top of page
Original.png

కన్నతల్లి ఆవేదన

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #KannathaliAvedana, #కన్నతల్లిఆవేదన, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kannathalli Avedana - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 13/01/2026

కన్నతల్లి ఆవేదన - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


అమ్మా! నీ ఉనికేది?......నీవు అమ్మవేనా? అని ప్రశ్నించిందా బిడ్డ. 


అమ్మా! నీ ఉనికేది? నీవు అమ్మవనేందుకు ఋజువేది?

ఆ రోజుల్లో లేబర్ రూమ్ లో సిసి కెమేరాలు లేవాయె. 


 దూరాన ఉన్న కన్నబిడ్డ రాక కోసం, వేయికళ్లతో ఎదురు చూసిన ఓ పిచ్చి తల్లీ!


బిడ్డ రాగానే ఆమెని అక్కున చేర్చుకుని తనువు, మనసు ఆమె మీదే పెట్టి,

ఏమేంకావాలో అన్నీ చేసిపెట్టి ఆదరించినా,

ఛీ! ఇది అలా ఉంది, అది ఇలా ఉంది అని వంకలు పెట్టినా, 

ఛీ!ఛీ! నువ్విలా, నువ్వలా అని ప్రతి దానికి, ప్రతిసారీ తల్లిని విదిలిస్తున్నా,

పని మనిషిని మీరు, అండి అని గౌరవిస్తూ ఆదరించి,

ఆమెతో సినిమాలు, షికార్లు చేసి డబ్బులు ఖర్చుపెట్టినా, 


తండ్రితో ఏడాది పాటు ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఇంత హఠాత్తుగా తండ్రి మీద తాను వెళ్లేదాకా ఎంతో ప్రేమ చూపుతూ, 

హోటల్స్, కబుర్లు, సెల్ఫీలు దిగుతూ, 

తండ్రి చెప్పుడు మాటలతో కన్నతల్లి కారెక్టరు మీద నింద వేసి, తండ్రి నిందలని బలపరిచి,

తల్లి చేత్తో ఏది చేసినా తినడం ఇష్టం లేక ఉన్నన్నిరోజులు కేటరింగ్ తెప్పించుకుని తింటున్నా, 


అయ్యో! పిల్ల మళ్లీ దూరదేశాలకు వెళుతుంది, మళ్ళీ ఎప్పుడు చూస్తానో పిల్లని, ఇక్కడున్నన్నాళ్ళూ తనకి నా ప్రేమని పంచుదామనే తపనతో, 

ఆ తల్లి తన బిడ్డని బ్రతిమాలి, బామాలి, బుజ్జగించినా ఫలితం శూన్యం. 


నిస్సహాయురాలైన ఆతల్లి ఇంక ఏంచేయగలదు?


‘నేను మా నాన్న కోసమే వచ్చాను’ అని ఖరాఖండిగా పదే పదే చెపుతూ తండ్రిని అపురూపంగా చూస్తూ కన్న తల్లిని చీడపురుగులా విదిలిస్తోందే? 

బిడ్డ ఊరికి వెళ్లేరోజున కూడా తల్లి బ్రతిమాలి తన చేత్తో కావల్సినవి చేసి బిడ్డకు అతికష్టం మీద తినిపించి సంతోషించిందా పిచ్చి తల్లి.


 అమ్మ మనసదే!


బిడ్డను అక్కున చేర్చుకుని కంట తడి పెట్టి ‘పాపాయ్! ఆడపిల్లలకు అమ్మ ఉంటేనే పుట్టిల్లమ్మా! ఈ అమ్మ మనసులో నీ మీద కోపమేమి ఉండదు, ప్రతిక్షణం నీ క్షేమం, నీ కుటుంబ క్షేమం కోసం దేవుని ప్రార్ధిస్తూ, నీకై పాకులాడుతున్నా’ అని తన మనసు విప్పి చెప్పినా, 

సుమారు 40 సం… ఆ పిల్ల అర్థం చేసుకోలేదు.

 

‘నీ కారెక్టరు, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, 

అసలు నీ మాటే నాకిష్టం లేదు,

నిన్ను చూస్తుంటే కంపరంగా ఉందంటున్న’ ఆ బిడ్డని ఏమంటుందా అమ్మ, అదీ తండ్రి ముందే. 


మనసులో ఎగిసిపడుతున్న బాధని దిగమింగి నా బిడ్డే కదా అన్నది, అది చిన్న పిల్ల అని మనసుకి సర్ది చెప్పుకుందా పిచ్చి తల్లి.

బిడ్డ ఎంత పెద్దవాళ్లైనా కన్న తల్లికి పసిపాపలే! 

 

 అమ్మ మనసంటే అదే! అది అర్థం చేసుకునేంత విశాలహృదయం ఆ బిడ్డకు ఉంటే ఎంత బాగుండును?


చివరికి బయలుదేరే ముందురోజున పనమ్మాయి విషయంలో తల్లితో ఘర్షణకు దిగి,

 తల్లి ముఖం మీదే దిండుతో గట్టిగా అదిమితే ఊపిరాడక గిలగిలా కొట్టుకుని అతికష్టం మీద ఆ ఉడుంపట్టుని విడిపించుకుని బ్రతికిందా తల్లి. ఇదంతా తండ్రి చూస్తూ ఊరుకుని తన మద్దతు కూతురికి తెలిపె.


జరిగిన పరిణామానికి  హతాశురాలై ఏడ్చిన ఆతల్లిని,

నీకిదంతా కావాలి, ఏమైందిప్పుడు? గట్టి ప్రాణం బానే ఉన్నావన్నాడు తండ్రి తన బిడ్డ ముందే. 


ఆ మరుసటి రోజున అన్నింటినీ మరిచి బిడ్డ కోసం తను కొన్నవన్నింటినీ ఇచ్చి, పట్టుచీర పెట్టి తీసికెళ్లమని బ్రతిమాలి ఇచ్చిందా అమ్మ.


వాటిని చూస్తే నీవు గుర్తొస్తావు, నిన్ను గుర్తు తెచ్చుకోవడం నాకిష్టం లేదందా బిడ్డ నిష్కర్షగా. 


ఆ మాటకు తల్లి మనసు కలత చెందినా అది మనసులో దాచుకుని, 

‘నన్ను గుర్తు తెచ్చుకోవద్దులేమ్మా. నీవు నిండునూరేళ్లు భర్త, బిడ్డలతో చల్లగా ఉండమ్మా!’ అని మనసారా దీవించిందా కన్నతల్లి.


వస్తువులని చూస్తేనే కన్నతల్లి గుర్తొస్తుందా! చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచిన తల్లి, తల్లి ప్రేమ ప్రతిక్షణం బిడ్డలకు గుర్తుండదా!


ఇక్కడున్నన్నాళ్ళూ, కారెక్కి వెళ్లేముందు కూడా తండ్రితో సెల్ఫీలు తీసుకుని, తండ్రిని హత్తుకొని అనేక జాగ్రత్తలు చెబుతూ, 

కనీసం తల్లిపై ఎలాంటి ప్రేమ చూపకుండా, వెళ్లొస్తా! అని కూడా తల్లికి చెప్పలేదు.


అయినా కారెక్కి పిల్ల వెళ్లేదాకా చూస్తూ మళ్ళీ ఎప్పుడు చూస్తానో బిడ్డను అని కంటతడెట్టుకుంది. 

అమ్మ హృదయాన్ని, ఆమె ప్రేమని బిడ్డ అర్థం చేసుకుంటే ఎంత బాగుండు. 


‘నేను నవమాసాలు మోసిన కన్న తల్లినే కదా! ఇన్నేళ్లు ఇన్ని కష్టాలకోర్చి ఈ పిల్లల కోసమేగా తను బ్రతుకుతోంది?

వాళ్లే కదా తన ప్రపంచమనుకుంది. 

 మరి ఇలా జరుగుతోందేమిటి?’ అని వ్యథ చెందిందా తల్లి.


తన బిడ్డల నుండి ఏమాసించిందా తల్లి. 

గుప్పెడు ప్రేమ, కొండంత ఆదరణ. 

మరి ఏవి? కనుచూపు మేర కానరావాయె. 


ఇదంతా చూస్తూ, భరిస్తున్న ఆ తల్లి బాధ ఎవరికి తెలుసు? 

ఎవరితో చెప్పుకోగలదు? ఏమని చెప్పగలదు?


కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా, 

తన బాధ చెప్పేదీ కాదు - చెపితే తీరేదీ కాదు. 


ఈ అవసాన దశలో తనకి ప్రశాంతత, మనశ్శాంతి లభించేట్లు చేయమని,

ఆ భగవంతుని ముందు మొర పెట్టుకుందంతే! 


.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link

bottom of page