top of page
Original.png

కాకతి రుద్రమ ఎపిసోడ్ 1

Updated: May 1

కాకతి రుద్రమ
కాకతి రుద్రమ

Kakathi Rudrama Episode 1 Telugu Serial | Ayyala Somayajula Subrahmanyam

కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 - Telugu Serial | అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

Published in manatelugukathalu.com on 28/06/2022




కాకతి రుద్రమ ఎపిసోడ్ 1

కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమదేవి కథను సీరియల్‌గా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత, కవి శ్రీ అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు.

పాఠకులు ఈ సీరియల్‌పై తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.

ఇక మొదటి ఎపిసోడ్ ప్రారంభిద్దాం.

నవలకాల చరిత్ర

------------------------

పదమూడో శతాబ్దంలోనే కత్తి పట్టింది. కదనరంగంలో దూకింది. మత్తగజాన్నే కాదు..

మగరాయళ్ళ అహంకారాన్ని అణచివేసింది. సమస్త స్త్రీజాతికి ఆదర్శమూర్తి—

కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి. చెదిరిన ఆంధ్ర దేశాన్ని ఒక్కటిగా చేర్చిన గణపతి

దేవుని పెద్ద కూతురు. ఓరుగల్లు రాజధానిగా దక్షిణాదిని ఏలిన కాకతీయ వంశానికి చెందిన ధీరోదాత్తురాలు రుద్రమదేవి.


ఆ వంశ మంత్రి శివదేవయ్య. ఆయనే రుద్రమదేవికి యుద్దవిద్యలన్నీ నేర్పించాడు.

రుద్రమదేవి సాహసాలను మాటల్లో వ్యక్తీకరించలేము. గణపతిదేవుడు బతికున్న కాలంలోనే, తండ్రి అనారోగ్య కారణంగా సైన్యాన్ని ముందుకు నడిపింది. దక్షిణ భాగం అధికం కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న సమయమది. పురుషాధిక్యాన్ని తట్టుకుని పాలించడం సామాన్య విషయం కాదు.


నిరంతర కత్తిసాములు, ఈటెలు విసరడం, అశ్విక స్వారీలు, శరసంధానంలో మునిగి తేలిన రుద్రమదేవి ఎల్లప్పుడూ పురుష ఆహార్యంలోనే ఉండేది. 13 వ శతాబ్దపు కాలంలోనే రుద్రమదేవి తనను వివాహం ఆడదలచుకున్న వారు తన మీద కత్తియుద్ధం చేసి గెలవాలన్న షరతు పెట్టింది. చాళుక్య వీరభద్రుడు ఆమెను ఓడించి పెళ్ళాడినా, అతడు ఇల్లరికం వచ్చాడు ఓరుగల్లుకు.


ఎంతో వీరోచితంగా కనిపించే రుద్రమ.. భర్త ముందు స్త్రీ సహజమైన సౌకుమార్యాన్ని, ప్రేమను ఒలికించేది.


గొప్ప సామ్రాజ్ఞి. పరిపాలనాదక్షురాలు. ధీరవనిత.. ఎన్ని యుద్దాలు చేసినా, జన్మతః మహిళే కదా!


రుద్రమలో పురుషుడిలోని కాఠిన్యం ఉంది. కాబట్టే మదపుటేనుగును అణచగలిగింది. ఆమె మీద తిరుగుబాటుకు ప్రయత్నించిన ప్రతీవారినీ ఓడించిన ధీశాలి. గణపతి దేవుడు యుద్ధవిద్యలు నేర్పించాడు. రాచతంత్రంలో మగవారికి ధీటుగా తీర్చిదిద్దాడు. ఇక యుద్ధరంగంలో అపరకాళీయేనంటారు చరిత్రకారులు.


"రాజ్యం పట్ల మనకు గల నిబద్ధతను చూసి శత్రువులు భయపడాలి. కలలో కూడా కన్నెత్తి చూసే సాహసం చేయకూడదు" అని సేనానులలో ధైర్యం నూరిపోసేది.

శక్తిగా మారగలదు.. స్త్రీ ఎలా ఉండాలి? అనే ప్రశ్నకు రుద్రమ నిలువెత్తు సమాధానం. మనం ఏ విషయంలోనూ మగవాళ్ళకి తక్కువ కాదు. ధైర్యసాహసాలు అనేవి సాధారణ గృహిణికి నిత్య జీవితంలో అవసరపడకపోవచ్చు. తప్పనిసరైతే మాత్రం ఆడపులిగా మారాల్సిందే. ఆ రెండు కోణాలని రుద్రమలో మనం చూస్తాం.


నాడు ఆడుదానికి సింహాసనం ఏమిటని దాయాదులు వ్యతిరేకించారు. ఆమె లేని సమయం చూసి కోటని ఆక్రమించుకున్నారు. తిరిగి వచ్చి రుద్రమ సివంగిలా విరుచుకుపడుతుంది. ప్రత్యర్థుల తల నరికి కోటగుమ్మానికి కట్టించింది.

"మన శత్రువులకు ఇదో గుణపాఠం. ఈ కోట గుమ్మాన్ని చూసి శత్రువులు, ప్రత్యర్థులు భయపడిపోవాలి" అని రౌద్రిస్తుంది.


'నేనొక తండ్రిలా రాజ్య ప్రజలని కాపాడుకుంటాను. కనురెప్పలలో పెట్టుకుని కాపాడుకుంటాను.' అని అభయమిస్తుంది.


అంటే ఓ తల్లిగా ప్రేమ కురిపిస్తూ, తండ్రిలా ప్రజలని రక్షించుకుంటుంది.

అదీ ఆమెలోని ఔచిత్యం.

--------------------------------------------------------

శ్రీశ్రీశ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతిదేవుల పుత్రిక. ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనం మీద అధివసించిన రాణులలో శ్రీ రుద్రమదేవి ఉత్తమ చరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీ సంపన్న నిర్వక్ర పరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి.


త్రిలింగదేశాన్ని, సమస్తమూ తన చెప్పుచేతల కింద, అజమాయిషీ కింద ఉంచుకుని "త్రిలింగదేశం మనదేనోయ్ - తెలుంగులంటే మనమేనోయ్" అని సగర్వంగా చెప్పించగలిగిన ధీమంతుడు, నానారాజ్య విజేత, బహుబిరుదాంకితుడూ కాకతీయ

సామ్రాజ్యాన్ని కత్తుల వంతెనగా నిర్మించిన ధీశాలీ - చక్రవర్తి కాకతీయ గణపతి రుద్రదేవుడు.


గణపతి రుద్రదేవుడికి మగ సంతతి లేదు.


గణపతి రుద్రదేవుడు వృద్ధాప్యంలో ఉన్నారు. వారికి వారసులున్నారు. దాయాది

సోదరులు ఈ రాజ్యం మీద కన్నేసి ఉంచారు. అసలు కాకతీయ మహా సామ్రాజ్య లక్ష్మి మీద కన్నులేనిదెవరికి? సామ్రాజ్యం అంటూ ఉంటే, శత్రురాజులు దాన్ని ఏదో విధంగా ఆక్రమించాలని చూస్తారు. రాజ్యం వీరభోజ్యం కదా! బలవంతుడు బలహీనుణ్ణి జయించటమే కదా!


అసలు ఈ సామ్రాజ్యానికి తామే కాబోయే రాజులమని, ప్రభువులమని హరిహరదేవుడు, మురారిదేవుడు, ప్రస్తుత వృద్ధుడైన గణపతిదేవులను హతమార్చో, రాజ్యభ్రష్టుణ్ణి చేసో బంగారు గద్దెపై కూర్చోవాలనే ప్రయత్నంలోనే ఉన్నారు.


అయితే ఇది అంత తేలిక కాదు; కడు దుస్సాధ్యము. అంతా మానవ ప్రయత్నాలు చేయకుండా ఉండరు కదా!


మరొకరకం వాదనలో, పురుష సంతతి గణపతి రుద్రదేవులకు లేకపోవడం చేత, మగవాడు మాత్రమే రాజ్యాధికారానికి వారసుడు కాబట్టి, గణపతి రుద్రదేవుల తదనంతరమైనా ఆ రాజ్యం హరిహర, మురారి దేవులకే రావాలని

పట్టుబట్టేవారూ బయలుదేరారు.


అసలు కథ ఏంటంటే గణపతి రుద్రదేవుల తండ్రిగారైన రుద్రదేవ చక్రవర్తి—కాకతీయ సామ్రాజ్య విస్తరణలో తన పక్కలో బల్లెంగా బ్రతుకుతున్న యాదవ చక్రవర్తిపై సైన్యాన్ని సమాయత్తం చేసి దేవగిరిపై దండెత్తారు. ఆ యుద్ధంలో ఇరుపక్షాలకూ అపార నష్టం జరిగినా, జయం రుద్రదేవ చక్రవర్తులకే దక్కింది.


ఆయన కాస్త రసజ్ఞుడు, సంగీత ప్రియుడు. ఆ పైన కాస్త శృంగార పురుషుడు. దేవగిరిలో కొంతకాలం మకాం చేసి, ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి అర్హత గల రాజుల కోసం గాలించి, తన పనుపున సామంతరాజుగా నియమించారు.

అప్పుడే రాజ్యానికి రావడం ఆలస్యమయింది.


ఆ రోజుల్లో, వారు అపురూప సౌందర్యవతియైన ఒక మహారాష్ట్ర కన్నె వలలో పడి, గాంధర్వ విధిలో వివాహమాడారు.


గాంధర్వ రీతిలో పెళ్ళి చేసుకున్న రుద్రదేవ మహారాజుకు జన్మించిన సంతానం

సారంగదేవుడు. అయితే రుద్రదేవ మహారాజు పట్టపు దేవేరి, తొలి భార్యయైన

ఆమెకు పుత్రసంతానం లేకపోయింది.


అయితే ఈ విశాల కాకతీయ సామ్రాజ్యం పాలించటానికీ, తనకు జన్మించిన వాణ్ణి సింహాసనం ఎక్కిస్తే, తోటి సామంతులకు, పరాయి రాజులకూ కోపం వచ్చి ఎదురు తిరిగి ఎడతెగని దండయాత్రలు చేస్తారని భయం ఉంది.


అది ఆయన పైకి అనక పోయినా మనసులో వున్న సంగతి. అందుచేత , ఆయన తన కిష్టుడైన మహాదేవుడిని పట్టాభిషిక్తుణ్ణి చేశారు.


ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు మెత్తనివాడూ అయిన సారంగదేవుడు ఎదురు తిరగలేదు. కాబట్టి ప్రచ్ఛన్న యుద్ధాలకు తావులేకుండా పోయింది.


మహాదేవరాయలు ఎక్కువకాలం రాజ్యం చేయకుండానే కాలధర్మం చేశారు.

అప్పటికే ఆ రాజ్యాన్ని పాలించే హక్కు, అదృష్టం సారంగదేవుడికీ లభించలేదు. ఆ సింహాసనాన్ని పాలించే హక్కు గణపతి రుద్రదేవ మహారాజుకి లభించింది.

సారంగదేవుడు ప్రభువులకు వరుసకు అన్న. అదీగాక ఆయన ఎన్నడూ వివాదాస్పదమైన వాడు కాకపోవటం చేత అంతా సవ్యంగానే జరిగిపోయింది. అంతేకాక సారంగధర దేవ ప్రభువయినా గణపతి దేవ మహారాజుని సొంత అన్నకన్నా మిన్నగా ప్రేమించాడు. తనకి చెందవలసిన సామ్రాజ్యాన్ని కూడా మనసులోకి రానివ్వక, అన్నను అతి గాఢంగానూ, విశ్వాసంగానూ ఆరాధించటం చేత - "తమ్ముడు నా కుడిభుజం... సారంగదేవుడంత విశ్వాసపాత్రుడు నాకు దొరకడు" అని ప్రభువులు బాహాటంగా చెప్పుకుంటూనే ఉండేవారు.


అందుచేతనే తమ్ముడికి గొప్ప హోదా ఇవ్వటం కోసం, తన పర్యవేక్షణలోనే కొలనుపాక రాజ్యాన్ని గోదావరీ తీరం వరకు పాలించుకునే ప్రభువుగా అనుమతి ఇచ్చారు.


సారంగధర దేవుడు కూడా రాజ్య పరిపాలనా విషయంలో ఎగుడుదిగుడులు లేకుండా మంచి ప్రభువుగానే గణనీయమైన ఖ్యాతిని తెచ్చుకున్నారు.


అయితే ఆయన ఎక్కువ కాలం బతకలేదు; నాలుగేళ్ళ క్రితం కన్ను మూశారు. ఇది

గణపతి చక్రవర్తికి పెద్ద దెబ్బే. ఆయన సారంగధర దేవుణ్ణి తలచుకుని - "తమ్ముడా, సారంగదేవుడా!" అని చాలా కాలం దుఃఖించాడు.


ఇంకా ఉంది.....



మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.





రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page