మదిలో మల్లెల మాల - పార్ట్ 13
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 1 day ago
- 6 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 13 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 24/01/2026
మదిలో మల్లెల మాల - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్ తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్ లో చేరుతారు. సినిమారంగంలో నష్టపోయి, రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు. వారికి సహాయం చేస్తూ ఉంటాడు రమణ. రంజనికి రమణ మీద ఆసక్తి కలుగుతుంది.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 13 చదవండి.
ఆనంద్... సునందలకు... రమణ, రంజనీ తనకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలనన్నింటినీ వివరంగా చెప్పాడు.
ఆనంద్ కొన్ని మాటలు అంటే... మీకు వివాహం అయిందా... పిల్లలు ఎంతమంది... అన్న మాటలను రెండు మూడు సార్లు అడిగి రమణ మూలంగా విని పకపకా నవ్వసాగాడు.
"ఎందిరా!... అలా పిచ్చోడిలా నవ్వుతున్నావ్?" ఆశ్చర్యంతో అడిగాడు రమణ.
"రేయ్, అవి చాలా మంచి మాటలు కదరా.... అందుకే నీ నోట ఒకటికి రెండుసార్లు విన్నాను. అన్నా!... నాకు చాలా ఆనందంగా వుందిరా!..."
"ఎందుకురా నీకు యింత సంతోషం?"
"త్వరలో నీవు ఒక యింటివాడివి కాబోతున్నావ్" నవ్వుతూ చెప్పాడూ ఆనంద్.
"అమ్మా వీణ్ణి చూడు. వీడికేమైనా పిచ్చి పట్టిందా!..." ఆశ్చర్యంగా ఆనంద్‍ను చూచి... తల్లిని అడిగాడు రమణ.
"వాడనే మాటలు ఫలిస్తాయనే నమ్మకం నీకుంది కదరా!.... నాకు కావలసిందీ అదే. త్వరలో నీవు పెళ్ళి చేసుకోవాలి. నా యింటికి నా కోడలు రావాలి" తన మనోభావాన్ని వ్యక్తం చేసింది సునంద.
"పెద్దమ్మా!.... అన్నయ్యగారికి సూట్ అయ్యే పిల్లను నేను చూడనా!....."
"చూడరా!.... మనిద్దరికీ నచ్చితే వాడికీ నచ్చినట్లేగా!..."
"అమ్మా!.... వాడితో కలిసి నీవూ.... ఏమిటమ్మా ఈ మాటలు!" చిరుకోపాన్ని ప్రదర్శించాడు రమణ.
"వాడు అన్నదాంట్లో తప్పులేదు. నేను అన్నదాంట్లో తప్పు లేదు. ఆరునెలల లోపల నీ పెళ్ళి జరగాల్సిందే సిద్ధంగా" నవ్వుతూ అంది సునంద.
"అన్నాయ్!... ఒక్కమాట"
"ఏమిటి?"
"తప్పుగా అనుకోకు. నాకు తెలియకుండా ఎవరినైనా ప్రేమించావా!"
సునంద వెనుక చేరి నవ్వుతూ అడిగాడు ఆనంద్.
"అమ్మా!... వీడికి పొగరు ఎక్కువైంది."
"అది తగ్గాలంటే వాడి ముక్కుకూ తాడు వేయాలిగా!...."
"ముందు ఈ మహానుభావుడు లైన్ క్లియర్ చేస్తేనేగా అది జరిగేది!..." నవ్వుతూ చెప్పాడు ఆనంద్.
"చాలు చాలు. యిక ఈ పిచ్చి మాటలు ఆపు. ప్రిన్సిపాల్ గారింటికి ఆరున్నరకల్లా వస్తామని నీవేగా చెప్పావు. పద. త్వరగా రెడీగా బయలుదేరాలి." అన్నాడు రమణ.
"అవునుర్రా..... మాటల్లో పడి ఆ మాటే మరిచిపోయాను. యిద్దరూ త్వరగా రెడీ కండి" తన గదివైపుకు వెళ్ళింది సునంద.
పావుగంటలో యిరువురు మిత్రులు రెడీ అయ్యారు. సునందతో కలిసి ముగ్గురూ కారులో ప్రిన్సిపాల్ ధర్మారావు గారి యింటికి చేరారు.
వారి కుటుంబం అంతా వాకిట్లో నిలబడి యీ ముగ్గురికీ స్వాగతం పలికారు. అందరూ లోనికి నడిచి హాల్లో సోఫాల్లో కూర్చున్నారు. తన కుటుంబ సభ్యులనందరినీ ధర్మారావు ముగ్గురికీ పరిచయం చేశాడు. యింతకు ముందు రెండుసార్లు వీరు వారి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో చిన్న కొడుకు, కోడలు, పాప అమెరికాకు వెళ్ళి వుండిన కారణంగా... సునంద, రమణ, ఆనంద్‍లు వారిని చూడలేకపోయారు.
ధర్మారావు గారి కూతురు సుధ.... టీ కప్పులను అందించింది. అందరూ కబుర్లతో టీని సేవించారు.
సుధ... ప్రతి కదలికను నవ్వుతూ ఆనంద్ గమనించడాన్ని రమణ గ్రహించాడు.
"రా రమణా!... మా గార్డెన్ను చూద్దువుగాని" సొఫా నుండి లేచి ధర్మారావుగారు అన్నారు.
"పదండి సార్!.... గార్డన్ డెవలప్ చేయడమంటే నాకూ యిష్టమే!..." నవ్వుతూ చెప్పాడు రమణ.
ఇరువురూ హాల్లోనుంచి బయటికి వచ్చారు. ఆనంద్... సుధ, చిన్న అన్నయ్య రవిని అమెరికా విషయాలను అడిగి తెలుసుకొంటున్నాడు.
యధార్థం చెప్పాలంటే.... ఆ విషయాల సేకరణ కన్నా, ఈ కారణంగా తను సుధను చూస్తూ వుండవచ్చునన్నది ఆనంద్ అసలైన భావన. కారణం... సుధ అందచందాలు అతనికి ఎంతగానో నచ్చాయి. మాట్లాడలేకపోయినా సుధ సౌజ్ఞలతో తన తల్లి అన్నవదినలకు.... చిన్నపాపకు తన అభినయంతో చెప్పే జవాబులను చూడ్డంలో అతనికి ఎంతో ఆశక్తి.
గురుశిష్యులు పూలమొక్కలకు, వాటికి పూచి వున్న పూలను చూస్తూ భవంతి వెనుక భాగానికి వచ్చారు. "యింటి నాలుగు వైపులా స్థలం పద్ధతిగా వుండేలా వాస్తురీత్యా యీ గృహాన్ని నిర్మించాడు రవి. యిక పూల మొక్కలు చెట్ల విషయం... అన్నింటినీ నాటి, నీరు పెట్టి పెంచి పెద్దవయ్యేలా చేసింది నా కూతురు సుధ. మరో విషయం పూచిన పూలను తను తప్ప వేరెవరినీ కోసే దానికి తను అనుమతించదు.
"నేను కోస్తానులేవే" అని వాళ్ళ అమ్మ అంటే ఒప్పుకోదు. సున్నితంగా కొమ్మలు విరగకుండా తానే కోయాలని అంటుంది. యీ చెట్లు మొక్కలు అంటే ఆమెను ప్రాణ సమానం" నవ్వుతూ చెప్పాడు ధర్మారావు.
రమణ వారి కళ్ళల్లోకి చూచాడు. పైకి నవ్వుతున్నా వారి నయనాల్లో కన్నీరు. వాటిని చూచి రమణ ఆశ్చర్యపోయాడు.
"సార్!... మీ కళ్ళల్లో ఆ కన్నీరు!..." సందేహంతో అడిగాడు.
"అంతటి సున్నిత మనస్కురాలికి యిప్పుడు యుక్తవయస్సు వచ్చిందిరా!... ఆమె వివాహ విషయమే నా యీ కన్నీటికి కారణం రమణా!...." జిజ్ఞాసగా చెప్పారు ధర్మారావు.
"ఎందుకు సార్.... మీరు బాధపడతారు. సుధ గారి కోసం ఎక్కడో ఓ మంచి అబ్బాయి పుట్టే ఉంటాడు. మీరు ప్రయత్నించండి. మీ మంచి మనస్సుకు మీకు తప్పకుండా మంచి వ్యక్తి అల్లుడిగా వస్తాడు."
ధర్మారావు ప్రశ్నార్థకంగా రమణ ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు.
"ఏమిటి సార్ అలా చూస్తున్నారు" అడిగాడు రమణ.
"రమణా!.... ద్రోణాచార్యులు అర్జునునకు ప్రత్యక్షగురువు. ఎన్నో విద్యలు నేర్పించాడు. ఏకలవ్యుడు ఆ గురువు బొమ్మను దీక్షతో పూజించి.... అతనూ అసమాన ధనుర్దారి అయ్యాడు. గురువు కోరిన వెంటనే ఏకలవ్యుడు... తన కుడిచేతి అంగుళీయాన్ని కోసి గురుదక్షిణగా యిచ్చేశాడు. అర్జునుడు... ఏకలవ్యుడు అచంచల గురుభక్తి కలవారే. నీ దృష్టిలో ఎవరి గురుభక్తి మిన్న రమణా!...." మెల్లగా అడిగాడు ధర్మారావు.
"ఏకలవ్యుని గురుభక్తి సార్!...."
"అయితే నీవు నన్ను ఏకలవ్యునిగా ఆరాధిస్తున్నావా!... అర్జునునిలా ఆరాధిస్తున్నావా!..."
"మీ విషయంలో నా ఆరాధన ఏకలవ్యుని ఆరాధనలా వుండాలన్నదే నా అభిప్రాయం."
"అయితే... ఎవరో ఎందుకు!... నీవు నా సుధను వివాహం చేసుకోగలవా?" అభ్యర్థనా పూర్వకంగా ధర్మారవు రమణ కళ్ళల్లోకి చూచాడు.
వారి ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి రమణ వికసించి గాలికి అటూ ఇటూ కదులుతున్న గులాబీలను చూస్తూ....
"మా అమ్మతో మాట్లాడి నా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను సార్. నాకు ఇరవైనాలుగు గంటల వ్యవధిని యివ్వండి."
"అలాగే రమణా!..." ఆనందంగా అన్నాడు ధర్మారావు.
కొన్ని క్షణాల తర్వాత... "పద... లోనికి వెళ్ళి భోంచేద్దాము" అన్నాడు ధర్మారావు.
వారి వెనుకాల మౌనంగా లోనికి నడిచాడు రమణ.
సుధ... వారి వదిన సుగుణ తప్ప అందరూ డైనింగ్ టేబుల్‍పై భోజనాలకు కూర్చున్నారు. వదిన మరదళ్ళు వడ్డించారు. గడచిన అరగంటలో ఆనంద్ వారికి తన మాటలతో బాగా సన్నిహితుడైనాడు. సుధ అతనికి ప్రత్యేకంగా వడ్డించడం రమణ గమనించాడు. భోజనానంతరం వారికి వీడ్కోలు చెప్పి రమణ, సునంద, ఆనంద్‍లు వారి నిలయం చేరారు.
*
యింట్లోకి ప్రవేశిస్తూనే.... "రమణా!.... మీ గురువుగారి కుటుంబ సభ్యులు వారి కోడలు... వారి అమ్మాయి సుధ ఎంత మంచివారు. ఎంతటి ఆప్యాయతా, అభిమానం నాకు కాబోయే వియ్యంకుడి గారి కుటుంబం అలాగే వుండాలి" అంది నవ్వుతూ సునంద.
"అవును పెద్దమ్మా!.... వారంతా చాలా మంచివారు. ముఖ్యంగా సుధ.... ఎంత ప్రీతిగా మనకు వడ్డించింది. ఆమె చూపుల్లో ఏదో అయస్కాంతం వుంది కదా పెద్దమ్మా!.... మూగదైతే మాత్రం ఏమిటి పెద్దమ్మా!... ఆమె మనస్సు మూగది కాదుగా!... ఆమెకు అందరి ఆడపిల్లల్లా ఆశలు... అభిమానాలు వుంటాయి కదా పెద్దమ్మా!..." కాస్త ఆవేశంగా చెప్పాడు ఆనంద్.
సునంద, రమణలు.... అతన్ని ఆశ్చర్యంగా చూచారు.
అతని వదనంలో చిరునవ్వు. కళ్ళల్లో వింత కాంతి.
"అవున్రా!.... నీవు చెప్పినదంత నిజమే!...." అంది సునంద.
వెళ్ళి.... తన గదిలో మంచంపై వాలిపోయింది. ఆమె హృదయంలో... సుధ పట్ల ఎంతో సానుభూతి. మమకారం. రమణ యిష్టపడితే... ఆ పిల్లను తన కోడలిగా చేసికోవడంలో తప్పేముంది? ఆ అమాయకురాలికి మంచి భవిషత్తును ప్రసాదించిన వాడౌతాడు రమణ.
ఎదుటివారి కనుసన్నల్లోని భావాలను గ్రహించి సుధ వర్తించిన తీరును తలచుకొంటూ.... రమణతో యీ విషయాన్ని గురించి మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చింది సునంద.
యిరువురు మిత్రులు తమ గదిలో ప్రవేశించారు. మంచాలపై వాలారు. తనతో ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్న రమణను పరీక్షగా చూచాడు ఆనంద్.
"రమణ!..." మెల్లగ పిలిచాడు.
"రేయ్ ఆనంద్!.... తలనొప్పిగా వుందిరా. వుదయం మాట్లాడుకొందాం. గుడ్ నైట్" చెప్పి కళ్ళు మూసుకొన్నాడు రమణ.
"తలకు కొంచెం అమృతాంజనం వ్రాయనా!...."
"వద్దురా. నీవూ నిద్రపో."
ఆ రెండవ పదం అర్థం.... యిక నీవు ఏమీ మాట్లాడకు అని. గ్రహించిన ఆనంద్.... తనూ కళ్ళు మూసుకొన్నాడు. యింతవరకూ వారిరువురి మధ్యనా ఎలాంటి రహస్యాలు లేవు. యధార్థం చెప్పాలంటే.... సుధ పట్ల తనకు కలిగిన అభిప్రాయాన్ని తాను యింకా రమణకు చెప్పలేదు. దానికి కారణం ముందు తను సుధ కుటుంబ సభ్యులు మనస్తత్వాలను గురించి వారితో కొంతకాలం సన్నిహితంగా గడిపి వారి తత్వాలను తాను బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత తన నిర్ణయాన్ని పెద్దమ్మకు, రమణకు చెప్పాలి. వారి చేతనే సుధ పట్ల తనకు వున్న అభిప్రాయాన్ని ధర్మారావు గారి కుటుంబానికి తెలియజేయాలి. యీనాడు తాను వారితో గడిపిన సమయం... తన మనస్సున వున్న సందేహాలన్నింటినీ తీర్చేసింది.
సుధ కూడా తనకు సన్నిహితురాలైంది. తను ప్రపోజ్ చేస్తే, ఆమె అంగీకరిస్తుందనే నమ్మకం తనలో కలిగింది. ముందుగా తన నిర్ణయాన్ని పెద్దమ్మకు చెప్పాలి. ఆమెకు నచ్చితే తను... అమ్మా నాన్నలతో మాట్లాడి వారిని ఒప్పించగలడు. తర్వాత రమణకు చెబితే.... వారిరువురూ ధర్మారావుగారితో మాట్లాడగలరు. ఈ నిర్ణయానికి వచ్చిన ఆనంద్.... తన హృదయం నిండా వున్న సుధను తలచుకొంటూ కలా జగత్తులో తియ్యని వూహలతో మునిగిపోయాడు.
రమణ ఆలోచనలు.... తనకు ధర్మారావు గారికి మధ్యన జరిగిన సంభాషణను గురించి.
గురువులు ధర్మారావు గారు నాకు ఎంతో సహాయం చేశారు. ఈ రీతిగా బెంగుళూరులో వారిని కలుస్తానని నేను అనుకోలేదు. అది... ఆ దేవుని నిర్దేశమే!.....
నాలుగుసార్లు వారి యింటికి వెళ్ళడం... ఆ కుటుంబ సభ్యులనందరినీ కలవడం... సుధను చూడడం... తను నన్ను చూడడం అంతా దైవ సంకల్పమే కదా!....
ఎప్పుడూ ఎవరి చేయి చూచి చెప్పని అమ్మ హోటల్లో తమ తొలి కలయికలో ఆ అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకొని చెప్పిన మాటలు... ఆమె మనస్సులో ఎన్నో ఆశలను రేకెత్తించి వుండవచ్చు. తను మాట్లాడలేకపోయినా ఆనంద్ అన్నట్లు ఆమెకూ మనస్సు వుందిగా... ఆ మనస్సున ఎన్నో కోర్కెలు... తలపుల్లో ఎన్నో కలలు వుంటాయిగా.
నా మీద ఎంతో నమ్మకం వున్న కారణం... ప్రిన్సిపాల్ గారు భారత కథను చెప్పి నీవు నాపట్ల అర్జునుడిగా వర్తిస్తావా లేక ఏకలవ్యుడిగా వర్తిస్తావా!.... అని అడిగారు. నేను ఏకలవ్యుడిలా వర్తిస్తానన్నాను. ఆ మాట విని తన కోరికను వారు నాకు తెలియజేశారు.
ప్రస్తుత నా కర్తవ్యం.... అయోమయం. తన యింటికి రావలసిన కోడలిని గురించి అమ్మ నిర్ణయం ఎలా వుందో... ఆమె నిర్ణయమే తనకు ఆమోదయోగ్యం. ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాటలను అమ్మకు చెప్పాలి. ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొని... తన నిర్ణయాన్ని ప్రిన్సిపాల్ గారికి తెలియజేయాలి. ఈ నిర్ణయానికి వచ్చిన రమణ గట్టిగా కళ్ళు మూసుకొన్నాడు.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 14 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments