top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Udayaraga Udvegalu - Part 8 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 03/01/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:


డిపార్టుమెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్ లో ఉంటాడు మధుమురళి. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్ళికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. 


తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్ళి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్ర కిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం, పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు. 


ట్రైనింగ్ ముగిసిన మధుమురళి భార్యతో కలిసి తన ఊరు చేరుకుంటాడు. ఆలయ పవిత్రోత్సవాలకు హాజరయి అందరూ మాధవ పురం వెళ్ళిపోయారు. 


ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 8 చదవండి.


చాలామంది గుర్తించరేమో గాని, కాలానికి ఒక ధర్మం ఉంది. ప్రకృతిలోని ఒక భాగంగా కాలం నిశ్చలంగా అన్నిటికీ అతీతంగా సాగుతున్నట్లనిపిస్తుంది గాని, దానికి మహత్తరమైన గుణాంశమొకటి ఉంది. ఎక్కడా యెప్పుడూ ఆగదు. సముద్ర తరంగంలా యెగిసి పడుతూ దూకుడుగా దూసుకుపోతూనే ఉంటుది;బొంత రాళ్ళలా మార్పుల్ని కూర్పుల్ని తనలో ఇముడ్చుకుంటూ తనతోబాటు మోసుకు పోతూ.. అందుకేనేమో ఓ తాత్వికవేత్త అంటాడు-“నేను మార్పుని ఆహ్వానిస్తాను. మనసా వాచా కర్మణ: ఆహ్వానిస్తూనే ఉంటాను. అలా ఆహ్వానించడం కేవలం మార్పుకోసం మార్పుని కోరడం కాదు సుమా! మార్పు ప్రకృతిలో ఒక భాగం. నేను సహితం ప్రకృతిలోని భాగాన్నే. అందుకే నిరంతర మార్పుకి నా మనఃపూర్వక ఆహ్వానం! “


ఆ రీతిన యిటీవల కాలంలో సోమ శేఖరంలో వింతైన మార్పు కనిపించ నారంభించింది. కొట్టవచ్చినట్టు కనిపించసాగింది. సోమశేఖరంలోని ఈ మార్పుని మొట్ట మొదట అందిపుచ్చుకున్నవాడు సోమశేఖరం తమ్ముడు ఇంద్రకిరణ్. అతడు మనసార అభిమానించే వదిన పట్ల అన్నయ్య చూపించే ఉదాసీనత అతనికి అసహనం కలిగించింది. ఈ అవాంఛనీయ అనూహ్యమైన మార్పుని యింట్లోవాళ్ళు గ్రహించకపోవడం అతడికి ఆశ్చర్యం కలిగించింది. ఆదిలో అతణ్ణి కదలించిన విషయం;సోమశేఖరం మునుపులా భార్యతో కలసి భోంచేయడం లేదు; ముఖ్యంగా రాత్రి భోజనం కలసి తీసుకోవడం లేదు. కలసి భోంచేయడం మాట అటుంచి, రాత్రి పూట చూపుకి ఆనకుండా నల్ల పూసలా కనిపించసాగాడు.. అలా జరగడం అడపాదడపా కాదు, తరచుగా మిస్ అవుతున్నాడు.


అంచేత, వదిన అన్నయ్య రాకకోసం ఎదురు చూసి అందరూ భోజనాలు ముగించి వెళ్ళిపోయిన తరవాత ఒంటరిగా డైనింగ్ టేబల్ వద్ద దించిన తల యెత్తకుండా యెటో ఆలోచిస్తూ మెతుకుల్ని కెలుకుతూ తిన్నాననిపించి లేస్తుంది. పనావిడ కాంతమ్మ కడగడానికి గిన్నెలూ డేగిసాలూ చేతులోకి తీసుకుంటూ“అన్నం సరిగ్గా తిన్నట్లు లేవమ్మా! ఏం, ఒంట్లో సుస్తీగా ఉందా అమ్మా! ” అని అడగటం పరిపాటయింది.


దానికి మధులిక కూడా చిరునవ్వుతోనే విషయానికి చివరి అంకం పలుకుతూ వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుని మేడ మెట్ల వేపు సాగిపోతుంది. ఇంతకూ సోమశేఖరం, అలా చోటు చేసుకుంటూన్న యెడబాటుకి భార్యకు యిచ్చే కారణం యేమిటి—బిజినెస్ మీట్ లోనో సమీక్షా సమావేశంలోనో భోంచేసి వచ్చానని చెప్పడం. అదెలా-ప్రతి రోజూ బిజినెస్ మీట్ లు-పెర్ఫార్మెన్స్ సమీక్షలూ జరుగుతుంటావేంటి? ఒకవేళ రద్దీగా తయారయిన వ్యాపార వాతావరణంలో అటువంటివి అలా జరుగుతున్నాయనుకున్నా ప్రతిసారి పొద్దెరగని బిచ్చగాళ్ళలా డిన్నర్ పార్టీలు యేర్పాటు చేస్తూనే ఉంటారేమిటి? వాళ్ళ వాళ్ళకు యిండ్లలో బిజినెస్ లీడర్సుకి భార్యాబిడ్డలు యెదురు చూడరేమిటి ..


లేదు—కచ్చితంగా అలా కాదు. ఎందుకో యెక్కడో తిరకాసు ఉన్నట్లుంది. ఒకరోజు ఇంద్రకిరణ్ హాలులో అందరూ గుమికూడి ఉండగానే సోమశేఖరం యధాప్రకారం రాత్రి పూట ఇల్లు చేరినప్పుడు జంకు లేకుండా అడిగేసాడు-“ఏంవిరా అన్నయ్యా! నువ్విలా ప్రతిరోజూ ఆలస్యంగా వస్తున్నావే.. వదిన తినకుండా నీ కోసం యిదురుచూస్తుంటుందని, నిద్రపోకుండా కునుకు పాట్లు పడుతూ నీరాక కోసం పడిగాపులు పడ్తూ ఉంటుందని నీకు తెలియటం లేదా!


ఎప్పుడో ఒకప్పుడైతే పరవాలేదు. ఇలా ప్రతిరోజు యింట్లోని రాత్రి భోజనం మిస్ చేస్తుంటావా! ” ఇంద్రకిరణ్ లేవదీసిన క్వరీకి సోమశేఖరమే కాదు, అందరూ ఖంగుతిన్నారు మధులిక తప్ప. అతడు ఉపయోగించిన పదంలోని పంచ్ లైన్ ఆందర్నీ ఓ కుదుపు కుదిపింది. అప్పుడు నర్సమ్మ కలుగ చేసుకుంది. తన పెద్దరికం నిలనాటడానికి పూనుకుంది.. ”నీకెందుకురా ఆ అవసరం లేని పెద్దరికం? ఇవన్నీ వాణ్ణి కట్టుకున్న వాడి పెళ్ళానికి తెలియదేమిటి—“ 

“లేదు బామ్మా! వదిన వాడికోసం అలా యెదురు చూసీ యెదురు చూసీ ఒంటరిగా బల్ల ముందు కూర్చుని భోంచేయడం నాకు బాగనిపించడం లేదు. వదిన మరీ సౌమ్యత చూపిస్తూ ఊరకుండటం కూడా నాకు నచ్చలేదు. అంతకంటే ముఖ్యంగా మీరందరూ వాణ్ణి నిలదీయక పోవడం నాకు మరీ నచ్చలేదు” అంటూ ఇంద్రకిరణ్ చకచకా నడచుకుంటూ తన స్టడీ రూమ్ వేపు సాగిపోయాడు.


అప్పుడక్కడ బరువైన నిశ్శబ్దం నలుచెరగులా వ్యాపించింది. ఎట్టకేలకు సదానందం నోరు తెరిచాడు-“ఔన్రా శేఖరం! మీరిద్దరూ కలసి భోంచేయడం-భోంచేస్తూ జోకులు విసురుకోవడం-మధులిక కూనిరాగాలు తీస్తూ నీకు కొసరి కొసరి వడ్డించడం చూసి చాలా రోజులయినట్లుందిరా! ఏదో మార్పు కనిపిస్తుంది. అది మంచికో చెడుకో చెప్పలేను గాని, నువ్వు ప్రతి సారీ ఒంటరి బ్రహ్మచారిలా యెక్కడెక్కడో డిన్నర్ చేసి రావడం యెబ్బెట్టుగా ఉందిరా! ఎంతటి సీనియర్ ఎగ్జుక్యూటివ్ పోస్టు ఐతే మాత్రం నిన్ను కట్టుకున్న పెళ్ళాం ఒకతె యింట్లో ఉందన్నది మరచిపోతే యెలా? ” 


“అటువంటిదేమీ లేదు బాబూ! ఆలస్యంగా వచ్చినప్పుడల్లా కారణం మధులికకు చెప్తూనే ఉన్నానుగా! “


అప్పుడు ఉమాదేవి కదలింది. “మాకు కావలసింది కారణం కాదు—వాస్తవం. నువ్వీ మధ్య యెందుకో మధులికతో మామూలుగా ఉండటం లేదు”


సోమశేఖరం తల్లి ధాటికి ఆశ్చర్యపోయాడు. తత్తరపాటుకి లోనయాడు. అతడు సర్దుబాటుకి పూనుకున్నాడు. “ఘాటుగా లేని పోనివన్నీ ఊహించుకుంటూ మాట్లాడి ఇంద్రకిరణ్ మిమ్మల్నందర్నీ కంగారు పెట్టించినట్టున్నాడు. మేం యెప్పటిలాగే నార్మల్ గానే ఉన్నామమ్మా! కావలిసొస్తే మీ కోడలి పిల్లనే అడగండి”


ఆమాట విన్నంతనే ముగ్గురూ చట్టున మధులిక వేపు తలలు తిప్పారు. మధులిక నవ్వు ముఖంతో తలాడించింది. అది చూసి నర్సమ్మ స్పందించింది-


“నువ్వెప్పుడూ నవ్వు ముఖంతోనే కనిపిస్తావు. నవ్వు ముఖంతోనే బదులిస్తావు. అలా నువ్వు నీ మొగుడికి యెల్ల వేళలా వత్తాసు పలుకుతావని మాకు తెలియదా యేమిటి? “అని మనవడి వేపు తిరిగిందామె.


“ఇప్పుడు నేను చెప్తున్నాను వినుకోరా సోమశేఖరా! ఇలా ప్రతి సారీ ఆలస్యంగా రావడం ఉద్యోగరీత్యా తప్పని సరైతే నువ్వు ఉద్యోగం మానుకుని కొత్త దానికోసం ప్రయత్నించు. నీకున్న అనుభవంతో ఎక్కడైనా ఏదో ఒకటి దొరక్కపోదు. ఉద్యోగం చేస్తున్నదెందుకట? సంపాదన కోసమేనా! కాదు. కుటుంబం బాగుండటం కోసం. ఇప్పుడు నీకున్నది మధులిక మాత్రమే కావచ్చు. రేపు బిడ్డా పాపలు కలగరేమిటి? “అంటూ సోఫానుండి లేచింది నర్సమ్మ.


ఆమె తరవాత భార్యా భర్తలిద్దరు కూడా లేచి మేడ మెట్ల వేపు కదిలారు. అప్పుడు సోమశేఖరం భార్యకు ముఖాముఖిగా నిల్చుని కన్నార్ప కుండా చూడసాగాడు. ఈసారి మధులిక మోమున చిర్నవ్వు చంద్రికలు వెలగడం లేదు. భర్తను తదేకంగా చూస్తూ చలనరహితంగా నిల్చుంది. శేఖరం మందస్మిత వదనుడై సమీపించి ఆమె మెడ చుట్టూ చేతులు పోనిచ్చి పడక గదివేపు నడిపించాడు. 


రహస్యాల అట్టడుగున ఆసక్తికరమైన ఊసులు అణగి ఉండవచ్చు. గుసగుసలు వినిపించీ వినిపించని రీతిన చెవులకు తాకవచ్చు. కాని—అవి యెంతటి గంభీరమైన రహస్యాలైనా—చివరకు ఆడామగాల మధ్య దోబూచులాడే మార్మిక రహస్యా లైనా, సైనిక స్థావరాలలోని ఊహ ప్రత్యూహల రహస్యాలైనా యెక్కువ కాలం దాగవు. వాటికున్న యేకైక బలహీనత యేదో ఒక రూపంలో ఏదో ఒకరోజు పగిలిన ఆనపకాయ జాడీలా ఎక్స్ పోజ్ కావడమే.. ఫెళ్ళున కాకపోయినా సముఖమున కాక పోయినా అవి యేదో ఒక రూపాన బట్టబయలు కాకమానవు. అదే రహస్యాలకున్న పరిమిత ఆంతరంగిక పెళుసు తనం. 


ఆరోజు శ్రావణ మాస మొదటి శుక్రవారం. సాయంత్రమయేసరికి ఆకాశంలోని వేడిమి తగ్గినట్లుంది. సూర్యుడు తెరచాటుకి తప్పుకున్నట్లున్నాడు. పక్షులు బారులు బారులుగా రివ్వు రివ్వున దిక్కుతోచని దిగంతాల వేపు దారులు వెతుక్కుంటూ దూసుకుపోతున్నాయి. సోమశేఖరం యదారీతిన వసారా వెలుపల కారుని పార్క్ చేసి చేతిలోని బ్రీఫ్ కేసుతో యింట్లోపలకు నడిచాడు. వచ్చీ వచ్చిన వెంటనే ఖంగుతిన్నట్టు చప్పున వీధి వాకిట వరకూ వచ్చి ఆగిపోయాడు. అదేదో సమీక్షా సమావేశంలా హాలులో కుటుంబసభ్యులందరూ యెవరి కోసమో యెదురు చూస్తున్నట్టు వాకిటవేపు తలలు తిప్పి చూస్తూ కూర్చున్నారు.


ఇంకెవరికోసం? తనకోసమే అయుంటుంది. తనింకా ఉన్న ఉద్యోగం విడిచి మరొక మంచి కొలువు కోసం ప్రయత్నిస్తున్నాడా లేదానని తెలుసుకోవడానికేనేమో.. బామ్మ ప్రశ్నల బాణం సంధించడానికి సిధ్ధంగా ఉన్నట్లుంది. ఉద్యోగం విడిచి పెట్టడమంటే—అందులో ప్రైవేట్ రంగంలో మరొక ఉద్యోగం సంపాదించడమంటే బన్నురొట్టెపైన వెన్న తడుముకున్నంత తేలికైన వ్యవహారమా! ఎక్కడైనా సరే—వయసు మళ్ళిన వాళ్ళతో వచ్చిన చిక్కు ఇదే! సగం అర్థమయి-సగం అర్థం కాని రీతిన మాట్లాడేస్తుంటారు. ఆజ్ఞలు జారీ చేసేస్తుంటారు. అతడు ఆశ్యర్యం నుండి తెప్పరిల్లే లోపల ఉమాదేవి పిలిచింది. ”ఇలారారా సోమశేఖరా! “అతడు తల్లి వద్దకు వస్తూనే తనను తను కుదుట పర్చుకుంటూనే అడిగాడు-“ఈరోజు యింటికి పెందలకడే వచ్చేసాను కదమ్మా! ” 


“కాదని యెవరన్నారురా శేఖరా! ముందు దీనికి బదులియ్యవోయ్-గుడికి వెళ్ళొస్తున్నావా? ”


కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ తలూపాడు.


“చిన్నప్పట్నించి చూస్తున్నాను మాతో గుడికి రానని మారాం చేసేవాడివి. నుదుట మెరుస్తూన్న కుంకు మ రేఖల్ని చూస్తుంటే నువ్వొక్కడివే వెళ్ళొచ్చినట్టున్నావు. భక్తి పెరిగింది. పర్వాలేదు. మంచిరోజు కదా—మంచి కార్యమే చేసా వు. ఓపారి మాకోసం కూడా మొక్కుకున్నావు కదూ! ” ఉమాదేవి అబ్బురపడుతూ అంది.


అతడు తలూపుతూ కదలి వచ్చి మధులికకు బ్రీఫ్ కేసు అందించాడు అలవాటు ప్రకారం.. ”చాలా మంచి పని చేసావురోయ్! మరి మా కోసం-ముఖ్యంగా నువ్వు అగ్ని గుండం చుట్టూ యేడడుగులు వేసి నీ జీవన సహచరిగా చేసుకున్న మధులిక కోసమైనా ప్రసాదం తెచ్చావా! ”


అతడు నిదానంగా బదులిచ్చాడు-“ఏదో మూడ్ లో పడి తేవడం మరచిపోయాను”


ఉమాదేవి అదోలా నవ్వింది. “ఔను. ఏదో మూడ్ లో పడి ఇంకెవరికో ప్రసాదం యిచ్చేసి ఉంటావు. అంతే కదూ! ” అంటూ సోఫానుండి లేచి వచ్చింది.


అనుకోకుండానే సోమశేఖరం రెండడుగులు వెనక్కి వేసాడు.


“అలా వెనక్కి జరిగితే చాలదో య్! ముందుకు రా! “


అతడలాగే అన్నట్టు నవ్వు ముఖంతో ముందుకు వచ్చాడు.


“నేనడిగే ప్రశ్నకు తడుము కోకుండా సూటి గా జవాబివ్వాలి. సరేనా! ”


అలాగే-అన్నట్టు తల పంకించాడు.


ఉమాదేవి ప్రశ్నల తుంపర కురిపించనారంభించింది. “నీ ప్రక్కనున్నదెవరు? ” 


“ఇదేమి ప్రశ్నమ్మా! ఇది గాని వింటే చూసేవారు నవ్విపోతారు” 


“నేను ముందే చెప్పాను బదులు సూటిగా యివ్వాలని. ఇప్పుడు పాయింటుకి తిన్నగా..రా! ”


అతడు బదులిచ్చాడు-“నా భార్య“అని.


అప్పుడు ఉమాదేవి వెంటనే మొబైల్ తీసి కెమేరా స్పాట్ తెరిచీ- “మరి ఈమెవరు? కళ్ళు విప్పార్చి చూచి మరీ చెప్పవోయ్“


సోమశేఖరం వెంటనే బదులివ్వలేదు. ఆ ఫొటోలోకి తదేకంగా క్షణాలపాటు చూసి యిక తప్పదన్నట్టు తేల్చు కుంటూ అన్నాడు-“ నాకు క్లోజ్ సహచరి “


“సహచరి అంటే? “


అతడు వెంటనే బదులివ్వకుండా కొన్ని క్షణాల పాటు మౌనం వహించి సౌమ్యంగా నిదానంగా బదులిచ్చాడు- “నాభార్య”అన్నాడు.


“ఏమన్నావూ! ” అంటూ కళ్ళను చింత నిప్పులు చేసుకుంటూ చేతినెత్తింది. కాని—యెత్తిన చేయి యెత్తినట్లే ఉండిపోయింది ఉమాదేవి.. మధులిక అత్తయ్య చేతిని భర్త చెంపన పడకుండా ఆపేసింది.


ఇంద్రకిరణ్ అయోమయంగా చూస్తూ గట్టిగా అన్నాడు- “మీకేమయింది వదినా! అమ్మ నీ కోసం ఫీలవుతూ రియాక్టయితే నువ్వెందుకలా అడ్డుతగుల్తావూ? నువ్వుఉండగా ఇంకెవర్నో పెళ్ళాం అనడం చిన్న విషయమా! ”


అప్పుడు మధులిక ఇటు తిరిగి స్పందించింది-

“నువ్వూరుకోవోయ్ చిట్టి మరిదీ! ”అని అందరి వేపూ చూస్తూ చేతులు జోడిస్తూ అంది- “సారీ అత్తయ్యా! సారీ మాఁవగారూ! మీ ఆబ్బాయి పైన మీకు లేని అధికారం మరెవ్వరికుంటుందో చెప్పండి. కాని నాముందు చేయి చేసుకుంటే నేను భరించలేన త్తయ్యా! ”


అప్పుడు దూరం నుంచి నర్సమ్మ కలుగచేసుకుంది- “ఎందుకంట? నీ బ్రతుకుని బుగ్గిపాలు చేయాలనుకున్నవాడి పైన యింకా పెను కెరటమంతటి మోహమా! “


మధులిక అటు కదలి వెళ్ళింది- “మీ మాట కాదన్నందుకు అన్యధా భావించ కండవ్వా! నేను మీ మనవడితో సంసారం సాగించింది రెండేళ్ళో మూడేళ్ళో కావచ్చు. కాని—అతడి గురించి నాకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే మీకంటే నాకు యెక్కువే తెలుసేమో! . మా వారికి యిటువంటి చిల్లర పనులు నచ్చవు—“


అప్పుడు ఉమాదేవి చప్పున గ్రుడ్లు పెద్దవి చేసుకుంటూ అడిగింది “మరి ఇదేమిటంట? ”


మధులిక యిబ్బందిగా ముఖం పెట్టి- “అదే చెప్పబోతున్నానత్తయ్యా! ఎక్కడో యేదో కిరికిరిలో చిక్కుకున్న ట్టున్నాడు మీ అబ్బాయి. అదేమిటో యింటి పెద్దలుగా మీరే అసలు విషయాన్ని రాబట్టుకోవాలి. మావారినీ నా సంసారాన్నీ గట్టెక్కించాలి”


ఈసారి సదానందం అలాగా అన్నట్టు తలూపుతూ శేఖరం వేపు చూపులు సారించాడు. “నిన్ను చూస్తుంటే విచిత్రమైన విపరీతమైన మనస్తత్వం గల మనుషులు గుర్తుకోస్తున్నారోయ్ శేఖరా! వాళ్ళు యెటువంటివారంటే—ఎప్పుడూ యెక్కడా ఎటువంటి తప్పూ చేయరు. కాని—యేదో ఒకసారి యెవరూ యెదురు చూడని విధంగా తడబాటుకి లోనవుతారు. తిన్నగా చూపుకానని పాతాళ లోకంలోకి వెళ్ళి పడతారు. మళ్ళీ తేరుకోరు. నువ్వు కూడా ఆ బృందంలో చేరిపోతున్నావేమో! అన్నట్టు నా దొక అనుమానం—నువ్వు కొత్తగా పరిచయమైన అమ్మాయిని గార్ల్ ఫ్రెండనే బదులు కొలీగ్ అనే బదులు యెమోషనల్ ఐపోతూ పెళ్ళాం అంటున్నావేమో! ఉంపుడు గత్తెలు- చేతులు కలుపు కుని తిరిగే లవర్సూ భార్యలు కాలేరు. ఇది గుర్తుంచుకో— తెలుగు భాషకు తెలుగు పదాలకూ అంతకంతకూ దూరమయి పొరపాటు గా మాట్లాడుతున్నావేమో—బాగా బుర్రను ఉపయోగించి చెప్పు..“


దానికి సోమశేఖరం తల అడ్డంగా ఆడిస్తూ నిబ్బరంగా చూస్తూ బదులిచ్చాడు- “లేదు నాన్నగారూ! కమలవాణి నా భార్యే— అబధ్ధం చెప్పి నన్ను నేను దగా చేసుకోలేను. మిమ్మల్ని దగా చేయలేను. ఇంకా చెప్పాలంటే, ఈ విషయం పెండ్లి చూపులప్పుడే సూచాయిగా మధులికకు చెప్పాను. ”


===============================================

                                                ఇంకా వుంది

                                    ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 త్వరలో

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree



 



bottom of page