top of page
Original.png

మదిలో మల్లెల మాల - పార్ట్ 12

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


Madilo Mallela Mala - Part 12 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 24/01/2026

మదిలో మల్లెల మాల - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:

తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్ తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్ లో చేరుతారు. సినిమారంగంలో నష్టపోయి, రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు. వారికి సహాయం చేయాలనుకుంటాడు రమణ. 

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 12 చదవండి.


బాతుల బంగారయ్యగారికి సుపుత్రుడు భీమారావు. నానా తంటాలు పడి ఐదేళ్ళకు బి.ఏ. పూర్తి చేశాడు. తండ్రి తీసే సినిమాలకు ప్రొడక్షన్ మేనేజరుగా వర్తిస్తూ కొంత జ్ఞానాన్ని, డబ్బు ఎలా సంపాదించాలనే విషయాన్ని తెలిసికొన్నాడు.


గ్రామానికి వచ్చిన అతని దృష్టిలో రంజనీ పడింది. యుక్త వయస్సులో అపరంజి బొమ్మలా, అందాల భామగా చూచిన వారి మతిని భ్రమింపచేసే రూపురేఖలతో వున్న రంజనీ, అతని హృదయంలో నిలిచిపోయింది.


తల్లి మంగతాయరుతో రంజనీని వివాహం చేసుకోవాలనే తన నిర్ణయాన్ని చెప్పి, తండ్రిని, రంజనీ తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం జరిపించవలసినదిగా కోరాడు భీమారావు.


అంతేకాదు, విలన్‍గా స్థిరపడ్డ రంగారావును కలిసి, తన నిర్ణయాన్ని తెలియజేశాడు. యీనాడు కులమతాలను గురించి చాలామంది పట్టించుకోవడం లేదన్నాడు.


నేటి ఈ లోకంలో ఎవడి స్వార్థం వాడిది. యితరులు ఏమైపోయినా ఫర్వాలేదు. తాను దర్జాగా హాయిగా వుండాలనే స్వార్థపు భావాలకు, ఏ రీతిగానైనా సరే ధనాన్ని ఆర్జించాలనే స్వార్థపు ఆలోచనలకు, ఎందరో అధినేతలు.


తమ కుటుంబానికి భీమారావు కుటుంబానికి రంజనీ మూలంగా బాంధవ్యం ఏర్పడితే, తన భవిష్యత్తు చిత్రరంగంలో ఎంతో బాగుంటుందని, బాతుల బంగారయ్య నిర్మించే ప్రతి చిత్రంలోనూ, తను బంధువుగా అయినందున విలన్ రోల్ తనకు రిజర్వేషన్‍గా వుంటుందని, కాలక్రమేణా హీరోగా మారే అవకాశాలు వస్తాయనే తీర్మానానికి వచ్చిన రంగారావు, మూడేళ్ళ తర్వాత, గ్రామానికి వచ్చాడు.


ఆకస్మాత్తుగా చెప్పా చేయకుండా మూడేళ్ళ తర్వాత ప్రత్యక్షమైన రంగారావును చూచిన తల్లి, తండ్రి, చెల్లి అతన్ని పలకరించలేదు.


తండ్రి, తల్లి, చెల్లి కాళ్ళావేళ్ళా పడి, తను తప్పు చేశానని చెంపలు తానే వాయించుకొని, వారిని ప్రసన్నులను చేసికొన్నాడు. ఎంతైనా కొంతవరకు నటుడుగా ఎదిగాడు కదా!


తల్లి మంచి మూడ్‍ను చూచి ప్రక్కన కూర్చొని నవ్వుతూ మెల్లగా, భీమారావు, రంజనీని యిష్టపడుతున్నాడని, ఒక్క పైసా కట్నం లేకుండా, పెండ్లి ఖర్చులనన్నిటిని తనే భరించి రంజనీని తన యిల్లాలుగా చేసికొంటాడని చెప్పాడు.


ఆ మాటలను విన్న లక్ష్మీదేవి త్రోక తొక్కిన నాగులా లేచింది. రంగారావు దుష్ట ఆలోచనలను ఖండించింది. కులంకాని వాణ్ణి గురించి మాట్లాడవద్దని ఛీ కొట్టింది.


విషయాన్ని విన్న రామారావు, రంజనీ, రంగారావును నిలదీసి నానామాటలు అడిగారు. యింట్లో నుంచి వెళ్ళిపొమ్మని, యికపై నీ ముఖాన్ని మాకు చూపించవద్దని శాసించి ప్రక్కకు వెళ్ళిపోయారు.


ఆ ముగ్గురి మాటలను విని భరించలేక, రంగారావు వారికి శాపం పెట్టి, ఆవేశంతో హైదరాబాద్‍కు బయలుదేరాడు.


అర్థాంగి మంగతాయరు భర్త బాతుల బంగారయ్యతో, తమ తనయుడు భీమారావు కోర్కెను తెలియజేసింది. సావధానంగా విన్నాడు బంగారయ్య.


వయస్సు మీరే కొద్దీ ప్రతి వ్యక్తిలోనూ పాప పుణ్య విచారణ ఒక్కో సమయంలో కలుగుతుంది. దానికి కారణం భయం, చేసిన పాపాలు భావి జీవితంలో తనకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయేమో అనే అనుమానం. ఈ స్థితికి చేరిన మహానుభావులు నిజంగా సూపర్ మ్యాన్స్. వారిని గురించి ఆలోచించడం గాని చర్చించడం గాని ఆనందకరమైన విషయం.


ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళుగా బాతుల బంగారయ్యకు ఆ భయం పట్టుకుంది. ఆ కారణంగా అతని ఆలోచనల్లో, చర్యల్లో ఎంతో మార్పు కలిగింది. తను రామారావుకు చేసిన న్యాయాన్యాయాలు గుర్తుకు రాసాగాయి.


ఆ తలంపుతో అర్థాంగి మంగతాయారు చెప్పిన మాటల విషయంలో తన ఆమోదముద్రను వేశాడు.


పెండ్లిళ్ళ డలారి, రాజగోపాల్ శాస్త్రిని పిలిపించి రామారావుగారిని కలిసి, తన నిర్ణయాన్ని తెలిపి రంజనీ జాతకాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు.


భర్త తన మాటకు ఎదురు చెప్పకుండా కార్యాచరణకు దిగినందుకు మంగతాయారు, తన తల్లిదండ్రులకు తనపై వున్న ప్రేమను తలచుకొని భీమారావు సంతోషించారు.


కానీ, యిల్లు అలకగానే పండగ కాదుగా!


రాజగోపాల్ శాస్త్రి లక్ష్మీదేవి రామారావు దంపతులను కలిశాడు. మంచి సంబంధం వుందని అమ్మాయి జాతకాన్ని యిమ్మని, రంజనీ జాతకాన్ని చేతికి తీసుకొని సుదీర్ఘంగా చూచాడు.


అతని ముఖ కవళికలు మారిపోయాయి. వారినే చూస్తున్న రామారావు దంపతులు ఆశ్చర్యంతో విషయాన్ని అడిగారు.


విచారవదనంతో శర్మగారు, "అమ్మా! అమ్మాయిగారి నక్షత్రం మూల ప్రథమ పాదం. వీరికి చూడవలసిన సంబంధం, మామగారు లేనిదిగా చూడాలి. యిప్పుడు నేను తెచ్చిన సంబంధంలో, ఆ యింటి యజమాని లక్షణంగా వున్నాడు. కాబట్టి ఆ సంబంధం మనకు పనికిరాదు" చెప్పి, లేచి నిలబడి జాతకాన్ని రామారావు గారికి అందించి వీధివైపుకు నడిచాడు రాజగోపాల్ శాస్త్రి.


బాతుల బంగారయ్య దంపతులను కలిసి విషయాన్ని తెలియజేశాడు.


వారు చెప్పిన మాటలను విన్న, ఆ దంపతులకు భీమారావుకు తలలు తిరిగిపోయాయి. మౌనంగా వుండిపోయారు. రంజనీ కోడలైతే చచ్చిపోతాననే భయం కలిగింది బంగారయ్యకు.


రాజగోపాల్ శాస్త్రి వారికి, మరో మంచి సంబంధం చూస్తానని, భీమారావు వివాహాన్ని తన చేతుల మీదుగా ఘనంగా త్వరలో జరిపిస్తానని చెప్పి తన యింటివైపుకు నడిచాడు.


శాస్త్రిగారు చెప్పిన మాటలకు లక్ష్మీదేవి రామారావులు బాధపడ్డారు. మన జీవితకాలంలో మనం యీ పిల్లకు పెళ్ళి చేయగలమో లేదో అని వాపోయారు.


రంజనీ పట్నం నుంచి వచ్చింది. ఆ రోజు శనివారం. తనకు ప్రమోషన్ వచ్చిందని పదివేలు జీతం పెరిగిందని తల్లికి తండ్రికి స్వీట్లను ఆనందంగా అందించింది.


వారి మనస్సుల్లో ఎంతో ఆవేదన వున్నా, ఆ చిన్నారి వదనంలో వున్న సంతోషాన్ని చూచి నవ్వుతూ ఆమె అంచిందిన స్వీటును అందుకొన్నారు. రంజనీ ప్రైవేటుగా ఎం.బి.ఏ. చదవడం ప్రారంభించింది.


స్వీటు నోట్లో తియ్యగా వున్నా వారిరువురి మనస్సుల్లో శర్మగారు చెప్పిన మాటలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఆమె జాతక రీత్యా తగిన సంబంధాన్ని చూచి వివాహం త్వరలో జరిపించాలని నిర్ణయించుకొన్నారు.


రామారావుగారు రాజగోపాల్‍ను కలిసి తన బిడ్డకు తగిన సంబంధాలను చూడమని కోరారు.


దాదాపు, పది సంబంధాలు వచ్చాయి. కట్న కానుకల విషయంలో వారి ఆశించినంత వీరు యివ్వలేకపోయినందున వచ్చినవారు సంబంధాన్ని కాదని వెళ్ళిపోయారు.


ఎనిమిది నెలల కాలంలో ప్రతినెలా జరిగే ఆ పెళ్ళి చూపుల తంతును, చూడవచ్చిన వారు మౌనంగా వెళ్ళిపోవడం, చూచిన రంజనీకి మన వివాహ వ్యవస్థ మీద, పెండ్లి కొడుకు తల్లిదండ్రులు చేసే డిమాండ్‍ల మీద అసహ్యం కలిగింది. తను వివాహం చేసుకోకపోతే బ్రతకలేనా! తన తల్లిదండ్రులను తాను జాగ్రత్తగా చూచుకోలేనా? అనే భావాలతో పంతంతో చదివి ఎం.బి.ఏ. పాసయింది.


"అమ్మా! నాన్నా! మీరు నాకు వివాహం కాలేదని దిగులుపడవద్దు. నాకు ప్రస్తుతంలో వివాహం చేసుకోవాలని మిమ్మల్ని విడిచి వేరొకరింటిని వెళ్ళాలనే వుద్దేశ్యం లేదు. వివాహ విషయంలో నాకు కొన్ని నియమాలు వున్నాయి. మొదటిది, నన్ను నచ్చి పెండ్లి చేసుకొనేవాడై వుండాలి. రెండవది, నా తల్లిదండ్రులైన మీ ఇరువురినీ, తన తల్లిదండ్రులుగా భావించి మిమ్మల్ని నా నుండి విడదియ్యకుండా వుండాలి. మూడవది, నేను ఉద్యోగాన్ని కొనసాగించే దానికి అంగీకరించాలి. నాల్గవది, మీనుండి నన్ను పెండ్లి చేసుకోదలచిన అతను ఎలాంటి కట్న కానుకలు, లాంఛనాలు ఆశించకూడదు. సింపుల్‍గా గుడిలో పెండ్లి జరిగిపోవాలి. నా వివాహం నేను చెప్పిన షరతులకు అంగీకరించిన వారితోనే జరుగుతుంది. అది ఎప్పుడో అని మీరు నన్ను అడిగితే ప్రస్తుతంలో నేను మీకు జవాబు చెప్పలేను. యీ సమస్యను పరిష్కరించవలసింది కాలం. మనుషులు కాదు. యిక మీ ప్రయత్నాలు ఆపండి." ఆవేశంగా చెప్పింది రంజనీ.


కన్నకొడుకు కాదని వెళ్ళిపోయినా, ఆడపిల్ల అయిన రంజనీ తమపట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు, లక్ష్మీదేవి రామారావు దంపతులు ఎంతగానో సంతోషించారు.


యిష్టదైవం జగత పిత సర్వేశ్వరుని, తమ బిడ్డ ఆశయాలను తీర్చమని చేతులు జోడించి వేడుకొన్నారు.-----నెలకు ముప్ఫై వేలు చొప్పున పంపుతున్న రమణతో ఫోనులో మాట్లాడాలని నిర్ణయించుకొంది రంజనీ. ఎనిమిదేళ్ళయింది తను అతనికి సన్నిహితంగా నిలబడి మాట్లాడి. కానీ, నెలకు రెండుసార్లు ఆనంద్‍కు ఫోన్ చేసి ఆ తల్లి కొడుకుల యోగ క్షేమాలను తను తెలిసికొంటూ ఉంది.


ఈనాటిని రమణ తనకు అన్నివిధాలా తగిన వాడనే నిర్ణయానికి వచ్చింది. అతనికి ఫోన్ చేసింది.


"హలో! ఎవరండీ?" రమణ ప్రశ్న.


"నాపేరు రంజనీ సార్!"


"ఏ రంజనీ?" ఆశ్చర్యంతో అడిగాడు రమణ.


"మీరు ప్రేమలేఖను వ్రాసిన రంజనీ!" నవ్వుతూ అంది.

రమణ ఉలిక్కిపడ్డాడు. వెంటనే బదులు చెప్పలేకపోయాడు. తమాయించుకొని, "మీకు ఆ లేఖను వ్రాసింది నేను కాదు" ముక్తసరిగా చెప్పాడు రమణ.


"నాకు ఆ విషయం తెలుసు"


"అమ్మా నాన్నా బాగున్నారా?" ఆ ప్రసంగాన్ని మార్చేటందుకు అడిగాడు రమణ.


"మీ దయవలన బాగున్నారు" అంది రంజనీ.


"వారిపట్ల నా దయేముందండి?"


"ప్రతినెలా ముఫ్ఫైవేలు పంపుతున్నారుగా!"


"అది నా ధర్మంగా భావించానండి. కారణం నేను మీ అమ్మగారు యిచ్చిన రెండు లక్షలతోనే ఇంజనీరింగ్ కాలేజీలో చేరగలిగాను."


"నేను ఇప్పుడు బాగా ఎదిగాను. మీ అంత గొప్ప కంపెనీ కాకపోయినా సుమారైన కంపెనీలో ప్రాసెస్ మానేజర్‍గా పనిచేస్తున్నాను. యింతకాలం మీరు మా కుటుంబానికి చేసిన సాయానికి మీకు నా ధన్యవాదాలు. యికపై మీరు డబ్బును పంపనవసరం లేదు."


ఆ మాటలను విని రమణ మౌనంగా వుండిపోయాడు.


కొన్ని క్షణాల తర్వాత రంజనీ:


"నేను చెప్పింది మీకు అర్థం అయిందా?"


తొట్రుపాటుతో, "అయింది"


"థాంక్యూ. ఆఁ, మీ అమ్మగారు బాగున్నారా?"


"షి ఈజ్ ఫైన్."


"మీకు వివాహం అయిందా?"


రంజనీ యీ ప్రశ్నకు రమణ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అతను ఆలోచనలో వుండగానే,


"పిల్లలు ఎంతమంది?"


రమణ అప్రయత్నంగా "ఆఁ" అన్నాడు.


దాన్ని విన్న రంజనీ, "ఎందుకు ఆశ్చర్యపోతున్నారు?" అంది.


"ఏమండీ!"


"చెప్పండి"


"నాకు యింకా పెళ్ళి కాలేదు" కాస్త విసుగ్గానే చెప్పాడు రమణ.


"ఓకే. గుడ్ థాంక్యూ. ఆల్ ది బెస్ట్" నవ్వి తన సెల్‍ను కట్ చేసింది రంజనీ.


"హమ్మయ్యా!" అంటూ సోఫాలో కూలబడ్డాడు రమణ.


============================================================

ఇంకా వుంది..

మదిలో మల్లెల మాల - పార్ట్ 13 త్వరలో

============================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page