top of page
Original.png

చార్ ధాం యాత్ర - పార్ట్ 5

#CharDhamYathra, #చార్ధాంయాత్ర, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

                                  

Char Dham Yathra - Part 5 - New Telugu Story Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 08/12/2025

చార్ ధాం యాత్ర - పార్ట్ 5 - తెలుగు కథ

రచన: పుల్లేటికుర్తి నగేష్ 



ఏడుకొండలవాడా!!!

వెంకట రమణా!!! గోవిందా!!! గోవిందా!!!


ఆపద మ్రొక్కులవాడా.. అనాధ రక్షకా.. రక్షించు స్వామి!


ఇవీ నా ఆర్తనాదాలు, క్రిందకి దిగుతున్నప్పుడు. 


పైకి ఎక్కడం కష్టమనుకుంటే, దిగడం దానికి మించిన యుద్ధం. 


 గుర్రం ఒక్కొక్క మెట్టు దిగుతుంటే, దేవుడు కళ్ల ముందు కదలాడుతున్నాడు. శరీరాన్ని వెనక్కి వంచి, కాళ్ళని ముందుకు తన్ని పెట్టి, గుండెలు అదుముకుని కూర్చున్నా.. 


ఎక్కడ స్లిప్ అయిపోతామో, పడితే పరలోక టికెట్ కన్ఫర్మ్ అనే భయం మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 


 ఎక్కేవాళ్లూ, దిగేవాళ్లూ – అందరి పరిస్థితి ఇంచుమించు సమానంగానే ఉన్నారు. కొంచెం ఎక్కువ సమానం, కొంచెం తక్కువ సమానం.. అంతే తేడా. 


గుర్రాలు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ, మా భయాలను రెట్టింపు చేస్తున్నాయి. పరిస్థితి దయనీయం. వీళ్లు మాట్లాడుకున్నప్పుడు, ఒక్కో గుర్రానికి ఒక్కడు వస్తామని వాగ్దానం చేశారు. బయలుదేరే సమయానికి మా ఆరు గుర్రాలకి ముగ్గురే! అడిగితే, “కుచ్ నహీ హోతా సాబ్” అన్నాడు నిదానంగా పాన్ పరాగ్ చింపుకుంటూ.. 


 ఏంటి నహీ హోతా నా?? ‘హోయిన తర్వాత’ ఇంకేం వుంటాది.. నా శ్రాద్ధం.. వాడి పిండాకూడు.. పైగా ఊస్కో రాస్తా మాలుం హై.. ” అంటూ పెద్ద భరోసా. 


వాడు హిమాలయాల్ని ఆప్యాయంగా చూస్తూ, వాడి జననీ జన్మ భూమి కదా, పైగా “దేవ భూమి”; పాన్ పరాగ్ బుగ్గలోకి తోసుకుంటూ.. “ఆప్ ఓ సుందర్ దృశ్య్ దేఖో.. ఎంజాయ్ కరో సాబ్.. ” అంటాడు. 


 ఇక్కడ మన పరిస్థితి ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితిలో ఉందా?


 కూసాలు కదిలి పోతున్నాయి. 


ప్రకృతి దృశ్యం మాట దేవుడెరుగు, ఆత్మ అదృశ్యమవుతుందేమో? 


దారి పరలోకానికి ఫాస్ట్ ట్రాక్ లా వుంది కదరా బాబూ. బ్రతికితే బలుసాకు తిని బ్రతకొచ్చు అనిపిస్తోంది. 


శివుడు, స్వామి, దర్శనం, ఆలింగనం – ఏమీ గుర్తుకు రావడం లేదు. భయం వల్ల పుట్టిన భక్తికి గౌరవం కలిపి, కాపాడమని ఆ ఏడుకొండలవాడిని వేడుకుంటున్నాం. 


 అవునూ.. ఇక్కడ వేంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఫర్వాలేదా? 


శివుడ్ని వేడుకోవాలి కదా? 


మరి వెంకటేశ్వరుడ్ని ఎందుకు పిలుస్తున్నా?


 ఫర్వాలేదు అనుకుంటా.. 


 శివకేశవులు ఒక్కరే అంటారు కదా!


 అయినా, ఎందుకైనా మంచిది – ఓం నమః శివాయ అనుకుందాం అని ప్రారంభించాను. 


 కానీ చిన్నప్పటి నుండి మనందరికీ వేంకటేశ్వరుడే అలవాటు కాబట్టి, అప్రయత్నంగా గోవిందా.. గోవిందా.. వచ్చేస్తోంది. 


ఈయన చూసుకుంటాడులే.. అని ఆయన, ఆయన చూసుకుంటాడులే.. అని ఈయన. ఇద్దరూ వదిలేస్తే నా పరిస్థితి ఏమిటి? 


ఇంకా చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి కదా.. 


ఈ ఆలోచనలతో, చెప్పాలంటే నిజానికి భయం చాలావరకు తగ్గింది. దైవాన్ని స్మరిస్తుంటే.. భయాలూ, బాధలూ తగ్గుతాయి కదా!


 సాయిగారి గీతోపదేశం కూడా అదే కదా!! 


 దైవ నామ స్మరణ ప్రభావం మనపై, మన చుట్టూ వుంటే ప్రకృతి పై ఎంతగా చూపిస్తుందో ఈ యాత్ర మాకు నేర్పింది. 


ఎప్పుడు ప్రకృతి విపతులతో అల్లల్లాడిపోయే ఈ ప్రయాణం, మా సాయిగారి ఉపదేశం పుణ్యమా అని “సుఖం, సురక్షితం, ఈశ్వరానుగ్రహం” లా జరిగిపోతుంది. 


 సాయిగారికి మేము ఎంతో ఋణపడి వున్నాము అనిపిస్తుంది. 


ఇక్కడో చిన్న మాట.. ఈ నాలుగు ఎపిసోడ్లు చదివిన తరువాత, మా సహోద్యోగి వచ్చి, మీ టూర్ ఆపరేటర్ నెంబర్ ఇమ్మని అడిగాడు. 


నిజం చెప్పొద్దు నాకు కొంచెం కోపం వచ్చింది. 


నువ్వు అంతా చదివిన తరువాత కూడా సాయి గారిని ‘టూర్ ఆపరేటర్’ అనడం నాకు సుతారామూ నచ్చలేదు. 


మాలో అందరూ సార్ ని ఒక అన్నలా, తమ్ముడిలా, కొడుకులా ఇలా రక్త సంబందీకుడిలా ఫీల్ అయ్యాము గాని, నువ్వననట్లు మమ్మల్ని డబ్బులు తీసుకొని ఒక బిజినెస్ మాన్ లా తీసుకెళ్లారని అనుకొనలేదు. 


నా కధలో నీకు అలా ఏమైనా అనిపించిందా అని అడిగా. 


ఆఖరి రోజు ఈ టూర్ ని successful గా పూర్తి చేయించి నందుకు, ఆ దంపతులకు పాదాభివందనం కూడా చేశారు మాలో కొంత మంది, అని చెప్పే సరికి, సారీ చెప్పేశాడు లెండి. 


 మేమైతే ఇద్దరికీ శాలువాలు కప్పి మా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. 


 నా కన్నా వయసులో చిన్న వాడేమో అనే డౌట్ తో పాదాభివందనం చేయలేదు అంతే. 


 అలా మెల్లగా మూడు గంటల తరువాత బ్రేక్ ఫాస్ట్ కి ఆపారు. వేడి వేడి మాగినే మహాప్రసాదం లా తిని టి త్రాగి తిరిగి ప్రయాణం ప్రారంభం అయింది. 


ఇంకా గంటన్నర సవారి వుంది. నిన్న సాయంత్రం, పైన, కేదార్నాధ్ లో స్వంత ఊరిలో తిరిగినట్లు తిరుగుతూ భీమ శిలా దగ్గరకి వెళ్ళాము. 


ఆ భీమ శిల ని చూస్తే శివుని అమ్మ లా అనిపించింది. 


నిజం చెప్పొద్దు అంత పెద్ద వరద నుండి తన కొడుకు శివయ్యని కాపాడుకుంది అనుకుంటేనే వళ్ళు జలధరించింది. 


 శివునికి తల్లి వుంటే ఇలానే కాపాడు కుంటుంది కదా.. నీటికి, ఏటికి, వరదకి అడ్డం పడైనా సరే. 


 శివునికి మ్రొక్కినంత భక్తితో తల ఆనించి ఇద్దరము మొక్కాము. 


 వీపు ఆనించి అమ్మ వొడిలో పడుకున్నట్లు కాసేపు కళ్ళు మూసుకుని పడుకున్నాము. 


 సుజాత కూడా.. అవును ఇద్దరికీ “అమ్మ” లేదు గా.. 


 సుజాత నా చేయి పట్టుకుని ‘అమ్మ ఇలానే కాపాడేది కదా’.. అన్నట్లు కళ్ళు మూసుకుంది. 


గుడి చుట్టూ సుమారు ఒక ఇరవై మంది సన్యాసులు వున్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు గా వున్నారు. ముందు హోమ గూండాలు, నెగల్లు, విగ్రహాలు, వంటి నిండా విబుధి, జడలు కట్టిన జుత్తు, మెడ చుట్టూ కట్టలు కట్టలుగా రుద్రాక్ష మాలలు, పెద్ద సిగలు, ఎర్రగా నెతురోడుతున్నట్లున్న వున్నా శాంతంగా వున్న కళ్ళు, కొందరు ఏదో తాదాత్మ్యతతో ఎటో చూస్తూ, ప్రక్కన, వెనుక, ముందు ఏవో విగ్రహాలు, శివలింగాలు. 


వాళ్ళు సన్యాసులా, నాగ సాధువులా, అఘోరాలా అన్న విషయం మన శక్తికి మించిన సబ్జెక్టు. 


 ఇక్కడ నాకు ఒక చిన్న షాక్. 


గుడి వెనుక మెట్లపై నుండి భీమా శిల దగ్గరకి వెళ్తుంటే, 


 నువ్వు తెలుగు వాడివా అన్న గొంతు వినిపించింది. 


చూస్తే ఒక సాధువు. చిన్నగా నవ్వుతున్నాడు. చిన్న కుదుపు, కొంపదీసి తెలిసిన వాడా? 


మీది vizag కాదూ??? అన్నాడు.. 


 కాదు శ్రీకాకుళం అని చెప్పా.. సరేలే అక్కడి వాడివేగా.. రా కూర్చో అన్నాడు. 


కొంచెం అలజడి, తెలిసిన వాడా.. నాతో ఏం పని, అయితే గియితే డబ్బులు అడిగి అశీర్వదించి పంపాలి కదా.. కూర్చో అంటాడేమిటి.. ఏమైనా ట్విస్ట్ వుందా?


 అనుకుంటూ.. కూర్చున్నా.. 


నెక్స్ట్ డైలాగ్, “సన్యాసులు నేరస్తులు కాదు గుర్తించుకో” అన్నాడు.. 


కరెక్ట్ గా గుండెల్లో దిగింది. ఎందుకో నా మనసులో ఆ భావన వుండేది. చాలా మంది సన్యాసులు ఏవో నేరాలు చేసి.. కొన్నాళ్ళు సన్యసించి.. తిరిగి వెళ్ళి పోతారు అని.. ఎందుకో అలా ఫిక్స్ అయిపోయాను.. చిన్నప్పుడు ఎక్కడో చదివింది అయి వుంటాది మైండ్ లో అలా ఫిక్స్ అయి పోయింది. 


నేను నవ్వాను.. నేనేమీ అలా అనలేదే.. కానీ నీ ఉద్దేశ్యం అదే కదా.. అయితే మీరు ఇక్కడ ఎందుకు ఇలా.. 


 “నేను ఇక్కడ లేను. ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఇక్కడ లేను” అన్నాడు. 


నాకు అర్ధం కాలేదు కాబట్టి, నవ్వు వచ్చింది. 

 ఇద్దరి మధ్య సంభాషణ చాలా కాసువల్ గా జరుగుతుంది. అతని పని అతను చేసుకు పోతున్నాడు. వచ్చిన వాళ్ళకి నుదుటిన నామ ధారణ చేయడం, ఒక రుద్రాక్ష ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన దక్షిణ తీసుకోవడం etc etc. , పేరు చెప్పాడు ఏదో ఆస్పష్టంగా.. చివర నాగసాధు అన్నాడు. 


 అడుగుదాం అంటే నీకు అంత అవసరం లేదలే అంటాడేమో. 


 అతను మాకు రెండు సంవత్సరాలు సీనియర్ ఆట. 1982 శ్రీకాకుళం లో AUPG సెంటర్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, మొదటి సంవత్సరం పరీక్షలు రాసి, వచ్చేశాను అన్నాడు. 


ఏమి జరిగినది అని అడిగితే, నవ్వేశాడు. సన్యాసులు నేరస్తులు కాదు గుర్తుంచుకో అన్నాడు. 


ఇంచు మించు 10 -15 నిముషాలు జరిగింది ఇదంతా. ఉపదేశాలు అలాంటివి ఏమి లేవు గాని, “ఆనందం” గా వుండు అన్నాడు. 


 మన ఫిలాసఫీ కూడా అదేగా.. వున్న నాలుగు రోజులు ఎవరినీ నొప్పించ కుండా మనం ఆనందంగా వుండడం. 


రోగి పాలే కావాలన్నాడు, డాక్టర్ పాలే తాగమన్నట్లుంది కదా.. మనకి ఏమి కావాలో మన కన్నా పెద్దాయనకే ఎక్కువ తెలుసు కదా.. కొంచెం డబ్బు ఇచ్చాను, చాలా? అన్నాను, మీకు డబ్బు మీద, మాకు శివుని మీద ఆశ అంతా త్వరగా తీరదు లే, చాలు.. అదే చిన్న నవ్వు. 


 ఇదంతా మా ఆవిడ వీడియొ తీస్తూనే వుంది, ఒక సారి నా వైపు చూస్తూ కళ్ళు పెద్దవి చేసింది.. ‘ఇతను మీకు తెలుసా ? అన్నట్లు. నేను పెదవి విరిచాను.. ఏమో అని. ఆమె నవ్వు ఆపుకోలేక పోతుంది. సరిపోయారు ఇద్దరకి ఇద్దరు.. బూడిద రాసుకున్న సన్యాసి.. ఎప్పుడూ వంటికి నూనె రాసుకున్నట్లు ఎవరికి ఎక్కడా దొరకని మీరు. 


అక్కడనుండి ఆది శంకరాచార్యుల వారు, సమాధి అని చెప్పలేం, చివరగా శిష్యులకు కనిపించిన ప్రదేశానికి వెళ్లి, కొంతసేపు వుండి. దర్శనానికి బయలు దేరాము. 


దర్శనం అయినాక, రాత్రి అక్కడే బస చేసి, ఉదయం స్పర్శ దర్శనం చేసుకుని, మెల్లగా క్రిందకి దిగి జీపులు పట్టుకుని అందరం పాటా చేరుకుని భోజనాలు చేసి విశ్రాంతి కి ఉపక్రమించాము. 


 లేడీస్ బ్యాచ్ ఒక సుమో మాట్లాడుకుని ‘ఊకి ధాం’, గుప్త కాశీ, త్రియుగ్ నారాయణ గుడులకి వెళ్ళి వచ్చేశారు. మేం మాత్రం అలసి సొలసి నిద్ర పోయాం. 


 చూశారా మనతో వస్తే అలా వుంటుంది. అసలయింది చెప్పనే లేదు కదా. 


 కేదారేశ్వరుని దర్శనం ఎలా అయింది. మన ట్రావెల్ ఫిలాసఫీ ‘డెస్టిని’ కాదు, ‘జర్నీ’ నే. 


అయినా మీ కోసం, మన కోసం, మన అందరి కోసం చెప్పుకుందాం. 


మొత్తం కేదారం అంతా స్వంత ఊరిలో తిరిగినట్లు తిరిగి, దర్శనానికి లైన్లో నిలబడ్డాము. 


ఇక్కడ కొంచెం స్థల పురాణం, జియోగ్రఫీ, చరిత్ర కొంచెం తెలుసు కుందాం. 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ జిల్లా, గర్హ్వాల్ హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున వుంది. ఇది సముద్ర మట్టం నుండి సుమారు 11755 అడుగుల ఎత్తులో వుంటుంది. 


ఇక్కడ శివుడు స్వయంభువు. త్రిభుజాకారంలో వుండి మన పూజలు అందుకుంటుంటాడు. 


పౌరాణికంగా చూస్తే మహాభారతం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు పాపక్షమాపణకు శివుని గురించి వెతికారని, శివుడు ఎద్దు (నంది) రూపం దాల్చి గుప్తకాశీలో దాక్కున్నాడని, భీముడు తోక పట్టుకుంటే. శివుడు నేలలోకి మునిగిపోయి, 5 భాగాలుగా కనిపించాడు అవే పంచ కేదారాలు. 


 ఆ ఎద్దు యొక్క వీపు భాగం, మూపురం ఉపరితలంపై వుంది వెలసిన క్షేత్రమే కేదార్నాధ్. 


 శీతాకాలంలో భారీ మంచు కారణంగా ఆలయం మూసివేసినప్పుడు, బాబా కేదార్‌నాథ్ యొక్క పంచముఖి ఉత్సవ విగ్రహాన్ని’ఉఖిమఠ్‌’ లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించి, అక్కడ ఆరు నెలల పాటు పూజిస్తారు. ఇది వెండితో చేసిన విగ్రహం. 


ఆలయం వెలుపల ద్వారం ముందు శివుని వాహనమైన నంది యొక్క భారీ విగ్రహం ఉంటుంది. ఆలయ మండపంలో మరియు చుట్టూ ఉన్న కారిడార్లలో పార్వతి, శ్రీకృష్ణుడు, పంచ పాండవులు, ద్రౌపది, వీరభద్రుడు ఉంటారు. కేదార్‌నాథ్ పట్టణానికి తూర్పున ఉన్న కొండపై, క్షేత్ర పాలకుడైన భైరవనాథ్ ఆలయం కూడా ఉంది. 


 శీతాకాలంలో ఈ భైరవనాథుడు పట్టణాన్ని రక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఒక రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. 


 ఆలయం తెరుచుకునేది అక్షయ తృతీయ (ఏప్రిల్) నుండి కార్తిక పూర్ణిమ (నవంబర్) వరకు మాత్రమే. 


దీని పాండవులు నిర్మించారని ఇతిహాసం, జగద్గురు ఆది శంకరాచారయుల వారు 8వ శతాబ్దంలో పునర్నిర్మించడం చరిత్ర. ఆది శంకరాచార్యల వారు ఇక్కడే చివర సారిగా దర్శనం ఇచ్చారని నమ్మకం. శివుని మూపుర భాగం కేదార్నాథ్, కటి భాగం తుంగనాథ్, బాహులు – మధ్యమహేశ్వర్, ఉదరం – రుద్రనాథ్, ముఖం – కల్పేశ్వర్. ఇక్కడి ప్రధాన పూజారులుగా శంకరాచార్యుల వారు కర్ణాటక కు చెందిన వీర శైవ బ్రాహ్మణులను నియమించారట, ఇప్పటికీ వారే ప్రధాన పూజారులు. 


జూన్ 2013 భారీ వర్షాలతో మందాకిని నదికి వచ్చిన వరదలు కారణంగా భయంకర నష్టం జరిగింది. సుమారు 5000 మందికి పైగానే మృత్యు వాత పడ్డారని అధికారిక లెక్కలు. 

చాలా మంది యాత్రికులు చెట్లపై చిక్కుకొని ఆకలితో మరణించారు. 


భీమ శిల ఆలయం వెనుక అడ్డుకుని, వరదలు రెండు వైపులా విడిపోయి, ఆలయం మట్టి, రాళ్లతో నిండినా లింగం, నిర్మాణం ఏ మాత్రం కూడా దెబ్బతినలేదు. 


 ఆలయం తిరిగి 2014 మే 4న తెరిచారు. ఇది భారతదేశ చరిత్ర లో చిరస్థాయి అద్భుతం. శివుడి కృపతో కేదార్నాథ్ శాశ్వతం! 

దర్శనం తరువాత రూమ్ కి చేరుకుని ఆరాత్రి -8 డిగ్రీ ల చలిలో చాలా కష్టంగా గడిపి ఉదయం మూడున్నర గంటలకి స్పర్శ దర్శనం కి వెళ్ళాము. 


దర్శనం బాగా జరిగినది. 

బయటకి వస్తున్నప్పుడు వళ్ళు ఎందుకో చిన్నగా జలధరించి నట్లు అయింది. 


చలికా? 


 కాదనుకుంటాను. మరి ఎందుకు.. చిన్నగా ఏదో అలజడి.. 


శివుడ్ని, శివుడు ఉన్న ప్రదేశంలో వెదకడం మానేసి ఊర్లు పట్టుకొని, పట్టణాలు దాటి, పర్వతాలు ఎక్కి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం కదా. 


 అందుకేనా గర్భ గుడిలో నంది అలా నా వైపు చూసి, నా కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతున్నాడు.. 


మీలో ఉన్న శివుడ్ని వదిలేసి.. మా శివుడి కోసం పరిగెత్తు కొచ్చారు అని. 


అది నంది కళ్లలోని నవ్వు కాదా.. 


అది మన అజ్ఞానానికి ఒక సన్నని ఎగతాళా. 


 "మీలో ఉన్న శివుడ్ని వదిలేసి.. మా శివుడి కోసం వచ్చావా" —


 ఇది గర్భగుడి నుంచి బయటకు వచ్చినప్పుటి నుండి గాలిలో కలిసిపోయి, నా గుండెలో ఒక చిన్న గంట మోగినట్టు, 


 కాదు కాదు తుఫాన్ లా సునామి లా.. ఆ ఒక్క మాటా..నా లోపల ప్రవహించే సందిగ్ధ భావాలకు కట్టలు తెంచేసింది


నిశ్శబ్దంగా ఉన్న నా మనసులో ఒక్కసారిగా కేదార్‌ వరదలా ఆలోచనలు ఉప్పొంగాయి..


దేవాలయం వెలుపల నాశనం చేసిన ఆ వరద, నా హృదయం లోపల అజ్ఞానాన్ని తుడిచిపెడుతుందా.. వరదలు నాశనం చేస్తాయి అంటారు కదా.. మరి నన్ను శుభ్రం చేస్తుందేమిటి?


 నాశనం వెనుక ఉద్దేశ్యం పునఃసృష్టా? పునర్నిర్మాణమా?


 జ్ఞానోదయం అంత త్వరగా ఇంత సులభంగా అవుతుందా?


 ఎందుకు కాదు అంధకారం నిండి వెలుతురికి దూరం (కను) రెప్పపాటే కదా! కాలమే నిర్ణయించాలి. 


 అలా ఆలోచిస్తూ రూంకి వచ్చి, ఎంతో ఉద్వేగంగా సుజాత తో చెప్తే.. నంది నావైపు కూడా చూసి నవ్వాడు అంది. 


 అవునా.. నీకు అలాగే అనిపించిందా.. అని సంభ్రమంగా చూస్తే.. 


 అంతొద్దు.. అక్కడ నంది పీఠం దగ్గర నవ్వుతున్న ముఖం చెక్కారు.. ఎందుకో మరి.. అదే మనకి కనబడింది.. 


అంటూ మొత్తం గాలి తీసేసింది.. అందరూ మాయ మాయ అంటారు.. అదేనా ఇది. ఎవర్నడగాలి బయటి శివుడ్నా??


 నాలోని శివుడ్నా??


 అయినా దేవుడు మనలో ఉంటే మనం బయట ఎందుకు వెతుకుతాం. 


మళ్ళీ ప్రశ్న. 


అవును శివుడ్ని దర్శించడానికి ఇంత దూరం వచ్చాం కానీ.. తెలుసుకోవడానికైతే ఇంత దూరం రావలసిన అవసరం లేదు కదా. 


చార్ ధాం యాత్ర కొద్ది మందికి అలసిన శరీర జ్ఞాపకాలతో బాటు ఆత్మపరిశీలన విత్తనాలు కూడా నాటబడతాయి. 


 ఈ యాత్రలో శరీరం, మనసు, ఆత్మ కలసి ప్రయాణం చేస్తాయనుకుంటాను. 



అయినా ఈ పిట్టు వాళ్ళని, డోలి వాళ్ళని చూస్తుంటే అర్ధం కావడం లేదా శివుడంటే కేవలం భక్తి మాత్రమే కాదు ఒక నమ్మకం అని. 


ఏ నమ్మకం లేకపోతే ఒక మనిషిని అమాంతం మోసుకుంటూ ఇన్ని కొండలు.. కిలోమీటర్ లు ఎక్కడానికి దిగడానికి ఎలా ఒప్పుకుంటారు. 


ఏ మాత్రం తేడా వచ్చినా, ఒక చిన్న తడబాటు వచ్చినా మెడ, నడుం, మోకాళ్ళు విరుగుతాయి కదా.. ప్రాణాలు గాల్లో దీపాలు కదా.. 


ఏ నమ్మకం లేకపోతే ఇంత మందిని ప్రాణాలకి తెగించి మరీ యాత్ర చేయిస్తున్నారు. 


 శివుడున్నాడు, శివుడే నడిపిస్తాడు, నడిపిస్తున్నాడు అనే నమ్మకం తోనే కదా.. 


మన రిస్క్ ఏముంది వీళ్ళతో పోల్చుకుంటే.. 


మన రిస్క్ మొత్తం జీవితం లో ఒక రోజు.. 


మరి వీళ్లది మొత్తం జీవితం అంతా రిస్కే కదా.. 


ప్రతి రోజూ చావుతో పోటీ.. గెలుపు తప్పని సరి కదా.. 


 లేదంటే.. శివైక్యమే. 


శివుడున్నది పుస్తకాలలో, గ్రంథాలలో, పద్యాలలో, సంస్కృత శ్లోకాలలో, వచనాల్లో, ప్రవచనాల్లో, కథల్లో, పురాణాల్లో కాదు.. 


 వీళ్ళ నమ్మకం లో వున్నాడు. 


శివుడంటే ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక ఆనందం, ఒక ఆధ్యాత్మికం, ఒక ఆర్తి, ఒక ఆకలి, ఒక అన్నం, ఒక అస్తమయం, ఒక ఉదయం. 


శివుడంటే అతి సామాన్యం, శివుడంటే అత్యద్భుతం.. 

ఈరోజే చివరది అనే వైరాగ్యం, రేపు వుందనే ఆశ. 

 శివుడంటే.. శివుడంటే.. 


అవును.. 


శివుడంటే మీరు.. శివుడంటే నేను.. నేనంటే శివుడు.. 


 శివుడిలో నేనున్నాను.. నాలో శివుడున్నాడు.. 


 అహం శివోహం.. త్వం శివోహం.. అహరహం శివోహం. 


ఇంకా వుంది

చార్ ధాం యాత్ర - పార్ట్ 6 త్వరలో..

***

పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

ree

పేరు: పుల్లేటికుర్తి నగేశ్ 

వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం. 

వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్ 

పుట్టిన ఊరు;;;;  శ్రీకాకుళం 

bottom of page