మదిలో మల్లెల మాల - పార్ట్ 8
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 3 days ago
- 6 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 8 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 28/12/2025
మదిలో మల్లెల మాల - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాసాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్ తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 8 చదవండి.
రమణ భగవానుల జీవిత చరిత్ర సాంతం ఒకటి రెండుమార్లు చదివాడు. చదివి తల్లికి వినిపించాడు. ప్రిన్సిపాల్‍గారు చెప్పిన మాట ప్రకారం....మిత్రునితో కలిసి వారిని కలిశాడు రమణ.
"మీ అమ్మగారి సలహా ఏమిటి రమణా!...." అడిగాడు ప్రిన్సిపాల్ గారు.
"సార్!.... మీ సలహాయే నాకు ఆచరణ యోగ్యం అని అమ్మ చెప్పింది సార్" వినయంగా జవాబు చెప్పాడు రమణ.
ప్రిన్సిపాల్ గారు కొన్ని నిముషాలు మౌనంగా ఆలోచించాడు.
"రమణా బి.ఇ కంప్యూటర్ సైన్స్ లో చేరు. నీకు సీటు దొరికేలా నేను ప్రయత్నిస్తాను."
"సార్!.... మరి నా సంగతి?" దీనంగా అడిగాడు ఆనంద్.
"నీవూ దాన్లోనే చేరుతావా?"
"అవును సార్!.... మీరు నాకు సాయం చేయాలి. రమణ నా ప్రాణమిత్రుడు. మేమిద్దరం కలిసి బి.ఇ.సి.ఎస్ నే చేస్తాము సార్" దీనంగా చెప్పాడు ఆనంద్.
"అలాగే. రిజల్ట్ రానియ్యండి. మార్కులను బట్టి.... నా ప్రయత్నం నేను చేస్తాను. ఆఁ..... ఇద్దరూ బాగా పరీక్షలు వ్రాశారు కదూ!" అడిగాడు ధర్మారావు.
"వ్రాశాం సార్!" చెప్పాడు రమణ.
"రిజల్ట్ రావడంతోనే వచ్చి నన్ను కలవండి. నేను మీ ఇద్దరికీ మార్కులను బట్టి చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తాను" నవ్వుతూ చెప్పాడు ప్రిన్సిపాల్.
వారికి నమస్కరించి ఇరువురు మిత్రులు గ్రామం చేరారు.
*
ఆనందరావు కుటుంబానికి లక్ష్మీదేవికి బంధుత్వం వుంది. ఆనందరావు అక్క వివాహం, వరుసకు మేనత్త అయిన లక్ష్మీదేవి.... పినతండ్రి నందనరావు, వారి కుమారుడు రామబ్రహ్మం. ఆనంద్ తండ్రి తాతల ఆహ్వానం మీద... అతని అక్క సౌమ్య వివాహానికి ఆ గ్రామానికి కూతురు రంజనీతో, భర్త తనయులు హైదరాబాదులో సినిమా ప్రపంచంలో చిత్ర నిర్మాణంలో మునిగి వున్నందున, చాలాకాలం తర్వాత స్వగ్రామానికి ఎంతో సంతోషంగా వచ్చింది.
రంజనీకి చాలా సంతోషం. కారణం.... ఈ కారణంగా తను రమణను కలవచ్చని... అతనికి సారీ చెప్పవచ్చనే ఆశ.
ఆనంద్ చెల్లెలు సుమతో తాను రమణను కలవాలని చెప్పింది. సుమతో కలసి రమణ యింటికి వెళ్ళింది. రమణ యింట్లో లేడు. ఆ యిల్లు పరిసరాలు చూచి వారు చాలా పేదవారని గ్రహించింది. రమణ విషయంలో తాను చేసిన తప్పును తలుచుకొని తన్ను తాను తిట్టుకొంది.
"అమ్మా!.... రమణ ఎక్కడికి వెళ్ళాడు?" అడిగింది సుమ.
"పెన్న ఒడ్డుకు" అంది సునంద.
"ఎందుకు?" అడిగింది రంజనీ.
"అక్కడ చాలా ప్రశాంతంగా వుంటుందని చదువుకొనేటందుకు వెళ్ళాడు"
"పరీక్షలు అయిపోయాయి కదా!...." అంది రంజనీ.
"వాడేం చదువుతున్నాడో నేను వాణ్ణి అడగలేదమ్మా"
"సరేనండి. మేము వెళుతున్నామండి" చెప్పింది రంజనీ.
"అవును. యింతకీ నీవెవరో నీ పేరేమిటో చెప్పనేలేదు" నవ్వుతూ ఆమెను పరీక్షగా చూస్తూ అడిగింది సునంద.
’పిల్ల బంగారు బొమ్మలా వుంది’ అనుకొంది మనస్సున.
"ఇది మా లక్ష్మీదేవి అత్తయ్య కూతురు పెద్దమ్మా దీని పేరు రంజనీ" సుమ జవాబు చెప్పింది.
"ఓహో అలాగా!" తలాడించింది సునంద.
వెళ్ళొస్తామని మరోమారు చెప్పి రంజనీ, సుమలు వీధిలో ప్రవేశించారు.
"పాపం.... రమణ చాలా పేదవాడు కదూ సుమా!..." అంది సాలోచనగా రంజనీ.
"వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు. కానీ వాడికి దేవుడు మంచి తెలివితేటలను, మంచి మనస్సును... యిచ్చాడు. ఏక సంతానగ్రాహి. తప్పకుండా ఒకనాడు చాలా గొప్పవాడవుతాడు. ఆనాడు మనమంతా ఆశ్చర్యపోతాం" అంది సుమ.
"నేను అతన్ని కలవాలి సుమా!"
"అంటే పెన్నా ఒడ్డుకి వెళదామంటావా?"
"అవును" అంది రంజనీ.
"మీ అమ్మతో చెప్పాలిగా!"
"చెప్పాను. శివాలయానికి నీతో కలిసి వెళుతున్నానని."
"సరే పద."
"ఎంతదూరం నడవాలి?"
"వన్ కిలోమీటర్"
ఇరువురూ ఏటి ఒడ్డుదారిన నడక ప్రారంభించారు. కొద్ది నిముషాల్లో ఏటి ఒడ్డుకు చేరారు. కొంతదూరంలో అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో పుస్తకాన్ని చేతబట్టి నడుస్తున్న రమణను చూచారు.
ఇసుకలో నడిచి అతన్ని సమీపించారు.
వెనుతిరిగి సమీపంలో వున్న వారిని చూచి రమణ కదలకుండా వారిని ఆశ్చర్యంతో చూస్తూ వుండిపోయాడు.
"అన్నా!.... మా అత్త లక్ష్మీదేవి కూతురు. నిన్ను చూడాలని వచ్చింది. నీవు ప్లస్ టు చదివింది వీరి కాలేజీలోనే కదా!..." అంది సుమ.
అవునన్నట్లు తలాడించాడు రమన. క్షణంపాటు రంజనీ ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకున్నాడు.
"పాపం.... నీకోసం వదిన ఇంతదూరం వస్తే హలో అనకుండా తలను ప్రక్కకు త్రిప్పుకొంటావ్ ఏమిటన్నయ్యా!..." ఆశ్చర్యంతో అడిగింది సుమ.
రమణ ఆశ్చర్యంగా సుమ ముఖంలోకి చూచాడు.
ఆకాశంలో పక్షులు క్రమబద్దంగా ఎగురుతున్నాయి. వాటిని పరీక్షగా చూస్తూ వుంది రంజనీ. అన్నింటికన్నా ముందు ఒక పక్షి ఎగురుతూ ముందుకు పోతూ వుంది.
’ఆ పక్షిలాంటివాడు రమణ. భావి జీవితంలో గొప్పవాడు కావాలి’ అనుకొంది రంజనీ.
కొన్నిక్షణాల తర్వాత.....
"రమణా!.... నామీద నీకు కోపమా?" మెల్లగా అడిగింది రంజనీ.
రమణ చిరునవ్వుతో... "లేదు. నన్ను చూడవచ్చినందుకు థాంక్యూ" అన్నాడు.
"పరీక్షలు బాగా వ్రాశావా?"
"వ్రాశాను"
"స్టేట్ ఫస్ట్ వస్తావా?"
"మా రమణన్నయ్య తప్పకుండా స్టేట్ ఫస్టు వస్తాడు రంజనీ" అందు సుమ నవ్వుతూ.
"ఎం చదువుతున్నావు?" అడిగింది రంజనీ.
"ఉపనయన వివాహ మంత్రాలు" రమణ జవాబు.
"ఆఁ...." ఆశ్చర్యపోయింది రంజనీ.
"అన్నయ్యా!... నీవు చెప్పింది!...."
"నిజం సుమా!.... ఈ పుస్తకాన్ని చూడు" సుమను సమీపించి అట్టమీద వున్న పేరును ఆమెను చూపించాడు.
"నేను జనరల్ నాలెడ్జ్ బుక్ అనుకొన్నానన్నయ్యా!" అంది సుమ.
"కాదమ్మా!... భావి జీవితం ఎలా వుండబోతుందో ఎవరికి తెలుసు. మన కులవృత్తికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో తప్పులేదుగా" నవ్వుతూ చెప్పాడు రమణ.
రంజనీ, సుమలు రమణ ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు.
"రమణా!... నేను నీ విషయంలో ఆవేశంతో తప్పు చేశాను. ఐయాం సో సారీ!" అంది రంజనీ దీనంగా.
రమణ ఆమె ముఖంలోకి క్షణంసేపు చూచాడు.
"మీరేం తప్పు చేయలేదు. నాకు మీరు సారీ చెప్పవలసిన అవసరం లేదు." ప్రవహించే నదీ జలాలను చూస్తూ చెప్పాడు.
"ఏమిటీ మీరిరువురూ మాట్లాడుకొంటున్నది రంజనీ!... నాకేం అర్థం కాలేదు. రమణకు నీవు ఎందుకు సారీ చెప్పావు?" ఆశ్చర్యంతో అడిగింది సుమ.
"పద యిక మనం వెళదాం" అంది రంజనీ ముక్తసరిగా.
"అన్నయ్యా!.... మేము వెళుతున్నాము" అంది సుమ.
రమణ తలాడించాడు. వారిరువురూ వూరి వైపుకు బయలుదేరారు. క్షణంసేపు వారిని చూచి తన పఠనాన్ని సాగించాడు రమణ.
*
సౌమ్య.... ఆనంద్ అక్క వివాహం గొప్పగా జరిగింది. వరుడు విద్యానాథ్. అసిస్టెంట్ కలెక్టర్.
కోడలికి బంగారు నెక్లెస్, గాజులు ఇచ్చింది లక్ష్మీదేవి. వారంరోజుల పాటు భర్త గ్రామంలో లేనందున పుట్టింటి వేడుకలలో ఆనందంగా పాలు పంచుకొంది.
వివాహ సందర్భంలో రమణను చూచింది లక్ష్మీదేవి. నూనుగు మీసాల రమణ ఆమెను ఎంతగానో ఆకర్షించాడు.
రమణ తండ్రిగారిని, అమ్మగారిని గురించి అడిగి, అతన్ని ప్రీతిగా పలకరించింది. రమణ ముక్తసరిగా జవాబు చెప్పి.... జరిగిన సంఘటనను గురించి ఆమె ప్రస్తావించే దానికి ఆస్కారం యివ్వకుండా ప్రక్కకు తప్పుకొన్నాడు.
మండపంలోని... రమణ ప్రతి కదలికనూ రంజనీ ఆసక్తితో గమనిస్తూ ఉంది. అతనిపై అభిమానం.... సానుభూతి ఆమె హృదయంలో చోటు చేసుకొన్నాయి.
లక్ష్మీదేవి రంజనీలు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఆ మరుసటి దినం వార్తా పత్రికల్లో ప్లస్ టు ఫలితాలు ప్రచురించబడ్డాయి.
రమణ స్టేట్ ఫస్ట్.... తృతీయ స్థానం ఆనంద్ సంపాదించారు. వారి ఫొటోలు పత్రికలో ప్రచురించారు.
కొడుకు ఫోటోను వార్తను..... చదివి సునంద, రమణను పారవశ్యంతో హృదయానికి హత్తుకొంది.
ఆ వార్తను చూచిన ధర్మారావు ప్రిన్సిపాల్ తన కాలేజీకి రాష్ట్రస్థాయిలో గొప్ప పేరును తెచ్చిన రమణ, ఆనంద్‍ల ప్రతిభకు ఎంతగానో సంతోషించారు.
పత్రికలో వున్న రమణ ఫొటోను రంజనీ, తన తల్లికి చూపించి.... ఆనందంతో చిందులు వేసింది. కూతురులోని ఆనంద పారవశ్యాన్ని చూచి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది.
"స్టేట్ ఫస్ట్ నీవు కాదు రమణ" అంది నవ్వుతూ.
రంజనీ తన గదికి వెళ్ళి రమణ ఫొటోను ఆ వార్తను కట్ చేసి జాగ్రత్తగా తన బీరువాలో దాచింది.
తన యిష్టదైవమైన పరమేశ్వరుని పటం ముందు నిలుచొని ’రమణ గొప్పవాడు కావాలి తండ్రీ’ అని కోరి చేతులు జోడించి థ్యానించింది.
భీమారావు... ఫెయిల్ అయ్యాడు. ఆ వార్త విని రమణ మిత్రులు సంతోషించారు.
లక్ష్మీదేవి ఆ మరుదినం తన జన్మభూమికి వెళ్ళి రమణ తల్లిని, రమణను కలిసి రెండు లక్షలు డబ్బును వారికి యిచ్చింది బలవంతంగా.
"వద్దండి" అన్నాడు రమణ.
"కాలేజీలో చేరి బాగా చదివి గొప్పవాడివైనాడు తిరిగి యివ్వు. అప్పుడు తీసుకొంటాను" నవ్వుతూ చెప్పింది లక్ష్మీదేవి.
ఆమె తమ పట్ల చూపిన ఆదరాభిమానాలను ఆ తల్లీ కొడుకులు మారు మాట్లాడలేకపోయారు. స్వీకరించారు.
లక్ష్మీదేవి తన వూరికి కార్లో వెళ్ళిపోయింది. తను చేసిన పనిని గురించి రంజనీకి చెప్పింది.
"అమ్మా!.... యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా. చాలా మంచి పని చేశావు" అంది ఆనందంగా.
రమణ, ఆనంద్‍లు పోయినసారి తిరుమల వెంకన్న ముందు మ్రొక్కిన మాట ప్రకారం మరోసారి ఏడుకొండలూ ఆ తండ్రి నామాన్ని జపిస్తూ ’గోవిందా... గోవిందా....’ అంటూ ఎక్కారు. తలనీలాలు సమర్పించారు.
తిరుమలేశుని, అలిమేలు మంగాపురంలో అమ్మవారిని దర్శించారు. ఆనందంగా స్వగ్రామం చేరారు.
*
యిరువురు మిత్రులు... ప్రిన్సిపాల్‍గారిని కలిశారు. వారిని ఎంతగానో అభినందించారు ధర్మారావుగారు.
బి.ఇ.సి.ఎస్‍కు వారిచేత అప్లికేషన్స్ ఫిలప్ చేయించారు. వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయమని తమ కరస్పాండెంట్‍తో మాట్లాడి వున్నానని చెప్పారు.
ఇరువురు మిత్రులు వారి ఆదేశాన్ని పాటించారు. ఫీజులు కట్టి కాలేజీలో చేరారు.
చిన్న ఇంటిని అద్దెకు కాలేజీలో దగ్గర తీసుకొని, తల్లి సునందతో కలిసి వుంటూ, తమ ఇంజనీరింగ్ కాలేజీ జీవితాన్ని ప్రారంభించారు రమణ, ఆనంద్‍లు.
యిల్లు.... కాలేజీ... చదువు... యివే వారి ప్రపంచం అయిపోయింది.
థర్డ్ ఇయర్ స్టూడెంట్ మోహన్ బాబుకు వీరంటే అసహ్యం, కోపం. దానికి కారణం మొదటిది.... వీరు ర్యాంక్ స్టూడెంట్స్ అని, రెండవది.... డొనేషన్ లేకుండా కాలేజీలో సీట్లు సంపాదించారని.
ర్యాంగింగ్ పేరుతో ఎన్ని మాటలన్నా... చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయించినా... రమణ, ఆనంద్‍లు సహనంతో అన్నింటిని సహించి భరించారు.
ఆరునెలలు గడిచిపోయాయి. వీరు ఉభయులూ ఎదిరించి మాట్లాడకుండా... ’అన్నా... అన్నా’ అంటూ అతి వినయంగా ప్రవర్తించడం వల్ల... రోజులు గడిచే కొద్దీ మోహన్ బాబు ధ్యాసలో వీరు లేకుండా పోయారు. ’లక్ష్యసాధనకు గాంధీవాదం ఎంత గొప్పదో’ అని మిత్రులిరువురూ అనుకొని ఆనందించారు.
చాకులాంటి రమణ తెలివితేటలు... తోటి విద్యార్థులను ఎంతగానో ఆకర్షించాయి. చాలామంది మిత్రులైనారు.
ఆ కాలేజీలో మోహన్ బాబుకు ఒక చరిత్ర ఉంది. తన రెండవ ఏటి నుంచి క్రొత్తగా కాలేజీలో చేరాలని వచ్చిన వారిని తన వద్దకు రప్పించుకొని సీటు ఇప్పిస్తానని వారిని నమ్మించి.... బేరం చేసి సొమ్ము వసూలు చేసి అటు... కాలేజీ నిర్వాహకులకు యిటు.... కొత్త విద్యార్థులకు సేతువులా నిలిచి, తనూ బాగా సంపాదించాడు. లక్ష చోట మూడు లక్షలు అంటే..... ఈనాటి విద్యావిధాన రీతుల్లో వున్నవారికి అదేం భారం కాదు. విద్యార్థి తల్లిదండ్రుల నిర్ణయం.... తమ కొడుకు... కూతురు.... ఆ కాలేజీలో చదివి డిగ్రీ తీసుకొని బయటికి వస్తే చాలు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. మనం సంపాదించింది మన బిడ్డల భవిష్యత్తును బాగుపరిచే దానికి కాకపోతే ఇంకెందుకు?....
ఈనాడు ఈ భావన గల తల్లిదండ్రులు ఎందరో!... అంటే ఒక రీతిగా లంచగొండితనాన్ని పెంపొందింపచేసేది పెద్దలే. పిన్నలు రేపు పెద్దవారై వారూ ఫాలో చేసేది ఈ ఫీలాసఫీనే. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!.... ఈ తీరు మారేదెప్పుడో!!!
ఆ కారణంగా విద్యార్థులు మోహన్ బాబును గురించి మాట్లాడుకొనేటప్పుడు సన్నిహితుల మధ్యన బ్రోకర్ బాబు అని ముద్దుగా పలుకుతుంటారు.
ఆరునెలల కాలేజీ అనుభవంలో రమణ ఆనంద్‍కు యింత ఘన చరిత్ర వున్నవాడు మోహన్‍బాబు అని తెలిసింది.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 9 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments