top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9

Updated: Jan 16

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 9 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 08/01/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:

తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.

తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్రకిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం, పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు.

సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది.


ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 9 చదవండి.


సదానందం తెల్లబోయి కొడుకు వైపు చూసాడు—చూస్తూ అడిగాడు— “కమలవాణి గురించి మధులికకు చెప్పావా!”


“ఔను చెప్పాను… కానీ ఖచ్చితంగా చెప్పలేకపోయాను.”


“వాట్ డూ యూ మీన్?”


“యస్ డాడ్—అప్పుడు మెడికోగా ఉన్న కమలవాణి మెదడు వాపు జ్వరానికి లోనై అర్జెంట్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిపోయింది. ఎంత సీరియస్ కండిషన్‌లో వెళ్లిందంటే ఎటువంటి కబురూ అందకపోయే సరికి చచ్చిపోయుంటుందనుకున్నాను. బిలీవ్ మీ డాడ్!”


కొడుకు మాటకు ఉమాదేవి ఆవేశం ఆపులేకపోయింది. అతణ్ని రెండు చేతులతోనూ దూరంగా కోపంగా నెట్టుతూ అంది— “అప్పుడెందుకురా అన్నం పున్నం ఎరుగని మధులికకు మూడు ముళ్లు వేసావు! నీకు పెళ్లాముందని మాకు ముందే చెప్పవచ్చు కదరా! ఇది ఆట కాదు రా—బ్రతుకు బాట రా ధూర్తుడా! ఇది గాని తెలిసి మా వియ్యంకుడూ వియ్యంకురాలూ కలిసి వచ్చి కయ్యానికి దిగితే మేమేమి చేసేదిరా! మా పరువేమి కానురా!”


“నాకు చెప్పనివ్వకుండానే మీకు మీరుగా బెంబేలు పడిపోతున్నారమ్మా! నేను ప్లాన్ వేసుకుని మధులికకు అన్యాయం తలపెట్టలేదమ్మా! నన్ను నమ్మండమ్మా! విషయం పూర్తిగా తెలుసుకోకుండా నన్ను కీచకుణ్ణి చేయకండమ్మా! మధులికకు విషయం చెప్పే మూడు ముళ్లు వేసానమ్మా—కమలవాణి గాని విదేశాలకు వెళ్లి విష జ్వరం నుంచి తేరుకుని ఉందంటే—ఆ విషయం నాకు తెలుసుంటే నేను కచ్చితంగా మధులికకు మూడు ముళ్లు వేసే వాణ్ని కానమ్మా—”


ఆ మాటతో అక్కడ నిశ్శబ్దం రాత్రిపూట వినిపించే సముద్ర హోరులా చోటు చేసుకుంది. ఆ విలంబత కాలంలో పనిగత్తె కాంతమ్మ అందరికీ పండ్లరసం అందించింది. అందరూ గ్లాసులు అందుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు.

సోమశేఖరం పండ్లరసం తాగడం పూర్తి చేసి ఊపిరి బరువుగా శ్వాసిస్తూ కాంతమ్మ వైపు చూపు విసిరాడు. ఆ చూపు సంకేతంతో ఆమె అక్కడినుంచి కదలి లోపలకు వెళ్లిపోయింది.


అప్పుడతను చెప్పసాగాడు. “నేనప్పుడు ఇంటర్ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్న సమయం. కమలవాణి హౌస్ సర్జరీ చేస్తూంది. సాధారణంగా ఆమెది హాట్ టెంపర్—ఒక విధంగా మొండి ఘటం కూడా. అనుకోని విధంగా చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా రియాక్ట్ అయేది—దాడి సలిపేది. ఒకసారి నన్ను ఏదో ఒక విషయంలో ఓవర్‌గా టీజ్ చేసింది. ఆపమన్నా ఆపకుండా టీజ్ చేయడం ప్రారంభించింది. నేను తట్టుకోలేకపోయాను.


అది గొప్పింటి అమ్మాయే కావచ్చు. మెడికోనే కావచ్చు. దాని గొప్పతనం దాని ఇంట్లో పెట్టుకోవాలి. ఎదుటివారిపై డామినేట్ చేయడానికి పూనుకుంటే స్వాభిమానం ఉన్నవారెవరైనా ఊరుకుంటారేమిటి? చాచి లెంపకాయ కొట్టాను. బుగ్గ వాచిపోయింది. ‘అబ్బా’ అంటూ క్రింద కూర్చుండిపోయింది.


నేను తిరిగి చూడలేదు. మళ్లీ కమలవాణి ముఖం చూడకూడదనే అనుకున్నాను. మూడు రోజులపాటు పెడముఖంగానే ఉన్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. దాని టెంపరమెంట్ తెలిసికూడా నేనలా సహనం కోల్పోకూడదేమోనని అంతర్మథనానికి లోనవుతూ ఆమె వెంటబడ్డాను క్షమాపణలు కోరుతూ—


ఎట్టకేలకు దివినుండి భువికి దిగి వచ్చింది. ఏదో మంచి మూడ్‌లో నా క్షమాపణలు అందుకుంటూ ఒక కండిషన్ పెడుతూ నన్ను ఎదురుకుంది. ఆమె పెట్టిన కండిషన్ ఇది—తనెక్కడికి పిలిచినా ఆమె వెంట వెళ్లాలి. ఎందుకని అడక్కుండా చెప్పినట్టు చేయాలి. ఒప్పుకున్నాను.


ఆమె చెప్పినట్టే ఆరోజు మళ్లీ స్నానం చేసి భవానీ అమ్మవారి గుడి ప్రాంగణం చేరాను. అక్కడ ఆమె ఆహార్యం చూసి అదిరిపోయాను— ‘అదేమిటి పెళ్లికూతురిలా సింగారించుకుని వచ్చావు?’ అని అడిగాను.


‘నేను ముందే చెప్పాగా—ఎందుకూ ఎప్పుడూ అని ప్రశ్నలు వేయకూడదని—’ అంటూ మొక్కుబడిగా చెట్టుకు వేలాడుతూ ఉన్న పసుపు తాడొకటి తెంపి నాకిచ్చింది. తను తెచ్చుకున్న పూలమాలను నా మెడన వేసి మరొకటి తన మెడన వేయమంది.


ఆ విధంగా ఆమె ఎన్నటికీ మారని మొండి ఘటమని నిరూపించుకుంది. ఆమె చెప్పినట్టే ఆమె మెడన అమ్మవారి గర్భగుడి ముందు మూడు ముళ్లు వేసాను. వేస్తూ గట్టిగా స్పందించాను— ‘నేను ముందే మాటిచ్చానుగా నిన్ను పెళ్లి చేసుకుంటానని—మరీ తొందరపాటెందుకు?’ అని.


దానికామె దివ్య ధీమాగా బదులిచ్చింది— ‘టిట్ ఫర్ టెట్ అనుకో! అలా చేయకపోతే నాకు తృప్తి కలగదుగా! ఇగో చల్లారదుగా!’ అని నిబ్బరంగా చెప్పింది కమలవాణి.

అంతే కాదు. గుడి పూజారి సమక్షాన మా ఇద్దరి సెల్ఫీ తీయించుకుంది. ఇదమ్మా జరిగింది—


“ఇదమ్మా జరిగిందని ముక్తసరిగా చెప్పి ఆపుచేస్తే ఎలాగురా! అది నిజంగానే అమ్మవారి సమక్షాన జరిగిన వివాహమనుకుంటే మధులికను చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నట్టు?”


“సారీ! పూర్తిగా చెప్పలేదు కదూ? అంతా అయిపోయిందనుకున్నాను. నువ్వు కూర్చో అమ్మా! నేను నిల్చునే చెప్తాను” అని అమ్మా బాబులిద్దర్నీ సోఫాలో కూర్చుండబెట్టి బామ్మకు స్పష్టంగా వినిపించేలా దగ్గరగా జరిగి కొనసాగించాడతను—


“అప్పుడొకసారి కమలవాణి సహ జూనియర్ డాక్టర్లతో కలిసి యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న కుగ్రామంలో ఏదో మెడికల్ క్యాంప్ జరుగుతుందని వెళ్లింది. వెళ్లేటప్పుడు నాకు చెప్పే వెళ్లింది గాని అసలు విషయం మాత్రం చెప్పలేదు. ఆ ఊరి జనంలో ముప్పావు మందికి విష జ్వరాలట. కొన్ని ఊరూ పేరూ లేని కొత్త రకపు ఫీవర్స్‌ట. అందరితో పాటు కలిసి వాళ్లకలా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కమలవాణికి జ్వరం సోకింది. అది మామూలు జ్వరమేననుకుని ప్రైమరీ లెవల్ మెడిసిన్స్ తీసుకుంది. కానీ—తెరపినివ్వలేదు.


ఉన్నపాటున ఆమె ముఖం తిరిగి పడిపోయిన తరువాతనే తెలిసొచ్చింది ఆమెకు తాకింది మామూలు జ్వరం కాదని—మెదడు వాపు వ్యాధి అని. నేను విషయం తెలుసుకుని ఆ ఊరికి పరుగున వెళ్లాను. కానీ—కమలవాణి అక్కడ లేదు. వాళ్ల అమ్మానాన్న వచ్చి కమలవాణిని తీసుకెళ్లిపోయారు.


ఇంటి విలాసం తెలుసుకుని వాళ్ల ఇంటికి వెళ్లి చూస్తే ఇంట్లో ఎవ్వరూ లేరు, పని వాళ్లు, గేట్ కీపర్ తప్ప. ఎంత నొక్కి అడిగినా వాళ్లు కమలవాణి భోగట్టా ఇవ్వలేకపోయారు. తరువాత సూచాయిగా తెలిసింది—కమలవాణికి కండిషన్ ప్రమాదకరంగా మారడం వల్ల, బీపీ పడిపోవడం వల్ల ఆమెను వాళ్ల అమ్మానాన్న స్పెషల్ ఫ్లైట్‌లో జర్మనీ తీసుకెళ్లిపోయారని. మళ్లీ అక్కడినుంచి అలా అమెరికా వెళ్లిపోతారని—ఇక ఇండియాకు తరలిరాకపోవచ్చని.


అసలు కమలవాణి బ్రతికి బట్ట కట్టగలదన్న అవకాశమే లేదని—కొన్ని నెలల పాటు అయోమయంలోనే కాలం గడిపాను. అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉద్వేగంలో ఊగిసలాడుతూ ఇంట్లో వాళ్ల మాట జవదాటలేక మధులిక మెడన మూడు ముళ్లు వేసాను.


మొత్తానికి ఏదీ నా అదుపులో లేకుండాపోయింది. కమలవాణి నిజంగానే నా భార్యయేనా—లేక బొమ్మల కొలువులో సరదాగా జరుపుకునే గౌరీ కళ్యాణ మహోత్సవమా! మీకది చెప్పాలా వద్దా అన్నది నిర్ధారించుకోలేక పెళ్లిపీటలపైన కూర్చున్నాను. అసలు సంగతి ఇదేనమ్మా!” అని సావధానంగా పెద్దలందరి వైపు చూసాడు సోమశేఖరం.


అప్పుడు ఇంద్రకిరణ్ మధ్యకు వచ్చి అడిగాడు— “కనీసం ఈ విషయం పెళ్లికి ముందో ఆ తరువాతనో వదినకు చెప్పి ఉండాల్సింది కదరా అన్నయ్యా!”


“సూచాయిగా చెప్పానని ముందే చెప్పాను కదరా—” అని కదలబోయాడు శేఖరం.


అప్పుడు సదానందం హుంకరింపు వినిపించింది— “ఆగరా శేఖరం! నీ ఎమోషన్స్ నువ్వు స్మార్ట్‌గా మాటల్లో చెప్పుకున్నావు గాని—నువ్వు అసలు విషయానికి రానేలేదు.”

అతడు కళ్లు పెద్దవి చేసుకుని తండ్రి వైపు తేరిపార చూసాడు.


“నువ్వు మళ్లీ కమలవాణిని ఎప్పుడు కలుసుకున్నావు? ఎక్కడ కలుసుకున్నావు? ఎలా కలుసుకున్నావు? కలుసుకున్న తరువాత దాపరికం లేకుండా చెప్పావా—నీకు పెళ్లయిందని—ఇకపైన ఆమెతో పరిచయాలు, స్నేహాలు పెంచుకోలేనని—”


తండ్రి మాటకు అతడు నీరసమైన చూపులతో బదులిచ్చాడు— “సారీ బాబూ! ఏదో మూడ్‌లో పడి, కాస్తంత అలసట ముంచుకొచ్చి ముఖ్యమైన విషయాలు చెప్పడం మరచిపోతున్నాను. మరొకసారి సారీ అమ్మా—ఇప్పుడు విషయం చెప్పి ముగిస్తాను.

కమలవాణిని చాలా రోజుల తరువాత అనుకోకుండా అకస్మాత్తుగా సవేరీ హోటల్‌లో కలుసుకున్నాను. నేను మా కంపెనీ తరపున బిజినెస్ మీట్‌కు వెళ్లాను. బిజినెస్ మీట్ పూర్తయి కదలి వస్తున్నప్పుడు ఎదురైంది. నేను నోట మాటరాక నేలకు అతుక్కుపోయినట్లుగా నిల్చుండిపోయాను. కార్పొరేట్ బిజినెస్ సూట్‌లో ఉన్న కమలవాణి నన్ను చూసి ఎమోషనల్ అయిపోయింది. ఎంతగా అంటే—కంటతడి పెట్టుకుంటూ అందరి ముందూ కౌగిలించుకుంది.”


అప్పుడు ఇంద్రకిరణ్ అడ్డువచ్చాడు— “మరి—నువ్వు ఎమోషనల్ అవలేదురా అన్నయ్యా?”


శేఖరం తల ఊపుతూ కొనసాగించాడు— “‘ఒంటరిగా వచ్చినట్టున్నావు కమలా! నీతో ఎవరూ రాలేదా?’ అని అడిగాను.


నిజానికి అలా ఎందుకు అడిగానంటే—ఆమెకు పెళ్లి అయిపోయిందనే అనుకుని. దానికి ఆమె ఇలా అంది—‘నేనెలా ఒంటరిదాన్నవుతాను, మీరుండగా?’


అప్పుడు తన గురించి మరింత చెప్పుకొచ్చింది. ఆమెను తాకిన మెదడు వాపు జ్వరం వల్ల ఆమెకు మెంటల్ బ్యాలెన్స్ కూడా అఫెక్ట్ అయిందట. మళ్లీ స్పృహలోకి రావడానికి చాలా రోజులే పట్టిందట. ఇక దాచడం ఎందుకని మధులికతో జరిగిన నా వివాహం గురించిన గుట్టు విప్పాను.


మొదట బిత్తరపోయినట్టుగా అదోలా చూపులు విసిరింది గాని, ఆ తరువాత మామూలు స్థితికి వస్తూ అడిగింది—‘మరిప్పుడు నీకు నేనేమవుతాను శేఖర్?’ అని.


అడుగుతూనే మెడన ఆ నాడు గుడిలో నేను కట్టిన పసుపు తాడు బయటకు లాగి చూపించింది.


నేను మరుమాటకు తావు లేకుండా ఆమె ప్రశ్నను స్వీకరించాను. ప్రశ్నతో పాటు ఆమెను కూడా స్వీకరించాను. నాకప్పుడు మరొక ఆలోచనేదీ కలగలేదు.”


ఈసారి సదానందం అందుకున్నాడు— “సరే—దీనికి బదులు ఇయ్యి—కమలవాణి సీరియస్ కండిషన్‌లో జర్మనీ వెళ్లకముందు ఆమెతో కలిసి ఎన్నాళ్లు గడిపావు?”


తండ్రి ప్రశ్న విన్న మధుమురళి తడబడకుండా నిదానంగా బదులిచ్చాడు; తామిద్దరి మధ్య అటువంటిదేమీ జరగలేదని తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడతను.


“మరిప్పుడూ—”


శేఖరం బదులివ్వకుండా ముఖం అటు తిప్పుకున్నాడు. సదానందం కొడుకుని తేరిపార చూస్తూ కొనసాగించాడు— “అర్థమైంది. నీవరకు ఆమె నీకు మొదటి భార్య కదూ. ఇక వ్యవహారం అలానే సాగుతుంది మరి. అదలా ఉంచు—ఇప్పుడు కమలవాణి ఏమి చేస్తుంది? డాక్టరుగా ప్రాక్టీస్ చేస్తుందా లేక సవేరీలో ఏదైనా ఉద్యోగం చేస్తుందా?”


“లేదు బాబూ! ఆనాడు ఆమెను తాకిన అనారోగ్యం దృష్ట్యా ఆమె డాక్టర్ ప్రాక్టీస్ చేయడం లేదు. హోటల్ సవేరీలో జాబ్ కూడా చేయడం లేదు. వాళ్ల నాన్న ఎక్కడో కూకట్పల్లిలో ఫార్మా కంపెనీ నడుపుతున్నాడు. దానికి చైర్మన్ అండ్ ఎండీ ఆయనే. కమలవాణి డిప్యూటీ ఎండీ—వాళ్ల అమ్మ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో మెంబర్.”


అప్పుడు ఇంద్రకిరణ్ కలుగజేసుకుని అడిగాడు—ఫార్మా కంపెనీ పేరేమిటని.

“విమలానంద్.”


భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. అది పెద్ద కంపెనీ—మేజర్ విదేశీ కంపెనీల పార్ట్‌నర్‌షిప్‌తో సాగుతున్న పేరున్న కంపెనీ. పలు ప్రాంతాలకు, పలు దేశాలకు సిరప్ తయారు చేసి సప్లై చేస్తున్న ఫార్మా కంపెనీ.


అంత పెద్ద కంపెనీ ఓనర్ కూతురై ఉండి, ఎందుకిన్నాళ్ల వరకు విదేశాల్లో ఫ్యాషనబుల్ లైఫ్ సాగిస్తూ పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉండి కూడా తోడుని ఎందుకు వెతుక్కోలేదు? ఏదో ఆవేశంలో మునిగి ఎక్కడో గుడి ప్రాంగణంలో కట్టించుకున్న పసుపు తాడును పనికిరాని సిల్లీ సెంటిమెంటల్ వ్యవహారమని పక్కన పెట్టి మరొక మగతోడుని వెతుక్కోవచ్చుగా!


అలా చేస్తే కమలవాణిని అడ్డుకునే వారెవరంట? ఆఫ్టర్ ఆల్—షీ ఈజ్ ఎ సోఫిస్టికేటెడ్ ఉమెన్. కాదా—పసుపుతాడు మెడన కట్టినంత మాత్రాన అది పెళ్లెలా అవుతుంది? పెళ్లయిందనుకున్నా సాక్ష్యమేదీ? సాక్షులేరీ!


డాషింగ్ వేగంతో ఆధునిక జీవితాలను సాగిస్తున్న ఇప్పటి తరం అమ్మాయిలందర్నీ ఒకే గాడిన పెట్టడం క్షమించరాని పొరపాటవుతుందేమో! ఏది ఏమైతేనేమి—అంతస్తులకతీతంగా తెలుగు ఇంటి శ్రేష్ఠ సంప్రదాయాలను పుణికిపుచ్చుకున్న అమ్మాయిలు నలుచెరగులా ఉంటారన్నది తెలుస్తూనే ఉందిగా కమలవాణి గురించి చెప్తుంటే—


అమ్మానాన్నలు అలా దీర్ఘమైన ఆత్మావలోకనంలో పడిపోవడం చూసి సోమశేఖరం మెల్లగా కదులుతూ నర్సమ్మ వద్దకు వచ్చి ఆమె మోకాళ్లపై చేతులుంచి అడిగాడు ముఖంలో ముఖం పెట్టి చూస్తూ— “నువ్వేమైనా అడగాలా బామ్మా?”


“ఉఁ… ఉందిరా అబ్బీ! బాగా గుర్తుపెట్టుకోరా సోమశేఖరా—మధులిక మేం చూసి నీకు జతకూర్చిన అమ్మాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పిల్లకు కష్టం కలిగించకుండా—కంటతడి పెట్టించకుండా—చూసుకో. లేదనుకో—నేను నేనులా ఉండను. ఇది నిశ్చయం.”


అతడలాగే అంటూ సమాధానమిస్తూ కదిలాడు.

అప్పుడు ఇంద్రకిరణ్ అన్నయ్యను ఆపాడు— “నాదొక చిన్న క్వరీ ఉందిరా అన్నయ్యా! క్లియర్ చేస్తావురా?”


“ఉఁ… అడుగు” అన్నాడతను.


“మరేమీ లేదు గాని—ఒక విషయం మాత్రం నాకు నమ్మశక్యం కాకుండా ఉందిరా అన్నయ్యా! నీదేమో ఆర్ట్స్ బ్రాంచ్—కమలవాణి గారిదేమో సైన్స్ బ్రాంచ్. మీరిద్దరూ కాలేజీ క్యాంపస్‌లో కలుసుకునే అవకాశమే లేదు కదా!”


దానికి సోమశేఖరం చిన్నగా నవ్వి బదులిచ్చాడు— “ఇంటర్‌లో మేమిద్దరమూ ఒకే కాలేజీలోనే కలిసి చదువుకున్నాం. అప్పుడటువంటి పరిచయాలు ఏర్పడటం సహజమే కదరా!”


అని చెప్పడం పూర్తి చేసి మేడ మెట్ల వైపు కదులుతూ మధులిక వైపు చూసి అన్నాడు సోమశేఖరం— “మరి మనం వెళ్దామా మధూ!”


ఆమె కదల్లేదు. అటు భర్త వైపు తిరిగి చూపు కూడా సారించలేదు. అతడు కాసేపు ఆగి ఒంటరిగా మేడ మెట్ల వైపు సాగిపోయాడు.


===============================================

                                                ఇంకా వుంది

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page