ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3
- Pandranki Subramani
- 2 days ago
- 6 min read
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 3 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 04/12/2025
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ:
డిపార్టుమెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్ లో ఉంటాడు మధుమురళి. తండ్రి కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్ళికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – ధారావాహిక మూడవ భాగం చదవండి.
మరుసటి రోజు పెళ్ళి జరిగేటప్పటికి మండపంలో చాలా వరకు సందడి తగ్గింది. పెళ్ళి మండపంలో పురోహితులిద్దరూ కొందరు దగ్గరి బంధువులూ తప్ప ఎక్కువ మంది ఆహ్వానితులు లేరు. మంగళ మంత్రోఛ్ఛరణల మధ్య బాజా భజంత్రీల సవ్వళ్ళు మధ్య మధుమురళి శివగామి మెడన మూడు ముళ్ళూ వేసాడు. ధనమ్మాళ్ భర్తతో కలసి ఆనంద భాష్పాలు రాల్చింది. కూతుర్ని అక్కున చేర్చుకుని తమిళంలో అంది-“నువ్వు అదృష్టవంతురాలివే శివగామీ! నువ్వు మీ అంకుళ్ గారింటికి కోడలు పిల్లగా వెళ్ళబోతున్నావు. ఇక్కడలాగే అక్కడ కూడా ఉండబోతున్నావు”
ఆమె యేమీ అనలేదు. మాటా పలుకూ లేకుండా కను సన్నల ఓరనుంచి మురళినే గమనిస్తూంది. ఇంతవరకూ అతను ఒక్కసారి కూడా ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూసిట్టు శివగామికి గుర్తు రావడం లేదు. తన పైనా తన కుటుంబం పైనా కోపంతో ఉన్నాడేమో! కేవలం సగం మనసుతో అంకుళ్ గారి ఒత్తిడితో పుస్తె కట్టడానికి ఒప్పుకున్నాడేమో! ఏమో--ఎందుకో యేమిటి--అదే నిజమై ఉంటుంది. చిత్తూరులో చిన్నప్పుడెప్పుడో మధుమురళిని చూసినట్టు లీలగా గుర్తు. ఇప్పుడు బాగా యెదిగి పోయాడు. రూపంలోనూ ముఖ భావంలోనూ గుర్తుకందని విధంగా మారిపోయాడు.
అతి క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. అదీను దీనదయాళన్ అంకుళ్ గారితో మాత్రమే-- ఒక వేళ తమిళం సరిగ్గా తెలియకనేమో-- చుట్టుప్రక్కల వాళ్ళ స్పందన గ్రహింప జాలక అలా ముభావంగా ఉంటున్నాడేమో— అతడి సంగతి అటుంచి, రేపు రామాపురంలోని మెట్టింటికి వెళ్ళిన తరవాత తన పరిస్థితి కూడా అంతేకదూ! ఇక్కడ కాంచీపురంలో అస్సలు తెలుగు వారు లేక కాదు. కాని— యిక్కడి తెలుగు వేరు- అక్కడి ఆంద్రా తెలుగు వేరు. ఇక్కడి తెలుగు పదాల మాటున మాటిమాటికీ తమిళ పదాలే దొర్లుతుంటాయి.. మాట్లాడే ఆ కొద్దిపాటి తెలుగు కూడా తమిళ యాసతో ఉంటుంది.
తను తెలుగు నేర్చుకోవాలంటే మధు మురళితో మనసు విప్పి మాట్లాడాలంటే-- ముఖ్యంగా అత్తవారింటికి ముఖ్యంగా ఆడపడుచులకు దగ్గర కావాలంటే తను తెలుగుని ఆనా అవ్వన్నాలతో ఆరంభించాలేమో! ఆమె ఉన్నపాటున కళ్ళ మూసుకుని హృద్యంగా మొక్కుకుంది- “అమ్మా కామాక్షి తాయే! నువ్వే నన్ను ఆదుకోవాలి తాయే! మా కుటుంబ గౌరవం కాపాడాలి. ఇకపైన తనకు యెదురు కాబోయేది నది అల వంటి జీవితం కాదు. అడు గడుగునా పోటెత్తే సముద్ర తరంగం. సుడి గుండం.”
అప్పుడు యిద్దరక్కయ్యల గొంతు వినిపించి కనురెప్పలు తెరచి చూసింది. ఇద్దరూ కైమోడ్పుతో అంటున్నారు- “రొంబ థేంక్స్ మాప్పిళే- మీరు మా కుటుంబ గౌరవం కాపాడారు. కుటుంబ గౌరవాన్ని దరి చేర్చారు. రొంబ నన్రి--”
టీ తాగుతున్నవాడల్లా లేచి నిల్చున్నాడు మురళి. ”రొంబ థేంక్సని పెద్ద పెద్ద మాటలు ఉపయోగించ కండి మేడమ్! మీకు తెలుసుగా మీ నాన్నా మానాన్నా క్లోజ్ ఫ్రెండ్సని. ఆత్మీయ సహోద్యోగులని. వాళ్ళ ద్వారానే మా పెళ్ళి సంబంధం యేర్పడింది. ఇందులో ఒకరికొకరు థేంక్సు చెప్పుకోవడానికేముంది? ఇప్పుడందరమూ ఒక్కటైపోయాంగా--”
వెంటనే స్పందించకుండా కాసేపాగి పెద్దక్క వేదనాయగి లోగొంతుకతో అడిగింది-“తంగై పిడిచ్చిరికా! ”(చెల్లి నచ్చిందా) దానికతడు ఆంగ్లంలో అడిగి తెలుసుకుని బదులిచ్చాడు. “మా నాన్నగారికి నచ్చితే నాకు నచినట్లే కదండీ! మీ చెల్లినే కాదు— మరింకెవరిని చేసుకోవాలనుకున్నా నాన్నగారికి నచ్చితేనే— మిగతాది. ఇందులో మీకు సందేహం అవసరం లేదు”
అతడి జవాబు విని ఇద్దరక్కయ్యల ముఖాన నవ్వు చిందలేదు. కళ్ళల్లో కాంతి కానరాలేదు. ఈసారి శివగామి చిన్నక్కయ్య షన్బుగవళ్ళి అందుకుంది- “రేపు చెన్నై వెళ్లి అక్కణ్ణించి ఢిల్లీ వెళ్ళిపోతారు కదూ! ”
ఉఁ అని తలూపాడు మురళి.
“రేపు ఉదయం మనమందరమూ మొదట కామాక్షి అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఆ తరవాత ప్రక్కనే ఉన్న మహంకాళి అమ్మన్ కోవెలకి వెళతాం. ఇక్కడ కొత్త వధూవరులకు ప్రత్యేక దర్శనం- అర్చన ఉంది. పంచె కట్టుకుని సిధ్ధంగా ఉంటారు కదూ! ” అని ఇద్దరూ వెనక్కితిరిగి మూడడుగులు వేసి చూసేటప్పటికి శివగామి టీ కప్పుతో వచ్చి మధు మురళికి అందిస్తూంది.
“నేనిప్పుడిప్పుడే టీ తీసుకున్నానోయ్! మళ్ళీనా-” అని ఆంగ్లంలో చెప్పాడతను.
ఆమె కూడా ఆంగ్లంలోనే స్పందించింది- “లేదు. మీరు తాగలేదు. మీరు తాగేటప్పుడు మా యిద్దరక్కయ్యలూ వచ్చి మిమ్మల్ని మాటల్లో దించి మిమ్మల్ని టీ తాగకుండా చేసారు. బాగా చల్లబడిపోయిన టీని తాగుంటారు. ప్లీజ్! తీసుకోండి”
అతడు మరు పలుకు లేకుండా టీ కప్పు తీసుకున్నాడు. శివగామి ముఖంలోకి నిదానంగా చూసాడు, “రియల్లీ ఎ సెన్సిటివ్ ఉమెన్! ” అని మనసు ఓరన అనుకున్నాడు.
మరునాడు ఉదయాన కుటుంబ సభ్యులందరితో బాటు శివగామి బావలిద్దరూ యిరుగు పొరుగున దగ్గరితనం గల మరి కొందరూ కలసి రెండు టాక్సీలు మాట్లాడుకుని కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళారు. ఇక్కడి తమిళమ్మాయిలు బావల్నీ మాఁవగారినీ సమంగా మామా అని పిలవడం గమనించాడు మురళి. అక్కడ తెలుగు ప్రాంతాన భర్తనూ అక్క భర్తనూ వరస కలిపి బావా అనే సంబోధిస్తారు. ఇదంతా ఇక్కడి వాళ్ళకు ముఖ్యంగా శివగామికి యివన్నీ విడమర్చి చెప్పడానికి సమయం పడ్తుంది కాబట్టి మురళి అదేమీ కదపకుండా ఊరకుండి పోయాడు.
గుడి అంతా చుట్టూరా పలు ఉపాలయాలతో విశాలమైన రాజ దర్బారులాగుంది అప్పటి పల్లవ రాజులూ చాళుక్యులూ దక్షిణ భారతం చుట్టూ యిటువంటివే చాలా గుళ్ళే కట్టి ఉంటారు. సామాజిక పరమైన ఆర్థిక పరమైన గొడవలూ ఘర్షణలూ రేగినప్పుడల్లా ఊరిపెద్దలు ఆలయ ప్రాంగణంలో కూర్చునే మూల విరాట్టుకి అర్చన చేసి దైవ నామాన్ని ఉఛ్ఛరించి తీర్పులిచ్చే వారట. ఊరి పెద్దల యెన్నికలు కూడా గుడి ప్రాంగణంలోనే జరిగేవట. అప్పటి కాలంలో గుడికున్న ప్రాముఖ్యత గుడికి సంతరించుకున్న పవిత్రత అటువంటిది మరి---
పూజా పునస్కారాలు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలూ పూర్తయిన తరవాత అందరూ మహంకాళి గుడికి చేరుకున్నారు. ఇక్కడ మధు మురళి యెదురు చూడనిది మరొకటి జరిగింది. అక్కడ తెలుగు ప్రాంతాన కూడా దైవభక్తి ఆధ్యాత్మిక చింతనా తక్కువేమీ కాదు. కాని యిక్కడ యెదురైన అనుభవం అతడికి కొత్తగా వింతగా తోచింది. ప్రధానార్ఛకుడు వాళ్ళ మధ్యకు వచ్చి పూలమాలలు యిచ్చి తమిళంలో ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు త్యాగరాజు కొడుక్కి చెప్పాడు, శివగామికి పూలదండ వేయమని.
మురళి అలాగే చేసాడు. బదులుగా శివగామి కూడా అతడి మెడన ముంగాళ్ళపై లేచి దండ వేసింది. దానితో అది- అంతేననుకున్నాడతను. కాదు— శివగామిని చేతుల్లోకి యెత్తుకోమన్నాడు.
ఏమి చేయాలో తోచక మురళి పెళ్ళి కూతురుని పైకి యెత్తుకున్నాడు. శివగామి అక్కయ్యలిద్దర్నీ అదే విధంగా బావలిద్దరూ పైకి యెత్తుకున్నారు. ఊపిరి బిగబట్టి భార్యల బరువు మోస్తూ ప్రదక్షిణ చేయసాగారు. తన వంతు తనేమి చేయాలో మధుమురళికి తెలిసొచ్చింది. అతడు కూడా శివగామిని జారవిడవకుండా గట్టిగా పొదవి పట్టుకుని ప్రదక్షిణ చేయనారంభించాడు.
కొద్ది దూరం నడచిన తరవాత శివగామి మురళి కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తూ అపోలజెట్ గా అంది- “సారీ! మీకిదంతా కొత్తగా యిబ్బందికరంగా ఉన్నట్లుంది. ఇక్కడి వాళ్ళకు ఇది ముఖ్యమైన ఆచారం. ప్లీజ్! కొంచెం అడ్జస్ట్ చేసు కోండి”
అతడేమీ అనలేదు. “తప్పుతుందా! ” అన్నట్టు ఓ చూపు విసిరి నవ్వలేక నవ్వటానికి ప్రయత్నించాడు. ప్రేలగంపలో పెళ్ళి కూతుర్ని మేనమామలు యెత్తుకుని వెళ్ళి పెళ్ళి మండపంలో కూర్చోబెట్టడం అతడికి తెలసు. కాని— యిలా ఆలయం చుట్టూ భర్తలు పెళ్ళాలను యెత్తుకుని ప్రదక్షిణం చేయడం అతడెక్కడా చూడలేదు. ఇదే అతడికి మొదటి అనుభవం. ఇంకా యెన్నెన్ని కొత్త అనుభవాలు చవి చూడాలో శ్రీమాన్ త్యాగరాజుగారి కృప వల్ల- ఇదంతా పెద్దల సమక్షాన జరిగిందని యింట్లోవాళ్ళకు చెపితే నమ్ముతారా!
ఏమో- వాళ్ళకిది ముందే అనుభవంలో ఉన్నదేనేమో! ఏ మహానుభావుడు చెప్పాడేమో గాని యెంత మార్దవంగా యెంత గంభీరంగా చెప్పాడు- పెళ్లిళ్లు అక్కడా యిక్కడా కాకుండా స్వర్గలోక వాకిట నిర్ణయించబడతాయని--
------------------------------------------
పూజా పునస్కారాలు, లాంఛన ప్రాయ విధులు ముగిసిన అదే రోజు సాయంత్రం మధు మురళి చెన్నైకి బయలు దేరాడు. అక్కణ్ణించి తిన్నగా ఢిల్లీకి విమానంలో వెళ్ళాలని యేర్పాటు. ఇంటి బయట టాక్సీ వచ్చి ఆగింది. దీనదయాళన్ త్యాగరాజుని ప్రక్కకు తీసుకువెళ్ళా డు. ధనమ్మాళ్ కూడా భర్తను అనుసరించింది.
దీనదయాళన్ మిత్రుడి రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు- “మన చిరకాలపు స్నేహం మాట అటుంచి సంప్రదాయం ప్రకారం అబ్బాయికి చేయాల్సిన వన్నీ మేం చేస్తాం. ఇందులో నీకు యిసుమంత అనుమానమూ అవసరం లేదు. నా తరపున చెల్లెలు గారికి యిదే మాట చెప్పు. ఐ ప్రామిస్! ”
మిత్రుడి మాటలకు త్యాగరాజు ఉన్నపళంగా నవ్వేసాడు. తనకు యిద్దరు వదినెలున్నారు. ఇద్దరిదీ అలవికాని పెద్దరికం. రామకృష్ణాపురంలో భార్య పుష్పవల్లి అక్కయ్య- సరోజమ్మ. అక్కడేమో మాధవపురంలో అన్నయ్య భార్య ఉమాదేవి. ఇద్దరూ చూపులతోనే నిప్పుకణికలు రాల్చగల స్త్రీ మూర్తులు. ఇక్కడ దీనదయాళన్ కి తెలియదు- వాళ్ళక్కడ మధుమురళికి రెండు మూడు సంబంధాలు చూసుంటారని. క్లాస్- వన్ ఆఫీసరు హోదాలో ఉన్న కొడుక్కి పెద్దింటి సంబంధాలు యెందుకు కుదరవూ! మొత్తానికి యిరు వైపులా తన మెదడు పచ్చడవడం ఖాయమేనేమో--
త్యాగరాజు ఉన్నపాటున తల విదిలస్తూ ఆలోచనల్ని ప్రక్కలకు నెట్తూ అన్నాడు- “ఇప్పుడదంతా యెందుకు దీనదయాళా! అబ్బాయిని సాగనంపింతర్వాత నేనిక్కడ మూడ్రోజులుండే కదా వెళ్తాను. ”
సంభాషణ సారాన్ని ధనమ్మాళ్ అర్థం చేసుకున్నట్లుంది. అప్పుడు తమిళంలోనే స్పందించింది- “అది కాదు అన్నా! మేం చేయాల్సింది మేం చేయాలిగా— ఇద్దరమ్మాయిలకూ మునుపు చేసిందేగా! అదేగా మురళి మాప్పిలయకీ చేయబోతున్నాం. కావేరి నదికి దగ్గరగా మాకు కొంత మాగాణి ఉంది. అందులో మూడెకరాలు అబ్బాయి పేర వ్రాసిస్తాం. మాకోసం కాదనకుండా వదినకు చెప్పన్నా!”
త్యాగరాజు ఓసారి ఇద్దరి వేపూ తేరిపార చూసి తలూపుతూ టాక్సీ వేపు కదిలాడు. దీనదయాళన్ అల్లుల్లిద్దరూ మురళి సూటు కేసూ తదితర సామానూ టాక్సీలోపల పెడ్తున్నారు. దానితో బాటు దారిలో తినడానికి అతిరసాలు(అరిసెలు వంటివి) మురుకులూ జంతికలూ పార్సల్ చేసి పెడ్తున్నారు. మురళి అందరికీ నమస్కరించి టాక్సీ వేపు నడిచేటప్పుడు వేదనాయగి అతడి వద్దకు వచ్చి చెప్పింది- “శివగామి మీతో యేదో చెప్పాలంటుంది. ఓసారి అలా యింట్లోకి వెళతారా మాఫ్ఫిలే! ”
అతడేమీ అనకుండా శివగామి వేపు నడిచాడు. ఆమె అక్కడ నిల్చోకుండా యింట్లోపలకు వేగంగా నడచింది. గదిలోపలకు వెళ్ళిన తరవాత అతడడిగాడు ఆంగ్లంలో-- “చెప్పు శివగామీ! ఏమి చెప్పాలి? ఇంత సేపు యింట్లోనేగా ఉన్నాను. అప్పుడు చెప్పొచ్చుగా!”
“ప్లీజ్! కోపగించుకోకండి. అలా అక్కడ నిల్చోండి” అని దేవుడి గదినుండి కుంకుమ తీసుకు వచ్చి అతడి నుదుట పూసి వినమ్రంగా వంగి కాళ్ళకు నమస్కరించింది.
ఉలిక్కి పడుతూ ఆమెను లేవనెత్తి గట్టిగా అన్నాడు- “ఇదేమిటి? శాత వాహనుల కాలం నాటి ఆచారాలు! నువ్వు సోషియల్ స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దానివి. హుందాతనం కాపాడుకోవాలి. తెలిసిందా!”
“సంప్రదాయం సంప్రదాయమే కదండీ! ”
“ఏ సంప్రదాయం? ! పుచ్చిపోయిన పుచ్చకాయల సంప్రదాయమా! నావరకు భార్యాభర్తలిద్దరూ సమానులే— ఇందులో వేరే నిర్వచనకు ఆస్కారం లేనే లేదు” అని బయటకు కదిలాడు.
శివగామి యెక్కడ నిల్చున్నదక్కడే ఉండి అడిగింది- “ఢిల్లీ వెళ్ళి ఫోను చేస్తారా!”
అతడాగకుండానే వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు- “ఇప్పుడా అడుగుతున్నావు! మీ పెద్దక్కయ్యనడిగి నేనెప్పుడో నీ ఫోను నెంబర్ నా ముబైల్ డేటాలో లింక్ చేసుకున్నాను”.
అది విని శివగామి పొంగే మనసుని ఆపుకోలేకపోయింది. పక్కున నవ్వేసింది. మురళిని సాగనంపటానికి టాక్సీ చుట్టూ నిల్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసారు. అక్కయ్యలిద్దరూ ముసి ముసినవ్వులతో చెల్లి వేపు కొంటెచూపులతో చూసారు- “తెలిసిందిలే! మాకు తెలిసిందిలే లోపలేమి జరిగుంటుందో—” అన్న రీతిన.
మూడు రోజుల తరవాత... త్యాగరాజు ఊరికి బయల్దేరుతున్నాడు. అతడి కోసం టాక్సీలో తినుబండారాలు పెడ్తూ పండ్లు కూడా పెడ్తూ అతడికి పెండ్లినాడు తీసిన వీడియోను అందివ్వబోయాడు దీనదయాళన్. కాని— త్యాగరాజు తీసుకోలేదు. భార్యా భర్తలిద్దరి చెవిలోనూ తేనె పోసినంత వార్త అందించాడు. ”నాకొద్దు. మధుమురళి ట్రైనింగ్ పూర్తి చేసుకుని రామకృష్ణాపురం రాడు. ఢిల్లీనుండి తిన్నగా ఇక్కడకు వస్తాడు. వీడియోతో బాటు వాడి పెళ్ళాన్ని కూడా యింటికి తీసుకు వస్తాడు”
ఆ మాట విన్నంతనే దంపతులిద్దరి ముఖాలూ వికసిత కమలాలయాయి. మిత్రుడితో నడుస్తూనే అన్నాడు దీనదయాళన్ “ఆమాట గుర్తుంది కదూ! ”
టాక్సీ డోరు వద్దకు చేరుకుని అదేమిటన్నట్టు తిరిగి చూసాడు త్యాగరాజు.
“అక్కడకు చేరుకున్న కొన్ని రోజుల తరవాత మా ఆవిడా, యిద్దరమ్మాయిలూ ఊరికి వచ్చి శాంతిముహూర్తం- అంటే, శోభనం జరిపిస్తారు. రాశిఫలాలు చూసి రావడానికి సమయం పడ్తుంది. లేకపోతే రేపు మనవళ్ళు మనవరాళ్లూ ఆరోగ్యంగా పుట్టరని యిక్కడివాళ్ళు దానిని సీరియస్ గా తీసుకుంటారు”
“ఉఁ! యిండీడ్ ఎ గుడ్ ఐడియా! ఆ లోపల శివగామి కూడా మానసికంగా అక్కడి వాళ్ళతో అక్కడి పరిసరాలతో మెలమెల్లగా అల వాటు పడుతుంది. కుదుట పడుతుంది. ఏదయితేనేమి— నీలా రిటైర్ట్ ఉద్యోగిని. నేనెలాగూ ద్వారపాలకుడిలా అక్కడేగా తచ్చాడుతూ ఉంటాను. డోంట్ వర్రీ” అంటూ టాక్సీలో కూర్చున్నాడు త్యాగరాజు..
===============================================
ఇంకా వుంది
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 త్వరలో
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

