top of page
Original.png

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10

Updated: 2 days ago

#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Udayaraga Udvegalu - Part 10 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 16/01/2026

ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:

తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.

తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్రకిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం, పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు.

సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం.


ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 10 చదవండి.


ఆ రోజు మంగళవారం. సరోజమ్మ చిన్న కూతురు చంద్రికతో కలసి చెల్లెలు పుష్పవల్లిని చూసి వెళ్ళడానికి వచ్చింది. తల్లీ కూతుళ్ళిద్దరూ వీధివాకిలి దాటి లోపలకు వస్తున్నప్పుడు శివగామి పాడుతూన్న తమిళపాట వినిపించింది- “ఇండ్రు వందదుమ్ అదే నిలా! -అండ్రు వందదుమ్ యిదే నిలా! ఎండ్రు వందదుమ్ ఒరే నిలా! “ 


గదిలోకి తొంగి చూస్తూ అడిగిందామె- “అదేమిటే వదినతో కలసి తమిళపాట పాడుతున్నావూ!” 


“మరి మీ వదిన తెలుగుపాట ఎప్పుడు నేర్చుకుంటుందని— త్యాగయ్య కీర్తనలు ఎప్పుడు పాడి వినిపిస్తుంది.. “ 


అప్పుడు మాధవి నవ్వుతూ లేచి యెదురొచ్చింది- “మా యిద్దరి మధ్యా ఒప్పందం కుదిరింది పెద్దమ్మా! నేను వదినకు తెలుగు పాట నేర్పుతుంటాను. వదినేమో నాకు తమిళ పాట నేర్పుతుంది. మంచి సమయానికి వచ్చావు పెద్దమ్మా!”


ఎందుకన్నట్టు చూసిందామె. 


“అమ్మ బెల్లం గారెలు చేస్తూంది. నీకు చాలా యిష్టం కదూ!“ 


అప్పుడు శివగామి లేచి వచ్చి నమస్కరిస్తూ- “రండి పెద్దత్తయ్మా!” అని యెదుర్కోలు పలికింది. 


సరోజమ్మ నిండుగా నవ్వింది- “పర్వాలేదు. మీ చిట్టి ఆడపడుచునుండి తెలుగు బాగానే నేర్చుకుంటున్నావన్నమాట! ఏదీ — నువ్వొక తెలుగుపాట పాడు- విందాం” 


అప్పుడు చంద్రిక కలుగచేసుకుంది. “నాకు తెలుసమ్మా. వదినకు ఘంటాసాలగారి- నా హృదయంలో నిదురించే చెలీ— చాలా యిష్టమని. పాడమని చెప్పేదా! ”

సరోజమ్మ నవ్వి శివగామి వేపు మెచ్చుకోలుగా చూసింది- “తప్పకుండా ఒక రోజు వింటాలే! ఇచ్చిపుచ్చుకోవడాలు రెండు వేపులా సాగాలి కదా- మీ అన్నయ్యను కూడా రెండు మూడు తమిళ పాటలు నేర్చుకోమను. ఎప్పుడైనా కాంచీపురం వేపు వెళితే పెళ్ళాంతో కలసి పాడాలిగా!” అని సంభాషణకు మలుపు తిప్పుతూ అక్కడకు వచ్చిన పుష్పవల్లి వేపు తిరిగి అంది- “నేనిప్పుడిక్కడకు వచ్చింది మీ యింటి బెల్లం గారెలు తినడానికి కాదే తల్లీ! ” 


మరెందుకన్నట్టు అక్కయ్య వేపు చూసింది పుష్పవల్లి- “నువ్వూ నీ ముద్దుల కూతురు తప్ప అందరూ చెప్పుకుంటున్నారు మీ పెరడు తోట గురించి— ఇరుగు పొరుగున యెక్కడా లేని పచ్చదనం మీయింటి చుట్టూ పరిఢవిల్లిందటగా! పూల మొక్కలు అరటి చెట్లు- జామి చెట్టు- బొప్పాయి చెట్లు – జాజులు సన్నజాజులు పారిజాతాలు గులాబీలు తోట నిండా విరగబూస్తున్నా యటగా! ఇదెలా సాధ్యమైందో నాకొక మాట చెప్తే కరిగిపోతావా యేమిటి? ” 


అప్పుడు వికసిత వదనంతో నవ్వడం పుష్పవల్లి వంతయింది- “ఇది మా ఘనకార్యం కాదే అక్కాయ్! అంతా శివగామి వచ్చిన వేళా విశేషం” 


అదెలా- అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది సరోజమ్మ. 


అప్పుడు మాధవి అందుకుంది- “నేను చెప్తాను పెద్దమ్మా! అదెలా జరిగిందంటే— నేనూ వదినా ఊరి చివరి సూపర్ మార్కెట్టుకి వెళ్ళామా.. అక్కడ మాకు అనుకోకుండా అగ్రికల్చరల్ డిపార్టుమెంటులో పనిచేస్తూన్న నిర్మల అనే ఆవిడ పరిచయమైంది. ఆమే, ఆమెభర్తా చాలా రోజులు చెన్నప్పట్నంలో ఉన్నారట. అక్కడి తెలుగు వారు ఆమెకు చాలామంది తెలుసని చెప్పుకొచ్చింది. 


వదిన ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని ఆమెను ఇంటికి పిలిపించి పెరడునేలలో భూసార పరీక్ష చేయించింది. భూమిలోని లవణ ఖనిజాల నిష్పత్తిని కూడా చెక్ చేయించింది. ఊరకే కాదు, తగిన ఫీజు యిచ్చుకునే.. నిర్మలగారు జరిపిన భూసార నివేదిక ప్రకారం యూరియా వంటి యెరువులు- తదితర పురుగుల మందులూ మోతాదుకి మించకుండా కలిపి పిచకారీ చేయిపించింది. నీళ్ళు కూడా ఎప్పుడు బడితే అప్పుడు యెడాపెడా పోయకుండా తగు రీతిలో పోసేటట్టు చేసింది. 


దాని ఫలితంగా.. మొక్కలు చీడల పాలు కాకుండా యేపుగా పెరుగుతున్నాయి. అంతే కాదు,పెరడులో రెండు మూడు చందనం మొక్కలు కూడా నాటించింది. ఇంకేమైనా అడగాలనుకుంటే వదనెను నువ్వే అడుగు పెద్దమ్మా! “ 


అంతా ఆసక్తికరంగా విన్న సరోజమ్మ నిష్ఠురంగా అంది- “చూడు శివమ్మా! నువ్వు ఈఇంటికి మాత్రమే కోడలివి కావు. మా ఇంటికి కూడా నువ్వు కోడలివే –ఇది గుర్తుంచుకుని మాఇంటికి వచ్చి మాతో పాటు కొన్నాళ్ళపాటు ఉండి యిటువంటివన్నీ చక్కదిద్దుతుండు. వచ్చేటప్పుడు ఒంటరిగా రాకు. నీ భర్తతోనే రా.. సరేనా? “ 

శివగామి నవ్వుతూ తలపంకిస్తూ సరోజమ్మ చేతులు అందిపుచ్చుకుంది అభిమాన పూర్వకంగా.. “మీరు నాకు పెద్దత్తయ్య— మీ మాట యెలా జవదాటగలను? ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను— మావారితో కలసి.. ”


సరోజమ్మ ఆ మాటకు తన్మయత్వం చెందుతూ ఆప్యాయంగా చూస్తూ “కబురంపుతాను. మాతో కొన్నాళ్ళుండి వెళ్ళు. చెన్నప్పట్నంలో యెక్కడో శరవణన్ హోటల్ ఒకటి ఉందటగా.. అక్కడ సాంబారు భలే బాగుందని మధుమురళి వాళ్ళమ్మకు చెప్పాడట. అటువంటి సాంబారు మాఇంటికి వచ్చి చేసిపెట్టు.. ఇక నేను వెళ్ళొస్తాను” అని మాధవి అందించిన చల్ల నీళ్లు తాగి కదలింది. 


అప్పుడు పుష్పవల్లి అక్కయ్యను ఆపింది- “గారెలు తిని వెళ్ళక్కయ్యా! ”


సరోజమ్మ తల అడ్డంగా ఆడించింది- “నాకిప్పుడొద్దు. తరవాత ఇంటికి పంపించు. ఇప్పుడు మీ ఇంటికి పనిగట్టుకుని వచ్చింది మీ పెరడు తోట గురించి తెలుసుకుని పోవడానికే! నేనే కాదు,ఇంకా కొందరు మీ పెరడు తోటలోకి రావచ్చు“ అని బయల్దేరమన్నట్టు కూతురు వేపు చూసింది. 


“నేనిప్పుడే రానమ్మా! వదినెతో నాకు కొంచం పనుందమ్మా! మధ్యాహ్నం తరవాత వస్తాను. సాయంత్రానికి యిడ్లీలు చేసుకోవడానికి పిండి రుబ్బి ఉంచాను. వచ్చేటప్పుడు తమలపాకులు తెంపుకొస్తాలే.. “ 

సరోజమ్మ అంగీకార సూచకంగా తలూపుతూ గడపదాటి వీధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మాధవి చంద్రిక వేపు ప్రశ్నార్థకంగా చూసింది, సంగతేమిటన్నట్టు.. 


“చెప్తాగా.. తొందరేమిటే! ” అంటూ ఆమె లోపలి గదివేపు నడచింది. ముగ్గురూ పేము కుర్చీలలో కూర్చున్న తరవాత శివగామి అడిగింది- “చెప్పు చంద్రికా! నాతో యేంపని? ” 


చంద్రిక వదినె చేతిపైన చేయి వేసి సంభాషణ ఆరంభించింది. “నిజంగా పని జరగాల్సింది నా కోసం కాదు. మా హైస్కూల్ క్లాస్ మేట్ విమల అన్నయ్య కోసం”


ఆ మాట విన్నంతనే శివగామీ మాధవీ కళ్ళు పెద్దవి చేసుకుని చూసారు. అప్పుడు చంద్రిక అందుకుంది- “మరేమి లేదు వదినా! విమల అన్నయ్య సోమ్రాజు చాలా అప్సెట్ ఐనట్టున్నాడు. ఎమోషనల్ గా అన్ ఈజీగా తయారయినట్టున్నాడు. ఇది విని— దీనికి మనమేమి చేయగలమని యెదురు ప్రశ్న వేయకండి. డాక్టర్ వద్దకు తీసుకెళ్ళమని సలహా యివ్వకండి. పూర్తిగా వినండి. 


చాలా రోజులుగా హాసిని అనే అమ్మాయి అతడితో క్లోజ్ గా ఉండేది. జాతర్లకు- పండగ పబ్బాలకు ఇతర శోభా యాత్రలకు ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. కలసి వచ్చేవారు. పెళ్ళికాకముందు వయసుకి వచ్చిన అబ్బాయీ అమ్మాయీ అలా ఫ్రీగా తిరక్కూడదని మందలించినా వినేవారు కాదు. కాని వాళ్ళ స్నేహం యిప్పుడు చటుక్కున మాంజాదారం లా తెగిపోయింది” 

శివగామి వెంటనే అడిగింది- “ఎందుకూ— అబ్బాయి కొత్త సీతాకోక చిలక వెంటబడ్డాడా! ” 


చంద్రిక అదే రీతిన తల అడ్డంగా కాదన్నట్టు ఆడించింది. “తెగతెంపులు చేసుకున్నది సోమ్రాజు కాదు, హాసిని.. అదాటున మూతి ముడుచుకుంటూ సోమ్రాజునుండి దూరమైంది” 


కారణమేమిటని మాధవి అడిగింది. 


“పోస్టల్ డిపార్టుమెంటులో రెగ్యులర్ స్టాఫ్ గా యెంపికైంది. కాని సోమ్రాజు యెంపిక కాలేదు. ఆ మాటకు వస్తే అతడు ఇందులోనే కాదు, ఇతర స్టేట్ సెంట్రల్ పోటీ పరీక్షలకూ హాజరయాడు. ఎందులోనూ యెంపిక కాలేదు. హాసిని విషయం అలాకాదు. మొదటి సారి వ్రాసిన మొదటి పరీక్షలోనే ఫ్లయింగ్ కలర్సుతో యెంపికయి పోయింది. అప్పట్నించి యెడముఖం పెడ ముఖంగా తయారయింది. ముందులా మూవ్ చేయిడం మానేసింది. దీని వల్ల సోమ్రాజు యెంతగా నిరుత్సాహపడ్డాడంటే- అన్న ఆహారాలు తినడం తగ్గించేసాడట. 


’ఇప్పుడు నా వద్దకెందుకు వచ్చావు? ఇందులో నేనేమి చేయగలను‘అని అడక్కు వదినా! నేనే చెప్తాను. నువ్వు బ్రిలియంట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నదానివని అన్నయ్య మాటల సందర్భాన చెప్పినట్టు గుర్తు. నువ్వు గాని ప్రాక్టికల్ స్థాయిలో కోచింగ్ యిస్తే సోమ్రాజు యెలాగో ఒకలా గట్టెక్కగలడని నాకు తోస్తుంది వదినా! కాదనకు వదినా- సోమ్రాజు చెల్లి విమల నాకు క్లాస్ మేట్ మాత్రమే కాదు. నాకు క్లోజ్ ఫ్రెండు కూడాను— దానికోసమైనా సోమ్రాజుకి మనం యేదైనా చేయాలి“


అంతావిన్న శివగామి కొన్ని క్షణాలపాటు మౌనం వహించింది. ఇప్పుడు సోమ్రాజుకి తక్షణం కావలసింది ఉద్యోగం కాదు. పోగొట్టుకున్న ప్రిస్టేజిని కొంతలో కొంత పూర్వస్థితికి తెచ్చుకోవడం. వీల్లేదనో తీరిక లేదనో అంటే ఆడపడుచు ముఖం మాడ్చుకుంటుంది. అప్పుడు శివగామి విషయానికి వస్తూ యిలా అంది- “సరే— మేటర్ అర్థమైంది. ఇప్పటికిప్పుడు మాటివ్వలేను గాని నీ స్నేహితురాలిని కూడా రమ్మను” 


ఆ మాట విన్నంతనే చంద్రిక ఉత్సాహంగా అంది- “అది బయటే కాచుక్కూర్చుంది వదినా! పిలుచుకు రానా? “


ఉఁ అంది శివగామి. చంద్రిక పిలుపందుకుని మర్యాద పూర్వకంగా లోపలకు వచ్చిన విమలను చిరునవ్వుతో పలకరించి- “అన్నయ్యంటే నీకు చాలా ఆభిమానంలా ఉందే—“ అంటూ కాసేపు మాట్లాడి మరునాడు పదింటికి రమ్మనమని పంపించేసింది శివగామి. 


మరునాడు ఉదయం పెరడుతోట నుండి పూలు యేరి పూజా గదిలో దైవార్చన చేసి తీర్థం తీసుకు వెళ్ళి అత్తామామలకూ మధుమురళికీ యిచ్చి మిగతాది తులసికోటలో పోసి వచ్చేటప్పటికి చంద్రిక మాధవి యిద్దరూ యెదురొచ్చారు-

“విమల సోమ్రాజులిద్దరూ బైట నీ కోసం యెదురు చూస్తున్నారు వదినా! లోపలక పిలుచుకు రానా? “ 


శివగామి మాధవిని వారించింది- “వద్దు! వసారాలో కూర్చోబెట్టండి. అత్తయ్యకు అంతరాయం కలిగించుకూడదు కదా!” అంటూ మేడ మెట్లెక్కి మురళితో చెప్పింది-


“నాకోసం చంద్రిక నేస్తాలు వచ్చినట్టున్నారు. మీరు టిఫిన్ తిన్నారు కదా— ఇంకేమైనా కావాలండీ! ” 


“ఇంకేమీ వద్దు. ఈమధ్య బాబు యేదో మూడ్ లో ఉన్నట్టున్నాడు. తరచూ అన్యమనస్కంగా కనిపిస్తున్నాడు. అంచేత కల్పించుకుని ఆయనకు అల్పాహారం యిచ్చి మాత్రలివ్వడం మరచిపోకు” 


“అంతా నావల్లే జరిగిందండీ! నేను గాని యిక్కడకు వచ్చుండకపోతే మాఁవగారికి యింతటి యిబ్బంది కలిగుండకపోను—“ 


“అటువంటిదేమీ లేదు. మా బామ్మకు మొదట్నించీ కోపమెక్కువ. రియాక్షన్ చేయడం కూడా యెక్కువ. ఏ లోకంలో ఉన్నాడో గాని మా తాతయ్య ఆ మహాతల్లిని యెలా భరించే వాడో! చూసావు కదూ— మా పెద బాబును సహితం ఒరేయ్ గిరేయ్ అంటూ - ఆమెకు అడ్డు తగుల్తున్నందుకు లెంపకాయ కొట్టడానికి కన్నెర్ర చేసింది. నువ్వు మరీ యెక్కువగా ఫీలవకు. ఇదంతా మాకు అలవాటే,ఇవన్నీ కదిలి చెదరిపోయే మేఘాలే.. అలాగని మాపైన పొరపాటే లేదని కాదు” అంటూ బ్రీఫ్ కేసు అందుకుని క్రిందకు దిగాడు మురళి. వెళ్ళిపోతూన్న భర్త వేపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది శివగామి. 


అల్పాహారం తిని చీర మార్చుకుని వసారాలోకి వచ్చేటప్పటికి అక్కడ దృశ్యం ఆమెను ఆశ్చర్యంలో ముంచింది. అక్కడ యిద్దరు ముగ్గురు కాదు. ఆరేడుగురు తన కోసం యెదురు చూస్తూ తాటాకు చాపలపైన కూర్చున్నారు. అదోలా ముఖం పెట్టి ఆడపడుచు వేపు చూసిందామె. వెంటనే మాధవి వదినెకు సంజాయిషీ యిచ్చుకుంది. “వీళ్ళందరూ సోమ్రాజు నేస్తాలు వదినా! వద్దంటున్నా వెన్నంటి వచ్చేసినట్టున్నారు” 


అప్పుడు విమల వచ్చి సారీ మేడమ్- అంది. 


“శివగామి యిక తప్పదన్నట్టు నవ్వుతూ ”సరే— ముందు అందరికీ మంచినీళ్ళవ్వండి”


అప్పుడు మాధవి కూడా వదినె నవ్వుతో నవ్వుకలుపుతూ అంది- “అందరికీ పేపర్ కప్పులో టీ పోసిచ్చాం వదినా! మొదటి రోజు కదా— అందుకని.. ప్లీజ్ వదినా! వీళ్ళందరూ ఉద్యోగ వేటలో ఉన్న వారే..” 


శివగామికి గతుక్కుమంది. తన కొత్త పెద్దరికానికి గురు స్థానానికి మండి పడి అత్తగారు యేమంటారో! ఏది యేమైతే నేమి- ఇంత వరకూ వచ్చి- కాదూ కూడదని తనిప్పుడు వెనక్కి వెళ్ళలేదుగా! మాట తప్పి మడమ వెనక్కి తిప్పలేదుగా! ఆమె ఓసారి గుండెల నిండా ఊపిరి పీల్చి వదలి అక్కడున్న పేము కుర్చీలో కూర్చుంది. 


“ఇప్పుడు మీరు తెచ్చుకున్న గైడ్ పుస్తకాలూ తదితర పుస్తకాలూ క్రింద పెట్టండి. ఈపూట నేను చెప్పిది మాత్రమే వినాలి. అర్థమైందా! ”


అందరూ తలలూపి పుస్తకాలు క్రిందపెట్టారు. 


“ఇక మీరందరూ పేరూ చిరునామా ఇంత వరకూ చదువుకున్న విద్యార్హతతో బాటు వయసూ వ్రాసివ్వండి. వీలుంటే గుర్తుంటే మీరింత వరకూ హాజరయిన యింటర్వ్యూల వివరాలు కూడా యివ్వండి. బడిలోని క్లాసులా ట్రీట్ చేస్తున్నానని మొహమాట పడకండి. కారణం ఉంది” 


అందరూ మాధవి అందించిన స్లిప్ నోట్ పైన అలానే వాళ్ళ వివరాలు వ్రాసిచ్చారు.


“ఇక మన క్లాసు ఆరంభమవుతుంది,ఈరోజే ఆరంభమవుతుంది. మన కంటే పెద్దవాళ్లు అంటే మనకంటే అనుభవంలో పెద్దవాళ్ళు ఒక మాట తరచూ చెప్తుంటారు.. చెప్పేది ఒక సారి శ్రధ్ధగా సావధానంగా వినడమంటే పదిసార్లు చదవడంతో సమానమని. పోటీ పరీక్షలు వ్రాయడమంటే— బడి పుస్తకాలు కంఠతా పట్టడం కాదు. బుర్రను పదును పెడ్తూ మలుపులూ మెళకువలూ యెరిగి ముందుకు సాగాలి. ముఖ్యంగా షార్ట్ కట్ పధ్ధతులు వెతుక్కోకుండా మెదడుకి బాగా పనివ్వాలి. నిరంతరంగా కళ్ళప్పగించి చూస్తూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. లేక పోతే ఓపెన్ జాబ్ మార్కెట్టులో నిలదొక్కుకోలేం. 


ఇక విషయానికి వస్తాను. పత్రికలో గాని మరెక్కడైనా గాని జాబ్ ప్రకటన చూసిన వెంటనే చదవారంభించడం కాదు ముఖ్యం. మొదట చదవడానికి అవసరమైన మేటర్ ని కుదురుగా సమకూర్చుకోవాలి. పదిలపర్చు కోవాలి. అప్పటికప్పుడు సమకూర్చుకోలేక పోతే గ్రంథాలయంలోకి వెళ్ళి లైబ్రేరియన్ అనుమతితో అనువైన పుస్తకాలు వెతికి మేటర్ సంపూర్ణంగా సమకూర్చుకోవాలి. దప్పిక కలిగిన తరవాతనే నుయ్యి తవ్వుతామంటే కుదరదు. ఇదీ అసలైన అగ్ని పరీక్ష. 


ఇంకొకడుగు ముందుకు వేసి చెప్పాలంటే— ఉద్యోగం దొరికేంతవరకూ సరస్వతీ దేవి కటాక్షం లభించేంత వరకూ మీకు అసలైన దేవాలయం గ్రంథాలయమే! ఎనీ డౌట్? ” 


అక్కడ కూర్చున్న యేడుగురూ మౌనంగా తలలూపుతూ ఉండిపోయారు. ఆమె కుర్చీనుండి లేచి చిరునవ్వు చిందిస్తూ యింట్లోపలకు కదలింది. ఏడుగురూ వెంటనే లేచి నిల్చోలేదు. ఎవరికీ అక్కణ్ణించి కదలి వెళ్ళాలనిపించ లేదు. శివగామిని చూస్తూ ఆమె మాటలు వింటూ యింకా అక్కడే ఉండాలనిపిస్తుంది. అన్నాళ్లూ ఉద్యోగాల వేటలో అలసిసొలసిన వాళ్ళ మనసుకి తాజా తోటగాలి ఎక్కణ్ణించో వచ్చి సోకినట్లనిపిస్తూంది. తెరచిన కొత్త కిటీకీల నుండి ధవళ కాంతి తాకుతున్నట్లని పిస్తూంది.

===============================================

                                                ఇంకా వుంది

===============================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page