ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6
- Pandranki Subramani

- Dec 21, 2025
- 8 min read
Updated: Dec 28, 2025
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 6 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 21/12/2025
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ:
డిపార్టుమెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్ లో ఉంటాడు మధుమురళి. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్ళికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.
తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్ళి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్ర కిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం, పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 6 చదవండి.
అన్నమాట ప్రకారం ఢిల్లీ ట్రైనింగ్ ప్రోగ్రాము ముగించుకుని అకాడమీ హాలులో ఫేర్ వెల్ డిన్నర్ పార్టీలో పాలు పంచుకుని, యోగ్యతా పత్రం అందిపుచ్చుకుని రామకృష్ణాపురానికి ఆ తరువాత కాంచీపురానికీ తను వస్తున్నట్టు ఫోను చేసి హాస్టల్ గది ఖాళీ చేసి విమానాశ్రయానికి టాక్సీ ఎక్కాడు. ఆ తరవాత చెన్నైలో దిగి స్పెషల్ లగ్జరీ బస్సెక్కి కాంచీపురం చేరాడు. గుమ్మం వద్ద శివగామి అక్కయ్యలిద్దరూ తాంబూలం తట్టలో హారతి తీసి లోపలకు తీసుకెళ్ళారు. ఎదురొచ్చి పరామర్శించిన అత్తా మామలిద్దరికీ నమస్కరించి జాప్యానికి తావివ్వకూడదనుకుంటూ తన ప్రయాణ షెడ్యూల్ ప్రకటించాడు.
“రేపు సాయంత్రం నేను కృష్ణాపురం బయల్దేరాలి మాఁవగారూ! డ్యూటీ ఉంది. ”
అప్పుడతడి వేపు దీనదయాళన్ నవ్వుతూ చూసి అన్నాడు. “ఎనక్కు తెరియుం మాప్పిళే! సారీ— తమిళంలో మాట్లాడేస్తున్నాను. మీ నాన్నగారు ముందే ఫోను చేసి చెప్పారల్లుడూ— రేపు సాయంత్రానికి బోలెడు టైం ఉంది కాబట్టి కామాక్షి అమ్మవారి గుడిలో పవిత్రోత్సవం ఉంది. మీరూ శివగామి తప్పకుండా దేవీ అర్చనకు రావాలి. పూజారికి చెప్పి ఏర్పాటు చేసి ఉంచాం”
ఆ మాట విన్నంతనే మురళికి గతుక్కుమంది. మరొకసారి కూతుర్ని యెత్తుకుని గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణం చేయమంటారేమో! ఇదెక్కడి ఆచారమో ఆ కామాక్షి అమ్మవారికే తెలవాలి. అడుగడుగునా ఇంతటి సింగినాదం జీలకర్రా పాటించేవారితో వేగడం కొంచెం కష్టమేనేమో! భక్తికైనా అభిమానానికైనా హద్దుండాలి కదా! ఇప్పటి రోజుల్లో ప్రపంచం యెంత వేగంగా విస్తరిస్తుందో వీళ్ళు గ్రహిస్తున్నారా!
కాని అతడనుకున్నట్లు అటువంటిదేమీ జరగలేదు. అమ్మవారి గర్భగుడి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి అర్చన ముగించారు. బహుశ:భక్తుల రద్దీవల్లనో గుడి ప్రాంగణంలో రెండు పెళ్లిళ్ల శుభకార్యం జరుగుతుండటం వల్లనో కావచ్చు.. ఆ రోజు దీనదయాళన్ దంపతులు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. అందరికీ శరవణన్ హోటల్ లో భోజనం ఏర్పాటు చేసారు.
మురళి ప్రక్కన శివగామి చోటు చేసుకుని కూర్చుంది. సాంబారు కాయగూరల వాసనలు హాలంతా ఘుమఘుమలాడుతున్నాయి. అతడికి ఆకలి పుట్టుకొచ్చింది. ఇక జాప్యమేల అనుకుంటూ అరిటాకుపైన పేర్చిన కాయగూరల్ని చేతిలోకి తీసుకున్నాడతను. అప్పుడు శివగామి పెద్దక్క వేదనాయకి గొంతు వినిపించి ఆగాడు. భోజన వేళలో సహితం కాంచీపురంలో పాటించాల్సిన సంప్రదాయం ఇంకేమైనా ఉందేమో!
ప్రతిదానికీ సంప్రదాయం పాటిస్తూపోతే మనిషి బ్రతికి బట్టకట్ట వద్దూ.. అసలు యివన్నీ పాటించడానికి మనిషికి సమయమూ తీరికా ఉండొద్దూ..
“మరదీ! మొదటి ముద్ద మీరు తీసుకుని రెండవ ముద్దు శివగామికి అందించండి. ఆ తరవాత విషయం చెప్తాను” అందామె వచ్చీరాని ఆంగ్లంలో, పదాలు వెతుక్కుంటూ..
“విషయమా! ఇప్పుడా! ” అనుకుంటూ అతడు మొదటి ముద్ద కలుపుకుని తను తిని రెండవ ముద్దను కలిపి శివగామికి అందించి- “చెప్పొదినా! “ అన్నాడు మురళి.
వేదనాయగి వివరించింది- “ఇలా అంటున్నానని యేమీ అనుకోకండి మరదీ! ఢిల్లీనుండి ఇక్కడకు రాకుండా తిన్నగా ఆంధ్రాలో ఉన్న మీ ఊరు రామకృష్ణాపురం వెళ్ళిపోతారనుకున్నాం”
అతడు వేదనాయకి ముఖంలోకి తేరిపార చూసి ఊరకుండి పోయాడు. షన్బుగవళ్ళీ శివగామి ఇద్దరూ ముఖాన నవ్వురేఖల్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ యెటో చూస్తూ కూర్చున్నారు. ఎట్టకేలకు మురళి నోరు తెరిచాడు. “మీకు మా కుటుంబం గురించి- ముఖ్యంగా మాతండ్రి త్యాగరాజుగారి గురించి తెలియదనుకుంటాను. ఆఫ్ కోర్స్— ఇల్లు చేరిన తరవాత మాకు కొన్ని సమస్యలు యెదురు కావచ్చు. అక్కడక్కడ నిప్పు కణికలు కూడా రాలవచ్చు. వి- కాంట్ హెల్ప్. కాని— కట్టుకున్న పెళ్ళాన్ని విడిచి వెళ్ళిపోవడమా! అబ్ సర్డ్— దానికే ఛాన్సే లేదు.”
అప్పుడు శివగామి చిన్నక్క షన్బుగవళ్ళి కలుగ చేసుకుంది. “సారీ మాప్పిళే! మీరలా సూటిగా అటు వేపు వెళ్ళిపోతారని అనుమానించలేదు. భయపడ్డాం. ఎంతైనా మేం ఆడపిల్ల వాళ్ళం కదా! అందులో హడావిడిగా అనుకోని పరిస్థితిలో జరిగిన వివాహమాయె.. ”
“సమయ భావం వల్ల కొన్ని ఆచారాలు పూర్తిగా పాటించి ఉండకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని మా తెలుగువారి ఆచారాల ప్రకారం జరిగి ఉండక పోవచ్చు. మొత్తానికి అంతా హైందవ సత్సంప్రదాయాల ప్రకారమే- పవిత్ర మంత్రోఛ్ఛరణల మధ్యే నాకు శివగామితో పెళ్ళి జరిగింది, మా ప్రాంతపు భాష రాదన్న చిన్నపాటి కొరత తప్ప శివగామిలో యేం తక్కువని? సోషియల్ స్టడీస్ లో బ్రిలియంట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంది. ఇదొక చిన్నపాటి జలతారు వంటిది. దీని ద్వారా శివగామి యెక్కడికైనా చేరవచ్చు. ఎంత పైకైనా యెదగవచ్చు. ఇకపైన ఈ ఊసు మళ్ళీ యెక్కడా యెత్తకండి”
ఆ మాటతో అక్కాచెళ్ళెల్లిద్దరూ నిశ్శబ్దంగా భోజనం చేయడంలో మునిగిపోయారు. శివగామి చేతిలో పెట్టుకున్న ముద్దను తినకుండా మధు మురళిని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ప్రక్క వరసలో కూర్చున్న మురళి అత్తామామలిద్దరూ నిండుగా నవ్వుకున్నారు. లోలోన మనసు పులకించింది. దీనదయాళన్ హృదయం పొంగింది. అల్లుడు గారెవరు? స్వయాన తన మిత్రుడు త్యాగరాజు కొడుకు కదూ! యథా పితా తథా పుత్రః
ఆ రోజు రాత్రి భోజనం వద్దన్నాడు మధు మురళి. ఒక కప్పు పశుపాలు, ఒక ప్లేటు ఫలహారం చాలన్నాడు. శరవణన్ హోటల్ లో తిన్న సాంబారు స్పెషల్ భోజనం సరిగ్గా అరగనట్లుంది. దీపాలు పెట్టే వేళ దాటింతర్వాత, దేవుడి గదిలో పూజలు జరిగిన తరవాత శివగామి వచ్చి అతడికి ప్లేటు నిండా జీడి పప్పు వేసిన ఉప్మా- కప్పునిండా పాలు తీసుకువచ్చి ఇస్తూ, ఇంకేమైనా కావలసొస్తే చెప్పమంది.
అతడు తలూపి తిననారంభించిన కొద్ది నిమిషాలలో ఆమె రెండు బరువైన సూటు కేసుల్ని గదిలోకి తీసుకు వచ్చి పెట్టింది. అతడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు- “ఇంత పెద్ద సూటుకేసులెందుకూ! నీకక్కడ అన్నీ దొరుకుతాయి. మనింట్లో మా చెల్లితో బాటు అక్కడ మా పెద్దమ్మవాళ్ళింట్లో మా అక్కయ్య ఉంది. పెద్ద చెల్లెలుంది. అడిగిన వెంటనే కావలసింది తెచ్చిస్తారు. సర్దుబాటు చేస్తారు. మీ యింట్లోలాగే అక్కడ కూడా మాది పెద్ద కుటుంబం. నువ్వు చూడబోతున్నావుగా.. ”
శివగామి నవ్వింది. “వీటిలో ఉన్నవన్నీ నేను ఉపయోగించుకునే కాస్మోటిక్స్ సామానుకాదు. నగలూ కాదు” మరేమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడతను. “ఒక పెట్టెనిండా కాంచిపురం పట్టు చీరలు”
ఇన్ని చీరలా- అన్నట్టు విస్మయంగా చూసాడు మురళి.
“ఇవన్నీ నాకోసం కాదు మహాశయా! పట్టు చీరలకు కాస్తంత బరువెక్కువ. సాధారణంగా యింట్లో కట్టుకుని తిరగరు. శుభకార్యాలకూ పండగ పబ్బాలకూ వేసుకుంటారు”
“ఇంతవరకూ నువ్వు పాయింటుకి రాలేదు. మరిన్ని చీరలెందుకట? కాంచిపురం నుండివచ్చానని గొప్పలు చెప్పుకోవడానికా! ”
“అబ్బ! ఎంత త్వరగా అసహనం చూపించేస్తున్నారు? మీ వద్ద కాస్తంత జాగ్రత్తగానే ఉండాలి సుమా! సరే— ఇప్పుడు చెప్తాను. మా అత్తగారికి ఒకటి. మా ఆడపడుచుకి ఒకటి. పెద్దత్తయ్యగారికి ఒకటి. మాధవపురంలో ఉన్న మరొక పెద్దత్తయ్యగారికి మరొకటి. ఓకే! “
“ఏమిటి ఓకే.. నో—ఓకే— అక్కడ మా పెద్దమ్మగారింట్లో పెళ్లయిన అక్కయ్యుంది- చదువుకుంటూన్న చెల్లెలు కూడా ఉంది. వాళ్ళ కు మొండి చేయి చూపించి తతిమ్మా వాళ్ళకు చీనీ చీనాంబరాలిస్తావా? వాళ్ళందరకూ చిరాకు కలిగిస్తవా? ఇదంతా నన్ను ముందే అడగొద్దూ! ”
మురళి నోట ఆ మాట విన్న శివగామి వెంటనే సర్దుబాటుకి దిగింది-
“సారీ! రియల్లీ సారీ! నిజంగా మీకు పెళ్ళయిన అక్కయ్యా మరొక చెల్లెలూ ఉన్నారన్నది నాకు తెలియదు. మన పెళ్ళి విచిత్రంగా అనుకోని రీతిన జరిగిందిగా! అంచేత వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. కాని— నథింగ్ టు వర్రీ. ఎందుకైనా మంచిదని మూడు పట్టు చీరలు అదనంగా మీ అత్తామామలకు కొనుంచమని చెప్పాను. అదీను యెక్స్ పోర్ట్ క్వాలిటీవి, అంచేత అక్కడకు చేరిన తరవాత వాళ్ళ స్కిన్ టోన్ కి తగిన చీర కలర్ ని వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకేనా! ”
డబుల్ ఓకే— అంటూ మురళి శివగామి ముందు చూపుకు ముచ్చట పడుతూ ఖాళీ ప్లేటుని ప్రక్కన పడేసి వేగంగా ఆమె వేపు దూసుకు వచ్చి యెందుకో చప్పున ఆగిపోయాడు. ఆమె నవ్వుతూ గది తలుపు దగ్గరగా చేరవేసి అంది- “అదేంవిటి? అంత వేగంగా వచ్చి అంతే వేగంగా ఆగిపోయారు. కట్టుకున్న పెళ్ళాన్నేగా— నాకు సమీపంగా వస్తే, యెవరూ యేమీ అనరులే..”
“ఆగిపోయింది సంకోచం వల్ల కాదు. పెళ్ళిరోజు మీ అంకుల్ గారు నాకొక వార్నింగ్ యిచ్చి వెళ్లారు. నీతో మరీ క్లోజ్ గా ఒరసు కుంటూ మెసలకూడదని.”
ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. “అంకుల్ గారు అలాగన్నారా! ”
“నువ్వు మరీనోయే! శాశ్వతంగా నీనుండి దూరంగా ఉండమనలేదు. మీవాళ్ళకేదో తరతరాలనాటి సంప్రదాయం ఉన్నట్లుంది. ఒక శుభ ముహూర్తాన మీ అక్కయ్యలూ బంధువులూ మా యింటికి వచ్చి ఆ కార్యం సలక్షణంగా జరిపిస్తారట. అంతవరకూ నన్ను నీ జోలికి వెళ్ళకన్నారు. లక్ష్మణ రేఖ దాటకన్నారు. ఇప్పడర్థమైందా మేడమ్ నేనెందుకు దూకుడు పెంచలేదో!”
శివగామి పక్కున నవ్వేసింది. నవ్వేస్తూ అతడి ముక్కు పట్టుకుని లాగుతూ అందామె- “మరొకటి చెప్పడం మరచిపోయేను.. మీకూ- అంకుల్ గారికి- పెద్ద అంకుల్సు యిద్దరికీ ఇంకా పేరు తోచని యిద్దరు ముగ్గురుకి కాంచిపురం పంచె చాపులూ పట్టు జుబ్బాలు ప్యాక్ చేసి తీసు కు వస్తున్నా ను. ఆర్ యు హ్యాపీ! ”
తలూపుతూ శివగామి ముక్కు పట్టుకుని లాగాడు మధుమురళి “యు ఆర్ స్మార్ట్” అంటూ—

మరునాడు సాయంత్రం దీనదయాళన్ దంపతులిద్దరూ కూతుర్నీ అల్లుడునీ చెన్నై లగ్జరీ బస్సులోకి యెక్కించారు. కూతుర్ని యెక్కిస్తూ ధనమ్మాళ్ భద్రంగా ప్యాక్ చేసిన కామాక్షి అమ్మవారి ప్రసాదాన్ని అందిస్తూ అంది. ”నువ్వు చదువుకున్న దానివి. బాగా చదువుకున్నదానివి. మీ అక్కయ్యలిద్దరికంటే చురుకైన దానివి. మీ మెట్టింటి వాళ్ళందరూ తెలుగు ఆడపడుచులు. వాళ్ళు తెలుగే మాట్లాడుతారు. మీ అత్తయ్యకి కూడా తమిళం అంతంత మాత్రమే తెలుసు. ఇప్పటికి అక్కడ నీకున్నఒకే ఒక ఆత్మ బంధువు మీ అంకుల్ గారొక్కరే.. నేను వాళ్ళగురించి యేదో అంటున్నాను గాని, నేను మాత్రం చిత్తూరులో గడిపానన్న మాటే గాని తెలుగు నేర్చుకున్నానా యేమిటి? అంచేత చెప్తున్నాను వాళ్ళు చెప్పేవన్నీ నీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. తెలిసీ తెలియ ని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ మాటలకు స్పందించకు. కస్సుమని లేవకు యిక్కడిలా. అవన్నీ ఇక్కడ మూటగట్టేసి వెళ్ళు”
“అవన్నీ నాకు తెలుసమ్మా! కాంచిపురంలో సగం మంది తెలుగు వాళ్ళేగా! వీళ్ళు మాట్లాడే తెలుగు వేరు కావచ్చు. తెలుగు వారి మూడ్సు గురించి నాకు కొంతలో కొంతయినా తెలుసు. కారం కాస్తంత యెక్కువగా తింటారు. అదీ తెలుసు. ఐనా నువ్వు అనవసరంగా కంగారు పడిపోతున్నావమ్మా! నాకు మంచి గైడ్ దొరికాడన్న వాస్తవం మరచిపోతున్నావు“”
అదెవరన్నట్టు చూసింది ధన మ్మాళ్. “ఇంకెవరు మీ బంగారు అల్లుడు గారే! ”
ఆమె కూతుర్ని విస్తుపోయి చూసింది;మొదటి రాత్రి కూడా జరక్కముందే మొగుడితో ఆరంభించేసావూ నీ ఆకతాయి ఆటలు- అన్నట్టు..
“భయపడిపోకమ్మా! భయపడిపోయి నాన్నను కంగారు పెట్టేయకు. సరేనా! “అంటూ అమ్మను కౌగలించుకుని మధుమురళి నిల్చున్న సీటు వద్దకు వెళ్ళిపోయింది, తండ్రివేపూ ఇద్దరక్కాయిలవేపూ చేతులూపుతూ— కనుల ఓరన కంట తడి పెట్టుకుంటూ..
పుట్టి పెరిగిన ఊరుని విడిచిపెట్టి, తననాదుకున్న స్నేహాలను వెనక్కి నెట్టి ముక్కూ మొహం యెరగని వ్యక్తిని నమ్ముకుని యేకంగా ఊరూ పేరూ తెలియని ఊరుకి, పరిచయమే లేని ప్రాంతానికి ప్రయాణం చేయడమంటే దాదాపు గతంతో తెగతెంపులు చేసుకోవడం వంటిదేగా! సరాసరి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడమేగా.. అందుకేగా తరచుగా అంటుంటారు;”ఆట కదరా! బ్రతుకాట కదరా!” అని..
మరి కాసేపటికి కండక్టర్ విజిల్ తో బస్సు కదిలింది. అప్పుడు లగేజీ స్టాండుపైనున్న సామాను వేపు ఓసారి తలెత్తి చూసి ప్రక్కకు చూసాడు మధుమురళి అసంకల్పితంగా.. శివగామి లేత పచ్చపట్టు చీర కట్టుకుంది.
ఇద్దరక్కయ్యలకంటే పొడవు- యెరుపు. విశాలమైన యిరుల కురుల మధ్య మల్లెపూలు విరబూసి నవ్వుతున్నట్లుంది. చీర చెంగు తొలగిన బిగువైన నడుము అతడి కంటిని గుచ్చుతున్నట్లుంది.
కొప్పులోని పువ్వుల ఘుమఘుమలో— లేక శివగామి మేని సువాసనలో తేల్చడం కష్టం గాని— మొత్తానికి యేమీ ఉల్లాసకరంగా ఊహించకుండా మోహనకరంగా తాకకుండా తొలగి ఉండటమన్నది సపోర్టింగ్ బ్యాలెన్సింగ్ రాడ్ లేకుండా తాడు పైన సర్కస్ విన్యాసమేనేమో— తలచుకుంటే ఇబ్బంది కరమే..
తనకు స్వంతమైన ఆడదానిని అల్లుకుపోవడానికేమీ అవాంతరం ఉండదు. కాని.. మాటకందని— చూపు కందని అవాంతర మేదో అతణ్ణి వెనక్కి తగ్గమంటుంది. ఒళ్ళు దగ్గరపెట్టుకుని మెసలుకో మంటుంది. దీనికంతటికీ కాంచిపురంలోని ఆ తమిళ సంప్రదాయమే కారణం. ఇది గాని అడ్డంకిగా లేకపోతే- వధూవరుల మధ్య- జ్వాలా తోరణాల నడుమ జరగాల్సిన ఆ శుభకార్యమేదో నిన్ననే- కాదు- పెళ్ళినాటి రాత్రే జరిగిపోయుండవచ్చు.
అతడు ఊపిరి బరువుగా పీలుస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. పిమ్మట బండి కాసేపు ముందుకు సాగిన తరవాత అతడు ప్రక్కన ఖాళీగా ఉన్న సీటులోకి తనకు తాను ల్యాండప్ అయాడు. అది గమనించి శివగామి చురుగ్గా స్పందించింది. “అదేమిటండీ అలా దూరంగా జరిగి కూర్చున్నారు! చూసేవారేమి అనుకుంటారు? మనం వేరు వేరుగా వచ్చామని అనుకోరూ! లేదా పెడముఖాలు పెట్టుకున్న మొగుడూ పెళ్లాలనుకోరూ! ”
అతడు స్పందించలేదు. నిజమే— చూసేవారలాగే అనుకుంటారు. కాని— దీనికి కారకుడు తనా! వీళ్ళ కాంచిపురం ప్రాచీన తమిళ సంప్రదాయం కదూ కారణం! ఈ ప్రపంచ ఋతు చక్రంలో కొన్ని ఉదాత్తమైనవి ఉన్నాయి. వాటిలో ఒకటి సహజ స్త్రీ- పురుషుల సంగమం. అది ఉదయకాలాన నిశ్శబ్దంగా పుష్పించిన మొగ్గలా జరిగిపోవాలి. ప్రణయరాగ గుసగుసలా సంతరించుకోవాలి. అటువంటి సుందర మనోహర క్షణానికి అంతటి బాహాటంగా దండోరా వేయించుకోవాలా!
అతడు వెంటనే ఆలోచనల నుండి తేరుకుంటూ తనను తను సర్దుకుంటూ అన్నాడు- “అబ్బే మరేమీ లేదు శివగామి! ఇలా నీకోసమే జరిగి కూర్చున్నాను. నువ్వు కాసేపటికి బండి కుదుపులకు కనురెప్పలు మూతలు పడి యిటు వేపు చేరబడవచ్చుకదా! అందుకని— నీకు సౌకర్యవంతంగా కంఫర్టబుల్ గా ఉండటానికని—”
ఆమె నివ్వెరపాటుకి లోనయినట్టు చూసింది. అలా చురుగ్గా చూస్తూ వెక్కిరింపుగా అంది- “ఔను. అలసట ముంచుకు వచ్చి కళ్ళు మూతలు పడి మీ వేపు ఒరిగి చేరబడవచ్చు. సోవాట్! ”
అతడి వద్ద జవాబు లేదు. ఔను. వాస్తవమే— కట్టుకున్న భార్య తనపైన ఒరిగి వాలితే.. అదొక నవరస సమ్మేళిత అద్భుత సన్నివేశమే– అరుదైన ఆనంద తాండవమే! కాని— ఒకసారి తీగ మీద పడితే అందులోనుంచి విద్యుత్ తనువంతటా ఆవహించదూ! ఐ =నా ఆడవాళ్ళ తీరే అంత.. మగాళ్ళ అవస్థ గురించి తలపోయరు. ఇక చేసేది లేక మధుమురళి శివగామి ప్రక్కకు వెళ్లి కూర్చున్నాడు,
పొందికగా.. శివగామి ఒలిచి అందించిన బత్తాయి తొనలు నోట్లో వేసుకుని తినసాగాడు. అప్పటికతడికి వేరే ప్రత్యమ్నాయం గోచరించ లేదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాలంటారు. మరి దీనికి యేమి అనాలో— యవ్వన వతి సరసన ఉంటే, సర్వ జాగ్రత్తలు తీసుకుంటూ నలుగురి కంట బడకుండా హంగామాకు దూరంగా ఉండాలంటారేమో..
మరి కాసేపటికి బస్సులో పవర్ లైట్లు ఆర్పి డిమ్ లైట్లు ఆన్ చేసారు. బస్సు మరి కొంత దూరం సాగిన తరవాత తనూహించినట్లే బస్సు కుదుపులకు ఊగుతూ జోగుతూ కనురెప్పల్ని మూసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే శివగామి ముర ళి వేపు ఒరిగింది.
శివగామి సొగసులు చిమ్మే అందాల మేని నుండి యవ్వన పూదోటను తాకుతూ వీచే సౌగంధం అతణ్ణి ముప్పిరి గొన్నాయి. ఓ విధమైన మృదువైన మత్తు తనువంతా ఆవహించింది. అతడికి తెలియకుండానే అతడి కుడిచేయి ఆమె నునుపైన పొత్తి కడుపు పైకి సాగింది. బలంగా తనపైకి లాక్కోవాలన్న కోరికల అల ఉవ్వెత్తున లేచిన నదిలా పొంగింది. కాని— ఆపుకున్నాడు. జ్వలించే నవ యవ్వనం పౌర్ణమి రాత్రిలా చల్లగా కదలికలేని నావలా ఉండమంటే యెలా గుంటుంది? ఈ మధ్య నలువైపులా అతడికి గులాబీ ముండ్ల వంటి సమస్యలే అడుగడుగున యెదురవుతున్నాయి.
అక్కడేమో— అకాడమీ ట్రైనింగ్ హాలులో యిరువైపులా కూర్చున్న యవ్వనవతులైన గుమ్మటాల్లాంటి పంజాబీ బెంగాళీ లేడీ ఆఫీసర్లు. ఓర చూపులతో మనో యవ్వన మధురిమలు చిమ్ముతూ ఉక్కిరి బిక్కిరి చేసారు. కోరల్లా తాకే మోహపు కోర్కెల నుండి తప్పుకోవడానికి పడరాని అవస్థలు పడ్డాడు తను. ఇప్పుడేమో— ఇక్కడేమో తన స్వంత ఆడదానిని అక్కున చేర్చుకోలేని నిస్సహాయ స్థితి— ఇదెక్కడి చోద్యమో యవ్వన నవ జీవన ప్రాంగణాన..
అతడలా ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ కుడి చేతిని వెనక్కి లాక్కోవాలను కుంటున్నప్పుడు శివగామి కనురెప్పలు విప్పకుండానే అతడి చేతిని పొత్తి కడుపుకి అదుముకుంది. మధు మురళికి ఉన్నపాటున కాంచిపురం అత్తామామలు యిద్దరు వదినెలూ గుర్తుకి వచ్చారు. ఆచారాలను అక్షరాలాపాటిస్తారు అక్కడివాళ్ళు. లేకపోతే అల్లుళ్ళను గుమ్మటాల్లాంటి పెళ్ళాలను అంతమంది యెదుట చంటి పిల్లల్లా యెత్తుకోమంటారా! ఎత్తుకుని గర్భ గుడి చుట్టూ తిప్పమంటారా! తన సంగతి వేరు. తనది వ్యాయామ శరీరం. శివగామి అక్కయ్యల భర్తలిద్దరూ పెళ్ళాలను యెత్తుకోవడానికి యెంతలా ఊపిరి బిగబట్టారో తను చూడలేదూ!
సింగినాదం జీలకర్ర వంటి ఆచారాలను పాటించడంలో కాంచిపురం ఆసామీలంద రూ జేజేమల్లాగే ఉన్నారు. కొత్తగా పెళ్ళి చేసుకున్న వధూవరుల్ని కలపడానికి శోభనం జరిపించడానికి యేదో పుణ్యముహూర్తం చూసి కొన్ని వందల మైళ్ళ దూరం నుండి రామ కృష్ణాపురం వస్తారట. ఇంకానయం కుటుంబమంతా డోలు కొట్టుకుంటూ అంబారీ వేసుకుని వస్తామన లేదు. దీనికి వత్తాసుగా తన పితృడు త్యాగరాజు గారొకరు.. వాళ్ళతో చేరిపోయారు. మధుమురళి మెల్లగా వింతైన సువాసనలు వెదజల్లే శివగామి శరీరం నుండి చూపునీ చేతినీ ఒకేసారి లాక్కున్నాడు, కరెంట్ వైరునుండి తొలగినట్టు.
===============================================
ఇంకా వుంది
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments