top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Udayaraga Udvegalu - Part 5 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 16/12/2025 

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ:

డిపార్టుమెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్ లో ఉంటాడు మధుమురళి. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్ళికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. భార్యాభర్తలు సమానులేనన్న భర్త మాటలకు ఇంప్రెస్స్ అవుతుంది నవ వధువు శివగామి. 


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్ళి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. 


ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 5 చదవండి.


కారు దిగి యింట్లోపలకు వచ్చి బూట్సు విప్పి చుట్టూ పరకాయించి చూసాడు సోమశేఖరం.. ఇల్లు ఖాళీగా ఉన్నట్లనిపించింది. మోడ్రన్ పాటల మ్యూజిక్ సిస్టమ్ పెట్టి విచ్చలవిడిగా స్టెప్పులు వేస్తూ తిరిగే ఇంద్రకిరణ్ కూడా కనిపించలేదు. కనీసం పవావిడ కాంతమ్మ కూడా కనిపించదేం? ఆ సమయాన యింట్లో అమ్మానాన్నల జాడ లేదంటే అతడు ఊహించుకోగలడు; యెక్కడో యాగమో పూజో జరుగు తుందంటే అక్కడకి వెళ్ళుంటారు. వీలుకాదని గింజుకున్నా విడవకుండా తల్లి తండ్రిని లాక్కుపో యుంటుంది. 

మరి మధులిక కేమైంది- ఆడుగుల జాడే వినిపించదేం? అప్పుడు అతడికి వెనుకనుంచి గాజుల గలగలలు వినిపించాయి. అతడికి చప్పున ఓ కవిగారి పద ప్రయోగం గుర్తుకి వచ్చింది- ‘నీ చేతి గాజులు నాకు సంకెళ్ళు కావా!’ 


అతడు మోహ పూరిత ఆవేశంతో తల తిప్పాడు. కమ్మని మధులిక సంగీతమయ స్వరం- “మీకోసమే యెదురు చూస్తున్నాను. ఇదిగో— కాఫీ తాగండి” అని కాఫీ కప్పు అందిచ్చి యెదుట వచ్చి నిల్చుంది. 


కళకళలాడు పచ్చటి పూల మొక్కలా తాజా చామంతిలా నిగనిగలాడుతూన్న భార్యను కన్నార్పకుండా చూసి “కాఫీ యిప్పుడొద్దు. నీళ్ళు పోసుకుని వస్తాను, అప్పుడు తీసుకుంటాను” అని లేవ బోయాడు సోమశేఖర్. 


ఆమె వదల్లేదు. భుజాలు రెండూ నొక్కి కూర్చోబెట్టింది- “వీల్లేదు. ఇప్పుడిది తాగండి. మీతో పనుంది. అందుకే కాంతమ్మను కూడా పంపించేసాను” 


అతడిక మాట్లాడ కుండా కాఫీ తాగి లేచి నిల్చుని మధులికను దగ్గరకు లాక్కోబోయాడు. 


ఆమె దూరంగా తొలగి “అదంతా తరవాత— ముందు నాతో యిలా రండి. ” అని వరండా వేపున్న గదికి తీసుకెళ్ళింది. సోమశేఖరం అయోమయంగా చూస్తూ అనుసరించాడు. 


“హుఁ! ఇప్పుడు నాతో కలసి స్టెప్స్ వేయండి. ఎడాపెడా కాకుండా లయబద్ధంగా వేయండి. ” అని అతడి నడుంపైన చేతులు వేసింది. అతడామెతో బాటు రెండడుగులు కదలి ఆగిపో యాడు. “ఇదేమిటి డాన్య్ హాలా! లేక నర్తనశాలా! అసలిది గెంతులు వేస్తూ డాన్స్ చేసే సమయమా! ” అదోలా ముఖం పెట్టి అన్నాడతను. 


ఆమె పదునుగా స్పందించింది- “రాసలీల వేళ రాయబారాలెందుకోయ్? మీరు మనసు పెట్టడం లేదు. అందుకే మీకు మ్యూజికల్ స్టెప్స్ కుదరడం లేదు. జస్ట్ ట్రై! ” 


“చూడు మధులికా- నాకు డ్యాన్స్ రాదని, అందులో నాకంతగా ఆసక్తి కూడా లేదని నీకు ముందే చెప్పాను. అసలు నువ్వు నృత్య కళాకారిణివని పెళ్ళి చూపులనాడు నువ్వు నాకు చెప్పనే లేదు”


ఆ మాటకామె గోముగా నవ్వి అంది- “యు ఆర్ రైట్ నా సుందర ప్రియా! నేనెందుకు చెప్పలేదంటే నేను నిజంగానే శిక్షణ పొందిన నృత్య కళాకారిణి కాను కాబట్టి. కాని నృత్యమంటే చిన్నప్పట్నించీ యిష్టం. నా యిష్టాన్ని సొగసుగాడైన నా అందాల మొగుడి ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాను. తప్పా? నా ఆశల ఊపిరిని నాతో కలసి పంచుకోమంటున్నాను. అది కూడా తప్పా! ” 


అతడీసారి ముఖం సాగదీసి అన్నాడు- “నాకు రాదే! రానిదాని కోసం ప్రయత్ని స్తే కాళ్లూ చేతులూ వంకర్లుపోతాయి. సరేనా!” 

ఆమె తగ్గలేదు. “నోరార అడిగినప్పుడు మనసారా పూనుకుంటే యెటువంటి అవాంతరమూ అడ్డురాదు. ఇక పాయింటుకి వస్తే-- అప్పుడు తీరకుండా మిగిలిపోయినవి కొన్ని కోరికలు— ఇప్పుడు అప్పటి అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవడానికి డాన్స్ స్టెప్పులు యిప్పుడు నేర్చుకోమంటున్నాను. నా అడుగులో అడుగు వేయమంటు న్నాను. ఇప్పుడు లాస్ట్ పాయింటుకి వస్తున్నాను. నాకు తెలియనివి, నాకేమాత్రమూ అలవాటు లేనివి మీకోసం చేయడం లేదూ! ” 


అతడు కళ్ళు పెద్దవి చేసుకుని దీర్ఘంగా చూసాడు. “నాకోసం నువ్వేమి చేస్తున్నావని! ” 


“నాకు కంప్యూటర్ సిస్టమ్ గురించే కాక- హార్డ్ వేర్ గురించి కూడా ప్రవేశం ఉండేలా నేర్చుకొమ్మని చెప్పలేదూ! చెప్పడమే కాక— కంపెనీ కాన్ఫిడెన్షియల్ డేటా— అందరితోనూ పంచుకోలేనూ-- అని నాతో టెండరింగ్ విషయాలను అప్టేట్ చేయించుకోలేదూ? 


ఆ పని పూర్తి చేయడానికి వంటావార్పూ మాని మీతో గంటల తరబడి గడపలేదూ! ఒకటి రెండుసార్లు మీతో వేళాపాలా లేకుండా గడుపుతున్నానని అత్తయ్య వద్ద చీవాట్లు తినలేదూ! అదంతా మీ తృప్తి కోసమేగా చేస్తున్నాను. నాకోసం మీరిది చేయలేరా!” 


సోమశేఖరం కళ్ళు మిటకరించి చూస్తూ అడిగాడు-“సరే! ఈవిషయంలో యు- స్కోర్డు బ్రౌనీ పాయింట్సు. నన్నిప్పుడేమి చేయమంటావు? ” 


“అదిగో— నేను ముందే చెప్పలేదూ! మీరు మనసు పెట్టి డాన్స్ చేయడం లేదని. ఇప్పుడు చూడండి. నా చేతులెక్కడున్నాయో— మీ చేతులెక్కడున్నాయో! నావి మీ నడుం చుట్టూ ఉన్నాయి. మీవేమో యెక్కడో గాలిలో తేలుతున్నట్టున్నాయి. స్వంత పెళ్ళాం నడుంపైన చేతులు వేయడానికి మీకెందుకండీ అంతటి మొహమాటం?” 


“అబ్బ! నువ్వు మరీనోయే! అందంగా వయ్యారంగా ఊగే నీ బిగువైన నడుంపైన చేతులు వేయడానకి నాకెందుకోయ్ సంకోచం? నీతో కలసి స్టెప్స్ కుదురుగా వేయడానికి ప్రయత్నించేటప్పుడు— ఉందా లేదా అన్నట్టున్న నీ సన్నని నడుం కళ్ళకు కనిపించలేదు. నధింగ్ మోర్— నథింగ్ లెస్!”


 “అప్పుడామె అతడి ముఖాన్ని తన రెండు చేతుల్లోకీ తీసుకుని అడిగింది- “నిజం చెప్పండి— నా నడుం యెక్కడుందో మీకు తెలియదు కదూ! ”


సోమశేఖరం ఖంగుతిన్నట్టు చూసాడు. అబ్బో— తన ముద్దుల పెళ్ళాం రంగుల రాట్నంలా ఉందే- అనుకుంటూ అన్నాడు- “నేను ముందే చెప్పాను కదా— నీతో సమానంగా స్టెప్స్ వేసేటప్పుడు తడబడ్తుంటానని- పట్టుతప్పిపోతుంటానని! ఇప్పుడు ఆరంభియ్యి. దంపుడు బియ్యం పాటలా దంచేస్తాను” అని షర్ట్ మోచేతుల్ని మడచుకున్నాడు సోమశేఖరం. 


అప్పుడామె మోహనకరంగా నవ్వుతూ అడిగింది- “ఆర్ యు షుయర్ నా అందాల మన్మథా! ”


ఉఁ అంటూ మధులిక నడుంపై న చేతులు పోనిచ్చాడతను. ఆమె వయ్యారంగా ఊగుతూ కదిలే మేఘంలా జోగుతూ ఆరంభించింది- “సెంచరీలు కొట్టే వయస్సు మాది! బౌండరీలు దాటే మనస్సు మాదీ—” అని రిథమిటిక్ గా పాట సాగించేలోపల హాలులో రింగు రింగున డోర్ బెల్ మ్రోగింది. దానితో ఆమె నాట్యం ఆపుచేసి హాలు వేపు అడుగులు వేసింది. సోమశేఖరం ఓపలేక పోయాడు. ఆమెను రివ్వున వెళ్ళి రెండు చేతుల్లోకి తీసుకుని విల్లులా వంచి గాఢంగా పెదవుల్లో పెదవులు కలిపి ముద్దు పెట్టుకున్నాడు. 


ఆమె విడిపించుకోవటానికి ప్రయత్నించకుండానే విసుగ్గా ముఖం తిప్పుకుంటూ అంది- “ఇప్పుడొద్దన్నానా! రాత్రిపూట గాలి నిశ్శబ్దంగా వీస్తున్నప్పుడే దానికి మాధుర్యం ఉంటుంది, ఎప్పుడు బడితే అప్పుడు కాదు” అని త్వరగా అడుగులు వేసుకుంటూ హాలులోకి వెళ్ళి తలుపు తెరిచింది మధులిక.


ఉమాదేవి అదోలా ముఖం పెట్టి అంది-“తలుపు తీయడానికింత ఆలస్యమా! ” 


మధులిక నసుగుతూ బదులిచ్చింది- “మరేం లేదు అత్తయ్యా! లోపల కొంచెం పనుంటేను—” 

ఈసారి యింద్రకిరణ్ చట్టున అందుకున్నాడు- “ఇప్పుడేం పని వదినా! ” 


ఆమె నవ్వి- “ఇంకే ముంటుంది- మీ అన్నయ్యతోనే! ” అని మనసులో అనుకుంటూ మరది చెవి పట్టుకుని లాగి “ఆడాళ్ళకు బోలెడు పనులుంటాయి. అవన్నీ నీకు చెప్పాలా యేం! చెప్తే మాత్రం నీకు అర్థమవు తుందా యేమిటి? ” అని అత్తగారి చేతినుండి పూజా ద్రవ్యాలు అందుకుని కళ్ల కద్దుకుంది. 


ఇంద్రకిరణ్ ఊరుకునేటట్టు లేడు. “అది కాదు వదినా! లోపల యేదో డ్యూయెట్ సాంగ్ విన్నట్లనిపించింది. అది నాకిష్ట మైన సాంగ్—” 


ఈసారి సదానందం చిన్నకొడుకుని మెత్తగా మందలించాడు- “అదేం కౌంటర్ ప్రశ్నరా! లోపల పనులుంటాయంటే ఉంటాయన్న మాటే! మళ్ళీ మరొక క్వరీ దేనికి రా“”


మధులిక గట్టిగా నవ్వేస్తూ మరది నెత్తిపైన మొట్టికాయ పెట్టింది- “రుబ్బ రోలు” అంటూ—


ఇంట్లోపలకు వచ్చి ఫ్యాను వేసి ఉమాదేవి అడిగింది- సోమశేఖరం ఇంకా యింటికి రాలేదానని. 


“మీ అబ్బాయి వచ్చేసాడు అత్తయ్యా! లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు” 

కోడలి బదులు విని భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంద్రకిరణ్ లోపల్నించి యేదో డ్యూయెట్ పాట విన్నట్టు చెప్పడంలో వాస్తవం ఉందేమో! మధులికకు ఫాస్ట్ ట్రేక్ తో సాగే తెలుగు పాటలంటే యిష్టమని వాళ్ళకు తెలుసు. టీవీలో పడీపడీ చూస్తుంటుంది. ఇప్పటి యువతీ యువకుల మూడ్ ప్రకారం అది సహజమే--


ఇప్పుడు వాళ్ళముందున్నది పాట పాడటం కాదు, పాట పాడుతూనే కోడలు మాత్రమే డ్యాన్స్ చేసిందా లేక సోమశేఖరాన్ని కూడా తనతో కలిపి స్టెప్స్ వేయించిందా! ఇది తెలిసే గావాలి ఇంద్రకిరణ్ పదేపదే తను డ్యూయెట్ సాంగ్ విన్నట్టు ప్రస్తావించ సాగాడు. ఏది యేమైతేనేమి? మొగుడూపెళ్ళాల మధ్య యెన్నో ఉంటాయి- యెవేవో జరుతుంటాయి. తామెందుకు వాటికోసం బుర్రపాడు చేసుకోవాలి. 


 మరునాడు శనివారం కాబట్టి- అత్తయ్యా కోడలూ పూజా పునస్కారాలలో ముఖ్యంగా శనిదేవుడి అనుగ్రహం కోసం నువ్వుల నూనె నల్ల వస్త్రాలు గట్రా సమర్పించి పలుమార్లు ప్రదిక్షిణలు చేస్తూ బహు రద్దీగా ఉంటారు. బహు పకడ్బందీగా పారాయణం చేస్తారు. ఆ తరవాత విస్తారంగా శివార్చన చేస్తారు. కాని— ఆ రోజు పూజలు త్వరగా ముగించినట్టున్నారు. హాలులో సంభాషణ గట్టిగా వినిపించి సోమశేఖరం గబగబా మెట్లు దిగాడు యేమై ఉంటుందానని. మధులిక సన్నగా నవ్వుతూ అత్తయ్య ప్రక్కన నిల్చుంది. వాళ్ళకు దగ్గరగా బిత్తర చూపులతో చూస్తూ నిల్చున్నాడు ఇంద్రకిరణ్. 

అప్పుడు సదానందం తల అడ్డంగా ఆడిస్తూ అంటున్నాడు- “నువ్వేదో యెక్కడో విని యేదో విని చిన్నటి విషయాన్ని కొండంతలు చేసుకుని సీరియస్ గా తీసుకుంటున్నా వేమో!” 


ఉమాదేవి వెంటనే రిటార్ట్ చేసింది- “ఏది చిన్న విషయమండీ! మొక్కై వంగనిది మ్రానై వంగదని మీకు తెలియదా!” 


అక్కడి కోపతాపాల వాతావరణం గమనించి శేఖరం తల్లికి దగ్గరగా వచ్చి విషయం యేమిటని అడిగాడు. 


“అదేమిట్రా అంత నిదానంగా అడుగుతావు! సౌమ్యత యెక్కడ చూపించాలో యెక్కడ నొక్కి వక్కాణించాలో తెలుసుకోవదట్రా? ” 


అప్పుడు సోమశేఖరం స్పందించాడు--

“విషయం తెలిస్తే కదమ్మా యెలా రియాక్ట్ కావాలో తెలుస్తుంది” అని తండ్రి వేపు తిరిగాడు- “మీరు చెప్పండి నాన్నగారూ— ఏమి జరిగిందో! ” అంటూ- 


దానికి ఉమాదేవి గట్టి గొంతుతో బదులిచ్చింది. “ఇంకేం చెప్పేదిరా! ఎక్కడో యెవరో లేడీ లెక్చరరట- మీ అమ్మకు తెలుసట. ఆమెగారు చెప్పారట- వీడు తోటి కాలేజీ మేట్సుతో కలసి అమ్మాయిల వెంట పడుతున్నాడట. ఎగతాళి పట్టిస్తున్నాడట. వెటకారపు పాటలు పాడుతూ వంకర టింకరగా మోకింగ్ చేస్తూ కాలేజీ అమ్మాయిల్ని యేడ్పిపిస్తున్నాడట” 

ఆ మాట విన్నంతనే సోమశేఖరం ఉన్నపాటున నవ్వేసాడు. “వీడా! వీడికంతటి సీనా! ఇప్పటి అమ్మాయిలు డేషింగ్ టైప్. కొందరు స్మేషింగ్ టైప్ కూడాను. వాళ్ళను టీజ్ చేయడానికి ధైర్యం కావాలమ్మా! ఇంద్ర కిరణ్ మన మధ్య తచ్చాడుతూ కొంటె పనులు చేస్తుంటాడు గాని— అంత దూరం వెళ్ళలేడమ్మా!” 


పెద్ద కొడుకు మాటలకు ఉమాదేవి కోపంగా చూస్తూ లేచింది. “ఒరేయ్ శేఖరా! ఇంటివాడివయావని చూస్తున్నాను గాని- నిన్ను చాచి లెంపకాయ కొడ్తాను. అప్పుడు, నేను విన్నదంతా అబద్ధమా? ” 


ఈసారి సదానందం కలుగచేసుకున్నాడు- “ముందు నువ్వు ఆవేశం తగ్గించుకుంటావా ఉమా! పరిసరాలను పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే సమస్యకున్న పిలక చేతికందదు. మొదట కుర్రకాయల వయసు గమనించు. దూకుడు మోసుకు వచ్చే వేడి వయసు. పొద్దుపోక పోతే— కాలేజీ అమ్మాయిల్నే కాదు— అప్పుడప్పుడు లెక్చరర్లను సహితం విడిచి పెట్టరు. మరొక సైకలాజికల్ ఫ్యాక్టర్ చెప్తాను. విన్నవెంటనే కస్సుమని లేవకు. బయటకు చెప్పుకుని తేలిపోరు గాని— లోలోన వాళ్ళకు- అంటే అమ్మాయిలకు సహితం అబ్బాయిలు తమ వెంటబడి యెగతాళి పట్టించడం యిష్టం. అది వాళ్ళ ఉనికికి— ముఖ్యంగా వాళ్ళ యవ్వన ప్రాయానికి ఓ విధమైన గుర్తింపు” 


ఉమాదేవి ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది- 

“అదేమిటి—అంతలావు కళ్ళు పెద్దవి చేసుకుని చేస్తున్నావు?” సీరియస్ ముఖంతో అడిగాడతను. 


ఆమె ఆశ్చర్యంగా చూస్తూనే అంది-- “మీరా యిలా మాట్లాడుతున్నారు! కాలేజీలో అమ్మాయిల్ని యెగతాళి పట్టించడం మాట అటుంచి- అమ్మాయిల వేపు తిరిగి కూడా చూడకుండా మీ మానాన మీరు వెళ్ళిపోతుంటారట. స్త్రీల పట్ల మీరు కనబర్చే మర్యాద గురించి వినే నేను పెళ్ళి చూపులనాడు వెంటనే ఔనన్నాను” 


“ నా తలకాయ! మర్యాదా కాదు భక్తీ కాదు. అప్పటి మా కుటుంబ పరిస్థితుల వల్ల నాకా వెసులుబాటు లేదు. అమ్మాయిలతో మాటలు కలిపే ప్రసక్తే లేదు. త్వరగా గ్రాడ్యుయేషన్ ముగించి ఉద్యోగం సంపాదించాలన్న ఉద్వేగపు ఆరాటంలో ఉండేవాణ్ణి” 


“ఇప్పుడు బాగా గుర్తుకొస్తూంది ఓ సినిమాలోని మూలకథ” ఉమాదేవి కొనసాగించింది. 


అదేమిటన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు సదానందం. “ఒకతనికి స్త్రీలంటే మహా కోపం. ఎందుకంటే— ఒకావిడ అతణ్ణి దగా చేసి నిలువునా ముంచేసి వెళ్ళిపోతుంది. దానితో అతను దాదాపు శాడిస్టుగా తయారవుతాడు. స్త్రీల పట్ల ద్వేషం పెంచుకుంటాడు. ఎంతగా అంటే— ఒక అబ్బాయిని దత్తు చేసుకుని వాణ్ణి కూడా స్త్రీ ద్వేషిగా మారుస్తాడు. అమ్మాయిల్ని ఆ కుర్రాడి ద్వారా యిబ్బంది పెట్టించి అతను పైశాచికానందం అనుభస్తుంటాడు. 

అదేవిధంగా— మీ చిన్నబ్బాయి అమ్మాయిల్ని---”


సోమశేఖరం యిక ఓపలేకపోయాడు- సర్రున లేచాడు తండ్రికి వత్తాసుగా నిలుస్తూ--“అమ్మా! ఇక నీ భయానక ఊహాగానాన్ని ఆపుతావా? ఇప్పటి రోజుల గురించి తెలుసుకోకుండా నలువైపులా చెలరేగే డేషింగ్ వాతావరణం గురించి తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నావమ్మా! 


అబ్బాయిలు మాత్రమే అమ్మాయిల్ని టీజ్ చేయడం నీకు తెలుసు. కొందరమ్మాయిలు కూడా అబ్బాయిల పట్ల అదే విధంగా టీజింగ్ గా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు యెగతాళి పట్టించడం ఒన్ వే ట్రాఫిక్ కాదు. ఇక లాస్ట్ పాయింటుకి వస్తున్నాను. బాగా వినమ్మా! ఇప్పుడు ఇంద్రకిరణ్ చెట్టాపట్టాలేసుకుని తిరిగే కుర్రాళ్లెవరు? కొందరు వాడితో హైస్కూలులో చదివిన వారు. మరికొందరేమో— ఇంటర్ లో వాడితో కలసి చదివిన వారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇంద్రకిరణ్ కాలేజీ మేట్సు – వాళ్ళందరిదీ ఒక జట్టు. ‘


ఇంద్రకిరణ్ కి యిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో కలిసే ఉండాలి. కొంత వరకు వాళ్ళతో కలిసే మెసలాలి. సర్దుకు పోవాలి. లేకపోతే ఒంటరివాడవుతాడు. కలివిడిగా ఉండకపోతే వాడి కాలేజీ లైఫ్ యమ బోర్ గా తయారవుతుంది. ఒంటరితనానికి మారు పేరవుతుంది. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలనమ్మా! . ఇంద్రకిరణ్ అందరిలా కాడు. కష్టపడి చదువుతాడు. మంచి గ్రేడేషన్ తెచ్చుకుంటాడు. నువ్వు ఊహించుకున్నట్టు, అన్నింట్లోనూ వాళ్ళతో పాలలో నీళ్ళలా కలసిపోడు. అవసరమైనప్పుడల్లా కాస్తంత సోషియల్ డిస్టాన్స్ పాటిస్తాడు. ఇది చాలా! నేనిక ఆఫీసుకి వెళ్ళాలి” అంటూ వెనుతిరిగాడు సోమశేఖరం. 


అప్పుడు ఇంద్రకిరణ్ పిలిచాడు. 


“చెప్పరా! ” అని ఆగాడు-


“థేంక్స్ రా అన్నయ్యా! బాబు మాటా నీ మాటా నేను తప్పకుండా కాపాడుతానురా! ఐ-ప్రామిస్“”


ఎప్పుడూ ఆకతాయి వేషాలు వేస్తూ తిరిగే తమ్ముడు అలా యెమోషనల్ అవడం చూసి శేఖరం నవ్వకుండా ఉండలేకపోయాడు. మధులిక కూడా నవ్వేసింది. సదానందం భార్య చుట్టూ చేతులు వేసి పైకి నడిపించాడు. అప్పుడు వెనుకనుంచి ఇంద్రకిరణ్ గొంతు విని ఆగాడు “సారీ బాబూ! నాగురించి యెవరో మేడమ్ యేదో చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నారు.” 


అతడు వెనుదిరిగి చిన్నకొడుకు వేపు చూసాడు అదోలా ముఖం పెట్టి. “ఇక నీ యెమోషనల్ ఫీలింగ్స్ కట్టిపెట్టరా అగ్గిపిడుగా! ఒకేసారి ఎదిగిపోయి పెద్దవాడివయిపోకు— ఎప్పటిలాగే చిలిపి చేష్టలు చేస్తూ, దొరికినవన్నీ యెడాపెడా స్వాహాచేస్తూ— మీ అమ్మా బామ్మల చుట్టూ తిరుగుతుండు. మీ వదినెకు యెస్కార్టుగా ఉండు. నౌ యుకెన్ మూవ్—“”


ఇంద్రకిరణ్ కదల్లేదు. వేగంగా వెళ్ళి అమ్మానాన్నలిద్దరినీ వాటేసుకున్నాడు. 


===============================================

                                                ఇంకా వుంది

                                    ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 త్వరలో

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree



 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page