మదిలో మల్లెల మాల - పార్ట్ 11
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 6 days ago
- 6 min read
Updated: 3 hours ago
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 11 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 18/01/2026
మదిలో మల్లెల మాల - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్ తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్ లో చేరుతారు. సినిమారంగంలో నష్టపోయి, రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు. వారికి సహాయం చేయాలనుకుంటాడు రమణ.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 11 చదవండి.
యిరువురు మిత్రులు బెంగుళూరు చేరారు. ఆఫీస్‍లో జాయిన్ అయ్యారు. రెండు వారాల తర్వాత వచ్చి రమణ తల్లిని బెంగుళూరుకు తీసుకొని వెళ్ళాడు.
తనకున్న మేధాశక్తితో ఆరునెలల్లోనే రమణ అందరికీ హితుడైనాడు. యాజమాన్య దృష్టిలో మంచి గుర్తింపు సంవత్సరం తర్వాత.... వన్ ఇయర్ స్పెషల్ ట్రైనింగ్‍కు యాజమాన్యం... రమణను ఎంపిక చేసి అమెరికాకు పంపించ నిర్ణయించారు.
ఆ విషయాన్ని రమణ తల్లికి తెలియజేశాడు. సంవత్సరం రోజులు రమణకు దూరంగా వుండేటందుకు ఆమె సంశయించినా... ఆనంద్ ఆమెకు నచ్చచెప్పాడు.... "వాడి స్థానంలో నీతో నేవుండి నిన్ను బాగాచూచుకొంటాను పెద్దమ్మా!" ఎంతో ప్రీతిగా ఆనంద్ చెప్పిన యీ మాటలు సునందను... అమెరికాకు రమణను పంపేదానికి అంగీకరించేలా చేశాయి.
రమణ తల్లి ఆశీర్వాదంతో.... స్నేహితుడు ఆనంద్ అభిమానంతో... అమెరికాకు వెళ్ళిపోయాడు. ఆనంద్ సునందకు అన్ని అమర్చి ఆఫీస్‍కు వెళ్ళి డ్యూటీ ముగించి యింటికి చేరి ఆమెను కన్నతల్లిలా చూచుకొనేవాడు.
వుద్యోగంలో చేరిన మొదటి నెల జీతం నుంచి... ఆ యిరువురూ పది పది, ఇరవై వేలను లక్ష్మీ దేవి పేర ఆమెకు పంపేవారు. రమణ బెంగుళూరులో లేకున్నా ఆ వుభయులూ తీసుకొన్న నిర్ణయం ప్రకారం ఆనంద్ డబ్బును లక్ష్మీదేవికి పంపించేవాడు.
రంజనీ.... బి.ఎస్సీ ఫస్టు ర్యాంకులో పాసయ్యింది. జిల్లానగరంలో ఉద్యోగంలో చేరింది. యిరవైవేలు నెల జీతం. యికపై డబ్బు పంపవద్దని తనకు ఉద్యోగం దొరికిందని ఆనంద్‍కు రంజనీ ఫోనులో చెప్పింది.
"అది రమణ నిర్ణయం. దాన్ని అమలు పరచడం నా కర్తవ్యం అని జవాబు చెప్పాడు. రమణ రెండు ఎం.బి నెంబర్లు కూడా యిచ్చాడు రంజనీకి ఆనంద్.
రమణ తరుచుగా ఫోన్ చేసి... తల్లి యోగక్షేమాలను లక్ష్మీదేవికి డబ్బు పంపే విషయాన్ని గురించి.... ఆనంద్, తన తల్లితో మాట్లాడేవాడు.
సంవత్సరకాలం ఎంతో ప్రశాంతంగా రమణ జీవితం అమెరికాలో గడచిపోయింది. ట్రైనింగ్ పూర్తయింది. ఇండియాకు తిరిగి వచ్చాడు. తల్లి ఆనంద్‍లు అతన్ని ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకొన్నారు. ఎంతో ఆప్యాయంగా తనయుని చుట్టుకొని ఆ తల్లి మురిసిపోయింది.
ఆఫీసులో రమణ హోదా, జీతం పెరిగాయి. ఎకోస్పోర్టు కారును కొన్నాడు. తల్లిని ఎక్కించుకొని మిత్రునితో కలిసి ఆమెకు ఆ విశాల నగరాన్నంతా చూపించాడు. ఎంతో ఆశ్చర్యంగా అన్నింటినీ చూచి ఆ తల్లి ఆనందించింది.
సమయం రాత్రి ఎనిమిది గంటలు. తాజ్ హోటల్ ముందు కారును పార్కు చేసి తల్లి చేతిని పట్టుకొని లోనికి ప్రవేశించారు రమణ, ఆనందులు.
ఎంతో సుందరంగా... దేవలోకాన్ని మైమరపించే ఆ హోటల్ పరిసరాలను చూచిన సునందకు పరమానందం. ముగ్గురూ టేబుల్ ముందు కూర్చున్నారు.
వెయిటర్ వచ్చి ఆర్డర్‍ను నోట్ చేసుకొని వెళ్ళిపోయింది. ద్వారం వైపున చూస్తున్న రమణ... కూర్చొని వున్నవాడు ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు.
"ఏమిట్రా లేచావ్?" అడిగాడు ఆనంద్.
"అలా చూడు" ద్వారం వైపుకు వ్రేలిని చూపించాడు రమణ. వెనుదిరిగి ఆనంద్ ద్వారం వైపు చూచాడు.
"ఎవరు నాన్నా!" అడిగింది సునంద.
"మా దేవుడమ్మా!... మాకు యీ జీవితాన్ని ప్రసాదించిన మా ప్రిన్సిపాల్ గారు" ఎంతో ఆనందంగా చెప్పాడు రమణ.
ఆనంద్, రమణలు ద్వారం వైపుకు నడిచారు. ప్రిన్సిపాల్ గారిని సమీపించారు. సవినయంగా చేతులు జోడించారు.
ప్రిన్సిపాల్ ధర్మారావు గారు అక్కడ.... ఆ యిరువురినీ చూచి ఆశ్చర్యపోయాడు. వారి కళ్ళల్లో ఎంతో ఆనందం.
"రమణా!.... ఆనంద్!...." ప్రీతిగా పలకరించాడు.
"అవును సార్ మీ రమణ...."
"మీ ఆనంద్ సార్..."
నవ్వుతూ చెప్పారు యిరువురూ.
ధర్మారావు ప్రక్కన వున్న యిరవై సంవత్సరాల పాలరాతి బొమ్మ వీరిని చూస్తూ నవ్వుతూ నిలబడి వుంది.
క్షణంసేపు ఆమెను చూచి, తనవైపుకు దృష్టిని మళ్ళించిన వారిని చూచి ధర్మారావు...
"నా కూతురు సుధ" నవ్వుతూ చెప్పాడు.
"హలో..." అన్నారు యిరువురూ ఒకేసారి.
ఆమె నవ్వుతూ తల వూపింది.
"రండి సార్. మా అమ్మగారు వచ్చి వున్నారు. పరిచయం చేస్తాను" అన్నాడు రమణ.
నలుగురూ సునంద వున్న టేబుల్‍ను సమీపించారు. కొత్తవారిని చూచి సునంద లేచి నిలబడింది.
"మీరు కూర్చోండమ్మా!... వీళ్ళిద్దరూ నా శిష్యులు" చిరునవ్వుతో చెప్పాడు ధర్మారావు.
"అమ్మా!.... వీరు మా ప్రిన్సిపాల్ గారు. మా యిరువురికీ యింజనీరింగ్ కాలేజీలో సీట్లు ఇప్పించింది వీరే" రమణ చెప్పాడు.
"కూర్చోండి సార్. మేడం కూర్చోండి" నవ్వుతూ అన్నాడు ఆనంద్.
వారు వుభయులూ కూర్చున్న తర్వాత....
"సార్ మేము ఆర్డర్ యిచ్చేశాము. మీరేం తీసుకొంటారో చెప్పండి" అడిగాడు రమణ.
ధర్మారావు తనకు, కుమార్తెకు కావలసింది చెప్పాడు. ఆనంద్ వెళ్ళి బేరర్‍ను కలసి... వారు చెప్పినవి అతనికి చెప్పి తిరిగి వచ్చాడు. కూర్చున్నాడు.
"మిమ్మల్ని ఇక్కడ కలవడం మా యిరువురికీ చాలా ఆనందంగా వుంది సార్" అన్నాడు రమణ.
"నాకూ అలాగే వుంది రమణ" అన్నాడు ధర్మారావు నవ్వుతూ.
"యీ అమ్మాయి ఎవరండి?" అడిగింది సునంద.
"మా అమ్మాయి పేరు సుధ" ధర్మారావుగారి ప్రత్యుత్తరం.

బేరర్ సూప్ తెచ్చి టేబుల్‍పై వుంచి వెళ్ళాడు. సూప్ త్రాగుతూ ఆనంద్.... "సార్! మీ అమ్మాయిగారు ఏం చేస్తున్నారు?" అడిగాడు.
"డమ్ అండ్ డఫ్ స్కూల్లో చదివి ప్రైవేటుగా కట్టిగ్ బి.ఎ పాసయ్యింది. చాలా తెలివైన పిల్ల. కానీ తను మాట్లాడలేదు. పుట్టుకతోనే మూగ" ధర్మారావు గారి చివరి మాటల్లో వారి హృదయ ఆవేదన ఆ ముగ్గురికీ వ్యక్తం అయింది.
క్షణంసేపు వారి ముఖంలోకి చూచి.... దృష్టిని సుధవైపు మరలించి క్షణకాలం తర్వాత.... విచారంగా ముగ్గురూ తలదించుకొన్నారు. వారి హృదయాల్లో సుధ పట్ల ఎంతో సానుభూతి.
సుధ వారిని చూచి, తండ్రిని చూచి.... మౌనంగా తలదించుకొంది.
వారి మధ్యన ఎంతో ఆనందంగా వున్న వాతావరణం... విచారంగా సుధ స్థితిని విన్న కారణంగా మారిపోయింది. కొన్ని నిముషాలు వారి మధ్య మౌనంగా సాగిపోయాయి.
"సార్!.... సుధ గారిని ఎం.ఎ చదివించండి. వారికి మంచి భవిష్యత్తు వుంటుంది." ఆ వాతావరణాన్ని మార్చాలనే వుద్దేశ్యంతో నవ్వుతూ చెప్పాడు ఆనంద్.
సుధ తలెత్తి అతని ముఖంలోకి చూచింది.
ఆనంద్ వదనంలో మాటల్లో ఆమెకు ఎంతో అభిమానం గోచరించింది.
"అవును సార్!... ఆనంద్ ఎప్పుడూ అతిగా మాట్లాడడు. ఏదైనా సమస్య విషయంలో సుదీర్ఘంగా ఆలోచించి నాకు సలహా యిస్తాడు. నా మాట నమ్మండి సార్!.... వాడు చెప్పినట్లు జరుగుతుంది" నవ్వుతూ చెప్పాడు రమణ.
"అలాగా!...." ఆశ్చర్యంతో అడిగాడు ధర్మారావు.
"అవును సార్. నేను చెప్పింది నా స్వానుభవం" నవ్వాడు రమణ.
"సార్!... రమణ నన్ను గురించి ఎప్పుడూ యిలాగే మాట్లాడుతాడు. యథార్థం చెప్పాలంటే నా గురించి ఎదుటి వారికి ఏదైనా మంచి తోచిందీ అంటే.... దానికి కారణం వీడే సార్. సారీ!.... వీడు అన్నాడు. తప్పైపోయింది. అన్నయ్య అనాలి. వీరు నాకంటే మూడునెలలు పెద్ద" నవ్వుతూ చెప్పాడు ఆనంద్.
అతని మాటలకు అందరికీ నవ్వు వచ్చింది. ఆనందంగా నవ్వుకొన్నారు.
సునంద... తన ప్రక్కనే కూర్చొని వున్న సుధ ఎడం చేతిని తన చేతిలోనికి తీసుకొంది. కొద్ది నిముషాలు పరీక్షగా చూచింది. ఆమె వదనంలో ఎంతో తృప్తి.
"అమ్మా మీకు హస్త సాముద్రికం తెలుసా!" అడిగాడు ధర్మారావుగారు.
"తెలుసు సార్!... కానీ అందరి చేతులనూ చూడదు. ఆ రీతిగా ఆమె తన పేరును అందరూ తలచుకోవడం, తన దగ్గరకు వచ్చి చేతిని చూచి మంచిమాట చెప్పమ్మా అని తనను అడగడం, అమ్మకు యిష్టం లేదు. పైగా నాన్నగారు వుభయభాషా ప్రవీణులు, పంచాంగ రచయిత. ఆ కారణంగా.. అమ్మ ’సూర్యుడు ముందు నేను దివిటీనిరా’ అంటూ నవ్వుతుంది" తల్లిని చూస్తూ నవ్వాడు రమణ.
"సార్!... యీ రోజు మా పెద్దమ్మ తానుగా సుధ గారి చేతిని తన చేతిలోకి తీసుకుందంటే, సుధగారు నిజంగా లక్కీ సార్" నవ్వుతూ సుధ ముఖంలోకి చూచాడు ఆనంద్.
సుధ క్షణంసేపు ఆనంద్ ముఖంలోకి చూచి.... సునంద తనను గురించి ఏం చెబుతుందా అని, ఆమె ముఖంలోకి చూచింది. వారిరువురి చూపులు కలిశాయి.
సునంద సుధ చేతిని వదలిపెట్టింది.... నవ్వుతూ.....
"ప్రిన్సిపాల్‍గారూ!.... మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎం.ఎ ని మంచి మార్కులతో పాసవుతుంది. సంవత్సరం లోపల ఆమెను ఎంతగానో ప్రేమించిన యువకునితో వివాహం జరుగుతుంది. ముగ్గురు వంశోద్ధారకులైన బిడ్డలకు తల్లి అవుతుంది. యిద్దరు మొగపిల్లలు. ఒక పాప. నిండుగా నూరేళ్ళు పండంటి కాపురంతో చల్లగా ఏ చీకూ చింతా లేకుండా జీవిస్తుంది."
ఒకవిధమైన భావావేశంతో చెప్పిన సునంద ఆపింది.
ధర్మారావు, సుధ, రమణ, ఆనంద్‍లు ఒకరి ముఖాలను ఒకరు చూచుకొన్నారు. వారి వదనాల్లో ఎంతో ఆనందం.
తననే పరీక్షగా చూస్తున్న రమణను క్షణంసేపు చూచి... నవ్వుతూ తలదించుకొంది సుధ.
"అమ్మా!.... మీరు చెప్పినట్లే జరిగితే... నా జీవితాంతం మీరు నా ఇలవేల్పుగా నా హృదయ మందిరంలో నిలిచిపోతారు" పరవశంతో చెప్పాడు ధర్మారావు.
"తప్పక జరుగుతుంది. అంతేకాదు ఒక సంస్థకు అధినేతగా జీవితాంతం శ్రమించి, గొప్ప పేరు ప్రఖ్యాతులను గడిస్తుంది యీ మీ... మన సుధ" నవ్వుతూ సుధ ముఖంలోకి చూస్తూ దేవతలా పలికింది సునంద.
ఆర్డర్ యిచ్చిన వాటినన్నింటినీ తెచ్చి టేబుల్ మీద వుంచాడు బేరర్.
అందరూ ఆనందంగా భోం చేశారు. ఆనంద్ బిల్లు పే చేశాడు. ఆనంద్.... రమణలకు సుధ ఎంతగానో నచ్చింది.
ఆ హాలునుండి అందరూ కారు పార్కింగ్ స్థలానికి వచ్చారు.
"సార్!.... మీరు ఎక్కడికి వెళ్ళాలి" అడిగాడు రమణ.
"మీతో చెప్పలేదు. యీ వూర్లో మా చిన్న అబ్బాయి రవి వున్నాడు. వాడు రైల్వేలో యింజనీర్. పెద్దవాడు రంగా. స్టేట్స్ లో సాఫ్ట్ వేర్ యింజనీర్‍గా వున్నాడు. వాడికి యిద్దరు కొడుకులు. పదేళ్ళలోపు వాళ్ళు. రవికి ఒక కూతురు ఐదేళ్ళు. రిటైర్ అయిన తర్వాత ఆరునెలల క్రిందట ఇక్కడికి వచ్చేశాను. అదిగో నా కారు. మీరంతా మా యింటికి ఒకసారి రావాలి." ఆహ్వానించాడు ధర్మారావు.
వారు సరే అన్నారు... ఎవరు కార్లలో వారు ఎక్కి యిండ్లవైపుకు బయలుదేరారు.
============================================================
ఇంకా వుంది..
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments