మదిలో మల్లెల మాల - పార్ట్ 10
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 5 hours ago
- 6 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 10 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 10/01/2026
మదిలో మల్లెల మాల - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్ తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్ లో చేరుతారు. సినిమారంగంలో నష్టపోయి, రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 10 చదవండి.
లక్ష్మీదేవి పరీక్షగా కొన్నిక్షణాలు రమణను చూచింది.
"రండి కూర్చోండి. మజ్జిగ ఇస్తాను" అంది.
ఇరువురూ వాకిటి ముందున్న మంచంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి లోనికి వెళ్ళిపోయింది.
"సాక్షాత్ లక్ష్మీదేవిలా వుండే అత్తయ్య ఎలా మారిపోయిందిరా!.. ఆమెను ఈ స్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా వుంది రమణ" అన్నాడు విచారంగా ఆనంద్.
"నెలనెలా మనం వీరికి కొంత ఆర్థిక సహాయం చేద్దామురా" సాలోచనగా అన్నాడు రమణ.
"అలాగే చేద్దాం" ఆనంద్ అమోదం.
లక్ష్మీదేవి రెండు గ్లాసులతో మజ్జిగను తీసుకొని వచ్చి వారికి అందించింది.
మౌనంగా ఇరువురూ త్రాగారు. ఖాళీ గ్లాసులను అందుకొంది లక్ష్మీదేవి.
"నిజం చెప్పాలంటే మేము ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి కారణం వీడే. మిమ్మల్ని చూడాలన్నాడు వచ్చాము" నవ్వుతూ రమణను చూస్తూ చెప్పాడు ఆనంద్.
"మీరు వచ్చి నన్ను చూచినందుకు నాకు చాలా సంతోషంరా" నవ్వుతూ అంది లక్ష్మీదేవి.
రంజనీ వచ్చింది. వారిని చూచి ఆశ్చర్యంతో వాకిట్లోనే నిలబడిపోయింది ఎవరా అని.
"ఎందుకు అక్కడే ఆగిపోయావురా. వీరు ఎవరో కాదు మనవారే" అంది లక్ష్మిదేవి.
రంజనీ మెల్లగా వారిని సమీపించింది. బాగా ఎదిగిపోయిన రమణను, ఆనంద్‍ను.. కొన్ని క్షణాలు చూచి మౌనంగా యింట్లోకి వెళ్ళిపోయింది.
పుస్తకాలను టేబుల్‍పై వుంచి.. కిటికీ గుండా వారికి కనబడకుండా వారిని చూస్తూ నిలబడింది.
కూతురు వాళ్ళను పలకరించకుండా లోనికి వెళ్ళిపోవడం లక్ష్మీదేవికి నచ్చలేదు.
ఆ ఇరువురూ లేచి నిలబడ్డారు.
"అత్తయ్యా!.. ఇక మేము బయలుదేరుతాం" అన్నాడు ఆనంద్.
లక్ష్మీదేవి యింటి ముఖ ద్వారం వైపు చూచింది.
"ఏయ్ రంజనీ!.. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వచ్చి పలకరించవే!" ఆమె వదనంలో చిరుకోపం.
ఆమె మాటల్లో అసహనం ధ్వనించింది. రమణ ఆనందులకు.
రంజనీ తలదించుకొని వచ్చింది. తలెత్తి వారిరువురినీ క్షణంసేపు చూచింది.
"బాగున్నారా!.." అంది.
"నీవు ఎలా వున్నావ్?" నవ్వుతూ అడిగాడు ఆనంద్.
’బాగున్నా’ నన్నట్లుగా తలాడించింది రంజనీ.
"వీడెవడో మరిచిపోయావా!.. రమణ" అన్నాడు ఆనంద్ నవ్వుతూ.
రమణ.. క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచాడు. అదే సమయంలో రంజనీ అతన్ని చూచింది. ఇరువురి చూపులు కలిసాయి. దృష్టిని మరలించి.. రమణ.. "ఆనంద్!.. బయలుదేరుదాం రా!.." అన్నాడు.
"సరే పద. వెళ్ళొస్తా అత్తయ్యా. మామయ్యను అడిగినట్లు చెప్పండి" చెప్పి, ఆనంద్ వీధివైపుకు నడక ప్రారంభించాడు.
రమణ లక్ష్మీదేవికి నమస్కరించి ఆనంద్‍ను అనుసరించాడు. వెళుతున్న ఆ ఇద్దరినీ చూస్తూ నిలబడిపోయారు ఆ తల్లీ కూతుళ్ళు.
’బంగారంలాంటి బిడ్డలు. విద్య వినయం పెద్దలయందు గౌరవం వారి సొత్తు. ఏ పూలతో ఏ ఆడబిడ్డలు పూజలు చేస్తున్నారో.. ఇలాంటి సుగుణవంతులను భర్తగా పొందేటందుకు!.. ఈకాలం మొగపిల్లల్లో వున్న ఏ అవగుణాలు వీరికి లేవు. యిలాంటి వారి అల్లుళ్ళుగా రావాలంటే.. ఆడపిల్లల తల్లిదండ్రులకూ అదృష్టం వుండాలి. మరి.. మా వుభయుల అదృష్టం.. యోగం, ఎలా వుందో!.. రంజనీ జీవిత భాగస్వామి ఎవరో! ఎక్కడున్నాడో!.. దాని భావి జీవితం ఎలా వుందో!.. కూతురు రంజనీ.. వివాహాన్ని గురించిన ఆలోచనలతో.. లక్ష్మీదేవి మనస్సున కలవరం.’ మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది.
ఠీవిగా ముందుకు నడిచి వెళుతున్న రమణ, ఆనందులు.. రంజనీల చూపులు వెంబడించాయి. ఆమె మనస్సులో పెన్న ఒడ్డున ఐదేళ్ళ క్రిందట తను కలిసిన రమణ, నేడు తను చూచిన రమణ.. నిలిచారు. ఆ రెండు మూర్తులలో ఎంత వ్యత్యాసం?.. నిక్కరు అప్‌ప్లాల్ షర్టు వేసుకొని వున్నాడు ఆనాటి రమణ.. తెల్లషర్టు, అదే వర్ణం ప్యాంటు, టక్ చేసి.. ఆరడుగులు ఎత్తులో సినిమా హీరోలా వున్నాడు ఈనాటి రమణ. కానీ.. అతని చూపుల్లో నాటికి నేటికి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఆ చూపుల్లో అమాయకత్వం, ఎంతో శాంతం.. ఆనాడు, నేడు ఒకేలాగా వున్నట్లు అనిపించింది రంజనీకి.
మనిషి మంచి సహృదయుడు, మంచి, మానవత్వం వున్నవాడు. అందుకనే ఈనాడు తన ఇంటికి వచ్చి.. అమ్మను నన్ను చూడగలిగాడు. యింతేనా లేక మరేదైనా ఆలోచనతో వచ్చాడా!.. ఆనాడు తను కోటీశ్వరుని కూతురు. ఈనాడు తను వృద్ధులైన పేద తల్లిదండ్రుల కూతురు. ఐదేళ్ళలో నా కుటుంబ పరిస్థితుల్లో ఎంత మార్పు.
ఆనాడు తన తల్లి తనకు చెప్పిన నయవచనాలు జ్ఞప్తికి వచ్చాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మ నాడు చెప్పిన ప్రతిమాటా అక్షర సత్యాలు. స్వానుభవం వల్ల అన్నీ ఋజువైనాయి.
తను బి.ఎస్సీ పూర్తి చేయాలి. ఉద్యోగాన్ని సంపాదించాలి. తన అన్నయ్యలా కాకుండా, తను తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూచుకోవాలి. అన్నయ్య వారికి అందివ్వలేని ఆనందాన్ని తను వారికి అందివ్వాలి. ఎంత శ్రమైనా సరే, సహనంతో సహించాలి.. భరించాలి. దీక్షతో కాలానికి ఎదురీదాలి.
అమ్మ పిలుపు, నాన్నగారి రాక రంజనీ ఆలోచనలకు అంతరాయాలైనాయి. తండ్రి కాళ్ళకు చెంబుతో నీళ్ళు అందించి..’వస్తున్నానమ్మా!..’ నాన్నగారు వచ్చారు’ అంటూ లోనికి నడిచింది రంజనీ.
పొయ్యిమీద వున్న అన్నాన్ని దించమని కూతురుకు చెప్పి లక్ష్మీదేవి వాకిట్లోకి వచ్చింది.
రామారావు మంచంపై కూర్చొని వున్నాడు. వారి ప్రక్కన ఏసోబు నిలబడి వున్నాడు.
రమణ, ఆనంద్‍లు వచ్చి వెళ్ళినట్టుగా లక్ష్మీదేవి రామారావుకు చెప్పి, జరిగిన సంభాషణనంతా వివరించింది. అర్థాంగి చెప్పినదంతా రామారావు శ్రద్ధగా ఆలకించాడు.
*
మిత్రులిరువురూ బస్సులో కూర్చున్నారు. బస్సు బయలుదేరింది.
ఇరువురి మనస్సుల్లో రామారావు గారి కుటుంబాన్ని గురించిన ఆలోచనలే.
కాలప్రభావంతో.. ’రాజే కింకరుడగు, కింకరుడే రాజగు’ ఏనాడో చదివిన ఆర్యోక్తి జ్ఞప్తికి వచ్చింది రమణకు.
’నేను వారికి ఋణపడి వున్నాను. ఆ ఋణాన్ని త్వరలో తీర్చుకోవాలి. రెండు లక్షలు వారికి ముట్టేలా చూడాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి’ అనుకొన్నాడు రమణ.
అతని కళ్ళముందు రంజనీ నిలిచింది. నవ్వుతూ తన్నే చూస్తూ ఉంది.
ఐదేళ్ళలో ఆమెలో ఎంత మార్పు, ఎంత హుందాతనం, ఎంత అందం. ఆటకాయితనంగా చిలిపిగా చూచే ఐదేళ్ళ క్రిందటి ఆ చూపులకు.. ఈనాటి అమె చూపుల్లో ఎంతో ప్రశాంతత గంభీరం.. ఎంతటి మార్పు, సిగ్గుతో నా కళ్ళతో తన చూపులను కలపలేకపోయింది. బహుశ.. నాడు తాను నాపట్ల చేసిన తప్పును తలచుకొని యింకా బాధపడుతూ వుందా!..
ఆమె చేసిన ఆ తప్పు వల్ల తను ఆ రోజంతా.. తర్వాత కొంతకాలం బాధపడింది వాస్తవమే. కానీ ప్రిన్సిపాల్ ధర్మారావు గారి అనునయ భాషణ, రంగయ్యగారి ఓదార్పు మాటలు, తన స్నేహితుల సహకారం, నాలోని ఆవేదనను తొలగించి.. నాలో పట్టుదలను పెంచాయి. ఆ సంఘటన.. ఆనాడు జరుగకుండా వుంటే.. బహుశా నేను ఈనాటికి యింతటి మంచి స్థితికి వచ్చి ప్రయోజకుణ్ణి అయ్యి వుండేవాడిని కాదేమో!.. రంజనీ ఒక రీతిగా నాకు మేలే చేసింది’ అనుకొన్నాడు రమణ.
కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న రమణను చూచాడు ఆనంద్.
"రమణా!.. ఏదో దీర్ఘాలోచనలో వున్నావు. ఏమిటి?"
"రంజనీ గుర్తుకు వచ్చింది."
"తను చాలా అందంగా తయారైంది కదూ!" నవ్వుతూ అడిగాడు ఆనంద్.
"నేడు నాకు ఆమె వదనంలో గాంభీర్యం.. సహనం.. సిగ్గు.. గోచరించాయి."
కిటికీగుండా శూన్యంలోకి చూస్తూ అన్నాడు రమణ.
"నేను మాట్లాడింది ఆమె అందాన్ని గురించి.. ముఖభావాలను గురించి కాదు."
"నీవు అన్నది ఆ వయస్సు మహిమ."
"అంటే!.."
"ఆ వయస్సులో వున్న ఆడపిల్లలు.. మగపిల్లల కళ్ళకు నీవు అన్నట్లుగానే కనిపిస్తారు."
"నేను కాలేజీ రోజుల్లో ఏనాడైనా యిలాంటి మాటను నీతో చెప్పానా!.. మన మధ్యన ఎందరో ఆడపిల్లలు వున్నారుకదా!.."
"అయితే.."
"నీకు రంజనీలో ఏ ప్రత్యేకతా కనిపించలేదా!.."
"నాకు తోచింది నీకు చెప్పేశాను."
"అది అబద్ధం.." నవ్వాడు ఆనంద్.
అతని మాటలకు, చూపులకు రమణకు కూడా నవ్వు వచ్చింది. నవ్వాడు.
"నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు పెద్దలు అవునా! బ్రదర్!.. నేను నీ అంతటి తెలివిగల వాడిని కాకపోవచ్చు. కానీ.. పువ్వుకు వున్న వాసన వాటికి కట్టిన నారకు సంక్రమించినట్లు.. నీ సహచర్యంతో నాకు అది కొద్దిగా సంక్రమించింది" నవ్వుతూనే చెప్పాడు ఆనంద్.
"రంజనీని నీవు చూచిన చూపులో.. నేను చూచిన చూపులోని వ్యత్యాసానికి నీ మాటనే సాక్షి."
"అలాగా!.." ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఆనంద్.
"అవును." అన్నాడు రమణ ముక్తసరిగా.
రమణలోని సీరియస్‍నెస్ చూచిన ఆనంద్ మౌనం వహించాడు. కానీ.. రంజనీ రమణను చూచిన చూపులో అతనికి క్రొత్త అర్థం తెలిసి వచ్చింది. ’భావికాలం.. ఏం నిర్ణయించబోతుందో చూడాలి మరి’ అనుకున్నాడు మనస్సున ఆనంద్.
మిత్రులిరువురూ వారి గ్రామానికి చేరారు. ఆకాష్ దగ్గర నుంచి రమణకు ఫోన్ వచ్చింది. అతను ఫోన్ మాట్లాడి ఆపిన తర్వాత..
"నాన్నా!.. ఆకాష్ ఎవరు?" అడిగింది సునంద.
"నా కాలేజ్ మేట్ అమ్మా. వాడి పెళ్ళి నేనే జరిపించాను" నవ్వుతూ చెప్పాడు రమణ.
"ఏమిటీ?.." ఆశ్చర్యంతో అడిగింది సునంద.
"అవునమ్మా!.. కాలేజీలో మంత్ర అనే అమ్మాయి వుండేది. ఆకాష్‍దీ, అమ్మాయిదీ ఒకే వూరు. వారు యిరువురూ ప్రేమించుకొన్నారు. వారి ప్రేమను గురించి వారు తల్లిదండ్రులకు తెలియజేశారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు కులాలు వేరు కావడంతో.. ఆకాష్‍ను వారు అల్లుడిగా అంగీకరించమన్నారు. వాడి తల్లిదండ్రులు సమ్మతించారు. ఆ కారణంగా వారిరువురూ వారి కథను నాకు వినిపించారు. ఆకాష్ చాలా మంచివాడు. వారికి సాయం చేయాలనుకొన్నాను. మంత్ర తల్లిదండ్రులను కలసికొని ఆమె నిర్ణయాన్ని గురించి వారికి చెప్పాను. వారు అంగీకరించలేదు.
ఫలితంగా.. గుడిలో వారి పెండ్లిని నేనే పురోహిత వేషంతో, వారు కోరిన విధంగా జరిపించాను. ఆ వుభయులు, ఆకాష్ తల్లిదండ్రులు.. ఎంతగానో సంతోషించారు. నన్ను అభినందించారు.
వాడు నా యోగ క్షేమాలను విచారించి, మంత్రకు మూడోనెల గర్భం అని యిప్పుడు చెప్పాడు. నా సాయాన్ని జీవితాంతం మరచిపోలేనన్నాడు. వాడు చాలా ఆనందంగా వున్నాడమ్మా. నేను చేసిన దాంట్లోతప్పు లేదు కదా అమ్మా!.." ప్రశ్నార్థకంగా తల్లి ముఖంలోకి చూచాడు రమణ.
"ఒకరినొకరు యిష్టపడి వివాహం చేసుకోవాలన్న యిరువురిని ఏకం చేశావు. అందులో తప్పేముంది నాన్నా. యీ కులం.. మతం.. మనం కల్పించుకొన్నవే. అంటే మనం కాదు మన పూర్వీకులు. నాకు తెలిసినంతవరకూ.. సాటి మనిషిని మనిషిగా చూచి ఆదరించి అభిమానించడమే అసలైన కులం, మతం. నీవు చాలా మంచిపని చేశావు రమణా!.." ఆనందంగా చెప్పింది సునంద.
తల్లిలో వున్న అభ్యుదయభావాలు.. మనిషి మానవత పట్ల ఆమెకున్న విశాల భావాలకు రమణ సంతోషించాడు. ’మై మదర్ ఈజ్ గ్రేట్’ అనుకొన్నాడు. బెంగుళూరు ప్రయాణానికి సర్దుకోవడం ప్రారంభించాడు.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 11 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
