top of page
Original.png

వారసుడొచ్చాడు

#Varasudochhadu, #వారసుడొచ్చాడు, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Varasudochhadu - New Telugu Story Written By Mayukha Published In manatelugukathalu.com On 16/12/2025

వారసుడొచ్చాడు - తెలుగు కథ

రచన: మయూఖ


ఒకరోజు పావని అత్తగారి, తోటి కోడలి ఆరళ్ళు తట్టుకోలేక భర్త వంశీ తో చెప్పింది. "ఏవండీ! నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోరు, నేను భరించలేక పోతున్నాను, ప్రతి దానికి ఏదో వంక పెట్టి ఇద్దరూ నన్ను అంటున్నారు. పనిమనిషి రాకపోతే పని అంతా నేనే చేస్తాను. అటువంటిది పనిమనిషితో "మీ అమ్మగారు ‘లక్ష్మమ్మ! పనికి మానకుండా రా! నేను పెద్దదాన్ని. అది చిన్న పిల్ల తల్లి. మేం చెయ్యలేం." అంటున్నారు.. నేను ఏ పని చేయనట్టు, దాని ఎదురుగుండా అలా అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి.


మొన్నటికి మొన్న పాపాయి పడిపోతే నేను నేను లేవదీయబోయాను.


’వద్దు, నువ్వు దాన్ని ముట్టుకోకు’ అంటూ గట్టిగా అరిచింది సుధ. 


పిల్లలు లేనంత మాత్రాన నేను పట్టుకోకూడదా! నాకు మానవత్వం లేదా! నిన్న అది జారి పడింది. నేను ఊరుకున్నాను. లేవ తీయలేదు. 


దాంతో సుధ, మీ అమ్మగారు.. ఇద్దరూ కలిపి ‘పిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ ఏం తెలుస్తుందిలే’ అంటున్నారు. 


నేను ఏం చేసినా, తప్పు పడుతున్నారు. నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. మీరు వాళ్లకి గట్టిగా చెప్పండి." అంది ఏడుస్తూ పావని భర్త వంశీతో.


కానీ ఎప్పటిలాగే మౌనం వహించి, "మనకి పిల్లలు పుడితే అన్నీ సర్దుకుంటాయిలే!” అన్నాడు తేలిగ్గా.


"ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు పిల్లలు పుట్టరు. మనశ్శాంతే లేనప్పుడు ఇంక కాపురం ఏంటి?" అంటూ అటు తిరిగి పడుకుంది పావని.

*****

రాజారావు, పార్వతి దంపతులకు వంశీ, రామ్ ఇద్దరు పిల్లలు. వంశీ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకుని వ్యవసాయం అంటే ఇష్టం ఉండడంతో ఉద్యోగం జోలికి వెళ్లక తండ్రి సంపాదించిన రెండు ఎకరాల్ని నాలుగు ఎకరాలు చేశాడు. వ్యవసాయాధికారిని పల్లెటూరికి రప్పించి ఆయన సలహాతో వ్యవసాయాన్ని మంచి సాగు బాట పట్టించాడు.


రామ్ బీఎస్సీ బిఈడి చేసి ఇదే ఊరి స్కూల్లో టీచర్గా పని చేస్తున్నాడు. పావనికి వంశీకి పెళ్లి అయ్యి 7 ఏళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. వంశీ తమ్ముడు రామ్ కి పెళ్లి అయిన వెంటనే అతని భార్య సుధ నెల తప్పడంతో నాలుగేళ్ల కూతురు ఉంది. సుధ పార్వతికి మేనకోడలు. అందుకే సుధ ఆడిందే ఆట పాడిందే పాట. దానికి తగ్గట్టు పెళ్లయిన వెంటనే నెల తప్పడం, పావని కి పిల్లలు లేకపోవడంతో సుధకి అహంకారం ఎక్కువైంది.


సుధ మాటకే వత్తాసు పలుకుతుంది పార్వతి. పావని, అత్తగారు తోటి కోడలు అంటున్న మాటలు వంశీ తో చెప్పినా ఏవీ మాట్లాడడు. ఎందుకంటే పావనికి సపోర్ట్ ఇస్తే ఎక్కడ వేరు కాపురం పెట్టమంటుందోనని భయం.


ఒకరోజు పొలం నుంచి వేళకానివేళ ఇంటికి వచ్చాడు వంశీ. పార్వతమ్మ, సుధ పావని ని సూటి పోటీ మాటలతో గుచ్చుతున్నారు. పావని ఏడుస్తూ అన్నం కంచం నుంచి లేచి వెళ్ళిపోయింది.


"విడ్డూరం కాకపోతే ఇప్పుడు ఏం అన్నావని అలా వెళ్ళిపోతోంది. పిల్లలు ఉన్నవాళ్లు నెయ్యి వేసుకుంటారు. నువ్వు ఎందుకు వేసుకున్నావ్?" అన్నాను. అది తప్పా!" అంటోంది పార్వతమ్మ.


"అవునత్తయ్య! దేనికైనా పెట్టి పుట్టాలి" సన్నాయి నొక్కులు నొక్కుతోంది సుధ.


ఈ మాటలు విన్న వంశీ భరించలేకపోయాడు. "ఇంటెడు చాకిరీ చేస్తూ, కడుపునిండా తినడానికి లేకుండా మాటలతో గుచ్చుతున్నారు. తను చెబుతున్నా, నేనే పెడచెవిని పెట్టాను" అనుకుంటూ,


"అమ్మా! అన్నాడు గట్టిగా. 


వేళ కాని వేళ లో వచ్చిన కొడుకుని చూసి బిత్తర పోయింది. అయినా ఏమీ ఎరగనట్టు "ఎందుకురా! ఇప్పుడు ఏమైందని అలా అరుస్తావ్!" అంది బింకంగా.


"ఛీ! మీరు మనుషులేనా! అన్నం తింటున్న దాన్ని లేవగొడతారా! దాన్ని అన్ని మాటలంటారా! నేను వ్యవసాయం చేసి సంపాదిస్తుంటే దాన్ని కడుపునిండా తిననివ్వరా"! అన్నాడు కోపంగా. పార్వతమ్మ, సుధ కిక్కురమనలేదు.


పావని కి పిల్లలు అంటే ఇష్టం. పాపాయిని ఒక్కసారి కూడా పావని దగ్గరకు రానివ్వట్లేదు సుధ. పావని, వంశీ పిల్లల కోసం టౌన్ కి వెళ్లి డాక్టర్ కు చూపించుకుంటే "మీరు ఇక్కడ కాదు. సిటీకి వెళ్లి చూపించుకోండి. అక్కడ అయితే ఎక్విప్మెంట్, స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లు ఉంటారు" అంది లేడీ డాక్టర్.


ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలనుకుంటున్నాడు వంశీ. కాలం భారంగా తిరుగుతోంది. చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.


ఒకరోజు వంశీ స్వీట్ ప్యాకెట్ తీసుకుని సంతోషంగా వచ్చాడు. "అమ్మా! అందరూ వినండి. నాకు ఉద్యోగం వచ్చింది. గ్రూప్స్ లో సెలెక్ట్ అయ్యాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జాబు వచ్చింది. హైదరాబాద్ వెళ్ళాలి" అన్నాడు.

అందరూ ఆశ్చర్యపోయారు. పావని మొహం సంతోషంతో వెలిగిపోతే, పార్వతమ్మ, సుధల మొహం మాడిపోయింది.


ఎప్పుడు పరీక్షకి కట్టావు? పొలం ఎవరు చూస్తారు? ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.


"అమ్మా! నేను పొలం ఏమి వదిలేయలేదు. మన పాలేరు రంగయ్యకే కౌలుకి ఇచ్చాను. మధ్య మధ్యలో నాన్న, తమ్ముడు చూసుకుంటారు. తమ్ముడికి కూడా పొలం విషయాలు తెలియాలి కదా!. నాకు రాజేందర్ నగర్ వ్యవసాయ యూనివర్సిటీ లో పోస్టింగ్ వచ్చింది. నేను ఒక వారంలో వెళ్లి జాయిన్ అవ్వాలి. ఇక నా చదువంటావా! ప్రశాంతంగా ఉంటుందని పొలానికి వెళ్లి అక్కడ చదువుకునే వాడిని. అదృష్టవశాత్తు నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది" అన్నాడు సంతోషంగా వంశీ.


వంశి హైదరాబాద్ వెళ్లి, జాబ్లో జాయిన్ అవ్వడం, ఇల్లు తీసుకుని,పావని ని తీసుకువెళ్లడం చకాచకా జరిగిపోయాయి.


పంజరం నుంచి తప్పించుకున్న చిలుకలా స్వేచ్ఛగా ఉంది పావని కి. ఇన్నాళ్ళకి తనకి ఇల్లు అనేది ఏర్పడింది అని సంతోషంగా ఉంది.


మంచి రోజు చూసుకుని వంశీ, పావని వైద్యం కోసం "మమతా దీన్ దయాల్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ కి" వెళ్లారు. ఆ డాక్టరు చేతి చలవ చాలా మంచిదని తెలుసుకుని, డాక్టర్ని కలిశారు. డాక్టర్ పరీక్షించి తప్పక పిల్లలు పుడతారని ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఐదు నెలలకే పావని నెల తప్పింది. భార్యాభర్తల సంతోషానికి అవధులు లేవు.


"తను తండ్రి కాబోతున్నాడు. నాన్న అని పిలిపించుకునే ఆ పిలుపే ఎంత మధురంగా ఉంది" అనుకున్నాడు వంశీ.


పావని అంది "మీ అమ్మగారు పాపాయిని మన రెండు ఇళ్ళకి అదే వారసురాలు అనేవారు. ఇప్పుడు చూడండి అసలైన వారసుడు వస్తున్నాడు" అంది సంతోషంగా.


డాక్టరు బెడ్ రెస్ట్ అనడంతో పావని ఎక్కడికి వెళ్ళకుండా తన తల్లిదండ్రులనే ఇక్కడికి రప్పించుకుంది. ఈ తొమ్మిది నెలలు వంశీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. పండంటి కొడుకు పుట్టాడు పావని కి. కొడుకు ముద్దు మురిపాలతో కాలం తెలియట్లేదు వంశీ, పావనికి.


ఐదో నెల వచ్చిన తర్వాత సారె తీసుకుని అత్తారింటికి బయలుదేరింది పావని. పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయారు.


"ఏ ఆశ్రమం నుంచి తీసుకువచ్చావ్"? అంది పార్వతమ్మ కోపంగా.


వెంటనే వంశీ కలగజేసుకుని "ఆశ్రమం నుంచి తెచ్చుకోవలసిన కర్మ నాకేంటి? నా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు. చూడు నాన్నగారి పోలికలు ఎలా కనిపిస్తున్నాయో" అన్నాడు ఉద్వేగంగా.


తన కూతురికి ఆస్తిలో వాటా రాదని అక్కస్సుతో "ఏమో ఎక్కడి నుంచి తెచ్చారో ఎవరికి తెలుసు? ఇదేం సత్రం కాదు. అనాధలందరినీ తీసుకురావడానికి. అంతగా మీరు రుజువు చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే సరి. ఎవరో అనాధకి ఈ ఆస్తి అంతా ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటాం"? అంది కోపంగా సుధ.


ఇదంతా వింటున్న రాజారావు ఇక తాను కలగజేసుకోపోతే లాభం లేదని "నోరు మూసుకోండి ఇద్దరు! ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ వ్యవహారాన్ని ముందు నుంచి గమనిస్తున్నాను. ఆ అమ్మాయి పిల్లలు లేక బాధపడుతుంటే మనం చేతనైంది చేయవలసింది పోయి, మానసికంగా హింసిస్తారా! మీరు ఆడవాళ్లేనా! "


"అందుకే నేను వంశీని, పావని ని ఇక్కడ నుంచి పంపించడానికే పరీక్షకి కట్టమన్నాను. మన ఊరి కరణం గారి కోడలు హైదరాబాదులో పెద్ద డాక్టర్ అని తెలిసి అక్కడికి నేనే వెళ్ళమన్నాను. వంశీ నాకు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు చెబుతున్నాడు. బాబు పుట్టిన విషయం చెప్పాడు. అమ్మకి చెప్పమన్నా నేనే వద్దన్నాను. మీరు ఏడుస్తారని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచిగా చూడండి ఆ అమ్మాయిని.


నా ఇంటికి అసలైన వారసుడిని తీసుకొచ్చింది. మీలాంటి వాళ్లు ఉండబట్టే ఉమ్మడి కుటుంబాలు అనేవి పోతున్నాయి. అత్త అనే పాత్ర తక్కెడలో మూలాధారం లాంటిది. రెండు బరువుల్ని సమానంగా చూడాలి. ఎప్పుడూ ఒకళ్ళనే సపోర్ట్ చేయకూడదు. ఇన్నాళ్లు ఈ కుటుంబం వీధిన పడుతుందని నేను నోరు మూసుకున్నాను. మీ ఆగడాలకి అంతులేకుండా పోతోంది. ఈరోజు నుంచి మీరిద్దరూ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త" అన్నాడు కోపంగా రాజారావు. 


రాజారావులో అంత కోపాన్ని ఎప్పుడూ చూడని పార్వతమ్మ, సుధ కుక్కిన పేనులా నోరు మూసుకున్నారు. పావని మనసు తేలికైంది. బాబు కిలకిల నవ్వాడు.



******శుభం *******


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page