మదిలో మల్లెల మాల - పార్ట్ 5
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 11 hours ago
- 8 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 5 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 11/12/2025
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ:
ఛైర్మన్ రామారావు గారి అమ్మాయికి లవ్ లెటర్ రాసాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని అతని ఇంటికి తీసుకొని వెళతారు. రమణను సస్పెండ్ చేయమని రామారావు చెబుతారు. తండ్రి రామశర్మను గుర్తుకు తెచ్చుకుంటాడు రమణ.
రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి.
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 5 చదవండి.
అలారం మ్రోగింది. వార్డెన్ రంగయ్య నిద్ర లేచాడు. వెళ్ళి రమణను లేపాడు. ఇరువురూ కాలకృత్యాలను తీర్చుకొన్నారు. సమయం నాలుగున్నర. బస్సు బయలుదేరే సమయం ఐదుగంటలు. హాస్టల్ నుంచి బస్టాండుకు పది నిముషాలు నడక.
రమణకు ముఖ్య స్నేహితులు పదిమంది నిద్ర లేచారు. నాలుగు ముక్కాలుకు అందరూ బస్టాండుకు చేరారు.
"రమణా!... నిన్న జరిగిన ఏ విషయాన్ని మనస్సున వుంచుకోకు. మీ అమ్మతో ఏమీ చెప్పకు. ప్రిపరేషన్ లీవులను చెప్పు. ఇల్లు వదలి ఎక్కడికీ వెళ్ళకు. శ్రద్ధగా చదువు. నీవు స్టేట్ ఫస్టు రావాలని నా కోరిక. అదే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం."
అరవై సంవత్సరాల రంగయ్య తన కుడిచేతిని రమణ తలపై వుంచి హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు.
స్నేహితులందరూ ’బాగా చదువు... బాగా చదువు’ అని ఎంతో ప్రీతిగా చెప్పారు. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. రమణ బస్సులో కూర్చున్నాడు. బస్సు ముందుకు కదిలింది.
వార్డెన్ రంగయ్య..... రమణ మిత్రులు అతనికి టాటా చెప్పారు. ఎడమ చేతిని పైకెత్తి కిటికీ గుండా చూస్తూ రమణ మెల్లగా వేళ్ళను కదిలించాడు. బస్సు వేగంగా ముందుకు వెళ్ళిపోయింది.
రమణకు రంగయ్య చెప్పిన నయవచనాలు గుర్తుకు వచ్చాయి.
రంగయ్య బాబాయ్.... చాలా మంచివాడు. పిల్లలనందరినీ తన సొంత బిడ్డల్లా చూచుకొంటాడు. పరీక్షల సమయంలో తాను నిద్రపోకుండా ప్రతి గదికీ వెళ్ళి పిల్లలను బాగా చదవమని చెబుతాను. తాను స్వయంగా టీ తయారు చేసి అందరికీ ఇస్తాడు.
ఆయన చెప్పిన విధంగా యిక్కడ జరిగిన ఏ విషయాన్ని అమ్మకు చెప్పకూడదు. నాన్నగారు గతించి రెండు సంవత్సరాలైంది. ఆయన జ్ఞాపకాలు ఆమె మనస్సు నిండా వున్నాయి. తలచుకొని కన్నీరు పెట్టుకుంటుంది. నిన్న జరిగిన యధార్థ విషయాన్ని ఆమెను చెబితే బాధపడుతుంది. ’నావల్ల నా తల్లికి ఎలాంటి దుఃఖం కలుగకూడదు. రంగయ్య బాబాయ్ చెప్పినట్లుగానే ప్రిపరేషన్ లీవులను చెబుతాను. చదవాలి.... చదవాలి. బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఆ వార్త, నా ఫొటోను పేపర్‍లో చూచి అమ్మ సంతోషించాలి. ఆమెకు నామీద వున్న కలలను నిజం చేయాలి.
బాగా పై చదువులు చదవాలి. ఎదగాలి... గొప్ప పేరు ప్రఖ్యాతిని సంపాదించాలి. నా మనస్సులో రామారావు, రంజనీల పట్ల వున్న కసిని... నా చదువులపై మళ్ళించాలి. విజయాన్ని సాధించాలి. మంచి ఉద్యోగం సంపాదించి బంగళా, కారు కొనాలి. అమ్మకు అన్ని విధాలా ఆనందాన్ని కలిగించాలి.
సత్యం, ధర్మం, నీతి, న్యాయం తప్పకుండా సాటివారి పట్ల ప్రేమ సౌభాత్రం కలిగి మానవతా వాదంతో, హైందవ సిద్ధాంత ఆచరణతో, అందరినీ అభిమానించి వారి మన్ననలను పొందాలి. సాటివారికి ఆదర్శంగా బ్రతకాలి. నేను పోయినా నా గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలి. మనిషిగా పుట్టినందుకు జీవితాంతం మంచి మనిషిగా బ్రతికి చావాలి.
నా లక్ష్యాన్ని సాధించిన నాడు... ఒక్కసారి రామారావు గారిని, రంజనీని కలవాలి. వారు నన్ను చూచి ఆశ్చర్యపోవాలి. వారు నాపట్ల చేసిన తప్పుకు వారు పశ్చాత్తాప పడాలి.
కండక్టర్ పలకరింపుతో రమణ ఆలోచనా స్రవంతికి అంతరాయం కలిగింది.
వూరిపేరు చెప్పి డబ్బును ఇచ్చాడు. అతను ఇచ్చిన టిక్కెట్ చిల్లరకు జేబులో వుంచుకొన్నాడు.
రానున్న ఐదారు సంవత్సరాలు తన జీవిత విధానాన్ని నిర్ణయించబోతాయి. ఆర్థిక వసతులు అంతంత మాత్రమే అయినందున, తను శ్రమించాలి, అర్జించాలి. కాలానికి ఎదురీదాలి, లక్ష్యాన్ని సాధించాలి.
అతని ఈ నిర్ణయం మనస్సున పట్టుదలగా మారింది. అరగంట తర్వాత.... ఉదయం ఏడున్నర ప్రాంతంలో బస్సు ఆ గ్రామంలో ప్రవేశించింది. ఆగింది. రమణ తన లగేజీని తీసుకొని, తల్లిని చూడబోతున్నందుకు ఆనందంగా తన ఇంటివైపుకు నడిచాడు.
*
రాత్రి చాలా పొద్దుపోయేవరకు రంజనీ కన్నీటితో రమణకు తన వలన అన్యాయం జరిగిందని బాధపడింది. తల్లి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. ఆ మాటలన్నీ అర్థవంతాలేనని.... తను తన భావి జీవితాన ఆచరణలో పెట్టాలని... తనలోని ఆవేశాన్ని అజ్ఞానాన్ని తన నయబోధతో తల్లి తొలగించి, యధార్థాలను జీవిత సత్యాలను తనకు తెలియజేసిన తల్లికి చేతులెత్తి నమస్కరించింది. వ్యాకుల చిత్తంతో ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకు తెలియదు.
ఉదయం ఆరుగంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రక్కయింట్లో వున్న తన స్నేహితురాలు వనజతో కలిసి హాస్టల్‍కు వెళ్ళి రమణను గురించి విచారించింది.
వార్డెన్ రంగయ్య... రమణ వేకువనే తన వూరికి వెళ్ళిపోయాడని చెప్పారు.
తన ప్రయత్నం ఫలించనందుకు... రమణకు సారీ చెప్పాలనుకొన్న తన నిర్ణయం ఫలించనందుకు రంజనీ చాలా విచారపడింది. మౌనంగా ఇంటికి వెళ్ళింది.
రమణ తన యింటికి చేరాడు. ప్రేమాభిమానాలతో తల్లిని పలకరించాడు. స్నానం చేసి దేవుని విగ్రహాల ముందు కూర్చొని ప్రాయశ్చిత్త మంత్రాలు... సంధ్యావందనం చేశాడు.
శివ సహస్రనామార్చన చేశాడు. తల్లి అందించిన పాయాసాన్ని దేవుని నైవేద్యం పెట్టాడు. తన లక్ష్యాన్ని స్వామికి విన్నవించుకొన్నాడు. తల్లిపాదాలకు నమస్కరించాడు. తనయుని భక్తికి, వివేకానికి ఆ తల్లి ఎంతగానో సంతోషించింది.
*
ఉదయాన్నే ఏడున్నరకు రామారావుగారు ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశారు.
"ధర్మారావు గారూ!... నిన్న నేను మీతో ఆవేశంతో ఆ అబ్బాయికి టి.సి ఇచ్చి పంపమని చెప్పాను. మీరు మూడువారాలు సస్పెండ్ చేస్తానన్నారు. మీరు ఏమీ చేయవద్దు. అతన్ని కాలేజీకి రానివ్వండి" సౌమ్యంగా చెప్పాడు.
రామారావు గారి ఈ మాటలను ధర్మారావు... ఆశ్చర్యపోయాడు. తన మాట ప్రకారం రమణ వూరికి వెళ్ళిపోయి వుంటాడని వారికి తెలుసు.
"సారీ సార్!.... వాడు వూరికి వెళ్ళిపోయాడు. నేను మీకు చెప్పిన మాట ప్రకారం త్వరలో అసలు నేరస్థుడు ఎవరో కనిపెట్టి మీ ముందు నిలబెడతాను."
"వాడు ఊరికి వెళ్ళిపోయాడా!...." రామారావు గారి ఈ మాటలో ఎంతో ఆశ్చర్యం.
"అవును. నేను ఫోన్ పెట్టేస్తున్నాను సార్" రిసీవర్‍ను ఫోన్ పై వుంచాడు ధర్మారావు.
రామారావు గారు సాలోచనగా ఫోన్ పెట్టేశారు. ప్రక్కనే వుండి వారి సంభాషణను విన్న లక్ష్మీదేవి మౌనంగా వంట ఇంటివైపుకు వెళ్ళిపోయింది.
ధర్మారావు తయారై కాలేజీకి వెళ్ళారు. తెలుగు లెక్చరర్ బలరామశర్మను పిలిచారు.
"శర్మగారూ!... ప్లస్ టు, ఫస్టియర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కు ’దేశభక్తి’ అనే టాపిక్ మీద వ్యాస రచన పోటీని నిర్వహించండి. రెండు ఏ ఫోర్ సైజు షీటులలో యాభై లైన్లు మాత్రమే వ్రాయాలి. అందరూ స్టూడెంట్స్ ఈ పోటీలో పాల్గొనాలి. ఈరోజు... ఉదయం సెకండ్ పిరీడ్‍లో యిది జరగాలి. ప్రేయర్‍లో మీరు అనౌన్స్ చేయండి. మెరిట్ సర్టిఫికేట్, ఫస్ట్ సెకండ్, ధర్డ్ ప్రైజెస్ ఇస్తామని చెప్పండి"
"అలాగే సార్" అన్నారు బలరామశర్మ.
విద్యార్థులందరూ ప్రెయర్‍కు హాజరైనారు. ప్రిన్సిపాల్ గారు తనకు చెప్పిన విషయాన్ని తెలుగు సీనియర్ పండిట్ బలరామశర్మ గారు అనౌన్స్ చేశారు. విద్యార్థులందరూ ఆనందంగా తలలు ఆడించారు.
మొదటి పిరీడ్ అయిపోయింది. రెండవ పిరీడ్‍లో అందరు విద్యార్థులు వ్యాస రచన పోటీలో పాల్గొన్నారు. పిరీడ్ ముగిసింది. ఆయా క్లాస్ సెక్షన్ లెక్చరర్స్, పేపర్లను కలెక్ట్ చేసి కట్ట కట్టి ప్రిన్సిపాల్ గారి టేబుల్‍పై వుంచారు.
తర్వాత... మిగతా పిరీడ్స్ యధాతధంగా జరిగాయి. కాలేజీ లాంగ్ బెల్ మ్రోగింది. విద్యార్థులు తరగతి గదుల నుండి బయటికి వచ్చారు. కొందరు యిండ్లకు వెళ్ళిపోయారు. కొందరు గ్రౌండులో ఆటలాడసాగారు.
తెలుగు సీనియర్ పండిట్ బలరామశర్మ, ప్రిన్సిపాల్ గారి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చొని వున్నారు. పిల్లలు వ్రాసిన వ్యాసరచనను పరిశీలిస్తున్నాడు. ప్రిన్సిపాల్ గారు కూడా అదే పని చేస్తున్నారు. కొన్ని పేపర్స్ తన ముందు వుంచుకొని.
తన జేబు నుండి ఒక కాగితాన్ని తీసి బలరామశర్మకు చూపుతూ....
"శర్మగారూ!... ఇది రమణ, రంజనీకి వ్రాసిన ప్రేమలేఖ. ఈ వ్రాత మనం జాగ్రత్తగా పరిశీలించి ఎవరి వ్రాతకు సరిపోతుందా తెలుసుకోవాలి. ఈ పోటీ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశ్యం అదే. కానీ మీరు అనౌన్స్ చేసిన రీతిగా మొదటి మూడు ఉత్తమ రచనలకు బహుమతులు, సర్టిఫికేట్స్ మనం మన స్కూల్ డే నాడు, ఎన్నిక అయిన పిల్లలకు ఇస్తాము. రమణ నిర్దోషి, అసలు దోషిని మనం పట్టుకోవాలి. అది మన తక్షణ కర్తవ్యం" తన చేతిలోని కాగితాన్ని బలరామశర్మకు అందించాడు ధర్మారావు.
మూడుగంటల ఆ ఇరువురి దీక్షాప్రయత్నంలో ఆరుగురి చేతి వ్రాతలు మీద వారిరువురికీ సందేహం కలిగింది.
వ్యాసరచన.... ప్రధమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులను సులువుగా ఎంపిన చేయకలిగారు వారు. కానీ లేఖ వ్రాసిన వాడిని పట్టుకొనేటందుకే వారికి చాలా సమయం పట్టింది.
చివరకు ఆ ఉభయులూ ప్రతి అక్షర వంపు సొంపులను ప్రేమలేఖ వ్రాతను.... వ్యాసరచన వ్రాతను.. పోల్చి చూచి చివరికి.... ఆ లేఖను వ్రాసినది బాతుగుడ్ల బంగారయ్య కుమారుడు భీమారావు అనే నిర్ణయించారు.
ఒకటి రెండు మార్లు తమ తమ అభిప్రాయాలను గురించి చర్చించుకొని, తాము జరిపిన పరీక్ష సరైందని... ఈ నేరం చేసింది భీమారావేనని వారు తీర్మానించారు.
కానీ... లేఖ క్రిందవున్న సంతకం రమణది. భీమారావు రమణ సంతకాన్ని ఎలా సాధించాడు?.... ఫోర్జరీ చేశాడా!.... అది వాడికి ఎలా సాధ్యమైంది?.... ఈ ప్రశ్నలకు ఎంతగా ఆలోచించినా వారిరువురికి జవాబు దొరకలేదు.
"సార్!..... గంట పదయింది. మన ప్రశ్నలకు జవాబు ఎంతగా ఆలోచించినా దొరకడం లేదు. మీకు నేను ఒక సలహా చెప్పనా?" అన్నాడు బలరామశర్మ.
"శర్మగారూ!.... ఈ విషయాన్ని గురించి మనం బాతుల బంగారయ్య గారిని పిలిపించి మాట్లాడితే!..."
ధర్మారావుగారు పూర్తిచేయక మునుపే.....
"వద్దు సార్!... అతను మొరటు మనిషి, మన కళ్ళముందే భీమారావును కొట్టవచ్చు. లేదా మనం తన కొడుకును కావాలనే దోషిగా చేశామని, తన సుపుత్రుడు అలాంటి పాడు పని చేయడని... మనమీదనే తిరగబడవచ్చు. గోటితో తీసివేసే దానికి గొడ్డలి ఎందుకు సార్!...."
బలరామశర్మ ఆంతర్యాన్ని ధర్మారావు అర్థం చేసుకొన్నాడు కుర్చీనుండి లేచాడు. ఇరువురూ వారి వారి ఇండ్లకు వెళ్ళిపోయారు.
*
మరుదినం ప్రెయర్‍లో తెలుగు సీనియర్ పండిట్ బలరామశర్మ గారు విజేతల పేర్లను ప్రకటించారు.
ప్లస్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రంజనీ మొదటి బహుమతి.... సెకండ్ ఇయర్ ఆనంద్... అంజిబాబులకు ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించారు.
పిల్లలు క్లాసు గదులకు వెళ్ళిపోయారు. తనకు మొదటి బహుమతి వచ్చినందుకు రంజని ఎంతగానో సంతోషించింది. స్నేహితురాండ్రు ఆమెను అభినందించారు. కొందరు మగపిల్లలు కూడా ’గ్రేట్ రంజనీ’ అని చెప్పారు.
అటెండర్ మస్తాన్ సెకండ్ ఇయర్ బి సెక్షన్‍కు వెళ్ళాడు. లెక్చరర్ గారితో... ప్రిన్సిపాల్ గారు భీమారావును పిలుస్తున్నారని చెప్పాడు.
సైన్స్ లెక్చరర్ మాధవమూర్తి భీమారావును పిలిచి మస్తాన్‍తో వెళ్ళమని చెప్పాడు.
భీమారావు గుండె జల్లుమంది. మౌనంగా వెనుక నడిచి... ప్రిన్సిపాల్ గారి రూమును సమీపించి ఆగాడు.
మస్తాన్ లోనికి వెళ్ళి.... ప్రిన్సిపాల్ గారితో భీమారావు వచ్చినట్లు చెప్పాడు.
ప్రిన్సిపాల్ భీమారావును లోనికి పిలిచారు. అతను లోనికి వెళ్ళాడు. తలుపులు మూసి బయటికి వెళ్ళమని మస్తాన్‍కు చెప్పాడు ప్రిన్సిపాల్. మస్తాన్ ఆ పనిచేసి వరండాలో నిలబడ్డాడు.
భీమారావు... భయంతో క్షణంసేపు ధర్మారావు గారి ముఖంలోకి చూచి.... తలదించుకొన్నాడు.
"అడగండి... బలరామశర్మ గారూ..." ప్రిన్సిపాల్ గారి ఆదేశం.
బలరామశర్మ.... భీమారావును దగ్గరికి రమ్మను సౌంజ్ఞ చేశాడు.
భీమారావు శర్మగారి కుర్చీని సమీపించాడు. తన చేతిలో వున్న ప్రేమలేఖను శర్మ... భీమారావుకు అందించాడు. మౌనంగా దాన్ని అందుకొన్నాడు భీమారావు. "విప్పిచూడు" ప్రిన్సిపాల్ గారి ఆదేశం.
కాగితాన్ని విప్పాడు భీమారావు. అతని చేతుల్లో వణుకు. మనస్సులో కలవరం. ముఖాన చెమట.
"భీమారావు!... దాన్ని వ్రాసింది నీవే కదూ!..." తెలుగు లెక్చరర్ గారి ప్రశ్న.
భీమారావు భయంతో క్షణంసేపు వారి ముఖంలోకి చూచి.... మెల్లగా తలదించుకొన్నాడు.
"నేను వ్రాయలేదు సార్" కొన్ని క్షణాల తర్వాత అన్నాడు.
"ఎవరు వ్రాశారో తెలుసా?" శర్మగారి ప్రశ్న.
"నాకు తెలీదు సార్" మెల్లగా చెప్పాడు భీమారావు.
"చూడు భీమ్ బాబు!... పరీక్షలు నెలరోజుల్లో వున్నాయి. వ్రాయాలని వుందా!.... టి.సి చేత పట్టుకొని ఇంట్లో కూర్చోవాలని వుందా!..... నిజం చెప్పు" ముందు సౌమ్యంగా ప్రారంభించి చివరగా గద్దించాడు శర్మగారు.
ఆ మాటలు వినేసరికి భీమారావుకు భయం వేసింది కళ్ళల్లో నీళ్ళు.
"రేయ్, భీమారావ్!.... నీకు నిజంగా పరీక్షలు వ్రాయాలని వుంటే చేసిన తప్పును ఒప్పుకో. నీవే ఈ పని చేశావనే దానికి మా దగ్గర తగిన సాక్ష్యాలు వున్నాయి. మా దృష్టి నుండి నేరం చేసినవాడు తప్పించుకోలేడు" ప్రిన్సిపాల్ గారి ఈ మాటలను విన్న.... భీమారావుకు తలపై పిడుగుపడినట్లయింది. ముఖంలో ఎంతో ఆవేదన.
ఈ విషయం... తన తండ్రికి తెలిస్తే తనను చంపేస్తాడు.
ఒకే వూరి వారైనందున పార్టీల బేధంతో తన తండ్రిగారికి.... రామారావు గారికి విరోధం అన్న విషయం భీమారావుకు తెలుసు.
ఆ కారణంగా..... ’అన్యధాశరణం నాస్తి’ అన్నట్లు ప్రిన్సిపాల్ గారి కాళ్ళమీద ఏడుస్తూ పడ్డాడు భీమారావు. "నన్ను క్షమించండి సార్!... నేను తప్పు చేశాను. మా నాన్నకు చెప్పకండి సార్!" భోరున ఏడుస్తూ చెప్పాడు.
"పైకి లే...." అన్నారు ప్రిన్సిపాల్ గారు.
తెల్ల కాగితాన్ని చేతికి ఇచ్చి..... "ఆ లేఖను నేనే వ్రాశాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి సార్. అని వ్రాసి క్రింద సంతకం పెట్టు" అన్నారు ధర్మారావు.
వణికే చేతులతో కాగితాన్ని అందుకొని... అతి కష్టం మీద ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాటలను వ్రాసి సంతకం చేసి వారి చేతికి అందించాడు భీమారావు.
"మరొక్క ప్రశ్న?" భీమారావు ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు బలరామశర్మ.
కన్నీటితో... భయంతో... దీనంగా వారి ముఖంలోకి చూచాడు భీమారావు.
"రమణ సంతకం నీవు ఎలా చేశావు భీమన్నా?" అడిగాడు శర్మగారు నవ్వుతూ.
"నేను చేయలేదు సార్. అది వాడి సంతకమే. మూడునెలల క్రిందట ఎవరి సంతకం బాగుంటుందో... వ్రాద్దామని నేను వ్రాసి... రమణ చేత ఈ కాగితంలో వాడి సంతకాన్ని చేయించాను. వాడికి తెలియకుండా నేను ఆ కాగితాన్ని తీసుకొన్నాను. నన్ను క్షమించండి సార్" దీనంగా అడిగాడు భీమారావు.
"అంటే.... నీవు మంచి స్నేహితుని వలె నటించి... రమణలోని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాణ్ణి నమ్మించి.... వాడి నోట్ బుక్‍లో వాడిచేత చివరన సంతకం చేయించి.... తర్వాత వాడికి తెలియకుండా ఆ కాగితాన్ని జాలేసి... ప్రేమలేఖను దానిపై వ్రాసి, రంజనీకి చేర్చి..... వాణ్ణి దోషిగా చేశావన్నమాట. అవునా?" ఆవేశంతో అడిగారు ప్రిన్సిపాల్.
భీమారావు దోషిలా తలదించుకొన్నాడు. నోరు మెదుపలేదు.
"యు రాస్కెల్.... గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్..." బిగ్గరగా ఆవేశంతో అరిచాడు ధర్మారావుగారు.
భీమారావు కదలలేక.... వంచిన తలను ఎత్తలేక... ఏడుస్తూ నిలబడిపోయాడు.
"భీమ్ బాబు!.. యిక నీవు క్లాసుకు వెళ్ళవచ్చని ప్రిన్సిపాల్ గారు చెప్పారు. వెళ్ళు" నాటకీయంగా చెప్పాడు విద్వాన్ బలరామశర్మ.
బరువైన పాదాలను శ్రమతో కదిలించి భీమారావు యుద్ధంలో పరాజయం పొంది, రక్త గాయాలతో దీనంగా సగానికి పైగా చచ్చిపోయిన వీరునిలా, ప్రిన్సిపాల్ గారి గదినుంచి బయటికి నడిచాడు.
వరండాలో నిలబడి వున్న మస్తాన్... వాడి వాలకాన్ని చూచి....
"ఒరేయ్ భీమా!.... నీకేం పొయ్యేకాలంరా!... రమణ మీద నీకు ఎందుకురా పగ. ఇక నీగతి నిర్ఘతే. పోరా ఎదవా పో!..." అసహ్యించుకొన్నాడు మస్తాన్.
"సార్!... నిజానిజాలు తేలిపోయాయి. ఈ గదిలో మన ముగ్గురి మధ్యన జరిగిన సంభాషణను నేను నా సెల్లో రికార్డు చేశాను. దాన్ని మీరు మన ఛైర్మన్ గారికి వినిపించండి. రమణ పట్ల వారికి వున్న దురాభిప్రాయం మారిపోతుంది" నవ్వుతూ చెప్పాడు బలరామశర్మ.
"వెరీగుడ్ శర్మగారు. మంచిపని చేశారు. ఈ సెల్ ఇలా ఇవ్వండి" అన్నాడు ధర్మారావు.
బలరామశర్మ తన సెల్‍ను ధర్మారావు గారికి అందించాడు.
"సార్ ఒక్కమాట"
’చెప్పండి"
"ఆ బాతుగుడ్ల బంగారయ్యకు... రామారావు గారి పార్టీల పరంగా వైరభావం. బంగారయ్య కొడుకు ఈ పని చేశాడని తెలుసుకొన్న రామారావు గారు ఆవేశంతో బంగారయ్య ఇంటిమీదికి వెళితే ఆవులావులు పోట్లాడుకోగా మధ్యనున్న దూడలకు కాళ్ళు విరిగాయనే రీతిగా... పాపం భీమారావు భవిష్యత్తు పాడైపోతుందేమో ఒక్కక్షణం ఆలోచించండి" అన్నాడు శర్మ.
"నేరం చేయని రమణ శిక్షను అనుభవించగా... నేరం చేసిన భీమారావు శిక్షను అనుభవించడంలో తప్పు లేదుగా. యిక వారి మధ్యన వున్న వైరం అంటారా దానికి మనకు సంబంధం లేదు. వుండదు. నేను రామారావుగారితో రమణ దోషి కాడని అసలు నేరస్థుణ్ణి పట్టుకొని మీకు తెలియజేస్తానని చెప్పాను. మనకు యధార్థం తెలిసింది. ఈ సెల్లోని మన సంభాషణ వారిని విననీయండి. విని వారు ఏమి నిర్ణయిస్తారో మనం విందాం" అనునయంగా చెప్పాడు ధర్మారావు.
"సరే సార్!... మీ ఇష్టప్రకారంగానే చేయండి" అన్నాడు శర్మగారు.
క్షణం తర్వాత వాచీ చూచి....
"క్లాసుకు టైమయింది. ఇక నేను వెళతాను సార్"
"మంచిది వెళ్ళిరండి. థాంక్యూ శర్మగారు" నవ్వుతూ చెప్పాడు ధర్మారావు.
కాలేజ్ లాంగ్ బెల్ నాలుగున్నరకు మ్రోగింది. ప్రిన్సిపాల్ గారు రామారావు గారికి ఫోన్ చేశారు. ఇంటికి వస్తున్నానని చెప్పారు. వారు ఇంట్లోనే వున్నానని రమ్మనమని చెప్పారు.
ధర్మారావు... బలరామశర్మ రామారావు ఇంటికి ఐదుంకాలుకల్లా చేరారు. విషయాన్ని వివరించారు. బలరామశర్మ సెల్లో రికార్డు చేసిన దాన్ని వినిపించారు.
అంతా మౌనంగా విన్నారు రామారావుగారు. వారు ఏం చెబుతారో వినాలని ఆత్రుతతో వారి ముఖంలోకి చూస్తూ వుండిపోయారు ధర్మారావు, బలరామశర్మలు.
కొద్ది నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. తర్వాత....
"ధర్మారావుగారూ!... ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీరు వాడిచేత వ్రాయించుకొన్నారుగా అది చాలు. వాడు ఇకపై భయంతో బుద్ధిగా వుంటాడు. వాడి తండ్రి సరైన మనిషి కాదు. ఆ కారణంగా ఆ భీమారావు గాడికి ఎలాంటి దండన వేయవద్దు" సాలోచనగా మెల్లగా చెప్పాడు రామారావు.
వారి అభిప్రాయానికి తమ అంగీకారాన్ని తెలియజేసి, నమస్కరించి వారిరువురూ భవంతి నుండి బయటికి వచ్చారు.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 6 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments