మదిలో మల్లెల మాల - పార్ట్ 3
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Dec 2, 2025
- 6 min read
Updated: Dec 6, 2025
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 3 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 27/11/2025
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ:
ఛైర్మన్ రామారావు గారి అమ్మాయికి లవ్ లెటర్ రాసాడని అభియోగంపై రమణ అనే విద్యార్థిని అతని ఇంటికి తీసుకొని వెళతారు. రమణను సస్పెండ్ చేయమని రామారావు చెబుతారు.
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 3 చదవండి.
ఆవేదన, అవమానం, ఆక్రోశంతో రమణ హాస్టల్ రెండవ అంతస్థు టెరస్‍పై ఓ మూల కూర్చొని వున్నాడు. అతని ప్రియ మిత్రులు పదిమంది అతని చుట్టూ కూర్చొని వున్నారు. అందరి ముఖాల్లో ఆవేదన, ఆవేశం. రమణ ఆ ప్రేమ లేఖను వ్రాసి వుండడని వారందరికీ తెలుసు. అందుకే వారు బాధపడుతున్నారు. అతన్ని ఓదార్చే దానికి ప్రయత్నిస్తున్నారు.
"రమణా!... బాధపడకురా. నీవు యిలా కూర్చొని వుంటే... నిన్ను చూస్తున్న మాకందరికీ ఏడుపు వస్తూ వుంది. నీవు ఆ నేరం చేయలేదు కదా!... నీకెందుకు రా భయం!...."
"ప్రిన్సిపాల్ గారికి నీవంటే ఎంతో యిష్టం. వారు నీకు తప్పకుండా సాయం చేస్తార్రా."
"నీవు వచ్చిన తర్వాత వారు రామారావు గారితో నీ విషయాన్ని గురించే మాట్లాడి వుంటారు. నీకు టి.సి ఇచ్చి పంపరు రా."
"నీవు మాతోపాటే కాలేజికి వస్తావ్. నెలరోజులు క్షణాలుగా గడిచిపోతాయి. పరీక్షలు నీవూ మాతో పాటే రాస్తావు."
"రేయ్!... నీవు ఇలా ముడుచుకొని కన్నీటితో కూర్చోకురా. నీవు చేయని నేరాన్ని గురించి నీవు ఎందుకురా చింతించడం. లే, పద... భోం చేద్దాం."
ఆప్తమిత్రులు.... తమకు తోచిన ప్రీతి వచనాలను పలికారు. రమణను ఓదార్చే దానికి ప్రయత్నించారు.
"నాకు ఆకలిగా లేదురా. మీరంతా వెళ్ళి భోంచేసి రండి" మనోవ్యధతో నిట్టూర్చాడు రమణ.
విశాల గగనంలో పున్నమి చంద్రుడు. రమణ విచారంగా ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాడు.
కొన్ని క్షణాల తర్వాత....
కూర్చున్న చోటునుంచి లేచి టెర్రస్‍పై అటూ యిటూ పచారు చేయసాగాడు సాలోచనగా. తన తోటే నడుస్తున్న స్నేహితులు... వారు మాట్లాడుకొనే మాటలు అతనికి ఎంతో చికాకుగా తోచాయి.
ఆగి.....
"చెప్పాను కదరా!... మీరంతా వెళ్ళి భోంచేయండి. నన్ను కాసేపు ఒంటరిగా వుండనీయండి ప్లీజ్ గో" కాస్త విసుగ్గానే చెప్పాడు రమణ.
హితులందరూ... అతని తత్వాన్ని ఎరిగిన వారైనందున, అందరూ మౌనంగా డైనింగ్ హాల్ వైపు వెళ్ళారు.
ప్రశాంతమైన నిశీధి, చంద్రుని పున్నమి వెన్నెల,.... ఉత్తరపు దిశలో వున్న తన కాలేజ్. పడమటి వైపున వున్న రామారావు గారి భవంతి. కొన్ని క్షణాలు అన్నింటినీ కన్నార్పకుండా పరీక్షగా చూచాడు రమణ.
నిన్నటివరకూ ఆ కాలేజీలో తను పున్నమి చంద్రునిలా వెలిగిపోయాడు. ఆటల్లో చదువుల్లో తనదే పైచేయి.
కానీ ఈనాడు... ఆ చంద్రునికి కళంకం ఆపాదించింది. పెద్ద తప్పు చేసిన వాడనే చెడ్డపేరు.... కాలేజి నుంచి సస్పెండ్ కావలసిన స్థితి ఏర్పడింది.
రేపు కృష్ణపౌడ్యమి. దిన దినానికి చంద్రుని కళ తరిగిపోతుంది. శుక్ల పక్షపు చంద్రునిలా తనకు వున్న పేరు గుర్తింపు తరిగిపోతుంది. సస్పెండ్ అయిన కారణంగా తను కాలేజికి వెళ్ళలేడు. ఇక్కడ వుంటే తన మనస్సులో ఈ చేదు జ్ఞాపకాలే వుంటాయి. చదువు సాగదు. ’వెంటనే వూరికి... అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. జరిగిన విషయాన్ని అమ్మకు చెప్పాలి. ముందు తను ఏడ్చినా... తర్వాత నన్ను దగ్గరకు తీసుకొని ధైర్యం చెబుతుంది. నన్ను ఓదారుస్తుంది.
నాకు బ్రతుకు మీదా ఆశలు కల్పిస్తుంది. నేను ప్రశాంతంగా చదువుకొనే దానికి వున్నంతలో అన్నింటినీ సమకూర్చుతుంది. చదవాలి... బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. అమ్మకు ఆనందాన్ని కలిగించాలి."
రమణ ఈ నిర్ణయానికి వచ్చాడు. కాలేజ్ వైపుకు చూచాడు. ఆ భవంతి టెర్రస్‍పై విద్యామతల్లి సరస్వతి నిలబడి నవ్వుతూ తన్నే చూస్తున్నట్లు గోచరించింది.
ఆమె తన కుడి హస్తాన్ని ఎత్తి తన్ను దీవిస్తున్నట్లు కనిపించింది. రమణ వదనంలో ఎంతో ఆనందం, చేతులు జోడించి వినయంగా ఆ తల్లికి నమస్కరించాడు. కొన్ని క్షణాల తర్వాత... ఆ మాత కనుమరుగైంది.
రమణ చూపులు రామారావు గారి భవంతివైపుకు తిరిగాయి. ఆ భవంతి టెర్రస్‍పై రామారావు, అతని కుమారుడు... రంగారావు అతనికి గోచరించారు. రంజనీ అన్న రంగారావు తోక త్రొక్కిన తాచులా అటూ ఇటూ పచారు చేస్తూ తండ్రితో ఏదో వాదిస్తున్నాడు. జేబు నుంచి తుపాకిని బయటికి తీశాడు. తండ్రిని సమీపించి ఆగ్రహావేశాలతో ఏదో మాట్లాడాడు.
ఈ దృశ్యం రమణ మనస్సుకు ఎంతో భయాన్ని కలిగించింది. గట్టిగా కళ్ళు మూసుకొన్నాడు.
రంగారావు ఆగ్రహావేశాలతో తన ఎదుట నిలిచాడు. తనను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. తుపాకిని గురిపెట్టి తనకు దగ్గరగా వస్తున్నాడు.
’ఎదవనాయాలా!.... నీవు నా చెల్లెలికి ప్రేమలేఖ వ్రాస్తావురా!... నీవెంత?.... నీ బ్రతుకెంత?.... ఒక్క గుండకు నీవు ఖాళీ....’ కసిగా పళ్ళు కొరుకుతున్నాడు.
భయంతో... మూసిన కళ్ళను తెరిచాడు రమణ. అవును. తను రామారావు గారి యింటికి వెళ్ళినప్పుడు అతను ఇంట్లో లేడు. అది ఆ కష్ట సమయంలో ఆ దేవుడు తనకు చేసిన సహాయం. అతనే ఇంట్లో వుండి వుంటే తప్పకుండా తన్ను కాల్చి చంపేసేవాడే. ఈపాటికి తన కథ ముగిసుండేది.
వార్డన్ రంగయ్య టెర్రస్ పైకి వచ్చాడు. రమణను సమీపించాడు.
"బాబూ!... రమణా!.... అందరూ భోం చేశారు. గడచిన దాన్ని గురించి విచారించి బాధపడి ప్రయోజనం లేదు. ప్రతి మనిషీ అనుకొన్నది.... అనుకొన్నట్లు జరుగదు. ఎంతో తెలివైన వాడివి. నీవు నిర్దోషివి. గిట్టని వాళ్ళు ఎవరో ఆ పని చేసి నిన్ను దోషిని చేశారు. బాధపడకు. సమస్యను ధైర్యంతో ఎదుర్కోవాలి. ఈనాడు కాకపోయిన... ఒకనాడు అసలు నేరస్థుడు ఎవరన్నదీ ప్రిన్సిపాల్ గారు తప్పకుండా కనిపెడతారు. వాణ్ణి అందరి ముందూ నిలబెడతారు. వాడు చేసిన నేరానికి తగిన శిక్షను విధిస్తారు. పొద్దుపోయింది. రా!... భోంచేద్దాం. నీవు తినలేదని నేనూ తినలేదు." అనునయంగా చెప్పాడు రంగయ్య.
"నేను ఆ లేఖని వ్రాయలేదు బాబాయ్. మా అమ్మ తోడు" రమణ కంఠం బొంగురుపోయింది.
"నీవు వ్రాశవా అని నేను నిన్ను అడిగానా!.... అన్నానా!... నీవు నిర్దోషివని నాకు తెలుసు బాబు. భోం చేసి స్థిమితంగా పడుకో. ఐదు గంటలకు మీ వూరికి బస్సు ఉంది. దాన్నెక్కి మీ వూరికి వెళ్ళిపో. యధార్థం చెప్పాలంటే నీవు చాలా అదృష్టవంతుడివి. రామారావు గారి కొడుకు రంగారావు వూర్లో లేడు. రామారావు గారు చాలా మంచివారు. కానీ... వాడు ఆయనకు పూర్తి వ్యతిరేకం. పరమనీచుడు. వాడు వూర్లో వుంటే నిన్ను తప్పక కొట్టేవాడు. నిన్ను చిత్రవధ చేసేవాడు. ఈ విషయానికి నీవు సంతోషించాలి. మారు మాట్లాడకుండా నాతోరా" రమణ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు.
ఇరువురూ డైనింగ్ హాల్లో ప్రవేశించారు. రంగయ్య భోజనం ప్లేటును రమణ ముందు వుంచాడు. తనూ ఒక ప్లేటుతో అతని ప్రక్కన కూర్చున్నాడు.
"రమణా!... తిను. వేకువన నేను నిన్ను బస్సు ఎక్కిస్తాను" ఎంతో ప్రీతిగా చెప్పాడు రంగయ్య.
నాలుగు ముద్దలు తిన్నాడు రమణ. అన్నం తినాలనే ఆసక్తి లేదు అతనికి. రంగయ్య మాటను కాదనలేక ఏదో తిన్నట్లుగా నటించాడు. చేయి కడుకొన్నాడు.
వాచ్‍మెన్ ఇస్మాయేల్ లోనికి వచ్చాడు.
"రమణా!... ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ఆఫీస్ గదిలో వున్నారు. నిన్ను రమ్మన్నారు" అన్నాడు.
రమణ ఆశ్చర్యంగా ఇస్మాయేల్ ముఖంలోకి... రంగయ్య ముఖంలోకి మార్చి మార్చి చూచాడు.
"భయపడకు రమణా!... ప్రిన్సిపాల్ గారు నీ శ్రేయోభిలాషి. ఏదో మంచి విషయాన్నే నీకు చెప్పేదానికి వచ్చి వుంటారు పద" ఎంతో అభిమానంతో చెప్పాడు రంగయ్య.
ఇరువురూ ఆఫీస్ గదిలో ప్రవేశించారు.
"గుడ్ ఈవెనింగ్ సార్!" నవ్వుతూ చెప్పాడు రంగయ్య.
"గుడ్ ఈవెనింగ్"
రమణ చేతిని పైకెత్తి ప్రిన్సిపాల్ గారికి విష్ చేశాడు.
ధర్మారావు గారు కొన్ని క్షణాలు రమణ ముఖంలోకి చూచాడు. రమణ దీనంగా వారి ముఖంలోకి చూచాడు.
"రమణా!... నీవు వెళ్ళిన తర్వాత నేను నీ గురించి రామారావు గారితో మాట్లాడాను. ఆ పని చేసింది నీవు కాదని, అందులో ఏదో మోసం వుందని, అసలు దోషిని నేను కనిపెడతానని వారికి మాట యిచ్చాను. నేను ఆ పనిని తప్పకుండా చేస్తాను. కానీ... నింద నీపైన సాక్ష్యం వారి చేతిలో వున్నందున నిన్ను.... నేను మూడువారాలు సస్పెండ్ చేస్తున్నాను. భయపడకు... బాధపడకు. రామారావు గారి తనయుడు రంగారావు వారి అంత మంచివాడు కాదు. కోపిష్టి. ఆవేశపరుడు. అతను దైవాదీనంగా ప్రస్తుతంలో వూళ్ళో లేడు. అతను వూర్లో వుండి వుంటే నీకు ఎంతో నష్టం... కష్టం కలిగించేవాడు. పోర్షన్స్ అన్నీ అయిపోయాయి. ఈ నెల రోజులు కాలేజీలో జరుగబోయేది రివిజన్ మాత్రమే. అది నీవు మీ వూరికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చొని చెయ్యి. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపో. బాగా చదువు. నీవు ఆనందంగా పరీక్షలు వ్రాసేదానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. రేపు ఉదయాన్నే నీవు మీ వూరికి వెళ్ళిపో" ప్రీతిగా చెప్పాడు ధర్మారావు.
"నేనూ మీరు చెప్పిన మాటలనే చెప్పాను సార్!... రేపు ఉదయం నేను ఇతన్ని బస్సు ఎక్కిస్తాను" అన్నాడు రంగయ్య.
"మంచిది అలాగే చేయండి. రమణా!... డోంట్ వర్రీ... ఐ విల్ బిహైండ్ టు యు. యిక నే వెళతాను" కుర్చీనుండీ లేచారు ప్రిన్సిపాల్ ధర్మారావు.
ఇరువురూ చేతులు జోడించారు. ధర్మారావు గారు కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. కారు హాస్టల్ ఆవరణాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది.
"రమణా!... నీ రూముకు వెళ్ళి అన్నీ సర్దుకో. సరేనా!..."
"అలాగే బాబాయ్"
వార్డన్ తన గదికి వెళ్ళిపోయాడు. తన గదిలో ప్రవేశించి రమణ పుస్తకాలను, గుడ్డలను సర్దుకొన్నాడు. రూమ్ మేట్ అడిగాడు. ఉదయాన్నే వూరికి వెళ్ళిపోతున్నానని జవాబు చెప్పాడు. పడుకొన్నాడు. నిద్రపట్టలేదు. మనస్సున తన తండ్రి జ్ఞాపకాలు... వారు కొన్ని గంటల్లో శాశ్వతంగా కన్ను మూయబోయే ముందు తన్ను దగ్గరకు పిలిచి చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి.
"నాయనా!... రమణా!... పుట్టుట గిట్టుట కొరకే. ఈ సృష్టిలో ఉద్భవించిన ప్రతి జీవి చెట్టు చేమ అన్నీ ఒకనాడు మట్టిలో కలిసిపోయేవే. ఏదో శాశ్వతం కాదు. కానీ మనిషి తన చర్యల వలన.... చేసే మంచి పనుల వలన... తను చచ్చిపోయినా... అలాంటి వారిని ముందు తరాల వారు స్మరిస్తూనే వుంటారు. వారు కీర్తిశేషులు. నా జీవితం ఎలా సాగిందో నీకు తెలుసు. నేను నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. ఏనాడూ అబద్ధాన్ని ఆడలేదు. నాకు వయస్సు మీరిన తర్వాత నీవు పుట్టావు. నేను పేదవాణ్ణి. కానీ... నీతి నిజాయితీ లేనివాణ్ణి మాత్రం కాదు.
నీవు నీ భావి జీవిత కాలంలో సత్యాన్ని, ధర్మాన్ని, సహనాన్ని పాటిస్తూ మంచి మనిషిగా బ్రతకడం నేర్చుకో. నీకు ఈ జన్మనిచ్చిన నీ తల్లిని జాగ్రత్తగా చూచుకో. మన హైందవ ధర్మం ప్రకారం మాత పిత గురువు ప్రతి ఒక్కరికీ దైవ సమానులు. వారి ఆశీర్వాదాలు వున్నవారు తప్పకుండా బాగా వృద్ధిలోకి వచ్చి గొప్పవారవుతారు. ఒక తండ్రిగా నిన్ను నేను, నీవు ఒకనాటికి గొప్పవాడివై పదిమందికి ఆదర్శప్రాయుడివై ఆనందంగా నీ జీవితాన్ని సాగించాలని నిన్ను ఆశీర్వదిస్తూ... నీవు నీ జీవిత కాలంలో హాయిగా వుండేలా చూడమని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. ఈ నీ పేద తండ్రి ఆశీస్సులను తప్ప నీకు ఇంకేమీ ఇవ్వలేడు నాయనా!..."
ఆ క్షణంలో వారి కళ్ళల్లో కన్నీరు. రెప్పలను మూయడంతో అవి చెక్కిళ్ళపైకి జారాయి.
తన చేతులతో రమణ తండ్రి కన్నీటిని తుడిచాడు. ’మీ మాటలను నేను తప్పక పాటిస్తాను నాన్నా’ తండ్రికి మాట ఇచ్చాడు.
అది జరిగిన రెండు గంటల్లో హృద్రోగంతో బాధపడుతున్న రామశర్మ శాశ్వతంగా కన్ను మూశాడు.
గత స్మృతులు రమణ మనస్సును ఎంతగానో వేధిస్తున్నాయి. కళ్ళల్లో కన్నీరు. గట్టిగా కళ్ళు మూసుకొన్నాడు. ఎప్పుడు నిద్రపోయాడో అతనికి తెలియదు.
రాజుగాని పేదగాని... ఎంతో ఆనందంగా వున్నా, అంతులేని దుఃఖంలో వున్నా పక్షపాతం లేకుండా తన హక్కును చేర్చుకొనేది... నిద్రామ తల్లి ఒక్కటే.
============================================================
ఇంకా వుంది..
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments