top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Udayaraga Udvegalu - Part 4 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 09/12/2025 

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ:

డిపార్టుమెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్ లో ఉంటాడు మధుమురళి. తండ్రి కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్ళికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. భార్యాభర్తలు సమానులేనన్న భర్త మాటలకు ఇంప్రెస్స్ అవుతుంది నవ వధువు శివగామి.  ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 4 చదవండి.


మాధవపురం, నగరానికి మధ్యస్థంగా ఉంది. అదే సమయాన కొండల వరసకి మరీ దూరం కూడా కాదు. మరి కాస్తంత వివరించి చెప్పాలంటే కొండగాలి నగరంలోకి రివ్వున రివ్వున బాగానే వీస్తుంది. మధ్యాహ్నం పూట యెండలు మండుతూన్న సమయంలో చల్లని కొండగాలి మేనికి అలవికాని హాయినిస్తుంది. 


పచ్చని పూల చెట్ల పరిమళాలను పసందుగా నగరం నడిబొడ్డు కి సరాసరి పూలతేరులా మోసుకు వస్తుంది. అందుకే కదూ సాహితీ ప్రియులు ప్రకృతి ఆరాధకులు పైరుగాలి పైన కొండగాలి పైన అంతెత్తు ఉద్వేగంతో కవితలూ గేయాలూ వ్రాస్తుంటారు. అవధికి మించిన తదాత్మయం పొందుతుంటారు. 


సెంట్రల్ గవర్నమెంటులో రెవన్యూ ఆఫీసరుగా కొలువు చేస్తూన్నసదానందం రిటైర్మెంటుకి సమీపంగా వచ్చాడు. కాని ఉషారుకీ సందడికీ యే మాత్రమూ దూరం కాలేదు. పేరులో ఉన్నట్టే నిత్యానందం అనే భావం అతడి నడకలో మాటలో కళ్ళ కదలికలో చైతన్య స్రవంతిలా కనిపిస్తుంటుంది. 


ఆరోజు ఉదయకాల నడక ముగించి ఉషారుగా చిన్నపాటి విజిల్ వేస్తూ అల్లంత దూరం నుంచే భార్యను పిలుస్తూ లోపలకు వచ్చాడు. అతడి ఉషారుకి ఆరోగ్యం మాత్రమే కారణం కాదు. అతడిలో అనునిత్యమూ వెల్లివిరిసే హాస్య చతురత కూడా ఒక కారణం. భర్త గొంతు విని వంటగది లోనుంచి బయటకు వచ్చింది ఉమాదేవి, “ఇక్కడే ఉన్నానండీ! ఏం కావాలండీ?” 


“అదేం ప్రశ్నోయ్! కొత్తగా చూస్తున్నట్టు- కొత్తగా యింటికి వచ్చినట్టు అడుగుతున్నావు! నీకు యెప్పుడేమి కావాలో నాకు యెరుకలో ఉన్నప్పుడు నాకెప్పుడు యేమి కావాలో నీకు తెలిసుండవద్దూ! నా ఆశల ఊసులు గ్రహించి రెడీగా ఉండవద్దూ! ”


ఉష్-అని ఉమాదేవి గసిరింది. “మీ యాక్టివ్ నెస్ యిక్కడ కాదు. ఎక్కడ చూపించాలో అక్కడ చూపించండి. ప్రక్క గదిలో అత్తగారున్నారు. పైనేమో మీ కోడలుంది పెద్దకొడుకుతో-- మీ చిన్నకొడుకేమో పుస్తకం మూసి చడీ చప్పుడు లేకుండా పుటుక్కున వచ్చేస్తాడు. వయసుకి అతకని మన గజిబిజి మాటలు గాని వింటే— పరువు పోతుంది. పై బడుతూన్న వయసుని గుర్తుపెట్టుకుని నోరు కొంచెం అదుపులో ఉంచుకోండి. ” 


సదానందం ముఖం దీర్ఘంగా పెట్టాడు. “ఇదెక్కడి చోద్యమే! పెళ్ళాంతో ఫ్రీగా మాట్లాడే అధికారం మొగుడికి ఉండదా? ఇందులో వయసుతో యేమి సంబంధం? ”


ఆమె వేగంగా దగ్గరకు వచ్చి భర్త ముక్కు పట్టుకుని లాగి చిరు కోపంతో అంది-- “ఉంది. ఉంటుంది. దానికి సమయ సందర్భం చూసుకోవాలి. మన వయసుకున్న పెద్దరికాన్ని కూడా గుర్తుపెట్టు కోవాలి. రండి! స్టూలుపైన కూర్చోండి. టీ-బిస్కట్లు తెచ్చిస్తాను !” అని స్టూలు అతడి ముందుకు తోసి స్టవ్ పైనుంచి టీ పోసి తీసుకు వచ్చింది. 


టీ ఫ్లేవర్ లోని రంగునీ రుచినీ ఆమూలాగ్రమూ అనుభూతించి సదానందం మళ్ళీ పేల్చాడు- “నిజానికి నిన్ను చూస్తుంటేనే నాకు అప్పుడప్పుడు దిగులుగా అనిపిస్తుందోయ్! ”


ఉమాదేవి చటుక్కున వెనక్కి తిరిగి చూసింది- ఎంతుకన్నట్టు--


“నీకు తెలుసు కదా-- కొండలకు అవతల- కొండలకు ఇవతల భూమి కంపిస్తుంటుంది. కొండ చరియలు కదలి కూలిపోతుంటాయి. అప్పుడు అందరూ చెల్లా చెదురుగా పరుగెత్తుతుంటారు. మరి నువ్వలా యాక్టివ్ గా మూవ్ చేయలేవు కదా! అందుకని-” అంటూ ఆగాడతను. 


అప్పుడామె యేమిటంట- అన్నట్టు షార్పుగా చూసింది.. అప్పుడు నేనే కదా నిన్ను మోసుకు వెళ్ళాలి. నీ బరువుని నేను భరించగలనానని ఆలోచిస్తున్నాను”


ఆమె సదానందాన్ని చురుగ్గా చూసింది. “ఏదో ఊహాలోకంలో ఓలలాడుతున్నట్టున్నారు. అలా జరగదు. జరిగినా మిమ్మల్ని యెత్తుకోమని అడగను. మిమ్మల్ని మీరు చూసుకోండి. అది చాలు. సరేనా! ”


అతడు అనంగీకారంగా తల అడ్డంగా ఆడించాడు. “అదెలా ఉమా! భర్త పదానికి నిర్వచనం యేమిటి? భరించే వాడనేగా! ఇన్నేళ్ళ సంబంధాన్ని అలా బూడిదలో పోసిన పన్నీరులా విదలించుకు వెళ్ళిపోతానా! ”


అప్పుడు వంట గది గుమ్మం వద్ద గొంతు ఖనేల్మంది. “ఒరేయ్ పెద్దోడా! అలా వెళ్తున్నప్పుడు మీ మొగుడూ పెళ్ళాల పలుకులు చెవిన సోకాయిరా!”


ఉమాదేవి అత్తగారి వేపు విసుగ్గా కళ్ళు పెద్దవి చేసికుని చూసింది. వెళ్తూ వెళ్తూ కాదు – కావాలనే ఇక్కడాగి చెవులొగ్గే వినుంటుందీవిడ. ఇప్పుడు అదేమీ తెలయనట్టు వచ్చుంటుంది. 


సదానందం- “చెప్పమ్మా!” అని అడిగాడు. 


“మరేం లేదురా పెద్దోడా! నిన్ను చూస్తుంటే నాకెంతటి ముచ్చటేసిందో చెప్పలేను రా! అచ్చు మీ బాబుకి తగ్గ తనయుడనిపించుకున్నావురా! పెళ్ళి కోత్తలో ఒక రోజు నేనూ మీ బాబూ టెంటు సినిమాకి వెళ్తున్నప్పుడు చిన్న వాగు అడ్డమొచ్చిందిరా- అప్పుడు మీ బాబేమి చేసాడో తెలుసా! వద్దంటున్నా వినకుండా నా చీరచెంగు తడిసిపోకుండా అమాంతం నన్నెత్తుకున్నాడురా! ” 


అప్పుడు వంటగదిలోకి ఇంద్రకిరణ్ చొరబడ్డాడు- “తాతయ్య నిన్ను అమాంతం చీర కుచ్చెళ్ళు తడవకుండా యెత్తుకున్నాడా! సరే అలాగే అనుకో-- మరి నిన్ను అద్దరి చేర్చాడా బామ్మా?” 


నర్సమ్మ నిస్పృహతో బదులిచ్చింది “అక్కడేరా ప్రతిబంధకం యెదురైంది. గులకరాయి దారికి అడ్డంగా పడితే మీ తాతయ్య తడబడ్డాడు” 


“తడబడ్డాడంటే నిన్ను వాగులో జారవిడిచాడు. అంతే కదూ! మొత్తానికి తాతయ్య మగజాతి పరువు తీసాడు కదూ!”


“నోరు మూస్తావురా కుర్ర కుంకా! మీ తాతయ్య నన్ను అద్దరి చేర్చాడా లేదా అన్నది ముఖ్యం కాదురా! కట్టుకున్న పెళ్ళాం పాదా లూ చీర కుచ్చెళ్ళూ తడవ కూడదని నన్ను సాహసంగా యెత్తుకున్నాడు చూడూ— అదిరా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం. ఈ తరం వాళ్ళయితే నాకెందుకూ ఈ సోదె అన్నట్టు చూస్తూ దారిన పోయే దానయ్యలా వెళ్ళిపోదురు”.


 అప్పుడు వాళ్ళ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ హాలులో ల్యాండ్ లైన్ మ్రోగింది. ఇంద్రకిరణ్ వెళ్ళి అందుకుని తండ్రిని పిలిచాడు రామకృష్ణా పురం నుండి చినబాబు పిలుస్తున్నాడని. 


సదానందం వెళ్ళి అందుకున్నాడు- “ఎలాగున్నావురా త్యాగూ! మీ వదిన యిక్కడ మధుమురళి కోసం రెండు మంచి సంబంధాలు చూసినట్లుంది. అమ్మకు కూడా తెలిసిన వాళ్ళే— వాణ్ణి యిక్కడకు ఓసారి పంపిస్తే యేదో ఒక సంబంధం గట్టుకి చేర్చి క్లించ్ చేయ వచ్చురా! ఏమంటావు?”


కొన్ని క్షణాల యెడబాటు తరవాత త్యాగరాజు స్పందించాడు- “కాంచీపురానికి నా క్లోజ్ ఫ్రెండు దీనదయాళన్ కూతురి పెళ్ళికి వెళ్తానన్నాను కదరా అన్నయ్యా— అక్కడ యెదురు చూడనిది జరిగిపోయిందిరా--. కోపగించుకోకుండా వినరా అన్నయ్యా!”


సదానందం ముఖంలోని మార్పులు గమనించిన నర్సమ్మ ఆతృతగా అడిగింది- “మాట్లాడుతున్నది మీ తమ్ముడే కదరా! ఏమంటున్నాడేమిటి?” 


అంతా విన్న తరవాత వివరిస్తానని చెప్పి తమ్ముడు చెప్పేది నిదానంగా వినసాగాడు సదానందం. ఆ తరవాత కూడా ఉగ్గబట్ట లేక నర్సమ్మ రెట్టించి అడిగింది- “ఏమైందిరా వాడికి! ఏమంటున్నాడు?”


తల్లి వేపు తిరిగాడు సదానందం. “వాడికేమీ కాలేదు. వాడి కొడుక్కే యేదో ఐనట్టుంది” అని కాంచీపురం లో జరిగినదంతా తల్లికి విడమర్చి చెప్పాడు. 


“హాఁ! అరవమ్మాయిని యింటికి కోడలు పిల్లగా తెచ్చుకున్నాడా! ఎంత ధైర్యం వాడికి? మన మందరమూ మట్టి విగ్రహాల్లా ఉంటే మనకు మాట వరసకైనా చెప్పకుండా యెక్కణ్ణించో అరవమ్మాయిని యింటికి తీసుకొస్తాడా! ఫోనియ్యి— వాడంతు తేలుస్తానిప్పుడే--”

 

“అమ్మా! కొంచెం ఆగుతావా?ఈ వయసులో అంతటి ఆవేశం పనికి రాదమ్మా--” 


అప్పుడు ఉమాదేవి కలుగ చేసుకుంది- “అత్తయ్యనెందుకు ఆపుతున్నారండీ! మధు మురళి చంటిపాపడేమిటి- బాబు చెప్పిందానికల్లా తలాడించడానికి? మరిదేమో ప్రాణ మిత్రుడికి వత్తాసుగా నిలవాలని ఉబలాటపడుండవచ్చు. వీడికేమయిందండీ! చదువుకున్నవాడికి ఆపాటి యింగితం ఉండొద్దూ! వాడికోసం యిక్కడ సంబంధాలు చూస్తున్నామన్నది గుర్తుకి రావద్దూ! ”


సదానందం భార్యవేపు పదునుగా చూసాడు- “నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా ఉమా! తేలిసీ తెలియని మిడి మిడి అవగాహనతో అమ్మకు వేడెక్కించకు, త్యాగరాజు నువ్వను కుంటున్నట్టు తొందరపాటుతో నిర్ణయం తీసుకునే మనిషి కాడు. అకస్మాత్తుగా పెళ్ళాగిపోయింది. పెళ్ళి కొడుకు ధూర్తుడు. తిన్నగా మండపానికి రాకుండా వాడి లవర్ తో మాయమయిపోయాడు. కాంచీపురంలో దీనదయాళన్ గారు పరపతి హోదా గల మనిషి. పెళ్ళింట్లో అనుచితమైనదైదీ జరగకూడదని---” 


అతడామాటను పూర్తి చేయనివ్వకుండానే నర్సమ్మ గట్టిగా అంది- “నువ్వు నోర్మూసుకోరా సదానందా! ఎవడో తనకవసరం లేదని తూలనాడి వెళ్ళిపోయిన అమ్మాయిని మీ తమ్ముడు సిగ్గూ లజ్జా లేకుండా యింటి కోడలు పిల్లను చేసుకుంటాడా?” 


“అమ్మా ప్లీజ్! అర్థం చేసుకోవే— దీనదయాళన్ మరెవ్వడో కాడు. తమ్ముడికి క్లోజ్ ఫ్రండ్. చిత్తూరులో కలసి పనిచేసారు ఇద్దరూ-- నాన్నగారు అనారోగ్యం పాలయితే అతనే త్యాగరాజుకి వత్తాసుగా నిలిచాడు. వైద్యం కలసిరాక చనిపోతే అతనే ముందుండి అంత్యక్రియలు జరిపించాడు. 


కష్టకాలంలో మనమక్కడ లేనప్పుడు తమ్ముడి దు:ఖాన్ని పంచుకున్నాడు. ఇదంతా మనం మరచిపోతే యెలా?”


“ఔను. వాస్తవమే కావచ్చు. దానికి బదులుగా స్నేహితుడికి వేరొక విధంగా సహాయం చేయవచ్చుగా! అక్కడే ఉండి మరొక పెళ్ళి సంబంధం వెతకడంలో చేయూత యివ్వవచ్చుగా! అది విడిచి పెట్టి భాషే తెలియని అమ్మాయిని యింటికి పిలుచుకొస్తాడా! తెలుగింటి ఆచారాల గురించి అవగాహనే లేని అమ్మాయిని మనూరుకి తీసుకొస్తాడా! అన్నీ సీదా సాదాగా అర్థం చేసుకుంటూన్న కోడలు పిల్లతోనే వేగలేక పోతూన్న కాలమిది. పరభాష గల అమ్మాయితో మీ మరదలు పిల్ల యెలా సర్దుకోగలదురా! ఇది చాలదని మధు చెల్లి మాధవి ఉండనే ఉందిగా! దానికీ అరవం రాదు. ఇక వదినా ఆడపడుచుల మధ్య రణరంగమే అనుకో--”


సదానందం బదులివ్వకుండా ఊరకుండిపోయాడు. కొన్ని క్షణాల తరవాత నిదానంగా అన్నాడు- “కాంచీపురం నుంచి కోడలు పిల్ల రామకృష్ణాపురం చేరిన తరవాత వాణ్ణి ఓసారి యిక్కడకు రమ్మంటాను” 


“వాణ్ణి అంటే-- యెవణ్ణి?” నర్సమ్మ కస్సుమంది. 


సదానందం అదోలా ముఖం పెట్టాడు. “అంత లావు కోప్పడితే యెలాగమ్మా! నేను చెప్తునే ఉన్నాగా— త్యాగరాజు అలా తొందరపడే మనిషి కాడని-- ఇప్పటికి విషయమంతా పూర్తిగా మన వరకూ రాలేదు. అవసర మనుకుంటే నేనూ ఉమా ఓసారి అక్కడకి వెళ్ళి వస్తాం” అని అక్కడ దూరంగా ఒదిగి నిల్చున్న చిన్నకొడుకుని ఉద్దేశించి అన్నాడు. “నువ్వు మీ బామ్మను గదికి తీసుకు వెళ్ళి మింగడానికి మాత్రలియ్యి. మీ అన్నయ్య యింకా మంచం దిగినట్లు లేడు. లేచీ లేచిన వెంటనే ఆఫీసుకి వెళ్ళకుండా నన్ను మీ వదినెతో బాటు వచ్చి చూసి వెళ్ళమను” అని మేడ మెట్లు వేపు కదిలాడు. 


ఉమా దేవి త్వరగా అడుగులు వేస్తూ భర్తను అనుసరిస్తూ అంది. “నేను కొంచెం గట్టిగా మాట్లాడినట్లున్నాను. సారీ! ” 


“సారీ లేదూ బీరూ లేదు. నువ్వెందుకు అలా మాట్లాడావో నాకు తెలియదనుకున్నావా! ఒకటి గుర్తుంచుకో— మధు మురళికి యిక్కడ మాత్రమే పెద్దమ్మ లేదు. అక్కడ రామకృష్ణాపురంలో కూడా మరొక పెద్దమ్మ ఉంది. ఆమె కూడా మధుకోసం పెళ్ళి సంబంధాలు వెతుకుతున్నట్లుంది. సెంట్రల్ గవర్మమెంటు సర్వీసులో క్లాస్- ఒన్ ఆఫీసర్ పోస్టంటే మాటలు కాదు కదా! హుందాతో కూడుకున్న స్థాయి కదా! ఆడపిల్లల్ని కన్న అమ్మానాన్నల కళ్ళు వాడిపైన పడి ఉంటాయి. వాడిని వెంటాడుతూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే వాడికెదురైన పరిస్థితి గురించి కూడా కొంచెం ఆలోచించు. వాడు చేసిన పొరపాటు ఒక్కటే— కన్న తండ్రి మాట జవదాటకుండా ముక్కూ మొహం తెలియని ఓ తమిళమ్మాయి మెడన పుస్తె కట్టడం. కాదా?“ అని మేడ మెట్లెక్కాడు సదానందం. 


===============================================

                                                ఇంకా వుంది

                                    ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 త్వరలో

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree



 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page