ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11
- Pandranki Subramani

- 2 days ago
- 7 min read
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 11 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 21/01/2026
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.
తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.
సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 11 చదవండి.
మరునాడు అదేరీతిన ఏడుగురూ వసారాలో బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. శివగామి అక్కడికి ప్రవేశించిన వెంటనే అందరూ లేచి శుభోదయం పలికారు. ఆమె మొదట సోమ్రాజుని సమీక్షకు తీసుకుంది.
తీసుకుంటూ అడిగింది- “నువ్వు తరచుగా ఎదుర్కునే సిలబస్ మేటర్‌ని అప్డేట్ చేసుకున్నావా?”
అతడు నిజాయితీగా బదులిచ్చాడు. “పూర్తిగా చేయలేకపోయానని అనిపిస్తోంది మేడమ్!”
నవ్వుతూ స్పందించిందామె- “ఔను. వీలుపడదని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని— మరీ పాతబడ్డ జనరల్ నాలెడ్జి- జనరల్ స్టడీస్ పుస్తకాలను పక్కన పెట్టి ఖర్చు ముఖం చూడకుండా కొత్తవి కొనుక్కోవడం. ఇక మరొకటి- దినపత్రిక ప్రతిరోజూ చదువుతున్నావా?”
తెలుగు దినపత్రిక చదువుతున్నానని బదులిచ్చాడు సోమ్రాజు.
ఆ మాటకామె దిద్దుబాటు చేసింది..“చాలదు. ఆంగ్ల దినపత్రిక కూడా చదువుతుండాలి. వాటిలోని ముఖ్య అంశాలను నోటు పుస్తకంలోకి దించుకోవాలి. మా ఇంటికి ఎలాగూ ఆంగ్ల పత్రిక వస్తుంది కాబట్టి దానిని సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకెళ్లి చదువుకో. ఇక ఆఖరి విషయం— అన్నీ కాకపోయినా కొన్ని పోటీ పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా జరుగుతాయి. దానికి ఇప్పుడే సంసిద్ధుడవై షార్ట్ టార్మ్ కోర్సులో చేరిపో—
ఇవన్నీ ఏకకాలంలో చేయడం కష్టమే మరి. కాలంతో బాటు మనం కూడా మారాలి కదా— అప్డేట్ చేసుకుంటూ పోవాలి కదా.. మనం ఔనన్నా కాదన్నా ఇది డిజిటల్ యుగం కదూ! అంతేకాదు. స్టేట్ గ్రూప్ పరీక్షల్లో గాని సెంట్రల్ స్టాఫ్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షల్లో గాని కంప్యూటర్ విద్య తెలిసుండాలని అంటున్నారు. ఇక ప్రైవేట్ సెక్టారు గురించి చెప్పనే అవసరం లేదు.
స్థిరమైన ఉద్యోగం హుందా గల పని వాతావరణం కావాలంటే మనం కాస్తంత శ్రమించే తీరాలి కదా! నౌ- లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్- హార్డ్ వర్క్ నెవర్ గో వేస్ట్- ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇక నువ్వు వెళ్లొచ్చు సోమ్రాజూ!”
అతడు నిదానంగా చూస్తూ బదులిచ్చాడు-“లేదు మేడమ్. అందరికీ కోచింగ్ క్లాసు అయ్యేంత వరకూ నేనిక్కడే కూర్చుంటాను మేడమ్. ఇక్కడ కూర్చుంటే నాకు బాగుంటుంది మేడమ్—”
ఆమె తలూపుతూ బాల్రాజుని పిలిచింది. అతడు చెప్పసాగాడు- “నాకు ఇంటర్ రెండు సార్లు పోయింది మేడమ్. నాకు ప్రైవేటు సెక్టారులో కూడా స్థిరమైన కొలువు దొరకడం కష్టమేనేమో! ఇప్పుడు వ్యవసాయంలో మా అన్నలకు సహాయం చేస్తూ పొలం పనులు చూసుకుంటున్నాను మేడమ్. ఇకపైన మీరు చెప్పినట్టు చేస్తాను మేడమ్. ఇప్పటికిప్పుడు మరొకసారి కాలేజీకి వెళ్లే ఛాన్స్ లేదు మేడమ్”
ఆమె నవ్వుతూ స్పందించింది. “నిజాయితీగా నిక్కచ్చితనంతో చెప్పావు. నాకు నచ్చింది. ఒకటి గుర్తుంచుకో— ఈ ప్రపంచం చాలా పెద్దది. చిత్తశుద్ధితో ప్రయత్నించాలే గాని ఏదో ఒక మూల ఏదో ఒక అవకాశం ఉండకపోదు. ఎంత చెట్టుకి అంతగాలి— నీ స్కూలు రోజుల్లోగాని- ఈ మధ్యగాని ఏమైనా గుర్తింపు పొందిన మంచి కార్యాలు చేసున్నావా?”
బాల్రాజు ఇబ్బందికరంగా ముఖంపెట్టి అన్నాడు. “గొప్ప కార్యాలేవి చేసినట్టు గుర్తు లేదండి. స్పోర్ట్సులో కూడా నాకు స్థానం లేదండి- పొట్టిగా ఉంటానని. ఒకసారేమో సర్పంచూ తహశిల్దారూ కలసి ఐదు వందల నోటు ఇచ్చారండీ!”
ఎందుకననట్టు ప్రశ్నార్థకంగా చూసిందామె.
“వర్షాకాలంలో మా ఊరి కాలవలో ఈత కొడుతూ ఇద్దరు బడి కుర్రాళ్ళు కొట్టుకు పోతున్నప్పుడు నేను చట్టున కాలవలోకి దూకి వాళ్ళిద్దరి జుత్తూ పట్టుకుని పక్కకు చేర్చానండి— అందుకు బహుమానంగా—”
“దానికి గుర్తింపుగా సర్టిఫికెట్ ఏదైనా ఇచ్చారా!”
బాల్రాజు నసుగుతూ అన్నాడు- “ఏదో పత్రం ఇచ్చినట్టున్నారు మేడమ్. కాని అదిప్పుడు ఎక్కడుందో గుర్తులేదు. వెతికి తెమ్మంటే తీసుకు వస్తానండి”
“చూడు బాల్రాజూ! అన్నిటికీ అన్ని కార్యాలకూ రూల్ బుక్కులో ప్రస్తావన ఉండకపోవచ్చు. కాని ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో మంచి కార్యానికి గుర్తింపు తప్పకుండా ఉంటుంది. దానికి సమయం రావాలి- అంతే..
ఉదాహరణకి చక్కటి చేతి వ్రాతకి అదనపు మార్కులు వేయాలని ఎక్కడా రూల్ బుక్కులో లేదు. కాని- టీచర్స్ ముఖ్యంగా లేడీ టీచర్స్ మంచి చేతి వ్రాతను ఇష్టపడతారు. ఐదారు మార్కులు అదనంగా విదిలిస్తారు. అటువంటిదే ఇది కూడా..
మొన్న చదివాను ఏదో సెంట్రల్ సంస్థలో సెక్యూరిటీ అసిస్టెంట్లు కావాలట. ఎంపికైన వారికి ట్రైనింగు ఇచ్చి పని తీరును బట్టి పోస్టుని క్రమబద్ధీకరించుకుంటారు. పత్రిక ప్రకటన నావద్ద ఉన్నట్లుంది. దానికి ఇంటర్ వరకూ చదివుంటే చాలు. వాళ్ళు చెప్పిన టైము లోపల చెప్పిన దూరానికి పరుగు పూర్తి చేయాలి. దీనికి పొడవు అవసరం లేదు. ఐతే ఆ పోస్టుకి ఆన్ లైన్ ద్వారా అప్లై చేయాలి. నేను చెప్పినవన్నీ తీసుకురా— ఆన్ లైన్ లో దరఖాస్తు నేను తయారు చేస్తాను”
ఆ మాట విన్నంతనే బాల్రాజు ముఖాన వెలుగు మెరిసింది. “ఇప్పుడు తెస్తాను మేడమ్!” అని అక్కడినుండి కదలబోయాడు.
శివగామి ఆగమంది. తరగతి పూర్తయ్యేంత వరకూ ఉన్నచోటే కూర్చోమంది. అప్పుడు వీర రాఘవ చటుక్కున లేచి నిల్చున్నాడు- “నేను పదవ తరగతి వరకే చదువుకున్నాను మేడమ్. నేను కబడ్డీ బాగా ఆడతాను మేడమ్. నేను దేనికైనా అప్లై చేసుకోవచ్చా మేడమ్! నిజం చెప్తున్నాను నాకు సర్కారు కొలువులో చేరాలని చాలా ఇదిగా ఉందండి”
“నేను ముందే చెప్పాగా— ఈ ప్రపంచం చాలా విశాలమైనదని— ఏదో ఒక మూల ఏదో ఒక అవకాశం దొరక వచ్చని. మొన్ననే ఒక సేవాతత్పరత గల స్వచ్ఛంద సేవా సంస్థ ప్రకటన చేసింది. వృత్తి విద్యలైన కార్పెంటర్- ఎలక్ట్రీషియన్- హౌస్ కీపింగ్- లేబ్ అసిస్టెంట్ పోస్టులకు షార్ట్ టార్మ్ ట్రైనింగ్ ఇప్పిస్తారని.
మూడునెలలు ట్రైనింగ్— భోజనం- గది వసతి- అంతా వాళ్లే ఉచితంగా ఏర్పాటు చేస్తారు. అందరికీ కాదు— ఇంటర్వ్యూలో ఎంపికైన వారికే.. ఎవరెవరికి ఇందులో ఆసక్తి ఉందో నాకు చెప్తే వాళ్లకు తదనుగుణంగా దరఖాస్తు తయారు చేసి ఇస్తాను. ఇక ఆఖరు మాట— బౌద్ధ ధర్మసూత్రమంతటి మాట- అందరూ చెవులొగ్గి వినాలి. మనసు పొరన ముద్రించుకోవాలి, ఏమిటో తెలుసా?
బాగా వినండి. దేనినీ ఎక్కువగా ఆశించకూడదు. త్వరగా పొందాలని అసలే ఆశించకూడదు. నిదానంగానే ముందుకు సాగాలి. రావలసింది దానికదే వచ్చి చేరుతుంది. అనుకున్నది సాధించలేక పోతే పట్టు విడవకుండా మరొక ప్రయత్నం చేయాలి. చేస్తూనే ఉండాలి. ఇక ఆఖరు మాట ఒకటి చెప్పి ముగిస్తాను. ఆఖరి మాటే- కాని చాలా ముఖ్యమైన మాట. ఎవరైతే— ఉద్యోగంలో ఉండాలని ఆశిస్తున్నారో— ముఖ్యంగా ప్రభుత్వ సంస్థ కొలువులో స్థిరపడాలని కోరుకుంటున్నారో— అటువంటి వాళ్ళు తక్షణం వాళ్లకు వాళ్ళు సర్వగుణ సంపన్నులుగా మారిపోవాలి. చెడు సహవాసాలకు దూరంగా తొలగిపోవాలి. మసకబడ్డ రికార్డు లేకుండా చూసుకోవాలి. ఆకతాయి వేషాలకు దూరంగా ఉండి పొగచూరు పోకుండా చూసుకోవాలి. కొన్ని రకాల ఉద్యోగాలకు వ్యక్తిగత రికార్డు తప్పనిసరిగా చూస్తారు. ఇలా చెప్పుకుపోతే మీకు పాయింటు అందకపోవచ్చు.
ఒక ఉదంతం చెప్తే విషయం మీకు మక్కికి మక్కిగా బోధపడుతుంది. ఒకరాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి మూడువేల మంది అభ్యర్థులు వ్రాత పరీక్ష వ్రాసారు. వాళ్లలో వేయిమంది ఉత్తీర్ణులయ్యారు. వాళ్లలో ఏడు వందల మందికి ఆనవాయితీ ప్రకారం పోలీసు ట్రైనింగుకి రమ్మని పిలిచారు. ఇది తెలుసుకుని మిగతా మూడు వందల మంది ఆందోళన చెందారు. ఉత్తీర్ణులైన లిస్టులో ఉన్న వాళ్ల పేరు గమనించలేదేమోనని పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు వరసగా నిల్చుని తమ పేర్లను అధికారులు మరచిపోయారని గుంపుగా చేరి మొర పెట్టుకున్నారు.
చివరకు వాస్తవం అదకాదని తెలుసుకుని ఖంగుతిన్నట్టయ్యారు. ఏమిటా వాస్తవమో తెలుసా! పలు పోలీసు స్టేషన్లలో వాళ్ల పేర్లు చిన్న చిన్న కేసులతో లింక్ అయి ఉన్నాయి. నిజానికి అవన్నీ చిన్న కేసులే— కాని— పోలీసులకు అవి సీరియస్‌గానే కనిపిస్తాయి, అవన్నీ క్లియర్ ఐన తరువాతనే దానికి అనుగుణంగా పోలీసు రిపోర్టు వచ్చిన తరువాతనే మిగతా వాళ్లకు కాల్ లెటర్స్ పంపిస్తామని ఆందోళన చేస్తున్నవాళ్ళందరినీ ఇండ్లకు సాగనంపారు.
నేను చెప్పొచ్చేదేమంటే పోలీసు ఇంక్వైరీ సీరియస్ వ్యవహారమని. దాదాపు అన్ని స్టేషన్లకూ క్యాండిడేట్ల డేటా అనుసంధానమై ఉంటుంది. ఇది మనం గుర్తించుకోవాలి. గుడ్ డే..“అంటూ శివగామి కుర్చీలోనుండి లేచింది. నేలపైన చాపలపైన కూర్చున్న వారందరూ లేచి ఆమెకు నమస్కారం చెప్పారు.
..
ఇది జరిగిన మరునాడు శివగామికి మరొక చిక్కు వచ్చి పడింది. చంద్రికా మాధవి ఇద్దరూ మరొక నలుగురు అభ్యర్థుల్ని తీసుకు వచ్చి ఆమె ముందు నిల్చోబెట్టారు. వాళ్ళను చూసి ఆమె ఉలిక్కిపడింది.
“మాధవీ! వీళ్ళందర్నీ బాగా ఆలోచించే ఇంటికి రప్పిస్తున్నావా? రోజంతా క్లాసులు నడుపుతూ ఉంటే ఇంటి పనులెవరు గమనిస్తారు? తోటకు నీళ్ళెవరు పోస్తారు? చెట్లకు ట్రిమ్మింగ్ ఎవరు చేస్తారు? నువ్వేమో మీ అక్కయ్యతో కలసి తిన్నగా హైస్కూలుకి వెళ్ళిపోతావు— మరి అత్తయ్యకు ఇంటి పనుల్లో ఎవరు సహాయం చేస్తారు? అత్తయ్యతో నాకు తిట్లు తినిపించాలనే తీర్మానించావన్నమాట!”
ఆ మాట విన్నంతనే అక్కాచెల్లెళ్ళిద్దరూ చేతులు జోడించి సారీలు గుప్పిస్తూ నివేదించారు- “ఎంత వద్దని విదిలిస్తున్నా మమ్మల్ని విడిచిపెట్టకుండా వెంబడిస్తూనే ఉన్నారు వదినా! అడిగినంత ఫీజు కూడా ఇచ్చుకుంటామని మొరపెట్టుకుంటున్నారు వదినా! చిన్నప్పట్నించీ మాకు బాగా తెలిసిన ముఖాలు. ఎలా తప్పుకోవాలో మీరే చెప్పండి వదినా! ఇకపైన మేమిద్దరమూ స్కూలు నుండి వచ్చి నీకు తోట పనుల్లో సహాయం చేస్తుంటాంలే..సరేనా!”
శివగామి వాళ్ళిద్దరి ముఖాలలోకీ తేరి చూస్తూ తిన్నగా వెళ్ళి విషయాన్ని అత్తయ్య పుష్పవల్లికి వివరించి చెప్పింది. అది విని ఆమె ఆలోచనలో పడింది. నిజమే! వాడలోని చాలామందివి తెలిసిన ముఖాలే..వాళ్ళ ముఖాన వీల్లేదని చెప్పడం అంత సులభ సాధ్యం కాదు. మనస్తాపాలు కలగకపోయినా, ఎడముఖాలు పెడముఖాలూ ఎదురు కావచ్చు. ఎట్టకేలకు నోరు తెరిచిందామె. “నాకూ ఏమీ చెప్పాలో తోచడం లేదుమ్మా! మురళి క్యాంపుకి వెళ్ళినవాడు ఇంకా రానట్టున్నాడు. వాడు గాని వస్తే— వాడితో మాట్లాడతాలే! రోజులు బాగా లేవు. ఇంతమంది నీవద్దకు కోచింగ్ కోసం వస్తున్న సంగతి మీ మామగారికి తెలుసా?”
శివగామి తెలుసన్నట్టు తలూపింది.
అదే రోజు సాయంత్రం మరొకసారి చంద్రికా మాధవి కలసి వచ్చారు. వాళ్ళను చూసి అదోలా ముఖం పెట్టి చూసింది శివగామి- “నేను ముందే చెప్పాగా! మీ అన్నయ్య వచ్చిం తర్వాత కలసి మాట్లాడి చెప్తానని..”
అప్పుడు చంద్రిక స్పందించింది.
“అబ్బే— మేం అందుకు రాలేదొదినా! ఈరోజు దుర్గాదేవికి అలంకారం శ్రీ సరస్వతీ దేవి అవతారం. నీకోసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్టున్నారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ-విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా”
అక్కయ్యను మాధవి ఆపింది. “నువ్వూరుకోవే అక్కాయ్! వదిన తమిళనాడు నుంచి వచ్చింది. మరచిపోకు..అక్కడ గుళ్ళో పూజారులు తమిళంలోనే దేవార్చన చేస్తారట. తమిళం తప్ప మరేదీ దగ్గరకు చేరనివ్వరట—”
శివగామి ఆడపడుచు వేపు దీర్ఘంగా చూసింది. “అలా ఎవరన్నారు? భక్తుల కోరిక ప్రకారం సంస్కృతంలో కూడా దైవార్చన చేస్తారు. నాకు తెలుగు సరిగ్గా రాకపోవచ్చు గాని, కాంచీపురంలో ఉన్నవాళ్ళందరూ తమిళులు కారు. తెలుగు వారు కూడా బాగానే ఉన్నారు. ఎటొచ్చీ వాళ్ళ తెలుగు ఇక్కడి తెలుగులా ఉండకపోవచ్చు. ద్రావిడ పార్టీ మొదటి ముఖ్యమంత్రి ఎవరనుకుంటున్నావు? దివంగత అణ్ణాదొరై గారు తెలుగువారే— కాంచీపురానికి చెందిన వారే..వాళ్ళ తల్లి పేరు చెప్తాను. వినండి- బంగారమ్మ. ఆమెగారు చనిపోయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా శ్మశానం వరకూ వెళ్ళారు తెలుసా! సరే—అదలా ఉంచు. ఇప్పుడీ ప్రత్యేక సరస్వతీ పూజ ఎందుకంట?”
ఈసారి చంద్రిక బదులిచ్చింది- “ఇంకా నీకు తట్టలేదా వదినా! ఇప్పుడు నీ వద్దకు గైడన్స్ కోసం వస్తూన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది పోటీ పరీక్షల్లో రెండు మూడు అటెంప్ట్స్ చేసిన వాళ్ళే— ఈరోజు సరస్వతీ పూజా కార్యక్రమం వాళ్ళు కలసి చేస్తున్నదే— నిన్ను తోడ్కొని రమ్మని మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు”
ఈసారి శివగామి చురుగ్గా రిటార్ట్ చేసింది. “అలాగే అనుకో— మరి నేను మాత్రమే ఎందుకు రావాలి? మా అత్తయ్య పెద్దత్తయ్య నాతో కలసి వస్తారు. వాళ్ళకేమైనా అబ్జెక్షనా!”
అక్కాచెళ్ళెల్లిద్దరూ ఏక కంఠంతో బదులిచ్చారు- “నో నో నాట్ ఆల్! అమ్మలిద్దరతో బాటు బాబులిద్దరు కూడా రావచ్చు. అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం- దద్ద్యోజనం- పాయసం- మంచి మంచి తీపు పదార్థాలు. అలంకరించే చీర రంగు- తెలుపు. అర్పించే పూలు- కలువపూలు. పారాయణం చేయాల్సినవి. సరస్వతీ స్తోత్రాలు” అక్కాచెళ్ళెల్లిద్దరూ పూజా విధానం కోసం ఇచ్చిన నిర్వచనం విని శివగామి నిండుగా నవ్వి ఇద్దరి నెత్తిపైనా చిన్న పాటి మొట్టికాయలు పెట్టింది.
“పొద్దుటే తలంటు స్నానం చేసాను. నా జుత్తు కాస్తంత ఒత్తుగా ఉంటుంది కదూ! జడ వేసుకుని చీర మార్చుకుని రావడానికి సమయం పడుతుంది. ఆగుతారు కదూ!”

దానికి ఇద్దరూ కూడబల్కుకున్నట్టు వెంటనే స్పందించారు. “ఆగడం ఎందుకు వదినా! మేం లేమూ నీకు చకాచకా జడ ఒత్తుగా అల్లడానికి. నీకు చీర కూడా మేమే కట్టబెడతాం. గోరింటాకు కూడా పెడతాం. పద పద” అని ముందుకు కదిలారు.
వాళ్ళ ఉత్సాహం చూసి ఆమె గట్టిగా నవ్వేసింది. సిటీ ఆఫ్ టెంపల్స్- పేరున్న కాంచీపురంలోని గుడి ప్రమిదల వెలుగులు ఆకాశ దీపాల కాంతులు ఆమె కళ్ళముందు విరజిమ్మాయి. పొరుగు తెలుగు రాష్ట్రపు మెట్టింట్లో తన జీవితం ఇంత సందడిగా ఉండబోతుందని ఆమె ఎన్నడూ ఊహించలేదు. అనుమానం ఉన్నచోట భయం ఉండనే ఉంటుంది కదా! ఇప్పుడా భయం ఎక్కడికి ఎగిరిపోయిందో తనకే తెలియదు.
ఇంతవరకూ ఊరినుండి ఫోను వచ్చినప్పుడల్లా అటునుంచి వచ్చే పరామర్శను వినడమే గాని, తన తరపున తను చేరిన మెట్టింటి గురించి పెదవి విప్పేది కాదు. ఎందుకంటే— ఇక్కడి వాళ్ళ మూడ్స్ గురించీ దైనందిన ఆచారాల ఆనవాయితీల గురించీ తనకు అంతగా తెలియదుగా! తను రావడం ఇక్కడి వాళ్ళకు అంతగా నచ్చలేదని అవ్వ నర్సమ్మ గారి ఆవేశపూరిత ప్రవర్తనను నుంచి తెలుసుకుంది. కాని, అలాగని తననెవరూ నొప్పించలేదుగా!
త్యాగరాజు అంకుల్ గారి ఆసరా తనకెప్పుడు ఉంటూనే ఉందిగా! తనవల్లనేగా ఆయన తల్లి వద్ద లెంపకాయ తిన్నదీ..అత్తయ్యా పెద్దత్తయ్యా తనను కూతురులా చూసుకోవడం లేదూ! ఇది తన అదృష్టం కదూ! ఇక తను జాప్యానికి తావివ్వకూడదు. ఎట్టకేలకు తను రామకృష్ణాపురంలో కుదుట పడ్డదని, ఇక తనకోసం దిగులు మానుకొమ్మని స్థిరమైన కంఠస్వరంతో అప్పాకి అమ్మాకీ చెప్పాలి. అక్కయ్యలిద్దరికీ భరోసా ఇవ్వాలి. రాత్రిపూట కాకుండా ఇకపైన పగటి పూటే ఫోను చేయమని చెప్పాలి. మొదట తనకు కాకుండా అత్తయ్యకూ మామగారికీ ఫోను చేసి ఆ తరువాతనే తనతో మాట్లాడమని గట్టిగా చెప్పాలి. ఇదే కదా— రీతీ ఆనవాయితీ—
===============================================
ఇంకా వుంది
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 12 త్వరలో
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments