top of page

చార్ ధాం యాత్ర - పార్ట్ 1

#CharDhamYathra, #చార్ధాంయాత్ర, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

(నాకు కనబడిన “నా” శివుడు)

Char Dham Yathra - Part 1 - New Telugu Story Written By Pulletikurthi Nagesh 

Published In manatelugukathalu.com On 15/11/2025

చార్ ధాం యాత్ర - పార్ట్ 1 - తెలుగు కథ

రచన: పుల్లేటికుర్తి నగేష్ 


ఓం నమశ్శివాయ.. హర హర మహాదేవ్..

ఈ యాత్ర గురించి చెప్పడానికి, అనుభవాలు మీ అందరితో పంచుకోవడానికి ఇంతకు మించిన ప్రారంభ వాక్యాలు ఉంటాయని అనుకోను.. మా సాయి గారు చెప్పినట్లు ఈ నామ స్మరణ ప్రభావం మా యాత్ర ఏ ఆటంకాలు లేకుండా జరగడానికి ఎంతో దోహదపడింది. హర నామ స్మరణ చెవుల్లో, హృదయంలో, గుండెల్లో (ఇక్కడ మాత్రం భయంతో వచ్చిన భక్తి) మారు మ్రోగితుంది. నిజంగా ఇది జీవితం లో చేసిన చాలా గొప్ప యాత్ర/ప్రయాణం. 


అరే నేను కేదార్నాథ్ వెళ్ళలేక పోతున్నాను అని చాలా సార్లు అనుకునేవాడిని. కొన్నిసార్లు డబ్బు సమకూరక, కొన్ని సార్లు అన్ని రోజులు సెలవు కుదరక, కొన్నిసార్లు ఫిట్నెస్ కుదరక, కొన్ని సార్లు వాతావరణం అనుకూలించక, రోడ్లు బాలేవని, ల్యాండ్ స్లయిడింగ్లు అవుతున్నాయని అలా రక రకాల కారణాలతో అన్నింటి కన్నా ముఖ్యంగా తెగించి వెళ్ళే ధైర్యం లేక వెళ్ళలేక పోతున్నాను అని అనుకునేవాడిని. 


కానీ అక్కడికి వెళుతున్న సమయంలో తోటి యాత్రికులను చూస్తుంటే నా తలపులన్నీ తప్పని తెలిసింది. ధనం లేని సన్యాసులు, చిన్న పిల్లలు, యువకులు, స్త్రీలు, వృద్ధులు, బలహీనులు, ఊబకాయిలు ముఖ్యంగా వికలాంగులు కూడా ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం చూసి అప్పుడు జ్ఞానోదయం అయింది. 


ఈ కేదార్నాథ్ యాత్ర మనం అనుకుంటే కాదు.. మహాదేవుడు పిలిస్తే జరుగుతుంది అని. సుమారు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో సంవత్సరానికి కనీసం పదిలక్షల మంది కూడా కేదార్నాథ్ యాత్ర చేయలేక పోతున్నారంటే ఇది ఎంత కష్టమో తెలుస్తుంది. మన తిరుమలను సుమారు మూడున్నర కోట్ల మంది ప్రతి సంవత్సరం దర్శిస్తూ ఉంటారు. 


అంతటి కష్టసాధ్యమైన కేదారేశ్వరున్ని దర్శించడం నిజంగా అదృష్టమే.. లలాట లిఖితమే కదా. కొంత మంది శివ సాన్నిధ్యం కోసం, కొంత మంది దర్శనం కోసం, కొంత మంది తల్లి తండ్రుల కోసం, కొంత మంది ప్రకృతి సౌందర్యం కోసం, కొంత మంది ఫోటోలు వీడియోలు రీల్స్ కోసం, కొంత మంది యూట్యూబర్ వీడియోస్ కోసం ఎవరు ఎలా వెళ్ళినా వచ్చేసరికి అందరి మనసులు శివోహంతో నిండి పులకించి పునీతమవుతాయి. 


చార్ ధాం యాత్ర స్లాట్ బుకింగ్  అనౌన్స్ అయిన వెంటనే మా ఇద్దరికి బుకింగ్ కన్ఫర్మ్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ మూర్తి గారికి నేను ఫోన్ చేసి చెప్పి, సార్ itinary చూసి, కాంటాక్ట్ చేసే సరికి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది (సార్ first time ఇక్కడ slots ఎంత త్వరగా బుక్ అవుతాయో తెలియదు). ఒక వారం తర్వాత కన్ఫర్మ్ చేశారు. మాది ఇది మూడో ట్రిప్ కాబట్టి, తిరుమల slots booking కి చేసినట్లు మేం వేగంగా చేసుకున్నాం. తర్వాత ఇంకో ఇద్దరు మిత్రులకు లాస్ట్ మినిట్ ఎంట్రీ దొరికింది. మొత్తం మేం ఆరుగురం ఒక sub గ్రూప్. ఇంటికి వచ్చి మా ఆవిడకి బుక్ చేసినట్లు చెప్తే, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని అంది గాని వద్దనలేదు. 


ఇక అప్పటినుండి ప్రారంభం అయింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. You tube వీడియోలు చూడడం, తెలిసిన వాళ్ళని, ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళని ఎలా వెళ్ళాలి, ఎంత కష్టం, ఎంత ఖర్చు ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడం ప్రారంభించాం. తెలుసుకుంటున్న 

కొలది మాలో ఆదుర్దా, టెన్షన్ పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఇంతలో ఆగస్ట్ సెప్టెంబర్ లో అక్కడ వర్షాలు, కొండ చరియలు విరిగి పడడం, యాత్రికుల కష్టాలు అబ్బో అన్ని ఇన్ని కాదు. ఎవరితోనైనా ఇలా చార్ ధాం కి వెళ్తున్నాం అంటే ముందుగా వచ్చే మాట జాగ్రత్తగా వెళ్ళి రండి అసలే అక్కడ వాతావరణం బాలేదట. మొన్న మాకు తెలిసిన వెళ్ళి ఆక్సిజన్ అందక తిరిగి రాలేదట అని తెలిసిన కష్టాలు, దుర్ఘటనలు చెప్పేవారే.. 


ఇక ట్రిప్ కి రెండు రోజుల ముందు విజయవాడ నుండి హైదరాబాద్ కి వస్తున్న సమయంలో మాతో ప్రయాణించిన మా సహోద్యోగి, వాళ్లు వెళ్ళిన పంచ కేదార్ యాత్ర గురించి చెప్తూ, కేదార్నాథ్ వెళ్ళడం అంటే మనం మనల్ని ఆ శివునికి అర్పించుకోవడమే.. తిరిగి రావడం ఆయన దయ.. అని చెప్పే సరికి నాకు చిన్న భయం స్టార్ట్ అయింది.. అంతకు ముందు *సాయి కృష్ణ" వాళ్ళు క్రియేట్ చేసిన what's app గ్రూప్ లో వస్తున్న సందేహాలు, రోడ్ల పరిస్థితి, వర్షాలు వరదలపై వస్తున్న సోషల్ మీడియా వార్తలు, క్లిప్పింగ్స్ లను అంత సీరియస్ గా తీసుకోని నేను ఇప్పుడు కొంచెం సందిగ్ధంలో పడ్డాను. వెళ్లగలమా వెళ్తే తిరిగి రాగలమా???! అప్పటికీ సాయి గారు చెప్తూనే ఉన్నారు సెప్టెంబర్ వాతావరణం వేరు అక్టోబర్ వేరు అని.. 


కానీ మన భయాలు మనకి వుంటాయి కదా.. ఇప్పుడు తిరిగి రాకపోయినా ఫర్లేదు.. ఇంకోసారి తిరిగి రావచ్చు అనే ఆప్షన్ వుండదు కదా. వస్తే రావడం.. లేకపోతే ఓం నమశ్శివాయ 🙏 


యాత్రకి ముందు రోజు మా పెద్దాడికి ఫోన్ చేసి అవి ఇవి మాట్లాడుతూ.. అసలు నీకు బాధ్యత ఏమైనా ఉందా రా.. నీకు మన ఇంటి పత్రాలు, బ్యాంకు వివరాలు, locker వివరాలు ఏమైనా తెలుసా?? 


తెలుసుకోవా? అని మందలిస్తున్నట్లు నటిస్తూ.. వివరాలు చెప్పడం మొదలుపెట్టాను.. నిజం చెప్పొద్దు గుండె గొంతుకలో రావడం తెలుస్తోంది.. గొంతు వణకడం స్పష్టంగా తెలిసింది.. ఆఖరి అప్పగింతలు చేస్తున్నట్లు ఉంది.. కాసేపటికి వాడికి అర్ధం అయినట్లు ఉంది.. ఇప్పుడు అవేం వద్దు నాన్న నువ్వు అమ్మ ధైర్యం గా హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని ఫోన్ కట్ చేసాడు.. 


అదీ నా పరిస్థితి, నా మనః స్థితి యాత్రకి ముందు రోజు. తరువాత యాత్రలో తోటివారితో మాటల సందర్భం లో తెలిసింది దాదాపు అందరి స్థితి కూడా అదే same to same అప్పగింతల ప్రహసనం. మా ఆవిడ మాత్రం ఆనందం గా ప్రశాంతం గా తన బట్టలు మేకప్ సామాన్లు సర్దుకోవడం లో చాలా బిజీగా ఉంది. అదృష్టవంతురాలు తక్కువ ఆలోచించి ఎక్కువ ఆనందం గా ఉండగలుగుతుంది. 


అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అంతర్లీనంగా భయం మాత్రం ఉంది. బయట పడడం లేదు అంతే. అప్పుడప్పుడూ ఏం ఫర్వాలేదు కదా, ప్రమాదమేమీ లేదుకదా అని అడుగుతున్నపుడు, ధైర్యం చెపుతున్నా ఏం కాదులే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. నిజానికి నాక్కూడా లోపల 104 కొడుతుంది. 


అన్నట్లు మీకు మేకపోతు గాంభీర్యం కథ తెలుసా.. చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా ఒక సారి చెప్తా క్లుప్తంగా.. ఒక మేక తన చిన్ని పిల్లలతో మేత మేస్తూ వర్షం వల్ల దారితప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. వర్షం వల్ల అన్నీ ఒక చెట్టు కింద చేరాయి. ఇంతలో ఒక పులి వీటిని చూసి తినడానికి మాటు వేసింది. పులిని చూసిన చిన్ని పిల్ల మేకలు భయం తో అరవడం ప్రారంభించాయి. మేకపోతుకి కూడా పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా అధైర్య పడక పిల్లల్ని కాపాడుకోవాలనే తపన తో తెలివిగా పిల్లల్ని కోప్పడుతున్నట్లు నటిస్తూ.. 


పిల్లలూ మీ ఆకలిని తీర్చడం నా వల్ల కావడం లేదు. ఇప్పుడే కదా రెండు పులుల్ని తిన్నారు, మళ్ళీ ఆకలంటే ఎలా.. పులులు బ్రతకాలా వద్దా అని గట్టిగా పిల్లల్ని మందలిస్తున్నట్లు మాటువేసిన పులికి వినబడినట్లు అరిచింది. అది విన్న పులికి ప్రాణాలు పోయినంత పని అయింది. ఇంకేముంది ఇవెక్కడి మేకలు రా నాయనా పులుల్ని తింటున్నాయి అని అనుకుంటూ చల్లగా మేకలకు కనబడ కుండా జారుకుంది. 


కొంచెం అతిశయోక్తిగా ఉన్నా ఎప్పుడో చిన్నప్పుడు చందమామ లో చదివిన కథ.. ఇలా కథ మధ్యలో చిన్న అదే పిట్ట కథలు చెప్పడం మా బస్ నంబర్ 3 mate సూర్యనారాయణ గారి 13 రోజున సహవాసం వల్ల వచ్చింది అనుకుంటా.. అయినా కథలు చెప్పడం పెళ్ళైన మగవాళ్ళకి 

రాకుండా వుంటుందా. ఇంటికి లేటుగా వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కథ చెప్తాం కదా. ఈ 13 రోజులు సూర్యనారాయణ సార్ మాతో చేయించిన నామ స్మరణ, భజన, తరువాత సార్ చెప్పిన ప్రవచనాలు మాలో చాలా ఉత్సాహాన్ని, జిజ్ఞాసను, ఆధ్యాత్మికతను పెంచాయి. ముందు ముందు వివరంగా చెప్తా. 


ఈ దంపతులు నూటికి నూరు శాతం దేవుడిని పూర్తిగా నమ్మిన వారు (నాలా సంశయాత్మకమైన భక్తి కాదు). అలా నా మేకపోతు గాంభీర్యం తో మా ఆవిడకి ధైర్యం చెప్తున్నాను ఏం కాదులే వర్షాలు రావట సాయి గారు చెప్పారు అని. ఇంకా నయం అక్కడకి వెళ్ళి మేం సాయి గారితో వచ్చాం కొంచెం వర్షాలు ఆగండి అని అనేరు అంది. 


నిజానికి జరిగింది అదే !!! సాయి గారు చెప్పినట్లు నామ స్మరణ శక్తి కాకపోతే మరేంటి మేం ఉన్న రెండు రోజులు వర్షాలు లేవు. ముందు రెండు రోజులు వర్షం పడింది.. రెండు 

రోజుల తరువాత పూర్తిగా మంచు కురిసింది. మేం ఉన్న రెండు రోజులు మాత్రం చక్కటి ఎండ తో  వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 


ఇంకొక్క విషయం ఈ హర నామస్మరణ తో బాటు యమునోత్రి, కేదార్నాథ్ ప్రయాణంలో గుర్రాల మెడలో గంటల చపుడు, వాటి గిట్టల శబ్దాలు, వాటిని అదిలించే కుర్రాళ్ళ హిందీ గర్వలీ కలిపిన భాషలో అరుపులు, తిట్లు ఇవికూడా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. చెప్పాలంటే భక్తి కన్నా భయం ఎక్కువ ప్రతిధ్వనిస్తుంది. మా ఆవిడైతే నిద్రలో బయ్యా దేకో, ఇస్కొ పకడో అని కలవరిస్తూనే ఉంది. 

 

ఇక అసలు పని, ముందుగా వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసిన విధంగా, యాత్రకి పట్టుకోవలసిన వస్తువుల లిస్ట్ తో క్రాస్ చెక్ చేసుకొని అన్నీ సర్దుకొని యాత్రకి రెడీ అయ్యాము.. మా తరపున వీళ్ళే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వెబ్ సైట్లో చార్ ధాం యాత్రకి రిజిస్ట్రేషన్ చేసి ఆ ఫామ్ మాకు గ్రూప్ లో పెట్టారు. వీటిని అక్కడ యాత్ర పర్చీలు అంటారు. వీటి ప్రింట్ ఔట్ లు తప్పని సరిగా ఉండాలి. 


యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ గుడి దగ్గర, ఇంకా మార్గ మధ్యం లో కూడా చెక్ అవుతాయి. అయ్యాయి కూడా. ఇక జీవిత కాలం లో ఒక సారైనా చేయాలనుకునే చార్ ధాం యాత్ర ప్రారంభ రోజు రానే వచ్చింది.. ఉదయం తల స్నానం చేసి ఆ మహాదేవుని మ్రొక్కి మధ్యాహ్నం 12 గంటలకి హైద్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అందరికి టికెట్స్ ఉదయమే whats aap group లో పెట్టారు. 


మెల్ల మెల్లగా అందరూ చెక్ ఇన్ అయి ఫ్లైట్ takeoff గేట్ దగ్గరకి చేరుకుంటున్నాం.. కొందరు మాతో సౌత్ టూర్ చేసిన వాళ్ళు ఉన్నారు. గుర్తు పట్టుకొని, గుర్తు పెట్టుకొని పలకరించు కుంటూ విమానం ఎక్కాం. మధ్యాహ్నం 2. 30 కి బయలు దేరిన విమానం సాయంత్రం 4. 30 కి డెహ్రాడూన్ సురక్షితంగా చేరింది. అక్కడ నుండి రెండు బస్సులలో ఈ లగేజీ లను పిల్లలు 5 గురూ (వీళ్లను సాయి గారు వాలంటీర్లు అనమ న్నారు) రెండు బస్సులలో సర్దేశారు. 


అక్కడ నుండి 40 కిలోమీటర్ ల ప్రయాణం ఒక గంటలో పూర్తి చేసుకొని అలా అందరం ఈ యాత్ర కి బేస్ క్యాంప్ లాంటి హరిద్వార్ కి చేరుకున్నాం. హరిద్వార్ అంటే నిజంగా హరి/హర నివాసాలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారమే అనిపిస్తుంది యాత్ర పూర్తయ్యేసరికి. 


దారిలో ఎంత వెతికినా వర్షం లో కొట్టుకుపోయాయి అని చెప్పిన రోడ్లు కాన రాలేదు. అలా హోటల్ Lalitude చేరాము. హోటల్ బాగుంది. వేడి వేడి టీ త్రాగి, allot చేసిన రూమ్లకి చేరుకున్నాం. పెద్దగా ఆ రోజు శ్రమ ఏమీ లేకపోయినా, ఎక్కువ విషయ పరిజ్ఞానం వల్ల వచ్చిన టెన్షన్ వలన అలసి నట్లు ఉంది అందరికీ. రాత్రి 8 గంటలకి భోజన సమయం లో తరువాయి రోజు ప్రోగ్రామ్ బ్రీఫింగ్ ఉంటుందని చెప్పారు. 


 రాత్రి డిన్నర్ ముందు రేపటి అంటే రెండవ రోజు ప్రోగ్రామ్ చెప్పారు. ముందు అనుకున్నట్లు రేపు ఉదయం గంగా స్నానం వుండదు, ఆఖరి రోజు ఫ్లైట్ సాయంత్రం కాబట్టి, ఆఖరి రోజు ఉదయం గంగా స్నానం వుంటుంది. ప్రస్తుతానికి రేపు అంటే రెండవ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినాక, మొదట మానస దేవి గుడి, తర్వాత చండీ దేవి గుడి, ఈ రెండు గుడులు చూడడానికి రోప్ వే పైన పోవాలి.


మధ్యాహ్నం లంచ్ చేసి కొంత సమయం రెస్ట్ తర్వాత గంగా హారతి చూడడం, తర్వాత హోటల్ కి వచ్చి డిన్నర్ చేయడం తో రేపు గడుస్తుందని చెప్పారు. సాయి గారు చెప్పింది సూటిగా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ ఆఫీసులో బాస్, ఇంట్లో భార్య అజమాయిషీ లో ఉండే మాలాంటి చాలా మందికి సాయి గారి అదుపాజ్ఞాలలోకి వెళ్ళడం కొంచెం కొత్తగా వున్నా, బాగుంది కూడా. 


కొత్త భార్య వచ్చింది అని అనలేను గాని, కొత్త బాస్ వచ్చినట్లుంది. ఈ విధంగా మా మొదటి రోజు యాత్ర సింపుల్ గా వున్నా, ఇంతమందితో కలసి ఉంటే ఎంత కష్టమైన యాత్ర అయినా ఫర్వాలేదు అనే ధైర్యంతో అందరం వేడి వేడి భోజనాలు చేసి నిష్క్రమించాం నిద్రపోవడం కోసం. 


ఇక్కడ ఈ ట్రిప్ లో పెట్టిన భోజనాల గురించి కొంత చెప్పుకోవాలి, నిజానికి ఎంత చెప్పినా తక్కువే. అసలు ముందే చెప్తే బాగుంటుంది అని అనుకున్నా, కానీ నాపై తిండిబోతు ముద్ర వేస్తారేమో అని ఆహా.. ఇక చెప్పాలి తప్పదు, భోజనాలు చాలా వేడి వేడిగా, శుచిగా, రుచిగా టైమ్ అంటే టైమ్ కి అందించారు. 


సాయి సత్ చరిత్రలో చెప్పినట్లు బాబా గారు తన దర్శనానికి వచ్చిన భక్తులకు తానే స్వయంగా సరుకులు అన్నీ క్వాలిటీ చెక్ చేసి మరీ తెచ్చి, స్వయంగా వండి వడ్డించే వారట. 

రచయిత హేమడ్ పంతు చెప్పింది.. తిన్న ప్రతి మెతుకు వంటికి వంటబట్టి తృప్తిని శక్తిని కలుగ చేసేది ఆ భోజనం. అలానే ఈ శుచి రుచి కలిగిన వేడి వేడి భోజనాల వల్లనే మా ప్రయాణ బడలిక, వంటి నొప్పులు ఏ రోజుకి ఆ రోజు పోయాయంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 


మాకు ఇంతకు ముందు సౌత్ ఇండియా టూర్లో భోజనం గురించి సాయి గారు చెప్పినట్లు "తినడానికి తీర్థానికి పోవాలట". ఇది ఇక్కడ నూటికి నూరు శాతం నిజం. నేనైతే ఫుడ్ ను బాగా ఎంజాయ్ చేసాను. 


ఇక ఉదయం ఇచ్చే కాఫీ గురించి చెప్పడానికి మాటలు చాలవు. రేపటి నుండి ఇక తిరుగుడే తిరుగుడు. తర్వాతి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మనం ముందే అనుకున్నట్లు బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకున్న సరే బాగుందని చెప్పండి.. 🙏 


ఇంకా వుంది

చార్ ధాం యాత్ర - పార్ట్ 2 త్వరలో..

***

పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

ree

పేరు: పుల్లేటికుర్తి నగేశ్ 

వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం. 

వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్ 

పుట్టిన ఊరు;;;;  శ్రీకాకుళం 

bottom of page