top of page
Original.png

అమృతం కురిసిన రాత్రి

#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #అమృతంకురిసినరాత్రి, #AmruthamKurisinaRathri, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Amrutham Kurisina Rathri - New Telugu Story Written By Parupalli Ajay Kumar

Published In manatelugukathalu.com On 14/01/2026

అమృతం కురిసిన రాత్రి - తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

“అత్తమ్మా! మామయ్యా!… ఓపెన్ ది డోర్! మేం వచ్చేశాం!” అన్న మాటలు పెద్దగా కలగాపులగంగా వినబడటంతో కలత నిద్రపోతున్న శివశంకర వరప్రసాద్ ఉలిక్కిపడి లేచాడు.


అంత పెద్దగా అరవడంతో పక్కింటి అత్తమ్మ మాత్రమే కాదు, వాళ్ళ కోడిపుంజు కూడా భయపడి ‘కొక్కొరకో ’ అని మూడుసార్లు అరచి బయటకు పరుగెత్తింది.


వరప్రసాద్ గోడకు తగిలించి వున్న డిజిటల్ గడియారం వైపు చూశాడు. తెల్లవారు ఝాము నాలుగు గంటలు కావస్తున్నది.

మంచం దిగి లైట్ వేశాడు. గదంతా వెలుగు పరుచుకుంది.


వంటింట్లో ఉన్న అతని అర్ధాంగి శారద వచ్చి “లేచారా! ముఖ ప్రక్షాళన కానిస్తే కాఫీ తీసుకొస్తా.” అంది.


“ఎవరివా కేకలు?” అడిగాడు గదిలో నుండి

బయటకు వస్తూ.


“సంక్రాంతి పండుగకు పక్కింటి సుగుణ తమ్ముడి పిల్లలు వచ్చారు. పోయిన ఏడాది చూసారుగా. వాళ్ళు బాగా అల్లరి పిల్లలు. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అందరినీ హడావుడి పెడుతుంటారు.” అంది శారద.


హాల్లో గోడకు తగిలించిన 2025 సంవత్సరం కొత్త క్యాలెండర్ వైపు చూశాడు. ఆ రోజు జనవరి 12 వ తారీఖు, ఆదివారం. రేపు 13 వ తారీఖు.

భోగి పండుగ. అదీగాక రేపు పౌర్ణమి. గట్టిగా నిట్టూర్చాడు. అదంతా చూస్తున్న శారదకు అసలు విషయం చెప్పేద్దామా అనిపించింది. 


“అమ్మా! మేము వచ్చే సంగతి చివరి క్షణం వరకూ నాన్నకు చెప్పవద్దు. ఒక్కసారిగా అందరం కనపడితే నాన్న ముఖంలో కదలాడే ఆశ్చర్యానందాలను మేము కన్నులారా చూడాలి.” అని కొడుకు, కూతురు ఒకటికి పదిసార్లు చెప్పారు.


“ముఖం కడుక్కుని రండి. మీకు కాఫీ ఇస్తాను. నాకు ఇవ్వాళ చాలా పని వుంది.

మధ్యాహ్నం నుండి ఒక్కొక్కరుగా మన చుట్టాలు వస్తుంటారు.” అని శారద హడావుడి పడుతూ వంటగది లోకి వెళ్ళింది.


రేపటి రోజు సంక్రాంతి భోగి రోజు మాత్రమే కాదు. శివశంకర వరప్రసాద్ గారి సహస్ర పూర్ణ చంద్ర దర్శనం రోజు. ఆరోగ్యంగా ఉంటూ, ఆనందంతో కాలం గడుపుతూ వెయ్యి చంద్రులను చూసే అదృష్టం అందరికీ రాదు. అందుకే ఈ జనవరి 13 రోజును ప్రత్యేకమైన వేడుక రోజుగా జరుపుకోవాలని నెల రోజుల ముందు నుండే బంధువులందరికీ పిలుపులు వెళ్ళాయి. విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు, వారి పిల్లలు, మునిమనవళ్ళు, మునిమనవరాళ్లు అందరూ వస్తారని సంబరపడిపోయారు పండు ముసలి దంపతులిద్దరూ.


"మేము వచ్చే పరిస్థితి లేదు నాన్నా! సెలవు దొరకలేదు. పిల్లలు కూడా చాలా బిజీగా ఉన్నారు. సారీ నాన్నా! సారీ అమ్మా!” అని అమెరికా నుంచీ, ఆస్ట్రేలియా నుంచీ పిల్లలు చెప్పేసరికి ప్రసాద్ గారు బాగా డీలా పడిపోయారు.

సహస్ర చంద్ర దర్శనం వేడుక వద్దని ప్రసాద్ అన్నా, శారద ఆ వేడుక జరగాలనే పట్టు పట్టింది.


శారద తెచ్చిన కాఫీ గ్లాసు అందుకుంటూ

“ఎందరు వున్నా అసలైన వారు రావడం లేదుగా శారదా!” బాధగా అన్నాడు ప్రసాద్.

అతని కళ్ళల్లోని దిగులుని చూసి శారద ఇక ఆగలేక పోయింది.


“మన పిల్లలు వస్తున్నారు…తాతగారికి సర్ప్రైజ్ ఇవ్వాలని మనవలు కూడా వారి పిల్లలతో వస్తున్నారు. నన్ను చెప్పవద్దు అని మాట కూడా తీసుకున్నారు. నేను మీతో చెప్పినట్టు వాళ్ళతో అనకండి. వాళ్లను చూడగానే కాస్త ఆశ్చర్యం

నటించండి.” అంది నవ్వుతూ.


“నిజమా శారదా! నువ్వు చెప్పేది నిజమా?” ఆనందంతో తబ్బిబ్బు అవుతూ అడిగాడు.


శారద నిజమేనని తల ఊపి లోపలికి వెళ్ళింది.


*************************************


మధ్యాహ్నం దాటిన దగ్గరినుండి ప్రసాద్ గారి బంధువులు ఒక్కొక్కరూ రావడం మొదలయింది. అందరినీ పేరుపేరునా ప్రేమగా పలుకరిస్తూ, వారిని ఆలింగనం చేసుకుంటూ, కుశల ప్రశ్నలు వేసి పరామర్శ చేస్తున్నా ప్రసాద్ గారి చూపులు వాకిలి వైపే తారట్లాడుతున్నాయి. మూడు గంటలు దాటేసరికి ప్రసాద్ ఆగలేక శారద వైపు చూశాడు. శారద మరి కాసేపు ఆగండి అన్నట్టుగా సైగ చేసింది.


సాయంకాలం అయిదు గంటల సమయంలో నాలుగు క్యాబ్ లు వచ్చి ప్రసాద్ గారి ఇంటి ముందు ఆగాయి.

ప్రసాద్, శారద ఆతృతగా బయటకు వచ్చారు.


ప్రసాద్, శారదల కొడుకు శ్రీధర్, కోడలు సంగీత, మనవరాలు భవిష్య ముందున్న కారులో నుండి దిగారు.

భవిష్య భర్త రాబర్ట్ ఇద్దరు చిన్న పిల్లలతో కలసి వెనుక వున్న కారులో నుండి దిగారు.

మరో కారులో నుండి ప్రసాద్, శారదల కూతురు శ్రీలత, అల్లుడు విరూపాక్ష, మనవడు యశ్వంత్ వచ్చారు.

యశ్వంత్ భార్య సుష్మా చటర్జీ, యశ్వంత్ కొడుకు సమీర్, కూతురు జాస్మిన్ చివరి కారులో నుండి దిగారు.


అంతమందిని ఒకేసారి చూసేసరికి ప్రసాద్ కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం ఉరకలు వేసింది. కళ్ళు పెద్దవి చేసుకుని అందరినీ

కన్నుల పండుగలా చూస్తూ మురిసిపోయాడు.


శ్రీధర్ తన మనవడు, మనవరాలిని తండ్రి దగ్గరకు తీసుకువచ్చి “నాన్నా మీ

మునిమనవడు, మునిమనవరాలు…కవల పిల్లలు… వీరిని వీడియో కాల్ లో చూసావు కానీ ప్రత్యక్షంగా చూడలేదు కదా ఈ రోజు వరకూ. వీడు హర్ష, ఇది వర్ష.” అన్నాడు.


“హే చిల్డ్రన్ థిస్ ఈజ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ థిస్ ఈజ్ గ్రాండ్ మా. యూ కాల్ థెం జీజీపా అండ్ గ్రానీ.”

అని శ్రీధర్ పిల్లలతో చెప్పాడు.


“హాయ్ జీజీపా! హాయ్ గ్రానీ!” అని పిల్లలిద్దరూ ముద్దు ముద్దుగా పలికారు.


ప్రసాద్, శారదలు ఆ ఇద్దరి పిల్లలను ప్రియమారా అక్కున చేర్చుకుని తనివితీరా ముద్దాడారు.


కూతురు శ్రీలత కూడా తన కొడుకు యశ్వంత్ పిల్లలను “నాన్నా! వీడు సమీర్, ఇది జాస్మిన్” అని తండ్రికి పరిచయం చేసింది.


ప్రసాద్, శారద ఆనందంతో తలమునకలవుతూ పిల్లలందరినీ అక్కున చేర్చుకుని కన్నీరు కార్చసాగారు.


“నాన్నా! నాన్నా! కళ్ళల్లో నీళ్ళు ఏమిటి? ఏమైంది నాన్నా!” అన్నాడు శ్రీధర్ కంగారుగా తండ్రిని పట్టుకుని.


ప్రసాద్ తేరుకుని “ఏం లేదురా! మిమ్మల్ని అందరినీ ఒక్కసారే చూసేసరికి ఆనందం పట్టలేక పోతున్నాను. ఇవి దుఃఖంతో వచ్చిన కన్నీరు కాదు. సంతోషంతో వచ్చిన ఆనంద భాష్పాలు” కళ్ళల్లో నీటిని తుడుచుకుంటూ అన్నాడు.


శారద అందరినీ పలుకరించి, మర్యాదలు చేయడంలో మునిగిపోయింది.


************************************


తెల్లవారు ఝామున, ఎముకలు కొరికేస్తున్నంత చలిలో, పిల్లలందరినీ లేపి

భోగి మంట దగ్గరకు తీసుకెళ్లగానే జాస్మిన్ ఒక్కసారిగా ఫోన్ తీసి

“ఓ! థిస్ యీజ్ ఎ హ్యుజ్ ఫైర్. షుడ్ ఐ కాల్ ఎమర్జెన్సీ?” అని పెద్దగా కేక వేసింది.


శారదకు జాస్మిన్ పలికిన యాక్సెంట్ సరిగా అర్ధంకాలేదు. కానీ ప్రసాద్ కు ఆ చిన్న పిల్ల మాటలు బాగానే అర్థం అయ్యాయి.


జాస్మిన్ ను దగ్గరకు తీసుకుని

“థిస్ ఈజ్ నాట్ ఎ ఫైర్ యాక్సిడెంట్.

థిస్ ఈజ్ భోగి మంటలు. ఇది మన ట్రెడిషన్…” అంటూ సంక్రాంతి భోగి మంటల గురించి కొంచెం కొంచెంగా చెప్పాడు.


జాస్మిన్ కు ఏం అర్థం కాక చిన్న నవ్వుతో తల ఊపి తండ్రి దగ్గరకు వెళ్ళి అతని చెవిలో గుసగుస లాడింది.

యశ్వంత్ నవ్వి భోగి మంటల గురించి ఇంగ్లీషులో కూతురుకి అర్థమయ్యేలా చెప్పాడు.


పాత కట్టెలు, పాత సామాన్లు మంటల్లో వేసే పెద్దలను చూస్తూ

“ఇన్ అమెరికా వుయ్ రీ సైకిల్ … హియర్ యు బర్న్ ఎవ్రీ థింగ్.” అన్నాడు హర్ష.


“మామ్ యీజ్ దట్ అలోడ్ ఫైర్ ఆన్ ది స్ట్రీట్ ?” వర్ష సందేహంతో తల్లిని అడిగింది.


శ్రీధర్ లేచి నిలబడి “భోగి రోజున పాత బట్టలు, పాడైన వస్తువులను భోగి మంటలో వేయడం మన ఆనవాయితీ. ఇది పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం వంటిది. భోగి మంటలలో పనికి రాని పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా తయారవుతుంది. దక్షిణాయనంలో పడిన కష్టాలను, చెడు అలవాట్లను అగ్ని దేవుడికి ఆహుతి చేసి, ఉత్తరాయణంలో సుఖ, సంతోషాలు, ఆరోగ్యం పొందాలని కోరుకోవడం ఈ భోగి మంటల వెనకవున్న పరమార్థం. ఇది తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం. ఇది మన సంస్కృతి.” అని పిల్లలందరికీ తెలిసేలా భోగి మంటల గురించి, సంక్రాంతి పండుగ గురించి వారికి అర్థమయ్యేలా ఆంగ్లంలో చెప్పాడు.


సమీర్ వెంటనే లోపలికి వెళ్ళి ఓ బ్యాగ్ తీసుకొచ్చి “డీజ్ అర్ మై పాస్ట్ ఇయర్ హోంవర్క్ టెన్సన్స్!” అని ఆ బ్యాగ్ ను మంటల్లో వేశాడు.


అందరూ పెద్దగా నవ్వారు ఆ పిల్లవాడు చేసిన పనికి.


అమెరికాలో, ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన పిల్లలు మొదటిసారిగా భోగి మంటలు చూసి తెగ ఆశ్చర్యపోతూ, తరువాత సంబరపడిపోతూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ, గంతులు వేస్తూ అల్లరి చేయసాగారు.


మంచం మీద నెమ్మదిగా కూర్చొని ప్రసాద్ కూతురు అందించిన హార్మోనియం పెట్టెను అందుకుని “సహస్ర చంద్ర దర్శనం...ఎన్ని జన్మల పూజా ఫలమో…” అంటూ హార్మొనీ వాయిస్తూ మధురంగా పాడి వినిపించారు.


ఆ పాటను వింటూనే శారద కళ్లలో ఆనంద భాష్పాలు ముత్యాలై మెరిశాయి.

అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు.


సూర్యోదయానికి ముందే పల్లెలో సంక్రాంతి శోభ మొదలయింది. అందరూ ఇళ్ళ ముందున్న వాకిళ్ళు చిమ్మి పేడ కళ్ళాపి చల్లారు. పెద్ద పెద్ద రంగవల్లులు వేసి రంగులతో తీర్చిదిద్దారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి పూలు పెట్టి, నవ ధాన్యాలతో అభిషేకించారు. విదేశాల నుండి వచ్చిన ఆ చిన్నపిల్లలకు ప్రతీది ఓ వింతగా అనిపించేది. వారి తల్లితండ్రులను అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టారు.


“హరిలో రంగ హరి” అని పాటపాడుతూ, చిడతలు వాయిస్తూ హరిదాసు రాగానే శారద ముని మనవరాళ్ళు వర్ష, జాస్మిన్ లకు మానికలో బియ్యం నింపి ఇచ్చి హరిదాసుకు ఇచ్చి రమ్మని పంపింది. ఆ బియ్యాన్ని హరిదాసు నెత్తి మీద వున్న అక్షయ పాత్రలో పోయడం వారికి భలే ఆనందాన్నిచ్చింది.


పెరట్లో వున్న బసవడు పెద్దగా రంకె వేసేసరికి వర్ష జడుసుకుని

“డాడ్! వాట్స్ థట్ రోర్? డైనోసార్ ఈజ్ హియర్” అని అరిచింది.



ప్రసాద్ వర్షను పెరట్లోకి తీసుకెళ్ళి ఎద్దును చూపిస్తూ “ఇది మా ఇంటి బసవడు.”అని చెప్పాడు. వర్ష బసవడి రంకెను తన సెల్లో రికార్డ్ చేసి ‘థిస్ ఈజ్ ఎ హ్యూజ్ బుల్ రోర్’ అని వాట్సప్ లో విదేశీ మిత్రులకు షేర్ చేసింది.


అప్పుడే వీధి చివర నుండి గంగిరెద్దు శబ్దం వినబడింది.

“గంగిరెద్దు వాళ్లమండి …!

గం గం గంగిరెద్దు వాళ్లమండి… !”

అని గాత్రం వినిపించగానే పిల్లలు పరుగెత్తి వరండాలోకి చేరుకున్నారు.

రంగులద్దిన వస్త్రాలతో కుట్టిన అందమైన బొంతకు అద్దాలు కుట్టి మూపురం నుండి తోక వరకు  కప్పి, కొమ్ములకు రంగులు వేసి, చివర్లో మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి, నొసటి భాగంలో రంగురంగుల తోలు కుచ్చులను, ముఖానికి తోలుతో చేసిన 'శికమారు'ను కట్టి, పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును చుట్టి, మూపురంపై పూల దండలు, చెమ్కీ దండలతో, కాళ్లకు గజ్జెలతో, మెడలో వేసిన గంటలతో ఆకర్షణీయంగా ముస్తాబైన గంగిరెద్దు తన తల ఊపుతూ నడిచి వస్తుంటే, పిల్లల్ల ముఖాల్లో విస్మయం కదలాడింది.


“జీజీపా! హూ డిడ్ మేకప్ టు థిస్ వన్. ఈజ్  థెర్ ఎ బ్యూటీ పార్లర్ ఇన్ యువర్ విలేజ్.”  జాస్మిన్ అడిగింది ముత్తాత పక్కన చేరి.


ఏం చెప్పాలో అర్థంకాక ప్రసాద్ గడ్డం గోక్కున్నాడు. పెద్దగా నవ్వి జాస్మిన్ ను ముద్దు పెట్టుకున్నాడు.


“లుక్ ఎట్ థట్. యిట్ ఈజ్ డాన్సింగ్.” అని గంగిరెద్దు డాన్స్ ను చూపించాడు.


“డూడూ బసవన్నా...

అయ్య‌వారికి దండం పెట్టు... డూడూ...

అమ్మగారికి దండం పెట్టు...డూడూ…" అంటూ డోలు వాయిస్తూ ఒకరు పాట పాడుతుంటే, స‌న్నాయి ఊదుతూ ఒకరు వుంటే గంగిరెద్దు చిత్ర, విచిత్ర విన్యాసాలతో అందరినీ అలరించింది.


శారద పాత బట్టలు, దుప్పట్లు కొన్ని తెచ్చి ఇచ్చి గంగిరెద్దుకు నమస్కరించింది.


పక్కింటి రాజు వచ్చి పది రూపాయల నాణెం ఇచ్చి “అంకుల్, మా కోసం గంగిరెద్దు మళ్ళీ డాన్స్ చేయాలి” అన్నాడు.

అతనితో వచ్చిన గణేష్, హరి కూడా అరిచి అరిచి డ్యాన్స్ వేయించే వరకూ వాళ్ళు ఆగలేదు.


“ఇది మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది.” అని ముత్తాతగారు ముద్దుగా చెప్పాడు.


అప్పుడు సమీర్ జేబులో నుండి  చాక్లెట్ తీసి గంగిరెద్దు ముందు ఉంచి.

“టేక్ మై చాక్లెట్… గివ్ బ్లెస్సింగ్!” అన్నాడు.


గ్రామంలోని పిల్లలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. పెద్దలు కూడా చిరునవ్వును  ఆపుకోలేకపోయారు.


ఫలహారాలు చేశాక అందరూ తలంటు స్నానాలు చేసి కొత్తబట్టలు కట్టుకున్నారు.


శివశంకర వరప్రసాద్ గారిని, శారదను పీటల మీద కూర్చోబెట్టి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, మనవరాలు, ముని మనవలు అందరూ వారికి పాదపూజ చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. అందరూ వారు తెచ్చిన కానుకలను అందించారు. తరువాత అందరూ కలసి గుడికి వెళ్ళి అర్చనలు, హోమాలు జరిపించారు. హోమం జరిపించిన పురోహితులకు దానాలు ఇచ్చారు.


ఇంటికి తిరిగి వచ్చాక పిల్లలను ఊరంతా తిప్పి చూపించారు.

కోడిపందాలు జరుగుతున్న చోటికి వెళ్లినప్పుడు

“థిస్ యీజ్  లైక్ డ్రోన్  రేసింగ్. డు దే హావ్ రిమోట్  కంట్రోల్స్ ?” అని అడిగాడు హర్ష.


ప్రసాద్ గారు నవ్వుతూ

“ఇక్కడ వైఫై లేదు. రిమోట్ కంట్రోల్ తో కాదు అవి ఫైట్ చేసేది. అవి నిజమైన

కోళ్ళు రా…” అన్నాడు.


గాలిపటాలు ఎగురవేసే మైదానం లోకి చేరుకుని పిల్లల చేత గాలిపటాలు ఎగుర వేయించాడు ప్రసాద్.


సమీర్ గాలిపటం దారాన్ని చూస్తూ “జీజీపా వాట్స్ థిస్?” అని అడిగాడు.


“అది మంజా! గాలిపటాల దారానికి పూస్తారు. వేరే గాలిపటాల దారాలను కోసేస్తుంది.” అన్నాడు.


“ మాంజా?   లైక్ నింజా ! నింజా  కట్స్ హెడ్స్. మాంజా కట్స్ కైట్స్.” అని సమీర్ అనగానే,

ప్రసాద్ గారు, పక్కనే ఉన్నవాళ్లు నవ్వు  ఆపుకోలేక పోయారు.


“సంక్రాంతి పండుగలో రంగుల రంగవల్లులు, బంతి,చేమంతుల సువాసనలు, వంటల రుచులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, గాలిపటాల ఉత్సాహం ఇవన్నీ ఉన్నా…పండుగకు అసలు ప్రాణం పోసేది పిల్లల  సందడే. అల్లరి పిల్లల నవ్వులు పల్లె లోగిళ్లలో ప్రకాశించి పండుగ శోభను  మరింతగా వెలిగిస్తాయి.” అన్నాడు ప్రసాద్ గారు.


“నిజమే పిల్లలు లేకుంటే పండుగకళ  ఉండదు” అని ఒకరన్నారు.

ఔనంటూ తలలు ఊపారు పక్కనున్న వారందరూ.


ఇంటికి వచ్చాక చుట్టాలు అందరితో కలసి విందు భోజనాలు చేశారు.


సాయంత్రం బొమ్మల కొలువు పెట్టి, నలుగురు పిల్లలను కూర్చోబెట్టి భోగి పళ్ళ వేడుక చేశారు. 


“గ్రానీ… వుయ్ లవ్ ఇండియా ఫెస్టివల్స్!”

పిల్లలందరూ ముక్తకంఠంతో అన్నారు.

**********************************

చల్లని రాత్రి నీలిరంగు చీరను పూర్తిగా చుట్టుకోగా పున్నమి చంద్రుడు ఆకాశంలో  వెండి దీపంలా మెరిసాడు.


శివశంకర వరప్రసాద్ గారిని, శారదను

అందరూ కలసి తీసుకొచ్చి ఆవరణలోని పెద్ద వేపచెట్టు కింద కూర్చోబెట్టారు.

అతనికి అత్యంత ఇష్టమైన స్థలం.

ఆకాశంలో పూర్ణచంద్రుడిని చూస్తూ దంపతులిద్దరూ లేచి నిలబడి నమస్కరించారు. వారి సంతానం,

మనవళ్లు, వారి పిల్లలు, బంధువులు, పొరుగు వారు అందరూ అర్ధవలయంలా ఆయన చుట్టూ నిలబడ్డారు.


శ్రీధర్ ముందుగా మాట్లాడుతూ

“సహస్ర పూర్ణచంద్ర దర్శనం అంటే ఒక వ్యక్తి తన జీవితంలో 1000వ పౌర్ణమిని పూర్తి చేసుకున్నప్పుడు జరుపుకునే  హిందూ సంప్రదాయ వేడుక. సగటున 29.53 రోజులకు ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి, 1000 పౌర్ణమిలు పూర్తి కావడానికి సుమారు 29,530 రోజులు, అంటే సుమారుగా 80 సంవత్సరాల 10 నెలలు పడుతుంది. అంటే ఇది 81వ సంవత్సరంలో వస్తుంది.

ఇది ఆ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది దీర్ఘాయుష్షు, శ్రేయస్సు, సంపూర్ణతను సూచిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి  ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.” అని చెప్పాడు.


లైట్లు వేసి, దీపాలు వెలిగించి,

“హ్యాపీ సహస్ర చంద్ర దర్శనం తాతయ్యా!” అని పెద్దలూ, పిల్లలు కలసి కోరస్ గా చప్పట్లు చరుస్తూ అన్నారు.


కేక్ కట్ చేయించారు వృద్ధ దంపతులతో.


దంపతుల  ముందుకు వచ్చిన ఇద్దరు ముని మనవరాళ్ల చేతుల్లో విరబూసిన బంతులు, చేమంతుల మధ్య ఒక చిన్న వెండి ప్లేట్… దానిపై సహస్ర చంద్ర దర్శనం అని చెక్కి వుంది.

ముత్తాతకు సర్ప్రైజ్. వెయ్యి చంద్రుల వెలుగు కన్నుల్లో నిలిచిన క్షణం.


“ఇది నిజంగా నా కోసమేనా?” చిరునవ్వుతో అడిగాడు ప్రసాద్.


వర్ష, జాస్మిన్ చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ

“యెస్ జీజీపా…డాడీ టోల్డ్ యు లుక్డ్ థౌజండ్ ఫుల్ మూన్స్. అవర్ విష్  యీజ్ థట్  యు సీ అనొథర్ టుట్వంటీ ఫుల్  మూన్స్.”  అన్నారు.


ప్రసాద్ గారి  గుండె  ఆనందంతో నిండిపోయింది. కన్నుల్లో తడిగా మెరిసిన పూర్ణ చంద్రబింబం. అదే అసలు సహస్ర చంద్ర దర్శనం.


“చూసావా శారదా! వాళ్లు పుట్టింది విదేశాల్లో అయి ఉండొచ్చు…

కానీ వారి నవ్వుల్లో, మాటల్లో  మన ఊరి మట్టి వాసన నిండి వుంది.” అన్నాడు భావోద్వేగం నిండిన స్వరంతో.


అప్పుడు  సమీర్  ముందుకొచ్చి ముత్తాత  చెయ్యిని పట్టుకుని అతని చెంపలపై ముద్దులు పెడుతూ

“తాతయ్యా… ఆర్ యు హ్యాపీ?” అని మెల్లిగా అడిగాడు.


హర్ష తాతయ్య మోకాలిపై తల వాల్చి

“తాతయ్యా… యు ఆర్ ది మూన్ ఫర్ అవర్ ఫ్యామిలీ.” అన్నాడు.


తెలుగు రానివారు  తెలుగులో తాతయ్యా అని పిలిచేసరికి ప్రసాద్ గారి కళ్లలో నీళ్లు నిలిచాయి.


ఆయన ఒక్కసారిగా రెండు చేతులు  చాచి ముని మనవళ్లను, ముని మనవరాళ్ళను

దగ్గరకు లాక్కున్నారు.


“మీరు రావడం…

ఈ వృద్ధుడికందిన అతి పెద్ద వరంరా.

నిజం చెప్పాలంటే… ఇంతకాలం

నేను చాలా భయపడ్డాను… నేను వెయ్యో చంద్రుడిని  చూస్తానా? లేదా?  అని కాదు…మీ అందరిని నా కనులారా చూస్తానా? లేదా? అని.”


అందరూ కళ్లతుడుచుకున్నారు.

శారద పెదవులపై చిన్న వణుకు.

మనసు ఉప్పొంగి మాటలు రావట్లేదు.


ప్రసాద్ గారు చిన్న నవ్వు నవ్వి

“మీరే నా వెలుగు… నా జీవితంలో చంద్రుడు వెయ్యిసార్లు ఉదయించొచ్చు…

కానీ మీ  నవ్వుల్లా నా హృదయాన్ని వెలిగించేది ఈ లోకంలో  మరొకటి లేదు.”

అని అన్నప్పుడు ఆకాశంలో కోటి తారలు వెలుగులు విరజిమ్మాయి. పిల్లలు ఆనందంతో డాన్స్ చేసారు.


ప్రసాద్ గారి చెంపపై జారిన ఆ ఒక్క కంటతడి మెరుపు… కుటుంబ బంధాలకు

నిజమైన అర్థాన్ని చూపించింది.


అతని జీవితంలో పూర్ణ చంద్రుడు వెయ్యిసార్లు ఉదయించాడు.

కానీ ఈ ఒక్క రాత్రి మాత్రమే

అతని హృదయం పూర్ణచంద్రుడిలా వెలుగులతో ప్రకాశించింది.


పిల్లలందరూ ముత్తాతను హత్తుకుని

“తాతా … నెక్ట్   సంక్రాంతి ఆల్సో వుయ్  

ఆర్  కమింగ్  హియర్  ఓన్లీ !”  అన్నారు.


ముత్తాత కళ్ళు మెరిశాయి.


“మీకు తెలుగు రాకపోయినా, మీ మనసు తెలుగుతనంతో  నిండిపోయిందిరా…”

అన్నాడు నిండు మనసుతో.


పిల్లలు నవ్వుతూ

“నెక్స్ట్ టైమ్ వుయ్   విల్  స్పీక్  ఫుల్  తెలుగు… ప్రామిస్ !”

అన్నారు.


ప్రసాద్ గారి తడికళ్లలో మెరిసిన వెలుగు...

చంద్రుడి వెలుగో,

మునిమనవళ్ల ప్రేమో,

లేదా జీవితం ఇచ్చిన వరమో!

ఎవరు చెప్పగలరు.


“మీరందరూ వచ్చినందుకు ఈ వెయ్యి చంద్రుల వేడుకకు ఒక సంపూర్ణత, ఒక సార్థకత చేకూరింది. ఇది నా జీవితంలో వచ్చిన  వెయ్యవ పున్నమి రాత్రి మాత్రమే కాదు. నా జీవితంలో అమృతాన్ని చిలికించిన రాత్రి. అవును...

ఇది వెన్నెల కురిసిన రాత్రి కాదు!

అమృతం కురిసిన రాత్రి…”

నెమ్మదిగా అన్నాడు ప్రసాద్.


మునిమనవళ్ల అల్లరి, పెద్దల నవ్వులు, పూర్ణచంద్రుడి వెన్నెల, పండగ శోభ… అన్నీ కలిసి ఆ ఇంట్లో వెయ్యి పున్నముల వెలుగును నింపాయి.


  ************************

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page