కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Maithri Bandham' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
శ్రీమద్రామాయణం లో అత్యంత కీలక ఘట్టం.రమణీయము.కమనీయము.ఎంతో
హృద్యంగా ఉంటుంది.హనుమంతులవారు ప్రవేశించే ఘట్టం. ఈయన రాకతో కథ మొత్తము ఒక కీలక మలుపు తిరుగుతుంది.
ఈ కథను ప్రముఖ కవి, రచయిత అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించారు . ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం
" పంపాసరస్సు తామరలతోనూ , కలువలతోనూ నిండి యుండెను.అట్టి సరస్సును రాముడు చూడగా అతని హృదయము చలించెను.అతడు దుఃఖిం
చెను.
' లక్ష్మణా!ఈ పంపా సరస్సు ఎంత అందముగా నున్నది.ఎంత నిర్మలమై
మధురమైన నీరు, వికసించిన తామరపూలు చూచుటకెంతో ముచ్చటగా నున్నది.
చుట్టు ప్రక్కల నున్న అరణ్యమున గల వృక్షములు దట్టముగను ఎత్తుగను ఉండి
పర్వతము వలె కాన్పించుచున్నవి.అటు భరతుడు తపోవృత్తితో కష్టపడుచున్నాడు.
ఇటు సీత రావణునిచే అపహరించబడినది.ఈ రెండు దుఃఖములకు వసంతము
చేరి మరి కొంత బాధ పెట్టుచున్నది.ఆహా! ఈ వసంతఋతువు ఎంత చక్కగా
నున్నది.దారములు లేని దండలవలె పూలచెట్లు పుష్పధారలు కురిపించుచున్నవి.
గాలికి ఊగుచున్న పుష్పవృక్షములు రాళ్ళపై రంగవల్లికలు తీర్చుచున్నవి.రాలిన
పూలతోనూ , రాలుచున్న పూలతోనూ , చెట్లకే ఉన్న పూలతోనూ మందమారుతము
మహోల్లాసముగా ఆడుకొనుచున్నది.గాలి పూలను రాల్చగా పూలనుండి రాలిన
తుమ్మెదలు పాట పాడుచున్నవి.కోకిల సన్నాయి పాడుచున్నది.గాలికి ఊగుచూ
వృక్షములు నృత్యములు చేసుచున్నవి.వాయువు గుహలలో దూరి గొంతెత్తి పాడుచున్నది
ఆ గాలికి ఊగి చెట్లకొమ్మలు ఒక దానిని ఒకటి కలుసుకొనుచున్నవి.అందువలన చెట్లన్నియు ఒకే మాలికగా కనిపించుచున్నవి.చందన శీతలమై , సుగంధ భరిత
మైన వాయువు శ్రమను తీర్చుచున్నది.చక్కగా పుష్పించి యున్న కొండగోగుచెట్లు
పీతాంబరములై, స్వర్ణాభరణములు ధరించిన మనుష్యులవోలే నున్నవి.
' వివిధ పక్షులు నాగములు గల ఈ వసంతము లక్ష్మణా! సీత లేకుండుట చేసి
నా శోకమును ఎక్కువ చేయుచున్నది.
కోకిలపాట సింహగర్జన వలె నన్ను భయపెట్టుచున్నది.నీటి కోడి కూసి నన్ను దుఃఖిం
ప చేయుచున్నది.రంగురంగుల పిట్టలు రకరకాలుగా పాడుచూ చెట్లమీదను , తీగల
మీదను దుముకుచూ నన్ను ఏడిపించుచున్నవి.అశోక పుష్ప గుచ్ఛములు నిప్పుగను
తుమ్మెదల ఝంకారములు ఫెళఫెళ ధ్వనులుగను, చిగురుటాకులు జ్వాలలుగను
ఉన్న ఈ వసంతాగ్ని నన్ను కాల్చివేయుచున్నది.పిట్టలు మహోల్లాసముగ కూయుచూ ఒకదానినొకటి పిలుచుకొనుచు నన్ను ఉన్మాధుని చేయుచున్నవి.నా ప్రియురాలు
ఉన్న చోట గూడ వసంతము ఉన్న ఆమె సహితము నా వలె మదన పరవశురాలై
దుఃఖించును గాక!
కాని ఆమె ఉన్నచోట వసంతమున కవకాశము ముండదు.ఉన్నచో ఆమె నన్ను
విడిచి ఉండదు.ఉన్నచో ఆమె నన్ను విడిచి జీవించుట కల్ల
పరమసాధ్వియయిన సీత నన్ను విడిచి బ్రతుకలేదనుట నిశ్చయము. సీత మనసు
నా మీదను , నా మనసు సీత మీదను లగ్నమై యున్నది.
పుష్ప పరీవాహమై , చల్లనై , మెల్లనై వీచు ఈ గాలి సీతను తలచుకొనుచున్నందున
నాకు అగ్ని వలెనున్నది.
పూర్వము నాకు ఏది సుఖముగా నుండెనో అదియే నేడు దుఃఖకరముగా పరిణ
మించినది.ఆకసమున ఎగురుచు పరుషముగా కూసి సీతావియోగమును సూచిం
చిన కాకి, నేడు మట్టుమీద కూర్చొని కొంచెము శ్రావ్యముగా కూయుచు , సీతా సమా
గమము జరగునని సూచించుచున్నది.ఈ కాకియే మునుపు నాకు సీతావియోగము
కలిగించినది.ఈ కాకియే నన్నిప్పుడు సీతతో జత కలుపబోవుచున్నది.అవిగో
పరిమళ ములు వెదజల్లుచున్న తామరపూవులు పంపా సరస్సు నందంతట సూర్యబింబము
వలె మెరయుచున్నవివానిపై గుంపులు గుంపులుగా ముసురుచున్న తుమ్మెదలు చూడ ఎంతో అందముగ నున్నవి.గాలి పంపా సరస్సులో లేపు కెరటములకు తామర పూవులు ఊయల లూగుచున్నవి.ఈ తామరపూవులు చూడగా పద్మప్రియ
అయిన సీత జ్ఞాపకము వచ్చి బ్రతుకనిన రోత పుట్టుచున్నది.తామరరేకులు నాకు సీత కళ్ళను గుర్తుకు తెచ్చుచున్నవి.పరిమళభరితమైన వాయువు సీత నిట్టూర్పు
గాలి వలె నున్నది.రాగమత్తమయిన తుమ్మెద' ఇది రమ్యముగ నున్నది.ఇది రుచిగా నున్నది.ఇది చక్కగా వికసించినది ' అనుకొనుచు ప్రతి పూవుమీద వాలి వెంటనే
ఎగిరిపోవుచున్నది.చెట్లక్రింద పూవులు దట్టముగా నుండుట వలన పరుపులు
పరచినట్లు పవళించుటకు చాల బాగున్నది.అట్టి పరుపులలో కొన్ని ఎర్రనివి, కొన్ని
పచ్చనివి , కొన్ని తెల్లనివి , కొన్ని రంగు రంగులవిగా ఉన్నవి.ఇది పూలకార్తి గాన చెట్లు
పందెములు వేసుకొని ఒకదానిని మించి ఒకటి పూయుచున్నది.గంగానదికి కూడ
ఇట్టి సౌందర్య మున్న, దాని గుణము లింకను రానించును.
లక్ష్మణా! సాధ్వియైన సీత కనిపించినచో, నేను అడవిలో నివసించినను నాకు
అయోధ్య కాని ఇంద్ర పదవి కాని అక్కరలేదు.
సీతను చూచిన నాకు సుఖము కలుగును.నాతో గూడి ఇక్కడ సీత సహితము చల్లని గాలిని అనుభవించిన నేను బ్రతుకుదును.సీత నన్ను వీడి ఎట్లు జీవించ
గలదు? సీత ఏదని జనకమహారాజు నన్నడిగిన నే నేమని చెప్పగలను? అడవు
లకు వచ్చినను నన్ను వీడజాలక నా వెంట వచ్చిన సీత ఏది? సీత మధురముగా
మాట్లాడిన ఎంత దుఃఖమునైనను నేను భరించగలను." కోడలు ఏది? అని నా
తల్లి అడిగిన ఏమని చెప్పగలను? లక్ష్మణా! భరతుడు భ్రాతృవత్సలుడు.నీవు అతని వద్దకు వెళ్ళిపొమ్ము.నేను సీతను బాసి జీవించలేను.
' కనిపించని సీతయు, కనిపించుచున్న ఈ వసంత ఋతువును నా దుఃఖమును
పెంచుచున్నవి.'
రాముని దుఃఖమును చూచి లక్ష్మణుడు " అన్నయ్యా! దుఃఖమును అణచు
కొనుము.నీకు శుభము కలుగుట తథ్యము.నిర్మల హృదయుడవైన నీవంటి వారికి
బుద్ది మందగించదు.అతి స్నేహము వలన తడసిన వత్తి కూడా మండును.( స్నేహ
మునకు మిత్రత్వము, నూనె రెండు అర్థములు).కాన సీతపై మునుపటి యంత స్నేహము పెట్టుకొనకుము.రావణుడు పాతాళమున దాగినను జీవించడు.వాని జాడ
తెలిసిన నాడు వాడు సీతనైనను మన కప్పగించవలెను.లేదా ప్రాణముల నైనను
విడువవలయును.కాన దైన్యము విడువుము.
ధైర్యము విడిచి ప్రయత్నమును మానుకున్న వాడేదియును సాధించలేడు.ఉత్సాహ
మే బలము.ఉత్సాహమున కన్న లోకమున మరొక బలము లేదు.ఉత్సాహవంతు
నకు అసాధ్యమైన దేదియును లేదు.ఉత్సాహము కల వారికి అపజయము కలుగదు.
ఉత్సాహమున్న సీత మనకు తప్పక లభించును.నీవు దుఃఖము విడువుము.
మన్మధార్తిని వీడుము.నీవు మహాత్ముడవు.కృతాత్ముడవు.నీ వది మరచిపోవు
చున్నావు' అని ఓదార్చి ధైర్యము చెప్పెను.
-------------------
అప్పుడు ాముడు ధైర్యము వహించెను.వెంటనే రామ లక్ష్మణులు పంపాసరస్సు
ను విడిచి బయలుదేరిరి.వారు గుట్టలు, పుట్టలు , గట్లు దాటి ఋష్యమూక పర్వత
మును సమీపించిరి.ఆ పర్వతమున నివసించుచున్న సుగ్రీవుడు వారిని చూచి
భయభ్రాంతుడయ్యెను.వారు వాలి పంపున వచ్చుచున్నారని అతడు కంపించెను.
రామ లక్ష్మణులు సుగ్రీవునకు మహావీరుల వలె కనిపించిరి.వారిని చూడగా అతనికి సందేహము కలిగెను.తన
అనుచరులతోలతో కష్టసుఖము లాలోచించి " నారబట్టలు కట్టి మారువేషమున
వాలి పంపుననే వీరు ఇక్కడికి వచ్చి తిరుగుచున్నా రని నిశ్చయించి అనుచరులతో
కూడ వెంటనే మరొక పర్వత శిఖరాగ్రమునకు వెళ్ళిపోయెను.అనుచరులు చేతులు
దోయిలించుకుని చుట్టు చేరగ సుగ్రీవుడు మధ్యన కూర్చొనెను.
హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి.అత డిదంతయూ చూచి సుగ్రీవునితో "రాజా
నీ వీ పర్వతముపై ఉన్నంతవరకు నీకు వాలి వలన భయము లేదు.చక్కగా ఆలో
చించలేక నీ విట్లు భయపడుచున్నావు.ఇందువలన నీ వానర బుద్ధి మాత్రమే స్పష్ట
మైనది." అనెను.అందుకు సుగ్రీవుడు " ఆ వచ్చినవారు ఆజానుబాహులు.శరచాప
ములు ధరించి యున్నారు.దేవకుమారుల వలెను ఉన్నారు.వారు నారచీరలు ధరించి
యుండుటను చూడ , వారు మారువేషములలో నున్నారని స్పష్టమగుచున్నది.వాలి
రాజ కార్యములలో మహా ప్రజ్ఞావంతుడు.రాజులు అనేక రకముల ఉపాయములతో శత్రువును సంహరించ చూతురు.కాన నీవు ప్రాకృత వేషమున వెళ్ళి వారి సంగతి
తెలుసుకొని రమ్ము.వారు సన్మనస్కులయిన మంచి మాటలతో వారు ఇచ్చట కేల
వచ్చిరో నా పక్షమున అడుగుము" అని చెప్పెను.
అది విని హనుమంతుడు బిక్షుక రూపము ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి వారిని యధోచితముగ పూజించి ఇట్లనెను.
" మీ రెవరు? మీరు రాజర్షుల వలెను ఉన్నారు.మీ శరీరముల స్వర్ణచ్ఛాయ ఈ ప్రాంతమున కెంతయో శోభ నిచ్చుచున్నది.మీరు రాజ్యపాలన చేయదగిన రాజ
కుమారుల వలె నున్నారు.అట్టి వారు జటావల్కల ధారులై అరణ్యమున కేల వచ్చితిరి?
మీ చాపములు ఇంద్రధనుస్సుల వలెను,మీ శరీరములు పూత్కారములు చేయు సర్ప
ముల వలెను ఉన్నవి.నే నెన్ని అడిగినను మీరు ఒక్క మాట యైనను మాటాడరేమి?
సుగ్రీవుడను రాజున్నాడు.అతడు ధర్మాత్ముడు.వీరుడు.అతని అన్నయయిన వాలి తరిమివేయగా అతడీ యడవులలో సంచరించుచున్నాడు.అతని పనుపున
నేను ఇచ్చటికి వచ్చినాను.నా పేరు హనుమంతుడు.నాకు కామగమనమును, కామ
రూపమును గలవు.నా ప్రభువు మీతో స్నేహము చేయవలె ననుకొనుచున్నాడు.
అతని శ్రేయస్సు కోరియే నేను మీ వద్దకు భిక్షుక రూపమున వచ్చినాను."
అది విని రాముడు మిక్కిలి సంతోషించి లక్ష్మణునితో " మనము ఎవరి కొరకు
వెదుకుచూ వచ్చినామో అతని మంత్రి మన వద్దకు వచ్చినాడు.నీ వితనితో మాట్లాడుము.
ఇతడు చాల చక్కగా మాట్లాడుచున్నాడు.
' ఋగ్యజుస్సామవేదము లధ్యయనము చేసిన వారికి గాని ఇట్లు మాట్లాడుట
కలవి కాదు.ఇతడు పెక్కుమారులు వ్యాకరణము చదివినాడనుట నిశ్చయము.ఏలననిన ఇంతసేపు మాటలాడినను ఒక్క అపశబ్దమైనను దొర్లలేదు.'
ఇతని వధనమందును, నొసలు నందును, కనుబొమలందును తక్కిన అవ
యవములలోను ఎట్టి దోషము కనిపించుట లేదు.ఇతని మాటలందు సంశయమునకు తావు లేకున్నది.ఉదాత్తానుదాత్త స్వరములతో రమ్యమైన ఇతని వాగ్ధోరణి విన్న, నరుకుటకు కత్తి ఎత్తినవాడును ముగ్ధుడై పోవును.ఇట్టి దూతలు రాజులకెట్టి కార్యములనైనను నెరవేర్చగలరు" అనెను.
లక్ష్మణుడు హనుమంతునకు తమ కథ నంతయు వినిపించి , మృధుమధుర
వచనములతో నిట్లనెను.
" సుగ్రీవుని విషయము మా కింతకు ముందే తెలిసినది.మేము అతనిని వెదుకుటకే ఇటు వచ్చినాము.ఇతడు మా అన్న రాముడు.వీరుడు.ధర్మజ్ఞుడు.కృతజ్ఞుడు.తేజ
శ్శాలి.
ఈయన పూర్వము నానా విధముల దానములు చేసెను.గొప్పకీర్తి బడసెను
ఒకప్పుడు లోకనాథు డయినాడు.నేడు సుగ్రీవునని తన నాథుడిగా కోరుచున్నాడు.
ఇతని తండ్రి పూర్వము ధర్మవత్సలుడై శరణార్థులను రక్షించువాడని పేరు
గన్నాడు.నేడు సుగ్రీవునని శరణు పొందుచున్నాడు.
మున్ను సర్వలోక శరణ్యుడు.రక్షకుడు.నాకు అన్న యగు ఈ రాముడు సుగ్రీవుని
శరణుపొందుచున్నాడు.
ఆ మాటలు చెప్పునప్పుడు లక్ష్మణుని కండ్లు చెమ్మగిల్లెను.డగ్గు త్తికపడెను.అది గుర్తించిన హనుమంతుడు నిజరూపము ధరించి,"వాలి సుగ్రీవుని భార్యను, రాజ్య
మును హరించినాడు.అంతతో ఆగక తమ్ముని అడవులకు తరిమినాడు.అతని
భార్యను చెరబట్టినాడు.కాన సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మీకు తప్పక సహాయము
చేయగలడు." అని రామలక్ష్మణులను భుజములపై ఎక్కించుకొని గంతులు వేయుచు
సుగ్రీవుని వద్దకు చేరెను.
హనుమంతుడు సుగ్రీవునకు రామలక్ష్మణులను పరిచయము చేసి " మహాప్రాజ్ఞు
డైన రాముడు , అతని సోదరుడు లక్ష్మణుడు ఇదే విచ్చేసియున్నారు.ఈ రాముడు తన భార్య సీతకొరకు నిన్ను శరణు కోరినాడు.వీ రిద్దరునూ పూజ నీయులు.నీ సఖ్యము కోరి వచ్చిన వీరిద్దరినీ ఆదరించి పూజించుము" అని చెప్పెను.
అది విని సుగ్రీవుడు " మీరు ధర్మపరులు.సర్వభూతహితులు.నాతో స్నేహము కోరు
చున్నా రనిన నన్ను గొప్పగా సత్కరించినట్లు భావించుచున్నాను.నా మైత్రిని కోరుట
వలన నాకు గొప్ప లాభమును చేసిన వారు అయినారు.ఇదిగో నా చేయి చాచితిని.
దానిని పుచ్చుకొని అనులంఘ్యమైన ఒక శాశ్వత బంధము నేర్పాటు చేయుడు" అని చేయు చాచెను.రాముడానందమున సుగ్రీవుని చేతిని గట్టిగా పట్టుకుని కౌగలించు
కొనెను.అప్పుడు హనుమంతుడు ఎండు పుల్లలు ఏరి తెచ్చి , కఱ్ఱ కఱ్ఱ ను రాచి నిప్పు చేసెను.రాముడు , సుగ్రీవుడు మండుచున్న ఆ అగ్ని చుట్టు తిరిగి అగ్నిసాక్షిగా
స్నేహము చేసికొనిరి.
సుగ్రీవుడు రాముని చూచి సంతుష్టుడై ' నీవు నాకు స్నేహితుడవైతివి.ఇక నీ
దుఃఖము నా దుఃఖమును ఒకటియే.నీ సుఖమును నా సుఖమును ఒకటియే అనెను.
తరువాత విరగబూసిన మద్దిచెట్టు కొమ్మ విరిచి రాముని దానిమీద ఆసీనుని
చేసెను.హనుమంతుడు మంచి గంధపు చెక్క తెచ్చి లక్ష్మణునకు ఆసనమొనర్చెను.
అప్పుడు సుగ్రీవుడు " రామా! నా కిప్పుడు చాల ఆనందంగా నున్నది.నా అన్నయైన
వాలి నా భార్య నపహరించి నన్ను వంచించినాడు.అతనికి భయపడి నేనీ పర్వ
తము మీద నివసించుచున్నాను.
' రామా! ఆ వాలి భయము నన్ను పీడించుచున్నది.నాకు అభయ నొసగి ఆ భయము లేకుండు నట్లు గావింపుము' అనెను.
అప్పుడు రాముడు ' మిత్రులకు ఉపకారము చేయుట ధర్మమని నాకు
తెలియును కాబట్టి నీ భార్య నపహరించిన వాలిని వధింతును." అనెను.
' సుగ్రీవునకు రామునకు స్నేహ మైనప్పుడు , కలువ వంటి సీత ఎడమ కన్ను, బంగారు రంగు గల వాలి ఎడమ కన్ను, నిప్పు వంటి రావణుని ఎడమ కన్ను గూడ
అదిరినవి.
" ఒకే రకమైన ఈకలుగల పక్షులు ఒకే చోట గూడును( Birds of same feath-
ers gather together) . ఇది ఒక ఆంగ్ల సామెత.
రాముడును, సుగ్రీవుడును ఒకే సమస్య గలవారు. కొద్దిగా అంతరమున్న ఉండ
వచ్చును.ఇద్దరకును రాజ్యము పోయినది. ఒకరి రాజ్యమును అన్న లాక్కున్నాడు.
ఒకరు తమ్మునకు స్వచ్ఛంధంగా నిచ్చినారు. ఇద్దరి భార్యలు అపహరించబడినారు.
ఒకరి భార్యను అన్న అపహరించినాడు. ఒకరి భార్యను పరుడు అపహరించినాడు.
ఇట్లు కొద్ది భేదములతో ఉభయులకును ఒకే విధమైన సమస్యలు కలవు. అంతియు కాక రాముని సహాయము లేనిది సుగ్రీవునకు విముక్తి లేదు. సుగ్రీవుని సహాయము లేక రాముడు సీతను సాధించలేడు. పరస్పర సహకారము వలన ఉభయుల కార్యములు గట్టెక్కును .
" అట్లే దేశకాలములు సహితము స్నేహమునకు కారణము లగుచున్నవి".
-------------------శుభంభూయాత్---------------------------------------
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Comments