'Sala Mai Tho Celebrity Bangaya Part 1/2' - New Telugu Story Written By Vasundhara
'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం
రచన: వసుంధర
(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా-
ఎందుకు? ఎప్పుడు? ఎలా?
ఎందుకు?
ఎంబియ్యే చేసి ఆరంకెల జీతం తెచ్చుకుంటున్నాను. ఐనా తలిదండ్రుల చాటు మామూలు మగాణ్ణి.
చదువు, ఉద్యోగం, పెంపకాల విషయంలో- నా భార్య కృప కూడా అన్నింటా నాలాగే ఉండే మామూలు ఆడపిల్ల. కానీ ఒక్కటే తేడా! నాకు సెలబ్రిటీ అవాలని లేదు. నేను సెలబ్రిటీ అవాలన్నది తన కల!
మేడ్ ఫర్ ఈచదర్ లా ఉంటామని నన్నూ, కృపనీ జంటగా చూసినవాళ్లు మాది ప్రేమపెళ్లి అనుకుంటారు. కానీ నాకు కృప మా అమ్మ చాయిస్. నేను తనకి వాళ్ల నాన్న చాయిస్.
ఇద్దరం ఒకళ్లనొకళ్లు సరిగ్గా చూసింది పెళ్లిపీటలమీదే! ఒకళ్లతో ఒకళ్లం సరిగ్గా మాట్లాడుకున్నది పెళ్లయ్యాకనే!
పెళ్లయ్యేదాకా నాకు అమ్మాయిలంటే ఆకర్షణే కాదు, చిన్నచూపూ ఉంది. వాళ్లకి వంట, షోకు- అంతే అనుకునేవాణ్ణి.
కానీ కృప వంట చేస్తుంది. టివి చూస్తుంది. పరిజ్ఞానంలో అప్టుడేట్. చుట్టుపక్కల మంచి మేనేజర్. ఆన్లైన్ షాపింగులో ఎక్స్‌పర్ట్. సోషల్ మీడియాలో యాక్టివ్. నెట్ బ్రౌజింగులో ప్రొఫెషనల్. ఇన్ని చేస్తూ ఉద్యోగంలో బాసులకి ఫేవరేటు.
ప్రయత్నిస్తే ఇన్నీ నావల్లా కావచ్చు. కానీ- కృపకిలా అన్నీ ఒకేసారి చెయ్యలేను. వన్ బై వన్ చేద్దామంటే- అంత టైమేదీ!
కృప నాకో సెలబ్రిటీ. కానీ నేనో సెలబ్రిటీ అవాలంటుంది తను. తనేం చేసినా బాధ్యతా నిర్వహణ అంటుంది. నేనేం చేసినా గ్రేట్ అంటుంది. ఆ గ్రేట్‌నెస్‌తో నన్ను సెలబ్రిటీని చెయ్యాలని తన టాలెంటుతో నా చరిత్ర మొత్తం తెలుసుకుంది.
ఎల్కేజీ వయసులో డ్రామాలో వేశాను. అది భటుడి వేషం. రాజు సింహాసనంమీద కూర్చుంటే- నేను పక్కన ఓ శూలం పట్టుకుని కదలకుండా నిలబడాలి.
రాజు పాత్రధారి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. భటుడి వేషంలో- కదలకుండా, రెప్ప వాల్చకుండా- పది నిముషాలు నిలబడ్డ నేను మాత్రమే ఆ బహుమతికి అర్హుణ్ణని అమ్మ అనేది, ఇంట్లోవాళ్లూ ఇరుగుపొరుగులచేత అనిపించేది.
ఆ ప్రభావంతోనే కాబోలు- ఆ తర్వాత మా వీధిలో జరిగిన ఓ వేడుకలో పిల్లల నాటకానికి- నాకోసం ప్రత్యేకంగా ఓ భటుడి పాత్రని సృష్టించారు. కానీ ఎందుకోమరి- అమ్మ ఒప్పుకోలేదు.
అ తర్వాత నేను నటుణ్ణవడం తనకిష్టం లేదంటూ, ఓ సంగీతం మేస్టారి దగ్గర జేర్పించింది. కానీ ఆయనకున్న పదిమంది స్టూడెంట్సులో నేనొక్కణ్ణే అబ్బాయిని. చిన్నతనంగా అన్పించి నేనే మానేశాను.
స్కూల్లో ఎనిమిది చదువుతుండగా, నా ఆలోచనలు మారాయి. కానీ ఈసారి సంగీతం టీచరు దగ్గర స్టూడెంట్సులో అంతా అబ్బాయిలే. ఒక్క అమ్మాయి కూడా లేదు. సంగీతం నాకు సూట్ కాదని చెప్పేసి మానేశాను.
ఐతే అనుకోకుండా, గాయకుడిగా నాకో అవకాశమొచ్చింది.
మా సైన్సు టీచర్ విద్యార్థులకోసం చక్కని ప్రబోధగీతం రూపొందించాడు. అది పాడ్డానికి స్కూల్లో పాటల పోటీపెట్టి- నలుగురమ్మాయిల్నీ, నలుగురబ్బాయిల్నీ ఎన్నుకున్నాడు. ఎంపికైన అబ్బాయిల్లో నేను లేను.
ఐతే ఆ పాట కథ అక్కడితో ఆగిపోలేదు.
ఎంపికలో పక్షపాతం జరిగిందని కొందరు పేరెంట్సు అభ్యంతరం చెప్పారు. ఒకరిద్దరు పేరేంట్సు టీచరుకి తాయిలాలు కూడా ఇచ్చారు. ఆ ఒత్తిడికి లొంగి ఆయన మళ్లీ పోటీ పెట్టి మరో ఐదుగుర్ని బృందంలోకి తీసుకోవాల్సొచ్చింది. ఒత్తిడి తెచ్చినవారిలో నా పేరెంట్సు లేరు కాబట్టి పోటీలో నేను ఎంపిక కాలేదు.
అలా ఆ పాట పాడ్డానికి ఎంపికైనవారు మొత్తం పదముగ్గురయ్యారు.
సైన్సు టీచరు కదా, ఆయనకు పదమూడు సంఖ్య శుభప్రదం కాదనిపించింది. అందుకని పద్నాలుగో గాయకుణ్ణి ఎన్నుకోవడం తప్పనిసరయింది. ఐతే ఈసారి పోటీ నిర్వహించకుండా- సంగీతం నేపథ్యం ఉన్నవాళ్లకోసం వెదికాడు.
ఇద్దరు టీచర్ల వద్ద సంగీతం నేర్చుకున్న ఘనుణ్ణి కదా, ఆటోమాటిక్‌గా నేనే ఎంపికయ్యాను. ఐతే మొదటి రిహార్సల్సులోనే ఆయన నన్ను పక్కకు పిలిచి, ‘నువ్వు బృందంలో నిలబడు. గొంతు మాత్రం విప్పకు’ అని నిర్దేశించాడు.
పాట పాడినా పాడకపోయినా- బృందంలో ఉన్నందుకు- గాయకుడిగా నాకూ ఓ సర్టిఫికెట్ వచ్చింది.
మా ఇంటికొచ్చిన వాళ్లందరికీ అమ్మ ఆ సర్టిఫికెట్ చూపించేది. పోటీలో పాల్గోకుండా, పేరెంట్సు ఒత్తిడి లేకుండా- బ్రతిమాలి మరీ బృందంలోకి చేర్చుకోబడ్డ ఏకైక గాయకుణ్ణని నన్ను ప్రశంసించేది.
ఇదే హిస్టరీ స్పోర్ట్సులోనూ ఉంది నాకు. బంతిని తన్నకుండా ఫుట్‌బాల్ లోనూ, కూత కుయ్యకుండా కబాడీలోనూ- నాకు సర్టిఫికెట్లున్నాయి.
‘స్కూల్లో కానీ, కాలేజిలో కానీ- మీనాన్నకి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు తప్ప మరో సర్టిఫికెట్ లేదు. మా బుజ్జినాన్నకి ఎన్ని సర్టిఫికెట్లో! అంతా నా పెంపకం’ అంటూ కొంచెం నన్నూ, కొంచెం తన్నూ మెచ్చుకుని మురిసిపోయేది.
సర్టిఫికెట్లు లేవు కానీ- ఇలాంటి అజ్ఞాత ప్రతిభ సాహిత్యంలో కూడా ఉంది నాకు. హైస్కూల్, కాలేజిల్లో మేగజైన్లలో వచ్చిన- నా మిత్రుల కథలకు ఐడియాలు నావే. నేనే వ్రాసుంటే- ఇంకా బాగుండేవని అన్నవాళ్లలో- రాసినవాళ్లు, టీచర్లు కూడా ఉన్నారు. ఏడాది క్రితం ఓ వెబ్ పత్రికలో పడ్డ నా కొలీగ్ కథ కూడా- నా ఐడియాతోనే. అతడే అది చాలామందికి చెప్పాడు. ఆ విషయం అమ్మకి చెబితే- తను నా గురించి ప్రచారం చేసేది.
కృప ఈ విశేషాలన్నీ చాట్‌జీపీటీ లెవెల్లో ప్రోసెస్ చేసి, “నటుడికి ప్రేక్షకులుండాలి. గాయకుడికి శ్రోతలుండాలి. రచయితకీ పాఠకులుండొచ్చు కానీ- వాళ్లతడికి కనబడరు. వాళ్లకతడు కనబడడు. కాబట్టి రచయిత కావడమే నీకు సేఫ్. పైగా, రచయితగా నీకు గొప్ప ఫ్యూచరుంది. అది నీ ఫ్రెండ్సూ, టీచర్సూ, కొలీగ్సూ గుర్తించారు. ఇక నువ్వే గుర్తించాలి” అంది నాతో.
“ఏం గుర్తింపో, నేను వ్రాస్తే బాగుండేదని అన్నారేకానీ- నన్ను వ్రాయమని అడిగినవారు ఒక్కరూ లేరు” అన్నాను జాలిగా.
“ఐతే ఇప్పుడు నేనడుగుతున్నా- నువ్వు కథల్రాయడం హాబీగా చేసుకో. సెలబ్రిటీవి కాకపోతే నన్నడుగు” అంది కృప.
హాబీ అనగానే నాకో విషయం గుర్తొచ్చింది.
ఉద్యోగానికి ఇంటర్వ్యూలో- నా హాబీలేంటని అడిగాడొకాయన. నాకు ఏ హాబీ లేదన్నాను. నమ్మలేక గుచ్చి గుచ్చి అడిగి, నిజమేనని రూఢి చేసుకున్నాక, “హాబీల్లేవన్న మనిషిని మొదటిసారిగా చూస్తున్నాను” అని నాతో ఓ సెల్ఫీ తీసుకోవడమే కాక- నన్నా ఉద్యోగానికి సెలక్ట్ చేశాడు.
హాబీల్లేకపోవడం వల్లనే నాకా ఉద్యోగమొచ్చిందని నమ్మినా, ఎందుకో ఆ విషయం అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు. ఇప్పటికీ ఈ రహస్యం కృపకి కూడా తెలియదు.
రహస్యం బయటపెట్టాలా, ఆమె మాట వినాలా అని సందిగ్ధంలో పడ్డాను.
కానీ అడిగింది నా భార్య. తప్పుతుందా మరి!
ఎప్పుడు?
రోజూ ఉదయం ఎనిమిదిన్నరనుంచి సాయంత్రం ఐదు దాకా- పడక గదిలో- కింగ్ సైజు మంచంమీద- భార్యాభర్తలు ఒకరిపక్కన ఒకరు గడిపితే- ‘అమ్మో, ఎంత రొమాంటిక్కూ’ అని అసూయతో గుండెలు బాదుకోకండి. ‘అయ్యో, అది ఆఫీసు టైమా- వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా’ అని జాలిపడండి.
పెళ్లయి మూడేళ్లయింది.
కంపెనీ ఇచ్చిన త్రీ బెడ్రూం ఫ్లాట్లో ఇద్దరమే ఉంటున్నాం.
ఒకే ఆఫీసు. ఒకే టైమింగ్సు.
మంచాని కిటుపక్క నేను, అటుపక్క కృప- కాళ్లు బారజాపుకుని, వెనక్కి జారగిలబడి కూర్చుంటాం. ఒడిలో లాప్‌టాప్. చేతులు కీబోర్డుమీద. పక్కనే ఉన్నా ఇద్దరికీ ఆ స్పృహే రానివ్వని ఆన్లైన్ చాటింగు. పన్నెండున్నర్నుంచి ఓ అరగంట లంచ్ బ్రేకున్నా - లాగిన్, లాగౌట్లకి సెకనైనా అటూఇటూ ఉండకూడదు కాబట్టి అలర్టుగా ఉండాలి.
తపస్సుని ‘వర్క్ ఫ్రం హోం’లా చేసుంటే- విశ్వామిత్రుడు మేనకకి లొంగేవాడు కాదు. శకుంతల పుట్టేది కాదు. దేశానికి భారత్ అన్న పేరు దొరికేది కాదు.
చాటింగులో ఎక్కువ టెక్స్‌టింగు, కొంచెం విడియో. విడియో ఎప్పుడో తెలియదు కాబట్టి- కృప ఫుల్ మేకప్పుతోనే లాగిన్ ఔతుంది. మధ్యమధ్య టచప్‌లు ఇచ్చుకుంటూ- టివి సీరియల్సులో ఆడవాళ్లలా- ఎప్పుడూ రిచ్‌గా, పువ్వులా ఉంటుంది.
లాగౌటయ్యేక మిగతా రొటీన్లు అప్రస్తుతం కానీ కాఫీ, వంట వగైరాలన్నీ కలిసే చేస్తాం. తను టివి శ్రద్ధగా చూస్తుంది. ఆ సమయంలో నేను పుస్తకమో, పేపరో- శ్రద్ధగా చదువుతాను. ఎంత శ్రద్ధగా అంటే- టివి ప్రోగ్రాం బుర్రకి ఎక్కనంత!
‘మీరిక పాఠకులు కాదు. మీకే పాఠకులుండాలి. ఊఁ క్విక్’ అని కృప నిర్దేశించడంతో- నా చదువుకి బ్రేక్ పడింది.
అర్థాంగి మాట్లాడితే అది శాసనమే కదా! ప్రస్తుతం కృప టివి చూస్తుంటే- నేను చదవడం మానేసి కథ వ్రాసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వల్లకావడంలేదు. నెల్లాళ్లు గడిచినా కథలో మొదటి వాక్యమే ఇంకా పూర్తి కాలేదు.
ఈలోగా కృపకి ఆమె ఫ్రెండు మఖ ఫోన్ చేసి, “సీటివిలో ‘చిలకా గోరింకా’ అనే కొత్త షో మొదలైంది. దాంట్లో వారం వారం ఓ కొత్త సెలబ్రిటీ జంటని తీసుకొస్తారు. వాళ్ల ముచ్చట్లతో సరదాగా ఓ గంట కాలక్షేపం చేసే ఆ షోకి- నేనూ, నా హబ్బీ శరణ్ సెలక్టయ్యాం” అంది గర్వంగా.
చూడ్డానికి సుమారుగా ఉండే మఖ పక్కన కూడా దొండపండుకి కాకిముక్కులా ఉంటాడు శరణ్. ఐతే అతడికా కాంప్లెక్సు లేదు. కాలేజిలో తనకి ‘మబ్బుగాడు’ అనే పేరుందని- తనే గొప్పగా చెప్పుకుంటాడు.
ఇక మఖ ఓ వాగుడుకాయ. ఆ మాటలకి ఓ అర్థం పర్థం ఉండదని- కానివాళ్లమైపోతామన్న భయం కూడా లేకుండా అయినవాళ్లంతా ఆమెని దూరం పెట్టారు. కృప ఒక్కత్తే ఆమెను సహృదయంతో భరిస్తుంది.
ఇప్పుడు మఖ-శరణ్‌లు సెలబ్రిటీ జంట అయ్యేరని తెలియగానే కృపకి మనసు చివుక్కుమంది. తప్పకుండా అదో చెత్త ప్రోగ్రామయుండాలని కాసేపు మనసు సరిపెట్టుకుంది కానీ- కన్ఫర్మేషన్ కోసం ఓసారి గూగుల్ సెర్చి చేసింది.
కృప హతాశురాలయింది. ఆ ప్రోగ్రాంకి టిఆర్‌పి రేటింగ్ రెండు దాటింది.
‘ఓసారి ఆ ప్రోగ్రాం చూడాలి’ అనుకుంది. తనా చానెల్ అస్తమానూ చూడదు కాబట్టి- తేదీకి మొబైల్లో అలర్ట్ పెట్టింది, ఆ రోజు రాగానే టైముకి అలెక్సా ద్వారా అలర్టయింది.
అలా ‘చిలకా గోరింకా’ ప్రోగ్రాం టివిలో చూసిన కృపని ఒక్కసారిగా ఆశ్చర్యానందాలు కమ్మేశాయి.
ఆ ప్రోగ్రాంకి యాంకర్ చంద్ర!
చంద్ర కాలేజిలో కృపకి రెండేళ్లు సీనియర్. ఆమె అందానికి ఫ్లాటైపోయి హృదయాన్ని ఆమెముందు పరిచి, ప్రొపోజ్ కూడా చేసేట్ట. కృప మృదువుగా నో చెబితే ఏమాత్రం అప్సెట్టవలేదుట.
“ఇప్పటికి నలుగురమ్మాయిల ముందు నా హృదయాన్ని పరిచాను. నీకులా ఇంత ఫ్రెండ్లీగా నో చెప్పినవాళ్లు లేరు. ఇది మామూలు లక్షణం కాదు. సెలబ్రిటీస్‍కి ఉండే మెయిన్ క్వాలిటీ. ఏదో రోజున నీ ఈ క్వాలిటీని సమాజమూ గుర్తిస్తుంది. గుర్తించదూ- మీడియాలో షోమాన్ అయ్యేక, నిన్ను సెలబ్రిటీగా పరిచయం చేస్తాను” అని ప్రతిజ్ఞ చేసేట్ట.
అప్పుడామె ఆ మాటని అంత సీరియస్‌గా తీసుకోలేదు.
ఆతర్వాతా చంద్ర తన హృదయాన్ని మరికొందరు అమ్మాయిలముందు పరిచాడు. అదేపనిగా తిరస్కారాలు లభిస్తే- ఎన్నాళ్లిలా అనుకుని చివరకు మఖ ముందూ పరిచాడు. ఆమె తన అదృష్టానికి మురిసిపోతుందని అతడి నమ్మకం.
ఐతే మఖ నో చెప్పడమే కాదు, ‘అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నావా’ అని అతణ్ణి నిరసించడమే కాక, ఆ విషయం కాలేజిలో ప్రచారం చేసి తన స్టేటస్ ప్రమోట్ చేసుకుంది. మఖకి కూడా ప్రొపోజ్ చేయదంతో, అమ్మాయిల్లో చంద్ర స్టేటస్ బాగా డిమోటయింది.
‘నాకూ టైమొస్తుంది. అప్పుడు మఖకి తగినవిధంగా బుద్ధి చెబుతా’ అని కృప వద్ద ప్రతిజ్ఞ చేశాడు చంద్ర.
ఇప్పుడు కృప చంద్రకి ఫోన్ చేసి, “ఆఖరికి మఖ కూడా రిజెక్ట్ చేసిందని అప్పట్లో బాధపడ్డవాడివి- ఇప్పుడు తనే నీకు సెలబ్రిటీ. తన హోదా పెరిగిందా, నీ హోదా తగ్గిందా?” అని నిలదీసింది.
ఏమాత్రం రహస్యాల్లేని ఆదర్శ దంపతులం మేము. ఇంట్లో మా ఫోన్లకి ఎప్పుడూ స్పీకర్ ఫోను ఆన్లోనే ఉంటుంది.
ఆమె మాటకి చంద్ర గుక్కపట్టి నవ్వాడు. ఎందుకలా నవ్వాడా అని ఆశ్చర్యపోయాను. కృప అడుగుతుందేమోనని అనుకున్నాను కానీ- తను సినిమాలో సస్పెన్సు సీన్ చూస్తున్నంత ఉత్కంఠతో ఆగేదాకా ఆ నవ్వుని వింది.
నవ్వడమయ్యేక, “నేను మాటంటే మాటే! నాకు సమయమొచ్చింది. పగ తీర్చుకుంటున్నాను. తనని సెలక్ట్ చేశాను కానీ ఇంకా డేటివ్వలేదు. ఎప్పుడెప్పుడు పిలుపొస్తుందా అని ఎదురుచూస్తూంటుంది. ‘చిలకా గోరింకా’లో తను కనబడ్డం ఒక జీవితకాలం లేటనుకో” అని ఇందాకటంతసేపు కాకపోయినా కొంచెం సేపు నవ్వాడు చంద్ర.
కృపకి మఖ పరిస్థితి అర్థమైంది, “నువ్వు చెప్పింది వింటే మఖమీద జాలేస్తోంది…” అని ఏదో చెప్పబోతే-
“నాకు నీ మాట వేదం. మఖకి ఫర్‌గా చెప్పినా కూడా పాటించేస్తానని భయం. ఇంతకీ నువ్వు మఖమీద జాలి పడ్డానికి ఫోన్ చేసేవా, లేక మరేదైనా కారణముందా? మఖ కోసమైతే వెంటనే ఫోన్ పెట్టేసేయ్!” అని మళ్లీ నవ్వాడు చంద్ర.
“అయ్యో, మఖతో నాకేం పని! గతంలో నువ్వు నాకో మాటిచ్చావు. గుర్తు చేద్దామని చేశాను” అంది కృప వెంటనే.
ఫోన్లో వెంటనే మళ్లీ పకపకా నవ్వు వినిపించింది.
“మాటిమాటికీ ఎందుకలా నవ్వుతావ్! నేను జోక్సేం వెయ్యడంలేదే!” అని చిరాకు పడింది కృప.
అవతల నవ్వాగిపోయింది. “సారీ- క్రూ! టివి ఆంకర్నయినప్పట్నించీ- నాకిలా ఉత్తపుణ్యాన నవ్వడం అలవాటయిందిలే కానీ- అదలాగుంచు. అప్పుడెప్పుడో నేను నీకిచ్చిన మాట మామూలుది కాదు. గుండెలోతుల్లోంచీ వచ్చింది. అదెందుకు మర్చిపోతాను? రెండు వారాల్లో నిన్ను ‘చిలకా గోరింకా’ సెలబ్రిటీగా పరిచయం చేసేదా?” అన్నాడతడు.
“అంతేలే, ప్రేమకంటే పగే గొప్పదన్న మాట నిజమే అనుకోవాలి. షోమాన్ అవగానే నీకు ముందు మఖ గుర్తుకొచ్చింది. నేనడిగేదాకా గుర్తు రాలేదు” అంది కృప.
“ఎందుకు రాలేదు? నువ్వే ముందు గుర్తొచ్చావ్! కానీ- నా గొంతు వినగానే నీ నోట్నించి వచ్చే మాట నో ఔతుందని భయమంతే! ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు ఊఁ అను- సెలబ్రిటీగా ఇదే నీకు ‘చిలకా గోరింకా’ ఆహ్వానం”
“సెలబ్రిటీ నేను కాదు. మా ఆయన” అంది కృప.
ఆడవాళ్లకి వరాలు ఎప్పుడు ఎలా ఎవరికోసం ఉపయోగించుకోవాలో బాగా తెలుస్తుందని రామాయణంలో కైకేయి కథ చెబుతుంది. అక్కడ కైక తన వరాన్ని కొడుకుకోసం కోరితే, ఇక్కడ కృప తన భర్తనైన నాకోసం కోరింది.
ఆ తర్వాత నేను నాకు తెలియకుండానే రచయితనయ్యాను. ఎటొచ్చీ ఆ విషయం కూడా తర్వాతే తెలిసింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
వసుంధర పరిచయం: మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.
Comments