top of page
Original.png

మదిలో మల్లెల మాల - పార్ట్ 6

Updated: Dec 22

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Madilo Mallela Mala - Part 6 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 16/12/2025

మదిలో మల్లెల మాల - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

జరిగిన కథ:

తన కూతురికి లవ్ లెటర్ రాసాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. 

ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 6 చదవండి.


ప్రిన్సిపాల్ గారు మౌనంగా రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నారు. 


"సార్ ఒక విషయం" అడిగాడు శర్మ. 


"ఏమిటది?.. "


"ఈ సమయంలో రామారావు గారి సుపుత్రుడు రంగారావు ఊర్లో లేకుండా ఉన్నందున ఉత్పన్నమైన సమస్య తేలికగా పరిష్కారం అయింది. అతను ఊర్లో ఉండి ఉంటే ఈ సమస్య గడ్డు సమస్యగా మారి వుండేది. అతని నోరు చేయి రెండింటికి దురుసుతనం అధికం. రమణ చాలా లక్కీ ఫెలో అనే చెప్పాలి. "


"మీ మాట నిజం శర్మగారూ!.. నేను ఒక నిర్ణయానికి వచ్చాను" 


"ఏమిటి సార్ అది?"


"ఈ ఊర్లో ప్లస్ టు పరీక్షలు.. అంటే ఈ కాలేజీలో జరుగకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరిగేలా చేయాలనుకొంటున్నాను. కారణం.. ఆ రంగారావు హైదరాబాదు నుండి తిరిగి వచ్చిన తర్వాత.. విషయాన్ని విని ఆ పేద రమణకు హాని చేస్తాడేమోనని నా అనుమానం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?.. "


"అలా జరగడం చాలా మంచిది సార్. రమణ నిర్భయంగా బాగా పరీక్షలు వ్రాయగలడు. వాడు చాలా మంచివాడు. తెలివైనవాడు. మంచి భవిష్యత్తు ఉన్నవాడు. మన కళ్ళముందు వాడికి ఎలాంటి కష్టం, నష్టం.. జరుగకూడదు సార్. "


"ఆ ఉద్దేశ్యంతోనే నేను నా నిర్ణయాన్ని తీసుకొన్నాను. జెడ్. పి ఆఫీసులో అధికారులతో మాట్లాడి జిల్లా నగరంలోనే ఆ పరీక్షలు ఈ కాలేజీ పిల్లలకు జరిగేలా చూస్తాను. "


"అది చాలా మంచి పని సార్. "


బలరామశర్మ గారి ఇంటి ముందు కారు ఆగింది. శర్మగారు దిగి ప్రిన్సిపాల్ గారికి విష్ చేశారు. 

"గుడ్ నైట్" చెప్పి.. ధర్మారావు తన నిలయం వైపుకు బయలుదేరారు. 


రెండు రోజుల తర్వాత.. స్కూల్ డే ఫంక్షన్ జరిగింది. ముఖ్య అతిథిగా రామారావుగారు ఆసనాన్ని అలంకరించారు. 

ఆటల పోటీలలో గెలిచిన వారికి, వక్తృత్వపు పోటీ, పాటల పోటీ, ఏకపాత్రాభినయం పోటీలలో ప్రథమ స్థానాన్ని సంపాదించిన వారికి బహుమతుల ప్రధానం జరిగింది. 

ఆటల్లో పన్నెండు బహుమతుల్లో.. పది రమణవి. ఏకపాత్రాభినయం, వక్తృత్వపు పోటీలో మొదటి స్థానం అతనిదే. 


రమణ ఊర్లో లేని కారణంగా.. అతనికి వచ్చిన బహుమతులను అతని ప్రాణ స్నేహితుడు ఆనంద్ రామారావు గారి చేతుల మీదుగా అందుకొన్నాడు. 

మైక్‍లో రమణ పేరు మారుమ్రోగుతూ ఉంటే.. అతని విషయంలో తాను చేసిన తప్పు ముల్లులా రామారావు గారి హృదయానికి గుచ్చుకొంది. పశ్చాత్తాపంతో మనస్సు తపించింది. 


దేశభక్తి వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి సాధించిన తన కుమార్తెకు బహుమతిని అందిస్తూ రామారావుగారు మురిసిపోయారు. ఫంక్షన్ ముగిసింది. 

*

జీవితానుభవం మనిషికి సహనాన్ని పెంచుతుంది. ఇది వివేకవంతుల లక్షణం. రామారావుగారు రమణ విషయంలో ఆవేశంతో తప్పుడు తీర్మానాన్ని తెలియజేసినా, అర్థాంగి వాదనలో అతనికి సత్యం.. తను చేసిన తప్పు తెలిశాయి. ఇక భీమారావు విషయంలో.. యథార్థంగా ప్రేమ లేఖ రాసింది వాడని తెలిసినా.. త్వరపడలేదు. విషయాన్ని ఇంతటితో వదిలేయండి అన్నాడు. 

దానికి ముఖ్య కారణం భీమారావు తండ్రి.. బాతుల బంగారయ్య. వీరికి మంచి చరిత్ర ఉంది. పదవ తరగతి రెండుసార్లు తప్పిన బంగారయ్య చదువుకు స్వస్తి చెప్పి.. తండ్రి చేసే వ్యాపారాల్లో ఆయనకు సాయంగా ఉంటూ, డబ్బును ఎలా సంపాదించాలో బాగా గ్రహించాడు. 

తండ్రి చేస్తున్న బాతుగుడ్లు, కోడిగుడ్ల వ్యాపారానికి, కప్పలు, ఎలుకలను జోడించి వ్యాపార రేంజిని పెంచాడు. నాలుగు లారీలు, బొలారో కారు పూరి గుడిసె స్థానంలో మూడంతస్థుల భవంతిని నిర్మించాడు. రాజకీయాల్లో దూరి నాయకులకు ఎంతో వినయ విధేయుడుగా ఉంటూ పార్టీ సభ్యుడిగా మారి, కాంట్రాక్టు రంగంలో ప్రవేశించి లక్షలు.. కోట్లు గడించారు. ఆస్తిపాస్తుల విషయంలో రామారావుకు సరిబంటు అయినాడు. 


ఈ కారణంగా.. వాడి జోలికి పోవడం.. మాట్లాడటం తన స్థాఇకి తగదని రామారావుగారు భీమారావు చర్యను గురించి బంగారయ్యతో మాట్లాడదలచుకోలేదు. 


భార్య లక్ష్మీదేవి రామారావుగారిని సమీపించింది. 

"ఏమండీ!.. దోషి తెలిసినా వాడికి మీరు శిక్షను ఎందుకు విధించలేదు?" రామారావు ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. 


"లక్ష్మీ!.. బాతుల బంగారయ్య నీతి నియమాలు లేని మొరటు మనిషి. వాడి కొడుకును నేను సస్పెండ్ చేసినా.. టి. సి ఇప్పించి కాలేజీ నుండి పంపించినా.. వాడు వాడి ముఠాతో కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‍ గారితో గొడవపడతాడు.


 ప్రిన్సిపాల్‍గారు పోలీస్ రిపోర్టు ఇవ్వవలసి వస్తుంది. వారు పిల్లలను బాధిస్తారు. మన పిల్లను గురించి అందరూ విమర్శిస్తారు. సకాలానికి పరీక్షలు జరుగకపోవచ్చు. కష్టపడి చదివిన పిల్లలు పరీక్షలు సకాలంలో వ్రాయలేకపోవచ్చు. అంతేకాదు, పోయిన ఎలక్షన్‍లో మన పార్టీ నా మూలంగా ఘన విజయాన్ని సాధించి.. వారి పార్టీకి డిపాజిట్ దక్కకపోవడం ఆ వర్గం ఇంకా మరువలేదు. అవకాశాన్ని వెతుకుతూ నాతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారంటే.. వారికి పిల్లల భవిష్యత్తు, నా అనుచిత నిర్ణయం కారణంగా.. పాడు కావడం నాకు ఇష్టం లేదు. 


ఆవేశంతో ఒకసారి తప్పుచేశాను. మా నాన్నగారి పేరున ఉన్న ఆ కాలేజీ గౌరవ ప్రతిష్టలను కాపాడడం నా ధర్మం లక్ష్మీ" ఎంతో అనునయంగా చెప్పాడు రామారావు. 

అంతా విన్న లక్ష్మీదేవి నవ్వుతూ.. "ఈసారి మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. మీకు టీ ఇంకా ఇవ్వలేదు తెస్తాను" చెప్పి లోనికి వెళ్ళిపోయింది. రామారావుగారు సాలోచనగా కళ్ళు మూసుకున్నారు. 

*

బాతుల బంగారయ్యకు సినిమా తియ్యాలనే పిచ్చి మిత్రుడు మేకల మస్తానయ్యతో కలిసి ఒక సినిమా తీశాడు. 

ఇక్కడ మేకల మస్తానయ్య చరిత్రను తెలుసుకోవాలి. వారి తండ్రి గోపయ్య. గొర్రెలను, మేకలను పెంచి ఎదిగిన తర్వాత మద్రాసు, బెంగుళూరు, కేరళకు రవాణా చేసేవాడు. మస్తానయ్యా అదే వ్యాపారాన్ని సాగించి కోట్లు సంపాదించాడు. 

ఊర్లో వారంతా వారిరువురికీ ముద్దుగా పెట్టి పరోక్షంగా పిలిచే పేర్లు వాలి.. బంగారయ్య, సుగ్రీవుడు.. మస్తానయ్యా. 

వీరి టైం బాగుండి తీసి, రిలీజ్ చేసిన సినిమా హిట్ అయింది. మంచి లాభాలు గడించారు. 


దీన్ని చూసిన రామారావు తనయుడు రంగారావుకు కూడా తాను సినిమా తియ్యాలి. కోట్లు సంపాదించాలనే ఆశ కలిగింది. ఆ విషయంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులను కలిసి మాట్లాడి అందరితో స్నేహాన్ని ఏర్పరచుకొని, కథను, నాఇకా, నాయకులను ఎంపిక చేసి, వారి డేట్లు తీసుకొని రావాలనే సంకల్పంతో హైదరాబాదుకు వెళ్ళి రెండు వారాలైంది. 


అక్కడ అతని ప్రయత్నాలు ఫలించాయి. డబ్బును మూట కట్టుకొని వెళ్ళేదానికి ఊరికి తిరిగి వచ్చాడు రంగారావు. 

తన ప్రయత్నం దివ్యంగా ఫలించిందని, మంచి కథ, డైరెక్టర్, నటీనటులు లభించారని తనకు పది కోట్లు డబ్బు కావాలని తల్లిదండ్రులకు తెలియజేశాడు. 


ఈ విషయంలో రామారావు గారికి ఉన్న వీక్ పాయింటు రంగారావుకు ప్లస్ పాయింటు అయింది. 


రామారావు గారి ఉద్దేశ్యంలో బాతుల బంగారయ్య, మేకల మస్తాను సినిమా తియ్యంగా నేను నా కొడుకు తియ్యలేమా అనే అహంభావం. మనస్సున ఈ భావన ఉన్న కారణంగా.. రామారావు తనయుడు చెప్పిన ప్రతీ అక్షరాన్ని నమ్మాడు. సినిమా తీసి.. ఆ ఇరువురు ప్రత్యర్థుల కన్నా ఎక్కువగా డబ్బును సంపాదించాలని నిర్ణయించుకొన్నాడు. 

అర్థాంగి లక్ష్మీదేవి.. సినిమా తీసి డబ్బు సంపాదించడాన్ని ఖండించింది. వద్దు అని వారించింది. తండ్రి కొడుకులు ఒకటైనందున ఆమె సలహాలు, నయవచనాలు వారి రుచించలేదు. 


ఆస్తి పత్రాలను బ్యాంకులో వుంచి, డబ్బును తీసుకొని ఇరువురూ కలిసి హైదరాబాదుకు వెళ్ళిపోయారు. రంగారావు తండ్రికి అందరినీ పరిచయం చేశాడు. 


కథను విన్నారు. నాఇక నాయకులను డైరెక్టుగా కలిశారు. పంతులుగారిని పిలిపించి ముహూర్తాన్ని నిర్ణయించారు. అగ్రిమెంట్లు రాసుకున్నారు. అడ్వాన్సులు ఇచ్చారు. టోటల్ బడ్జెట్ పదిహేను కోట్లు అని డైరెక్టర్ గారు తెలియజేశారు. 


వీరికి అందరినీ పరిచయం చేసి కథను ఇంతవరకూ నడిపింది నల్లేరు నారాయణ. మంచి మాటకారి, నందిని పందిని.. పందిని నందిని మాటలతో చేయగల సమర్థుడు. 

కొత్తగా సినిమా తియ్యాలని భాగ్యనగర్‍కు వచ్చిన వారిపై వల విసిరి వారిని పట్టుకొంటాడు నారాయణ. తన తేనలూరే మాటలతో వారిని సమ్మోహపరిచి.. తన గుప్పెట్లో పెట్టుకొంటాడు. పెట్టుబడిని పెట్టవలసిన వారు వచ్చినా సరే. కథనంతా నడిపించేది నారాయణే. 


బాతుల బంగారయ్యకు.. మేకల మస్తానయ్యకూ సినిమా రంగ ప్రవేశానికి మార్గదర్శి ఈ నల్లేరు నారాయణే.. వారి టైం బాగుండింది. రిలీజ్ చేసిన ’చిగురాకులలో చిలకమ్మ’ చిత్రం ఘన విజయం సాధించింది. 


ఆ విజయ పరంపర కారణంగా ఆ వాలి సుగ్రీవులు మరో చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు. రంగారావు, రామారావులకు ఆ విషయాన్ని గురించి నారాయణ తెలియజేశాడు. 


ఆ మాటలను విన్న తండ్రి కొడుకుల్లో పంతం పెరిగింది. వాడు తీసిన, తియ్యబోయే చిత్రానికన్నా తమ చిత్రానికి ఎంత ఖర్చు అయినా సరే గొప్పగా తీయాలనే తీర్మానానికి వచ్చారు. కాదు.. కాదు నల్లేరు నారాయణ వారిని ఆ స్థితికి చేర్చాడు. 


అనుకున్న ముహూర్తానికి పూజా.. షూటింగ్ ప్రారంభం అయింది. తండ్రి కొడుకులు హైదరాబాదుకు వచ్చిన పదిరోజుల్లో ఇంత ప్రగతిని సాధించారు. అనుకొన్నది అనుకున్నట్లు జరుగుతున్నందున ఉభయులూ ఎంతో ఆనందించారు. 


ఆ తరుణంలో రంగారావు మనస్సులో ఒక కోరిక రేకెత్తింది. చిత్రంలోని ’విలన్’ పాత్రను తను పోషిస్తే ఖర్చులు తగ్గుతాయని.. తనకూ సినీ స్టార్‍గా గుర్తింపు వస్తుందని తన అభిప్రాయాన్ని తండ్రికి తెలియజేశాడు. యథార్థంగా రంగారావు ఉద్దేశ్యం.. ఆ చిత్ర నాయకిని సన్నిహితంగా ఉండాలని, మాట్లాడాలని, తన దాన్నిగా చేసుకోవాలని. 

ఖర్చు తగ్గుతున్నందుకు రామారావు సంతోషించారు. తనయుని కోరికను ఆమోదించారు. డైరెక్టర్‍తో రంగారావు విలన్ పాత్రను పోషిస్తారని చెప్పి ఒప్పించారు. 

*

ప్రిన్సిపాల్ ధర్మారావు జెడ్. పి ఛైర్మన్, జిల్లా విద్యాశాఖ ముఖ్య ఉద్యోగులతో మాట్లాడి, తమ కాలేజీ ప్లస్ టు పరీక్షలు జిల్లా నగరంలో జరిగేలా ఏర్పాటు చేశారు. 


పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రంగారావు హైదరాబాదు షూటింగుల్లో ఉన్న కారణంగా ప్రిన్సిపాల్‍ గారు లెక్చరర్లు భయపడిన విధంగా.. రమణకు ఎవరి వలన.. ఏ హానీ జరుగలేదు. అన్ని పరీక్షలను రమణ బాగా వ్రాశాడు. చివరి రోజు తన్ను కలిసిన ప్రిన్సిపాల్ గారితో.. 


"సార్!.. మీ దయ వలన నేను అన్ని పరీక్షలను బాగా రాయగలిగాను. మీరు నాకు గురువులే కాదు. 

తండ్రిలాంటివారు. మీరు నాకు చేసిన సహాయాన్ని నేను నా జీవితాంతం మరువలేను. మీ ఋణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. " కన్నీళ్ళతో చేతులు జోడించాడు. 


"రమణా!.. నేను న్యాయాన్యాయా విచక్షణతో నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీవు తప్పక మంచి మార్కులతో పాసవుతావు. తర్వాత ఏం చేయాలనుకున్నావు?" నవ్వుతూ అడిగాడు ధర్మారావు. 


"నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు సార్. మా అమ్మనడిగి కనుక్కోవాలి" వినయంగా చెప్పాడు రమణ.

 

"నీకు ముందు గొప్ప భవిష్యత్తు వుంది రమణా!.. నీవు చదువును కొనసాగించాలి. పెద్ద చదువులు చదవాలి. ప్రయోజకుడివి కావాలి. మీ అమ్మగారి అభిప్రాయాన్ని కనుక్కో. అందులో తప్పులేదు. కానీ నీవు తప్పక పై చదువులు చదవాలి. అది ఇంజనీరింగా, సివిల్‍కు సంబంధించిన బి. ఎ, ఎం. ఎ నా అనే విషయాన్ని నీ అభిలాషరీత్యా నీవే నిర్ణయించుకోవాలి. ఓ పదిరోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి నన్ను కలువు. నేను నీకు సహాయం చేస్తాను" అనునయంగా చెప్పాడు ధర్మారావు. 


జిల్లా నగరంలోని తన ఇంటి అడ్రస్ ధర్మారావుగారు రమణకు ఇచ్చాడు. కారు ఎక్కి వెళ్ళిపోయాడు. 

============================================================

ఇంకా వుంది..

============================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page