top of page

ఫుల్ డిస్కౌంట్


'Full Discount' - New Telugu Story Written By Surekha Puli

'ఫుల్ డిస్కౌంట్' తెలుగు కథ

రచన: సురేఖ పులి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అన్ని దినపత్రికలో చీరల డిస్కౌంట్ గురించి ప్రకటన వెలువడింది. పండగ రోజులు కదా.. ఆకర్షించే ప్రకటన అది. ఒక చీర పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారని ఆడవాళ్లందరూ కొనుగోలుకు ఎగబడుతున్నారు.


జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేస్తున్న మాణిక్యం, నివేదిత లంచ్ టైం లో పేపర్లో వచ్చిన చీరల ప్రకటన గురించి చర్చించుకున్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా హోటల్ సరోవర్ లో నిర్వహించబడుతున్న డిస్కౌంట్ చీరల ఎగ్జిబిషన్ కి వెళ్లాలి అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ ఒకేసారి సెలవు దొరకదన్నాడు బాస్.


రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళిద్దరిలో ఆత్రుత హెచ్చింది. ఏమైనా సరే తక్కువ రేట్ లో పండక్కి చీర కొనుక్కోవాలని, పిల్లలకు ఆరోగ్యం బాలేదని ఒకరు, తనకే తలనెప్పి అని మరొకరు సగం రోజు సెలవు తీసుకుని మొత్తానికి ఎలాగైతేనేం ఆఫీస్ నుండి బయటపడ్డారు.


ఆటో ఎక్కి హోటల్ సరోవర్ వైపు దారి తీశారు. నివేదిత అన్ది "మా అత్తగారు కూడా ఇంట్లో లేరు, నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి ఆలస్యంగా వెళితే పిల్లలు స్కూల్ నుండి వచ్చి గాబరా పడతారు".


మాణిక్యం చెప్పింది "అందుకే కదా సగం రోజు సెలవు తీసుకున్నాము. సరిగ్గా ఆఫీస్ వదిలే టైం కి ఇంటికి వెళ్లి పోతే సరే.. ఏ బాధ ఉండదు, ఎవరికీ డౌట్ రాదు. "


వచ్చేవి పండుగ రోజులు. సగానికి సగం రేటు తగ్గించి చీరలు అమ్ముతున్నారు అనే విషయం ఎంతో మంది స్త్రీల మనసు దోచే విషయము. హోటల్ సరోవర్ వెనకవైపు పెద్ద హాల్లోని గోడలకు రకరకాల చీరలను పురివిప్పిన నెమలి ఆకారంలో వేలాడ దీసారు. గుట్టలుగా టేబుల్స్ మీద పరిచి ఉన్న చీరలను చూసి అన్ని వయస్కుల స్త్రీలు వేలంవెర్రిలా ఎగబడుతున్నారు. కొందరు కొనడానికి వస్తే, చాలామంది కాలక్షేపానికి వచ్చారు.


ఒక్కొక్క చీరల గుట్ట ముందు వాటి ధరలు సూచిస్తూ బోర్డులు వేలాడదీశారు. అంతా గజిబిజిగా ఉంది. ఒకటే తోపులాట. సెక్యూరిటీ తరం కాలేదు, క్రమశిక్షణ కరువైంది.


ఒక వైపు అమ్మాయి చీరను చూస్తుంటే మరొక వైపు ఇంకొక స్త్రీ ఆ ఫలానా చీరనే లాగుతుంది. అదేంటో ఆడవాళ్ళు అల్మారా నిండా చీరలు ఉన్నా, పక్క వాళ్ళు ఏ చీరలు చూస్తున్నారో వాటి మీదనే దృష్టి పెడతారు.


నివేదిత, మాణిక్యం కూడా అందరిలాగానే చీరల నాణ్యత, రంగు, డిజైన్ ఇలా ఎన్నో హంగుల్లో చూస్తున్నారు. నివేదిత తనకు నచ్చిన చక్కని ఐదు చీరలను సెలెక్ట్ చేసింది.


"మణీ! చూడవే.. ఈ చీరలు బాగున్నాయా? ఒక్క చీర రేటు రెండు వందలు అంటే మనకు వంద రూపాయలకు వస్తుందన్నమాట. ఐదు చీరలకు ఐదు వందలు".


"ఇంతకీ ఎన్ని డబ్బులు తెచ్చావు"? మాణిక్యం ప్రశ్నించింది.


"ఎంతోకొంత తెచ్చాను లేవే, ఈ చీరల్లో నీకు నచ్చినవి సెలెక్ట్ చేయి".


"నాకు ఈ చీరల క్వాలిటీ నచ్చలేదు. ఆ ప్రక్కగా వేయి రూపాయల బోర్డు తగిలించిన చీరలు బాగున్నాయి" అని స్నేహితురాలు చెప్పగానే సెలెక్ట్ చేసిన ఐదు చీరలను యధాస్థానంలో పెట్టేసి, మరో వైపుకు వెళ్లారు.

"అదేమిటి నచ్చిన చీరల్ని అలా వదిలేసావు?'”


"వేరే చూద్దాం పద" అంటూ మరో వైపు చీరలు ఎంపిక మొదలుపెట్టారు.


పది నిమిషాలు ఆలోచించి శరీరం మీద వేసుకొని చూశాక లేత నారింజ రంగు గార్డెన్ వేరెలి జార్జెట్ చీర తీసుకుంది మాణిక్యం.


"నివేదిత నువ్వు కూడా సెలెక్ట్ చేయవే"


జవాబు ఇవ్వలేదు నివేదిత. కానీ చీరలు కెలకటమే పనిగా పెట్టుకుంది.


సేల్స్ కుర్రవాడిని అష్టావధానం చేస్తున్నారు ఆడవాళ్ళు, ఒకసారి దూరం నుండి మరొకసారి దగ్గర నుండి ఆపైన బార్డర్ అని డిజైన్ అని కొంగులని చూపించమని సేల్స్ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని తికమక పెడుతున్నారు.


నఖశిఖపర్యంతరం అయిన తరువాత మాణిక్యం సెలెక్ట్ చేసిన లేత నారింజ రంగు గార్డెన్ చీరను చూసి నివేదిత ఓ. కే. ముద్ర వేసింది.


మాణిక్యం పర్సులో ఉన్న ఆరు వందల రూపాయలను మరొక్కసారి మననం చేసుకుని బిల్ చేయమన్నది.


"ఇవి ఒకటవ రకం చీరలు, వీటి పైన తగ్గింపు లేదు. దీని బిల్లు వేయి రూపాయలు అవుతుంది, ముందుగానే మీకు చెప్తున్నాను" అన్నాడు సేల్స్ అబ్బాయి..


ఎంతో నచ్చిన చీర ఐదు వందలకు వస్తుందనుకున్న మాణిక్యం నిరాశ పడ్డది. "క్వాలిటీ బాగాలేనివి, మిస్ ప్రింట్ అయినవి, డామేజ్ అయిన చీరలు పైన డిస్కౌంట్ పెట్టారు" అన్నాడు సేల్స్ అబ్బాయి.


"మీ అడ్వర్టైజ్మెంట్ లో అన్ని చీరల పైన డిస్కౌంట్ అంటేనే ఆఫీసుకు లీవ్ పెట్టుకొని మరీ వచ్చాము మేము". నివేదిత లెక్చర్లు ఇవ్వడం మొదలుపెట్టింది.


కానీ ఎవరూ వినే స్థితిలో లేరు. మాణిక్యం తొందర పెట్టింది వెళ్ళిపోదామని. జనం ఇంకా వస్తునే వున్నారు. నివేదిత మరిన్ని చీరలు వెతుకుతూనే ఉంది. లేత నారింజ రంగు గార్డెన్ వేరెలి చీరను మడతపెట్టి చీరల కుప్పల పక్కన పెట్టాడు సేల్స్ అబ్బాయి. నివేదిత అదే చీరను చేతిలో పట్టుకుంది. నిలబడటానికి స్థలం లేనంత జనం, ఇసుక వేస్తే రాలటం లేదు అన్న మాటే. కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు, టైం పాస్ చేసే వాళ్ళు చీరలు వెతుకుతూనే ఉన్నారు.


నివేదిత వేయి రూపాయల లేత నారింజ రంగు గార్డెన్ వేరెలి చీరను ఇంకా చిన్నగా మడిచి ఎడమ చేత్తో పట్టుకుని కుడిచేత్తో వేరే చీరలు సెలెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నది. ఎవరో పంజాబీ మేడం తను తీసుకున్న చీరలోని డ్యామేజ్ను చూపిస్తుంది. ఒకటే రొద, హాలంతా హడావిడి, పైగా సినిమా పాటలు హోరు.


"ఏయ్, మాణిక్యం ఇటు ఎడమవైపురా" అని గట్టిగా పిలిచింది. మాణిక్యం వచ్చింది.


నివేదిత రెప్పపాటుకాలంలో లేత నారింజ రంగు గార్డెన్ వేరెలి చీరను మాణిక్యం బ్యాగ్ లోకి తోసేసింది. మాణిక్యం ఏంటి అని ముఖం పెట్టే సరికి, "మళ్ళీ మాట్లాడకు పద తొందరగా" అన్నది నివేదిత.


ఒక్కొక్కచోట ముగ్గురేసి సేల్స్ వాళ్ళు వున్నా నివేదిత గబుక్కున చీరను మాణిక్యం బ్యాగులో నొక్కేసిన చర్యను ఎవరూ గమనించలేదు.


మాణిక్యానికి గుండె దడ హెచ్చింది. వేయి రూపాయల చీర తన బ్యాగ్ లో ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. సేల్స్ అబ్బాయిలతో ఏవో జోక్స్ వేస్తుంటే, కస్టమర్లను ప్లీజ్ చేసే ఉద్దేశంతో సేల్స్ స్టాఫ్ కూడా జోక్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాళ్లు చేతులు వణుకుతున్నాయి, మెదడులోని నరాలు రక్తం చిందిస్తూట్టుగా అనిపిస్తుంది మాణిక్యానికి.


అతి కష్టంగా అన్నది మాణిక్యం "చాలా ఆలస్యం అయింది, నువ్వు రాకపోతే నేను ఇంటికి వెళ్ళి పోతాను".


"వస్తున్నా" అంటూ నివేదిత ఎగ్జిట్ వైపు నడిచింది.


"థాంక్యూ మేడం, ప్లీజ్ విజిట్ అగైన్" అని వినయంగా చెప్పే వాళ్ళని చూసి అందరూ తననే చూస్తున్నారని సిగ్గుతో మాణిక్యం చీర తన బ్యాగ్ లో ఉన్నందుకు బయటికి వచ్చి రావడంతోనే బ్యాగ్లో నుండి తీయబోతే నివారిస్తూ బస్టాండ్ కి వచ్చాక చీర ఇమ్మన్ది నివేదిత.


బస్టాండ్ వరకు వచ్చి రాగానే మాణిక్యం చీర తీసి ఇచ్చింది. అమ్మయ్య ఇప్పుడు మాణిక్యం మనసు కుదుటపడ్డది.


"ఏంటి, మరీ నువ్వు, షాప్ వాళ్ళు మన లాంటివాళ్ళను దోచుకోవటం లేదా, మనం ఎంతో మోసపోతున్నాము కనుకనే ఈ బిజినెస్ మేన్ ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు, మనం ఇలాగే ఉండి పోతున్నాము".


"ఏమో, ఇట్లాంటివి నాకు నచ్చవు, అయినా నో కామెంట్స్" అని మాణిక్యం ఖాళీ ఆటో కోసం చూడసాగింది.


"మాణిక్యం! ఈ చీర నీకు చాలా నచ్చింది కదా.. నీకు నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అమ్ముతాను. నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఈ చీర నువ్వు తీసుకో".


నివేదిత దొంగతనం చేసినందుకు ఏమీ కామెంట్ చేయని మాణిక్యం అవాక్కయి పోయింది. తన బాగ్ లో చీర ఉన్నందుకు ఎంతో టెన్షన్తో గిల్టీగా ఫీల్ అయి, ‘యూ కృకెడ్, పై పెట్టు దొంగిలించిన చీరను డిస్కౌంట్ పేరిట నాకే అమ్ముతున్నది, ఆహా ఎంతటి జాణ’ అని మనసులో అనుకుంది.


పైకి మామూలుగా ఉండి "కష్టేఫలి, ఆ ఫలితం నువ్వే దక్కించుకో, నాకొద్దు. నాకైతే సగం డిస్కౌంట్ మాత్రమే. నీకైతే ఫుల్ డిస్కౌంట్" అని మాణిక్యం, ఆటోలో ఇంటి వైపు దారి తీసింది.

***

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు : సురేఖ పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్


పిల్లలిద్దరికీ వివాహమైంది.

నేను ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్నగారే నాకు మార్గదర్శకులు.

స్కూల్ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం చాలాకాలం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, నెచ్చెలి లాంటి ఎన్నో పత్రికలలో నా కథలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.


66 views3 comments

3 Comments


nice @anilgurram-pi1yn • 25 minutes ago

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 04, 2023
Replying to

Thank you for your valuable comments

Like

@surekhap4148 • 1 hour ago

ధన్యవాదాలు

Like
bottom of page