మదిలో మల్లెల మాల - పార్ట్ 9
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 2 days ago
- 6 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 9 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 04/01/2026
మదిలో మల్లెల మాల - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్ తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్ లో చేరుతారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 9 చదవండి.
రామారావు రంగారావు డి.ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ’నీవు కావాలంటే నేను కాదంటానా’ సినిమా మూడు వంతులు పూర్తయింది. రామారావుగారి చేతిలో ద్రవ్యం అయిపోయింది. చిత్రం పూర్తి చేయాలంటే మరో అయిదు కోట్లు కావాలని డైరెక్టర్ చెప్పాడు. తండ్రీ కొడుకులు అయోమయ స్థితిలో పడిపోయారు. నక్కజిత్తుల నల్లేరు నారాయణగారి సలహా కోరారు.
"మీరు సరేనంటే నేను బాతుల బంగారయ్య, మేకల మస్తానయ్యతో మాట్లాడి ఐదు కోట్లు ఏర్పాటు చేయగలను. వారు ఆదాయంలో నాలుగోవంతు వాటాను అడగవచ్చు. దానికి మీరు సరే అంటే ప్రొసీడ్ అయిపోతాను" అన్నాడు నారాయణ.
’అన్యథా శరణంనాస్తి’ అనే స్థితిలో వున్న ఆ తండ్రీ కొడుకులు నారాయణ మాటలు నమ్మి ’సరే’ అన్నారు. నారాయణ బాతుల బంగారయ్యను, మేకల మస్తానయ్యను కలిసి రామారావు గారి సమస్యను గురించి మాట్లాడాడు.
యింతకాలానికి రామారావు తన చేతికి చిక్కినందుకు బాతుల బంగారయ్య పరమానందం పొందాడు. ఐదుకోట్లు పెట్టుబడి పెడతానని, సంస్థలో నాలుగోవంతు వాటా తనదిగా రామారావు, రంగారావులు వ్రాసి ఇవ్వాలని.. నిర్మాతల పేర్లలో రామారావు తర్వాత తన పేరూ తెరపై కనబడాలని షరతులు పెట్టాడు.
అన్ని వివరాలను నారాయణ రామారావు గారికి.. తెలియజేశాడు. పరిస్థితుల ప్రభావంతో వేరే మార్గం లేక, బాతుల బంగారయ్య గారి షరతులకు ఆ తండ్రి కొడుకులు సమ్మతించారు.
అందరూ సమావేశం అయినారు. వ్రాతకోతలు ముగిశాయి.
"రామన్నా!.. నన్ను నీవు అసహ్యించుకొన్నావే గాని నేను ఏనాడు నిన్ను చిన్నచూపు చూడలేదు. నీవు పరంపర భాగ్యవంతుడవు. నేను నా కష్టంతో పైకి వచ్చినవాడిని. నీవంటే నాకు ఎప్పుడూ గౌరవమే. ఈ కారణంగా మనం సన్నిహితులమైనాము. ఇది కలకాలం కొనసాగాలని నా ఆశ" ఎంతో సౌమ్యంగా చెప్పాడు బాతుల బంగారయ్య.
ప్రక్కనే వున్న మేకల మస్తానయ్య నవ్వుతూ.. "నా ఆశయం కూడా అదే" అన్నాడు.
"ఈరోజు మనందరికీ చాలా సుదినం. ఎదురైన సమస్య అమావాస్య చీకటిగా విడిపోయింది. రామారావు గారూ మీరు చాలా అదృష్టవంతులు. శత్రువులు మిత్రులుగా మారిపోయారు. కాబట్టి.. ఈ సాయంత్రాన్ని మనమందరం కలిసి ఆనందంగా అనుభవించాలి" తన విదురనీతి ఫలించినందుకు సంతోషంతో అన్నాడు నల్లేరు నారాయణ.
రామారావు రంగారావు ముఖంలోకి చూచాడు. ఆ చూపులోని ఆంతర్యాన్ని గ్రహించిన రంగా రిసెప్షన్‌కు ఫోన్ చేసి మందుగుండు సామాగ్రిని ఆయత్తం చేశాడు.
తమకు తాము గొప్ప సెలబ్రిటీలుగా ఫీలైపోతున్న రామారావు, రంగారావు, బాతుల బంగారయ్య, మేకల మస్తానయ్య, నల్లేరు నారాయణ.. పరమానందంగా త్రాగి, భుజించి గుడ్ నైట్ చెప్పుకొని పడిపోయారు.
ఆగిపోయిన చిత్ర చిత్రీకరణ ప్రారంభం అయింది. రెండు నెలల్లో చిత్ర నిర్మాణం పూర్తయింది.
రామారావుగారి జన్మదిన సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున ’నీవు కావాలంటే నేను కాదంటానా’ చిత్రం ఆంధ్రాలో అన్ని కేంద్రాల్లో రిలీజ్ అయింది.
కథ.. నాయకుడు తాను ఎంతగానో ప్రేమించిన నాయకి తను ఒకప్పుడు విలన్‍ను ప్రేమించానని, అతని ముందు ఏడుస్తూ చెప్పినందున, నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుతుందని భావించి నాయకుడు.. చిత్రపు టైటిల్‍ను ఆమెతో చెప్పి, నాయకిని విలన్‍కు అప్పగించడంతో సినిమా ముగింపు.
జనానికి ఈ ముగింపు నచ్చలేదు. నాయకుని పాత్ర చిత్రీకరణ, నాయిక అభిప్రాయం పట్ల చిత్రాన్ని చూచిన వారు అసంతృప్తితో ’ఏం బాగా లేదని’ ముద్ర వేశారు. వారంరోజుల్లోనే.. థియేటర్ యజమానులు దీన్ని తొలగించి వేరే చిత్రాలను ప్రదర్శించసాగారు.
కోట్లు గడించవచ్చని ఆశతో బాతుల బంగారయ్య మీద పోటీతో రామారావు, రంగారావులు వెచ్చించిన సొమ్ము గంగపాలైంది. ఆశలు అడియాశలైనాయి.
’గుడ్డిలో మెల్ల శ్రేష్ఠం’ అన్నట్లు విలన్ పాత్రలో రంగారావు నటనకు.. ప్రేక్షకులు, సినీ ప్రముఖులు మంచి మార్కులు వేశారు. రంగారావుకు రెండు ఆఫర్లు కూడా వచ్చాయి. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకొని రంగారావు జ్ఞానిగా మారి అందరితో వినయంగా వర్తించడం ప్రారంభించాడు.
నెత్తిన చెంగేసుకొని వ్యాకుల వదనంతో రామారావు గ్రామానికి చేరాడు.
అర్థాంగి లక్ష్మీదేవి.. ముందు భర్తను తిట్టినా.. చివరకు, ఆ రమణ హృదయానికి మీరు పెట్టిన క్షోభను మీరు ఈనాడు ఈ రీతిగా అనుభవిస్తున్నారని సిద్ధాంత ధృవీకరణ చేసి కన్నీటితో ప్రక్కకు తప్పుకొంది. దీనికంతటికీ కారణభూతుడైన తనయుని తిట్టిపోస్తూ విచారసాగరంలో మునిగిపోయాడు రామారావు.
భార్య సలహా మేరకు.. సుక్షేత్రమైన మాగాణి భూములను, తోటలను, భవంతిని, కారును అమ్మి బ్యాంక్ ఋణాన్ని తీర్చాడు. సర్వం బాతుల బంగారయ్య స్వాధీనం అయింది. సంవత్సరం రోజుల క్రింద రారాజుగా వెలిగిపోయిన రామారావు.. సామాన్య రైతుగా రెండు ఎకరాల భూమిలో ఒక్క గ్రౌండ్ స్థలంలో పూరిపాకలో వుండవలసిన స్థితి ఏర్పడింది. హైదరాబాదులో వున్న రంగారావు తన వారిని మరిచిపోయాడు.
రంజనీ.. మంచి మార్కులతో ప్లస్ టూ పాసైంది. ఆనంద్ తండ్రి రామబ్రహ్మం సాయంతో రంజనీ.. కాలేజీలో బి.ఎస్సీలో చేరింది.
’పూలు అమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసిన స్థితి’ని తలచుకొని, రామారావు నిరంతరం బాధపడేవాడు. సహధర్మచారిణి లక్ష్మీదేవి.. వారికి వూరట కలిగించే మాటలు చెప్పేది. అనునయించేది. నాలుగు గేదెలను కొని పాల వ్యాపారం ప్రారంభించింది. అనాదిగా వారి ఇంటి సేవకుడుగా వున్న ఏసోబు ఈ తరుణంలో కూడా వారిని వదలి వెళ్ళకుండా వారితోటే వుండడం మంచికి మానవత్వానికి నిదర్శనం.
*
రమణ జీవితంలో మరో నాలుగు మధుర వసంతాలు మధుర స్మృతులను మిగిల్చి మనోహరంగా సాగిపోయాయి.
గోల్డ్ మెడలిస్టుగా కాలేజీ టాపర్‍గా బి.ఇ. కంప్యూటర్ సైన్సు పరీక్షలలో నెగ్గాడు రమణ. ద్వితీయ స్థానాన్ని ఆనంద్ సాధించాడు.
క్యాంపస్ ఇంటర్వ్యూలో యాపిల్ కంపెనీ సెలక్ట్ చేసి బెంగుళూరులో ఇరువురికి ఉద్యోగాన్ని ఇచ్చింది.
బెంగుళూరుకు వెళ్ళేముందు ఆ ఇద్దరు మిత్రులు వారికి దైవ సమానులైన ప్రిన్సిపాల్ ధర్మారావు గారిని కలిసి వినయ విధేయతలతో పాదాభివందనం చేశారు.
మీసాలు గడ్డాలతో నవ యువతగా ఎదిగి తన ముందు నిలుచున్న వారిరువురినీ చూచి ధర్మారావుగారు ఎంతగానో సంతోషించారు. వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
ఒక గురువు.. తన శిష్యుడు ప్రయోజకుడై ఎదిగి కొంతకాలం తర్వాత.. గతాన్ని మరువకుండా తన్ను చూడవచ్చి, కృతజ్ఞతలను తెలియజేసినప్పుడు వారి మనస్సు మహదానందానికి గురి అవుతుంది. అదే జరిగింది ప్రిన్సిపాల్ ధర్మారావుగారి విషయంలో.
వినయం విధేయతా గతాన్ని జ్ఞాపకం వుంచుకోవడం, పెద్దలను గౌరవించి వారి ఆశీర్వచనాలను తీసికోవడం అన్నది ఉత్తమ లక్షణం. దీన్ని అనాదిగా మన హైందవ సమాజీకులు పాటించే మనదైన మానవ ధర్మం. ఎంతో విజ్ఞానం పెరిగి వుండవచ్చు. అభ్యసించి గొప్పవారై వుండవచ్చు. కానీ.. స్వధర్మాన్ని ఎవరూ ఎప్పుడూ తమ జీవిత కాలంలో మరచిపోకూడదు. ’అన్ని నిండిన ఆకు అణగి వుంటు’దన్నట్లుగా.. ’ఫలభరితమైన వృక్షశాఖలు క్రింది వంగి వుంటా’యన్నట్లుగా.. విద్యాధికులు వినయ సంపన్నులై.. చిన్నవారికి ఆదర్శప్రాయులుగా వర్థిల్లాలి. అప్పుడే మనజాతి (మానవ) రీతి (సాంప్రదాయం) సాటివారికి.. అన్యులకు ఆదర్శప్రాయం అవుతుంది.
ఆ కోవకు చెందిన మహనీయులు ఈ భారతావని గత చరిత్రలో ఎందరో, ఆ వాసనలు ఆఘ్రాణించి మెచ్చిన పాశ్చాత్యులు ఈ దేశాన్ని సందర్శిస్తున్నారంటే ముఖ్య కారణం అదే. భావి భారత పౌరులైన నేటి యువతీయువకులు ఆ ధర్మాలను పాటించి, ఆచరించి, ఈ దేశ వాసుల ఘనకీర్తిని ద్విగుణీకృతం చేయడం.. తమ బాధ్యతగా భావించాలి. దేశపు యశస్సును పెంచాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి.
ఈ పద్ధతులను గౌరవించి పాటించి ఎదిగి తన ముందు ప్రయోజకులుగా నిలిచిన రమణ ఆనందులను చూచి భుజం తట్టి ’శెభాష్’ అన్నారు ధర్మారావుగారు.
’వెళ్ళివస్తాము సార్’ అని వారికి చెప్పి ఆ మిత్రులు ఇరువురూ వారి గృహప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించారు.
"రమణా ఎక్కడికి వెళదాం?" అడిగాడు ఆనంద్.
"రంజనీ వూరికి, వాళ్ళ అమ్మగారిని ఒకసారి చూడాలిరా. సినిమా తీసి రామారావుగారు ఆస్థినంతా కోల్పోయారని విన్నాముగా. యిప్పుడు వారు అక్కడ ఎలా వున్నారో చూడాలి. సరేనా!.." ఆనంద్ ముఖంలోకి చూస్తూ చెప్పాడు రమణ.
"అలాగే రమణ" అన్నాడు ఆనంద్.
ఇరువురూ బస్సులో ఆ వూరికి చేరారు. వారి భవంతిని సమీపించారు. అది బాతుల బంగారయ్యగారి స్వాధీనం అయిపోయిందని విన్నారు.
వార్డెన్ రంగయ్యను కలిసికొన్నారు. అనారోగ్య కారణంగా ఉద్యోగాన్ని మాని ఇంట్లో వున్న రంగయ్యను చూచారు. యోగక్షేమాలను విచారించారు. రంగయ్య.. రామారావుగారి నేటి స్థితిగతులను గురించి వివరంగా రమణకు ఆనంద్‍కు చెప్పాడు.
మిత్రులిద్దరూ.. రామారావుగారు ప్రస్తుతం వుంటున్న పూరి యింటికి సమీపించారు. మెల్లగా ఆ యింటి ఆవరణంలో ప్రవేశించారు.
ఇంట్లో నుంచి బయటికి వచ్చిన లక్ష్మీదేవి వారిని చూచింది. గుర్తుపట్టలేకపోయింది. ఐదేళ్ళు గడచిపోయాయి కదా!.. దగ్గరగా వచ్చి.. "మీరు ఎవరు బాబు!" వారిని పరీక్షగా చూస్తూ అడిగింది.
"నాపేరు రమణ. వీడి పేరు ఆనంద్" మెల్లగా చెప్పాడు రమణ.
లక్ష్మీదేవికి గతం గుర్తుకు వచ్చింది. వదనంలో వున్న అయోమయ చూపుల స్థానంలో చిరునవ్వు వెలిసింది.
"రామశర్మగారి అబ్బాయివి రమణవా?" అడిగింది లక్ష్మి.
"అవును"
"అత్తయ్యా బాగున్నావా!.. నేను మీ తమ్ముడు రామబ్రహ్మం కొడుకును"
"ఓ నీవా!.. గుర్తుపట్టలేకపోయానురా. నిన్ను నేను మీ అక్క సౌమ్య పెళ్ళిలో చూచిందేగా. నాలుగైదేళ్ళు అయింది. నీవూ బాగా ఎదిగిపోయావురా" నవ్వుతూ అంది లక్ష్మీదేవి.
"అత్తయ్యా!.. మామయ్య ఎలా వున్నారు?" అడిగాడు ఆనంద్.
"హు.. వారిని గురించి ఏం చెప్పేది!.. ఆ దరిద్రుడు రంగ మాటలను నమ్మి వున్న ఆస్థినంతా వూడ్చిపెట్టి సినిమా తీశాడు. అది జనానికి నచ్చలేదు. దివాలా తీశారు. ఋణవిముక్తి కోసం సర్వస్వాన్ని బాతుల బంగారయ్యకు ధారపోశాడు. యిక మిగిలి వున్నది రెండు ఎకరాల భూమి, ఈ స్థలం, నిరంతరం మనోవ్యథతో బాధపడుతుంటారు. పైరును చూచేదానికి చేలవైపుకు వెళ్ళారు."
"రంజనీ!"" అడిగాడు ఆనంద్.
"మీ నాన్నగారి సాయంతో బి.ఎస్సీ చదువుతూ వుంది. మానవత్వాన్ని, బంధుత్వాన్ని మరువని మంచి మనిషి మీ నాన్న."
"అవును రమణా!.. నీకు మా కుటుంబం మీద యింకా కోపమా!.." దీనంగా అడిగింది లక్ష్మీదేవి.
"లేదండి. నాకు ఎవరి మీదా ఎలాంటి కోపం లేదు" చెప్పాడు రమణ.
"ఏం చేస్తున్నావు?" అడిగింది లక్ష్మి.
"బి.ఇ కంప్యూటర్ సైన్సు వరకూ చదివాను. బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది వీడికి నాకు. రేపు బయలుదేరి వెళుతున్నాము. యథార్థం చెప్పాలంటే నేను మీకు ఋణపడి వున్నాను. మీరు యిచ్చిన ఆ రెండు లక్షలతోనే నేను కాలేజీలో చేరకలిగాను. మీరు చేసిన ఆ సహాయాన్ని నేను నా జీవితాంతం మరువలేను." ఎంతో వినయంగా చెప్పాడు రమణ.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 10 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
