మదిలో మల్లెల మాల - పార్ట్ 7
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Dec 22
- 7 min read
Updated: 3 days ago
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 7 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 22/12/2025
మదిలో మల్లెల మాల - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాసాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. రమణ పై చదువుకు సహాయం చేస్తానంటాడు ప్రిన్సిపాల్ ధర్మారావు.
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 7 చదవండి.
రమణ, ఆనంద్ మరుదినం ఉదయం.... ఆనందంగా తమ గ్రామానికి చేరారు. అతని స్నేహితుడు ఆనంద్ కూడా ఆ వూరి వాడే. ఇరువురు మిత్రులూ ముందుగా ఆనందరావు యింటికి వెళ్ళారు. స్కూల్ డే రోజున, రమణకు బదులుగా తాను అందుకొన్న రమణ ఫ్రైజులన్నింటినీ అతని ముందు వుంచారు. వాటిని చూచి రమణ ఎంతగానో సంతోషించాడు. ఒక కవరులో వాటన్నింటినీ పెట్టుకొని ఇరువురు మిత్రులు రమణ ఇంటికి వచ్చారు.
పరీక్షలన్నీ బాగా వ్రాశామని తనకు కాలేజీలో వచ్చిన బహుమతులను సర్టిఫికేట్స్‍ను తల్లికి చూపించారు. ఆ పేద తల్లి ఎంతగానో సంతోషించింది.
ప్రిన్సిపాల్‍గారు తనతో చెప్పిన మాటలను తల్లికి వివరించాడు రమణ.
అన్నీ విన్న ఆ తల్లి... "వారు నీ తండ్రిలాంటివారు. వారి వద్దకు వెళ్ళి.... మీరు ఏది చేయమంటే దాన్నే నేను చేస్తానని వారికి చెప్పు. మన ఆర్థిక పరిస్థితులు వారికి తెలిసినవేగా!... వారు ఏం చెబితే అది చెయ్యి రమణా!..." అంది ఆ తల్లి.
"ఒరేయ్ రమణా!... మనం అమ్మమాట ప్రకారమే చేద్దాంరా. మనిద్దరం ఒకటవ తరగతి నుండి ఇంతవరకూ కలిసి ఒకేచోట చదువుకున్నాము. ఇక ముందూ అలాగే జరగాలని నా కోరిక" అన్నాడు ఆనంద్.
ఆనంద్‍రావు మాటల్లోని సారంశం రమణకు అర్థం అయింది.
ఆనందంగా నవ్వుతూ....
"అలాగేరా!.... పదిరోజుల తర్వాత మనం వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలుద్దాం. వారి సలహాను పాటిద్దాం. సరేనా!...."
"ఎస్ డియర్" సంతోషంగా అన్నాడు ఆనంద్.
వారి సంభాషణను విన్న ఆ తల్లి నవ్వుతూ....
"కలకాలం మీ ఇరువురూ ఇలాగే రామలక్షణుల్లా కలిసి వుండాలి. గొప్పవారు కావాలి" అంది.
"అమ్మా!...." అది ఒక వృద్ధ బ్రహ్మణుని పిలుపు.
రమణ, ఆనంద్, సునంద వాకిటి వైపు చూచారు. డెభ్బై సంవత్సరాల వృద్ధుడు వారికి కనిపించాడు.
రమణ పరుగున వెళ్ళి వారిని సమీపించాడు.
"రమణ మూర్తి ఇల్లు ఇదేనా!" అడిగాడు ఆ బ్రాహ్మణుడు.
"అపరాహ్ణ వేళ అయింది. బ్రాహ్మణుణ్ణి. ఆకలిగా వుంది. అడిగితే ప్రక్క ఇంటివారు, రమణమూర్తి ఇంటికి వెళ్ళండని మీ ఇంటికిని చూపించారు. పట్టెడన్నం పెట్టగలరా బాబూ!" దీనంగా అడిగాడు.
రమణ కళ్ళకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సాక్షాత్ తన... తండ్రి రామశర్మలా గోచరించాడు.
"రండి స్వామీ. లోనికి రండి" సాదరంగా ఆహ్వానించాడు.
ఇరువురూ వరండాలో ప్రవేశించారు. తన తండ్రిగారు కూర్చునే పాత కుర్చీని వారికి చూపి....
"కూర్చోండి స్వామీ" అన్నాడు రమణ.
వారు కుర్చీలో కూర్చున్నారు.
రమణ తల్లిని సమీపించారు.
"అమ్మా!... వంట అయింది కదూ!..."
"అయిందయ్యా!...."
"వారికి భోజనం పెడదామమ్మా!...."
"అలాగే. లోనికి తీసుకురా" నవ్వుతూ అంది సునంద.
ఆనంద్..."నేను భోం చేసి వస్తానురా" చెప్పి అతను వెళ్ళిపోయాడు.
రమణ వచ్చిన వారిని సమీపించాడు. "స్వామీ!... స్నానం చేస్తారా!..." అడిగాడు.
"ఉదయాన్నే చేశాను నాయనా. రమణ అంటే నీవేనా?"
"అవును స్వామి"
రమణను వారు కొన్ని క్షణాలు పరీక్షగా చూచారు.
"నాన్నా!.... ఒక అరిటాకును కోసుకురా" చెప్పింది తల్లి సునంద.
"అలాగే అమ్మా!...."
దొడ్లోకి వెళ్ళి అరటి ఆకును కోసుకొని వచ్చి తల్లికి అందించాడు.
పీటవేసి... ఆకును పరచి సునంద... "నాన్నా వారిని లోనికి తీసుకురా" అంది.
రమణ వారి చేతిని పట్టుకొని.... "స్వామీ!... లోనికి దయచేయండి" నవ్వుతూ వినయంగా చెప్పాడు.
ఆ బ్రాహ్మణుడు లోనికి వెళ్ళాడు. సునంద వారికి నమస్కరించింది.
"కూర్చోండి స్వామీ!" అంది.
వారు ఆసనంపై కూర్చున్నారు. సునంద వడ్డించడం ప్రారంభించింది.
"రమణా! నీవు భోం చేయవా!...."అడిగాడు ఆ బ్రాహ్మణుడు.
"స్వామీ!.. మీరు తృప్తిగా భోం చేయండి. అమ్మ నేను తర్వాత కలిసి కూర్చుంటాము" అన్నాడు.
సునంద వడ్డించిన తర్వాత... ఔపోసనం త్రిప్పి వారు భోంచేయ ప్రారంభించారు. వున్నంతలో కొసరి కొసరి మరీ వడ్డించింది సునంద.
ఆనందంగా వారు భోంచేశారు. చివరగా లేవబోయే ముందు... ’అన్నదాతా సుఖీభవ’ అన్నారు వారు.
చేతికి నీటి చెంబును అందించాడు రమణ. చేయి కడుక్కొని పాద ప్రక్షాళనం చేశారు ఆ బ్రాహ్మణుడు. వచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నారు.
సంచిలో నుండి శ్రీ రమణ భగవాన్ ఫొటోను తీసి రమణను దగ్గరికి రమ్మని పిలిచారు. రమణ వారిని సమీపించారు.
"ఈ ఫోటోలో వున్నది నీ పేరు గల మహాస్వామి. భగవాన్ రమణ మహర్షి. నీ దగ్గర వుంచుకో. ఒక్కసారి వెళ్ళి వారి ఆశ్రమాన్ని చూచి వారి తల్లి.... వారియొక్క నిర్మాణ నిలయాలను సందర్శించిరా. నీకు ఆ తండ్రి అంతా మంచినే చేస్తాడు. నీకు అండగా ఉంటాడు. ఆ క్షేత్రం పేరు తిరువన్నామలై. తమిళనాడులో రాణిపేట, వేలూరుకు పడమరగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి అగ్ని లింగేశ్వర ఆలయాన్ని, ఆ మహాస్వామి వారి ఆశ్రమాన్ని దర్శించి వస్తున్నాను. రాష్ట్ర విభజన కాకముందే మన ప్రాంతం వారు వారిని సందర్శించి వారి బోధనలను విని శిష్యులై తరించారు. వారిలో సూరి నాగమ్మగారు ఘనచరితులు. భగవాన్ బోధనలను వారు, లేఖలుగా వారి అన్నగారికి వ్రాసి భద్రపరిచారు.
ఈ వూర్లో వున్న ఉదయ కాళేశ్వర స్వామి వారిని దర్శించాలని మనస్సున బహుకాలంగా ఆశ. అందుకే ఇక్కడికి వచ్చాను. స్వామి వారిని దర్శించాను.
మీ ఆతిథ్యం చాలా బాగుంది. నాకు పరమానందం. మీరు చల్లగా వుండాలి. వుంటారు" చేయి ఎత్తి ఆ తల్లీబిడ్డను దీవించాడు ఆ బ్రాహ్మణుడు.
రమణ మంచం వాల్చి, బెడ్ షీటును పరిచి దిండును వుంచాడు.
"కాసేపు విశ్రాంతి తీసుకోండి స్వామీ" అన్నాడు.
వారు మంచంపై విశ్రమించారు.
"మీరు ఏ వూరు స్వామీ?"
"ఒంగోలు...."
"నాలుగు గంటలకు బస్సు ఉంది. నేను మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను" అన్నాడు రమణ.
రమణ... స్నానం చేసి భగవాన్ శ్రీ రమణుల ఫొటోను పూజా వేదికపై వుంచి..... కొన్ని నిముషాలు ధ్యానించి... తర్వాత తల్లీ తను కలిసి భోం చేశారు.
"అమ్మా!... నేను ఆనంద్ కలిసి తిరువన్నామలై వెళ్ళి వస్తామమ్మా!...." తన నిర్ణయాన్ని తల్లికి తెలియజేశాడు రమణ.
"అలాగే నాన్నా!..... వెళ్ళిరండి. యిప్పుడు సెలవులే కదా!... నీవు మీ ప్రిన్సిపాల్ గారిని కలుసుకొనే ముందు. ఆ క్షేత్రాన్ని చూచి, సర్వేశ్వరుని జగన్మాతను, భగవాన్ శ్రీ రమణుల ఆశ్రమాదులను దర్శించి... గిరి ప్రదక్షిణం చేసి రండి. మీ ఉభయులకూ అంతా మంచే జరుగుతుంది" అంది సునంద.
ఆనంద్ వచ్చాడు. సమయం మూడున్నర అయింది. ఆ స్వామివారిని లేపి.... యిరువురూ కలిసి వారితో బస్టాండు వైపుకు నడిచారు.
"రమణా!.... తిరువన్నామలైలో గిరిప్రదక్షిణం చాలా ముఖ్యమైంది. పద్నాలుగు కిలోమీటర్ల ఆ దూరాన్ని శివ సన్నిధానం తూర్పు గాలి గోపురం నుండి ప్రారంభించి చెప్పులు లేకుండా కాలి నడకతో ముగించాలి. చాలామంది భక్తులు గిరిప్రదక్షిణం తప్పక చేస్తారు. ఆ గిరి ఎవరో కాదు సాక్షాత్ పరమశివుడు. నీకు ఎంతో మంచి జరుగుతుంది. నా మాట నమ్ము" నడుస్తూ చెప్పారు ఆ బ్రాహ్మణుడు.
"అలాగే స్వామీ!..." వినయంగా చెప్పాడు రమణ.
బస్టాండుకు చేరారు ముగ్గురూ. బస్సు వచ్చింది. వారు బస్సు ఎక్కారు. కిటికీ గుండా చేతిని ఎత్తి రమణను నవ్వుతూ ఆశీర్వదించాడు. బస్సు కదిలి వెళ్ళిపోయింది.
మిత్రులు యిరువురూ.... రమణ నిలయం చేరారు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన తిరువన్నామలై విశేషాలను రమణ ఆనంద్‍కు తెలియజేశాడు.
యిరువురూ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకొన్నారు.
క్యాలెండర్‍ను చూచి, సునంద... "పై గురువారం బాగుంది ఆ రోజు బయలుదేరండి" అంది.
ఇరువురూ ఆనంద్ యింటికి వచ్చారు. ఆనంద్ తల్లి తండ్రికి విషయాన్ని చెప్పారు. వారూ అంగీకరించారు. అనుకొన్న రోజున ఆ యిద్దరు మిత్రులు తిరువన్నామలైకి బయలుదేరాలనుకొన్నారు.
*
తల్లి సునంద నిర్ణయించిన ఏప్రిల్ మాసం గురువారం నాడు రమణ ఆనందులు తమ తిరువన్నామలై యాత్రకు వుదయాన్నే బయలుదేరారు.

ప్రధమంగా నెల్లూరు నుండి తిరుపతికి వెళ్ళి, కాలినడకతో ఏడుకొండలు ఎక్కి, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ రాత్రి.... స్వామి దర్శనానంతరం తిరుమలలోనే విశ్రమించి, మరుదినం ఏడుగంటలకల్లా క్రిందికి వచ్చి... తిరువన్నామలైకి వెళ్ళే బస్సులో కూర్చున్నారు. ఆ మధ్యాహ్నం రెండు గంటలకు తిరువన్నామలై చేరారు. హోటల్లో గది తీసుకొని స్నానం చేసి భోం చేసి... నాలుగున్నరకు అరుణాచలేశ్వరుని ఆలయంలో ప్రవేశించి, ఆ అగ్నిలింగ దర్శనం చేసుకొని తమ ఆశయాలను విన్నవించుకొని మ్రొక్కి, ఆ ఆలయ ప్రాంగణంలో వున్న విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్వేశ్వర, మాత జ్ఞానాంబికా మూర్తులను దర్శించి తీర్థప్రసాదాలను సేవించి, ఆరున్నరకు ఆలయం వెలుపలికి వచ్చారు.
అది చైత్రమాసం, శుక్లపక్షం. ఆలయ తూర్పు గాలి గోపురం ముందు కర్పూరాన్ని వెలిగించి.... గిరి ప్రదక్షిణానికి ఉపక్రమించారు ఆ ఇరువురు మిత్రులు.
’తండ్రి అరుణాచలేశ్వరా... తండ్రీ భగవాన్ రమణేశ్వరా’ అనే నామాలను జపిస్తూ... వృద్ధి చంద్రుని వెన్నెల్లో గిరి ప్రదక్షణాన్ని సాగించారు.
పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణంలో వారు ఇంద్ర, అగ్ని, యమ, నివృత్తి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్య... పేర్లతో వెలసి వున్న అష్ట శివలింగాలను దర్శించి, కర్పూరాన్ని వెలిగించి తమ కోరికలను ఆయా పరమేశ్వర మూర్తులకు విన్నవించుకొని నాలుగున్నర గంటల పాదరక్ష రహిత పాదయాత్రలో ఎంతో దీక్షగా గిరి ప్రదక్షిణాన్ని పూర్తి చేసి ఉత్తరపు వైపుగా... నడక ప్రారంభించిన తూర్పు గాలి గోపురం ముందుకు చేరారు.
వారు నడచిన పద్నాలుగు కిలోమీటర్ల పరిధిలో క్రొత్తగా నిర్మించిన సూర్య చంద్ర లింగాలను, వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, ఆదివరాహ, రాఘవేంద్ర, విష్ణు ఆలయాదులను సందర్శించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో వున్న ఆ అష్టలింగాలు ఒక్కొక్క అంశానికి ప్రసిద్ధి.
ఇంద్ర లింగం.... దీర్ఘాయుషు, కీర్తి ప్రతిష్టలకు...
అగ్ని లింగం... రోగ నివారణకు, భయభ్రాంతులను తొలగించుటకు...
యమ లింగం.... సుదీర్ఘ ఆయుషుకు.....
నివృత్తి లింగం.... ఆరోగ్యానికి, భోగభాగ్యాలకు, సత్ కీర్తికి.....
వరుణ లింగం.... అనారోగ్య నివారణకు, జలదోష సంబంధిత బాధా నివారణకు…
వాయు లింగం.... జటిల సమస్యా నివారణకు, కరువు కాటకాల నివారణకు...
కుబేర లింగం... భోగములకు, మనుగడ అభివృద్ధికి....
ఈశాన్య లింగం.... ఆనందానికి, శాంతికి...
ప్రతి రూపాల ఆర్యోక్తిని ఆయా లింగాల వద్ద అర్చక స్వాముల వారిని అడిగి పై విషయాలను ఆ యిద్దరు మిత్రులు తెలుసుకొన్నారు.
గదికి చేరిన వారు... ’యీ దినం మన జీవితకాలంలో మరువలేనిది. ఎంతో ఆనందంగా వుంది’ అనుకొన్నారు.
మనిషి, లక్ష్యసాధనకు, పట్టుదల, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఈ ఇరువురు మిత్రులు నాలుగున్నర గంటలసేపు దైవధ్యానం తప్ప... మాట్లాడుకోలేదు. వారి కదలికలు కంటి సైగలతోనే జరిగాయి.
మరుదినం ఆరున్నర గంటలకల్లా తయారై భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించారు. ఆ మహనీయుని జననం 1879 డిసెంబర్ 29వ తేదీ శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు జరిగింది.
ప్రాతఃకాల సమయంలో అక్కడ జరిగే పూజా విధానాలను నేత్రానందంగా తిలకించారు.
అక్కడ వున్నవారిలో నలభై శాతం విదేశీ పురుష స్త్రీలు వుండటం వారిని ఆశ్చర్య చకితులను చేసింది.
ఆ ప్రాంగణంలో ఎడమవైపున భగవాన్‍ల వారి జనని అలగమ్మ గారి సమాధి.... కుడివైపున వారి సమాధి పైన శివలింగం... ముందు విశాలమైన ప్రార్థనా మందిరం, దాని ముందు భగవానుల వారు వారి చివరి రోజుల్లో శయనించిన గది... వారు వాడిన సామాగ్రి.... వారి పడక ఆ గదిలో గోచరిస్తాయి. ద్వారానికి వున్న అద్దం ద్వారా చూడాలి. తాళం వేసి వుంటుంది.
ఆ మందిరానికి పశ్చిమ భాగాన వారి శిష్యుల సమాధులు, లక్ష్మి అనే గోమాత సమాధి క్రమంగా వెలసి వున్నాయి.
వాయువ్య మూలాన బావి... ప్రక్కన పాకశాల, భోజనాలు చేసే హాలు క్రమంగా అమరి వున్నాయి.
ఉత్తరపు వైపున గోశాల.... ఎన్నో గోవులు వున్నాయి. అశ్రమ ప్రాంగణంలో వున్న వృక్షాల మీద నెమళ్ళు, ఉడతలు, కోతులు అనేక రకాల పక్షులు వాటి మృదుమధుర స్వరాలతో కమ్మని రాగాలను ఆలపిస్తున్నాయి. భగవానుల నిర్యాణం 1953 జనవరి 29వ తేది గురువారం రాత్రి 11.30లకు జరిగినది.
ఆ ఆశ్రమ పరిసరాలు చూచేటందుకు ఎంతో నేత్రానందంగా గోచరిస్తాయి. రమణ, ఆనంద్‍లు ఎంతగానో ఆనందించారు. ఆశ్రమ పరిసరాలను అన్నింటినీ వీక్షించి ప్రార్థనా మందిరంలో ప్రవేశించి అందరితో పాటు వీరూ కళ్ళు మూసుకొని భగవాన్ ధ్యానాన్ని ప్రారంభించారు.
అరగంట ఎంతో ప్రశాంతంగా గడిచిపోయింది. నైవేద్య దీపారాధనలు రమణ భగవానులకు జరిగాయి. పారవశ్యంతో ఆ ఉభయులూ వీక్షించారు. మనస్సుకు ఎంతో శాంతి లభించింది.
రమణకు మనస్సున... భగవాన్ వారిని ఆశీర్వదించిన భావన కలిగింది. అది అతని ఏకాగ్రతకు ఫలం. ఆనంద్‍ది అదే స్థితి.
తదుపరి.... ప్రక్కనే కుడి పక్కన ఉన్న శ్రీ శేషాద్రిస్వామి వారి ఆశ్రమంలో ప్రవేశించి... అంతా కలయ చూచి... తిరిగి రమణాశ్రమంలో ప్రవేశించి ధ్యాన మందిరానికి ఆగ్నేయమూలన వున్న పుస్తక విక్రయశాలలో ప్రవేశించి భగవానుల దివ్య జీవిత చరిత్ర గ్రంధాన్ని, వారి ఫొటోలను కొన్నారు. విక్రేతలలో తెలుగువారు కూడా వుండటం వల్ల ఇరువురు మిత్రులకు భాషా సమస్య రాలేదు.
పదకొండున్నరకు భోజనాల ఏర్పాటు జరిగింది. డైనింగ్ హాలుకు వెళ్ళి స్వామి వారి ప్రసాదాన్ని సేవించి పన్నెండున్నరకు ఆశ్రమం నుంచి బయటికి వచ్చి గదికి చేరారు.
సాయంత్రం ఆరున్నరకు బస్సులో బయలుదేరి రాత్రి ఒకటిన్నరకు చిత్తూరు చేరారు. అక్కడ బస్సు మారి ఉదయం ఎనిమిది గంటలకు నెల్లూరు చేరి పదిగంటలకు స్వగ్రామం చేరారు.
తమ యాత్రా విశేషాలను రమణ, ఆనంద్‍లు వారి తల్లి.... తల్లిదండ్రులకు వివరించారు. వారు ఆనందించారు.
============================================================
ఇంకా వుంది..
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments