top of page

గర్భం


'Garbham' New Telugu Story

Written By Sirisha Sadhanala

'గర్భం' తెలుగు కథ

రచన: శిరీష సాధనాల



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఒక అందమైన కల్యాణమండపం. ఆ కళ్యణ మండపం పంతులు గారి మంత్రాలతో, వెళ్లి వచ్చే చుట్టాలతో, ఇంకొకపక్క భోజనాల హడావుడితో కళకళలాడుతూ ఉంది. పెళ్లి కొడుకు తల్లి ఐన రాధిక గారికి సంతోషం తో కాలు అసలు నిలవట్లేదు. ఆవిడకు ఆకాశంలో తేలుతున్నట్టుగా ఉంది. కొడుకు కార్తీక్ అంటే పంచ ప్రాణాలు ఆవిడకు. ఆమె భర్త, కార్తీక్ చిన్నవాడుగా ఉన్నప్పుడే చనిపోతే అందరు ఆమెను రెండవ పెళ్లి చేసుకోమని పట్టు పట్టారు. వచ్చే అతను ఆమెకు భర్త అవుతాడు కానీ తన కొడుకుకి తండ్రి అవ్వడేమో అనే భయంతో ఎన్నో కష్టాలను దాటుకుని, ఎంతో మంది ఆకలి చూపుల నుండి తప్పించుకుంటూ తన కొడుకుకి తల్లి, తండ్రి తానే అయ్యి, తన కొడుకు సంతోషం లోనే తన సంతోషాన్ని చూసుకుంటూ పెంచారు. కార్తీక్ కి కూడా తల్లి అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి తల్లి కష్టాలను చూస్తూ పెరగడం వల్ల తల్లి అంటే ఏంతో గౌరవం కార్తీక్ కి. మంగళవాద్యాలు మోగుతున్నాయి. పెళ్ళి పీటల మీద ఉన్న జంటను చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ముహూర్త సమయంలో అందరి ఆశీర్వాదం తో పెళ్ళి కొడుకు ఐన కార్తీక్, పెళ్ళి కూతురు ఐన శ్వేతను మూడు ముళ్ళు వేసి తన భార్యను చేసుకున్నాడు.. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి.. ఒక గదిలో శ్వేతని కొంతమంది రెడీ చేస్తున్నారు.. వాళ్ళు అందరు శ్వేతను సరదాగా ఏడిపిస్తున్నా అవేమి చెవికి ఎక్కట్లేదు.. శ్వేతకి అంతా కంగారుగా భయంగా ఏదో తెలియని బిడియం గా ఉంది. ఆ టైం లోనే రాధిక గారు ఆ గదికి వచ్చారు. ఆమెను చూసి మిగతా వాళ్ళు అందరు బయటకి వెళ్లిపోయారు. ఆమెను చూసిన శ్వేత ఒక్క సారిగా కంగారు పడిపోయింది. శ్వేత కంగారు ను చూసిన రాధిక గారు చిన్నగా నవ్వుతూ “ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావ్.. నాకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం.. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా ఇంటికి కోడలు రూపం లో కూతురు వచ్చినందుకు.. నాకు తెలుసు, నీకు అంత కొత్తగా భయంగా ఉంటుంది అని.. దేనికీ భయపడకు.. ఇప్పుడు ఇది నీ ఇల్లు తల్లి.. కార్తీక్ కూడా చాల మంచి వాడు.. కానీ బయట ప్రపంచం అంతగా తెలీదు వాడికి.. ముఖ్యంగా అమ్మాయిల విషయాలు అంతగా తెలీవు వాడికి. ఆ విషయంలో వాడికి ఏమైనా తెలియకపోయినా నువ్వే చూసుకోవాలి తల్లీ.. అలానే నీకు ఈ అత్తమ్మ ఎప్పుడు తోడుగా ఉంటుంది.. మీ అమ్మగారితో చెప్పుకునే ఏ విషయం ఐనా నువ్వు నాతో చెపుకోవచ్చు.. వాడికే సపోర్ట్ చేస్తా అనుకోకు. చెప్పా కదా.. నువ్వు నాకు కూతురువే. అల్ ది బెస్ట్ తల్లీ ! నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వాడికి చెప్పు. కచ్చితంగా వింటాడు. నీ ఇష్టాన్ని కాదు అని ఏదీ చేయడు. సరే నా.. ” అని చెపుతారు. ఆ మాటలు విన్న శ్వేతకు ఆ క్షణం ఆనంద బాష్పాలు వస్తాయి.. అసలు అనుకోలేదు ఆమె తనకు ఇంత మంచి అత్తగారు వస్తారు అని.. ఆనందంతో రాధిక గారిని కౌగిలించుకుని “థాంక్స్ అత్తమ్మా” అని చెప్పి పాల గ్లాస్ తో గదిలోకి అడుగుపెడుతుంది శ్వేత.. రకరకాల పువ్వులతో, అత్తరు సువాసనతో, ఉన్న ఆ గది లో కార్తీక్ శ్వేత కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. అతడి ఎదురు చూపుకు తెరదించుతూ, తెలుపు రంగు మీద గోల్డ్ కలర్ బోర్డర్ ఉన్న చీరలో, రెండు చేతులకు నిండుగా గాజులు వేసుకుని, మెడలో పసుపుతాడుతో, హారం తో, నుదిటిన కుంకం బొట్టుతో, చేతిలో పాల గ్లాసుతో అడుగు పెట్టింది శ్వేత. కార్తీక్ శ్వేతను కాసేపు ఆలా చూస్తూ ఉండిపోయాడు. తరువాత తేరుకుని బిడియం తో తలుపు దగ్గరే ఆగిపోయిన శ్వేత దగ్గరకు వెళ్లి, పాల గ్లాస్ పక్కన పెట్టి, మంచం వరకు తీసుకుని వెళ్లి, కూర్చోపెట్టాడు. శ్వేత ఏదైనా మాట్లాడుతుందేమో అని చూసిన కార్తీక్, ఆమె ఎంతకూ మాట్లాడకపోవడం తో “నువ్వు చాల అందంగా ఉన్నావ్ శ్వేతా” అని అన్నాడు.. చిన్నగా నవ్వి ఊరుకుంది శ్వేత.. ఆమె ఇంకా భయపడుతూ ఉండడంతో ఆమె చేతిని తన చేతులోకి తీసుకుంటూ “ఫ్రీ గా ఫీల్ అవ్వు శ్వేతా.. టెన్షన్ పడకు.. నీకు ఈ టెన్షన్ పోయే వరకు కబుర్లు చెప్పుకుందాం. తరువాత నీ ఇష్టం” అని తన ఇష్టాయిష్టాలు చెప్పి, శ్వేత ఇష్టాయిష్టాలు తెలుసుకుని, ఆమె టెన్షన్ పోగొట్టి, చివరిగా ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి, “నువ్వు ఇలా గలగలా మాట్లాడితేనే చాలా బాగున్నావ్ శ్వేతా.. నీ పెదవుల పైన ఆ నవ్వు ఎప్పటికి ఉండేలా చూసుకుంటా” అని చెప్పి ప్రామిస్ చేస్తాడు.. ఆ మాటకు ఎంతగానో మురిసిపోతుంది శ్వేత .. “ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవ మరుసటి రోజు లేకుండా చూసుకుంటా” అని శ్వేత కూడా ప్రమాణం చేస్తుంది.. అలా కొద్ది సేపు మాట్లాడుకున్నాక శ్వేత తన కళ్ళతో కార్తీక్ కు అంగీకారం తెలపడంతో ఆ రాత్రి వాళ్ళు మానసికంగానే కాక శారీరకం గా కూడా ఒకటి అవుతారు.. మరుసటి రోజు కొడుకు కోడలు మొహాలలో వచ్చిన వెలుగు చూసి వాళ్ళు ఇద్దరు ఒక్కటి అయ్యారు అని అర్ధం అయ్యి రాధిక గారు ఎంతో మురిసిపోతారు.. అలా వాళ్ళ మూడు రాత్రులు అయ్యాక, ఇద్దరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావడంతో మళ్ళీ వాళ్లకు టైం దొరకదు అని వాళ్ళని ఒక వారం రోజులు అరకు పంపిస్తారు .. ఆ వారం రోజులు అరకులో ప్రకృతిని ఆస్వాదిస్తూ చూడవలసిన ప్రదేశాలు చూస్తూ ఒకరికి ఒకరు ఇంకా దగ్గర అయ్యి ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు నుండి ఎవరి దినచర్య వాళ్ళది యధావిధిగా ప్రారంభం అవుతుంది.. శ్వేతకు ఆఫీస్ ఉండడం వల్ల శ్వేత వద్దు అని ఎంత చెప్పినా వినకుండా వంట పని మొత్తం రాధికగారే చూసుకుంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళిద్దర్నీ ఖచ్చితంగా తల్లి కూతుర్లు అనుకునే అంతగా ఉంటారు.. వాళ్ళ పెళ్ళి ఐన నెల రోజుల తరువాత శ్వేతకు వాంతులు అయ్యేలా ఉండడం, నీరసంగా ఉండడంతో అనుమానం వచ్చి ప్రెగెన్సీ కిట్ తో టెస్ట్ చేయుకుంటుంది.. అది పాజిటివ్ చూపించడంతో సంతోషంగా కార్తీక్ కి, ఇంకా రాధికా గారికి చేప్తుంది. రాధిక గారి సలహా మేరకు డాక్టర్కి కూడా చూపించుకుని, ఆవిడ కూడా కన్ఫర్మ్ చేసాక ఇంకా సంతోషిస్తారు. కార్తీక్ మొదట సంతోషించినా, తరువాత తన ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి.. కానీ సంతోషం లో ఉన్న అత్తా కోడళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోరు.. రాధిక గారు ఐతే వర్క్ ఫ్రొం హోమ్ పర్మిషన్ అడిగి కోడలిని ఇంట్లో నుండి వర్క్ చేసుకోమని, తనని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. ఆ రోజు నుండి కార్తీక్ ప్రవర్తనలో తేడా వస్తుంది.. శ్వేత మీద నమ్మకం లేకపోవడం అని కాదు కానీ ఎందుకో అతడికి నెల రోజులకే ప్రెగ్నెన్సీ రావడం అనేది నచ్చట్లేదు.. అందువలన శ్వేతకు దూరం గా ఉండలేక, అలా అని దగ్గర కాలేక ఒక పక్క శ్వేతను కనీసం ఏదైనా విషయం లో చిరాకు పడలేక, ఆమెతో మాటలు తగ్గించేసి, అడిగితే హెవీ వర్క్ అని చెప్పి దూరం గా ఉంటున్నాడు. శ్వేత బాధపడినా వర్క్ కదా అని సరిపెట్టుకుంది.. కానీ రాధికా గారు కొడుకు ప్రవర్తన లో తేడా కి కారణం ఇది కాదు అని గుర్తించారు. విషయం ఏదైనా శ్వేత కు తెలియకుండా మాట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అనవసరంగా శ్వేత ఎక్కడ బాధ పడుతుందో అని ఆవిడ ఆలోచన. ఒక రోజు శ్వేతకు మీటింగ్ ఉండడం వల్లన కచ్చితంగా ఆఫీస్ కి వెళ్ళవల్సివచ్చింది. ఆ రోజు కార్తీక్ ని ఉండిపొమ్మని శ్వేత వెళ్ళాక విషయం అడిగారు ఆవిడ. ముందు చెప్పడానికి ఆలోచించినా, రాధికా గారు గట్టిగా అడగడంతో ఆవిడ ఒడిలో తల పెట్టుకుని తన మనసులో ఉన్న బాధను చెప్పడం ప్రారంభించాడు కార్తీక్. "నాకు పెళ్ళి ఐన నెల రోజులకే ఆడవాళ్ళు తల్లి అవుతారు అని తెలీదమ్మా.. శ్వేత అలా అవ్వడం నాకు నచ్చట్లేదు. అలా అని తన మీద అనుమానం కాదు అమ్మా.. నా శ్వేత బంగారం అని నాకు తెలుసమ్మా.. నా మనసులో ఏముందో నాకు తెలియట్లేదమ్మా.. ” అని అంటాడు తల్లి వంక బేలగా చూస్తూ.. కార్తీక్ మాటలకూ రాధిక గారు కార్తీక్ తల మీద చిన్నగా ఒకటి ఇచ్చి, “సాధారణంగా అమ్మాయిలకు నెలసరి ఐన తర్వాత 10 నుండి 20 రోజులలో ఇంకా ముఖ్యంగా 14 లేదా 16 లేదా 18 రోజులలో కనుక అబ్బాయితో కలిస్తే ఆ టైం లో వాళ్లలో అండం రిలీజ్ అయ్యి, త్వరగా గర్భం దాలుస్తారు. దాంట్లో వాళ్ళ తప్పు ఏం ఉండదు రా.. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని నా కోడలిని బాధ పెట్టకు” అని కొంచం గట్టిగ చెప్పి మందలిస్తారు.. “నేను తనని ఎప్పుడు తప్పు గా అనుకోనమ్మా.. అసలు ఇప్పుడు కూడా అనుకోలేదు. సారీ అమ్మా” అంటాడు.. “నాకు సారీ ఏం వద్దు కానీ శ్వేత దగ్గర మాత్రం ఈ విషయం అనకు. తనని జాగ్రత్త గా చూసుకో” అని చెపుతారు రాధికా గారు. ఆ రోజు రాత్రి శ్వేత పడుకునే సమయం లో “నువ్వు ఈ రోజు చాలా అలసిపోయి ఉంటావ్ కదా! నేను నీ కాళ్లకు మర్దన చేస్తా” అని శ్వేత ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా మర్దన చేస్తూ, మధ్యలో ఆమె పాదాలు పట్టుకుని ‘నాకు నీ మీద ఎప్పటికి అనుమానం అనేది రాదు శ్వేత. కానీ నా మనసులో వచ్చిన ఆ ఆలోచనకి నన్ను క్షమించు’ అని మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు. ఈ విషయాలు ఏవి తెలియని శ్వేత, పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ, తన అదృష్టానికి మురిసిపోతూ, హాయిగా పడుకుంది. సమాప్తం

శిరీష సాధనాల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు శిరీష.

నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను.

నాకు స్టోరీస్ చదవడం రాయడం అంటే చాల ఇష్టం.

నా ప్రతి కధ ఒక చక్కటి అర్థాన్ని ఇచ్చేలా చూసుకుంటాను.

నాకు సాడ్ ఎండింగ్స్ అంటే అసలు నచ్చవు.

అందుకే నా ప్రతి కథ ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చేలా రాస్తాను..



123 views0 comments
bottom of page