మదిలో మల్లెల మాల - పార్ట్ 2
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 2 days ago
- 4 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 2 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 27/11/2025
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ:
ఛైర్మన్ రామారావు గారి అమ్మాయికి లవ్ లెటర్ రాసాడని అభియోగంపై రమణ అనే విద్యార్థిని అతని ఇంటికి తీసుకొని వెళతారు.
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 2 చదవండి.
"చెప్పిన మాటను గుర్తుంచుకో. వాళ్ళు ఎవరు ఏమన్నా, సహనంతో మౌనంగా వుండు. నేను మాట్లాడుతాను రమణా!" దగ్గరగా వచ్చి ప్రిన్సిపాల్ ధర్మారావు మరోసారి రమణకు చెప్పారు.
రమణ బిక్కమొఖంతో ’సరే’ అన్నట్లు తలాడించాడు.
ఇరువురూ వరండా మెట్లెక్కి సింహద్వారాన్ని దాటి హాల్లో ప్రవేశించారు.
రామారావు గారి ముందు ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఏదో చర్చిస్తున్నారు. చర్చ ముగిసింది. హాల్లోకి వచ్చిన ప్రిన్సిపాల్ గారిని చూచిన రామారావు..
"సరే ఇక మీరు వెళ్ళిరండి" ప్రిన్సిపాల్ గారిని చూచి "రండి సార్. కూర్చోండి" నవ్వుతూ చెప్పాడు.
ఆ ముగ్గురూ.. వారికి నమస్కరించి వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్ గారు వారికి నమస్కరించి వారి ముందున్న సోఫాలో కూర్చున్నారు.
కొంచెం దూరంలో ఎదురుగా నిలబడి వున్న రమణను చూచాడు రామారావు.
"వీడేనా రమణ?" రామారావు గారి ప్రశ్న.
"అవును సార్" ప్రిన్సిపాల్ గారి జవాబు.
"మీది ఏ వూరు?"
భయంతో మెల్లగా జవాబు చెప్పాడు రమణ.
"మీ నాన్నగారి పేరేమిటి?"
"రామశర్మ!"
"నీవు గండవరం రామశర్మ కొడుకువా!" రామారావు గారి ఈ మాటల్లో ఎంతో ఆశ్చర్యం.
’అవునన్నట్లు’ తలదించుకొనే మౌనంగా తల ఊపాడు రమణ.
ప్రిన్సిపాల్ గారు ఆ ఇరువురి ముఖాలను క్షణంసేపు పరీక్షగా చూచాడు. రమణ భయంతో దోషిలా తలను దించుకొని వున్నాడు. రామారావుగారు రమణను పరీక్షగా చూస్తున్నాడు.
"వీడు చాలా పేదవాడు సార్" రామారావుగారి ముఖంలోకి చూస్తూ మెల్లగా చెప్పాడు ధర్మారావు.
"వీడి తండ్రి గురించి నాకు బాగా తెలుసు. వీడికిదేం పోయేకాలం. ఎక్కడి నుండి వచ్చింది వీడికి అంత ధైర్యం.. నా కూతురుకి ప్రేమ లేఖ వ్రాసేదానికి? వీడిని మీరు ఎలా శిక్షించదలచుకొన్నారు?" వ్యంగ్యంగా అడిగాడు రామారావు.
రామారావు మాటలు సమ్మెట దెబ్బల్లా వినిపించాయి రమణకు. వారు అడిగిన చివరి ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలనే ఆలోచనలో పడ్డారు ప్రిన్సిపాల్.
"నా వూర్లో, మా స్కూల్లో, మా హాస్టల్లో వుంటూ వీడు నా కూతురికి ప్రేమలేఖ వ్రాశాడంటే.. వీడు.. వీడు పరమనీచుడు. రేయ్!.. నీ వయస్సు ఎంత?"
"పదిహేడు సార్" రమణ కంఠం బొంగురుపోయింది.
తలను పైకి ఎత్తకుండానే జవాబు చెప్పాడు.
"వీడు చేసిన పనికి మీరు వీడికి వేయవలసిన శిక్ష తక్షణమే టి. సి ఇచ్చి పంపించేసేయండి. వీడు గండవరం రామశర్మ కొడుకు కాకుంటే.. నేను వీడికి విధించే శిక్ష వేరుగా వుండేది ధర్మారావు గారు!.. " రామారావు గారి మాటల్లో క్రోధం.
రమణ.. శరీరం చెమటతో తడిసిపోయింది. అవమానంతో మనస్సు వెయ్యి ముక్కలైంది. యధార్థానికి తను నిర్ధోషి. ఆ ప్రేమలేఖను తను వ్రాయలేదు. అంతర్‍వాణి యధార్థాన్ని అరచి చెప్పమంటూ వుంది. నేరం చేసిన వానిలా తల దించుకోవద్దంటూ వుంది. భయం పిరికితనంతో మౌనంగా వుంటే ఆ నేరం నీవు చేసినట్లుగానే రామారావు గారు భావిస్తారని, నిజాన్ని ఎలుగెత్తి చాటమని చెబుతూ వుంది అంతరాత్మ.
రోషంతో తలను పైకెత్తాడు రమణ.
’సార్!.. మీరు నాపై మోపిన నేరాన్ని నేను చేయలేదు. నేను సంపదలేని పేదవాణ్ణే. కానీ.. గుణంలో నేను పేదవాడిని కాను’ గట్టిగా చెప్పితే తన నిర్దోషత్వాన్ని రామారావు గారు నమ్ముతాడని ఆశించాడు.
రామారావు గారి ముందున్న టిపాయ్‍పై, పేపర్ వెయిట్ క్రిందున్న కాగితాన్ని వారు వేగంగా తీసి.. "ఈ సంతకం ఎవరిదో చూచి మీరు చెప్పండి" ప్రిన్సిపాల్ చేతికి అందించాడు.
కాగితాన్ని అందుకొని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి.. "ఇది రమణ సంతకమే సార్!" మెల్లగా చెప్పాడు ధర్మారావు.
"వాడిని చూడమనండి" రామారావుగారి ఆదేశం.
కాగితాన్ని ప్రిన్సిపాల్ గారు రమణకు అందించాడు. తడబడుతున్న చేతుల్లోకి ఆ కాగితాన్ని తీసుకొని రమణ.. క్రింద వున్న తన సంతకాన్ని చూచాడు. అది తన సంతకమే.. అతని తలపై పిడుగు పడినట్లయింది. కళ్ళు నీటితో నిండిపోయాయి. అక్షరాలు అలికినట్లు అగమ్యగోచరంగా కనుపించాయి. రోదిస్తూ తలను దించుకొన్నాడు.
"వీడు చేసిన పనిని ఇకముందు ఎవరూ.. ఏ ఆడపిల్ల విషయంలోనూ చేయకుండా వుండాలంటే.. వీడికి మీరు.. నేను చెప్పిన శిక్షను విధించి తీరాల్సిందే ప్రిన్సిపాల్ గారూ!" తన ధృడ నిర్ణయాన్ని తెలిపాడు రామారావు.
రాజుగారి శాసనంలా రామారావు గారి మాటలు వినిపించాయి రమణ, ధర్మారావులకు. ఇరువురూ మౌనంగా శిలా ప్రతిమల్లా వుండిపోయారు.
కొద్ది క్షణాల తర్వాత ప్రిన్సిపాల్ ధర్మారావుగారు "రమణా!.. ఇక నీవు వెళ్ళవచ్చు" మెల్లగా చెప్పాడు.
రమణ దీనంగా ప్రిన్సిపాల్ గారి ముఖంలోకి చూచాడు. వెళ్ళు అన్నట్లు కళ్ళతో సౌంజ్ఞ చేశాడు ధర్మారావు. రమణ చేతులు జోడించి ఆ ఉభయులకు నమస్కరించి.. వేగంగా బయటికి వెళ్ళిపోయాడు.
"ఏరా!.. వాళ్ళు నిన్ను అంతగా అవమానిస్తే.. నమస్కారం చేసి మరీ బయటికి వచ్చావు. నిన్ను మంచివాడని రామారావుగారు అనుకోవాలనా?"
"నమస్కారం చేసింది వారి మెప్పుకోసం కాదు. నా తత్వాన్ని వారు అర్థం చేసుకోవాలని.. నేను నిర్ధోషినని వారు తెలుసుకోవాలని. "
"అయితే.. ఆ ప్రేమలేఖ వ్రాసింది నీవు కాదా!.. "
"కాదు.. కాదు.. కాదు. "
"మరి ఎవరు వ్రాసినట్లు!.. నీ సంతకాన్ని ఎవరు చేసినట్లు!.. హు ఈజ్ దట్ బ్లాక్ షీప్?"
"ప్రస్తుతానికి నాకు తెలియదు. కానీ త్వరలో తెలుసుకొంటాను. "
"ఎలా వీలవుతుంది. ప్రిన్సిపాల్ గారు నీకు టి. సి ఇచ్చి కాలేజి నుంచి వెళ్ళగొట్టబోతున్నారుగా?"
"కాలం చాలా శక్తివంతమైనది. అన్ని సమస్యలనూ అది పరిష్కరిస్తుంది. నాకున్న ధనం.. సహనం.. నిజానిజాలు నీతి నిజాయితీలు నిజం. నిప్పు.. త్వరలోనే అందరికీ తెలుస్తుంది. "
ఆత్మ.. అంతరాత్మల సంఘర్షణతో రమణ వీధిలో ప్రవేశించారు. అక్కడ వున్న అతని స్నేహితులు అతన్ని చుట్టుముట్టారు.
"ఏమైంది?.. ఏమైంది?.. " అందరూ అడిగింది ఈ ప్రశ్ననే.
వారికి ఎలాంటి జవాబు ఇవ్వకుండా రమణ మౌనంగా హాస్టల్ వైపుకు నడిచాడు.
"సార్!.. "
"చెప్పండి"
"పరీక్షలు నెలరోజుల్లో రానున్నాయి. ఇప్పుడు నేను వాడికి టి. సి ఇచ్చి పంపితే.. వాణ్ణి ఏ కాలేజీలోనూ ఈ సమయంలో చేర్చుకోరు. చాలా పేదవాడు. సంవత్సరం చదివిన చదువుకు అర్థం లేకుండా పోతుంది. కనుక మూడువారాలు సస్పెండ్ చేస్తాను. నాకు తెలిసినంతవరకూ వాడు ఈ పని చేసి వుండడు. ఎవడో చేశాడు. నేరం వాడిమీద పడింది. నేను విచారిస్తాను. అసలు నేరస్థుడికి శిక్ష పడేలా చూస్తాను" అనునయంగా చెప్పాడు ధర్మారావు.
"మీకు వాడిమీద అంత నమ్మకమా!.. " గద్దించినట్లు అడిగాడు రామారావు.
"అవును సార్!.. "
"రేపే వాణ్ణి సస్పెండ్ చేయండి" సోఫా నుండి లేచాడు రామారావు.
దాని అర్థం ’యిక మీరూ బయలుదేరండి అని’ గ్రహించిన ధర్మారావు సోఫా నుండి లేచాడు.
"వెళ్ళొస్తాను సార్" చెప్పి హాల్లో నుండి బయటికి వచ్చి కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments