డబ్బులు దొరుకుతాయా!
- Sairam Allu

- 5 hours ago
- 3 min read
#AlluSairam, #అల్లుసాయిరాం, #DabbuluDorukuthaya, #డబ్బులుదొరుకుతాయా, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Dabbulu Dorukuthaya - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 16/12/2025
డబ్బులు దొరుకుతాయా! - తెలుగు కథ
రచన: అల్లు సాయిరాం
సాయంత్రం స్కూల్ బెల్ మోగింది. పిల్లల్ని తీసుకునివెళ్లడానికి వచ్చిన పేరెంట్స్ బైకులతో, స్కూటీలతో, కారుల్లో వచ్చి స్కూల్ గేట్లు ముందు ఎదురుచూస్తున్నారు. బెల్ శబ్దం వినగానే, ఉదయం నుంచి క్లాసులు విని విని అలిసిపోయిన పిల్లలు వెంటనే బుక్స్ బ్యాగుల్లో సర్దేసి, భుజానికి తగిలించుకుని, ఫ్రెండ్స్ కి బాయ్ అని చెప్తూ వస్తున్నారు.
గేటు దగ్గర ప్రకాష్ ని చూసి “డాడీ!” అని సాత్విక్ పరుగెత్తుకుంటూ వచ్చి, స్కూటీ ఎక్కేసరికి, సాత్విక్ బ్యాగులో ఉన్న చాక్లెట్స్ కింద పడ్డాయి.
ప్రకాష్ ఆశ్చర్యంగా “సాత్విక్! ఇన్ని చాక్లెట్సా! ఎవరిచ్చారు?” అని అడిగితే, “సీక్రెట్!” అని చెవిలో మెల్లగా చెప్పాడు సాత్విక్.
“ఓఁ సీక్రెటా! అయితే ఓకే!” అని అన్నాడు ప్రకాష్.
సాత్విక్ చిన్నగా బుంగమూతి పెట్టి “అడగాలి కదా డాడీ!” అని అంటే, “సీక్రెట్ అన్నావు కదా. అందుకే అడగలేదు!” అని అన్నాడు ప్రకాష్.
“అంటే నువ్వు అడిగితే, నేను చెప్తాను డాడీ!” అని సాత్విక్ అంటే, ప్రకాష్ నవ్వుతూ “ఓహో! ఇది ఆ రకమైన సీక్రెటా! సరే. ఆ సీక్రెట్ ఏంటి చెప్పు. చెప్పు!” అని అడిగాడు.
సాత్విక్ బ్యాగ్ సర్దుకుంటూ “డాడీ, మా ఫ్రెండ్ రేవంత్‌కి ఎప్పుడూ డబ్బులు దొరుకుతాయట. కానీ నాకు ఎందుకు దొరకవు?” అని అడిగితే, ప్రకాష్ ఆశ్చర్యంగా “డబ్బులు దొరకడమేంటి సాత్విక్?” అని నవ్వుతున్నాడు.
“అవును డాడీ! రేవంత్ చెబుతాడు. తనకి రోజూ డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బుతో నాకు చాక్లెట్లు యిస్తాడు” అని చెప్తుంటే, ప్రకాష్ ఆలోచిస్తూ “సాత్విక్! ఆలోచించు. రోజూ ఒకరికి డబ్బులు దొరకాలంటే, ఇంకొకరి దగ్గర నుంచి పోవాలి. మీ సైన్స్ పాఠాల్లో చెప్తారు కదా. శక్తి ఒక రూపంలో నుంచి యింకో రూపంలోకి మారుతుందని. డబ్బు కుడా అంతే!” అని అంటే, సాత్విక్ ఆశ్చర్యపోతూ “అవునా డాడీ! రేవంత్ రోజూ డబ్బులు దొరుకుతాయని చెప్తాడు. ఎలా మరి?” అని అడిగాడు.
ప్రకాష్ సాత్విక్ వైపు చూస్తూ “సింపుల్ సాత్విక్! రేవంత్ నీతో అబద్దం అయినా చెప్తుండాలి. రోజూ డబ్బులు దొంగతనం అయినా చేస్తుండాలి. ఇవి కాకుండా వేరే చాన్స్ లేదు!” అని చెప్తున్నప్పుడే, రేవంత్ తన పేరెంట్స్ వైపు నడుస్తూ “హాయ్ అంకుల్!” అని ప్రకాష్ కి చెప్తూ వెళ్తుంటే, వెంటనే ప్రకాష్ “రేవంత్! ఒక నిమిషం. రా!” అని పిలిచాడు.
సాత్విక్ కంగారుగా “డాడీ! తనని అడగొద్దు. నాకు మరి చాక్లెట్స్ యివ్వడు!” అని ప్రకాష్ షర్ట్ లాగుతూ మెల్లగా చెప్తున్నాడు. రేవంత్ దగ్గరికొచ్చి “చెప్పండి అంకుల్!” అని అంటే, ప్రకాష్ సూటిగా “ఏం రేవంత్! నీకు రోజూ డబ్బులు దొరుకుతున్నాయా! డబ్బులు లేక జనాలు, ప్రభుత్వాలు యిబ్బంది పడుతున్నాయి. డబ్బులు ఎక్కడ దొరుకుతున్నాయో, కాస్త ఆ సీక్రెట్ ఏదో అందరికి చెప్తే, ఈ బాధలు ఉండవు!” అని అడిగేసరికి, స్కూల్ దగ్గరున్న పిల్లలు, పేరెంట్స్ అందరి ముందు రేవంత్ తలదించుకుని సాత్విక్ వైపు చూస్తుంటే, సాత్విక్ చూడలేకపోయాడు.
ప్రకాష్ ప్రశాంతంగా “రేవంత్! ఏమైంది నీకు? సాత్విక్ నీగురించి ఎంతో బాగా చెప్తుంటాడు. కానీ, యి విషయం చెప్పేసరికి, నువ్వు తప్పుడు దారిలో పడ్డావేమోనని కోపంతో అడిగాను. నువ్వు చెప్పకపోతే, నువ్వు తప్పు ఒప్పుకున్నట్లే. నేను మీ పేరెంట్స్ కి చెప్పేస్తాను!” అని అన్నాడు.
రేవంత్ చూట్టూ చూస్తూ “అంకుల్!” అని చెప్పబోతుంటే, “అవునండీ! డబ్బులు దొరుకుతాయి!” అని అంటూ రేవంత్ దగ్గరికి వచ్చాడు అశోక్.
“డాడీ!” అని రేవంత్ అశోక్ ని హగ్ చేసుకున్నాడు.
అందరూ పిల్లల్ని స్కూటీలపై, కారులో ఎక్కించుకుని వెళ్లకుండా, ఆసక్తిగా చూస్తున్నారు.
“అశోక్ గారు! రేవంత్ డబ్బులు.. ” అని ప్రకాష్ చెప్తుంటే, “అంతా తెలుసు ప్రకాష్ గారు! మేం చెప్తేనే, రేవంత్ చేశాడు. డబ్బు కోసం కాదు. ఇది స్వచ్చభారత్, పరిసరాల పర్యావరణ అవగాహన కోసం!” అని అంటే, ప్రకాష్ ఆశ్చర్యపోతూ “డబ్బులు దొరకడానికి, పర్యావరణ అవగాహనకి సంబంధం ఏముంది?” అని అడిగాడు.
రేవంత్ భుజం మీద అశోక్ చెయ్యి వేసి “మేం మా రేవంత్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మనం మొత్తం చెత్తని శుభ్రం చెయ్యలేం కానీ, రేవంత్ తను చెత్త క్రియేట్ చెయ్యకుండా, సాధ్యమైనంతవరకు ఉండడానికి, రోజూ స్కూల్లో, యింట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచినందుకు మేమే తనని ఎంకరేజ్ చేస్తూ డబ్బులు యిస్తున్నాం. ఆ డబ్బులు మాయింట్లోనే దొరుకుతున్నాయి!” అని నవ్వుతూ అన్నాడు.
ప్రకాష్ ఆలోచిస్తూ “పర్యావరణ అవగాహన అంటే మంచి విషయమే కానీ, దానికోసం తనకి డబ్బులు యిస్తే, తనకి డబ్బులు విలువ తెలియకుండాపోతుంది కదా. ప్రతి పనికి లంచంలా ఆశించే అవకాశం ఉంటే, మనమే పిల్లల్ని పాడుచేసుకుంటామా?” అని అడిగాడు.
అశోక్ తలవూపుతూ “మీరు చెప్పింది పాయింటే. కానీ, పర్యావరణ పరిరక్షణ అవగాహన పెరుగుతున్న కొద్దీ, పెద్దల్ని గౌరవించడం, తమ దగ్గరున్నది స్నేహితులకి పంచడం లాంటి నైతికవిలువలు కుడా పెరుగుతున్నాయి!” అని అంటే,
నిజం తెలుసుకున్న సాత్విక్ “నిజమే డాడీ! రేవంత్ తన డబ్బులతో మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్లు కొనిపెడతాడు!” అని అంటే,
రేవంత్ నవ్వుతూ “ఆ డబ్బుతో మీకు చాక్లెట్లు ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. అయినా, నిజమైన డబ్బు నేల మీద దొరకదు. మనమే కష్టపడి సంపాదించాలి కదా?” అని అంటే,
సాత్విక్ తలవూపుతూ “నేను కూడా నీలాగే నావంతుగా, యింట్లో మావంతుగా పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తాం. అప్పుడు నాకు కుడా డబ్బులు దొరుకుతాయి కదా డాడీ!” అని అడిగితే,
అశోక్ చెప్పిన మాటలు ఆలోచనలో ఉన్న ప్రకాష్ “కచ్చితంగా. ఆలోచన మంచిదైనప్పుడు, ఆచరించడానికి యిబ్బంది ఏముంది! నువ్వు, రేవంత్, యింకా మీ ఫ్రెండ్స్!” అని అంటూ చూట్టూ చూస్తే “ఆలోచన మంచిదైనప్పుడు ఆచరించడానికి యిబ్బంది ఏముంది! మేం చేస్తాం!” అని పేరెంట్స్, పిల్లలు అందరూ నవ్వుతూ అన్నారు.
ప్రకాష్ గర్వంగా “అశోక్ గారు! మీరు చాలా మంచి పనిని ప్రారంభించారు. ఈ చిన్నారులే మన భవిష్యత్తు! ఇటువంటి పనుల వల్ల పిల్లలకి నైతిక విలువలు తెలిసి వారి భవిష్యత్తు బాగుంటుంది!” అని అంటే, “మొత్తానికి మావాడి డబ్బులు యింత పెద్ద పని చేశాయన్నమాట! రేపటి నుంచి అందరికి డబ్బులు దొరుకుతాయి. జాగ్రత్త!” అని అశోక్ అంటే, అందరూ నవ్వుతూ, అక్కడ నుంచి బయలుదేరారు.
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.




Comments