top of page
Original.png

తెలివైన కాకి

#ThelivainaKaki, #తెలివైనకాకి, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Thelivaina Kaki - New Telugu Story Written By Palla Deepika

Published In manatelugukathalu.com On 12/01/2026

తెలివైన కాకి - తెలుగు కథ

రచన: పల్లా దీపిక

ఒకప్పుడు ఒక పెద్ద అటవీ ప్రాంతం చివరలో కాలా అనే తెలివైన కాకి ఉండేది. మామూలు కాకుల మాదిరిగా కాకుండా కాలా చాలా తెలివైంది, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల పక్షులు వాటి ఆహారాన్ని సులభంగా సంపాదించుకునేవి. కానీ కాలా మాత్రం ఎప్పుడూ తన తెలివితేటలను ఉపయోగించి భిన్నంగా ఆలోచించేది. 


ఒకరోజు కాలా అడవిలో ఎగురుతూ ఉండగా, ఒక వాల్నట్ (ఆక్రోట్ కాయ) కనిపించింది. అది ఎంతో ఆకర్షణీయంగా ఉంది, దానిని తినాలనిపించింది. కానీ ఆ వాల్నట్ పెంకు చాలా గట్టిగా ఉండడం వల్ల దాన్ని పగలగొట్టడం ఎలా అని ఆలోచించింది. మొదట తన ముక్కుతో దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. అయినా అది సాధ్యం కాలేదు. గట్టిగా కొట్టినా కూడా ఆ వాల్నట్ పెంకు చెక్కుచెదరలేదు. అప్పుడు దానికి కుండలో నీరు తక్కువగా ఉన్నప్పుడు రాళ్లు వేసి నీటిని పైకి రప్పించిన తన పూర్వీకురాలు గుర్తొచ్చింది. 


"దీన్ని ఎలాగైనా పగలగొట్టాలి" అని కాలా మనసులో అనుకుంది. 

 ఆ సమయంలో కాలా కళ్ళు దగ్గరలో ఉన్న ఒక ఇటుకపై పడ్డాయి. అది ఎంతగానో గట్టిగా ఉంది. ఆ ఇటుకతో వాల్నట్ ను కొడితే పగిలిపోతుందని అనుకుంది. వెంటనే, ఆ వాల్నట్ ను తన ముక్కుతో పట్టుకొని ఆ ఇటుక దగ్గరికి తీసుకొచ్చింది. ముందుగా ఇటుకను ఎత్తి వాల్నట్ పై పడేయాలని చూసింది. కానీ, ఇటుక చాలా బరువుగా ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. ముక్కుతోనే అటు ఇటు కదిపి వాల్నట్ పై పడేసింది. కానీ అది పగల్లేదు. 


కాలా నిరాశ పడలేదు. మళ్లీ ఆలోచించడం మొదలు పెట్టింది. "ఇటుకను నేను ఎత్తలేకపోతే, వాల్నట్ ను ఎత్తి ఇటుకపై పడవేస్తే సరిపోతుంది, " అని నిర్ణయించుకుంది. వెంటనే ఆ వాల్నట్ ను పట్టుకొని గాల్లోకి ఎగిరి, శక్తివంతంగా ఆ ఇటుకపై వదిలింది. వాల్నట్ ఒక్కసారిగా నేలపై పడినా, ఆ గట్టి పెంకు పగలలేదు. కాలా ఈ ప్రయత్నాన్ని చాలాసార్లు చేసింది, అయినా ఫలితం దక్కలేదు. 


కాలా ఆలోచనలో పడింది. తన మొదటి ఆలోచన పనిచేయలేదు, ఇప్పుడు ఏమి చేయాలి అని తర్జనభర్జన పడింది. అదే సమయంలో, దూరం నుండి వాహనాల శబ్దం వినిపించింది. కాలా అటువైపు చూసింది. ఆ అడవికి ఆనుకుని ఒక పెద్ద రహదారి ఉంది. ఆ రహదారిపై కార్లు, లారీలు వేగంగా వెళ్తున్నాయి. వాటిని చూస్తూ ఉండగా కాలాకు ఒక కొత్త ఆలోచన తట్టింది. 


"వాహనాలు ఎంత బరువుగా ఉంటాయో! వాటి చక్రాల కింద ఈ వాల్నట్ పడితే కచ్చితంగా పగిలిపోతుంది, " అని అనుకుంది. వెంటనే ఆ వాల్నట్ ను తన ముక్కుతో పట్టుకొని రహదారి పైకి ఎగిరింది. కాలా చాలా జాగ్రత్తగా రహదారిపై దిగింది. వాహనాల వేగాన్ని, అవి వచ్చే సమయాన్ని అంచనా వేస్తూ, ఆ వాల్నట్ ను రహదారి మధ్యలో పడేసింది. వాహనాలు వెళ్లేటప్పుడు అది పగిలిపోతుందని ఎదురు చూసింది. 

 కానీ, మొదటగా వచ్చిన చిన్న కారు దానిని తాకకుండానే వెళ్ళిపోయింది. కాలాకు ఇంకా పట్టుదల పెరిగింది. మరింత ఓపికగా ఎదురుచూసింది. ఇంతలో ఒక పెద్ద లారీ వేగంగా అటువైపు వస్తోంది. కాలా సమయం చూసి వెంటనే రహదారిపై నుండి దూరంగా వెళ్లి ఒక చెట్టుపై కూర్చుంది. ఆ లారీ చక్రాలు ఆ వాల్నట్ పై వెళ్ళాయి. ఒక్కసారిగా "కర్" అనే శబ్దం వినిపించింది. 


లారీ వెళ్ళిపోగానే కాలా ఎగిరి, రహదారిపై పడిన వాల్నట్ దగ్గరికి వచ్చింది. ఆ వాల్నట్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. కాలా ఎంతో సంతోషంగా అందులోని పప్పును కడుపు నిండా తిన్నది. ఆ రోజు నుండి కాలాకు ఏ గింజ దొరికినా, రహదారి పైకి వెళ్లి పగలగొట్టుకుని తినడం అలవాటయింది. ఆ కాకి తెలివితేటలకు రహదారిపై వెళ్లే వాహనదారులు కూడా ఆశ్చర్యపోయారు. కాకులు ఎంత తెలివిగలవో మరొకసారి నిరూపితమైంది. 


సమాప్తం

***

పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక


వయసు: 21


చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్


హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం


నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page