'Nenu Manchi Bharthana' New Telugu Story
Written By M R V Sathyanarayana Murthy
'నేను మంచి భర్తనా' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“రండి పంతులు గారూ, మీ కోసమే చూస్తున్నాం” అన్నాడు రాఘవరావు ఆనందంగా. “నేను కూడా మిమ్మల్ని కలవాలనే ఆతృతగా ఉన్నాను. నిన్న మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచాను” అన్నారు శాస్త్రి గారు. ఆయన మాటలకు రాఘవరావు మనసులో చిన్నపాటి అనుమానం వ్యక్తమయ్యింది. “చెప్పండి పంతులు గారు” అన్నాడు రాఘవరావు. “అంటే కట్న కానుకల గురించి కాదు. అబ్బాయి ఒక విషయంలో ఖచ్చితంగా ఉంటున్నాడు. అది ఏమిటంటే.. ” అని నెమ్మదిగా ఒక సంగతి చెప్పారు శాస్త్రి గారు. అది విని నిర్ఘాంతపోయాడు రాఘవరావు. అప్పుడే హాలు లోకి వచ్చిన జానకమ్మ, చంద్రలేఖ ఒకరి మొహాలు, ఒకరు చూసుకున్నారు. 'అయితే ఈ సంబంధం కూడా చేజారిపోయినట్టేనా?' అని నిరుత్సాహపడ్డాడు రాఘవరావు. అబ్బాయి బ్యాంకులో ఆఫీసర్, తండ్రి టీచర్ గా చేస్తున్నారు, ఉన్న ఒక్క ఆడపిల్లకు పెళ్లి చేసేసారు. పైగా కట్న కానుకలు అక్కర్లేదు, అమ్మాయి లక్షణంగా ఉంటె చాలన్నారు. కానీ ఇప్పుడు అబ్బాయి కండిషన్ తో సంబంధం పీటముడి పడిపోయిందని దిగులు పడ్డాడు. తల్లి తండ్రులు కేసి చూసి ఒక నిర్ణయం తీసుకుంది చంద్రలేఖ. “పంతులు గారూ, మీరు మా గురించి పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదుగా?” అడిగింది చంద్రలేఖ. “లేదమ్మా, ఏదో చూచాయగా చెప్పాను. ఇవాళ నీ ఫోటో పట్టుకు వస్తానని చెప్పాను. ” అన్నారు శాస్త్రిగారు. కూతురు ఏం మాట్లాడుతుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు రాఘవరావు, జానకమ్మ. “నేను బి. ఏ. చదువుకున్నాను. ఆ విషయం ఒకటీ చెప్పండి చాలు” అంది చిన్నగా నవ్వుతూ చంద్రలేఖ. శాస్త్రిగారు, రాఘవరావు, జానకమ్మ ముగ్గురూ ఆమె కేసి నిర్ఘాంతపోయి చూసారు. “నాన్నగారూ, ఈ సంబంధం మనకు అన్నివిధాలా బాగుందని రాత్రే అనుకున్నాంగా. మరి ఇంక ఆలోచించకండి. నాన్నగారూ! పంతులుగారికి నా ఫోటో ఇవ్వండి. అమ్మా నువ్వు ఆయనకి కాఫీ ఇయ్యమ్మా. నేను కాన్వెంట్ కి వెళ్ళాలి” అని లోపలకు వెళ్ళింది చంద్రలేఖ. శాస్త్రిగారు రాఘవరావు చెప్పిన వివరాలు అన్నీ ఒక కాగితం మీద రాసుకున్నారు. చంద్రలేఖ ఫోటో తీసుకుని డైరీ లో పెట్టుకున్నారు. జానకమ్మ ఇచ్చిన కాఫీ తాగి "అంతా శుభం జరుగుతుంది సర్” అని రాఘవరావు కి చెప్పి స్కూటీ ఎక్కి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. నాలుగు రోజులు పోయాకా చంద్రలేఖ ని చూడటానికి శేఖర్, తల్లితండ్రులు రమణారావు, సుందరి లతో కలిసి వచ్చాడు. బంగారు మేని చాయతో, తీర్చి దిద్దిన రూపు రేఖలతో ఉన్న చంద్రలేఖ, శేఖర్ కి బాగా నచ్చింది. రాఘవరావు కి ఒక్కతే కూతురు చంద్రలేఖ అవడం, వారి ఆస్థి పాస్తులు రమణారావు, సుందరి లకు బాగా నచ్చింది. ఆరోజు మంచి రోజు అవడం వలన తాంబూలాలు పుచ్చుకున్నారు ఇరు వర్గాలవారు. మాఘమాసంలో శేఖర్, చంద్రలేఖ ల వివాహం వైభవంగా జరగడం, భర్తతో కలిసి చంద్రలేఖ విశాఖపట్నం వెళ్ళడం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. శేఖర్ బ్యాంకు కి వెళ్లిపోయాకా చంద్రలేఖ కి చాలా సమయం ఉంటోంది. ఏం చేయడానికి పాలుపోక ఒకరోజు భర్తని అడిగింది. “ఏమండీ, మీరు బ్యాంకు కి వెళ్లి తిరిగి వచ్చేవరకూ నాకు ఏం తోచడం లేదు. ఏదైనా ఉద్యోగం లో చేరతాను”. ఆమె మాటలకు గట్టిగా నవ్వాడు శేఖర్. “నీ బి. ఏ. క్వాలిఫికేషన్ కి ఏం ఉద్యోగం వస్తుంది. మీ ఊరిలో అంటే ఏదో చిన్న టీచర్ పోస్ట్ వచ్చింది. ఇక్కడ సిటీలో కాన్వెంట్ లో టీచర్ గా ఉండాలంటే, బి. ఎడ్. అవ్వాలి లేదా పి. జి. అయినా చెయ్యాలి” అన్నాడు కళ్ళు ఎగరేస్తూ భార్య కేసి చూసి శేఖర్. “అయితే బి. ఎడ్. కి అప్లై చేయమంటారా?” ఆశగా అడిగింది చంద్రలేఖ. ఆమె మాటలకు ఒక్కసారి ఖంగు తిన్నాడు శేఖర్. “ఆ.. ఇప్పుడు అటువంటివేమీ వద్దు. రేపు పిల్లలు పుడితే వాళ్ళను నువ్వు చూసుకోవద్దూ” అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్. తను ఎక్కువ చదువుకోవడం భర్తకి ఇష్టం లేదని ఆమెకి రుజువుఅయ్యింది. ******* కాలచక్రంలో ఐదేళ్ళు గిర్రున తిరిగాయి. చంద్రలేఖ కి అబ్బాయి, అమ్మాయి కలిగారు. అటు తల్లితండ్రులు, ఇటు అత్తా మావయ్యలు చాలా సంతోషించారు. శేఖర్ కూడా ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వైజాగ్ లోనే ఇంకో బ్రాంచ్ కి బదిలీ అయ్యింది శేఖర్ కి. ఇది కొంచెం దూరం. చంద్రలేఖ అతనికి కేరేజి సర్ది ఇవ్వడం, పోద్దునే టిఫిన్ తయారు చెయ్యడం తో చాలా బిజీగా ఉంటోంది. బాబుని కాన్వెంట్ లో ఎల్. కే. జి. లో చేర్చారు. పాపకి ఇంకా రెండవ ఏడు జరుగుతోంది. రాఘవరావు కూతురికి లాప్ టాప్ కొని ఇచ్చాడు. నెట్ లో ఏవో కోర్సులు నేర్చుకుంటోంది. శేఖర్ పొద్దున్నే వెళ్లి పోవడం, రాత్రి ఎనిమిది గంటలకు రావడం.. పిల్లలతో కాసేపు ఆడుకుని.. భోజనం చేసి నిద్ర పోవడం.. అన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి. ఆదివారం రోజునే భార్యా భర్తలు ఇద్దరూ తీరికగా మాట్లాడు కుంటున్నారు. కాలచక్రంలో మరో రెండేళ్ళు తిరిగాయి. చంద్రలేఖ పిల్లలు ఇద్దరూ కాన్వెంట్ లో చదువుకుంటున్నారు. వాళ్ళ కాన్వెంట్ లోనే కింది తరగతులకు చెప్పడానికి ఒక టీచర్ కావాల్సి వచ్చింది. ఒక రోజు భర్తని అడిగింది చంద్రలేఖ. ”ఏమండీ, మన పిల్లలు చదువుతున్న కాన్వెంట్ లోనే కింది క్లాసులకు చెప్పడానికి టీచర్ కావాలిట. ప్రిన్సిపాల్ నన్ను అడిగింది ‘మీరు వస్తారా?’ అని. మిమ్మల్ని అడిగి చేబుతానన్నాను. నేనూ అక్కడ ఉంటె, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. వచ్చేటప్పుడు పిల్లల ఆటో లోనే ఇంటికి వచ్చేయవచ్చు. ఏమంటారు?” చాలా ప్లీజింగా అడిగింది. శేఖర్ ఒక్క క్షణం ఆలోచించాడు. పిల్లలకు తోడుగా ఉంటుందన్న పాయింట్ అతనికి బాగా నచ్చింది. అందుకే భార్య ఉద్యోగంలో చేరడానికి అంగీకరించాడు. చంద్రలేఖ టీచర్ గా కాన్వెంట్ లో చేరడం పిల్లలు ఇద్దరికీ బాగా నచ్చింది. ‘చంద్రలేఖ టీచర్ గారి పిల్లలు’ అని వారికి కొత్త గౌరవం వచ్చింది. చంద్రలేఖ కి చాలా ఆనందంగా ఉంది. తన విరామ సమయం వృధాగా పోకుండా చిన్నారులకు చదువు చెబుతున్నందుకు. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. మూడు కొత్త కేలండర్లు మారాయి. శేఖర్ కి అనకాపల్లి బ్రాంచ్ కి మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. “చంద్రా, నా ప్రమోషన్ నాకు చాలా సంతోషం ఇచ్చింది. మరి మనం అనకాపల్లి మకాం మారుద్దామా? లేక నేను రోజూ వెళ్లిరానా? నీ సలహా ఏమిటి?” అడిగాడు భార్యని శేఖర్. “మన పిల్లలు ఈ కాన్వెంట్ కి బాగా అలవాటు పడ్డారు. టీచర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దాని వలన వాళ్ళ చదువు బాగా సాగుతోంది. మంచి రాంక్ లు కూడా తెచ్చుకుంటున్నారు. అయితే మీరు రోజూ ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుందేమో ఆలోచించండి. అక్కడ మన పిల్లలకు మంచి కాన్వెంట్ దొరకాలి. అదొక ఇబ్బంది. ” అంది చంద్రలేఖ నెమ్మదిగా. శేఖర్ మరోసారి ఆలోచించాడు. భార్య చెప్పింది కూడా నిజమే. పిల్లలు ఇద్దరూ బాగా చదువుతున్నారు. అక్కడ మంచి కాన్వెంట్ దొరకాలి. పిల్లలు దానికి అలవాటు పడాలి. తమ ఇంటికి బస్సు స్టాండ్ దగ్గర. స్కూటర్ మీద పది నిముషాలలో చేరుకోవచ్చు. ఎక్సు ప్రెస్ బస్సు ఎక్కితే గంట లోపుగానే అనకాపల్లి వెళ్ళవచ్చు. ఆ మాటే భార్యతో అన్నాడు. “చంద్రా, పిల్లల చదువు దృష్టిలో పెట్టుకుని, నేనే అనకాపల్లి వెళ్లి రావడం మంచిది అనిపిస్తోంది. బస్సు స్టాండ్ మన ఇంటికి చాలా దగ్గరకదా. స్కూటర్ మీద బస్సు స్టాండ్ కి వెళ్తాను. స్కూటర్ అక్కడ పెట్టి బస్సు లో అనకాపల్లి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాను. ఏమంటావు?”నవ్వుతూ అన్నాడు శేఖర్. “మీ ఇష్టం మహానుభావా”అంది నాటకీయంగా చంద్రలేఖ. ఆమె మాటలకు మరోసారి నవ్వాడు శేఖర్. అలా శేఖర్ మూడు సంవత్సరాలు వైజాగ్ టు అనకాపల్లి షటిల్ సర్వీసు చేసాడు. ఒకరోజు హెడ్ కేషియర్ కేశవరావు, శేఖర్ రూమ్ లోకి వచ్చి స్వీట్ అతని చేతిలో పెట్టి ‘మా అబ్బాయి సివిల్స్ లో ఐదవ రాంక్ సాధించాడు సర్’ అన్నాడు ఆనందంగా. శేఖర్ లేచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి ‘చాలా గ్రేట్ సర్. మీ అబ్బాయికి నా అభినందనలు చెప్పండి. ఈ విజయం మన బ్యాంకు కి కూడా విజయమే సర్’ అని అభినందించాడు. స్వీట్ తింటూ ‘మీ అబ్బాయి ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు?హైదరాబాదా.. బెంగుళూరా?’ అడిగాడు శేఖర్. “ఇక్కడే.. మన వైజాగ్ లోనే సర్. వాగ్దేవి కోచింగ్ సెంటర్ లో. అంతా ప్రవల్లిక మేడం చలవే సర్. మా అబ్బాయిని సానబెట్టిన వజ్రంలా తీర్చిదిద్దింది సర్. ఇంతక్రితం కూడా ఎంతోమంది గ్రూప్ వన్ పరీక్షలలో విజయం సాధించారు అంటే ఆమె ప్రతిభే సర్. కానీ ఎప్పుడూ మీడియా ముందుకు రారు. ఒకసారి నేను ఆ కోచింగ్ సెంటర్ కి వెళ్లాను. భారత రాజ్యాంగం గురించి అనర్గళంగా చెప్పారు. అంతే కాదు.. ఎవరు ఏ ప్రశ్న అడిగినా చక చకా చెప్పారు. పుంభావ సరస్వతి అంటారు చూడండి.. అలాంటి కోవకు చెందిన గొప్ప వ్యక్తి సర్. కోచింగ్ సెంటర్ సెక్రటరీని అడిగితే చెప్పారు, ఆమె ఎం. ఏ. పాలిటిక్స్ లో గోల్డ్ మెడలిస్టు అని. ఎం. ఏ. సైకాలజీ కూడా చేసారని. రేపు ఆదివారం కదా సర్. కోచింగ్ సెంటర్ వాళ్ళని కలవాలి, ప్రవల్లిక మేడం ని కూడా కలిసి ధన్యవాదాలు చెప్పాలి” అన్నాడు కేశవరావు. “రేపు మీ పనులు అయ్యాక మా ఇంటికి కూడా కాఫీకి రండి మీరూ, మీ అబ్బాయీ” ఆహ్వానించాడు శేఖర్. ‘తప్పకుండా వస్తాను సర్’ అని చెప్పి మిగతా స్టాఫ్ కి స్వీట్లు ఇవ్వడానికి వెళ్ళాడు కేశవరావు. శేఖర్ మనసు చాలా ఆనందంగా ఉంది. తమ బ్యాంకు ఉద్యోగి కొడుకు సివిల్స్ లో గొప్ప విజయం సాధించాడని. ఆ రోజు ఇంటికి రాగానే భార్యకి చెప్పాడు శేఖర్. మా హెడ్ కేషియర్ కొడుకు సివిల్స్ లో టాపర్ గా వచ్చాడని, రేపు మన ఇంటికి కాఫీ కి వస్తారని. చంద్రలేఖ కూడా చాలా ఆనందించింది, మన ప్రాంతం విద్యార్థి ఘనవిజయం సాధించాడని. మర్నాడు ఉదయం నుంచీ శేఖర్ చాలా హడావిడి పడుతున్నాడు. పిల్లలు ఇద్దరికీ చెప్పాడు 'ఇవాళ మన ఇంటికి ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారని. మీరు కూడా ఆయన లాగే చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని’. కిరణ్, శ్రావ్య కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు ఆ గెస్ట్ కోసం. సరిగ్గా పదకొండు గంటలకు శేఖర్ ఇంటిముందు టాక్సీ ఆగింది. ముందుగా కేశవరావు, వాళ్ళ అబ్బాయి ధీరజ్ దిగారు. వాళ్ళ వెనకే మరొక ఆయన దిగారు. శేఖర్ ముగ్గురినీ ఆదరంగా ఆహ్వానించాడు. ఆ మూడో వ్యక్తి కోచింగ్ సెంటర్ కార్యదర్శి రామకృష్ణ అని శేఖర్ కి పరిచయం చేసాడు కేశవరావు. అందరూ లోపలకు వచ్చి కూర్చున్నారు. కిరణ్ బిస్కట్లు ట్రే లో పట్టుకొచ్చాడు. శ్రావ్య మంచినీళ్ళ గ్లాసులు తెచ్చింది. అతిధులు ముగ్గురూ బిస్కట్లు తిన్నారు. శేఖర్ ‘చంద్రా, కాఫీలు తీసుకురా’ అని పిలిచాడు. ‘వస్తున్నా’ అని బదులు పలికి, కొద్దిసేపటికి ట్రే లో కాఫీ కప్పులతో హాలు లోకి వచ్చింది చంద్రలేఖ. ఆమెని చూడగానే ఆశ్చర్యపోయాడు కేశవరావు. వెంటనే లేచి నిలబడి ‘నమస్తే మేడం’అన్నాడు. ధీరజ్ కూడా లేచి నిలబడి “నమస్తే మేడం” అని నమస్కరించాడు. శేఖర్ వాళ్ళిద్దరి కేసి ఆశ్చర్యంగా చూసాడు. చంద్రలేఖ ట్రే, టీపాయి మీద పెట్టింది. ధీరజ్ తను తెచ్చిన పూల బోకే చంద్రలేఖ చేతికి ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు. రామకృష్ణ ‘గుడ్ మార్నింగ్ మేడం’ అని చిన్నగా నవ్వాడు. బదులుగా ‘మార్నింగ్ సర్’అంది చంద్రలేఖ. శేఖర్ ఇంకా అయోమయంగా వారికేసి చూస్తున్నాడు. ఐదు నిముషాలు ధీరజ్, చంద్రలేఖ మాట్లాడారు. ధీరజ్ కి కొన్ని సూచనలు చేసింది చంద్రలేఖ. కాఫీలు తాగి వెళ్లేముందు కేశవరావు మరోసారి చంద్రలేఖతో, ”మీరే మా అబ్బాయికి సరైన మార్గదర్సనం చేసి, వాడు సివిల్స్ లో రాంక్ సాధించడానికి సహకరించారని, మీ మేలు ఎప్పుడూ మరువలేమని “ అన్నాడు. “నాదేముంది, నా డ్యూటీ నేను చేసాను. మీ అబ్బాయి తెలివైనవాడు, చురుకైనవాడు. ఏ విషయం చెప్పినా ఇట్టే పట్టుకుంటాడు. అతని కృషి, పట్టుదల అతని విజయానికి రాచబాట వేసాయి” అంది చంద్రలేఖ. శేఖర్ పిల్లలు ఇద్దరూ, ధీరజ్ తో సేల్ఫీ దిగారు. టాక్సీ ఎక్కే ముందు కేశవరావు, శేఖర్ తో”మీరు చాలా గుట్టు మనిషి సార్” అని అన్నాడు. ఏం చెప్పాలో తెలియక ఓ వెర్రి నవ్వు నవ్వాడు శేఖర్. లోపలకు వచ్చాకా భార్యని అడిగాడు “ఏమిటి ఇదంతా, వాళ్ళు నీకు ముందే తెలుసా?” చంద్రలేఖ పిల్లలతో ‘లోపలకు వెళ్లి ఆడుకోండని’ చెప్పింది. వాళ్ళు లోపలకు వెళ్ళిపోయారు. “మీకు అనకాపల్లి బదిలీ అయినప్పటినుంచి వాగ్దేవి కోచింగ్ సెంటర్ లో పనిచేస్తున్నాను. మన పిల్లలు పెద్దవారు అయ్యారు కదా. ఇంక ఆ కాన్వెంట్ లో పనిచేయ్యవలసిన పని లేదని ఇంట్లోనే ఉంటానని మీతో చెప్పాను. కానీ నా చదువుకి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ” ఒక్క క్షణం ఆగింది చంద్రలేఖ. శేఖర్ కి కేశవరావు చెప్పిన ఎం. ఏ. గోల్డ్ మెడలిస్ట్ తన భార్యేనని అర్ధమైపోయింది. తన చదువు గురించి ఆమె అబద్ధం చెప్పిందని తెలియగానే కోపం వచ్చింది. “అంటే నీ చదువు గురించి దాచిపెట్టి నన్ను మోసం చేసారన్న మాట” ఉక్రోషంగా అన్నాడు. భర్త పక్కనే కూర్చున్న చంద్రలేఖ, అతని జుట్టులోకి తన చేతివేళ్లు పోనిచ్చి గారంగా “ఏం చేయమంటారు? నూరు అబాద్ధాలు ఆడి అయినా, ఒక పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. నేను ఒక్క అబద్ధం ఆడి బంగారం లాంటి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అయినా మీతో సమానంగా ఆడవాళ్ళు చదువుకోకూడదని ఎందుకు అనుకున్నారు? మీరు ఎంతో సంస్కారవంతులు. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. మరి ఇది ఏమిటి?” అడిగింది. భార్య అలా అడిగేసరికి కరిగిపోయాడు శేఖర్. “మా బామ్మ చెప్పింది. ’ఒరేయ్ అబ్బిగా, నీతో సమానంగా కానీ, నీ కంటే ఎక్కువ కానీ చదువుకున్న పిల్లని చేసుకుంటే నీ మాట వినదు. నిన్ను ఆడించేస్తుంది’ అని. అందుకే పెళ్ళిళ్ళ శాస్త్రి గారితో ముందే చెప్పాను. డిగ్రీ చదివిన అమ్మాయిని మాత్రమే చూడండని” అన్నాడు శేఖర్. మరలా సందేహం వచ్చి ‘ఈ ప్రవల్లిక పేరు ఏమిటి?’ అని అడిగాడు. “నా పూర్తి పేరు ప్రవల్లికా చంద్రలేఖ” అంది అతని గుండెలమీద వాలి. ఇంత చదువుల సరస్వతి తన భార్య అయినందుకు చాలా సంతోషించాడు శేఖర్. కానీ అంతలోనే ఒక సందేహం వచ్చింది. “చంద్రా, ఇంతకీ నేను మంచి భర్తనా.. కాదా?” అడిగాడు శేఖర్. “మీరు చాలా చాలా మంచి భర్త. మా ఆయన బంగారం. సరేనా” అని అతని బుగ్గమీద ముద్దు పెట్టింది చంద్రలేఖ. శేఖర్ కి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది భార్య కితాబుకి, ఆమె ఇచ్చిన బహుమతికి. ***** |
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
mrvs murthy • 4 hours ago
బాగా చదివారు సార్. ధన్యవాదాలు