మదిలో మల్లెల మాల - పార్ట్ 1
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

మదిలో మల్లెల మాల ధారావాహిక - ప్రారంభం
Madilo Mallela Mala - Part 1 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 22/11/2025
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"రమణా!...."
స్నేహితులతో కబడ్డీ ఆడుతున్న అతను... పిలిచిన వ్యక్తి వైపు చూచాడు.
అతను కాలేజి అటెండర్ మస్తాన్. తనవైపు చూచిన రమణను దగ్గరకు రమ్మని చేయి విసిరి పిలిచాడు మస్తాన్.
రమణ.... సాలోచనగా అతన్ని సమీపించాడు.
"ఏం మస్తాన్ భాయ్?...."
"నిన్ను ప్రిన్సిపాల్ గారు పిలుచుకు రమ్మన్నారు"
"దేనికి?"
"నాకు తెలిదు."
"సరే పద."
ఇరువురూ.... ప్రిన్సిపాల్ రూమ్ వైపుకు నడిచారు. ’ఈ సమయంలో ప్రిన్సిపల్ గారు తన్ను ఎందుకు పిలిచినట్లు!...’ రమణ మస్తిష్కంలో ఈ ప్రశ్న....
వారి సంభాషణ విన్న రమణ మిత్రులు ఆటను ఆపి... వారిరువురినీ అనుసరించారు.
రమణ వెనక్కు తిరిగి చూచి.... వారిని ఆగమని సౌంజ్ఞ చేసి, తను ప్రిన్సిపాల్ రూములో ప్రవేశించాడు.
ఎప్పుడూ.... నవ్వుతూ కనిపించే ప్రిన్సిపాల్ ధర్మారావు గారి ముఖం... ఎంతో గంభీరంగా... ఆందోళనగా కనిపించింది రమణకు.
’భగవాన్.... ఇంటికి వెళ్ళవలసిన ప్రిన్సిపాల్ గారు తన సీట్లో కూర్చొని ఎంత గంభీరంగా వున్నారంటే కారణం...! నేను ఏ తప్పు చేయలేదే, నన్ను ఎందుకు పిలిపిచినట్లు?.... నన్ను చూచీ చూడనట్లు కిటికీ గుండా శూన్యంలోకి చూస్తున్నారంటే... నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేశానా!... వీరు నన్ను ఈ సమయంలో పిలిచిన దానికి కారణం ఏమైయుంటుంది?’ జవాబు తెలియని సందేహాలు.
ప్రక్కన నిలబడి వున్న మస్తాన్ వరండాలో దూరంగా వెళ్ళిపోయాడు. తన స్నేహితులంతా వరండాలో దూరంగా తన ఆదేశానుసారం నిలబడి తన్నే చూస్తున్నారు.
రమణ మనస్సులో వ్యాకులత.... భయం, ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లగా నడిచి ప్రిన్సిపాల్ టేబుల్ ముందు నిలబడ్డాడు.
"సార్!.... గుడ్ ఈవెనింగ్. నన్ను రమ్మన్నారట!"
భయంతో మెల్లగా అడిగాడు రమణ.
ప్రిన్సిపాల్ గారు తన చూపును రమణ వైపుకు త్రిప్పారు. కొన్నిక్షణాలు అతని ముఖంలోకి పరీక్షగా చూచారు.
అభంశుభం తెలియని చిన్న పిల్లవాని ముఖంలా రమణ ముఖం వారికి గోచరించింది. అతని ముఖాన వున్న చెమట... తన పిలుపు, రమణను ఎంతగానో కలవరపరిచిందనే విషయానికి సాక్షి. పెదవుల పైకి చిరునవ్వును తెచ్చుకొని....
"రమణా!..... మనం ఇప్పుడు ఈ కాలేజీ ఛైర్మన్ రామారావు గారి ఇంటికి వెళ్ళాలి పద" కుర్చీ నుండి లేచి వరండాలో ప్రవేశించారు. రమణ వారిని అనుసరించాడు వ్యాకుల వదనంతో.
ప్రిన్సిపాల్ గారిని చూచి మస్తాన్ వారిని పరుగున సమీపించాడు.
"మస్తాన్!... లాక్ చేసి నీవు ఇంటికి వెళ్ళు" నడుస్తూనే అన్నారు ప్రిన్సిపాల్.
మస్తాన్ తలాడించి ఆగిపోయాడు. వరండాలో వున్న రమణ స్నేహితులు.... వారు రూమ్ నుండి బయటికి రావడాన్ని చూచి, ప్రక్కన వున్న క్లాస్ గదిలో దూరి, వారికి కనిపించకుండా గోడ ప్రక్కగా దాక్కున్నారు.
రమణ ప్రిన్సిపాల్ వెనకాలే అయోమయ స్థితిలో నడుస్తున్నాడు. ’నన్ను వీరు ఛైర్మన్ గారింటికి ఎందుకు పిలుచుకొని వెళుతున్నారు!..... వారికి నాతో ఏం పని?...’ ఈ ప్రశ్నలు రమణ మస్తిష్కాన్ని వేధిస్తున్నాయి. మనస్సులో ఏదో భయం.... కొద్ది నిముషాల్లో ఏం జరుగబోతూ వుంది?... ఎప్పుడూ ఎంతో ఆదరంగా పలకరించే ప్రిన్సిపాల్ గారు ఇంత గంభీరంగా, ముక్తసరిగా విషయం ఏమిటో చెప్పకుండా వుండేదానికి కారణం ఏమిటి?... ఈరోజు నేను ఎవరి విషయంలోనూ ఏ తప్పు చేయలేదే!?...." అని రమణ మదిలోని తలపులు.
ప్రిన్సిపాల్ గారు తన కారును సమీపించి డోర్ తెరిచి లోన కూర్చున్నారు.
వ్యతిరేక దిశలో వున్న డోర్‍ను తెరిచి... "రమణా!... రా కూర్చో" సాదరంగా చెప్పారు.
తెగని ఆలోచనలతో సతమతమౌతున్న రమణ యాంత్రికంగా కార్లో కూర్చున్నాడు. డోర్‍ను మూశాడు.
ప్రిన్సిపాల్ గారు కారును స్టార్ట్ చేశారు. కాలేజీ ఆవరణం దాటి కారు రోడ్డు మీద ముందుకు వెళుతూ వుంది.
అయోమయ స్థితిలో గువ్వలా భయంతో తన ప్రక్కన కూర్చొని ఉన్న రమణ ముఖంలోకి కొన్ని క్షణాలు చూచారు ప్రిన్సిపాల్ ధర్మారావు.
’బెస్ట్ స్టూడెంట్ రమణ. వీడు అలాంటి పాడుపని చేసి వుంటాడా!. నో.... నో.... వీడికి కానివాళ్ళు... వీడంటే గిట్టని వాళ్ళు ఆ పనిని చేసి వుంటారు. వీడికి గిట్టని వాళ్ళు ఎవరు?... వీడు అందరితోనూ బాగుంటాడు కదా!... ప్లస్ టు సెకండ్ ఇయర్ పరీక్షలు వీడు ఒక నెల తర్వాత అందరిలా వ్రాయాలి. వీడి మీద వేయబడ్డ నేరాన్ని నేను ఎలా రూపుమాపగలను?... ఏది ఏమైనా వీడి భవిష్యత్తు పాడు కాకుండా చూడటం నా ధర్మం’ ఈ నిర్ణయానికి వచ్చిన ధర్మారావు....
"రమణా!..." ప్రీతిగా పిలిచాడు.
"సార్!..."
"భయంగా వుందా!..."
"అవును సార్!... మీరు నన్నెందుకు ఛైర్మన్ గారింటికి తీసుకొని వెళుతున్నారు సార్?" దీనంగా అడిగాడు రమణ.
ప్రిన్సిపాల్ రమణ ముఖంలోకి క్షణంసేపు చూచి....
"రమణా!.... నీవు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు. అక్కడ ఎవరు ఏం మాట్లాడినా... నీవు ఆవేశపడకూడదు. వాదించకూడదు. నీకు అండగా నేను వున్నాను..."
"అసలు... విషయం ఏమిటి సార్?"
"రంజనీకి ఎవరో లవ్ లెటర్ వ్రాశారు. అది నీవని ఆ రంజనీ వారి నాన్నగారికి చెప్పింది. వారు నాకు ఫోన్ చేసి నిన్ను వారింటికి తీసుకొని రమ్మన్నారు. నీవు అలాంటి పని చేయవని నాకు తెలుసు. ఛైర్మన్ గారి ఆదేశం కదా!... అందుకే నిన్ను తీసుకొని వెళుతున్నాను. భయపడకు."
"సార్!...." భోరున ఏడ్చాడు రమణ.
"రమణా!... ఏడవకు. నీవు నిర్ధోషివని నాకు బాగా తెలుసు. డోంట్ క్రై. డోంట్ క్రై. ఐ విల్ మ్యానేజ్."
చేతి రుమాలుతో కన్నీటిని తుడుచుకొన్నాడు రమణ.
"నెలరోజుల్లో పరీక్షలున్నాయి సార్!" దీనంగా అన్నాడు రమణ.
"ఆ విషయం నాకూ తెలుసుగా!... ఏం జరిగినా... నేను నీకు సాయం చేస్తాను. పరీక్షలు నీవు వ్రాసేటట్లు చేస్తాను. బాధపడకు రమణా!"
’ఎవరు ఆ ప్రేమలేఖను వ్రాశారు?... అది నేను వ్రాసినట్లుగా రంజనీ ఎలా నమ్మింది?... నేరస్థుణ్ణి నేనేనని ఎలా తీర్మానించి వాళ్ళ తండ్రికి చెప్పింది?... వారి ఇంట్లో ఇప్పుడు ఏం జరుగబోతూ వుంది?.... నా భవిష్యత్తు ఎలా వుంది?...’ రమణ హృదయం నిండా అన్నీ జవాబు లేని ప్రశ్నలే.
కారు ఛైర్మన్ రామారావు గారి పోర్టికోలో ఆగింది. ప్రిన్సిపాల్ ధర్మారావు కారు దిగారు. రమణ మౌనంగా దిగి... వారిని అనుసరించాడు.
============================================================
ఇంకా వుంది..
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.





Comments