top of page

భళి భళిరా భట్టుమూర్తి


'Bhali Bhalira Bhattumurthi' written by Ayyala Somayajula Subramanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

ఒకనాడు ఒక భట్టరాజు పది రెండేళ్ల వాడయిన తన కుమారుని వెంట బెట్టుకుని తిమ్మరుసు మహామంత్రీశ్వరుని దర్శనమునకు వచ్చి తమ రాకను గూర్చి నివేదించుకొనుచున్నారు.

" అయ్యా! మాది భట్టుపల్లె యను గ్రామము. నా పేరు ప్రభంధాంకము సూరపరాజు. నేనేదో కావ్యములవీ చదువుకొన్నాను. కవిత్వము గూడ కొలదిగా వ్రాయగలను. ఆయా గ్రామములలో పురాణములు చెప్పుచుందును. ఇతడు నా ఏకైక పుత్రుడు.పేరు భట్టుమూర్తి. నా వద్దనే తెలుగు చదువుకొనినాడు. అంతో యింతో కవిత్వము వ్రాయగలడు. సంగీతము చక్కగా పాడగలడు. నిరుపేదలమయినందున ప్రభు దర్శనము ఇప్పించగలరని వచ్చినాము. తాము దయచూపి రాయలవారి దర్శనము చేయించిన యొడల , పిల్లవాడు వారి యనుగ్రహము చేత తన సంగీత, సాహిత్యములను వృధ్ది చేసుకొనగలడు. తాము మా యందు కరుణ చూపి ప్రభుదర్శన మిప్పించగలరని ప్రార్థించుచున్నాము”.

తిమ్మరుసు మహామంత్రి మంచివాడే! సాహిత్యాభిమానియే. అభిమాని యేమి! సంస్కృతాంధ్రములయందసామాన్య పాండిత్యము గలవాడు. అగస్త్య కృతమగు సంస్కత బాల భారతమునకు " మనోహర" మను పేరుగల వ్యాఖ్యానము వ్రాసి, సాహిత్య నిర్మాతల శ్రేణిలో చేరినవాడు. అష్ట దిగ్గజములతో విలసిల్లు రాయలవారి భువన విజయము నడుపు ధీశాలి గదా యతడు! ఆనాడతని బుద్ధి రాజకీయాలోచనలతో వ్యాకులమై యున్నది. ఆ పితాపుత్రులు వచ్చిన దుర్ముహూర్తమెట్టిదో గాని, వారిపై తిమ్మరుసునకు ఆగ్రహము కలిగినది.

ఆతడిట్లనినాడు. "రాయలవారు కవులను పోషించుచున్నారని ప్రతివారికిని , నేడిది యొక ఆటయైనది. నేడందరును కవులే. ఏ మహాకవినో ఆశ్రయించి రెండు పద్యములు వ్రాయించుకొని వచ్చుట, అవి రాజుగారికి వినిపించుట, బహుమానములు పొందుట, మేము రాజబహూకృతులమని డప్పు వాయించుకొనుట, నేడు నాలుగు అక్షరములు నేర్చిన ప్రతివానికిని పరిపాటయింది. రాజదర్శనమట.. రాజదర్శనము! మాకు రాజ్యకార్యములు చూచుకొను వనిపాటలేమియు లేవన్నమాట. మీ వంటివారిని

సమ్రాట్టుల వద్దకు కొంపోవుటకే మేమీ మంత్రిపదవి నదిష్టించి యున్నామన్న మాట! పో ! పొండు! ప్రభు దర్శనము లేదు! గిభు దర్శనము లేదు !”

మొదట తిమ్మరుసు కూడ నిరుపేదయే. వారిది గుత్తి దుర్గము. అక్కడ ఆయన తల్లి నాగమ్మ, భర్త చనిపోయిన పిమ్మట విస్తళ్ళు కుట్టుకుని జీవించుచు, తన బిడ్డలను పోషించుకొన్నది. అటునుండి చంద్రగిరికి వచ్చి వారములు చెప్పుకొని తినుచు, తిమ్మరుసయ్య చదువుకొనినాడు. తరువాత పెనుగొండలోని యొక సత్రమున భుజించుచు విద్యలు నేర్చినాడు. ఆయా దుర్గాధిపతుల ప్రాపు వలన వృద్ధినందినాడు.

పిమ్మట సాళవనరసింహరాయల కడ ప్రధానమంత్రిగ నున్న చిట్టి గంగనామాత్యుని యండదండలు సంపాదించుకొని యుద్యోగములో చేరెను. అటు పిమ్మట తుళువ నరసింహరాయలు, వీరనరసింహరాయలు అనుగ్రహమునకు పాత్రుడై కృష్ణరాయల నాటికాయన చెంత, సర్వ శిరఃప్రధాని పదము నలంకరించినాడు. రాయల వారి నాశ్రయించి నప్పటినుండి ఆయన దశ ఎత్తుకొన్నది. ఆయనయే కాదు. రాయల నాశ్రయించిన యెవ్వరు కాని అసాధారణైశ్వర్యములతో తులతూగవలసినదే! పెద్దనాదులేమి! టెంకణాదులేమి. శిల్పులేమి. తక్కుంగల కళారాధకులేమి. ఇందుకు నిదర్శనము. అందుకనియే ప్రతివారును రాయలవారి దర్శనమును, వారి ఆశ్రయమును సంపాదింప నువ్విళూరుచుందురు.

నేడు సూరపరాజు ఆ యుద్దేశముతోనే వచ్చినాడు. సూరపరాజు వచ్చునప్పుడు, దారిలో కుమారునికి తిమ్మరుసు గారి చిన్నప్పటి వృత్తాంతమంతయూ చెప్పినాడు. కడు

బీదరికము నుండి ఆయన పైకి వచ్చినాడనియు , అట్లే నీవును ఉన్నతోన్నతస్థానమును పొందవలయుననియు కుమారునికి బోధించినాడు. కష్టముల నెదుర్కొనుచు గట్టెక్కిన తిమ్మరుసయ్య, కష్టములోనున్న తమకు సాయపడతాడని ఆ తండ్రీకొడుకులు తలంచినారు. చివరకు కథ అడ్డం తిరిగినది. ఈ సంఘటనము కుర్రవాడగు భట్టుమూర్తికి ఆగ్రహమొనరించినది. ఆశుకవిత్వంతో తిమ్మరుసు చిన్ననాటి కడగండ్లను గూర్చి ఎత్తి పొడిచినాడు.

" గుత్తిం బుల్లెలు కుట్టి, చంద్రగిరిలో కూడెత్తి, పెన్గొండలో

హత్తిన్సతమునందు వేడి , బలు దుర్గాధీశు తాంబూలం

దిత్తుల్‌ మోసి సదస్థులైన ఘనులన్‌ దీవింప.."

పద్యమింతవరకు వచ్చునప్పటికి తిమ్మరుసు ఆశ్చర్యచకితుడైనాడు. ఈ భట్టు పిల్లవానికి తన చిన్ననాటి చరిత్ర మెట్లు తెలియునని ఆశ్చర్యపడినాడు. పద్యములో నున్నదంతయూ తన కథయే! అతడు వేగిరపడినాడు.

బాబూ తిట్టకుము. మీరు కోరినట్లు ప్రభుదర్శనము చేయింతుము. మీ పిల్లవానికి సంగీతము కూడ వచ్చునంటిరి కదా! సంగీత సాహిత్యములన్న రాయలవారు మిక్కిలిగా ప్రేమింతురు. - అని బుజ్జగింపబూనుకొనెను.

అప్పుడానందముతో భట్టుమూర్తి మిగిలిన పద్యభాగమునిట్లు పూరించినాడు.

.. దీవించెదన్‌ మత్తారాత్యభియాతి నాగమసుతున్‌ మంత్రీశ్వరున్‌ దిమ్మరుసునకున్‌ ."

పిల్లవాని దుడుకుతనమునకు సూరపరాజు చాలా బాధ పడుచుండెను. తిమ్మరుసయ్య , రాయల వారితో చెప్పి తమకెట్టి శిక్ష వేయించునోయని యాతడు కలతపడుచుండెను. కాని చివరకు తిమ్మరుసు కొండ దిగివచ్చుట, కుమారుడు పద్యమును సుఖాంతము చేయుట, సూరపరాజునకు సంతోషము గూర్చినవి. అంతట భట్టుమూర్తి తిమ్మరుసునింకను ప్రశాంత చిత్తుని చేయదలచి ఇట్లు పొగడినాడు.

" అయ్య యనిపించుకొంటివి

నెయ్యంబున గృష్ణరాయ నృపకుంజరుచే,

అయ్యా, నీ సరి యేరీ ।

తియ్యని విలుకాడవయ్య , తిమ్మరుసయ్యా !"

ఈ పద్యమును వినునప్పటికి తిమ్మరుసు పొందిన యానంద మింతయని వర్ణింపలేము. ఆ కాలము వారికి పొగడు పద్యములు చెఫించుకొను నుత్సాహమెక్కుడు.

కవులు గూడ పొగడ్తల చేతను ,అవసరమైనచో తెగడ్తల చేతను తమ పనులను నెరవేర్చు కొనుచుండెడివారు.

భట్టుమూర్తి సంస్కృతాంధ్రములలో గొప్ప పండితుడును, కవియును కావలయునని సూరపరాజు ఉద్దేశ్యము. ఆయన అల్లసాని పెద్దన నాశ్రయించి తన కుమారునికి సంస్కృతమును బోధింపవలయునని ప్రార్థించెను. అందులకా ఆంధ్రకవితా పితామహుడు సంతోషముగా నంగీకరించెను

***

కొన్నిరోజులు గడిచిన పిమ్మట ఒకనాటి భువనవిజయ ఆస్థానమున ముమ్మురముగా కవితా గోష్టులు జరుగుచుండెను. సమయము చూసుకొని తిమ్మరుసు మంత్రి ' నేనొక విద్యార్థిని తీసుకొని వచ్చితిననియు, అతడు సంగీతము బాగుగా పాడగలడనియు ,

ప్రభువు నాతని గాన ప్రభందమును వినగోరుచున్నాన'నియు కోరెను. రాయల వారందు కంగీకరించిరి. ఆ పిల్లవాడు సూరపరాజు కొడుకు భట్టుమూర్తియే. అతడు రాళ్లురుగునట్లు తన అశిక్షిత సంగీతము చేత సభను మోహింప జేసెను. సభలోనున్నరామరాజు దృష్టి ఆ బాలకునిపై బడినది. రామరాజు సహజముగా సంగీత ప్రియుడు. గానమన్న అతడు చెవులు కోసికొనును. భట్టుమూర్తికి సంగీతములో శిక్షణ మిప్పించిన, అతడెంతగానో రాణించునని తలంచి వానిని తన తోడనే తోడుకొనిపోయెను.

***

భట్టుమూర్తి సంస్కృత విద్యాభ్యాసము చాలావరకు వచ్చినది. ఆతడు కావ్యనాటకాలంకార సాహిత్య మర్మములను క్షుణ్ణముగా నేర్చినాడు. సంగీతశాస్త్రమును ఆనాడా శాస్త్రమును భీష్మునివంటివాడైన కృష్ణ గాయకులవద్దనే అభ్యసించినాడు. కృష్ణగాయ

కుడెంతటి వృద్ధుడైనను, యోగ్యులగు శిష్యులు దొరికినచో విద్యాదానము చేయకూరకుండెడివాడు కాడు. రాకుమారులనియు, సామాన్యులనియు తేడా లేకుండా అందరికీ వాత్సల్యముతో విద్యాదానము చేయుచుండెను. సాధారణముగా కవులగువారికి సంగీతవాసన యుండదు. సంగీత సాహిత్య సరస్వతులగువారు అరుదుగా నుందురు. కొందరు కవులు పద్యము చదువుచున్నచో అది పద్యమో, గద్యమో వినువారికి బోధపడదు. మరికొందరకు సంగీతము రాకున్నను పద్యమును చెవులకింపైన రీతిలో చదివి వినువారికి విందులు చేయగలరు. పఠన మాత్రముననే శ్రోతల హృదయము నాటుకొనగల పాఠకులెందరు లేరు? భట్టుమూర్తి పూర్వజన్మ సుకృత మెట్టిదోగాని, అతనికి శాస్త్రీయ సంగీతము పట్టుబడినది. ఆతడందరి

మన్ననల నందుట కదియునొక కారణమైనది.

సంస్కృతము నేర్చుకున్నప్పటి నుండి భట్టుమూర్తి శ్లేష కవిత్వమున ప్రావీణ్యత సంపాదించుటయే గాక అసామాన్యుడైనాడు. గీర్వాణవాణి గాంభీర్యముచే హొయలు

వొలకబోయు చిన్నారి వలె యున్నది. శత లేఖిని పద్య సందానము ,ఆశు కవితలు చెప్పుట, ఏదేని ఒక ఇతివృత్తము నిచ్చి కావ్యమల్లుమన్నచో ఒక్క గడియ కాలము

లోనే ఒక ప్రభంధము నాతడల్లగలడు. ఇవన్నీ గురువుల వద్ద నేర్చినవి కావు. పెద్దన లాంటివారు యేవో నాలుగు సంస్కృతపు ముక్కలు మాత్రమే నేర్పిరి. జన్మసిద్ధ ప్రతిభయే కారణము. తెలుగుసొగసుల తెలివి తండ్రి పెట్టిన భిక్ష.

***

ఒకనాడు పెద్దన యింటికి నంది తిమ్మనయు, రుద్రకవియు వచ్చుట సంభవించినది. ఇద్దరును అనుకోకుండగనే ఒకే సమయమున విచ్చేసినారు. భట్టుమూర్తి యేదో వ్రాసుకొనుచుండెను.పెద్దనతోబాటు తిమ్మన, రుద్రకవులు కొంతసేపు భట్టుమూర్తి ప్రతిభా విశేషములను గూర్చి ముచ్చటించుకొనుచున్నారు. ఇంతలో తిమ్మన - " నాయనా,

భట్టుమూర్తీ! నీవు కవిత్వములో అనేక ప్రక్రియలను సాధించుచున్నావుగదా। అవధానమని గూడ ఒక ప్రక్రియ నారంభించినావట. వ్యస్తాక్ఛరిని సాధించుచున్నట్లును వింటిని. నేను కొన్ని పదముల నిత్తును. వాని నొక పద్యములో నిమిడ్చి చెప్పగలవా! అట్లు చెప్పిన దానిని 'దత్తపది' యందురు అనెను. అందుకు భట్టుమూర్తి

"పెద్దల దయ యున్నచో యత్నించి చూతు" ననినాడు. తిమ్మన " నాయనా! సారంగము, గంధఫలి, నాస, పుంజము- ఈ నాలుగు మాటలను నాలుగు పాదము

లలో నిమిడ్చి నీ యిష్టము వచ్చిన వృత్తములో స్త్రీ నాసికా వర్ణనము వర్ణింపుము.

గంధఫలి యన్నచో సంపంగి మొగ్గ యని యర్థము. ఇది మారుమూల పదమని యెంచి నీ కర్థము చెప్పినాము. మేము రెండు గడియల కాలం యేదో ముచ్చటించు కొనుచుందుము. ఈ లోపల నీవేకాంత ప్రదేశమున కేగి పద్యమును వ్రాసి మాకు చూపుము" అని కోరినారు. భట్టుమూర్తి - "ఏకాంత ప్రదేశమునకు పోనేల? ఇక్కడనే కూర్చుండి పద్యమును వ్రాసి పెద్దలకు చూపుదును. తాము నన్ను వ్యస్తాక్షరి గూడ పరీక్షింపుడు.పెద్దలైన తమవంటి వారి పరీక్షలో నెగ్గుట నాకు శ్రేయమే" అనెను.

వ్యస్తాక్షరి యన- కవి, కవిత్వము వ్రాయునప్పుడు ఒక పృచ్ఛకుడు ఆతని యాలోచనమును భంగపరుచును. ఒక పద్య పాదమునుగానీ , లేక యేదో యొక వాక్యమును గానీ అందలి యక్షరములకు క్రమసంఖ్యను చేర్చి ఆ సంఖ్య తారుమారొనర్చి ఈ సంఖ్యగల యక్షర మిదియని నడుమ నడుమ కవికి వినిపించును. చివరికా కవి

తన కవితతో బాటు వ్యస్తముగా నిచ్చిన యక్షరముల నన్నింటిని క్రమపరచుకొని పృచ్ఛకునికి వినిపించవలయును. అందుకనియే దానికి వ్యస్తాక్షరి యని పేరు కలిగినది. అవధాన విద్యలో నిదియొక అంశము.

తిమ్మన యీ వ్యస్తాక్షరిని రుద్రకవి నిమ్మని కోరినాడు. రుద్రకవి ఒక పద్య పాదపుటక్షరములకు అంకెలు వేసి వానిని వ్యత్యస్తము చేసి యిచ్చుచున్నాడు. ఆ కవిత్రయమచ్చట తమ సంభాషణ కొనసాగించుచున్నారు. భట్టుమూర్తి యేకాగ్రతను భంగముచేయు తలంపుతో కొంచెము పెద్దగనే మాట్లాడుకొనుచున్నారు. ఒక ఘడియ కాలము గడుచునప్పటికి భట్టుమూర్తి నాసికా వర్ణనము పూర్తి చేసి వినిపించినాడు.

"నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే

లా నన్నొల్లదటంచు గంధ ఫలి బల్కానల్ తపం బొంది యో

షా నాసాకృతి బూనె సర్వ సుమన సౌరభ్య సంవాసియై

బూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్

సంపంగి మొగ్గను ఆడువారి ముక్కునకు ఉపమానము గా చెప్పుచుందురు. తుమ్మెదలకు చంపకముల తావి తలనొప్పి కలిగించును. అందుకని తుమ్మెదలన్ని పుష్పములలోని తేనియలను ద్రావునే కాని, సంపంగి జోలికి రావు. చంపకమునకు తుమ్మెద తన్ను ముట్టదేయన్న కొరత యున్నది. ఆ సంపంగి మొగ్గ తపమొనరించి

ఆడువారి ముక్కుగా అవతార మెత్తినది. ఇక చూపులనెడి తుమ్మెదలు ఆ సంపంగి కిరువంకల జేరి కొలువు చేయుచున్నవి. సంపంగి తపము చేసి ముక్కయి తన కొరత

దీర్చుకొన్నదన్నమాట. కవులు ఆడవారి చూపులను తుమ్మెదలతో పోల్చుచుందురు. ఈ పద్యమును తిమ్మన కోరినట్లు, నాలుగు పాదములలో వరుసగా సారంగము,

గంధఫలి, నాస,పుంజము - అను పదములు గూడ వచ్చినవి.

భట్టుమూర్తి ఆ కవిత్రయమును తన ప్రతిభచే నీ విధముగా అలరించినాడు.పెద్దన, పద్య సౌందర్యమునకు మెచ్చుకొని మా తిమ్మన గారెంతటి పద్యమును వ్రాయించినారనుచు " ముక్కుపై చక్కని పద్యమును వ్రాయించినావు గాన , నేటి నుండియు నీవు నంది తిమ్మనవు గావు, ' ముక్కు తిమ్మనవయ్యా' అని తిమ్మనను ప్రశంసించెను.

" భట్టుమూర్తీ! ఈ పద్యమున కిట్లు సార్థకత యేమున్నది? దీనినే కావ్యము లోనైనను స్త్రీ వర్ణన సందర్భమున నుపయోగించుకొన్నచో కలకాలముండును! అనికూడ భట్టుమూర్తికి సూచించెను.

***

ప్రభందాంకము సూరపరాజు అచ్యుత దేవరాయల భువన విజయమున ఆస్థాన పండితుడైనాడు. అతడు కవియును , పండితుడును, పౌరాణికుడును అయినందున సభనద్భుతంగా రంజింపజేయుచున్నాడు. తండ్రితో బాటు భట్టుమూర్తి గూడ భువనవిజయమునకు రాకపోకలు చేయు వీలు కలిగినది.

***

రామరాయలు పట్టాభిషేక మహోత్సవమున, కవులు ఉచితాసనముల నలంకరించియున్నారు. వేంకటరాయ భూషణ బిరుదాంకితుడైన ప్రబంధాంకము సూరపరాజు ఒక ఉచితాసనమున ఆసీనుడయ్యెను.

వంధి మాగదులు కైవారము చేయుచున్నారు. అంతట రామరాజు " భట్టుమూర్తి కవీంద్రులు తమ కవితామృతమును వర్షించి శ్రోతల నానందింప జేయ గోరుచున్నాము" అనినాడు. భట్టుమూర్తి సంగీతము జాలువార నిట్లు చదివినాడు..

" పట్టాభిషేక విపర్యయంబున బ్రోలు

వెడలి ప్రియానుజుల్‌ వెంట రాగ

జిత్రకూటాభిఖ్య జెలగు పెన్గొండ, సాం

ద్ర హరి ద్విపేంద్ర నాదవని జేరి,

ఖల జనస్థానవాసుల బల్వుర వధించి

మహి ను సలక ఖర స్మయ మడంచి ,

హరి వీర భట మహోద్ధతి నబ్ధి గంపింప

దురమున గడిసి తద్థ్రోహి దునిమి,

అనఘతర పార్థివేందిర నధిగమించి,

సాధు కర్ణాట విభవ సంస్థాపనంబు

పూని శరణాగతుల నెల్ల బ్రోచె రాము

డతడు నిజచరతంబు రామాయణముగ! "

భట్టుమూర్తి యీ పద్యమును శ్రీరామచంద్రునికిని , రామరాజునకును పోలిక పెట్టి ద్రోహియైన సలకము తిమ్మరాజును రావణునిగా పోల్చి తద్విజయముచే తన చరిత్రమును రామాయణము చేసి కొన్నట్లు వర్ణించి నాడు.

పిమ్మట రామరాజు సభలో భట్టుమూర్తి గురించి ప్రశంసలు కురిపించిరి. " వేంకటరాయభూషణ పుత్రుడు భట్టుమూర్తి మహా కవీశ్వరుడు. ఈయన వయసున చిన్నయైనను , పాండిత్య కవిత్వములందు పెద్దయే! విశేషించి సరస సంగీత చాతురి ఈయనను వరించినది. ఈయనను " సంగీత కళారహస్యనిధి" గా మేము గుర్తించుచున్నాము. ఈయన మమ్ము వర్ణించుచు చదివిన పద్యములు సభ్యులు వినియే యున్నారు గదా! నా పేర ' రామాభ్యుదయము' యను కావ్యమునే రచించెను. శ్లేషనెంత చమత్కారముగను, సులభముగను భట్టుమూర్తి నిర్వహింపగలడో ఈ పద్యము వ్యక్తీకరించుచున్నది. ఈతడు మునుముందు మహా కావ్యములు వ్రాసి గణుతి కెక్కగలడని మా యాశయము.ఈ కవి చంద్రుని మా సభకు భూషణుడుగా

నెంచి " రామరాజభూషణ" బిరుదము నిచ్చి గౌరవించుచున్నాము.”

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


242 views0 comments

Comments


bottom of page