top of page
Original.png

చార్ ధాం యాత్ర - పార్ట్ 2

#CharDhamYathra, #చార్ధాంయాత్ర, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Char Dham Yathra - Part 2 - New Telugu Story Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 18/11/2025

చార్ ధాం యాత్ర - పార్ట్ 2 - తెలుగు కథ

రచన: పుల్లేటికుర్తి నగేష్ 



ఉదయం ఆరు కొట్టే సరికి ఠంచనుగా రూమ్‌కి కాఫీ వచ్చేసింది. కాఫీ త్రాగి, ఒక అరగంట వాకింగ్‌ చేసి ఫ్రెష్‌ అయి, 8.00కి వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, మళ్లీ కాఫీలు త్రాగి రెండు బస్సులలో “మానసా దేవి” టెంపుల్‌కి బయలుదేరాం.


మా కెప్టెన్‌ సాయి గారు నిన్నే చెప్పారు — భక్తి, శ్రద్ధలతో మనసా వాచా reasonable కోర్కెలు కోరితే తప్పకుండా తీరుతాయని.ఈ reasonable అనే పాయింట్‌ని అందరూ గమనించాలి — గొంతెమ్మ కోర్కెలు కోరకూడదన్నమాట.


ఒక అరగంటలో గుడి దగ్గరకి చేరుకొని, కొంచెం దూరం నడచి, ముందుగా వాళ్లే బుక్‌ చేసిన టిక్కెట్లతో రోప్‌వే దగ్గరకి చేరుకున్నాము.ఈ ఆలయం హరిద్వార్‌కి 500 అడుగుల ఎత్తులో ఉంది.


మా అందరినీ (60+8 = 68 మంది) ఒక గ్రూప్‌గా ట్రీట్‌ చేసి రోప్‌వే వాళ్లు ఒకరి తరువాత ఒకరుగా, కేబుల్‌ కార్‌లో నలుగురు చొప్పున ఎక్కించారు.ఈ రోప్‌వేను “మానసా దేవి ఉదమ్ ఖటోలా” అని పిలుస్తారు.


అక్కడ మన రెండు రాష్ట్రాలకు అవసరం లేని ఒక ఆక్ట్‌ ఉంది — అదే “ది ఉత్తరాఖండ్‌ రోప్‌వే ఆక్ట్‌.”రోప్‌వే వాడేటప్పుడు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మొదలైన లిస్టులు పెద్దగా డిస్ప్లే చేశారు.

(ఇది మనకి అవసరం లేని ఇన్ఫర్మేషన్‌, కానీ అదేగా general knowledge అంటారు!)


ఈ యాత్రలో మేము చూసిన అన్ని ప్రదేశాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాయి.రోప్‌వే ప్రయాణం చాలా బాగుంది — క్రింద గంగా నది, దాని తీర ప్రాంతం, భవనాలు, ఘాట్లు ఎంతో అందంగా కనబడ్డాయి.


ఇక్కడ ఈ గుడి విశిష్టత కొంచెం తెలుసుకుందాం.ఈ ఆలయాన్ని “బిల్వ తీర్థం” అని కూడా పిలుస్తారట.ఆలయం ఉన్న కొండ పేరు బిల్వ పర్వతం.శివాలిక్‌ కొండలలో బిల్వ తీర్థం పై వెలసిన అమ్మవారు శక్తిరూపం.ఆ మహాదేవుని మనస్సు నుండి ఉద్భవించినదని ఇక్కడ నమ్ముతారు.

ఈ హరిద్వార్‌లో ఉన్న సిద్ధ పీఠాల త్రయంలో (మానసా దేవి, చండీ దేవి, మాయా దేవి) ఇది ఒకటి. సంస్కృతంలో “మానసా” అంటే కోరిక అని అర్థం.


ఈ ఆలయానికి ఆధ్యాత్మిక మూలాలు కాలాతీతంగా పరిగణించబడుతున్నప్పటికీ, దీని ప్రస్తుత నిర్మాణం క్రీ.శ. 1811–1815 మధ్య మణి మజ్రా మహారాజా గోపాల్‌సింగ్‌ చేత నిర్మించబడింది.హరిద్వార్‌ నగరాన్ని దేవతల ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.

మేము అంతగా గమనించలేదు గాని, ఈ మందిరం గర్భగుడిలో రెండు ప్రధాన విగ్రహాలు ఉన్నాయి — ఒకటి ఎనిమిది చేతులతో, మరొకటి మూడు తలలు, ఐదు చేతులతో. జనసందోహం వల్ల మేము అంతగా గమనించలేకపోయాం.

గర్భగుడి పక్కనే మూడు చెట్ల మొదళ్లకు ఎరుపు రంగు దారాలు ఎక్కువగా చుట్టబడి ఉన్నాయి.భక్తులు తమ కోర్కెల సంకేతంగా అక్కడ కడతారట.తీరిన తర్వాత తిరిగి వచ్చి విప్పుతారట.

అవి చాలా ఉన్నాయి — సహజమే కదా, జనం ఎక్కువ, కోరికలూ ఎక్కువ!

దర్శనాలు పూర్తయ్యాక ముందే చెప్పినట్టు వాలంటీర్లు ఎవరు తప్పిపోకుండా కాపుకాస్తున్నారు.అయితే సాయి సార్‌ చెప్పారు — దారిలో చాలా షాపింగ్స్‌ ఉంటాయి, ఎవరైనా అందులో పడి మిస్‌ అయితే హోటల్‌కి వచ్చేయండి అని.


మెల్లగా నడచుకుంటూ బస్‌ పార్కింగ్‌ దగ్గరకి వచ్చి “చండీ దేవి గుడి”కి బయలుదేరాము.ఈ టెంపుల్‌కి కూడా కేబుల్‌కార్‌లోనే వెళ్ళాలి.

ఇక్కడ కొంచెం జనం ఎక్కువ.ఒక అరగంట తర్వాత మా టర్న్‌ వచ్చింది.పైకి చేరుకొని కొంచెం మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నాం.అప్పటికే ఎండ‌ కొంచెం ఎక్కువగా ఉంది. అందరూ అలసిపోయారు.


చండీ దేవి ఆలయం

మానసా దేవి ఆలయం బిల్వ పర్వతం పై ఉంటే, చండీ దేవి ఆలయం “నీల” పర్వతం పై ఉంది.రాక్షస సంహారకురాలిగా పూజింపబడే పార్వతీ దేవి యొక్క ఉగ్ర అవతారమే చండీ దేవి.

స్థల పురాణం ప్రకారం —ఇంద్రుని స్వర్గరాజ్యాన్ని ఆక్రమించిన శుంభ, నిశుంభ రాక్షస రాజులను ఓడించడానికి చండీ దేవత ఉద్భవించింది.వారి సైన్యాధిపతులు చంద, ముండలను మరియు శుంభ, నిశుంభులను సంహరించిన తరువాత అమ్మవారు ఇక్కడి నీల పర్వతంపై విశ్రాంతి తీసుకుందట.కొండ పక్కన ఉన్న రెండు శిఖరాలు శుంభ–నిశుంభులను సూచిస్తాయని చెబుతారు.

జగద్గురు ఆది శంకరాచార్యులు శైవమత పునరుద్ధరణలో భాగంగా చండీ దేవి ప్రధాన విగ్రహాన్ని ప్రతిష్ఠించారట.ప్రస్తుత ఆలయాన్ని 1929లో కాశ్మీర్‌ మహారాజు సుచత్‌సింగ్‌ నిర్మించారట. నవరాత్రి, కుంభమేళా సమయంలో జనం ఎక్కువగా వస్తారు.


ప్రయాణ సౌందర్యం

ఈ ప్రయాణం పొడవునా ప్రకృతి సౌందర్యం గురించి ఎంత వర్ణించినా తక్కువే.విశాలమైన కొండలు, క్రింద దారి పొడవునా యమునా నది మనతోబాటే వస్తుంది. పచ్చని చెట్లు, కొండలను తాకుతున్న మేఘాలు — అబ్బో, అద్భుతం!

కానీ కళ్లకి కనిపిస్తున్నది అద్భుతం అయినా, క్రిందకి చూస్తే వెయ్యి అడుగుల లోయలు —అందులో పరవళ్ళు త్రొక్కుతున్న యమునా!కొంచెం జారినా — అంతే “ఓం నమశ్శివాయ”!

దారిలో ఎక్కడ చూసినా వర్షాల వల్ల ల్యాండ్‌స్లయిడ్స్‌.కొన్ని రాళ్లు బస్సు కంటే రెండింతలు పెద్దవి!వర్షాకాలంలో ఈ మార్గం భయానకమనే అనిపించింది.

మా ప్రయాణంలో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ దారిలో ఉన్న చిన్న ధాబాలలో ఏర్పాటు చేశారు.దారులు సింగిల్‌ — ఎదురుగా వాహనం వస్తే తప్పించడానికి నైపుణ్యం కావాలి.

మా డ్రైవర్‌ అనుభవజ్ఞుడు.వయసు ఎక్కువైనా డ్రైవింగ్‌ అద్భుతంగా చేసాడు.దారిలో వెనక్కి రివర్స్‌ చేయడం అవసరమైతే ప్రయాణీకులు ఊపిరి బిగుపుకున్నారు.


లఖామండల్ కథ

సాయంత్రం బార్కోట్‌ దగ్గరకి చేరాము.బార్కోట్‌కి 20కి.మీ. ముందుగా లఖామండల్ అనే బోర్డు కనబడుతుంది.ఈ ప్రాంతం మహాభారతంతో ముడిపడి ఉంది.“లఖామండల్” అంటే లక్ష శివలింగాలు అని అర్థం.

ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలలో అనేక శివలింగాలు బయటపడ్డాయి.దుర్యోధనుడు, శకుని, కౌరవులు పాండవులను చంపడానికి లక్కమందిరం నిర్మించిన చోటే ఇది.విదురుడు పాండవులను అగ్నిప్రమాదం గురించి పరోక్షంగా హెచ్చరించాడు.పాండవులు సొరంగ మార్గం తవ్వి తప్పించుకున్నారు —ఇది మనం పాండవ వనవాసం సినిమాలో చూసిన కథే!

ఈ లఖామండల్‌లోనే ఆ సంఘటన జరిగిందట.ఇప్పటికీ ఆ గుహను చూడవచ్చట.లక్క ఇల్లు మాత్రం కాలిపోయింది.

అక్కడ పాండవులు పూజించిన శివాలయం ఉంది.మన ఐటినరీలో లేకపోయినా సాయి గారు చూపించారు కదా — అంతే మరి!


యమునోత్రి ట్రెక్కింగ్

సాయంత్రం 4–5కి బార్కోట్‌ దాటాం.ఇక్కడి నుంచి రెండు గంటల ప్రయాణం.చాలామంది ఇక్కడే బస‌ చేస్తారు.మేము ముందుకు జానకి చట్టీ వరకు వెళ్లాం,ఉదయం యమునోత్రి ట్రెక్కింగ్‌ ముందుగానే మొదలు పెట్టాలని ప్లాన్‌.

కానీ దారిలో ల్యాండ్‌స్లయిడ్‌, ట్రాఫిక్‌ జామ్‌ — మూడు గంటలు ఆగిపోయాం.రాత్రి 9కి హోటల్‌కి చేరుకున్నాం.

రూములు, భోజనం సిద్ధం చేశారు.డార్మిటరీ బస‌ — నలుగురికి ఒక రూమ్‌.భోజనం చేస్తుండగా సాయి గారు బ్రీఫింగ్‌ ఇచ్చారు:

ఉదయం 5కి రెడీ అవ్వాలి.6కి గుర్రాలు, డోలీలు, పిట్టూలు బయలుదేరాలి.నడిచే వారు ఇంకాస్త ముందుగా.

గుర్రం ₹3500, డోలి ₹11000 రానుపోను.ID కార్డులు తీసుకోవాలి, తిరిగివచ్చిన తర్వాతే ఇవ్వాలి.

ఇది సుమారు 5కి.మీ. ట్రెక్కింగ్‌.మొదట బాగానే అనిపించింది.తరువాత స్టీప్‌ హైట్‌ ప్రారంభమైంది.గుర్రాలు ఎక్కడానికి కష్టపడ్డాయి.

మెట్లు చాలా ఎత్తు, నిట్టనిలువు.ఆపసోపాలు పడుతూ యమునోత్రి చేరుకున్నాం.

డోలీ, పిట్టు వాళ్ల కష్టం వర్ణనాతీతం.నలుగురు కలిసి ఒకరిని మోసుకోవడం — భయానకం!

సాయి గారు చెప్పారు — ఇది యమునా దేవి శాపం.పూర్వం వీరు యాత్రికులను దోచుకునేవారట.అందుకే దేవి వీరిని ఈ కష్టానికి గురి చేసిందట.కేదార్‌నాథ్‌ ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఇలాగే.


తప్త కుండ్ – యమునోత్రి

మొదట తప్త కుండ్‌కి వెళ్లాము.ఇది వేడి నీటి బుగ్గ (Hot water spring).పురుషులు, స్త్రీలకు వేరు వేరు గూండాలు ఉన్నాయి.

మొదట దిగినప్పుడు చాలా వేడి అనిపించింది,తర్వాత అలవాటు అయ్యాక ఆహా! అద్భుతం.నీటి వేడిని బ్యాలెన్స్‌ చేయడానికి చల్లటి నీరు కలుపుతున్నారు — అది ఫ్రిజ్‌ నీటికి మించిన చల్లదనం.


15 నిమిషాల స్నానం చేసిన తర్వాత ఎంతో హాయిగా అనిపించింది.మా ఆవిడ కూడా వచ్చి ఫోటోలు, వీడియోలు తీసాము.

‘సూర్య కుండం’ దగ్గర సంకల్పం చెప్పి దర్శనం చేసుకున్నాం.నీళ్లలో బుడగలు పుడుతుండటం వల్ల వేడి స్పష్టంగా కనిపిస్తుంది.

స్థానికులు బట్టలో బియ్యం, ఆలూ కట్టి ఆ నీటిలో ఉడికిస్తారు.తరువాత వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.

తరువాత యమునా మాత దర్శనం చేసుకున్నాం.జనం తక్కువగా ఉండడంతో ఎంతో ప్రశాంతంగా దర్శనం అయింది.


తిరుగు ప్రయాణం

తృప్తి, ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.తిరుగు ప్రయాణం గుర్రాలపై దుర్భరం!

ఇప్పుడు ఎడమవైపు పెద్ద లోయలు, వేగంగా ప్రవహిస్తున్న యమునమ్మ.గుర్రాలు ఐదు–ఆరు ఇంచుల దారిలో నడుస్తున్నాయి.గుర్రం గుండె చప్పుడు మన కాళ్లకే వినిపిస్తుంది,మన గుండె చప్పుడు దేవుడికే తెలుసు!

“ఛీ! దీ__ జీవితం, ఎన్నాళ్ళు ఈ గాడిద బరువు!” అని అనుకున్నా,ముందు వస్తున్న గుర్రం “ఇదెప్పుడు మాట వినదు” అనుకున్నా —ఇవి మనసులో వచ్చిన భయభావాలే.

గుర్రం కాలు జారినా, మనం కొంచెం ఒరిగినా…“ఓం నమశ్శివాయ!”ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం అంటే ఇదే!

తగిలితేనే తత్వం బోధపడుతుంది — ఇదే గమ్యం.పడితే వెతకడానికి ఎవరూ రావు, రాలేరు కూడా.

నేనైతే మా ఆవిడకి “వస్తున్నావా?” అని పదే పదే అడుగుతూనే ఉన్నాను.భయంతోనా, ధైర్యం కోసమో — అర్థం కాలేదు.మీ పరిస్థితి కూడా అదే కదా!


యాత్ర సమాప్తం

అలా మా యమునోత్రి యాత్ర ధైర్యంగా (???) పూర్తయింది.హోటల్‌కి చేరాక లంచ్‌కి సమయం ఉంది.డోలీ, పిట్టు, గుర్రాల వాళ్లతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నాను.భుజాలు, పాదాలు, మెడ — నొప్పుల సముద్రం!

“ఇంత కష్టానికి మరో ట్రిప్‌ వేస్తారా?” అని అడిగితే,ఆ కుర్రాడు చూసిన చూపులో వంద మాటలు దాగి ఉన్నాయి.


దేవుడా! వీళ్ళు త్వరగా శాపవిమోచనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.ప్రభుత్వం వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.

ఇప్పటికే చాలా పొడవుగా అయింది. గంగోత్రి ప్రయాణం ఇందులో కలపాలనుకున్నా —ఇక్కడే ఆపుదాం. తర్వాతి భాగం తరువాత!


ఇంకా వుంది

చార్ ధాం యాత్ర - పార్ట్ 3 త్వరలో..

***

పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్ 

వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం. 

వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్ 

పుట్టిన

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page