top of page

జస్ట్ వెయిట్

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Just Wait' New Telugu Story Written By Vasundhara

'జస్ట్ వెయిట్' తెలుగు కథ

రచన: వసుంధర

(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


రావణసంహారం చేసి అయోధ్యకు తిరిగొచ్చిన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతోంది. ఉన్నట్లుండి లక్ష్మణుడు పెద్దగా నవ్వి వెంటనే వెనక్కి వాలిపోయాడు. అది నిద్రే ఐతే- మూర్ఛేమో అనిపించేటంత గాఢ నిద్ర.


అది నిద్రా, మూర్ఛా అన్న విషయం అక్కడున్నవారెవ్వరూ పట్టించుకోలేదు.

లక్ష్మణుడెందుకు నవ్వాడో తెలియక- రాముడు, భరతుడు, సీత, ఆంజనేయుడు వగైరాలు- ఆ నవ్వు తమ గురించేనని మనసులో చిన్నబుచ్చుకున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి కూడా.


ఐతే అసలు విషయం లక్ష్మణుడికి స్పృహ వచ్చేక తెలిసింది.


పద్నాలుగేళ్ల వనవాసంలో- క్షణమైనా దరికి రాకుండా నిద్రాదేవిని ఆపినవాడు లక్ష్మణుడు. అలాంటివాడు తనకు ప్రాణంకంటే ఎక్కువైన అన్నగారు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకానికి ముహూర్త సమయం సమీపిస్తుంటే- ఆవేడుకని కళ్లారా చూడాలని మనసు ఉవ్విళ్లూరుతుంటే- ఒక్క క్షణమైనా నిద్రాదేవిని ఆపలేకపోతున్నాడు. ఆ అసహాయతకు ఏడవలేక నవ్వొచ్చిందిట లక్ష్మణుడికి. ఆ తర్వాత ఆశ్చర్యంతో మూర్ఛ వచ్చింది.


ఆ పుక్కిటి పురాణకథ ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే-


కొన్ని నెలలుగా మా ఇంటిముందు కుళ్లుకాల్వకు మరమ్మతు జరుగుతుంటే పెద్దగా పట్టించుకోని మావారు- ఈ రోజు ఉన్నట్లుండి పెద్దగా నవ్వి స్పృహ కోల్పోతే- అది మూర్ఛో, నిద్రో తెలియక కలవర పడాల్సిన సమయంలో- ఊరటకోసం కాబోలు మనసు ఈ లక్ష్మణుడి కథని గుర్తు చేసింది.

మా ఇంటిముందున్న కుళ్లుకాల్వ మరమ్మతు కథ ఎంత పెద్దదంటే- లక్ష్మణుడి కథతో బ్రేక్ వెయ్యకపోతే, అది అంతులేని కథగా కొనసాగుతుండేదేమో!


అన్నట్లు మా ఇంటిముందు కుళ్లుకాల్వ నేపథ్యం మీకు తెలియదు కదూ….


అది సరిగ్గా మా ఇంటి ప్రహారీగోడనానుకుని ఉంది. దాన్ని కప్పుతూ వెడల్పైన సిమెంటు బ్లాక్సు టాపుగా ఉన్నాయి. మేము గేటు తియ్యగానే వేసే మొదటి అడుగు ఆ టాపు మీదే! ఆ టాపు మేము రోడ్దెక్కడానికి వారధి అన్నమాట!


వానొస్తే హైదరాబాదులో పల్లపు ప్రాంతాలు ములిగాయని వార్తల్లో విటుంటాం, చూస్తుంటాం.

నిజానికి హైదరాబాదులో మెట్ట ప్రాంతాలంటూ ఏమీ లేవు. ఏ ప్రాంతంలో గట్టిగా వాన పడితే ఆ ప్రాంతం ములిగిపోవడం ఖాయం. ములిగిన ప్రాంతాన్ని పల్లం అనడం ఇక్కడ రివాజు.

అలా ఒకసారి- వానా వరదా వచ్చి- మా కాలనీని పల్లపు ప్రాంతంగా మార్చి వెళ్లాయి. ప్రవాహం వడి ఎలా ఉందంటే- ఆ జోరుకి ఇంటిముందున్న కుళ్లుకాల్వ టాప్ బాగా పైకి లేచి దానికింద ఉన్న వైతరణి లాంటి కాల్వ దర్శనభాగ్యం కల్గించింది.


అంతవరకూ ఒక వారధిగా మాత్రమే గుర్తించబడిన ఆ టాప్- అన్నాళ్లుగా మమ్మల్నా కుళ్లు కంపునుంచి కాపాడుతూ మాకు చేసిన అసలు సేవ అప్పుడు గ్రహింపికొచ్చింది.


దేశంలో రాజకీయాలు, విలువలు, మానవత్వం- అన్నీ కుళ్లిపోయాయంటారు. ఆ కుళ్లంతా మా ఇంటిముందు కాల్వలోంచే పయనిస్తోందేమో మరి- కాల్వమీద టాపు లేవగానే ఒక్కసారి భరించలేని వాసన మా ఇంట్లో గుప్పుమంది.


ఆ వాసన వీధంతా కూడా ఉంది కానీ, మరీ భరించలేనంత కాదు. ఆ విషయం నొక్కించడానికన్నట్లు- మా వీధిలో వాళ్లు ఒకరితర్వాత ఒకరొచ్చి, “మాకంత ఫర్వాలేదుకానీ, మిమ్మల్ని చూస్తేనే జాలితో కడుపు తరుక్కుపోతోంది. మరీ నరకం కళ్లజూస్తున్నారు” అని నాలిక్కరుచుకుని, “వాసన కదా, ‘ముక్కు’జూస్తున్నారు అనాలేమో!” అనేసి వెడుతున్నారు.

కలిసికట్టుగా కాక ఒకరి తర్వాత ఒకరు వచ్చారేమో- వాళ్లు మాకు సినిమాల్లో గూండాల్లా అనిపించారు.


ఎదుటివాళ్లమీద జాలి చూపిస్తే అదో కిక్కు. టివిలో వచ్చిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో- కోటి రూపాయలు గెల్చినా అంత కిక్కుండదు.


ఇక సానుభూతి పొందేవాడి అవస్థ తెలుసుకోవాలంటే- అదే పోటీలో యాబై లక్షలదాకా వచ్చి, కోటి వస్తుందన్న అత్యాశతో మొండిగా ముందడుగేసి- ఆరు లక్షలకి పడిపోతారూ- అలాంటివాళ్లనడగండి. అంత డబ్బు పోయిందన్న బాధని మించి- నిర్వాహకుడి సానుభూతి వ్యాఖ్యలెలా ఉక్రోషపెడతాయో- అనుభవించిన వాళ్లు చెబుతారు.


అడగడం, చెప్పడం అంటే గుర్తొచ్చింది- మా సమస్యకు పరిష్కారంకోసం చాలామందినడిగాం.

‘బయటకెడితే (ముక్కు) మూసుకుని తిరగండి, ఇంట్లో ఉన్నప్పుడు (తలుపులు) మూసుకుని కూర్చోండి’- అన్నారు ఎక్కువమంది- ‘మూసుకుని’ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ.


అందరికీ బాగుండి, మనకొక్కరికే కష్టమొస్తే అదో ఉక్రోషం. అందుకే నేను మా వీధివాళ్లని అపార్థం చేసుకునే మూడ్‌లో ఉన్నాను కానీ- పాపం, నిజానికి వాళ్లూ మా సమస్య గురించి తమవంతు కృషి చేస్తున్నారు.


ఒకసారి మా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంటు రామానుజం మా ఇంటిముందునుంచి వెడుతూ ఠక్కున ఆగి, జేబులోంచి రుమాలు తీసి ముక్కు మూసుకోవడం, మా ఎదురింటి విశ్వం చూశాడు. వెంటనే పరుగున వెళ్లి- కుళ్లుకాల్వ మరమ్మతు గురించి నిలదీసేడు.


దానికాయన, “మరమ్మతేమిటి? మాకేం కంప్లయింట్ లేదే!” అని ‘దిగ్భ్రాంతి’ చెందాడు.


కాలనీ పొరుల్లో ఒకడుగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలకు రామానుజం కూడా మామూలుగానే ఆశ్చర్యపోయేవాడు. అసోసొయేషన్ ప్రెసిడెంటు ఐనప్పట్నించీ, ఆ హోదాకి తగ్గట్లు ‘దిగ్భ్రాంతి’ చెందుతున్నాడు.


అప్పుడు విశ్వం మా ఇంటికొచ్చి, మావార్ని పిలిచి, “కాలవకి టాపు లేచిపోయి వారం దాటింది. ఇంకా కంప్లయింటివ్వలేదా?” అని మందలించాడు. దానికి మావారు అమాయకంగా మొహంపెట్టి, “ఈయన కాలనీ ప్రెసిడెంటుగా పోటీ చేసినప్పుడు, ‘సమస్యుంటే చెప్పక్కర్లేదు. మేమే తెలుసుకుని సరిచేస్తాం’ అన్నారు. అందుకే వేరే కంప్లయింటివ్వలేదు” అన్నారు.


దానికి రామానుజం, “అంటే అనుండొచ్చు కానీ, మీకు మీ ఇల్లొక్కటే. నాకు కాలనీలో వెయ్యిళ్లు. నా అంతట నేను ఎన్నిళ్ల సమస్యలు తెలుసుకోగలను?” అన్నాడు రుమాలింకా ముక్కుకే అదిమి పట్టుకుని.


అది చూసిన మావారు, “పోనీ, ఇప్పుడు మీకు సమస్య తెలిసినట్లే ఉంది కదా!” అన్నారు.


“కాలనీలో వాక్ చేస్తూ ఇక్కడికి రాగానే వాసనేసింది. కాసేపు రుమాలుతో ముక్కు మూసుకుంటే చాలనుకున్నాను. చాలకపోతే వాకింగ్ రూట్ మారిస్తే, నా సమస్య తీరిపోతుంది. అలా మీరూ నాకులా సమస్య పరిష్కరించుకోవాలనుకుంటే సరే! లేదూ- మాకో కంప్లయింట్ ఇవ్వాల్సిందే” అని రూల్సు పట్ల తన నిబద్ధతను ప్రకటించాడు రామానుజం.


“బాగుంది- ప్రోబ్లం తెలిసినాసరే, కంప్లయింటుంటేనే పట్టించుకునే మాటైతే- మీకూ మాకూ తేడా ఏంటి?” అన్నాడు విశ్వం.


“తేడా ఉంది. మేము కంప్లయింట్సు తీసుకుంటాం. మీరు తీసుకోరు” అని వెళ్లిపోయాడాయన.


జరిగిందంతా మా ఇంటి గుమ్మంలో (ముక్కు) మూసుకుని నిలబడి వింటున్న నేను, వారు లోపలికి రాగానే, “రామానుజం గారు అన్నదాంట్లో పాయింటుంది. వెంటనే కంప్లయింటివ్వండి” అన్నాను.


మావారు నవ్వి, “ఇప్పుడే నాకో విషయ మర్థమైంది. కొందరికి పదవి కిక్కిస్తుంది. అందుకని ఎన్నికలప్పుడు పోటీ పడి వాగ్దానాలు చేసి పదవిని సాధిస్తారు. పదవీ బాధ్యతలు వాళ్లని కిక్ చేస్తాయి. అందుకని బాధ్యతలకి దూరంగా ఉంటారు. అదీ వాస్తవం” అన్నారు.


“అలాగని నెపం మనమీదుంచుకుంటామా? ముందు కంప్లయింటివ్వండి. మెయింటెనెన్సు కడుతున్నాంగా, అసోసియేషన్ తప్పక స్పందిస్తుంది” అన్నాను.


నా గొంతుని బట్టి- నాది సూచనో, ఆర్డరో కనిపెట్టగల సత్తా మావారికుంది, “సరే, పనవుతుందని నమ్మకం లేకపోయినా, నీ మాటను గౌరవిస్తున్నాను” అంటూ వెంటనే కంప్లయింటిచ్చారు.

అలా అనకుండా కూడా కంప్లయింటివ్వచ్చు. కానీ కంప్లయింటుతో పని జరిగినా జరక్కపోయినా, నాకిచ్చిన కాంప్లిమెంటు ఏదో విధంగా పనికొస్తుందనే వివేకం మావారిది.


కంప్లయింట్ తీసుకోగానే ఆఫీసువాళ్లు- సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం సాధారణం. కానీ అనుకోకుండా మాకు రామానుజం నుంచి ఫోనొస్తే ఆశ్చర్యపడ్డాం. నిజానికి దిగ్భ్రాంతి చెందాలి. కానీ మాకింకా అంత హోదా లేదుగా!


“మీ కంప్లయింట్ చూశాం. ఐతే ఆ కుళ్లుకాల్వ బాధ్యత కాలనీది కాదు. మున్సిపాలిటీది. మరమ్మతు మున్సిపాలిటీ వాళ్లే చెయ్యాలి. మా వంతుగా మేము వాళ్లకి ఫిర్యాదు చేశాం. దానికి వాళ్లెలా స్పందిస్తారో తెలియదు. కానీ ఈలోగా మీ ఇంటిముందు కాల్వకో ఫొటో తీసి, మాకిచ్చిన కంప్లయింట్ కాపీకి దాన్ని జతపర్చి, మన ఎమ్మెల్యేగారికి మెయిల్ చెయ్యండి. ఇటీవలే ఆయన- ఎవరికే సమస్యొచ్చినా తనకో మెయిలిస్తే వెంటనే తీర్చేస్తానని స్టేట్‌మెంటిచ్చారు. మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి, మీ దరఖాస్తుకి విలువెక్కువుంటుంది కూడా” అన్నాడు.


షరా మామూలే- నేను మావారికి సూచనలాంటి ఆర్డరు వేశాను.


‘మంత్రి పదవుల్లో ఉన్నవారే- ఇంతకంటే పెద్ద వాగ్దానాల్ని తుంగలో తొక్కేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలో లెక్కా’ అని గొణుగుతూనే- నా పోరు పడలేక, నా మాటని గౌరవిస్తూ ఎమ్మెల్యేకి మెయిలిచ్చారు మావారు.


ఊహించినట్లే- నెల గడిచినా నో రెస్పాన్స్.


మావారు రామనుజానికి ఫోన్ చేశారు. “అసోసియేషన్ పర్స్యూ చేస్తోంది. జస్ట్ వెయిట్” అన్నాడాయన.


మరో పుక్కిటి పురాణకథ గుర్తొచ్చింది. ఓ ముని వందల ఏళ్లు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాట్ట. ‘స్వామీ! ప్రత్యక్షం కావడానికి ఇన్ని వందల ఏళ్లు తీసుకోవడం న్యాయమా!’ అని ముని వాపోయేట్ట. దానికి బ్రహ్మ, ‘నిజానికి నేను తీసుకున్నది ఒకే ఒక్క నిముషం. ఎటొచ్చీ మీ మనుషులకి అది వందల ఏళ్లు. వాపోవడం మాని ఏం కావాలో కోరుకో’ అన్నాడు. ‘కొంచెం ఆలోచించుకోవాలి స్వామీ!’ అన్నాట్ట ముని. ‘సరే! నిముషంలో వస్తాను’ అని మాయమయ్యాట్ట బ్రహ్మ.


మరీ అంతకాకపోయినా- ‘జస్ట్ వెయిట్’ అంటే- ఒకటి కాదు, రెండు కాదు- పది నెల్లని తర్వాత తెలిసింది. అదీ మరమ్మతుకి కాదు. మున్సిపాలిటీకి మా కాలనీలో జరగాల్సిన కొన్ని మరమ్మతుల జాబితాని తయారు చేయడానికి పట్టిన టైము.


ఆ విషయం మా అసోసియేషన్ ప్రెసిడెంటు రామానుజం సగర్వంగా మాకు ఫోన్ చేసి చెప్పాడు. ఎటొచ్చీ ప్రయారిటీలో మా ఇంటిముందు కుళ్లుకాల్వది మూడో స్థానం. ఎందుకంటే వేరే రెండిళ్లవాళ్లు మాకంటే ముందు కంప్లయింటిచ్చారుట.


మా కుళ్లుకాల్వ విషయంలో ఇంకా మేము ‘జస్ట్ వెయిట్’ చెయ్యాల్సి ఉంది.


ఫండ్సు శాంక్షనవక ప్రయారిటీ నంబర్ వన్ మరమ్మతు పని మొదలవడానికి మరో రెండునెల్లు పట్టింది.


ఈలోగా మరోసారి వాన, వరద వచ్చాయి. మా ఇంటిముందు కుళ్లుకాల్వ టాపు మరికాస్త లేచింది. వాసన వ్యాపించడానికి దారి మరింత పెద్దదై, వీధిలో బాధితుల సంఖ్యని పెంచింది.


మేము ఒకరికిద్దరు, ముగ్గురు, నలుగురు అవడంతో- మా కంప్లయింటుకి విలువ పెరిగింది.

ఆప్పుడు రామానుజం వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని, అసోసియేషన్ డబ్బులతో ఓ టార్పాలిన్‌ కొని- మా ఇంటిముందు కుళ్లుకాల్వ టాపు లేచిన చోట ఏర్పడిన కాళీని దాంతో మూయించాడు. దాంతో వీధిలో వాళ్లకి వాసన బాగా తగ్గింది. మాకూ కొంత తగ్గింది.


ఐతే అది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు కదా! కానీ అంతవరకూ మొహం చాటేసే రామానుజం, తరచు మా వీధిలోంచి వెడుతూ మా ఇంటిముందు ఓ క్షణం ఆగి టార్పాలిన్ కేసి చూసి వెడుతుండేవాడు. మేం కనిపిస్తామేమోనని మాకోసమూ ఆగేవాడు. ఆ విషయం మొదటిసారి ఆయన ఆగినప్పుడే కనిపెట్టాం. కానీ అది ఒకసారితో పోయేదా!


మాకు ‘జస్ట్ వెయిట్’ టైము ఎప్పటికొస్తుందా అని ఆత్రుత. ఆయన కనిపించినప్పుడల్లా ఆ విషయం అడగాలనుండేది.


మొదటిసారి అడగ్గానే ఆయన గొప్ప మొహం పెట్టి, “నేను వేయించిన టార్పాలిన్- కాల్వమీంచి వాసన రాకుండా బాగా ఆపుతోందా?” అనడిగి మెప్పుకోసం ఆశగా చూశాడు.


మావారు ఆయన్ని నిరాశ పర్చలేదు. అవసరమైనకంటే కాస్త ఎక్కువే పొగిడారు. ఆ రోజలా ఐపోయింది.


ఆయనకు కాస్త టైమివ్వాలిగా అని మా సహనం మేరకి- ఓ మూడు వారాలాగి రెండోసారి ఆయన్నడిగాం.


అడగ్గానే ఆయన మళ్లీ గొప్ప మొహం పెట్టి టార్పాలిన్ ప్రస్తావన తెచ్చాడు. మావారు ఆయన్నీ, టార్పాలిన్నీ మెచ్చుకోగానే సంతృప్తి పడి వెళ్లిపోయాడు.


అలా మూడు వారాల గ్యాపిస్తూ- మరో రెండు సార్లు అడిగాం. ఆయన టార్పాలిన్ ప్రస్తావనకే పరిమితమై, మావారి పొగడ్తలు అందుకుని వెళ్లిపోయాడు.


“మనది ఎంక్వయిరీలా లేదు. డ్రామా రిహార్సల్లా ఉంది. దీన్ని కొంచెం మార్చాలి” అన్నారు మావారు.


తర్వాతనుంచి మావారు రామానుజాన్ని మరమ్మతు గురించి అడక్కుండా- నేరుగా టార్పాలిన్ వేయించినందుకు మెచ్చుకోవడం మొదలెట్టారు. రామానుజం సంబరపడి వెళ్లిపోయేవాడు.

రిహార్సలు మావారికి ఏకపాత్రాభినయంగానూ, రామానుజానికి మూకాభినయంగానూ మారింది.

పొగిడించుకోవడం ఎన్నాళ్లయినా బాగుండొచ్చు. కానీ పొగిడేవాడికి- అది బోరే కదా! అందుకని రామానుజం మమ్మల్ని తప్పించుకోవాల్సింది పోయి, మావారే ఆయన్ని తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. దూరాన్నుంచి ఆయన కనబడితే చాలు- చటుక్కున ఇంట్లోకొచ్చి తలుపులు మూసేసేవారు మావారు. కానీ రామానుజమే మా ఇంటి కాలింగు బెల్ మ్రోగించి- టార్పాలిన్ గురించి అడగసాగాడు.


ఇలా లాభం లేదని మావారు ఆయనొచ్చే టైముకి బాత్రూంలో దూరేవారు. ఒకోసారి యూట్యూబులో చాగంటివారివో, గరికిపాటి వారివో ప్రవచనాలు- గేటు దాకా వినబడేలా పెట్టేవారు. డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేక రామానుజం ఆగి, ఆయన్ని పిల్చేవాడు కాదు. ఐనా ఆ సమస్యకు అంత సులభంగా పరిష్కారం లభించలేదు.


పొగడ్తలందుకున్నవాడు మనిషి రక్తం రుచి మరిగిన పులిలాంటివాడు. రామానుజం మా ఇంటివద్దనే కాదు, ఎక్కడ కనబడ్డా మావారిని టార్పాలిన్ గురించి అడగసాగాడు. దాంతో మావారు ఆయన్ని తప్పించుకునే మార్గంకోసం బాగా ఆరా తీసి- రామానుజం షెడ్యూల్ తెలుసుకున్నారు. ఆయన్ని చూడగానే మావారు తప్పించుకునే తీరు చూసి, ఓ మిత్రుడొకడు- “ఎంత బాకీ పడ్డావేమిటి?” అనడిగాడు. రామానుజం అప్పులవాడని ఆయన భ్రమ పడ్డాడు.


ఇది ఎంతవరకూ వచ్చిందంటే- రామానుజం ఎదురౌతాడన్న భయంతో మా వాకింగ్ టైం కూడా మార్చుకున్నాం.


చివరికి మావారు “జీవితంలో నిన్నేదీ కోరలేదు. కోరను కూడా- మా ఇంటిముందు టార్పాలిన్ పోయేలా చూడు” అని దేవుణ్ణి వేడుకున్నారు. “ఆ అడిగేదేదో, కుళ్లుకాల్వ మరమ్మతు గురించే అడగొచ్చుగా” అని నేను విసుక్కుంటే, “అది మున్సిపాలిటీ పని. వాళ్లని ప్రభావితం చెయ్యడం ఆ దేవుడి తరం కూడా కాదు” అని మావారు నాకు జ్ఞానబోధ చేశారు.


ఏమైతేనేం- కాలం దేనికీ ఆగదుగా- ప్రయారిటీ నంబర్ త్రీగా మా కుళ్లుకాల్వ మరమ్మతు సమయం వచ్చేసింది. అప్పటికి- మొదటిసారి దాని టాపు లేచి ఏణ్ణర్థమైంది. మా ఇంటిముందు ఏదో జరుగబోతోందనడానికి నిదర్శనంగా ఓ రెండువారాల పాటు- ఆ కాల్వని కొందరు ఇంజనీర్లు, కంట్రాక్టర్లు, సబ్ కంట్రాక్టర్లు సందర్శించారు.


వాళ్లతోపాటు వచ్చిన రామానుజాన్ని, “మరమ్మతు మొదలౌతోందన్నమాట!” అని ఉత్సాహంగా పలకరించారు మావారు.


“ప్రస్తుతానికి ఎలా మరమ్మతు మొదలెట్టాలీ అని వ్యూహరచన చేస్తున్నారు. పని మొదలవడానికి ఇంకా రెండుమూడు వారాలు పట్టొచ్చు. నేను టార్పాలిన్ వేయించాను కాబట్టి కానీ…..” అని ఏదో అనబోతుంటే- మావారు ఆయన్ని ప్రోగ్రెస్ గురించి మరి ప్రశ్నలు వెయ్యకుండా- అడక్కుండానే ఆయనకు కావాల్సిన మెప్పుని అందించి ఆపేశారు.


ఐతే అక్కడున్న మునిసిపల్ కంట్రాక్టరు, “అలా రెండుమూడు వారాలు అనకండీ- సోమవారంనుంచే మొదలెడుతున్నాంగా” అన్నాడు గొప్పగా.


ఆరోజు శనివారం కావడంతో, ఎల్లుండినుంచే పని మొదలు కాబోలని మురిసిపోయాను.

కానీ ఎల్లుండి సోమవారం నాడు ఎవరూ రాకపోతే నిరుత్సాహపడ్డాను.


మర్నాడు మంగళవారం కాల్వముందు నలుగురు కనబడేసరికి, ఉత్సాహమొచ్చి మావారికి చెప్పాను.


మావారు వెళ్లి వాళ్లను పలకరించి, “సోమవారమన్నారు. మంగళవారమొచ్చారు” అన్నారు నిష్ఠూరంగా.


“అయ్యో! మేము మాటంటే మాటే! పని సోమవారమే మొదలౌతుంది. ఈవేళ ఇంకా మంగళవారమే కదా!” అన్నారు వాళ్లు.


అప్పుడర్థమైంది. రెండుమూడు వారాలంటే 14-21 రోజులని కమిట్‌మెంటు. సోమవారమంటే- అది ఈ ఏడాదో లేక నెక్స్‌టియర్లోనో వచ్చే ఏ సోమవారమైనా కావచ్చు. అంతవరకూ వాళ్లెప్పుడొచ్చినా అది వ్యూహరచనకే!


మొత్తంమీద ఆరు వారాల తర్వాత వాళ్లన్న సోమవారం వచ్చింది. మేమనుకున్న పెద్ద గీతకంటే- ఇది చాలా చిన్న గీతలా అనిపించడంతో- వాళ్లు చాలా పెందరాళే వచ్చినట్లు అనిపించింది. వస్తూనే వాళ్లు ముందు టార్పాలిన్ తీసేశారు.


కుళ్లు కాల్వ గుప్పుమంది. కానీ టార్పాలిన్ కనబడకపోయేసరికి మాకు తనువులు, మనసులు ఎంతో తేలికైనాయి.


మరమ్మతు పని కాస్త పెద్దదే! ఆగకుండా పనిచేసినా 40 రోజులు పట్టొచ్చన్నారు.


హమ్మయ్య, ఫలానా రోజుకి పనైపోతుందని సంబరపడ్డాం కానీ అక్కడా పప్పులో కాలేశాం.


బ్యాంకులవాళ్లు- ఐదు పని దినాల్లో మీ పని పూర్తవుతుంది- అంటారు. ఆదివారాలు, ఇతర సెలవు రోజులు తీసెయ్యగా- ఐదంటే పది దాటుతుంది. ఈమధ్య బ్యాంకులకి కూడా సెలవులు బాగా పెరిగాయి. అలా ఒకోసారి 15 రోజులకు డేకవచ్చు.


అలాగే మా కుళ్లుకాల్వ మరమ్మతుకి- ఆగకుండా పని చేస్తే 40 రోజులన్నారు. కానీ వాళ్లో రోజొస్తే వరుసగా నాల్రోజులు మానేస్తున్నారు. ఒకోసారి వారం కూడా మానేస్తున్నారు.

ఇలా ఐతే నలబై రోజులు ఎప్పటికయ్యేను?


మేము ప్రతిరోజూ తెల్లారగానే తలుపులు తెరిచి ఆశగా పరికించేవాళ్లం.

బయట చిన్న చప్పుడైనా పనివాళ్లేమోననుకుంటూ- ‘వాళ్లు వచ్చేరని పని చేసేరని కన్నుల నీరిడి కలయజూసేవాళ్లం’.


అలా రెండునెల్ల తర్వాత- నిన్నటికి కుళ్లుకాల్వ మరమ్మతు పనికి- పది రోజులు పూర్తయ్యాయి.

నలబై రోజులని వాళ్లన్నది నిజమైతే- ఇంకా ముప్పై రోజుల పని ఉంది. ఎన్నాళ్లు పడుతుందో ఊహిస్తే గుండె గుభీల్మంది.


మధ్యమధ్య రామానుజం వచ్చి ప్రోగ్రెస్ చూసి వెడుతూండేవాడు, “మరమ్మతు పేరు చెప్పి కాల్వ ఓపెన్‌గా ఉండిపోయింది. మీకు టార్పాలిన్ ఉన్నప్పుడే బాగుండేదేమో!” అని సగర్వంగా జాలిపడేవాడు.


మున్సిపాలిటీతో అనుభవం ఉన్నవారెవరైనా- ఇది అంతు లేని కథ అని గ్రహించగలరు. అంత పెద్ద కథను వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నా వినిపించే సరదా మాకు లేదు. ఎందుకంటే పాట్లు మావి కదా!


ఈ కథకి ముగింపు పలకాలన్నట్లు- ఇదిగో ఈరోజు మావారోసారి పెద్దగా నవ్వి మూర్ఛపోయారు.

అదృష్తవశాత్తూ ఆ సమయానికి నేను పక్కనే ఉండి పడిపోకుండా ఆయన్ని పట్టుకున్నాను.

రామానుజం, మునిసిపాలిటీ ఉద్యోగులు, కంట్రాక్టర్లు, పనివాళ్లు మాత్రం- ఆయన మూర్ఛపోయిన విషయాన్ని గ్రహించకుండా- ఎవరికి వారు మావారు నవ్వింది తమ గురించేనన్న అనుమానంలో కొట్టుకుపోతున్నారు.


అసలు విషయమేమిటంటే-


మరమ్మతు పనివాళ్లు నిన్నొచ్చారా, నేడు కూడా వచ్చారు.

అంటే మొదటిసారిగా వాళ్లు వరుసగా రెండ్రోజులు పన్లోకొచ్చారు.


మావారు లక్ష్మణస్వామి- ఆనందం పట్టలేక పెద్దగా నవ్వినా, ఆ వెంటనే ఆశ్చర్యంతో మూర్ఛపోయినా ఆశ్చర్యమేముంది?


కథ ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా- కుళ్లుకాల్వ మరమ్మతు ఎప్పుడు పూర్తయిందో చెప్పాలి కదా అంటున్నారా-


అది చెప్పాలంటే-


జస్ట్ వెయిట్….

---౦---

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link:


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.






66 views0 comments
bottom of page