top of page
Original.png

మదిలో మల్లెల మాల - పార్ట్ 4

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Madilo Mallela Mala - Part 4 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 06/12/2025

మదిలో మల్లెల మాల - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

జరిగిన కథ:

ఛైర్మన్ రామారావు గారి అమ్మాయికి లవ్ లెటర్ రాసాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని అతని ఇంటికి తీసుకొని వెళతారు. రమణను సస్పెండ్ చేయమని రామారావు చెబుతారు. తండ్రి రామశర్మను గుర్తుకు తెచ్చుకుంటాడు రమణ.


ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 4 చదవండి.

భోజనానంతరం రంజనీ తన గదికి వెళ్ళిపోయింది. రామారావుగారు వారి గదికి వెళ్ళిపోయారు. 

లక్ష్మీదేవి.. అన్నింటినీ సర్ది రంజనీ గదిలో ప్రవేశించింది. 

రంజనీ మంచంపై పడుకొని సైన్స్ నోట్సును చదువుతూ ఉంది. తల్లిని చూచి, లేచి కూర్చుంది. 


"పడుకొని చదవకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను!.. "

గద్దించినట్లు అడిగింది లక్ష్మీదేవి. 


ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది రంజనీ. 

"నీవు ఈ రోజు చాలా పెద్ద తప్పు చేశావు రంజనీ. "


"నేనేం తప్పు చేశానమ్మా!.. "


"ఆ లవ్ లెటర్‍ను తెచ్చి మీ నాన్నగారికి చూపించడమే నీవు చేసిన తప్పు. "


"అది నీకు తప్పుగా అనిపిస్తూ వుందా అమ్మా!"


"అవును"


"ఎందుకమ్మా.. నామీద నీకు ఇంత కోపం?.. ఆ చెత్త లేఖను నాన్నగారికి ఇవ్వకుండా వేరేవరికి ఇవ్వాలి?"


"మీ ప్రిన్సిపాల్ గారికి. నీవు చేసిన ఈ పని వల్ల ఆ పిల్లవాడి విషయంలో మీ నాన్నగారు తప్పు చేశారు. కాలేజీలో ఎవరు ఏం చేసినా, న్యాయాన్యాయాలను విచారించి, తప్పు చేసిన వారిని శిక్షించవలసింది ప్రిన్సిపాల్ గారు. మీ నాన్నగారు కాదు. "


"ఆ కాలేజీ మనదమ్మా!" అంది రంజనీ. 


"అందుకే నీలో ఇంత అహంకారం" ఆవేశంగా అంది లక్ష్మీదేవి. 


రంజనీకి మాటలు కరువయ్యాయి. తనకు తెలిసి తన తల్లి.. ఇంత కోపంగా తనతో మాట్లాడింది ఇంతవరకూ లేదు. బిక్కమొఖంతో తల్లినే చూస్తూ వుండిపోయింది రంజనీ. 


"ఆ అబ్బాయి ఎవరో కాదు మా వూరి వాడు. వాళ్ళ తండ్రి సత్ బ్రాహ్మణుడు. పురోహితుడు. నా వివాహాన్ని జరిపించింది వారే. మా వూర్లో వారిని ’ధర్మరాజు’ అని పిలుస్తారు. వారి పేరు రామశర్మ. పార్వతీ మాత ఉపాసకులు. వారి నోటి నుండి వెలువడిన మాట జరిగి తీరుతుంది. అలాంటి వ్యక్తి కడుపున, నీవు.. నీ తండ్రి అనుకొనేటంతటి నీచుడు పుట్టి ఉండడు. 


మీ నాన్నగారు ఆ అబ్బాయితో, ప్రిన్సిపాల్ గారితో జరిపిన సంభాషణ అంతా విన్నాను. అన్నీ విని.. చివరగా ఆ అబ్బాయి ఏడుస్తూ.. ’సార్!.. మీరు నాపై మోపిన నేరాన్ని నేను చేయలేదు. నేను సంపదలేని పేదవాణ్ణి కానీ, గుణంలో నేను పేదవాణ్ణి కాను’ అన్నాడు. 


ఆ మాటలు నిజం. ఆ క్షణంలో నాకు అతని ముఖంలో నీతి, నిజాయితీ కనిపించాయి. కిటికీ గుండా హాల్లో జరిగిన భాగవతాన్నంతా నేను చూచాను. నీ కారణంగా ప్రిన్సిపాల్ గారు నెలరోజుల్లో పరీక్షలు వున్నా.. మీ నాన్నగారి ఆదేశానుసారంగా అతన్ని కాలేజీ నుంచి తొలగించవలసిన స్థితి ఏర్పడింది. 


నీ పూర్వజన్మ సుకృతం కొద్దీ ఈ ఇంట పుట్టి భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు. తండ్రి గారాల కూతురివి. కాబట్టి నీవు ఏది చేసినా చెల్లుతుందని అనుకోకు. అది చాలా తప్పు. సాటి మనుషులను మనుషులుగా చూడటం నేర్చుకో రంజనీ. పవర్ నీ చేతిలో వుందని వెనుకా ముందూ ఆలోచించకుండా విచక్షణా రహితంగా మీ అన్నయ్యలా నడుచుకోవడాన్ని మానుకో. 


నీవు ఆడపిల్లవు. ఒక ఇంటికి పోవలసినదానవు. ఆ ఇంట నీవు నీ భర్తనే కాక.. ఇంట వున్న వారందరినీ మెప్పించి వారిని నీవు గెలవాలి. అలాంటి గెలుపు నీకు రావాలంటే నీకు శాంతం, సహనం, సంఘీభావం అవసరం. నా తల్లి నాకు యివి నేర్పింది. ఈవాళ నీ వల్ల తప్పు జరిగింది కాబట్టి.. ఇక మీదట ఎన్నడూ ఇలాంటి తప్పును నీవు చేయకూడదని.. నిన్ను కన్నతల్లిగా నా బాధ్యతగా ఇవన్నీ నీకు చెప్పాను. అది నా ధర్మం. యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి, పాటించడం నీ ధర్మం అవుతుంది" చెప్పడాన్ని ఆపి లక్ష్మీదేవి మంచంపై కూర్చొని రంజనీ ముఖంలోకి చూచింది. 


ఆమె వదనం కళా విహీనంగా వుంది. మనస్సులో అమ్మ చెప్పినట్లుగా తను తప్పు చేశాననే భావన. 

"ఐయాం సారీ అమ్మా!" దీనంగా అంది రంజని. 


"హుఁ.. సారీ!.. నాకు నీవు సారీ చెప్పినంత మాత్రాన ఆ అబ్బాయికి మేలు చేసిన దానివౌతావని అనుకొంటున్నావా?, .. చూడు!.. నీవు ఆడపిల్లవన్న మాట మరిచిపోకు. నీ వివాహానంతరం నీ అంపకాల సమయంలో ఎంతో సౌమ్యంగా కన్నీటితో నేను చెప్పవలసిన మాటలవి. ఈనాడు నీవు చేసిన పని కారణంగా అది నాకు నచ్చనందున, ఇంత ఆవేశంగా నీతో చెప్పవలసి వచ్చింది. అది ఒక తల్లిగా నా కర్తవ్యంగా భావించాను. చెప్పాను. 


నా మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకొని పాటించి ఈ నీ తల్లిని ఆనందాన్ని కలిగిస్తావో.. నా మాటలను పెడ చెవిన పెట్టి మీ అన్నయ్యలా ప్రవర్తిస్తావో, అది నీ చేతుల్లో వుంది. అంతే కాదు నీవు తెలుసుకోవలసింది ఇంకా వుంది. 


మనిషిలోని మంచి చెడ్డలకు కొలబద్ధ సిరి సంపదలు కావు. అవి శాశ్వతంగా ఎవరి వద్దనూ వుండబోవు. చేసే చేతల వలన రాజులు బంట్లు కావచ్చు. బంట్లు రాజులు కావచ్చు. అదంతా దైవనిర్ణయం. సాటి మానవుల పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం చేయకలిగినంత సాయం, చేయాలనే తలంపు ప్రతి మనిషినీ ఉన్నతికి చేరుస్తాయి. దీని వ్యతిరేకంగా ఆశ అహంకారం స్వాతిశయంతో మనుగడ సాగించిన వారు.. కడకు అష్టకష్టాల పాలవుతారు. ఇది జీవిత సత్యం. 


నా దృష్టిలో.. మన ఈ ఆడజన్మ ఎంతో గొప్పది తల్లీ!.. ప్రతి స్త్రీ మూర్తి, శాంతి, సహనం, స్నేహభావాలకు ప్రతిరూపం. ఆ మూర్తికి.. అమ్మగా, పిన్నమ్మగా, పెద్దమ్మగా, వదినగా, అత్తయ్యగా, నానమ్మ, అమ్మమ్మగా.. వయస్సు రీత్యా ఎన్నో రూపాంతరాలు, ఆయ పేర్లతో పిలువబడుతుంది. అయిన వారి యొక్క, తెలిసిన వారియొక్క, ఆదరాభిమానాలను పొంద కలుగుతుంది. 


ఈ ఘనకీర్తి ఆడజన్మకు సొంతం, నీవు నాకు ఒక్కగానొక్కదానివి. నా బిడ్డ సంఘంలో సాటి సమాజంలో మంచి పేరుతో గొప్పగా బ్రతకాలని నా ఆశ చిట్టితల్లీ. ఈ అమ్మ చెప్పిన మాటల్లో నీకు ఆవేశం గోచరించి వుండవచ్చు. నేను చెప్పిందంతా నీ మంచికేనమ్మా. నీ మీద నాకు కోపం లేదు. ఎన్నటికి వుండబోదు" లక్ష్మీదేవి చెప్పడం ఆపేసింది. 

రంజనీ చెవులకు జడివాన కురిసి వెలసినట్లనిపించింది. మనస్సులో ఒకమూల తాను తప్పుచేశాననే భావన కలిగింది. అమ్మ చెప్పిన మాటలన్నీ యధార్థాలే అనే తలంపు. జేవురించిన ముఖాన్ని సాలోచనగా క్రిందికి దించుకొంది. 

కొద్దిక్షణాలు.. 


కూతురి వాలకాన్ని చూచి, పవిటతో ఆమె ముఖాన్ని తుడిచి.. 

"బాధపడకు. నేను చెప్పిన వాటిని జ్ఞాపకం వుంచుకో. శ్రద్ధగా చదువుకో" నవ్వుతూ చెప్పి లక్ష్మీదేవి గదినుంచి బయటికి నడిచింది. 


రంజనీ కళ్ళల్లో నీళ్ళు.. తప్పుచేసిన దానికి సాక్షిగా నిలిచాయి. మంచంపై తల్లి చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ వాలిపోయింది. 


పడకగదికి వచ్చి ప్రక్కన మౌనంగా పడుకొన్న భార్యను చూచాడు రామారావు. కదలిక మాట లేకుండా ఆమె పడుకొన్న తీరును చూచి లక్ష్మీదేవి అప్రసన్నంగా వున్న విషయం రామారావుకు అర్థం అయింది. 


"లక్ష్మీ!.. " మెల్లగా పిలిచాడు రామారావు. 


ఆమె పలకలేదు. కదల్లేదు. 

కొన్ని క్షణాల తర్వాత పడుకొని వున్న రామారావు కూర్చొని, భార్య భుజంపై చేయివేసి.. 

"దేవిగారికి నామీద కోపమా!.. ఏం తప్పు చేశానబ్బా!" 

సాలోచనగా పైన తిరుగుతున్న ఫ్యాన్‍ను చూస్తూ అన్నాడు రామారావు. 

అతని చేతిని ప్రక్కకు నెట్టి లక్ష్మీ లేచి కూర్చుంది. భర్త ముఖంలోకి చూచింది. 

నవ్వుతూ ఆమె ముఖంలోకి చూచాడు రామారావు. 


"నావల్ల ఏం తప్పు జరిగింది లక్ష్మీ!" అమాయకంగా అడిగాడు. 

"ఇంతలోకే మరిచిపోయారా?"


"ఏమిటది?"


"ఆ పేద పిల్లవాడు రమణ విషయంలో మీరు ఇచ్చిన తీర్పు."


"వాడు మన రంజనీకి ప్రేమలేఖ వ్రాశాడు లక్ష్మీ!.. "


"వాడు ఏడుస్తూ నేను వ్రాయలేదన్న మాటలు మీకు వినిపించలేదా!"


"వాడు చెప్పింది అబద్ధం. "


"వాడి విషయంలో ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాటలు అబద్ధాలే అంటారా!"


రామారావు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. భృకుటి ముడిపడింది తలను దించుకొన్నాడు. 


"ప్రతి విషయానికి నా సలహాను అడిగి తెలుసుకొనే మీరు.. ఈ విషయాన్ని గురించి నాతో ఎందుకు చెప్పలేదు. ఆ లేఖను నాకు ఎందుకు చూపించలేదు?"


"అది నా బిడ్డకు సంబంధించిన విషయం!.. " ఆవేశంగా అన్నాడు రామారావు. 


"ఏమన్నారు?.. మీ బిడ్డ!.. రంజనీ నాకూ కూతురన్న విషయాన్ని మరిచిపోయారా తమరు?"


ఈ ప్రశ్నకూ.. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రామారావు. 


ఏడుస్తూ వచ్చి రంజనీ ప్రేమలేఖను హాల్లో వున్న రామారావుకు అందించింది. ఆమె తన గదికి వెళ్ళిపోయింది. ఆమె వదనంలో విచారం, కన్నీళ్ళు. రామారావు గారిని ఆవేశానికి గురిచేశాయి. ఫోన్ చేసి వెంటనే రమణతో ప్రిన్సిపాల్ గారిని ఇంటికి రమ్మని ఆదేశించాడు. 


ఆ సమయాన.. లక్ష్మీదేవి శివాలయానికి వెళ్ళింది. ఇంటి వెనుక ద్వారం గుండా వెళ్ళి.. అదే ద్వారం గుండా రామారావు గారు విచారణ సాగిస్తున్న సమయంలో వచ్చింది. కిటికీ గుండా హాల్లో జరిగిన విచారణను చూచింది. రామారావు గారి తీర్పును విన్నది. 


"ఆ సమయంలో.. ఆవేశంతో నేను వెనుకాముందూ ఆలోచించలేకపోయాను లక్ష్మీ. నీవు శివాలయానికి చెప్పి వెళ్ళావు కదా!.. " అనునయంగా చెప్పాడు రామారావు. 


"నేను వచ్చేదాకా ఆగలేకపోయారు కదూ!.. "


"అవును" తన తప్పును ఒప్పుకొన్నాడు రామారావు. 


"ఆవేశం అనర్థానికి దారి తీస్తుందనే విషయాన్ని మరచిపోయారు. కాలేజీ మీది.. హాస్టల్ మీది.. పనిచేసే వారంతా మీవారే, మీరు సర్వాధికారులు. మీకు తోచినట్లు చేయగలరు. మీరు ఇచ్చే జీతాలు తీసుకొంటున్నదానికి.. ప్రిన్సిపాల్ గారు కూడా మీకు బదులు చెప్పలేక మీ ఆజ్ఞను పాటించారు. ఆ పిల్లవాణ్ణి డిస్మిస్ చేశారు. వాడి భవిష్యత్తును నాశనం చేశారు. 


నేను ఆ పని చేయలేదని వాడు ఏడుస్తూ అన్న మాటల్లోని నిజాయితీ మీకు కనిపించలేదు. కిటికీ గుండా చూచిన నాకు.. కనిపించింది. మీరిచ్చిన తీర్పుకు ప్రిన్సిపాల్ గారి ముఖంలో నాకు కనిపించిన భావాలు మీకు కనిపించలేదు. 


క్షణికావేశంతో మీరు ఆ అబ్బాయి భవిష్యత్తును నాశనం చేశారండీ. మీ కూతురూ.. మీరూ ఇద్దరూ తప్పు చేశారు. ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను. సమర్థించలేను" విచారంగా చెప్పింది లక్ష్మీదేవి. 


కార్యేషుదాసి, కరణేషు మంత్రి, భోజ్యోషు మాత, శయనేషు రంభ.. పెద్దల ఈ వాక్కులు రామారావు గారికి గుర్తుగా వచ్చాయి. కూతురు కన్నీరు తనలో విచక్షణా జ్ఞానాన్ని హరించింది. ఆవేశాన్ని పెంచింది. ఇంతకాలంగా అన్ని విషయాల్లో.. వ్యవహారాల్లో తన అర్థాంగి సలహాలను పాటించిన మనిషి.. ఈన్నాడు ఆమెను గురించి ఆలోచించకుండానే త్వరపడ్డాడు. స్వనిర్ణయాన్ని అమలు పరిచాడు. 


భార్య మాటలు.. యధార్థాలని రామారావు గారి మనస్సు ఘోషిస్తూ వుంది. 


లక్ష్మీదేవి.. గుణవతి, విద్యావతి (బి. ఎ) సౌశీల్య, పాతిక సంవత్సరాల క్రిందట తన యిల్లాలుగా.. ఆ యింట అడుగు పెట్టింది. భార్యా భర్తల అన్యోన్యతకు మారుపేరుగా నిలిచింది. అత్తామామలను కన్న తల్లిదండ్రుల వలే ప్రేమాభిమానాలతో అభిమానించింది. వారికి సేవలు చేసింది. ఇరువురూ వయోరీత్యా ఆమె చేతుల్లోనే ప్రాణాలు విడిచారు. 


తల్లిదండ్రులు ఒకే సంవత్సరంలో గతించిన కారణంగా ఎంతో విచారంలో మునిగి పోయిన రామారావుకు ధైర్యం కల్పించింది. హితవాక్యాలు చెప్పింది. ఓదార్చింది. నేను మీ జీవిత భాగస్వామిగా వున్నంత వరకూ మీకు ఎలాంటి విచారమూ వద్దూ. అన్నింటికీ నేను మీకు అండగా వుంటానని మాట యిచ్చింది. 



తను.. వీటన్నింటినీ మరిచి ఈనాడు తొందరపడ్డాడు. తప్పు చేశాడు. 


సింహావలోకనంతో తను చేసిన తప్పును తెలుసుకొన్నాడు రామారావు. భార్యను సమీపించాడు. 


"నా వల్ల తప్పు జరిగింది. నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఆ అబ్బాయి కాలేజీకి వచ్చేలా చేస్తాను. నీవు నన్ను కోపంగా చూస్తే నేను భరించలేను లక్ష్మీ!.. " దీనంగా భార్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రామారావు. 


ఆనందంగా నవ్వుతూ భర్త కళ్ళల్లోకి చూచింది లక్ష్మీదేవి. 

అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలు. 

============================================================

ఇంకా వుంది..

మదిలో మల్లెల మాల - పార్ట్ 5 త్వరలో

============================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page