సౌందర్యమంటే?
- Malla Karunya Kumar

- 7 minutes ago
- 5 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #సౌందర్యమంటే?, #Soundaryamante, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

Soundaryamante - New Telugu Story Written By Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 07/12/2025
సౌందర్యమంటే? - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
ఎప్పటిలాగే తన గుండెల్లో గుబులు చెలరేగింది. 'దేవుడా ఈ సారైనా కనికరించు' అని తన లోలోపల దేవుడ్ని ప్రార్థిస్తూ లోపలున్న బాధని బయటకు కనబడనివ్వకుండా బలవంతంగా చిరునవ్వును తన పెదాలకు అద్దుకుంటూ ఎదురుగా కూర్చున్న వాళ్ళతో మాట కలిపాడు.
"అసలు విషయం తేలితే. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుదాం." చేతులతో సైగ చేస్తూ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి తల్లి తండ్రులు అసలు విషయం బయట పెట్టారు.
వాళ్ళ హావభావాలు, సైగ లతో విషయం తేటతెల్లం అయ్యింది రామనాథం కు. విస్తుపోతూ, "పంతులు గారు! మీతో చెప్పిన విషయాలేవీ వీళ్లతో చెప్పలేదా" ప్రశ్నార్థకంగా చూసాడు రామనాథం.
"ఆ అయ్యా! అది..." చేతిలో వున్న పంచాంగం వైపు చూస్తూ... ఏం చెప్పాలో తెలియక తటపటాయిస్తూ వున్నాడు పంతులు.
రామనాథం పంతులు సంభాషణ విని, "ఏమిటా అసలు విషయం! పంతులు గారు మాతో ఏమీ చెప్పలేదే." ఆశ్చర్యంతో అడిగాడు అబ్బాయి తల్లితండ్రులు.
"కట్నం గురించి నాకు ప్రస్తావించడం ఇష్టం లేదు. మా మనవరాలు ఉన్నత విద్య చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంది!. ఇక కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?" అన్నాడు రామనాధం.
"చోద్యంగా వుందే! అప్సరస ల్లాంటి వాళ్ళను కాలదన్ని వచ్చాం. ఎందుకనుకున్నారు. వచ్చే కోడలు లక్ష్మిని తీసుకువస్తే మా వాడికి కాస్త ఆర్దికంగా బాగుంటుందని. ముందే మీరు రిక్త వాక్యం చెప్తే ఎలా?. అటూఇటూ ఐనా పర్వాలేదు ఎంతోకొంత ఒక మాట అనుకుంటే బాగుటుంది " తెగేసి చెప్పారు వాళ్ళు.
”మీ నిర్ణయం అదే ఐతే! నా నిర్ణయం గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మాటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను." గుమ్మం వైపు దారి చూపిస్తూ అన్నాడు రామనాథం.
"బాగుంది!...పిలిచి మరీ వాత పెట్టడమంటే ఇదే. మీ మనవరాలు ఏమైనా బంగారం అనుకున్నారా!. చూడటానికే పెద్ద సాహసం చేయాలి. మరి పెళ్లాడడానికి ఇంకెంత సాహసం చేయాలి!. పాపం మా వాడు ఆ సాహసానికి సిద్దం అయ్యాడు.” నానా మాటలు ఆడి అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళు.
“అయ్యా, రామనాధం గారు! మీరు కాస్త ఆలోచించుకోవాలి. ఇలా పట్టుబడితే ఎలా?" తన పంచాంగాన్ని తన భుజానికి వున్న గుడ్డ సంచిలో పెడుతూ, తన మాటగా చెప్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు పంతులు.
అలవాటై పోయింది... ఎప్పుడూ వుండే మాటలే, కానీ ఎంత హృదయాన్ని రాయిలా చేద్దాం అనుకున్నా ఉప్పొంగిన సముద్ర కెరటంలా తనలో వున్న దుఃఖం తన మనసును కుదురుగా ఉండనీయడం లేదు. అంతకు మునుపటి వరకు తళుక్కు మంటూ మెరిసిపోతున్న తన శరీరం వున్న అభరణాలు ఇప్పుడెందుకో కళా విహీనంగా మారిపోయాయి. దుఃఖ భారంతో ఆమె కృంగిపోతూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది.
మనవరాలు దీనస్థితి చూసి, 'ఎందుకు స్వామి కనికరం చూపించడం లేదు. నా మొర ఎప్పటికి ఆలకిస్తావు!.' నిట్టూర్చుతూ, ఉప్పొంగిన తన దుఃఖానికి తనకు తను సర్దిచెప్పుకొని అడ్డుకట్ట వేస్తూ, "తల్లి! ఈ తాతయ్య నిర్ణయం కరుగ్గా ఉందా! నా మాటలు వాళ్ళతో పాటు నిన్ను ఇబ్బంది పెట్టాయా!" ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు.
కన్నీళ్లను తుడుచుకుంటూ, "ఈ కురూపికి సౌందర్య అని ఎందుకు పేరు పెట్టారు తాతయ్య!. నా పేరు తలుచుకుంటేనే నాకు అసహ్యంగా, వెక్కిరింపుగా వుంది." హృదయంలో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని ఒక్కసారిగా బయటకు కక్కేసింది.
"తల్లి! ఏ తల్లితండ్రులకైనా తమ పిల్లలు సౌందర్యంగానే కనిపిస్తారు. అలా నీ తల్లితండ్రులు నీకు ఆ పేరు పెట్టారు. అంతే కానీ నీ శరీర ఛాయను చూసి పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు మనకు దూరం అవడం ఇద్దరి దురదృష్టం. ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు. ఈ లోకం తో నువ్వు ఎలా వేగుతావో నాకు భయంగా వుంది తల్లి." మనస్సును ఛిద్రం చేస్తున్న దుఃఖాన్ని వెళ్లగక్కుతూ వాపోయాడు.
ఎప్పుడూ తాతయ్య నుండి అటువంటి మాటలు తాను వినలేదు. ఎప్పుడూ ధైర్యానికి చిహ్నంగా, ధైర్యంగా మాటలు చెప్పే తాతయ్య నుండి ఈ మాటలు విని తను కంగారు పడింది.
"అయ్యో తాతయ్య! ఏమిటా మాటలు. నీకు నేను వున్నాను కదా. నేను ఉండగా భయం ఎందుకు?." పక్కనే వున్న తాతయ్య భుజం పై చేయి వేస్తూ అంది.
"తల్లి.. నేను కట్నం ఇవ్వలేక కాదు. అసలు ఈ ఆస్తి అంతా నీదే కదా. కట్నం కోసం ఆశపడి వచ్చిన వాళ్ళు మనుషులుకు ఏం విలువ ఇస్తారు తల్లి, లేని మచ్చలు అంటించి మనస్సు గాయ పరుస్తారు. నేను అలాంటి వారికి వ్యతిరేకం." తన ఉద్దేశం బయట పెట్టాడు.
"మీ గురించి నాకు తెలియదా! మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు. ఆ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మీరు చెప్పింది నిజమే కానీ, నా రంగు చూసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు తాతయ్య?. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ రంగు తో ఆ దేవుడు నన్ను పుట్టించాడు!." కళ్ళలో దుఃఖ ప్రవాహాలు ఏరులై సాగుతున్నాయి.
“అయ్యో తల్లి, ఇలా నువ్వు ఏడిస్తే నేనేమైపోవాలి?. వద్దు నువ్వు ఎవడవకు. నీకు ఒక మాట చెప్పనా... మనం పుట్టినప్పుడే ఆ దేవుడు మనకు కాబోయే జీవిత భాగస్వామిని కూడా పుట్టించుంటాడు. తప్పకుండా నీకోసం అతను వస్తాడు. అప్పటి వరకు ఓపికగా మనం ఎదురుచూడాలి." మనవరాలును ఓదార్చుతూ అన్నాడు.
తాతయ్య మాటలకు నవ్వేసింది కానీ మనసులో ఏదో తెలియని సందిగ్ధత, విరక్తి, కోపం, బాధ... ఈ సుడిగుండాలు తో ఆమె సతమతమౌతుంది.
మరుసటి రోజు ఒక పత్రిక తో సౌందర్య దగ్గరకు చేరుకున్నాడు రామనాధం. ఆమెకు ఆ పత్రిక ఇచ్చాడు.
"ఏమిటి తాతయ్య!." అని ఆశ్చర్యంతో అంటూ ఆ పత్రిక తీసుకొని ఆ ప్రకటన చూసి ఒక్కసారిగా నవ్వింది.
"ఏమిటి తాతయ్య! మిస్ యూనివర్స్ పోటీ ప్రకటన తీసుకు వచ్చి నాకు ఇచ్చావు." నవ్వుతూ అంది.
"నువ్వు ఆ పోటీలకు వెళ్ళాలి."
ఒక్కసారిగా తన నవ్వు ఆపేసింది. మౌనం దాల్చింది.
"నాకు తెలుసు నీ కోరిక ఏమిటో! చిన్నప్పుడు కూడా ఇలానే ఈ ప్రకటన చూసి నేను పాల్గొనాలి అనేదానివి. చిన్న నమ్మకం ఇస్తే నేనేంటో నిరూపిస్తానని అంటుండే దానివి. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది అనుకో, పోటీకి సిద్దం అవ్వు." అన్నాడు రామనాధం.
"చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం అలా అని అన్నీ అవ్వలేము కదా... ఈ కల కూడా నెరవేరని ఒక కల. నన్ను హింసించే పీడ కల" విరక్తి వాక్యాలు ధ్వనిస్తూ వున్నాయి.
"అయితే ఎప్పటి నుండో నీతో చెప్పాలనుకొని ఆగిపోయాను. ఆ మాటేంటో తెలుసా? నిన్ను మిస్ యూనివర్స్ గా చూడాలన్న నా కల నెరవేర్చుతావా?."
అడిగాడు రామనాధం.
కాసేపు ఆగి, "ఏమిటి తాతయ్య! అక్కడకు వెళ్లి వాళ్ళతో కూడా మాటలు పడాలనా నీ ఉద్దేశ్యం?" తాతయ్య కలను నెరవేర్చలేను అని తన నిస్సహాయత కు బాధపడుతుంది.
"నాకు నమ్మకం వుంది నువ్వు గెలుస్తావని. ఇదే నా చివరి కోరిక." అంటూ మరేం మాట్లాడలేదు రామనాధం.
"సరే, నా కోసం కాకపోయినా నీకోసం వెళ్తున్నాను." మాట ఇచ్చిందే కానీ తనలో సందిగ్ధత.
"నీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను." అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఒక పది నిముషాల తర్వాత ఒక కవర్ తో వచ్చాడు. దాన్ని సౌందర్య కు ఇస్తూ, "ఇది నువ్వు విజయం సాధించిన తర్వాత తెరిచి చూడు." అని చెప్పాడు.
దాన్ని తీసుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటిది అని అడిగింది.
"చెప్పాను కదా నువ్వు విజయం సాధించిన తర్వాత చూడు." అని చెప్పాడు రామనాధం.
********
ఒక్కసారిగా తన పేరు పిలవడం తో జ్ఞాపకాల నుండి తేరుకుంది.
చివరి రౌండ్ కు పిలుస్తున్నారు. మెల్లగా స్టేజ్ వైపుకు అడుగులు వేస్తుంది. వెళ్ళి తోటి ఫైనలిస్ట్ పక్కన నిల్చుంది. కానీ ఏదో సందిగ్ధత చోటు చేసుకుంది. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తనకు జరిగిన అవమానాలను గుర్తు తెచ్చుకుంది. ఎలాగైనా గెలవాలని తనలో కసిని రగిల్చాయి ఆ మాటలు...
న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు తడబాటు లేకుండా సమాధానం ఇచ్చింది. కొంత సమయం విరామం తర్వాత ఫలితాలు ప్రకటించారు. అనూహ్యంగా సౌందర్య విజేతగా నిలిచింది. కిందటి సంవత్సరం విజేతగా నిలిచిన మెక్సికో సుందరి సౌందర్య కు కిరీటం అలంకరించింది.
కళ్ళలో ఆనందభాష్పాలు. ఇదంతా నిజమేనా అని అనుకుంటుంది. కార్యక్రమం పూర్తైన తర్వాత తనకి కేటాయించిన గదికి చేరుకుంది. తాతయ్య ఇచ్చిన కవర్ గుర్తుకు వచ్చి వేగంగా దాన్ని తెరిచి చూసింది. దానిలో ఒక లేఖ వుంది. దాన్ని చదవడం ప్రారంభించింది.
"నాకు జీవితమంటే, మరణమంటే ఎటువంటి భయం లేదు తల్లి. ఆ భయాన్ని నటించాల్సి వచ్చింది ఎందుకో తెలుసా!. నీలో ఉన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని తట్టిలేపడానికి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటో తెలుసా? మనల్ని మనం ప్రేమించుకోవడం, ఆరాధించండి. నిష్కల్మషమైన హృదయంతో వుండడం. ఇదే నిజమైన సౌందర్యం, విశ్వ సౌందర్యం!. నీకు సౌందర్య పేరు పెట్టారని నువ్వు చాలా బాధపడుతుంటావు. ఇప్పటికైనా ఆ పేరుకి అర్ధం గ్రహించావు అనుకుంటూ. చివరిగా విశ్వసుందరి కి శుభాకాంక్షలు." ఆ లెటర్లో వున్న అక్షరాలు చదివింది సౌందర్య.
ఆనందంతో వెల్లివిరిసిన తన హృదయ సంద్రం నుండి ఆవిరిగా మారిన కన్నీళ్లు తన కనుల మేఘాలు నుండి జారుతూ ఆ లేఖను తాకాయి.
'అవును ఇంకా ఈ ప్రపంచంలో నిజమైన సౌందర్యం గుర్తించే వాళ్ళు వున్నారు!. ఆత్మ సౌందర్యం మిన్న అని చాటిచెప్పే వాళ్ళు వున్నారు. అయితే అప్పటి వరకు మనం చేయాల్సింది అవిశ్రాంత కృషి మాత్రమే!.' ఆమె ముఖంలో వేల సూర్యుల సమానమైన ఓ వెలుగు ప్రత్యక్షం అయ్యింది.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.




Comments