top of page
Writer's pictureVasundhara

సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా - పార్ట్ 2



'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2/2' - New Telugu Story Written By Vasundhara

'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం

రచన: వసుంధర

(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

నన్ను సెలబ్రిటీగా చూడాలన్నది నా భార్య కృప కోరిక.

కాలేజిలో తన సీనియర్ చంద్ర టివి యాంకర్ అయినట్లు తెలుస్తుంది కృపకి.

నన్ను చంద్ర నిర్వహిస్తున్న ‘చిలకా గోరింకా’ ప్రోగ్రాం కి సెలెక్ట్ చెయ్యమని చంద్రని కోరుతుంది.



ఇక సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పెద్ద కథ చివరి భాగం చదవండి..


ఆ తర్వాత నేను నాకు తెలియకుండానే రచయితనయ్యాను. ఎటొచ్చీ ఆ విషయం కూడా తర్వాతే తెలిసింది.


ఎలా?


ఆ రోజు సాయంత్రం ఐదు.

పడక గదిలో మంచంమీద కూర్చున్న నేను- ‘సీ యూ టుమారో, బై’ అని ఒళ్లోని లాప్‌టాప్‌లో టైపు చేసి- ఓ పక్కనుంచి కింగులా దిగాను. అదే సమయానికి మంచంమీద మరో పక్కనుంచి క్వీనులా దిగింది కృప.


నేనిలా మంచం దిగి, అలా కృపని చూశానో లేదో- జేబులో సైలెంటు మోడ్‌లో ఉన్న మొబైల్ అదిరింది.


చూస్తే కొత్త నంబరు,

“నేను చంద్ర. సీటివిలో ‘చిలకా గోరింకా’ యాంకర్ని. పది నిముషాల్లో వస్తున్నా. మీ దంపతులు నాకోసం ఓ గంట స్పేర్ చెయ్యాలి” అని కట్ చేశాడా చంద్ర.


ఫోన్ మళ్లీ అదిరింది. కారణం ఆ కబురుకి నా బాడీ, మైండూ అదిరాయి. ఫోను అదురుతున్న నా చేతిలో ఉంది.


కృప ఉత్సాహంగా నన్ను సమీపించి, “ఎవరూ, చంద్రేనా? గంటనుంచి చాట్ చేస్తున్నాడు. పది నిముషాల క్రితం ఓకే చేశాను. నాకులా సైమల్టేనియస్ చాటింగు నీకు రాదంటే, ఆఫీసు టైమవగానే నీకు ఫోన్ చేస్తానన్నాడు. నా విషయంలో తను మహా ప్రాంప్ట్” అంది కృప గర్వంగా.


మా ఇంట్లో దేనికైనా పర్మిటింగ్ అథారిటీ తనదేననీ, ఏ టాలెంటులోనైనా తన తర్వాతే నేననీ- చెప్పుకుందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోదు కృప. అమ్మ, నాన్న, తోడబుట్టినవాళ్లతో సహా- మొత్తం నా బంధుమిత్రులందరికీ ఈ విషయం తెలిసి కనీసం రెండున్నరేళ్లు అయింది.

ఆ జాబితాలో తాజా ఎంట్రీ చంద్రది.


“చంద్ర ప్రాంప్ట్‌నెస్ విషయం సరే, మనమింకా సెలబ్రిటీసు కాలేదుగా!” అన్నాను.


“కాకపోవడమేంటి? గతవారం- ‘చంచల’ వెబ్ మాగజైన్లో నీ మొదటి కథ పడింది. ఆ కథని నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో పెడితే, 400 మంది వహ్వా అన్నారు. వాళ్లలో చంద్ర ఒకడు. సో, తనకి నువ్వు సెలబ్రిటీ” అంది కృప వెంటనే.


నేనెప్పుడు కథ వ్రాశానూ అనబోయాను కానీ, కృప నన్ను మాట్లాడనివ్వలేదు.

“చంద్ర టైం చాలా విలువైనది. డౌట్లు తర్వాత! ముందు నువ్వు ఫ్రెష్షయి రా” అంది.


‘చంద్రకి మేం టైమిస్తున్నామా, మేమతడి టైం తీసుకుంటున్నామా’ అని డౌటొచ్చినా పైకి అనడానికి ధైర్యం చాలలేదు. కానీ ఇంకో డౌటుని అడగడానికి సాహసం చెయ్యక తప్పలేదు.


‘ఫ్రెష్షవడానికి నాకైతే ఐదు నిముషాలు. కానీ నీకు కనీసం అరగంట కావాలి’ అనబోయి ఆగిపోయాను.

షాట్‌కి రెడీ ఐన హీరోయిన్లా మిలమిల మెరిసిపోతోంది కృప. అంటే తను మేకప్ కిట్ పక్కనెట్టుకుని- వర్క్ ఫ్రం హోం టైంలోనే ఫ్రెష్షయింది.


ఏమనాలో తెలియక, “సరే, నేను ఫ్రెష్షయి వస్తాను. నువ్వు అతిథి మర్యాద ఏర్పాట్లలో ఉండు” అన్నాను.


“నో ఫార్మాలిటీస్ అని చంద్ర ముందే చెప్పాడు. తను నీ బంధువుల్లా కాదు. మాటంటే మాటే!” అంది కృప.


కృప మల్టీ టాస్కింగులో- నా బంధునింద కూడా ఒకటన్నది స్వానుభవం. అందుకని మాట్లాడకుండా డ్రెస్సింగ్ టేబిల్ చేరి తల దువ్వి, ముఖానికి కొంచెం పౌడరద్దుకున్నాను.

కృప నా వెనకే వచ్చినట్లుంది, “ముఖానికి పౌడరంటే- కూరకి కరివేపాకులాంటిది. రుమాలుతో తుడిచేసుకుని రా. నేను డ్రాయింగ్ హాల్లో సోఫాలో కూర్చుంటా” అని వెళ్లిపోయింది.


ఫ్రెష్షవడానికి కృప విధించిన డూస్ అండ్ డోంట్సు కొన్ని ఉన్నాయి. గుర్తొచ్చినంతలో వాటిని ప్రతిబింబంలో వెరిఫై చేసుకుని- డ్రాయింగ్ హాల్ చేరేసరికి కాలింగ్ బెల్ మ్రోగింది.

సోఫాలో ఫాన్ కింద కూర్చున్న కృప, “నడిస్తే చెమట పట్టి నా మేకప్ పాడౌతుంది. నువ్వెళ్లి తలుపు తియ్” అంది.


తలుపు తీస్తే- ఎదురుగా బ్యాక్‌ప్యాక్‌తో నిటారుగా నిలబడ్డ ఓ యువకుడు. అందంగా, హీరోలా ఉన్నాడు. నన్ను చూసి పకపకా నవ్వి, “నేను చంద్ర. మీరు ప్రముఖ రచయిత జీవన్ కదూ!” అని మళ్లీ నవ్వి లోపలికొచ్చి తలుపు మూశాడు.


నా మొహం ఎర్రబడింది. ‘ఆ నవ్వెందుకు? తను హీరోలా ఉంటే, నేను లేమాన్‌లా ఉన్నాననా?’ అనుకున్నాను.


అంతలో చంద్ర నవ్వాపి, “నాతోపాటే మీరూ నవ్వుతారనుకున్నా. మచ్ డిజప్పాయింటెడ్” అన్నాడు.


“నవ్వడానికి మీరేమైనా జోకేశారా? మీ పేరు, నా పేరు చెప్పారు. అంతేగా!” అన్నాను చిరాకుని అదుపు చేసుకుంటూ.


అంతే చంద్ర గుక్కట్టి పడిపోయాడు. తమాయించుకున్నాక, “అంతేలెండి, శంకరాభరణం శంకరశాస్త్రిగారింట్లో గోడలు, స్తంభాలు సంగీతం పలికినట్లు- రచయితలు కదా- మీనోట్లోంచి వెలువడే ప్రతి అక్షరం ఒకో జోకు” అన్నాడు.


“నేనా? రచయితనా?” అన్నాను ఆశ్చర్యంగా. కానీ అతడి నవ్వుల సింధువులో నా మాట బిందువై ఒదిగిపోయింది.


నవ్వాగేక, “మీరింకా నవ్వలేదు” అని హెచ్చరించాడు. ఈ నవ్వుల గోలేంటిరా బాబూ అనిపించింది కానీ పైకి అనలేదు.


అంతలో చంద్ర ముఖం గంభీరంగా ఐపోయింది. గొంతు సవరించి, “బాగా గుర్తుంచుకోండి. ‘చిలకా గోరింకా’ ప్రోగ్రాం, మొదట్నించి చివరిదాకా సరదాగా ఉండాలి. సరదాగా ఉన్నట్లు ప్రేక్షకులకెలా తెలుస్తుంది? నేను మిమ్మల్ని పలకరించి నవ్వుతాను. మీరు మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ నవ్వుతారు. అలా ప్రోగ్రాం పొడుగునా ప్రతి ప్రశ్నకీ, జవాబుకీ, మాటకీ మనం నవ్వుకుంటూనే ఉండాలి. అదీ కాన్సెప్టు” అని వివరించి, “ఇలాంటివి మీకంటే కృపకి బాగా అర్థమవచ్చు” అని- ఇంకా ఏదో అనబోయాడు.


అంతలో కిలకిలమని నవ్వు. అటు చూస్తే కృప. తనూ చంద్రలాగే నవ్వుతోంది.

ఆమె నవ్వుకి అప్రతిభుణ్ణై చూస్తూండిపోయాను. నవ్వులో నా కృప ఇంత బాగుంటుందా- అనుకున్నాను కానీ పైకనలేదు.


“మీతో కాపురంలో ఇలా నవ్వే అవకాశం నాకెప్పుడైనా ఇచ్చేరా?” అనే అవకాశం కృపకివ్వకుండా జాగ్రత్త!


కానీ చంద్రకి అలాంటి ఇబ్బందేం లేదు కదా! భర్తని నాకే మనోహరంగా తోచిన ఆమె నవ్వు- ఎప్పుడో ప్రేమించి, ఇప్పటికీ ప్రేమిస్తున్న అతడికెలా ఉంటుంది?

చంద్ర సోఫాలో కూర్చున్న కృపని సమీపించి, “అప్పుడూ ఇప్పుడూ అదే అందం నీది” అన్నాడు. ఆవెంటనే పకపక.


“అప్పుడూ ఇప్పుడూ- నీది అదే చలాకీతనం” అంది కృప. ఆవెంటనే కిలకిల.


అలా ఇద్దరిమధ్యా కాసేపు పకపకలూ, కిలకిలలూ అయ్యేక- కృప, “అయ్యో, ఇంకా నిలబడే ఉన్నావు” అని కిలకిలా లేవబోయింది. అతడు వెంటనే, “నువ్వు లేచి నిలబడ్డంకంటే, నేను కూర్చోడం బెటర్ కదా” అని పకపకా ఆమెకెదురుగా సోఫాలో కూర్చున్నాడు.


నేను కృప పక్కన కూర్చున్నాను. పకపకలూ, కిలకిలలతో- చంద్ర, కృప కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

అలా ఐదు నిముషాలు గడిచేసరికి, ఐదు యుగాలయ్యాయనిపించింది నాకు.


“ఇలా అర్థం లేకుండా నవ్వుకోవడమే ప్రోగ్రామైతే- షో చూసేవాళ్లకి విసుగు పుట్టదా?” అన్నాను ఉండబట్టలేక.


అప్పుడు కృప అతి కష్టంమీద కిలకిలలాపి, “ఇంకా నువ్వు నవ్వడం మొదలెట్టలేదు” అంది.


చంద్ర అప్రయత్నంగా, “వెరీ స్మార్ట్! కృప ఈజ్ మై షోస్ డ్రీమ్ గెస్ట్” అని మెచ్చుకున్నాడు.

“ఐతే మొత్తం మీ ప్రోగ్రాం ఎంతసేపుంటుందో చెప్పండి. టైమర్ పెట్టుకుని నవ్వడం మొదలెడతాను” అన్నాను.


చంద్ర నవ్వి, “నేను ప్రోగ్రాం చెయ్యడానికి కాదు, ప్రాక్టీసుకొచ్చాను. షూటింగ్ మా స్టుడియోలో ఉంటుంది. నేడు ప్రాక్టీసయ్యేక- డేట్ ఫిక్స్ చేసి మీకు చెబుతాను” అన్నాడు.


“నువ్వు వెరీ ఫాస్ట్” అంది కృప అతణ్ణి అడ్మైరింగ్‌గా చూస్తూ.


“దీనికే ఫాస్ట్ అంటే- ఈ ఫైలు చూస్తే ఏమంటావ్!” అంటూ అతడో ఫైలు నాకందించి, “వెబ్‌పత్రిక ‘చంచల’లో మీరు వ్రాసిన ‘అజ్ఞాని’ కథ తెలుగునాట పెద్ద సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ నిర్మాత దాన్ని సినిమాగా తియ్యాలని అనుకుంటున్నాడు. వెబ్‌లో మీ రచనలపై మూడు వ్యాసాలొచ్చాయి. ఇవన్నీ కవర్ చేస్తూ- మన ప్రోగ్రాంలో నేనడిగే ప్రశ్నలు, మీ జవాబులు, ఇంకా మన సంభాషణలో చోటు చేసుకునేఇతర అంశాలు- ఇందులో వివరంగా ఉన్నాయి. ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చెయ్యండి. ప్రాక్టీసులో ప్రోగ్రాం పొడుగునా నవ్వుతుండాలని గుర్తుంచుకోండి” అన్నాడు.


అతడుండగానే ఇద్దరం ఆ ఫైలు చూశాం. చూస్తే అంతా ఫేక్!

కాలేజిలో నేను గొప్ప వక్తనిట. నా టాలెంటుకి ముగ్ధురాలై- కృప నన్ను ప్రేమించిందిట.

మా పెళ్లికి పెద్దలు ముందు అభ్యంతరపెట్టారుట. కానీ మేమిద్దరం బాగా పట్టుబట్టడంతో- నెమ్మదిమీద సద్దుకుని తామే దగ్గరుండి పెళ్లి జరిపించారుట.


కృప ప్రోత్సాహంతోనే నేను రచయిత నయ్యానుట. కృపకి ప్రచారమంటే ఏమాత్రం ఇష్టముండదుట. ఆమె తల్చుకుని ఉంటే- ఈపాటికి నా పేరు తెలుగునాటేకాదు, ప్రపంచమంతా మ్రోగిపోయేదిట. కృప తనకి కాలేజిమేట్ కాబట్టి- చంద్రకీ విషయాలు తెలిశాయిట. ఆమెను సంప్రదిస్తే, భర్తనొక్కణ్ణే పిలవమందిట. కానీ ఈ ప్రోగ్రాంకి దంపతులు జంటగా రావాల్సి ఉంటుందని నొక్కించడంతో- భర్తకి గుర్తింపు కోసం అయిష్టంగానే ఒప్పుకుందిట.


“ఇందులో ఒక్క నిజం లేదు. నన్ను సెలబ్రిటీని చెయ్యడానికి ఇన్ని అబద్ధాలా? ఇలాంటి ప్రచారంతో- నేను సెలబ్రిటీ ఐపోతానా?” అన్నాను ఇబ్బందిగా.


“ఎందుకవరూ? బైబిల్ ప్రకారం- ‘లెట్ దేర్ బి లైట్’- అన్నాడు దేవుడు. భూమ్మీదకు వెలుగొచ్చింది. నేడు మీడియా- జనాలకి దేవుడు. మీడియా వాళ్లు- సెలబ్రిటీ అంటే- మీరు సెలబ్రిటీనే! ఇంకోలా చెప్పాలంటే- మారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నట్లు- సెలబ్రిటీస్ ఆర్ మేడ్ బై మీడియా” అన్నాడు చంద్ర.


అతడు వెళ్లిపోయాడు. తర్వాత కృపతో కలిసి ‘చిలకా గోరింకా’ కోసం రెండు వారాలు రిహార్సల్సు చేశాను.


ఆ తర్వాత నాలుగు రోజులకి స్టూడియోకి రావడానికి డేట్ ఫిక్స్ చేశాడు చంద్ర.

నాకైతే ఇదో రకం ఫ్రాడ్ అనిపించింది. ఈ ఫ్రాడ్ నుంచి తప్పించుకోవాలని బలంగా ఉంది. కానీ ఎలా?


ఫ్రాడ్‌ని ఫ్రాడ్‌తోనే జయించాలని తెలుసు.

బాగా ఆలోచించేక ఓ ఉపాయం తట్టింది. కృపకి తెలియకుండా అమ్మకి ఫోన్ చేసి, దాచకుండా విషయం మొత్తం చెప్పేశాను. అమ్మ సహకరిస్తానంది.


సరిగ్గా షూటింగుకి ఒకరోజు ముందు- అర్జంటుగా రమ్మని అమ్మనుంచి ఫోనొచ్చింది.

వెళ్లక తప్పదని తెలిసిన కృప బాగా డిజపాయింటయింది. నేను వెళ్లి మూడ్రోజుల తర్వాత వచ్చాను.

ఆ తర్వాత మూడు వారాలకి కృపకి మఖనుంచి ఫోను. ఆ రోజు రాత్రి సీటివిలో చిలకా గోరింకలు తనూ, శరణ్ అని.


మామూలుగా ఐతే ఏమో కానీ, మేము రావాల్సిన ప్రోగ్రాంలో వాళ్లొస్తున్నారని- కుతూహలంగా ఆ రాత్రి ప్రోగ్రాం చూశాం.

చంద్ర మంచి యాంకర్. ప్రోగ్రామంతా నవ్వులతో నడిపించాడు.


మధ్యమధ్య మాటల్ని బట్టి మాకు తెలిసిందేమిటంటే- శరణ్ గొప్ప వక్త. అతడు, మఖ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శరణ్ ‘చంచల’ అనే వెబ్ మాగజైన్లో వ్రాసిన ‘అజ్ఞాని’ కథ తెలుగునాట పెద్ద సంచలనం సృష్టించింది. త్వరలో ఓ పెద్ద నిర్మాత దాన్ని సినిమాగా తియ్యబోతున్నాడు…..

అక్షరం పొల్లుపోకుండా అది చంద్ర- నాకోసం, కృపకోసం వ్రాసిన కథ.


చివరికిలా….

ప్రోగ్రాం అవగానే మఖ ఫోన్ చేసి, “వచ్చేవారం ఫ్రెండ్స్ అండ్ రెలెటివ్స్ మాకు సన్మానం చేస్తున్నారు. పార్టీకి నువ్వూ మీ ఆయనా తప్పక రావాలి” అంది.


కృపకి పుండుమీద కారం చల్లినట్లయింది. వెంటనే చంద్రకి ఫోన్ చేసి, “మాకోసం వ్రాసిన కథని- ఇంకొకళ్లకి వాడావు, సరే! మరీ మఖ, శరణ్‌లని సెలబ్రిటీల్ని చేస్తావనుకోలేదు. వెరీ బాడ్ టేస్ట్” అని అక్కసు తీర్చుకుంది.


“ఏంచెయ్యను? లాస్ట్ మినిట్లో షూటింగ్ కాన్సిల్ చేశావ్! అంత తక్కువ టైంలో ఈ ప్రోగ్రాంకి ఒప్పుకునేవాళ్లెవరు? మఖ వెంటనే ఒప్పుకుని నా పరువు కాపాడింది” అని, “అలాగని నేను నా మాట మర్చిపోయానని అనుకునేవు. ప్రస్తుతం నా దగ్గర- డాన్సింగ్ సెలబ్రిటీకి ఓ స్లాట్ కాళీ ఉంది. వీలు చూసుకుని కొత్త ఫైలుతో మీ ఇంటికొస్తాను” అన్నాడు చంద్ర.


స్పీకర్ ఫోన్లో ఈ మాటలు వినగానే ఉలిక్కిపడి, “ప్లీజ్ నాకు రైటర్ సెలబ్రిటీయే బాగుంది. నన్ను డాన్సింగ్ సెలబ్రిటీని చెయ్యొద్దు” అని జాలిగా చూశాను కృప వంక.


అప్పటికామె ఏమనలేదు. వారం తర్వాత మఖ దంపతులకు జరిగిన సన్మాన సభకు వెడితే-

అక్కడ ఒక్కరూ శరణ్ రచనల ప్రసక్తి తేలేదు. ప్రోగ్రాంలోని ఇతర అంశాల్ని పట్టించు కోలేదు. టివిలో కనబడ్డమే ఒక విశేషమన్నట్లు అదేపనిగా అభినందించారు. పార్టీ చివర్లో ఆ దంపతులిద్దరూ సినిమా స్టైల్లో నృత్యం చెయ్యాలని పట్టుబడితే- శరణ్, మఖ ఏమాత్రం సంకోచించలేదు.


‘సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా’ అని పాడుతూ శరణ్ స్టెప్సు వేస్తుంటే- అక్కడ ఒకటే ఈలలు…

“ఆ స్టెప్సు చూడు. నువ్వు అంతకంటే బాగా వెయ్యగలవు” అంది కృప నా చెవిలో.


చంద్ర ఆఫర్ విషయంలో ఆమె నిర్ణయాన్ని గ్రహించిన నా గుండెల్లో రాయి పడింది….


---0---

========================================================================

సమాప్తం

========================================================================

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.




33 views0 comments

Comments


bottom of page