంకరం పిల్లలకి కూడా ‘అమెరికా లైఫ్ బాగుంటుంది, యిక్కడే వుండిపోతే, మీ పిల్లలకి మీ నాన్న చెవులు కుట్టించి వేదాలు నేర్పిస్తాడు..’ అని చెప్పి వాళ్లని కూడా అమెరికా కి తీసుకుని పోయారు. మొద్దు చాకిరి చేయడం లో ఇండియన్స్ కి పేరు వుండటం తో శంకరం కొడుకు, అల్లుడు కి సులువుగా అమెరికాలో ఉద్యోగాలు దొరికిపోయాయి. రాంబాబు రోజూ అనే వాడు, రేపటినుండి నేను వాకింగ్ కి రాననడం, మళ్ళీ తయారవడం. రాంబాబు కి ‘వున్నది అంతా యిక్కడ అనుభవించాలి, పోయిన తరువాత యింకో లోకం వుంది, అక్కడ శిక్షలు, సుఖాలు వుంటాయి అన్నది అబద్దం’ అని దృఢమైన అభిప్రాయం తో వున్నాడు. అందుకే కొడుకులకి చెప్పేసాడు, తను పోయిన తరువాత చాదస్తంగా 12 రోజులు వాళ్ళని వీళ్ళని పిలిచి పూజలు, గోదానం, మొదలగునవి చెయ్యద్దు అని. రాంబాబు పిల్లలు రాంబాబు కంటే ఎక్కువ తిన్నారు. ‘అవన్నీ చేయడం సంగతి తరువాత, ముందు ఇండియాలో ఎవ్వరు పోయినా మేము అమెరికా నుంచి రావడం కుదరదు. అందుకే మీ ఆరెంజ్మెంట్స్ మీరు చేసుకుని పోవాలిసిందే’ అనేసారు. “ఒరేయ్ రాంబాబు, నువ్వు చెడింది కాక నీ పిల్లలని కూడా చెడగొట్టావు, వాళ్ళు మా పిల్లలని చెడగొడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులకి పున్నామ నరకం నుండి తప్పిస్తారని శాస్త్రం. అటువంటిది, ఏ దానం అక్కరలేదు అని ఈ పిచ్చ వేషాలు ఏమిటిరా” అన్నాడు శంకరం. “ఒరేయ్ శంకరం! నువ్వు చూడని గుడిలేదు, చెయ్యని పూజ లేదు, పైపెచ్చు ఆవుని మేపడం. నీకు నమ్మకం వుందా.. నువ్వు అనుకునే స్వర్గం కి వెళ్తావని. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా చెప్పారా నీకు” అన్నాడు రాంబాబు. “సరే! నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది,. అవసరంగా దీని మీద మాట్లాడి మనసులు పాడుచేసుకోవడం ఎందుకు” అన్నాడు శంకరం. గుడి దగ్గర కి వెళ్లి చూస్తే ఆవు, దూడా కనిపించలేదు. అలాగే ఆకుకూర కట్టలు పట్టుకుని నుంచుని చూసాడు, ఆవు వస్తుంది అని. ఆవు రాలేదు కానీ రాంబాబు ఫోన్ చేసి “త్వరగా గుడినుంచి వూడిపడు, యిక్కడ సోడాలు తాగలేక చస్తున్నాను” అని గొడవ. రాంబాబు గొడవ పడలేక త్వరగా వచ్చేసి, “ఏమిటో రా, ఈ రోజు ఆవు, దూడా రాలేదు” అన్నాడు చేతిలోని తోటకూర కట్టలు పడేయబోతూ. “ఆగు, ఆలా పారేయకు, నాకు యివ్వు, మీ చెల్లెలు తో తోటకూర పులుసు చేయించుకుంటా, ఆవుకి పెట్టిన దానికంటే ఈ రాంబాబు కి పెడితే ఎప్పుడైనా పలుకుతాడు” అన్నాడు. ఆవు దూడా రావడం లేదు, పూజారిగారిని అడిగితే తెలియదు అన్నాడు. సాయిరాం హారతి తీసుకుని రాంబాబు కూర్చుని వున్న సోడా షాప్ కి వచ్చి, “పదరా, ఈ రోజు కూడా ఆవు దూడా రాలేదు” అన్నాడు శంకరం. “యింకా ఎక్కడి ఆవు సార్, పదిరోజుల క్రితం ట్రక్ కింద పడి చనిపోయింది, దూడ కి దెబ్బలు తగిలాయి, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్లారు” అన్నాడు సోడా షాప్ యజమాని. “అయ్యో పాపం.. చనిపోయిందా!” అని అక్కడే వున్న బల్ల మీద కూర్చుని తనతో తెచ్చిన అరటిపళ్ళు రాంబాబు కి యిచ్చేసాడు. శంకరం పడుతున్న బాధ చూసి, షాప్ అతను, “మనుషులు పోతేనే పట్టించుకోవడం లేదు, యింకా జంతువుల గురించి ఎవ్వరు పట్టించుకుంటారు సార్, ఈ షోడా తాగండి కొద్దిగా నీరసం తగ్గుతుంది” అని షోడా కొట్టించాడు. రాంబాబు వంక చూసిన శంకరంకి, ఎందుకో కళ్ళు తుడుచుకుంటునట్టు కనిపించింది. బహుశా తన బాధ చూసి ఆలా వున్నాడేమో అనుకున్నాడు. “యిహ రేపటినుండి ఈ సైడ్ వాకింగ్ కి రావద్దు, వేరే సైడ్ కి పోదాం” అంటున్న రాంబాబు వంక చూసి లేచి బయలుదేరారు. “చాపకింద నీరులాగా కరోనా చుట్టముడుతోందిట, మనం కూడా కొన్నాళ్ళు వాకింగ్ మానేసి ఇంట్లోనే తిరుగుదాం” అన్నాడు శంకరం రాంబాబుతో. “ఒరేయ్ నేను ఐరన్ మ్యాన్ ని, నీకు నీ పూజల పుణ్యం వుంది, మనల్ని ఏ కరోనా ఏమి చేయలేదు. నాకు నడక అలవాటు చేసి యిప్పుడు మానేద్దాం అంటే మళ్ళీ నాకు బానపొట్ట ఖాయం” అన్నాడు రాంబాబు. రాంబాబు పోరుపడలేక లేకపోతే నడక అలవాటు మానలేక మళ్ళీ రోజు వాకింగ్ కి వెళ్తున్నారు ఆ స్నేహితులు. వీళ్ళు వెళ్ళే దారిలో ఒకచోట పానీపూరి బండి ఉండేది. అది చూడగానే రాంబాబు మునిసిపల్ బండి ఆగినట్టు ఆగి, రెండు ప్లేట్స్ పానీపూరి, ఒక అరగ్లాస్ ఆకుపచ్చ నీళ్లు తాగేసి, ‘ఒరేయ్.. కొద్దిగా మెల్లగా నడుద్దాం’ అనేవాడు. ‘ఎందుకురా ఏది పడితే అది రోడ్డు మీద తింటావు, అసలే ఊరిలో బాగుండలేదు’ అన్నా వినేవాడు కాదు. ఆరోజు సాయంత్రం వాకింగ్ కోసం యింకా రాంబాబు రాకపోవడం తో, తనే రాంబాబు ఇంటికి బయలుదేరుతో ఉంటే, శంకరం భార్య, “మీ స్నేహితుడుకి కరోనా పాజిటివ్ ట, అటువైపుకి వెళ్ళకండి” అంది. “నీకు తెలిసి, నాకు యింతవరకు ఎందుకు చెప్పలేదు, ఒకసారి వెళ్లి చూసి వస్తాను” అంటున్న శంకరం ముక్కుకి మాస్క్ తొడిగి, “దూరం నుంచి పలకరించి, వచ్చేసేయండి. మనకేమన్నా వస్తే చూసే దిక్కు కూడా లేదని గుర్తుపెట్టుకోండి” అంటున్న భార్య వంక చూడకుండా రాంబాబు ఇంటి వైపు నడిచాడు. మంచం మీద మూలుగుతో కనిపించాడు రాంబాబు. “అదేమిటి ఎవ్వరూ లేరే, మా చెల్లెలు ఏది?” అన్నాడు శంకరం. “తను కరోనా అంటే భయపడుతోంది, నేనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించాను. రిపోర్టులో కరోనా ఎక్కువగా రాలేదు, రెండు మూడు రోజులలో తగ్గుతుంది అన్నారు డాక్టర్ గారు” అన్నాడు. ‘ఏది ఆ రిపోర్ట్.. నన్ను చూడనీ’ అని బలవంతంగా లాక్కుని చూస్తే, కరోనా చాలా ఎక్కువగానే వచ్చింది. “నీ మొహం, యింట్లో కూర్చుని వుంటే తగ్గదు. నాకు తెలిసిన హాస్పిటల్ జాయిన్ అవుదువుగాని, పదా , యింతకీ మీ పిల్లలకి చెప్పావా” అన్నాడు. “అక్కడ మా కోడలు కి కరోనా ట, అందుకనే నా గురించి అంతగా కంగారు పడలేదు, నువ్వు ముందు యిక్కడ నుంచి వెళ్ళు, నేను వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అవుతాను రేపు. ఇదిగో నా సేవింగ్స్ డీటెయిల్స్ రాసిన పుస్తకం. ఒకవేళ నాకు ఏదైనా అయితే మా ఆవిడకి సహాయం చెయ్యి, తనకి బ్యాంకు ఎక్కడో కూడా తెలియదు” అన్నాడు రాంబాబు. “నోరుమూసుకో, నేను వుండగా నీకు ఏమి అవ్వదు, అంబులెన్సు పిలిచాను. లేచి ప్యాంటు వేసుకో. హాస్పిటల్ లో జాయిన్ అవుదువుగాని” అని, అతి బలవంతంగా తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసాడు. శంకరం భార్య ఒక్కటే గొడవ, ‘కరోనా వాడితో అంటకాగితే మీకు కరోనా వస్తుంది మొగుడా అని అంటే వినకుండా హాస్పిటల్ కి వెళ్ళి వస్తారా’ అంది. అర్ధరాత్రి భర్త మూలుగు విని, ఎందుకైనా మంచిది అనుకుని మాస్క్ వేసుకుని భర్తని లేపి ‘ఏమైంది’ అంది. “వొళ్ళు నొప్పులు, చలిగా వుంది” అన్నాడు శంకరం. జ్వరంతో ఒళ్ళు కాగిపోతోంది. “బాబోయ్ అంటించుకున్నారు దేముడా” అనుకుంటూ కొడుకు కి ఫోన్ చేసి చెప్పింది. “నాన్నని కూడా వెళ్ళి రాంబాబు బాబాయ్ తో హాస్పిటల్ లో ఉండమను, నువ్వు జాగ్రత్తగా వుండు” అని ఫోన్ కట్ చేసారు. సంగతి అర్ధం చేసుకుని శంకరం ఉదయమే రాంబాబు ని జాయిన్ చేసిన హాస్పిటల్ లోనే తను జాయిన్ అయ్యాడు. యిద్దరు ఒకే రూంలో ఉంటామని చెప్పి అడ్వాన్స్ గా చెరో లక్ష రూపాయలు కట్టి, ‘యింకా ఏమైనా పడితే ఈ ఫోన్ నెంబర్ లో మాట్లాడండి’ అని కొడుకుల నంబర్స్ యిచ్చారు. జాయిన్ అయిన వాళ్ళు అయినట్టే ఎగిరిపోతున్నారు, కరోనా రాక్షసి జనాల ని మింగేస్తోంది. వున్నట్టు వుండి శంకరం కి, రాంబాబు కి ఊపిరి యిబ్బంది రావడం తో ఐ సి యూ లోకి మార్చడం, ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు మరణించడం జరిగిపోయింది. ‘బాడీలను ఇంటికి ఇవ్వము, వచ్చి గ్లాస్ డోర్ నుంచి చూసుకోండి’ అని కబురు రావడంతో గొల్లుమని శంకరం భార్య, రాంబాబు భార్య వెళ్ళి చూసివచ్చారు. పిల్లలు హాస్పిటల్ కి కట్టాలిసిన డబ్బు అమెరికా నుంచి పంపించారు. ‘ఏమిటి.. ఎప్పుడూ చూడని ఊరు వచ్చాను’ అని నడుస్తున్న శంకరం కి దుర్వసన కొడుతున్న పెద్ద నది కనిపించింది. కొంతమంది ఆ ఒడ్డున కూర్చొని ఎవరితోనో దెబ్బలు తింటున్నారు. కొంతమంది ఆవుల తోకలు పట్టుకుని నదిలో ప్రవేశించిగానే వాళ్ళకి గంగానది లో దిగి వెళ్లిపోతున్నట్టు గా వెళ్లిపోతున్నారు. ‘అదేంటి రాంబాబు ఆ మూల కూర్చుని ఏడుస్తున్నాడే’ అనుకుని అటు వెళ్ళబోతున్నా శంకరం కి, ‘ఆగు’ అని వినిపించింది. ఆశ్చర్యం.. తను సాయిబాబా గుడి దగ్గర చూసిన ఆవు యిక్కడే వుండి తనని ‘ఆగు’ అంది మానవ బాషలో.. అని ఆగాడు. ఆ ఆవు శంకరం దగ్గరికి వచ్చి, “నేను ఈ పాటికి మానవుడు గా పుట్టాలి, కానీ నేను ఆ భగవంతుడు ని వేడుకుని, నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీ పిల్లలు వాళ్ళకి కుదిరినట్టు గా, నీ చావు కార్యక్రమం చేసారు. గోదానం మీ బాషలో వీసా లాంటిది, ఆదిలేందే ఈ నది దాటలేవు. నీవు నాకు పెట్టిన ఆహారం కి కృతజ్ఞత గా నా తోక పట్టుకో, నీకు ఎటువంటి బాధ లేకుండా ఈ నది ని దాటిస్తాను” అంది. “మరి అక్కడ మా రాంబాబు ఆలా ఏడుస్తున్నాడు ఎందుకు?” అని అడిగాడు శంకరం. “అతను చనిపోతే యిహ పై లోకాలు, పాపపుణ్యాలు, శిక్షలు ఏవి లేవు అని మూర్ఖత్వం బతికి యిక్కడకి వచ్చి చూస్తే అన్నీ వుండటం తో ‘అయ్యో ఎంత పొరపాటు పడ్డాను, తన శరీరం తో ఒక్కసారి కూడా ఏ గుడికి వెళ్ళలేదు, యిప్పుడు వెళ్ళాలి అనుకున్నా శరీరం లేదు’ అని ఏడుస్తున్నాడు. కాలం గడపక నా తోక పట్టుకో” అంది గోమాత. “యిద్దరం కలిసి బతికాము, గుడి లోపలికి రాకపోయినా నా కోసం గుడిదాకా వచ్చేవాడు. అతనిని వదిలి నేను రాలేను” అన్నాడు శంకరం. “అవును. నువ్వు చెప్పిన దాంట్లో కొంత నిజం వుంది. తను నీ కోసం గుడి అరుగుమీద కూర్చుని, ఎవరైనా ప్రసాదం యిస్తే, ఆ ప్రసాదం నాకు తెచ్చి పెట్టేవాడు, అదికాక నీ లాంటి పుణ్యాత్ముడి తో జతకలవడం వలన అతను కూడా నీతో పాటు ఈ వైతరణి నది దాటడానికి నేను సహాయపడతాను, అతనిని తీసుకుని రా, యిక్కడ పేర్లు వుండవు, పిలవకుండా వెళ్ళి తీసుకుని రా” అంది గోమాత. సంతోషంగా రాంబాబు దగ్గరికి వెళ్ళాడు శంకరం. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు, ‘నరకం లేదు, స్వర్గం లేదు, పాపం, పుణ్యం అన్నీ అక్కడే అనుకుని పొరపాటు చేసాను’ అని ఏడుస్తున్న రాంబాబు చెయ్యి పట్టుకుని తను గోమాత తోక పట్టుకుని వైతరణి నదిలో ప్రవేశించాడు. మనం అనుకున్నట్టు పై లోకాలు లేకపోతే పర్వాలేదు, వుంటే అప్పుడు పుణ్యం చేసుకోవడానికి కావలిసిన శరీరం వుండదు. వున్నప్పుడే పుణ్యం చేసుకోండి. ఫలితం మనకి అనవసరం. సమాప్తం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

52 views0 comments

Comments


bottom of page