చార్ ధాం యాత్ర - పార్ట్ 3
- Pulletikurthi Nagesh

- 1 day ago
- 6 min read
#CharDhamYathra, #చార్ధాంయాత్ర, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Char Dham Yathra - Part 3 - New Telugu Story Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 25/11/2025
చార్ ధాం యాత్ర - పార్ట్ 3 - తెలుగు కథ
రచన: పుల్లేటికుర్తి నగేష్
ఆజ్ఞ లేనిదే…
నొప్పి కొద్దిగా... కాదు, బాగానే తెలుస్తోంది.
కుడి కాలు ఒక చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయి, మొండిగా బిగించుకుపోయింది. నరనరం లాగేస్తున్నట్లు బాధ. బయటకు లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను, కానీ నా చేతులు సహకరించడం లేదు. వాటికి శక్తి పూర్తిగా ఉడిగిపోయింది.
చుట్టూ అలుముకున్న మసక చీకటి. మెల్లిమెల్లిగా, ఏం జరిగిందో తెలుస్తోంది.
...ఆఫీసులో, వాకింగ్‌లో—ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు: "ఈ యాత్ర చాలా కష్టం, ప్రమాదం కూడా!"
సుజాత (నా భార్య) అయితే పట్టుబట్టింది: "పిల్లల పెళ్లిళ్లు అయ్యాక, వాళ్లు కాస్త కుదురుకున్నాక వెళ్లవచ్చు కదా!" అని.
అయినా వినలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్... దానికి తోడు ఆ మెట్ట వేదాంతం! రాసిపెట్టినది జరగక మానదు కదా? మధ్యలో ఆ పెద్దాయన రిఫరెన్స్ కూడా! "శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు," లాంటివన్నీ! ఇదంతా నా మొండితనం. "ఏం జరిగితే అది జరుగుతుంది!" అనుకొని బయలుదేరాం.
ఇప్పుడు, నా విషయంలో, ఆ శివుడి ఆజ్ఞ అయిపోయినట్టుంది!
గుర్రం బాగానే దిగుతుందే... రాజ్ (నా గుర్రం) ఎందుకు జారిందో! బహుశా, ఇద్దరికీ కలిపి అప్రూవల్ వచ్చిందేమో! మసక చీకట్లో, నా పక్కనే ఒక పెద్ద శరీరం.
నా గుర్రం... రాజ్. సుజాతది బాబ్లీ.
ఈ టైమ్‌లో పేర్లు అవసరమా? బోర్డింగ్ పాస్ కూడా అయిపోయిందిగా! చిన్నగా నవ్వు వచ్చింది.
అదే నాలో నాకు బాగా నచ్చిన గుణం – సెన్స్ ఆఫ్ హ్యూమర్. కొంచెం ఎక్కువ! ఎంత కష్టంలోనైనా చిన్న జోక్ పుట్టించగలను. బరియల్ గ్రౌండ్‌లో కూడా జోక్ చేయగలను!
ఏమిటి ఈ ఆలోచనలు? ఒకదానికొకటి పొంతన లేకుండా! చుట్టూ చీకటి, అడివి మధ్యలో, పక్కనే సుడులు తిరుగుతూ దుముకుతున్న యమునా నది. అయినా అంత భయం, బాధ కలగడం లేదు. కొంచమే ఉంది.
సాయి గారికి ఫుల్ పేమెంట్ చేసి వచ్చాం కదా. నేను మధ్యలో డ్రాప్ అయిపోయాను. బ్యాలెన్స్ అమౌంట్ సుజాతకు ఇస్తారా? ఇంటర్నరీ పాంఫ్లెట్‌లో చాలా కండిషన్స్ ఉన్నాయి. అయినా ఇప్పుడీ డబ్బుల గొడవ ఏంటి? ముందు బయట పడే మార్గం వెతకాలి కదా!
"కేదార్‌నాథ్, బద్రీనాథ్ దర్శనం అయితే బాగుణ్ణు..."
ఏమో, మనకి డైరెక్ట్ ఎంట్రీ దొరికినట్టుంది!
వెతకడానికి ఎవరైనా వస్తారా? బహుశా రారు. నేనే రాసుకున్నాను కదా, కింద పడితే వెతకడానికి ఎవరూ రారని. మిగిలిన వాళ్లంతా "బ్రహ్మ కపాలం" వైపు వెళ్లిపోవచ్చు. ఇక నేను కూడా వాళ్ళు వచ్చేసరికి కంచం పట్టుకొని బ్రహ్మ కపాలంలో కూర్చోవచ్చు.
“కంచంతో బ్రహ్మకపాలం – ఒక ఆత్మ ‘ఆత్మకథ’” ఈ టైటిల్ భలే ఉంది!
ఆత్మ పరిశీలన
నేను ఏం వాదించాను? దేవుడు ఏదైనా చెప్తే డైరెక్ట్‌గా, ఖచ్చితంగా చెప్పొచ్చు కదా. నర్మగర్భంగా ఎందుకు చెప్పాలి అని!
ఇదిగో, దేవుడు డైరెక్ట్‌గా చెప్తే ఇలానే ఉంటుంది, నా పరిస్థితి లా! అందుకే అంటారేమో—దేవుడంటే భయం, భక్తి ఉండాలని. భక్తి ఎక్కువైతే భయం తగ్గుతుంది, భక్తి తక్కువైతే భయం ఎక్కువవుతుంది.
మనదంతా సంశయాత్మకమైన భక్తి. అందుకే ఈ భయమా? అయినా ప్రశ్నించకూడదంటే ఎలా? దేవుణ్ణి ప్రశ్నిస్తే తప్పవవచ్చు గానీ, దేవుని గురించి ప్రశ్నిస్తే తప్పేలా అవుతుంది? ప్రశ్నించడం మన డెమోక్రసీకి ఆయువు పట్టు కదా! దేవుణ్ణి ప్రశ్నించడం కూడా తప్పు కాదు. ఉంటే ఉన్నానని చెప్తాడు, లేకపోతే లేనని చెప్తాడు, ఇష్టం లేకపోతే "నువ్వే తెలుసుకో, పో!" అంటాడు. అంతే కదా!
మొత్తం అంతా సినిమా రీల్ లా గిర్రున తిరుగుతోంది: అనుభవించిన బాధలు, పోగొట్టుకున్న అమ్మానాన్నలు, బంధువులు, అనవసరంగా పడిన మాటలు... మోసపోయిన క్షణాలు, మోసగించిన క్షణాలు... కోల్పోయిన నమ్మకాలు, దూరమైన బంధాలు, దూరం చేసుకున్న బంధాలు... దగ్గరై బాధపెట్టిన మనుషులు, నష్టపోయిన డబ్బులు, పోగొట్టుకున్న ఆరోగ్యాలు, తిరిగిన ప్రదేశాలు, పొందిన ఆనందాలు... అన్నీ, అందరూ!
ఇంతలో “ఏమండీ...” అనే పిలుపు.
సుజాత గొంతులా ఉందే! కొంపదీసి ఈమె గుర్రం కూడా పడిందా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, నన్ను అంత సులువుగా వదలదు. నిజానికి, ఏ భార్యా భర్తని అంత త్వరగా వదలదు... స్వర్గానికైనా, సన్యాసానికైనా!
మళ్ళీ పిలుపు: “లెగండి! నాలుగు అయిపోయింది. ఐదుకు బయలుదేరాలి. లేట్ అయితే మనల్ని వదిలేసి వెళ్లిపోతారు! సాయిగారితో చాలా కష్టం!” అంటుంది.
ఠక్కున తెలివి వచ్చింది. హమ్మయ్య! ఇదంతా కలే అని తెలిసేసరికి పట్టలేని ఆనందం! అయితే శివుడి ఆజ్ఞ అవలేదన్నమాట. ‘జీవుడా’ బ్రతుకు, అదే "బ్రతుకు జీవుడా!" అని అనుకుంటూ బాత్రూంకు పోయాను. ఇదీ నా పరిస్థితి. ఇక కేదార్‌నాథ్, బద్రీనాథ్ తర్వాత ఇంకెలా ఉంటుందో!
ఇక, మన యాత్రలోకి వద్దాం.
యమునోత్రి – సోదరి ప్రేమ
యమునోత్రి, ఒక నది మాత్రమే కాదు, ఒక సోదరి ప్రేమ కూడా.
సంధ్యాదేవి సూర్య తేజస్సు భరించలేక, తన నీడను ఛాయాదేవిగా మార్చి శివుని దగ్గర తపస్సు చేసింది. ఛాయాకి శని జన్మించగా, సూర్యుడు తిరస్కరించాడు. ఛాయ తన తల్లి కాదని తెలియడంతో యముడు ఆ ప్రదేశాన్ని వదిలి పాతాళానికి వెళ్ళిపోతాడు. శివుని వరం వల్ల యముడు నరకానికి అధిపతి అవుతాడు. యముడు వెళ్ళిపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్న సోదరి యమి, భూమిపై హిమాలయాలకు చేరుకొని నదిగా మారిపోయింది – అదే యమునోత్రి మూలం.
ఆలయం అసలు జన్మస్థానం కాదు. ఇది 12 కి.మీ. పైన చంపసరి గ్లేసియర్ నుంచి పుట్టి, సప్తఋషి కుండ్‌లో పడుతుంది. ఆ దారి ట్రెక్కింగ్ నిపుణులు మాత్రమే చేరుకోగలరు.
మరి ఈ ఆలయాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారో? బహుశా గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేసియర్ కరిగి ఇక్కడికి వెళ్లిపోయిందా? ఈ పర్వతాన్ని కాళింది అంటారు. అందుకే యమునా నదిని కాళింది నది అని కూడా అంటారు.
యమున సుమారు 1370 కిలోమీటర్లు ప్రయాణించి, ప్రయాగ్రాజ్ (అలహాబాద్) దగ్గర గంగా నదిలో కలుస్తుంది.
ఈ నాలుగు ఆలయాలు (చార్ ధామ్) ఇంచుమించు ఒకే సమయంలో ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు. వాతావరణం ప్రభావమే! అవును, వేసవిలో పర్వతం పైన, శీతాకాలంలో కింద ఊర్లలో దేవతలు కొలువు తీరుతారు. ఆ మైనస్ చలిలో అంతా పైకి ఎక్కి పూజాదికాలు చేయడం దుర్లభం.
మాకు ఈ ప్రారంభ చలిలోనే సినిమా కనబడింది. కేదార్‌నాథ్‌లో -8°C, బద్రీనాథ్‌లో -6°C చలిలో నిద్ర పట్టలేదు. దానికి తోడు సాయి గారి వార్నింగ్: "ఎక్కువసేపు హీటర్ వాడితే రూంలో ఆక్సిజన్ అయిపోతుంది, ఇక్కడ డాక్టర్లు కూడా దొరకరు!" ఆ అనుభవాలు ముందు ముందు మాట్లాడుకుందాం.
అలా అందరితో మాట్లాడుతుంటే ఒక 15 నిమిషాల తేడాలో మా ఆవిడ, ఇంకో ఇద్దరు మేడమ్ ల గుర్రాలు వచ్చాయి. వాళ్ళు దిగిన (దింపబడిన) ఐదు, పది నిమిషాల్లోనే ఆ ముగ్గురు నడక నేర్చుకున్నారు – అదీ గుర్రపు స్వారీ తరువాత పరిస్థితి!
అప్పుడే చిన్న జల్లు ప్రారంభమైంది. అప్పుడు ఆరుబయట వేడివేడి భోజనాలు అదుర్స్! అలసిన అందరం ఆ రోజుకి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం వేడి టీ, సూప్ ఇచ్చారు. రాత్రి 7 గంటలకు భజన ప్రారంభమైంది.
భజన తరువాత, మా మిత్రులు “నీలకంధరా దేవ దీన బంధవా రావా” అని అద్భుతంగా పాడేరు. ఇప్పటికీ నా గుండెల్లో మారుమ్రోగుతుంది ఆ పాట. మా సాయిగారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ముఖ్య ప్రజ్ఞాశాలి, పాటలు కూడా చాలా బాగా పాడేరు.
గంగోత్రి – భగీరథ ప్రయత్నం
మరుసటి రోజు బ్రీఫింగ్‌లో, ఉదయం 8.30కి బ్రేక్‌ఫాస్ట్ తరువాత బయలుదేరాలి. సుమారు 100 కి.మీ. ప్రయాణం. రాత్రి 7 గంటలకు ఉత్తర కాశీ చేరడం మా ప్రోగ్రాం. కండిషన్ అప్లై: బయలుదేరడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. చేరడం రోడ్డు, వాతావరణం, ట్రాఫిక్ జామ్, ఆపై ఆ పైవాడి దయ!
ఉదయం మేము నలుగురం వాకింగ్ పోతే, పోలీసులు చెప్పారు: "పైనుండి లాండ్ స్లైడ్ ఉంది, ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది, వీలైనంత త్వరగా బయలుదేరి, జానకీ చెట్టి నుండి బయట పడండి!"
త్వరగా బయలుదేరామనుకున్నాం, కానీ అవ్వాల్సిన లేటు అవనే అయింది. ఒక పార్కింగ్ ప్లేస్‌లో బస్సులు సుమారు మూడు గంటలు ఆపేశారు. వదిలిన తర్వాత చూడుము కదా, ఇంచుమించు ఐదు కి.మీ. ఎదురు నుండి వాహనాలు ఊర్లోకి వదలడం లేదు. యాత్రికులు గుర్రాలపై, డోలీలపై రావడం కనిపిస్తుంది. మొత్తానికి ఎలానో ఆ లాండ్ స్లైడ్, చిన్న వర్షం వల్ల వచ్చిన విపరీతమైన బురద నుండి బయట పడ్డాము.
ఇక అక్కడి నుండి ప్రయాణం సాఫీగా సాగింది. మధ్యలో లంచ్ చేసి రాత్రికి ఉత్తర కాశీ (జిల్లా హెడ్ క్వార్టర్స్) చేరుకున్నాము. ఉదయం ఐదు గంటలకు బయలుదేరి గంగోత్రి దర్శనం చేసుకుని, రాత్రికి తిరిగి రావడం మా ప్రొగ్రాం. గంగోత్రి గుడి వరకు బస్సులు పోతాయి అన్నది ఆనందించే విషయం.
దారిలో దృశ్యాలు అదుర్స్! కొండలు, జలపాతాలు మాకు చాలా కామన్ అయిపోయాయి. గంగా నదికి పక్కనే, కొన్ని ప్రదేశాలలో గంగ ప్రవహించిన దారిలోనే ప్రయాణం సాగింది. బోనస్ ఏంటంటే, ఎక్కడ చూసినా ఆపిల్ చెట్లు. కోసే సీజన్ అనుకుంటా, నిండుగా ఉన్నాయి.
అలాంటి ఒక ఆపిల్ తోట పక్కన బ్రేక్‌ఫాస్ట్‌కి ఆపారు. లేడీస్ అందరూ ఫోటోల పేరుతో తోటలోకి వెళ్లి, కొన్ని కోయాలనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు! సాయి గారు, "జాగ్రత్త! తోటల కాపలా కోసం కుక్కలు పెంచుతారు!" అని చెప్పడంతో అంతా గప్‌చుప్. (రిటర్న్ జర్నీలో ఇక్కడే ఆగి కిలో 40కి ఆపిల్ పళ్ళు కొన్నాము.)
లోతైన ప్రశాంతత
సుమారు పదిన్నరకి గంగోత్రి చేరాము. కొంచెం దూరం నడవాలి. కష్టమనుకున్న వాళ్ళకోసం వీల్ చైర్లు ఉన్నాయి. "ఆ నలుగురు" లాంటివి – మనం చూడలేమనుకునే ఎన్నో ఈ యాత్రలో కనిపిస్తాయి.
అలా అందరం జెండాపై అశ్వరాజ చిహ్నాన్ని ఫాలో అవుతూ ఆలయం దగ్గరికి చేరుకున్నాము. జనం చాలా ఎక్కువ ఉన్నారు. సార్ ఇద్దరు పూజారులతో మాట్లాడి VIP దర్శనం ఏర్పాటు చేశారు, కానీ అది కూడా కొంచెం బల ప్రదర్శనే అయింది.
అందరి దర్శనాలు అయినాక, గంగోత్రి నది ఒడ్డునే ఉన్న ఒక మండపంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూజ చాలా బాగా జరిగింది. పంతులుగారు చెప్పిన కథ చాలా నచ్చింది: "మనం గంగోత్రి వెళదాం అని సంకల్పిస్తే చాలు, 21 తరాల మన పూర్వీకులు ఆశతో మనల్ని అనుసరిస్తారట." ఆ మాట నిజంగా నాకు వళ్ళు గగుర్పొడిచింది!
నది జన్మస్థానం గోముఖం సుమారు 20 కి.మీ. పైన ఉంది. ఇక్కడ నది ఒడ్డున భగీరథుడు తపసు చేసిన ప్రదేశం ఉంది. అంత గొప్ప ప్రయత్నం ఇక్కడి నుండి జరిగింది కదా అని చాలా అబ్బురంగా చూసాము. మోకా
అలా అందరూ దర్శనాలు చేసి చిన్న చిన్న బాటిళ్లలో గంగని పట్టుకున్నాము. నీరు ఎంత చల్లగా ఉందో చెప్పలేం. కాళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. ప్రవాహం కూడా చాలా ఉధృతంగా ఉంది.
ఇక భౌగోళిక అంశాల విషయానికొస్తే, భారతదేశంలో అతి పవిత్రమైన, అతి పొడవైన నది గంగా. ఇక్కడ దీన్ని ‘భాగీరథి’ అని పిలవబడి, దేవప్రయాగ్ వద్ద అలకనంద నదితో కలిసి గంగానదిగా మారుతుంది. ఇంచుమించు 2000 కి.మీ. ప్రవహిస్తుంది.
గంగోత్రి అనగానే నాకు గుర్తొచ్చింది కీరవాణి గారు పాడిన పాట “గల గల గల గంగోత్రి, హిమగిరి జని హరిపుత్రి...” పాటలో “అమ్మా... గంగమ్మా...” అనే పదం కీరవాణి కంటే గొప్పగా, అంత మార్ధవంగా ఇంకే గాయకుడు పలకలేడు అని నా నిశ్చితాభిప్రాయం. పాట కూడా గంగా ప్రవాహంలానే ఉంటుంది.
అలా గంగమ్మ దర్శనం ముగించుకొని, రాత్రికి తిరిగి ఉత్తర కాశీకి చేరి, డిన్నర్ ముందు రేపటి బ్రీఫింగ్ అయింది.
ఇప్పటి వరకు ఒక ఎత్తు, రేపటి నుండి ఒక ఎత్తు. అసలైన ప్రయాణం, పరీక్ష ముందు ముందు ఉంది. యమునోత్రి, గంగోత్రి ప్రయాణాలే కష్టం, మిగతావి అంతా కష్టం కాదు అని చెప్పారు. కానీ, అది పూర్తిగా నిజం కాదు. పరీక్షలలో ఏది కష్టం, ఏది సులభం అని మనం ముందుగా చెప్పలేము. దేని కష్టం దానిదే. ఆ విషయం ఎల్లుండి కేదార్‌నాథ్ వెళుతున్నప్పుడు తెలిసి వచ్చింది.
ఆ విషయాలు, విశేషాలు, అనుభవాలు తరువాయి భాగంలో…
అంతర్మధనం – ప్రారంభం
ఎందుకో ఈ యాత్ర నాకు చాలా నేర్పింది, ఇంకా చాలా నేర్చుకోవాలని చెప్పింది అనిపిస్తుంది. అందుకే ఎంత షార్ట్ చేద్దామన్నా నా వల్ల కావడం లేదు. ఈ గంగోత్రి ట్రిప్ ముగిసింది. ఇది యమునోత్రి లాంటి స్ట్రగుల్ కాదు, కేదార్ లాంటి ఎక్సైట్‌మెంట్ కాదు – కానీ ఒక డీప్ ఇన్నర్ పీస్ ఇచ్చింది. చార్ ధామ్‌లో ఇది మా హృదయాన్ని టచ్ చేసిందని చెప్పవచ్చు.
ఈ యాత్ర నాలో జిజ్ఞాసని రేకెత్తించింది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా... అలానే చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది. ఇదంతా చూస్తుంటే, ఇది కేవలం యాత్ర కాదు – ఒక ఆత్మపరిశీలనకి ప్రారంభమేమో అనిపిస్తుంది.
చూద్దాం, ముందు ముందు జీవితం ఏ టర్న్ తీసుకుంటుందో, జీవితం ఏమి నేర్పిస్తుందో? అందులో నుండి మనం ఏం నేర్చుకుంటామో? కాలాన్ని మించిన గురువు లేరు కదా!
ఇంకా వుంది
చార్ ధాం యాత్ర - పార్ట్ 4 త్వరలో..
***
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం




Comments