ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7
- Pandranki Subramani

- Dec 28, 2025
- 8 min read
Updated: Jan 3
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 7 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 28/12/2025
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
డిపార్టుమెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్ లో ఉంటాడు మధుమురళి. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్ళికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.
తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్ళి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్ర కిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం, పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు.
ట్రైనింగ్ ముగిసిన మధుమురళి భార్యతో కలిసి తన ఊరు చేరుకుంటాడు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 7 చదవండి.
మరునాడు ఉదయం యిద్దరూ చెన్నైలో దిగి కాసేపు హోటెల్ రూములో ఫ్రెషప్ అయి అదే బస్టేషన్ లో రామకృష్ణాపురానికి మరొక బస్సు యెక్కారు. ఇద్దరూ ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చున్న వెంటనే శివగామి బహు అలవోకగా అంది- “అంత సేపూ అడగాలనుకుంటూనే మరచిపోయినట్లున్నాను నిద్ర మత్తులో పడి— ఫ్రెషప్ చేసుకోవడంలో మునిగి— ఇప్పుడు గుర్తుకొస్తూంది. చెప్పండి— మిమ్మల్ని నిన్న రాత్రి డిస్టర్బ్ చేసానా? ”
“నాట్ యెటాల్. నన్ను మౌన నినాదంలా కలకలం రేపి డిస్టర్బ్ చేసింది అక్కడున్న నీ పేరంట్సు- ఇక్కడున్న మీ మావగారు త్యాగరాజు గారు”
“అదెలా? “ఆమె చిరునవ్వు దాచుకుంటూ అడిగింది.
” అదంతా తరువాత తెలుస్తుందిలే! ఇప్పటికి మనమిద్దరమూ గప్ చిప్—“
“అర్థమైంది. ఇకపైన మీ వాళ్ళందరూ నాతో తెలుగులోనే మాట్లాడతారని కూడా అర్థమైంది. తెలుగులో నన్నింకేమేమి అనబోతు న్నారో! నాకెంత వరకు అవగాహనకు వస్తుందో! ఇక చివరి ప్రశ్నొకటి వేయనా! ”
ఉఁ- అన్నాడతను శివగామి అందించిన దానిమ్మ గింజలు అందుకుంటూ..
“మీకు మీ తండ్రిగారి పట్ల అంత మర్యాదా! ”
“నాకు మా బాబు పట్లే కాదు. ఇక్కడున్న పెదబాబుగారి పట్లా అక్కడున్న పెదబాబు గారి పట్లా అదే గౌరవం ఉంది. ఇంకేమైనా అడగాలా—”
ఆమె తల అడ్డంగా ఆడించింది- లేదన్నట్టు- మరి కొన్ని దానిమ్మ గింజలు అతడి దోసిళ్లలో పెడుతూ—
ఎట్టకేలకు వధూవరులిద్దరూ రామకృష్ణాపురం చేరారు. ఇంటి ముంగిట టాక్సీలో దిగి మధు మురళి యింటి వసారా చుట్టూ పరకాయించి చూసాడు. అతడికి విస్మయం కలిగింది. తనకు చిన్నప్పట్నించీ తెలుసు పొద్దుటే యింటి గడపన యింతటి స్తబ్ధుగా ఉండదని. వారాలతో తిథిలతో నిమిత్తం లేకుండా రద్దీగా ఉంటుంది. అదేంవిటి మాధవి కూడా కనిపించదేం? ఆడాళ్ళ సంగతి అటుంచి పలకరింపుగా బాబు తమకెదురుగా రావచ్చు కదా! తన వెనుక తలవంచుకుని నిల్చున్న శివగామి వేపు తిరిగి చూసి యిబ్బంది కరంగా నవ్వాడు మధుమురళి.
ఇద్దరు ముగ్గురు కాదు—చాలామంది ఆడాళ్ళే యిండ్ల వాకిళ్ళ నుండి ముసిముసి నవ్వులతో తొంగి చూస్తున్నారు. గుసగుసలు పోతున్నారు. ఎలుకకు ప్రాణసంకటమైతే పిల్లికి చెలగాటం అంటే ఇదేగా .. అలా మనసులో అనుకుంటూ యిటు తిరిగి చూసేలోపల మాధవి గొంతూ చంద్రిక గొంతూ ఒకేసారి వినిపించాయి “ఒరేయ్ అన్నయ్యా! ఇటు చూడరా! కొత్త పెళ్ళాన్ని తరువాత తనివితీర చూసుకుందువు గాని- ఆరతి అందుకో—“
అతడు నవ్వుతూ—“నువ్వూరా! దగ్గరకి—“ అని శివగామికి చెప్పి ఆరతిపైన చేతులుంచబోయాడు.
“ఊఁ కుదరదు. చెల్లెళ్ళిద్దరికీ ఆడపడుచుల దక్షిణం పెట్టు”
మళ్ళీ అమ్మాయిల కరఘోష.. అతడు దక్షిణం యివ్వడానికి జేబులు వెతుక్కుంటున్నప్పుడు శివగామి- “మీ పర్సు నా వద్ద ఉంది” అని ఆంగ్లంలో చెప్పి అందించింది.
మురళి నవ్వుతూ రూపాయి నోట్లు పళ్ళెంలో పెట్టి ఆరతి తీసుకుని శివగామికి అడ్డుతొలిగాడు, ఆమె ఆరతిని కళ్ళకు హత్తుకుంది. అప్పుడు పెద్దమ్మ చిన్నకూతురు చంద్రిక అంది- “ఏంవిరా అన్నయ్యా! పర్సుని మాత్రమే వదినెకు సరెండర్ చేసావా లేక మరింకేదైనా సరెండర్ చేసావా! ఇప్పుడే చెప్పు. ఇక్కడే చెప్పు. మాకందరకూ తెలవాలిగా! “
అప్పుడు గుమ్మం వద్దనుండి తల్లి పుష్పవల్లి మెత్తటి మందలింపు వినిపించింది- “చాల్లేవే మీ ఆడపడుచుల ఆకతాయితనం! అందుకున్నారుగా మీవంతు దక్షిణం— తొలగండి.. ”
దానితో యిద్దరు అక్కాచెల్లెళ్ళూ వెనక్కి తగ్గారు. పుష్పవల్లికి ఆరతి పళ్ళెం అందించి యిద్దరూ మెట్లు దిగి వచ్చి శివగామి చుట్టూ చేతులు పోనిచ్చి లోపలకు నడిపించారు. నడుస్తూనే మాధవి స్వగతంలా అంది- “పర్వాలేదు. ఆరతి మాలాగే అందుకున్నావు.. ”
ఆ మాట విని శివగామి ఆశ్చర్యంగా చూసింది అర్థం కానట్టు—
అప్పుడు మాధవి మబ్బు రేఖను తొలగించింది- “మరేం లేదు వదినా! కొందరు స్త్రీలు ముఖ్యంగా మహారాష్ట్ర ఆడపడుచులు ఉత్తరాది ఆడపడుచులు ఆరతిని మనలా కళ్ళకు హత్తుకోరు. నెత్తికో జుత్తుకో బారుగా హత్తుకుంటారు. అదీ సంగతి.. ”
శివగామి నవ్వకుండా ఉండలేక పోయింది. “ఇక్కడి తెలుగమ్మాయిలు ఇటువంటివన్నీ గమనిస్తుంటారన్నమాట! ”
అలా మనసున అబ్బురపడుతూ ఆమె గడప దాటి అడుగు పెట్టీ పెట్టిన వెంటనే దూరాన చేతులు కట్టుకుని అదంతా చోద్యంగా చూస్తూ నిల్చున్న త్యగారాజు వద్దకు వెళ్ళి కాళ్ళకు నమస్క రించి పిమ్మట అత్తగారికి వంగి నమస్కరించ బోయింది.
ఆమె శివగామిని చప్పున ఆపి అక్కయ్య వేపు చేతులు చూపి- “పెద్దత్తయ్య సరోజమ్మ- ముందు పెద్దత్తయ్యకు నమస్కరించు” అంది.
శివగామి అలాగే చేసింది; అక్కా చెల్లెళ్లిద్దరికీ వరసన పాదాలకు నమస్కరించింది. అంతవరకూ ఉగ్గబట్టుకుని నిల్చున్న సరోజమ్మ యిక ఆపుకోలేక పో యింది. “ఏంవిరా అబ్బాయి! నువ్వు చదువుకున్నోడివేగా— పెళ్ళి నీకు మళ్ళీ మళ్ళీ జరగదుగా! ఇంట్లో పెద్దవాళ్ళం మేమున్నామన్నది నీకు తెలుసుగా— పుస్తెకట్టేముందు మాకొక మాట చెప్పాలని తోచవద్దూ? చప్పుడు లేకుండా భాష తెలియని అమ్మాయికి పుస్తెకట్టి ఊరికి తీసుకొచ్చేసావు. ఏం- ఇకపైన మా యింటికి యెప్పుడూ రావా—మా ముఖాలు చూడవా! నీకు మీ బాబంటేనే గురి. మీ బాబు మాట మాత్రమే వింటావు. నీ చూపులో మేమందరమూ గడ్డిపరకలం. అంతే కదూ! “
పెద్దమ్మ పలికిన ఆ ఒక్క మాటా మధుమురళికి తగలరాని చోట తగిలినట్లయింది. ముఖం వివర్ణమైంది. కనుకొలకుల్లో తుంపర నిలిచింది. ఇక యేదో ఒకటి చెప్పక తప్పదని తేల్చుకున్నాడు. “అలాకాదు పెద్దమ్మా! నాకు అమ్మవేరు. నువ్వు వేరా? మళ్ళీ పాతదంతా తిరగదోయడ మెందుకూ! మీ మరదిగారు అన్నఒకే ఒక మాట చెప్తాను. ఆతరువాత నేనేమీ చెప్పను. వింటావు కదూ పెద్దమ్మా! “
సరోజమ్మ తలూపలేదు. తలాడించ లేదు. నిశ్చలంగా చూస్తూ నిల్చుంది-
“నువ్వు గాని నా మాట ప్రకారం యిప్పటికిప్పుడు పెళ్లిపీటల పైన కూర్చోక పోతే నువ్వు మళ్ళీ మీ బాబుని రామకృష్ణాపురంలో చూడలేవు. ఇది సత్యం- అని ఒట్టు పెట్టి చెప్పాడు. అప్పుడు నాకు మా బాబు ముఖ్యమా లేక మీరందరి అనుమతి తీసుకునే వరకూ ఆగడం ముఖ్యమా! నువ్వే చెప్పు పెద్దమ్మా! “
సరోజమ్మ యేమీ అనలేదు. త్యాగరాజు వేపు సూటిగా చూసి మురళి నెత్తిపైన చేతులుంచి ఆ తరువాత తన మెడనుండి బంగారు గొలుసు తీసి శివగామి మెడలో వేసి చంద్రిక చేతిని అందిపుచ్చుకుని యింటి వాకిట వేపు అడుగులు వేసింది. వదినెను సాగనంపడానికి త్యాగరాజు యింటి గుమ్మం వరకూ నడిచాడు. కాంచిపురంలో పెళ్ళి మండపంలో కడపటి కూతురి పెళ్లాగిపోయినప్పుడు తన చిరకాల మిత్రుడు దీనదయాళన్ దంపతుల మన: స్థితి గురించి త్యాగరాజు ఆమెకు ముందే వివరించాడు. అవన్నీ వినే స్థితిలో ఆమె లేదేమో! తనకిష్టుడైన చెల్లి కొడుకు వివాహ మహోత్సవానికి హాజరు కాకపోవడం, కనులార తిలకించకపోవడం ఆమె వరకు జీవితంలో ఒక మైనస్ పాయింటే కదా! బంగరు తరుణం కోల్పోవడమే కదా!
.. .. .. .. .. .. ..
ఆనాడు చెలరేగిన దుమారం అంతటితో ఆగదని త్యాగరాజుకీ అతడి సతీమణి పుష్పవల్లికీ ముందే తెలుసు. ఇప్పట్లో ఆ దుమారం యెడారిలో లేచే సైకత మేఘంలా చల్లారదని సుడిగాలిలా ఆగదని కూడా వాళ్ళకు తెలుసు. వాళ్ళనుకున్నట్లే తమిళ కోడలు యిల్లు చేరిన వారం రోజుల తరువాత మాధవరం నుండి అత్త నర్సమ్మ ఆమె పెద్దకొడుకూ, పెద్దకోడలితో దిగారు. కొన్ని దుమారాలు అంతే! గమ్యం యెరగని యెడారి తుఫానులా తగ్గవు.
త్యాగరాజు మధు మురళితో బాటు వెళ్ళి తల్లికి అన్నావదినలకు ప్రత్యుత్థానం చేసి లోపలకు తీసుకు వచ్చాడు. శివగామి అత్తగారి సూచన ప్రకారం వెళ్ళి ఉమాదేవికి బొట్టు పెట్టి పెద్దావిడ నర్సమ్మకు వంగి నమస్మరించబోయింది. కాని ఆమె కాళ్ళను వెనక్కి తీసుకుంది. మ్రాన్పడిపోతూ శివగామి ప్రక్కన నిల్చున్న మధు మురళి వేపు నిస్సహాయంగా చూసింది. నథింగ్ టు వర్రీ—అన్నట్టు చూపు సారించాడతడు. కాని—వర్రీ అక్కడే అప్పుడే ఆరంభమైంది.
నర్సమ్మ అటు యిటూ చూడకుండా మనవరాలు మాధవి నవ్వు ముఖంతో అందించిన మంచి నీళ్ళ గ్లాసు అందుకోకుండా, ముఖంలోకి కూడా చూడకుండా చిన్న కొడుకు త్యాగరా జు వేపు తిరిగి అంది- “మధుమురళి నీ కొడుకే—నువ్వు కన్న కొడుకే—మేం కాదనడం లేదు. కాని—వాడికీ మాకూ మధ్యా యే సంబంధమూ లేదంటావు. అంతే కదరా! నాకు గాని, మీ అన్నయ్యకు గాని ఓ మాట చెప్పాలని తోచలేదు కదరా! ఇకపైన మా ఉనికితో సంబంధం లేకుండా మాతో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించేసావు. అంతే కదరా! “
అతడు తడబడుతూ చేతులు రెండూ క్రాస్ గా కట్టుకుని యెదో అనబోయాడు- “అది కాదమ్మా.. - “అని,
అంతే—అతడి చెంప ఛెళ్ళుమంది. అందరూ అదరిపోయారు. పుష్పవల్లి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. మాధవి చేతిలోని గ్లాసు క్రింద పడింది. అలా ఔతుందని కలలో కూడా ఊహించని సదానందం కొన్న క్షణాల పాటు నివ్వెరపోయి నిల్చున్నాడు. ఉమాదేవి పరిస్థితి కూడా అలాగే ఉంది. శివగామి కళ్ళలో నీరు సుళ్ళు తిరుగుతూంది. ఇదంతా తనవల్లే కదూ!
కాని—మధుమురళి మాత్రం చురుగ్గా తేరుకుని “బామ్మా! అదేంవిటి బామ్మా మా అందరి ముందూ బాబుపైన అంతలావు చేయి చేసుకుంటావూ! చూడు. అమ్మ యెంత అప్సెట్ ఐయిందో—“
అప్పుడు సదానందం నుండి గర్జన విని పించింది- “నోర్ముయ్యరా బడవ రాస్కెల్! ఇది మా అన్నాదమ్ముల మధ్య సాగుతూన్న సమస్య- నువ్వు మూడోవాడివి. దూరంగా తొలగి ఉండు. లేకపోతే—నీకూ అదే శాస్తి జరుగుతుంది” అని తల్లి వేపు తిరిగి వేదనా భరితంగా అన్నాడు-
“ఏంవిటమ్మా యిదంతా! నేను ముందే చెప్పాను కదమ్మా—వాడు మనల్ని ధిక్కరించేటంతటి వాడు కాదని. నిదానపరుడని—స్పార్థ చింతనతో నిర్ణయం తీసుకునే మనిషి కాడని.. కాంచిపురంలో అనుకోనిదేదో జరిగుంటుందని నేనెన్నిసార్లు చెప్పాను. విని అర్థం చేసుకున్నావా? వాడిదేమిటి—చిన్నప్పుడు నిక్కరు వేసుకుని మనింటి చుట్టూ సైకిల్ తో తిరిగే వయసనుకున్నావా? చెట్టంత కొడుక్కి తండ్రి. ఇప్పుడు అలా చూడు—నీ చిన్నకోడలూ మనవరాలూ యెంతలా అప్సెట్ అయారో! “
నర్సమ్మ ఆగలేదు. ఇసుమంత కూడా తగ్గలేదు. పెద్దకొడుకు వేపు తిరిగి అతడి జుబ్బా చేతిలోకి అందుకుని అంది- “తమ్ముణ్ణి వెనకోసుకు వస్తున్నావా! మరొకసారి నోరు తెరిచావనుకో- నీ చెంప కూడా పగిలిపోద్ది. మీ అన్నాదమ్ములిద్దరూ నాగురించి యేమనుకుంటున్నారు? చేవలేని ముసిల్దాననుకుంటున్నారా! అప్పటికీ ఎప్పటికీ మీ యింటి పెద్ద దిక్కును నేనే—గుర్తు పెట్టుకో! ఇప్పుడు దీనికి బదులియ్యి—మీ తమ్ముడి కొడుకుని నమ్మి నేనూ నీ పెళ్ళామూ ఓ పెద్దింటి సంబంధం చూసాం. సానుకూలంగా తలాడించి వచ్చాం త్వరలోనే కబురందిస్తామని.. ఇదంతా నీకూ మీ తమ్ముడికీ చెప్పే కదా చేసాం! ఇప్పుడు పెళ్ళి చూపులు కూడా జరక్కుండానే వాళ్ళ ముఖాన మీ సంబంధం మాకొద్దని కల్లాపు నీళ్ళతో కొడ్తే మా పరువేమవుతుంది? ఊళ్ళో తలెత్తుకు తిరగ్గలమా! నీ తమ్ముడి గురించే ఆలోచిస్తున్నావు గాని మన కుటుంబ పరపతి కోసం కొంచెమైనా ఆలోచిస్తున్నావా! ”
సదానందం నోట మాట రానట్టు దిక్కులు చూడసాగాడు. అప్పుడు ప్రాణం వచ్చిన విగ్రహంలా కదలి వచ్చాడు త్యాగరాజు. “నన్ను క్షమించమ్మా! అనుకోని విధంగా నీ చిన్న మనవడి పెళ్ళి జరిగిపోయింది. నువ్వు లేకుండా నీకు చెప్పకుండా మధుమురళి పెళ్ళి జరిపించడం తప్పే.. ” అని వంగి తల్లి పాదాలపైన చేతులుంచాడు.
భర్త ప్రక్కకు చేరిన పుష్పవల్లి నిదానంగా అభ్యర్థనా పూర్వకంగా అంది- “నేనిప్పుడు నీకొక మాట చెప్పేదా అత్యయ్యా! ”
అభావంగా కోడలు ముఖంలో కి చూసింది గాని నర్సమ్మస్పందించలేదు. రవంత సేపు అన్యమనస్కంగా ఉండిపోయిన తరువాత, సూటిగా చూపులతో కోస్తున్నట్టు అంది- . ”అసలిదంతా నీవల్లే జరగిందంటాను. నువ్వు గాని త్యాగరాజుతో కాంచీపురం వెళ్లి ఉంటే ఇటువంటి అస్తవ్యస్త కార్యం జరిగి ఉండేది కాదుగా! ”
పుష్పవల్లి మరింత నిదానంగా అత్తయ్య వేపు చూస్తూనే తల అడ్డంగా ఆడించింది, తలాడిస్తూ అందామె- “చెప్తే కోపగించుకుంటారేమో గాని.. నేను మీ చిన్నబ్బాయితో అక్కడకు వెళ్ళినా నేనాపెళ్ళి ఆపి ఉండేదానని కాదు అత్తయ్యా! ”
ఆ మాటకు నర్సమ్మ “హాఁ! ” అని నోరుతెరిచింది. ”చిన్నకోడలకు అంతటి ధిక్కారమా! ” అన్నట్టు కళ్ళమ్మట నిప్పు కణికలు కురిపించబోయింది, అప్పుడు పుష్పవల్లి అదే ముఖ భావంతో వివరించింది- “వాళ్ళది మన భాష కాదు గాని, మన ప్రాంతం కాదు గాని- అమ్మాయిది మంచి కుటుంబం అత్తయ్యా! చిత్తూరులో మాతో ఉంటున్నప్పుడు మాంవగారు హఠాత్తుగా మంచాన పడి చనిపోయినప్పుడు దీనదయాళన్ గారే ప్రక్కనుండి మీ చిన్నబ్బాయికి అన్నిటా చేదోడు వాదోడుగా ఉండి మీరందరూ చిత్తూరు చేరేంత వరకూ దగ్గరుండి అంత్య క్రియలు జరిపించడంలో పురోహితుడి సహాయంతో శాంతి పూజ జరిపించడంలో చేయూతనిచ్చారు. అంతే కాదు. నేనొకసారి థైరాయిడ్ రేంజ్ పెరిగిపోయి మంచాన పడ్డప్పుడు ఆస్పత్రిలో దీనదయాళన్ గారి భార్య ధనమ్మాళ్ గారే ఆస్పత్రి వార్డులో ఉండి అంతా చూసుకున్నారు. అప్పుడు వెనుకా ముందూ యెవరూ లేకుండా పోయారు. అంతే కాదు. మీ అబ్బాయి కూడా లేడు. ఎక్కడికో లాంగ్ టూరుపైన వెళ్ళిపోయాడు పిల్లలేమో చిన్నవాళ్ళు. వాళ్ళప్పుడు మనకు చేసిన మేలు మనమెలా మరచిపోగలమత్తయ్యా? అంతేకాక- మరణ ధృవపత్రం కూడా ఆయనే పలుసార్లు రెవన్యూ ఆఫీసు చుట్టూ తిరిగి ఇప్పించారు. మీకు నెలసరి ఫ్యామిలీ పెన్షన్ రావడానికి సహాయం చేసారు. దయచేసి కొంచెం శ్రమ తీసుకుని గుర్తుకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అత్తయ్యా! ”
“అంటే—మాకెవరికీ చెప్పకుండా మురళిని పెండ్లి పీటలపైన కూర్చోబెట్టడం సరేనంటావు. ఇందులో మాయింటి కోడలు పిల్లగా నీకే మాత్రమూ బాధ్యత లేదంటావు. అంతేనా! ”సూటిగా చూస్తూ అంది నర్సమ్మ.
ఆ మాటకు పుష్పవల్లి తడబాటుకి లోనవుతూ నచ్చచెప్పడానికి పూనుకుంది. “అబ్బే—నేనలా అనడం లేదత్తయ్యా! ఎదురు చూడని పరిస్థితిలో పొరపాటు జరిగిపోయిందని క్షమాపణ కోరుకొంటున్నాం. శివగామి వేరే ఊరినుండి వేరే ప్రాంతం నుండి వచ్చిన అమ్మాయి. మీకాళ్ళకు నమస్కరిస్తున్నప్పుడు మీరు కాళ్ళను వెనక్కి తీసుకున్నారు. దానికా పిల్ల యెంతగా ఫీలయి ఉంటుందో కొంచెం ఆలోచించండత్తయ్యా! ఊరుకాని ఊరు నుండి మనల్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయి.. “ అని తడిసిన కళ్ళతో కొడుకునీ కోడల్నీ దగ్గరకు రమ్మనమని చూపుతో సైగ చేసిందామె.
ఇద్దరూ సమీపించి నర్సమ్మకు మోకాళ్ళపై వంగి నమస్కరించారు. ఈసారామె కాళ్ళు వెనక్కి తీసుకోలేదు. ప్రసన్న వదనంతో యిద్దర్నీ ఆశీర్వదించి అక్కున చేర్చుకుంది. శివగామికి ఆశ్చర్యం వేసింది. వంశవృక్షానికి మ్రానువంటి అవ్వ అంత త్వరగా కోపం నుండి తెప్పరిల్లుతుందని అనుకోలేదు. కాని—అంతకంటే ఆశ్చర్యం కలిగించేది మరొకటి జరిగింది. నర్సమ్మ మెడ నుండి ఒంటిపేట గొలుసు తీసి శివగామి మెడన వేసింది. అప్పుడు శివగామి అడ్డు చెప్పకుండానే మధుమురళితో యేదో అంది. అది పసిగట్టి నర్సమ్మ నవ్వు ముఖంతో అంది- “ఏంవిట్రా పిల్లాడా! నీ తమిళ పెళ్ళాం యేదో గొణుకుతున్నట్లుంది- ఏ మంటుందేమిటి? “
“అబ్బే! మరేమీ లేదు బామ్మా! సరోజ పెద్దత్తయ్య ఇంతకు ముందొక గొలుసు తన మెడన వేసిందని చెప్తుంది శివగామి”
“అలాగా! పర్వాలేదులే—ఉంటే ఉండనియ్యి. ఇది కూడా ఉంచుకోమను. పచ్చగా ఉండాల్సిన అమ్మాయి బంగారం వద్దన వచ్చా—అది సరేగాని—ఈ అమ్మాయికి తెలుగు బొత్తిగా తెలియనట్లుందే! మీ బాబుకి తప్ప యింట్లో మరెవ్వరికీ ఆ భాష తెలియదుగా! మరెలా? ”
అప్పుడక్కడకు మనవరాలు మాధవి చురుగ్గ్గా నడచుకుంటూ వచ్చింది. “నో ప్రోబ్లమ్ బామ్మా! దానికి ముందస్తు యేర్పాట్లు చేసుంచాం”
అదేమి యేర్పాటన్నట్టు కళ్ళెత్తి చూసింది నర్సమ్మ మనవరాలి వేపు.
“మరేమీ లేదు బామ్మా! వదిన నాకూ- చంద్రిక అక్కయ్యకూ తమిళం నేర్పుతుంది. మేమేమో వదినకు తెలుగు చదవడం మాట్లాడటం నేర్పుతాం. నేర్పడం అంటే రేపో మాపో కాదు. ఇప్పటికే ఆరంభించేసాం- ముప్పై రోజుల్లో తెలుగు యెలా నేర్చుకోవాలి అన్న పుస్తకంతో. ఆ తరువాత పెద్ద బాలశిక్ష తప్పని సరి. మాకేమో వదిన ఆనా అవ్వన్నాతో తమిళ పాఠాలు చెప్పడం ఆరంభించేసింది. మేం యేమో అనుకున్నాం గాని, వదినది గట్టి బుర్ర బామ్మా! “
నర్సమ్మ నవ్వింది. “వినడానికి బాగానే ఉందర్రా! ”అని పుష్పవల్లి వేపు తిరిగి అడిగింది- “అది జరిగిపోయింది కదూ! ”
ఏమిటన్నట్టు అత్తయ్య వేపు ప్రశ్నార్థకంగా చూసిందామె.
“అదేమిటే అలా కొత్తగా చూస్తున్నావు! కార్యం తంతయిపోయింది కదూ? ” రెట్టించి అడిగింది నర్సమ్మ.
పుష్పవల్లి అడ్డంగా తల ఆడించింది- యింకాలేదన్నట్టు.
ఆ సంకేతం అందుకున్న నర్సమ్మ తెప్పరిల్లుతూ అంది “ఇంకా లేదన్నమాట. సరే—వధూవరులిద్దర్నీ మాతో బాటు తీసుకెళ్ళి ఆ తంతంతా మా ఊళ్ళో జరిపిస్తాం అక్కడున్న మనింట్లో జరిపిస్తాం.. పురోహితుడితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి—“
అప్పుడు తత్తరపా టుతో పుష్పవల్లి స్పందించింది- “విషయం అది కాదత్తయ్యా ! వాళ్ళు కాంచిపురం తమిళులు కదా- వాళ్ళకేదో ప్రాచీన కాలం నాటి సంప్రదాయం గట్రా ఉన్నట్లుంది. ఒక మంచిరోజు చూసి వాళ్ళే యిక్కడకు యేతెంచి సారెలు గట్రా తీసుకు వచ్చి ఆతంతు జరిపిస్తామన్నారు. దానికి మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నట్టున్నాడు”
నర్సమ్మ యేమీ అనలేదు. చిన్న కొడుకు త్యాగరాజు వేపు చూసింది. అతడు యెటో చూస్తూ తల తిప్పుకున్నాడు. తల్లి చూపులోని నిరసన అతడు అర్థం చేసుకున్నాడు- “నా మనవడి పెళ్ళి నన్నెలాగూ చూడ నివ్వలేదు. చివరికీ శుభకార్యానికీ నోచుకోకుండా చేసావు కదట్రా! ఎంత మిత్రుడైతే మాత్రం అతడు అడిగిందల్లా వాళ్ళ సంప్రదాయం ప్రకారం చేసుకుపోతుంటే.. మరి మా గురించి యెప్పుడాలో చిస్తావు? తెలుగు వారిగా మాకూ కొన్ని అచ్చట్లూ ముచ్చట్లూ ఉంటాయి కదా.. ”అని అడుగుతున్నట్లుంది ఆమె చూపు.
నర్సమ్మ యింకేదో చెప్పడానికన్నట్టు మనవడి వేపు తలతిప్పి చూసింది. వధూవరులిద్దరూ యెప్పుడో అక్కణ్ణించి కదలి వెళ్ళి పోయారు. పరిస్థితి గమనించిన సదానందం మోహనకరంగా నవ్వుతూ ఉమాదేవి వేపు చూపులు సారించాడు. బుగ్గల నిండా సిగ్గు దాచుకుంటూ తల దించుకుందామె. శోభనమంటే ప్రతి తెలుగింటా మరవలేని మధురానుభూతి కదూ! జ్ఞాపకాలను కమ్మని రంగుల కలలుగా మార్చే హృదయానుభూతి కదూ!
మూడురోజులుండి ఆలయ పవిత్రోత్సవాలకు హాజరయి అందరూ మాధవ పురం వెళ్ళిపోయారు.
===============================================
ఇంకా వుంది
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments